Friday, April 22, 2011

జుత్తు తెల్లబడ కుండా కొన్ని జాగ్రత్తలు , Hints to prevent Graying Hair



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జుత్తు తెల్లబడ కుండా కొన్ని జాగ్రత్తలు(Hints to prevent Graying Hair)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వయసుతో పాటు జుత్తు తెల్లబడటం మామూలే కానీ చిన్న వయసులో వెంట్రుకలు నలుపుదనాన్ని కోల్పోతుంటే ఎవరికైనా దిగులు పట్టుకుంటుంది. ఒక్క తెల్ల వెంట్రుక కనబడ్డా ఆందోళన మొదలవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ 'అకాల తెలుపు' బారినపడకుండా చూసుకునే వీలుంది.

పొగ మానెయ్యండి

పొగ తాగటం వల్ల త్వరగా వృద్ధాప్యం ముంచుకొస్తున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది వెంట్రుకలకూ వర్తిస్తుంది. కాబట్టి జుత్తు తెల్లబడొద్దనుకుంటే వెంటనే సిగరెట్లు, బీడీల వంటివి మానెయ్యాల్సిందే.

ఒత్తిడికి దూరం

మానసిక బాధలు, ఒత్తిడి మూలంగా వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఉంది. పొగ లాగానే ఒత్తిడి కూడా త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడి బారి నుంచి బయటపడొచ్చు. ఇది జుత్తు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

ప్రోటీన్లు తినాలి

ఆహారంలో ప్రోటీన్లు లోపించినా తెల్ల జుత్తు రావొచ్చు. కాబట్టి ప్రోటీన్లు దండిగా ఉండే.. మొలకెత్తిన గింజలు, తృణ ధాన్యాలు, మాంసం, సోయా వంటివి తీసుకోవటం మంచిది.

శుభ్రం పరిశుభ్రం

జుత్తు ఆరోగ్యంగా ఉండాలంటే దానిని శుభ్రంగా ఉంచుకోవటమూ ముఖ్యమే. మనలో చాలామంది స్నానం చేసేటప్పుడు తల గురించి అంతగా పట్టించుకోరు. వారానికి మూడు సార్త్లెనా తలస్నానం చేయటం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.

కారణాన్ని గుర్తించాలి

విటమిన్‌ బి 12, థైరాయిడ్‌ సమతుల్యత లోపించినా జుత్తు రంగు కోల్పోవచ్చు. అందువల్ల జుత్తు నెరవటానికి గల కారణాలను గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి.

కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్ర లేకపోయినా జుత్తుకు ముప్పు పొంచి ఉన్నట్టే. రోజుకి 6-7 గంటల పాటు తగినంత నిద్ర చాలా అవసరం. రాత్రుళ్లు ఎక్కువసేపు టీవీలు, ఇంటర్నెట్‌లకు అతుక్కుపోకుండా ఉంటే మేలు.

రంగులపై ఓ కన్ను

మార్కెట్లో ఏది దొరికితే ఆ జుత్తు రంగునో, ఉత్పత్తులనో వాడటం అంత మంచిది కాదు. వీటిల్లో హానికర రసాయనాలుండే అవకాశం ఉంది. వేటినైనా నిపుణులను సంప్రదించాకే వాడుకోవాలి.

సరదాలకీ ప్రాముఖ్యం

ఎప్పుడూ పనిలోనే మునిగిపోయి సరదాలు, షికార్లును పక్కన పెట్టేయకండి. రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ఆనందంగా గడిపే మార్గాలను అన్వేషించండి. ఇది జుత్తు తెల్లబడకుండానే కాదు.. త్వరగా ముసలితనం మీద పడకుండానూ కాపాడుతుంది.

మాత్రల తోడు

ఒమేగా 3 చేపనూనె మాత్రలను తీసుకోవటమూ జుత్తు నెరవకుండా చూస్తుంది. అవసరమైనప్పుడు వైద్యుల సూచన మేరకు వేసుకోవాలి.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. చాలా మంచి చిట్కాలు చెప్పారు.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.