Monday, August 29, 2011

అవయవాల మార్పిడి ,Organ Transplantation



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అవయవాల మార్పిడి ,Organ Transplantation- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన శరీరంలోని రకరకాల అవయవాలు దేనిపని అది చేసుకుని పోతూ ఉంటే, మనం హాయిగా మన పనులు చేసుకుంటూ ఉంటాము. ఏదైనా కారణం వలన ఆ అవయవాలు పనిచేయకపోతే, శరీరం కూడా మొరాయిస్తుంది. అటువంటప్పుడు ఆ పనిచేయని అవయవం స్థానంలో వేరొర క్రొత్త అవయవాన్ని ఏర్పరచగలిగితే .......?

ప్రాచీన కాలంలో ఇటువంటి ఊహలకు ప్రతిరూపమే మనం చూపే వినాయకుడి తల... కాబట్టి మనకు తెలిసిన మొదటి అవయవ మార్పిడి వినాయకుడి అసలు తల స్తానం ఏనుగు తల రావడం. అలా ఊహల పల్లకిలో ఊరేగిన మనిషి మేధస్సు ఎంతో...... ఇంకెంతో ఎదిగి, ఇప్పుడు చేస్తున్న ఆధునిక అవయవాల మార్పిడి స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ముఖ్యంగా మార్పిడి చేస్తున్న అవయవాలలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు (కార్నియా) ముఖ్యమైనవి.

వీటిలో........ శరీరంలో ఒకటే ఉన్న అవయవాన్ని (ఉదా...గుండె, కాలేయం మొ|| ) మార్చాలంటే....... అప్పుడే చనిపోయిన వ్యక్తి నుంచి తీసి మాత్రమే మార్చవలసి వస్తుంది. దీనిని Cadaver transplant అంటారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి - ఏ వయసులో వారైనా - రోడ్డు ప్రమాదాలు లేదా గుండెపోటు వల్ల లేదా ఇతర కారణాల వలన చనిపోయినప్పుడు - అతని మెదడు చనిపోతుంది - కాని గుండె ఇతర అవయవాలను కృత్రిమంగా పనిచేస్తూ ఉంటారు. దీనిని Brain Death అంటారు. ఇటువంటి వ్యక్తులు కృత్రిమ సహాయం (ఉదా,, వెంటిలెటర్) ఆపిన వెంటనే పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో, ఇటువంటి వ్యక్తుల నుంచి అవయవాలను వేరొకరికి దానం చేసి ఇతరులకు సహాయపడవచ్చు.

ఇక శరీరంలో జతగా ఉన్న అవయవాలు ఉదా,, కిడ్నీలు బతికి ఉన్న వాళ్ళు వేరొకరికి ఒక కిడ్నీ దానం చేయవచ్చు. దీనిని Live transplant అంటారు.
పేదరికం వల్ల కొందరు తమ అవసరాలనిమిత్తం ఒక కిడ్నీని అమ్ముకునే సంఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తున్నాం. డబ్బున్న వాళ్ళకు కిడ్నీ కావలసి వస్తే ఎంతైనా ఖర్చు పెట్టి పేదల కిడ్నీలు కొనేస్తున్నారు. పేదలకు కిడ్నీ కావలసివస్చే మాత్రం, కొనలేక, ఎవరైనా దానం చేసినా, అపరేషన్ చేయించుకుని అమర్చుకొనే స్తోమత లేక మొగ్గదశలోనే రాలిపోతున్నారు.్

----------

----------
ఇంత ముఖ్యమైన కిడ్నీలు పనిచేయకపోతే ?

* తాత్కాలికంగా పనిచేయనప్పుడు - కిడ్నీల పని బయట నుంచి మనం చేయవచ్చు. దీనిని డయాలసిస్ అంటారు.
* శాశ్వతంగా పనిచేయకపోతే-
1. జీవితాంతం డయాలసిస్.
2. కిడ్నీ మార్పిడి.

మరి కొత్త కిడ్నీ ఎక్కడ దొరుకుతుంది ?

* ఇంతవరకు చెప్పుకున్నట్లు చనిపోయిన వ్యక్తి నుంచి గాని, బ్రతికి వున్న వ్యక్తుల నుంచి గాని తీసుకోవాలి.

రెండు కిడ్నీలు మార్చుకోవాలా ?

* ఒక ఆరోగ్యవంతమైన కిడ్నీ శరీరాన్ని కాపాడుతుంది.
* కాబట్టి కిడ్నీ ఇచ్చిన దాత తనకు మిగిలిన ఒక కిడ్నీతో ఆరోగ్యంతో జీవిస్తాడు.
* గ్రహీతకు ఒక్క కిడ్నీ సరిపోతుంది. అవయవ మార్పిడి లో ముఖ్యమైన అంశాలు మూడు
1. ఆ అవయవం దొరకడం { Availability }
2. తీసుకొనే వారి శరీరానికి సరిపోవడం { matching }
అది అమర్చే ప్రక్రియ { Fixation }

దొరకడం ఎలా ? ఇంతకు ముందు చెప్పినట్లు చనిపోయిన వ్యక్తి నుంచి లేదా బ్రతికి ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని అమర్చాలి.
సరిపోవడం అంటే ?

