Friday, November 25, 2011

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ , Prostate Cancer




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ , Prostate Cancer -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మధ్య వయసు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్‌ గ్రంథి పెద్దదవుతుంది. దీన్నే ప్రాణాపాయరహిత ప్రొస్టేట్‌గ్రంథి పెరుగుదల (బిపిహెచ్‌-బినైన్‌ ప్రొస్టేటిక్‌ హైపర్‌ప్లాసియా) అంటారు. తరచుగా ఇది 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి కేన్సర్‌ కాదు. ఇది మూత్రాశయానికి చుట్టుకుని ఉండడం వల్ల బిపిహెచ్‌ మూత్ర విసర్జనకు ఆటంకం కలిగిస్తుంది. బిపిహెచ్‌ ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ లక్షణ రహితంగా వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి మూత్రనాళాన్ని (శరీరం నుండి మూత్రాన్ని బయటకు పంపించేది) ముడుచుకుపోయేలా చేయడం వల్ల మూత్రాశయం ఖాళీ కావడాన్ని జటిలం చేస్తుంది. నలభై నుంచి యాభై ఏళ్లపైబడిన వాళ్లు ప్రతి సంవత్సరం ''సెరమ్‌ ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజైన్‌'' పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, మూత్ర సంబంధిత ఇబ్బందులుంటే కూడా చేయించుకోవాలి.  ప్రొస్టేట్‌ గ్రంథి సమస్యలు, క్యాన్సర్‌గురించి...

మూత్రాశయం దిగువన ప్రొస్టేట్‌ గ్రంథి ఉంటుంది. పురుషులకు మాత్రమే ఉండే గ్రంథి ఇది. ఇది ఉత్పత్తి చేసే ఒక విధమైన ద్రవం వీర్యకణాలను రక్షిస్తుంది. పురుషాంగం నుంచి మూత్రాన్ని, వీర్యాన్ని బయటకు తీసుకెళ్ళే మూత్రమార్గం వెలుపలి భాగాన్ని చుడుతూ ఉంటుంది. ఈ గ్రంథి దీని ఉండే నరాలు అంగస్తంభనలో పాలు పంచుకుంటాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు గురైతే క్యాన్సర్‌ కణాలు గ్రంథి అవతలి భాగాలకు కూడా విస్తరిస్తాయి. ఈ క్యాన్సర్‌ నెమ్మదిగా ఎదుగుతుంది. ఎలాంటి వ్యాప్తిని లేదా లక్షణాలను ప్రదర్శించవు. పెద్ద వయస్సులో, ఇతర వ్యాధుల కారణంగా మరణించిన వారిలో ఎంతోమందికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తదనంతరం నిర్వహించిన శవపరీక్షల్లో వెల్లడైంది. కొన్ని రకాల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లు మాత్రం వేగంగా వృద్ధి చెందడంతో పాటు వేగంగా విస్తరిస్తాయి కూడా. 50 ఏళ్ళ పై బడిన పురుషులకు ఎక్కువగా ఈ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు కనిపించవు

క్యాన్సర్‌ ఉన్నవారికి తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలావరకు ఈ క్యాన్సర్‌లు రొటీన్‌గా నిర్వహించే మలాశయ పరీక్షల సందర్భంగానే వెల్లడవుతాయి. వ్యాధి తీవ్రత పెరిగిన తరువాత, మూత్రవిసర్జన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో బాగా బాధగా ఉండవచ్చు. వెన్ను లేదా వృక్కద్రోణి (మూత్రనాళం మొదలు) లేదా కటివలయం (పొత్తి కడుపు ప్రాంతం)లో నొప్పిగా ఉండవచ్చు. మూత్రం అనిశ్చితంగా, ఆగి ఆగి సన్నగా రావడం. మూత్రం తొందరగా రావడం, కారటం లేదా బొట్టు బొట్టుగా పడటం. అత్యంత తరచుగా మూత్ర విసర్జన, ప్రత్యేకించి రాత్రి సమయంలో. మూత్ర విసర్జన సమయంలో మంటగా/నొప్పిగా ఉండటం. అత్యవసరంగా రావటం, మూత్రవిసర్జనను ఆపుకోలేకపోయే అనుభూతి. మూత్ర విసర్జనకు ప్రారంభించడానికి, కష్టపడటం లేదా ఒత్తిడికి అవసరం కావటం వంటి లక్షణాలుంటాయి.

