Monday, July 25, 2011

ఎనర్జి డ్రింక్స్‌ శక్తి ఎంత,Energy of Energy drinks



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎనర్జి డ్రింక్స్‌ శక్తి ఎంత(Energy of Energy drinks)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఎనర్జి డ్రింక్స్‌. ఈ పేరు వినగానే స్టామినా పేరిట, ఎనర్జీ పేరిట క్రీడాకారుల దగ్గర్నుండి సామాన్య యువతీ యువకుల దాకా క్రేజ్‌తో తాగుతున్న ఆకర్షణీయమైన రంగురంగుల లేబుల్స్‌ ఉన్న బాటిల్స్‌ గుర్తుకొస్తున్నాయి . ఈ ఎనర్జి డ్రింక్స్‌ నిజంగా మనకి శక్తినియాస్తాయా లేక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయా తెలీకుండానే చాలా మంది తాగేస్తున్నారు. మరి అలాంటి ఎనర్జి డ్రింక్స్‌ ఆరోగ్యంపై నిజంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో కొన్ని వాస్తవాలు పరిశీలిద్దాం.

మన దేశంలో ప్రస్తుతం ప్రతి గల్లీలో, సిగరెట్‌ షాపుల్లో, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో, పబ్స్‌లో, జిమ్స్‌లో క్రీడా ప్రాంగణాల్లో లభిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఎనర్జీ డ్రింక్స్‌ యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపి, స్టామినా పెంచి కొత్త ఎనర్జిని అందించి మరింత డైనమిక్‌గా క్రీడలు వంటి పలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోపడతాయని వీటి గురించి చెబుతుంటారు. క్రీడాకారులే కాకుండా త్వరగా నిద్రపోకుండా ఎక్కువసేపు పనిచేయాలనుకునే పలు వృత్తుల్లోని యువతీయువకులు, నైట్‌ స్టడీ చేసే విద్యార్థులు కూడా ఈ డ్రింక్స్‌పట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. మన దేశంలో 250మిల్లీ లీటర్ల ఎనర్జి డ్రింక్‌ ఖరీదు సుమారుగా 75 రూపాయలు.

ఇందులో ఏముంటాయి?

బి-కాంప్లెక్స్‌ మిటమిన్స్‌, కెఫీన్‌, అమినో ఆమ్లాలు (టారిన్‌ వంటివి), కార్నిటిన్‌, ఇనోసిటాల్‌, గ్లూకురొనోలాక్టోన్‌, హెర్బల్‌ సప్లిమెంట్స్‌, గ్లూకోజ్‌ మొదలైనవి ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటాయి. కొన్ని డ్రింక్స్‌లో జిన్సెంగ్‌ లాంటి ఉత్తేజకర పదార్థాలు కూడా ఉంటున్నాయి.

ఎన్ని రకాలు

1990 దశకంలో కొకొకోలా 'షాక్‌' పేరుతో ఎనర్జి డ్రింక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు 'బర్న్‌' అనే పేరుతో మరో డ్రింక్‌ను ప్రవేశపెట్టింది. రెడ్‌ బుల్‌, క్లౌడ్‌నైన్‌, మాన్‌ స్టర్‌, రాక్‌ స్టార్‌, నో ఫియర్‌, టాబ్‌ ఎనర్జి, వైర్‌డ్‌, ఫిక్స్‌, సోబె, ఎక్స్‌ఎల్‌ వంటి పాపులర్‌ బ్రాండ్‌లు మన దేశంలో చలామణిలో ఉన్నాయి.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?

ఆగస్ట్‌ 2008లో ఆస్ట్రేలియాలోని రాయల్‌ అడిలైడ్‌ హాస్పిటల్‌లోని కార్డియోవాస్క్యులర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ జరిపిన అధ్యయనంలో ఎనర్జి డ్రింక్స్‌లో ఉంటున్న అధిక మోతాదు కెఫిన్‌ వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ (పక్షవాతం) వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇవేకాక రక్తంలో చిక్కదనం పెరిగి పర్యవసాన పరిణామాలకు దారితీయగలదని వెల్లడైంది. జాన్‌హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు, ఫిజిషియన్ల బృందం కూడా ఈ ఎనర్జి డ్రింక్స్‌లో ఉండే రసాయనాల వాడకంపై మరింత కఠినమైన, నిర్దిష్ట నియమాలు విధించి అమలుచేయాలని అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సూచించింది.

