Sunday, July 24, 2011

మందులతో వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స, Cancer Treatment in Old age



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కాన్సరు లేదా కాన్సరు వ్యాధి, శరీరంలో ఏ భాగంలోనైనా ఏర్పడే గడ్డ... ఈ పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చేవి. వృద్ధుల్లో సాధారణంగా వచ్చే కాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సరు, జీర్ణకోశ - పేగుల కాన్సరు, రొమ్ము కాన్సరు, గర్భాశయముఖ కాన్సరు, తల, మెడ కాన్సరు, ప్రోస్టేలు, రక్త సంబంధిత కాన్సరులు ముఖ్యమైనవి. సాధారణంగా 50, 60 ఏళ్ల వయసులో కాన్సరు వ్యాధి వచ్చే అవకాశంవుంది. కాన్సరు అభివృద్ధి చెందడానికి వృద్ధాప్యం ఒక కారణం కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా (1999) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులు, గుండె జబ్బలు, నాడీ మండల, మానసిక జబ్బుల తరువాత కాన్సరు వ్యాధి ప్రబలమైనదిగా తేలింది. గణాంకాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 65 ఏళ్లు పైబడ్డ వారి జనాభా పెరుగుదల 113 శాతం గానూ, అభివృద్ది చెందిన దేశాల్లో 65 ఏళ్లు మించిన వారి పెరుగుదల 43 శాతం గానూ (1985-2010 మధ్య కాలంలో) వున్నది. పాశ్చాత్యాదేశాల్లో 65 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషుల్లో కాన్సరుకు గురయ్యే ప్రమాదం వుంది. 1985 -2010 మధ్య 99 శాతం కాన్సరు కేసులు పెరుగినట్లు అంచనా. వృద్ధుల్లో పాశ్చాత్యదేశాల్లో 50 నుంచి 60 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 శాతం వారికి కాన్సరు వచ్చే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల్లో వచ్చే సాధారణ కాన్సరు జబ్బులు.. ఊపిరితిత్తుల, ప్రోస్టేటు గ్రంథి, రొమ్ము, పెద్దపేగు, గుదమ, గర్భాశయం, లింఫ్‌గడ్డలు క్లోమ గ్రంథి కాన్సర్లు.

భారతదేశంలో ఎక్కువగా వృద్ధులు తల, మెడ, ఊపిరితిత్తులు, గర్భకోశముఖద్వారం, అన్నవాహిక కాన్సర్ల వల్ల మరణిస్తున్నారు.

లక్షణాలు

వృద్ధుల్లో వచ్చే కాన్సర్‌ వల్ల నొప్పి నీరసం, ఆకలి లేకపోవటం, ఆయాసమే కాక ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఇలా ఉంటాయి.

తల, మెడ కాన్సరు : మాననిగాయం, గొంతుల్లో, నోటిలో నొప్పి. ఆహారం మింగటంలో కష్టం. స్వరంలో మార్పు, మెడపై వాపు.

ఊపిరితిత్తుల కాన్సరు : దగ్గు, కళ్లెలో రక్తం, ఊపిరితిత్తుల చికాకు, ఛాతీ నొప్పి తరచుగా శ్వాసకోశ వ్యాధి గ్రస్థత.

అన్న వాహిక, జీర్ణకోశ కాన్సరు : మింగటంలో కష్టం. ఆకలి లేకపోవటం, బరువును కోల్పోవటం, రక్తాన్ని వాంతి చేసుకోవటం, వాంతులు కావటం, యాస్పిరేషన్‌ న్యూమోనియా.

పెద్దపేగు-గుదము-ఆసనం కాన్సరు : జీర్ణకోశ పేగుల కింది మార్గం - (పెద్దపేవు-గుదం- అసనం) పేగుల అలవాట్లలో మార్పులు, మల బద్ధకం/విరేచనాలు, గుదము నుండి రక్తస్రావం లేక రక్తంతో కూడిన స్రావం స్రవించడం, ఆసనంలో నొప్పి, గాలిపోవుట, ఉదరంలో గడ్డ, పేగుల్లో ఆటంకం.

జననాంగ, మూత్రాశయం కాన్సరు : రక్తహీనత, జ్వరం, బరువును కోల్పోవడం.

గర్భకోశ ముఖద్వారం కాన్సరు : యోని నుండి రక్తస్రావం నడుంనొప్పి, ఉదరంలో నొప్పి.

ప్రోస్టేటు కాన్సరు : త్వరగా మూత్రం విసర్జించాలన్న భావన ఎక్కువ కావటం, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం చుక్కలు, చుక్కలుగా రావటం, ధారతగ్గటం మొదలగునవి.

