Tuesday, November 29, 2011

రోగనిరోధక శక్తి,immunity,రక్షణ కవచం



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రోగనిరోధక శక్తి,immunity,రక్షణ కవచం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


* రోజూ మన శరీరం ఎన్నో రోగాల బారి నుండి కాపాడబడుతుంది. నిత్యం ఎన్నో రోగక్రిముల నుండి రక్షింపబడుతున్నాము. ఈ ప్రక్రియ అనునిత్యం మన జీవితంలో ఒక భాగం. ఇవన్నీ మన శరీరధారుడ్యాన్ని బట్టి, మంచి అలవాట్లను బట్టి రోగనిరోధక శక్తి వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను మనం దృఢపరచుకోవడానికి కొన్ని నియమాలు, అలవాట్లు పాటించాలి.

రోగ నిరోధక వ్యవస్థ శరీరమంతా వ్యాపించి వుంటుంది. ఈ వ్యవస్థ శరీరానికి సంబంధించిన కణాలు, బయట వుండే కొత్త కణాలేవో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతుంది. శరీరానికి సంబంధించిన కణజాలాల్ని సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వాటికి సరైన రీతిలో ప్రతిస్పందించి వాటిమీద దాడి చేస్తుంది. శరీరంలో ప్రతిబంధకాలు (యాంటి బాడీస్‌)ను వాటికి అనుగుణంగా సృష్టించుకుంటుంది. సూక్ష్మజీవులతో పోరాడుతుంది. వీటితో పోరాడే కణాల్ని ప్రేరేపించి రోగక్రిములను నశింపజేస్తుంది. ఈ రోగనిరోధక వ్యవస్థకు ధైమస్‌గ్రంథి, లింప్‌ గ్రంథులు, లింప్‌ నాళాలు, ఎముకలోని గుజ్జు, ప్లీహం సహాయపడతాయి.

  • థైమస్‌ గ్రంథి
ఛాతి ఎముక వెనక వైపున వుండే ఈ గ్రంథి ఉత్పత్తి చేసే తెల్ల రక్తకణాలు టి. లింపో సైట్స్‌గా వృద్ధిచెందుతాయి.శరీరంలో ప్రవేశించిన బాక్టీరియాతో, వైరస్‌లతో పోరాడతాయి. టి సెల్స్‌ అనే ఈ కణాలకు మరికొన్ని కణాలు తోడై జంటగా కూడా పోరాడతాయి. సహయక టి.సెల్స్‌, కిల్లర్‌ టి-సెల్స్‌, సప్రసెర్‌ టి-సెల్స్‌ను జంటగా పోరాడే కణాలు అంటారు. ఆ బాక్టీరియా నశిస్తూనే పోరాటం ఆపాలనే సందేశం వాటికి అందుతుంది. కానీ కొన్ని సందర్భాలలో రోగనిరోధక కణజాలాలు మన శరీరంలో వుండే కణజాలాల మీదనే దాడికి దిగుతాయి. అప్పుడు శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడి వచ్చే వ్యాధులను ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు అంటారు. రుమాటాయిడ్‌ ఆర్థ్రయిటీన్‌ కీళ్లవ్యాధి ఈ విధంగానే వస్తుంది.

  • లింఫ్‌ గ్రంథులు
ఇవి బి-లింఫోసైట్స్‌ అనే రక్త కణాలను తయారు చేస్తాయి. వీటిపై భాగానా ఇమ్యూనోగ్లోబిన్స్‌ అనే ప్రోటీన్‌ వుంటాయి. ఇవి రోగక్రిములతో పోరాడే యాంటిబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి.

  • లింఫ్‌ నాళాలు
ఈ నాళాలు సూక్ష్మక్రిములను లింఫ్‌ గ్రంథుల వద్దకు చేర్చి, అక్కడ తయారయ్యే యాంటీ బాడీస్‌, సూక్ష్మక్రిములను నశింపజేస్తాయి.

  • ఎముక గుజ్జు
ఇది మన శరీరంలో రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ తెల్ల రక్తకణాలు శరీరంలో ప్రవేశించిన సూక్ష్మక్రిములతో పోరాడి వాటిని నశింపజేస్తుంది.

  • ప్లీహం
ఇక్కడికి రక్త ప్రసరణ ద్వార చేరిన సూక్ష్మక్రిములను, తెల్ల రక్తకణాల ద్వార నశింపజేస్తుంది.

  • రోగనిరోధక వ్యవస్థ రకాలు.--
రోగనిరోధక వ్యవస్థ రెండు రకాలు :
మొదటిది పుట్టుకతో వస్తుంది. అంటే తల్లి గర్భంలో వుండగా, తల్లి శరీరము నుంచి లభించే యాంటీబాడీస్‌ ద్వారా, తర్వాత తల్లి పాలనుండి లభించే యాంటి బాడీస్‌ ద్వారా రక్షణ కల్పించే వ్యవస్థ.

ఇక రెండోది అక్వైర్డ్‌ ఇమ్యూనిటి. ఇది మనిషి పెరిగి పెద్దయ్యే క్రమంలో మంచి మంచి అలవాట్ల వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటాం.