మన దేశంలో ఇటీవల మే, జూన్‌ నెలల్లో ఢిల్లీలో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సిఎస్‌ఇ) అనే సంస్థ నిర్వహించి కొద్దిరోజుల క్రితమే వెలువరించిన శాస్త్రీయ అధ్యయనాల ఫలితాల ప్రకారం 44 శాతం శాంపిల్స్‌లో కెఫీన్‌ 145 పిపిఎంలకంటే ఎక్కువగా అనారోగ్యానికి దారితీయగల మోతాదులో ఉన్నట్టు వెల్లడైంది. 38 శాతం శాంపిల్స్‌లో లేబుల్స్‌పై పేర్కొన్న శాతం కంటే ఎక్కువ శాతం కెఫీన్‌ సదరు డ్రింక్స్‌లో ఉన్నట్లు తెలిసింది. 25శాతం శాంపిల్స్‌లో లేబుల్స్‌పై కెఫీన్‌ మోతాదు గురించి ఎటువంటి కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా రూపొందించిన నియామవళి లోపభూయిష్టంగా ఉన్నందునే ఇటువంటి అవకతవకలకు ఎనర్జి డ్రింక్స్‌ తయారీదారులైన కంపెనీలు పాల్పడగల్గుతున్నాయి.

ఆరోగ్యంపై ప్రభావాలు ఏమిటి?

కెఫీన్‌ అనేది కేంద్ర నాడీవ్యవస్థని ఉత్తేజపరచడం ద్వారా పనిచేసే రసాయనం. నిద్రమత్తుని వదిలించుకోవడానికి సాధారణంగా తాగే కాఫీలో ఉండే ప్రధాన రసాయనం ఇదే. కానీ ఇది నిర్దిష్ట పరిమాణాన్ని మించి ఇటువంటి ఎనర్జి డ్రింక్స్‌లో తీసుకున్నప్పుడు ఆరోగ్యంపై దుష్ఫలితాలను చూపుతుంది. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె రిథమ్‌లో అసాధారణ మార్పులు, హార్ట్‌అటాక్‌, స్ట్రోక్‌ (పక్షవాతం), ఫిట్స్‌, హైపోకెలీమియా (రక్తంలో పొటాషియం తక్కువ అవడం వల్ల కలిగే పరిణామాలు), రాబ్డోమయోలైసిస్‌ (ఒక రకమైన కండరాల బలహీతన), మూత్రం ఎక్కువగా పోవడం వల్ల డీహైడ్రేషన్‌ వంటి దుష్ఫలితాలు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక నాడీవ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగిన కెఫీన్‌ వాడడం వల్ల క్రమంగా అలవాటు మారి వ్యసనానికి దారితీస్తుంది.

ఎనర్జి డ్రింక్స్‌ -స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ ఒకటేనా?

ఎనర్జి డ్రింక్స్‌ని స్పోర్ట్స్‌ డ్రింక్స్‌గా భ్రమపడి సేవిస్తున్న వ్యక్తులు అధికంగా ఉంటున్నారు. స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ వాస్తవానికి తగిన పాళల్లో గ్లూకోజ్‌, ఎలక్ట్రోలైట్స్‌ కలుపబడి డస్సిపోయిన శరీరానికి శక్తిని, నీటినందించి రీహైడ్రేషన్‌కు ఉపయోగపడతాయి. కానీ ఎనర్జి డ్రింక్స్‌ని కూడా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ అనే భ్రమలో యువత నేడు విచ్చల విడిగా వాడడం వల్ల అర్థికంగానే గాక, ఆరోగ్యపరంగా కూడా నష్టానికి గురవతున్నారు.

మనం ఏం చేయాలి?

ఆరోగ్యానికి హానిచేసే ఈ రకమైన ఎనర్జి డ్రింక్‌లలో ఉండాల్సిన రసాయన పదార్థాల సురక్షిత మోతాదులపై నిర్దిష్టమైన సూచనలతో నియంత్రణా విధానాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని ఫుడ్‌ సేఫ్టి అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెంటనే అమలు చేయాలి.

ప్రజల్లో ముఖ్యంగా స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ పేరిట మభ్యపెట్టి ప్రచార పటోపంతో మార్కెట్‌ అవుతున్న ఈ హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ గురించి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజారోగ్య పక్షపాతులందరూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఖరీదైన, హానికరమైన ఎనర్జి డ్రింక్స్‌ స్థానే తక్కువ ఖర్చుతో, స్థానికంగా లభించే తాజా, సహజ పానీయాల్ని సేవించడం పట్ల యువతీయువకుల్లో అవగాహన పెంపొందించాలి.

  • మూలము : ప్రజాశక్తి న్యూస్ పేపర్ / డాక్టర్‌ కె.శివబాబు, రాష్ట్రకమిటీ సభ్యులు--జనవిజ్ఞాన వేదిక, జహీరాబాద్‌, మెదక్‌ జిల్లా.
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.