శరీర నిర్మాణం ప్రకారం బయట నుంచి వేరొక క్రొత్త పదార్థమేదైనా శరీరంలోకి వచ్చినప్పుడు శరీరం వెంటనే దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ పని చేస్తుంది. అందుకని సాధ్యమైనంతగా శరీర స్థితికి దగ్గరగా ఉండే వారి నుంచి మాత్రమే కిడ్నీని తీసుకోవలసి వస్తుంది. దీనికోసం రక్తం గ్రూపు, HLA Testing మొదలైనవి చేసి, ఎంతవరకు ఇచ్చేవారి కిడ్నీ రోగికి సరిపోతుందో పరీక్షిస్తారు. సాధారణంగా తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల కిడ్నీ అయితే రోగి శరీరం బాగా స్వీకరిస్తుంది. వీరుకాక రక్తం గ్రూపు మొదలైనవి సరిపోయిన వేరొకరి నుంచి తీసుకొంటే, రోగి శరీరంలోని ఆ క్రొత్త కిడ్నీని నాశనం చేయకుండా శక్తివంతమైన మందులతో (immuno suppressants) రోగ నిరోధక వ్యవస్థను పనిచేయకుండా చేయాలి. దీని వలన క్రొత్త కిడ్నీ నాశనం కాకుండా బాగుంటుంది. కాని శరీరానికి రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గి ఇతర ఇన్ఫెక్షెన్లు సోకే ప్రమాదం వుంది.
అమర్చే ప్రక్రియ ఎలా ?

క్రొత్త కిడ్నీని నూటికి నూరుపాళ్ళు అత్యంత నిపుణతతో శరీరంలో అమర్చవలసి వుంటుంది. దానికి వాడే పరికరాలు, ఇతర వస్తువులు (సూదులు, దారాలు) మొదలైన వాటిలో ఎంతో మార్పు వచ్చి, ప్రస్తుతం వాడే వస్తువులు అత్యంత నాణ్యమైనవిగా తయారయ్యాయి.
ఎన్నో పరిశోధనలు చేసి, శాస్త్రవేత్తలు ఇంతకుముందు చెప్పిన immuno suppressant మందులు తయారుచేశారు. ఈ ఒక్క రంగంలోనే ఆ పరిశోధనలకు గాను 3 నోబెల్ బహుమతులు ఇవ్వబడ్డాయి.
అలాగే ఆపరేషన్ కు వాడే వస్తువులను తయారు చేసే క్రమంలో కూడా జరిగిన పరిశోధలకు గాను కూడా 3 నోబెల్ బహుమతులు ఇవ్వబడ్డాయి.

కాని, మనందరి చేతుల్లో ఉన్నది -ఎక్కువ మంది కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు రావడం. రోజు రోజుకు కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న యువతీ యువకులు ఎంతో మంది పెరుగుతున్నారు. వీరందరికీ విజయవంతంగా కిడ్నీ మార్పడి చేయగలిగితే వారి వారి కుటుంబాలు, తద్వారా దేశానికి ఎంతో ఉపయోగం. అందుకని ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వం, ప్రజలు చనిపోయిన వ్యక్తుల నుంచి అవయవాలను మార్చడానికి గట్టి నిర్ణయం తీసుకొని ప్రోత్సహించాలి.

కొన్ని దేశాలలో (ఉదా. ఆస్ట్రేలియా ) వారి పౌరులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేప్పుడు, దురదృష్టవశాత్తు వారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగితే, వారి అవయవాలు ప్రభుత్వానికే చెందేట్లు చట్టం చేశారు. దీనివలన అలా చనిపోయిన వారి అవయవాలను ఎంతో మంది రోగులకు అమర్చే అవకాశం ఉంది. మన దేశంలో కూడా ఇటువంటి చట్టం చేసే దిశగా ప్రభుత్వం, ప్రజలు చర్చించవలసిన అవసరం ఉంది.

అలాగే, కిడ్నీ మార్పిడి ప్రక్రియలో వాడే మందులు, ఇతర వస్తువులు ధరలు బాగా తగ్గించగలిగితే ఎక్కువ మంది కిడ్నీ మార్పిడి చేయించుకోగలుగుతారు. ఈ దిశగా ప్రభుత్వం ఆయా మందులు తయారీదారులు ప్రయత్నించవలసిన అవసరం ఉంది.


--డా. ఎస్.ఎల్.వి.నారాయణరావు, నెఫ్రాలజిస్ట్, అరవింద్ కిడ్నీ సెంటర్, నెల్లూరు


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.