వంశపారంపర్యంగా

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రావడానికి కారణాలేంటో ఇప్పటికీ పూర్తిగా తెలియనప్పటికీ, వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రమాద కారకాలను కొన్నింటిని పరిశోధకులు గుర్తించారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది. కుటుంబంలో ఓ వ్యక్తి తండ్రి లేదా సోదరునికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటే, ఆ వ్యక్తికి కూడా వ్యాధి వచ్చేందుకు సాధారణ వ్యక్తులతో పోలిస్తే రెట్టింపు అవకాశాలుంటాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే పురుషులు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. శరీరంలో కొవ్వు ఎక్కువ ఉండటంకన్నా కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, పాల ఉత్పత్తులు అధికంగా తినడం, జీవనశైలి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను అధికం చేస్తుంది. కాల్షియం అధికంగా ఉండే, ఫ్రక్టోస్‌ (ఫ్రూట్‌ షుగర్‌) తక్కువగా ఉండే ఆహారపదార్థాలు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను అధికం చేస్తాయి. వేసెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉండవచ్చు. 35 ఏళ్ళ లోపు వేసెక్టమీ చేయించుకున్న వారిలో ఈ వ్యాధికి గురయ్యే ముప్పు అవకాశాలు అధికంగా ఉంటాయి.

కారణాలేంటి?

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రావడానికి అసలు కారణాలు ఏంటో నేటికీ నిర్దిష్టంగా తెలియవు. ముప్పును పెంచే కొన్ని కారకాలను మాత్రం పరిశోధకులు గుర్తించారు. కణాలు చేసే పనులన్నింటికీ అవసరమైన ఆదేశాలను కలిగిఉండే లేదా తీసుకెళ్ళే రసాయనమే డిఎన్‌ఎ. కణ విభజనను మందగింపజేసే లేదా నిర్దేశిత సమయంలో కణాలు నశించిపోయేలా చేసే జన్యువులను ట్యూమర్‌ సప్రెసర్‌ జన్యువులని అంటారు. డిఎన్‌ఎ మ్యుటేషన్‌ (ఉత్పరివర్తనం లేదా జన్యుపరమైన లోపాలు) వల్ల అంకోజీన్స్‌ పని చేయడం లేదా ట్యూమర్‌ సప్రెసర్‌ జన్యువులు పని చేయకపోవడం జరుగవచ్చు. ఈ విధమైన డిఎన్‌ఎ జన్యులోపాలను కొంతమంది వారసత్వంగా పొందడం గమనార్హం. ఇలా వారసత్వంగా వచ్చిన కొన్ని జన్యువుల్లోని డిఎన్‌ఎ మార్పులు, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధి చెందే అవకాశాలను అధికం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లలో దాదాపు 10 శాతం మేరకు ఇలా జన్యుపరమైన మార్పుల వల్ల చోటు చేసుకునేవేనని భావిస్తున్నారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించిన, డిఎన్‌ఎ ఉత్పరివర్తనాలు (జన్యులోపాల్లాంటివి) వారసత్వంగా రావడానికి మించి, మనిషి జీవిత కాలంలోనే ఎక్కువగా వృద్ధి చెందుతాయి.

రోగ నిర్ధారణ పరీక్షలు

మూత్ర విసర్జన చేయడాన్ని పరీక్షించడం లాంటి ఇతర పరీక్షలు. దీన్ని ఒక ఎలక్ట్రానిక్‌ మీటర్‌ను ఉపయోగించి చేస్తారు. మూత్రవిసర్జన వేగం తగ్గితే, అది బిపిహెచ్‌ అని నిర్ధారించుకోవచ్చు. మూత్రాశయాన్ని ఎంత బాగా ఖాళీ చేస్తున్నారో చూడటాన్ని 'పొస్ట్‌వాయిడ్‌ రెసిడ్యుయల్‌' అనే పరీక్ష చేస్తారు. నలభై నుంచి యాభై ఏళ్లపైబడిన వాళ్లు ప్రతి సంవత్సరం సెరమ్‌ ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజైన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, మూత్ర సంబంధిత ఇబ్బందులుంటే కూడా చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడానికి ముందే 31 శాతం మంది ప్రొస్టేట్‌ గ్రంథి సమీపంలోని కణజాలాల్లో క్యాన్సర్‌ వ్యాప్తి చెంది ఉంటుంది. ప్రొస్టేట్‌ నరాలకు సమీపంలోని నరాలకు చికిత్స చేయడం లేదా వాటిని తొలగించడం వంటివి నపుంసకత్వం వంటి అంగస్తంభన సమస్యలకు దారి తీయవచ్చు. తొలిదశలోనే ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స చేయడమనేది కొంతమంది ఆయుర్ధాయాన్ని పెంచినప్పటికీ, మరెంతోమంది ఆయుర్దాయంపై అదెలాంటి ప్రభావాన్ని కలిగించలేకపోయింది.