మూత్రాశయ కాన్సరు : నొప్పి లేకుండా మూత్రంలో రక్తం రావటం, ఉదరంలో నొప్పి, మూత్రం నిలచి పోవటం.

రొమ్ము కాన్సరు : రొమ్ములో చేతితో తాకి గుర్తించగల గడ్డ, చనుమొనల నుండి రక్తంస్రావం, చంకలో గడ్డ.

రక్త కాన్సరు : రక్తహీనత, బలహీనత, జ్వరం, బరువు కోల్పోవటం, తరచుగా ఛాతీ, మూత్ర సంబంధ వ్యాధి గ్రస్తత, చర్మం కింద చిన్న చిన్న రక్త స్రావాలు, ముక్కు నుండి చిగుళ్ళ నుండి రక్తం కారటం, కీళ్ళనొప్పులు, నొప్పిలేని తాకి తెలుసుకోగల లింఫ్‌ గ్రంథులు, కాలేయం ప్లీహము వాచుట.

కేంద్రనాడీ మండల కాన్సరు : తలనొప్పి వాంతులు, మూర్ఛలు, చూపుతగ్గుట, స్వర్శ కోల్పోవుట లేక కండరాల బలహీనత, మూత్ర కోశ ప్రేవుల ధర్మాల్లో మార్పులు, స్పృహలో మార్పులు.

వ్యాధి నిర్ధారణ పద్ధతులు

కాన్సరు వ్యాధి నిర్ధారణకు.. భౌతిక శరీరపరీక్ష, వ్యాధి సంబంధిత పరీక్షలు జరపాలి. ఎండోస్కోపీ, లారింగోస్కోపీ, బ్రోంకోస్కోపీ, కోలోస్కోపే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎక్స్‌-రే, అల్ట్రా సౌండ్‌, సిటీస్కాన్‌, మామోగ్రఫీ, రక్త సంబంధ, జీవ రసాయనశాస్త్ర పరీక్షలు, ఎముక స్కాన్‌, ఎముకల అధ్యయనం చేస్తారు. కాన్సరు దశలను నిర్ణయించి దానిని నయం చేయడానికి విధానాలను రూపొందించుకోవాలి. కాన్సరు దశను నిర్ణయించుకోవటంవల్ల జబ్బు ఏ దశలో వుంది? దాని పెరుగుదల ఎలా వుంటుంది? వ్యాధిని నయం చేయడానికి ఏ విధానాలను రూపొందిచాలి. చికిత్సకు ఎటువంటి ఫలితం వుంటుందనే విషయాలు తెలుస్తాయి.

చికిత్స

చికిత్సకు సంబంధించి నిర్ణయాలు మూడు విషయాలపై ఆధారపడి వుంటాయి. శరీర సాధారణ స్థితి, ఇతర జబ్బులు, కాన్సరుదశ, రోగి కోరిక, సమ్మతి. తొలిదశలో వున్న కాన్సర్లలో 70 నుంచి 90 శాతం కేసుల్లో నయం అయ్యే అవకాశం వుంది. కాన్సరు చికిత్సలో 19వ శతాబ్దం చివరిదశలో కాన్సరుకు శస్త్ర చికిత్స ప్రారంభమైంది. అయితే కాన్సరుకు శస్త్ర చికిత్స రానురాను వయస్సు పెరిగిన కొద్దీ తగ్గిపోతున్నది. రేడియేషన్‌ చికిత్స ఎక్స్‌రేను కనుగొన్న 1895 నుండి జరుపబడుతున్నది. వృద్ధుల్లో కాన్సరు జబ్బుకు రేడియేషన్‌ చికిత్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాన్సరుకు మందులతో చికిత్స 1950 నుండి ప్రారంభమైంది. వృద్ధుల్లో కాన్సరు చికిత్సకు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

నివారణ

ఆరోగ్యపు అలవాట్లను, ఆహారపు అలవాట్లను 30 నుంని 40 ఏళ్ల వయస్సు నుంచే ప్రారంభించాలి. తొలిదశలోనే కాన్సరును గుర్తించి చికిత్స పొందాలి. ధూమపానం, సురాపానం, గుల్కా, జర్దాకిల్లీలు మానాలి. పండ్లు, కూరగాయలు పీచు పదార్థం ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. కాన్సరు బారినుండి శరీరాన్ని రక్షించుకోవాలి. దీనికి స్క్రీనింగ్‌ పరీక్షలు జరపాలి.

డా|| నాగినేని భాస్కరరావు-వృద్ధుల వైద్యనిపుణులు--ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాల ,ఆసుపత్రి సంగారెడ్డి.
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. sir information chala bagundi... lung cancer ku unani lo treatment unda theliyajeya galaru

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.