Sunday, August 28, 2011

డెమన్షియా , Dementia,మతిమరుపు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డెమన్షియా , Dementia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


డెమన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడంవల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, సమస్యా పరిష్కారశక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత పాండిత్యంగల వారైనా దీని బారిన పడ్డారంటే భాష మీద ఆధిపత్యం, ఏకాగ్రత, భాషాచాతుర్యం, పరిశీలనాశక్తి వంటివి దారుణంగా దెబ్బతింటాయి. దీనికితోడు మనిషి ప్రవర్తనలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. డెమన్షియావల్ల జ్ఞాపకశక్తిలో లోపం ఏర్పడి ఆ మనిషికి మరుపు మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు.
బాగా ముదిరితే ... ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

మనిషిలో వచ్చే మార్పులు
ఈ డెమన్షియా ముదురుతుంటే భార్యని అమ్మా అని లేదా పిన్నీ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని వస్తువుల పేర్లు గుర్తుకురాక అది..ఇది అని మాట్లాడుతారు. ఎవరికి కనిపించనిది, వినిపించనిది తనకు కన్పిస్తున్నట్లు, విన్పిస్తున్నట్లు భ్రమకు లోనవుతూ ఉంటారు.ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. మగతగా, అయోమయంగా తయారవుతారు .

ఈ డెమన్షియాలో ఎన్నెన్నో రకాలు వున్నాయి. ఒకొక్కదానికి ఒకొక్క రకం లక్షణాలు.

ఆల్‌జైమర్ డెమన్షియా : .
డెమన్షియా వచ్చిన వారిలో సగం మందికి పైగా ఈ ఆల్‌జైమర్ డెమన్షియా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా ఇంకా తెలియరాలేదు. కాకపోతే కొంతమంది దీనిని వారసత్వపు సమస్యగాను, మరికొందరు ఆడవారికి ఎక్కువగా వస్తుందని అంటారు.

ప్రీ సెనైల్ డెమన్షియా : ఈ డెమన్షియా మనిషికి 40 ఏళ్ల వయసులోనే వచ్చిందంటే దానిని ప్రీ సెనైల్ డెమన్షియా అంటారు. .

సెనైల్ డెమన్షియా : ఈ డెమన్షియా మనిషికి 60 ఏళ్ల వయసులో వస్తే సెనైల్ డెమన్షియా అంటారు.

క్రాజోఫెల్ట్ జాకబ్ డిసీజ్ డెమన్షియా : క్రాజోఫెల్ట్ జాకబ్ డిసీజ్ గురించి చెప్పుకోవాలి. ఇది మెదడు క్రమంగా క్షీణిస్తూ ఎదురయ్యే ఒక విధమైన డెమన్షియా. ఇది రావడానికి ఒక కారణం మేడ్ కౌ డిసీజ్ వున్న ఆవు మాంసం తినడం అని వైద్యపరిశోధకుల అభిప్రాయం.

కారణాలు :
  • శరీరంలోకి అల్యూమినియం చేరి దాని విషప్రభావం వల్ల మెదడు దెబ్బతిని ఈ డెమన్షియాకు కారణం అవుతోందని కొంతమంది వాదన.
  • మెదడులో కంతులు,
  • తలకు గాయాలు,
  • ఎయిడ్స్,
  • పార్కిన్‌సన్ వ్యాధి
  • మెటబాలిజం సమస్యలు,
  • ఆహార లోపాలు-విటమిన్‌ బి 12 లోపము ,
  • కొన్ని మందులు వాడకము వల్ల -- cimetidine , some cholesterol lowering medicines .
  • నిరంతర మద్యపానము నకు బానిస ,
వంటివి వచ్చినప్పుడు కూడా వారికి డెమన్షియా వచ్చే అవకాశం ఉంటుంది.ఇతర ఇన్‌ఫెక్షన్సువల్ల కూడా కొంతమందికి ఈ డెమన్షియా సమస్య వస్తుంది.

చికిత్స
మెదడును మరమ్మత్తుచేయడానికి మందులు వున్నాయి. అయితే అవి వ్యాధిగ్రస్థునికి ఏమేర పనిచేస్తాయన్నది అనుమానమే. పిరాసిటామ్, వైరిటినాల్, హైడర్జిన్ లాంటి మందులు కొంత మేలుచేస్తున్నట్లు రికార్డులవల్ల తెలుస్తోంది.
వైద్యుని పర్యవేక్షణలో చికిత్స ఎంతో అవసరం. దీనికితోడుగా ఆహారం, వ్యాయామం, ఆటవిడుపు కార్యక్రమాలు కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వీరికి ప్రధానంగా సపోర్టివ్ సైకోథెరపీ మంచిది.