చికిత్స విధానాలు

శ్రస్త చికిత్స చేయకుండా ప్రొస్టేట్‌ పరిమాణాన్ని తగ్గించడంలో మందులు ఉపకరిస్తాయి. ఇవి ఈ విధంగా పనిచేస్తాయి... మూత్రాశయంపై ఒత్తిడి తగ్గించడం ద్వారా. ప్రొస్టేట్‌ వృద్ధిని ప్రోత్సహించే హార్మోన్లను అడ్టుకోవడం ద్వారా. మూత్ర విసర్జన తీవ్రతను ఉపశమించడం చేయడం ద్వారా. శస్త్రచికిత్సలు...

లేజర్‌ ప్రొస్టేట్‌ రిమూవల్‌ : ఇది లైటుతో కూడిన టెలిస్కోపును చొప్పించడం. దీని ద్వారా ప్రొస్టేట్‌ను చూడొచ్చు. ఇందులో శస్త్ర చికిత్స ఉపకరణాలను పంపించడం ద్వారా ప్రొస్టేట్‌ కణజాలాన్ని తొలగిస్తారు.

టియుఆర్‌పి : ఇది ట్రాన్స్‌ యురిథ్రల్‌ రిసెక్షన్‌ ఆఫ్‌ ప్రొస్టేట్‌. మూత్రాశయం, బ్లాడర్‌ను అడ్డుకునే టిష్యును తొలగిస్తారు.

ఓపెన్‌ ప్రొస్టేటెక్టొబి ఇన్సిషన్‌ : అధిక టిష్యును తొలగించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

థర్మల్‌ థెరపి : అధిక కణజాలాన్ని కుంచించుకుపోయేలా చేయడానికి వేడిని ఉపయోగిస్తారు.

లోకలైజ్డ్‌ క్యాన్సర్‌ అంటే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బయటికి లోపలే ఉంటే రాడికల్‌ ప్రొస్టెక్టమీ అనే శస్త్ర చికిత్స ద్వారా ప్రొస్టేట్‌ను తొలగిస్తారు. 90 నుంచి 95 శాతం శస్త్రచికిత్సలు విజయవంతమవుతున్నాయి. ఒక్కోసారి ఈ క్యాన్సర్‌ శరీరంలోని ఇతర భాగాలు ఎముకలు, లింఫ్‌నోడ్లు, ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది. ప్రస్తుతం (ఐఎంఆర్‌టి రేడియేషన్‌ థెరపీ అందుబాటులో ఉంది. ప్రొస్టేట్‌లో చిన్న సూదినుంచి దీని ద్వారా రేడియేషన్‌ కిరణాలను పంపిస్తే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణాలు కాలిపోతాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ మధ్యస్థంగా ఉంటే చికిత్స సులభమవుతుంది. తీవ్రంగా ఉంటే సర్జరీయే కాకుండా హార్మోన్‌ థెరపీ, ఇంజక్షన్లతో చికిత్స అవసరం.

-డాక్టర్‌ ఎన్‌.ఉపేంద్రకుమార్‌,-సీనియర్‌ యురాలజిస్ట్‌, ఆండ్రాలజిస్ట్‌ కన్సల్టెంట్‌--అవేర్‌ గ్లోబల్‌హాస్పిటల్‌, ఎల్‌బినగర్‌, హైదరాబాద్‌.