  • ఎలా సాధ్యం ?
రోగనిరోధక శక్తిని మనలో ఉంటుంది. ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. వివిధ సందర్భాలలో సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యవస్థ చురుకుంగా పనిచేసి వాటి నిర్మూలిస్తుంది. ఇదేలా సాధ్యమంటారా...
  • నోటిలో లాలాజలంలో వుండే ఎంజైమువల్ల.
  • ముక్కులోనికి దుమ్ము, ధూళి నాసికలలో వుండే కేశములవల్ల బయటికి తోసెయ్యబడతాయి. ఒక్కసారి ఈ సూక్ష్మక్రిములు ముక్కులోపల ప్రవేశిస్తే, తుమ్ము ద్వారాగాని, చీమిడి ద్వారాగాని బయటికి నెట్టివేయబడ్తాయి.
  • గొంతులోపల వుండే టాన్సిల్స్‌ ద్వారా నిరోధించబడ్తాయి.
  • జీర్ణాశయంలో, కడుపులో తయారయ్యే యాసిడ్స్‌వల్ల ప్రేగుల్లో ప్రవేశించినప్పుడు ఈ సూక్ష్మక్రిములను ఉపకారిక బ్యాక్టీరియా నశింపజేస్తుంది.
  • చర్మం తన స్వేదగ్రంథుల ద్వారా, నూనె గ్రంథులలో తయారయ్యే నూనె వల్ల చర్మం ద్వారా ప్రవేశించే సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి.
  • మూత్రనాళాలలో వుండే మంచి బాక్టీరియా ఈ సూక్ష్మ క్రిములను నశింపజేస్తాయి.
  • ఇలా మన శరీరంలో చొచ్చుకొని వచ్చే అపకారిక్రిములను చాలా వరకు నశింపజేస్తాయి.
  • మనం ఏం చేయాలి ?
మన చుట్టూ ఉండే వాతావరణంలో ఎన్నో రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌, పారసైట్లు వంటివి అదృశ్యంగా ఉంటాయి. ఆహారంతోపాటు మన శరీరంలోకి ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతుంటాయి. సాధారణ జలుబు నుండి ఫ్లూ వరకూ ఎన్నో వ్యాధులు గాలిలో తేలియాడే వైరస్‌ల కారణంగానే సోకుతాయి. వీటి బారినుండి శరీరాన్ని రక్షించేది మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ . ఈ దీన్ని పటిష్టపరుచుకోకుంటే మనం రోగాల బారినుంచి రక్షించుకున్న వాళ్లమవుతాయి.

  • పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌, దుంపలు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులు రాకుండా కాపాడుకోగలుతుగారు. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడంలో ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు, ఖనిజాలు, బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి, ఫోలేట్‌, ఇనుము, మెగ్నీషియం, కెరోటినాయిడ్లు, ఫైటో కెమికల్స్‌, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

  • ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్‌, ఖనిజల వణాలు కలిగిన పోషక పదార్థాలతో కూడిన సంతులిత ఆహారము వేళకు సరిగ్గా భుజించడము.
  • రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో చాలా చవకైనది వ్యాయామం. రోజు తప్పని సరిగా వ్యాయమం చేయడం అలవాటు చేసుకోవాలి. వయసు, సమయాన్ని బట్టి చేసే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. నడకగాని, జాగింగ్‌ సైక్లింగ్‌, స్విమింగ్‌ (లేదా ఆటలు) చేయాలి.
  • ఒత్తిడికి దూరంగా వుండాలి. ఒత్తిడి ఎక్కువైతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకని ఒత్తిడిని తగ్గించునే మార్గాలు ఎంచుకోవాలి. ప్రణాళికాబద్దంగా పనులు చేస్తే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
  • మద్యపానం, అతిగా టీ కాఫీలు సేవించడం మానాలి.
  • పొగ తాగడం, గుట్కా జర్దా వాడటంమానాలి.
  • కొన్ని ప్రాణాంతకమైన రోగాలకు తప్పని సరిగా వ్యాక్సీన్‌లు వేయించుకోవాలి.
  • పుట్టిన పిల్లలకు తర్వాత పెరిగే పిల్లలకు, నిర్దేశించబడిన సమయాలలో వ్యాక్సిన్‌ వేయించాలి. వీటిని పాటిస్తే మన ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా వుంటుంది.
  • రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేయాలి. కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. దీని వల్ల అలసిన శరీరానికి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • రోజూ చాలినన్ని నీళ్లు తాగాలి. దాహం కాలేదని నీళ్లుతాగడం మరచిపోకూడదు. డీహైడ్రేషన్‌ వల్ల తలనొప్పి కలిగే అవకాశాలున్నాయి.
  • స్థూలకాయం కూడా రోగనిరోధక శక్తికి శత్రువు. ఎందుకంటే స్థూలకాయం తెల్లరక్తకణాలు పెరగడం, యాంటిబాడీల ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.