ముందు జాగ్రత్తలు(prevention) :
  • ధూమపానము మానివేయాలి. ,
  • మద్యపానము మానివేయాలి ,
  • బి.పి . ఉంటే అదుపులో ఉంచుకోవాలి ,
  • మధుమేహము ఉంటే .. అదుపులో ఉంచుకోవాలి ,
  • కొవ్వు పదార్ధాలు తక్కువగా తినాలి ,
  • వ్యాయామము క్రమము తప్పకుండా(regular) చేయాలి .
updates: 

  • వృద్ధాప్యంలో మతిమరుపు సహజమే. కానీ 30ల్లో ఉన్నవారూ దీని బారినపడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది.

* 6% మందిలో ముప్పైల్లోనే మతిమరుపు ప్రారంభమవుతోంది.
* 10% మందిలో నలబైల్లోనే జ్ఞాపకశక్తి తగ్గటం మొదలవుతోంది.
* 40% మంది తమకు చాలాకాలంగా తెలిసిన వ్యక్తుల పేర్లను తరచుగా మరచిపోతున్నారు.
* 20% మంది తాళంచెవులను, కళ్లద్దాలను ఎక్కడ పెట్టామో గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారు.
* 10% మంది ఏటీఎంలలో తమ రహస్యసంఖ్య(పిన్‌) గుర్తుకురాక ఇబ్బంది పడుతున్నారు.

నిజానికి చిన్నవయసులో ఇలాంటి మతిమరుపు పెద్దగా హాని కలిగించేదేమీ కాదు. కానీ కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో జ్ఞాపకశక్తి తగ్గిపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుస్తకాలను చదవటం.. చిక్కు సమస్యలను, పదకేళీలను పూరించటం.. హోంవర్కు చేయటంలో పిల్లలకు సాయపడటం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం.. వంటి పనులు మతిమరుపు బారినపడకుండా దోహదపడతాయని సూచిస్తున్నారు.

వేళకు తింటే మతిమరుపు దూరము : 
వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపు (డిమెన్షియా)తో బాధపడేవారు వేళకు తినాలనే సంగతినీ మరచిపోతుంటారు. కొన్నిసార్లు తిన్నారో లేదో కూడా చెప్పలేని అయోమయంలో ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక ఇతరత్రా సమస్యలూ ముంచుకొచ్చే అవకాశముంది. ఇలాంటి వారికి సమయానికి ఆహారం తీసుకునే విషయాన్ని గుర్తుంచుకునేలా శిక్షణ ఇస్తే మంచి ఫలితం కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. దీంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుంగుబాటు లక్షణాలూ తగ్గుముఖం పడుతున్నట్టు తైవాన్‌ పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా కొందరికి మామూలు చికిత్స, మరికొందరికి చికిత్సతో పాటు ఆహార అలవాట్లను గుర్తుంచుకునేలానూ శిక్షణ ఇచ్చారు. ఇలా జ్ఞాపకశక్తి శిక్షణ తీసుకున్న వారిలో పోషకాల మోతాదులతో పాటు శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) కూడా మెరుగుపడినట్టు తేలింది. అలాగే వీరిలో కుంగుబాటు లక్షణాలూ తగ్గుముఖం పట్టటం విశేషం. అందువల్ల డిమెన్షియా బారినపడ్డ వారిలో బలహీనత, పోషకాలు తగ్గిపోవటం, కుంగుబాటు లక్షణాల వంటివి కనబడితే ఇలాంటి జ్ఞాపకశక్తి సంబంధ శిక్షణ ఇచ్చే పద్ధతి పాటించటం మేలన్నది పరిశోధకుల సూచన.


Brain exercises in dementiaమతిమరుపునకు మెదడు వ్యాయామాలు

ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుంద నుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాల న్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు
మెమొరీ గేమ్‌ చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందంటే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరోమారు జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు. విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే విచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూపలేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.

పజిల్స్‌ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చర్‌ పజిల్స్‌, సుడోకు వంటివి మెదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవండి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి. భాషాపర వైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగువుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది. ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎంతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.