వ్యాయామంతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నెమ్మది
  • వ్యాయామంతో కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు. అయితే ఇది జన్యువుల్లో మార్పులనూ కలిగిస్తుందని, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కణితులు పెరిగే వేగాన్ని తగ్గిస్తుందని మీకు తెలుసా? ఎక్కువసేపు వ్యాయామం చేయటం వల్ల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ తొలిదశలో గలవారిలో 180 రకాల ప్రోస్టేట్‌ జన్యువులు మార్పు చెందుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ జన్యువుల్లో కణితుల వృద్ధిని తగ్గించే, డీఎన్‌ఏను మరమ్మతు చేసే జన్యువులూ ఉండటం విశేషం. అంటే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధిని నెమ్మదించటం లేదా నివారించటంలో వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందన్నమాట. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన జూన్‌ చాన్‌ ఇటీవల ఒక అధ్యయనం చేశారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ తొలిదశలో గల వారిని, ఆరోగ్యవంతులను ఎంచుకొని వారిలోని ప్రోస్టేట్‌ జన్యువులను పరిశీలించారు. వారానికి కనీసం మూడు గంటల పాటు జాగింగ్‌, టెన్నిస్‌ లేదా ఈత వంటివి చేసేవారిలో 184 జన్యువుల్లో మార్పులు కనిపించాయి. వీటిల్లో కణితుల వృద్ధిని అడ్డుకునేవీ ఉన్నాయి. అంతేకాదు.. డీఎన్‌ఏను మరమ్మతు చేయటంలో పాలు పంచుకునే జన్యువులు కూడా విభిన్నతను ప్రదర్శించాయి. వారానికి మూడు గంటలు లేదా అంతకన్నా ఎక్కువసేపు వ్యాయామం చేసేవారిలో జబ్బుల మూలంగా కలిగే మరణాల ముప్పు 50% తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ బయటపడింది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మూలంగా సంభవించే మరణాల ముప్పూ 60% తగ్గుతున్నట్టు తేలటం విశేషం. నెమ్మదిగా నడిచేవారితో పోలిస్తే.. గంటకు మూడు మైళ్ల వేగంతో నడిచేవారిలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధి సుమారు సగం వరకు తగ్గుతున్నట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది. మొత్తమ్మీద గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేసే వ్యాయామాలతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బాధితులకూ ప్రయోజనం కలుగుతున్నట్టు ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 New Medicine for prostrate problem,ప్రోస్టేట్‌ సమస్యకు కొత్తమందు


  •  
మగవారిలో వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రోస్టేట్‌గ్రంథి వాపు ఒకటి. 60 ఏళ్లు వచ్చేసరికి సుమారు 70% మంది దీని బారినపడుతున్నట్టు అంచనా. మూత్రమార్గం చుట్టూ ఉండే ప్రోస్టేట్‌గ్రంథి వాపు మూలంగా మూత్రం ధార సన్నబడటం, బొట్లుబొట్లుగా పడటం, తరచుగా మూత్రం రావటం, ఎంతోకొంత మూత్రం లోపలే ఉన్నట్టు అనిపించటం, వెంటనే మూత్రానికి వెళ్లాల్సి రావటం, మంట వంటి రకరకాల లక్షణాలు కనబడతాయి. ఇలాంటివారికి శస్త్రచికిత్స చేయటం, అసాధారణ కణవృద్ధికి కారణమయ్యే టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ను అడ్డుకునే మందుల వంటివి ఇస్తుండటం చేస్తుంటారు. అయితే ఈ మందులతో శృంగారంపై అనాసక్తి, స్తంభనలోపం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంది. అందుకే అమెరికాలోని మియామీ వెటరన్స్‌ అఫైర్స్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన ఆండ్రూ షాలీ బృందం ఆర్‌సీ-3940-|| అనే కొత్తమందును రూపొందించింది. ముఖ్యంగా మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావటం నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో దీన్ని తయారుచేశారు. ఇది కణవృద్ధికి మరో కారకమైన గ్యాస్ట్రిన్‌-రిలీజింగ్‌ పెప్త్టెడ్‌(జీఆర్‌పీ)ను అడ్డుకోవటం ద్వారా పనిచేస్తుంది. దీన్ని ఎలుకల్లో ప్రయోగించి చూడగా ప్రోస్టేట్‌గ్రంథి వాపు 18% మేరకు కుచించుకుపోయినట్టు బయటపడింది. మనుషుల్లో కూడా ప్రోస్టేట్‌ కణాలు 21% మేరకు కుచించుకుపోయాయి. పైగా దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఇది అందుబాటులోకి వస్తే మున్ముందు ప్రోస్టేట్‌వాపు బాధితులకు ఉపశమనం కలిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. -- source : Medicine update Magazine
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.