Thursday, December 1, 2011

మానసిక ఆరోగ్యం - అవగాహన,Mental health - Awareness

  •  
image : courtesey with Andhra bhoomi News paper
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మానసిక ఆరోగ్యం - అవగాహన,Mental health - Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆధునిక కాలంలో మానసిక సమస్యలు అధికమవుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కల్పించిన సౌకర్యాలను మనం సుఖంగా అనుభవించలేకపోతున్నాం. మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి అందని వస్తువులవుతున్నాయి. ప్రస్తుత విజ్ఞాన యుగంలో 70 శాతం మంది వత్తిళ్ళతో సహజీవనం చేస్తున్నారు. అందులో 20 శాతం మానసిక రుగ్మతలతో సతసమతమవుతున్నారు. వీరిలో కొద్దిమంది మాత్రమే సలహాలు, చికిత్సలు పొంది పరిపూర్ణులు కాగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వవికాసంపట్ల అవగాహన పెంచుకోవడం అందరికీ అవసరం.

  • మానసిక ఆరోగ్యం - లక్షణాలు
ఆలోచనలు, దృక్పథం, ఉద్వేగాలు, ప్రవర్తనల మధ్య సమతుల స్థితి కలిగి ఉండటాన్ని మానసికంగా ఆరోగ్యంగా చెప్పవచ్చు. వ్యక్తి వ్యవహార శైలి, మానవ సంబంధాలు, సామాజిక సర్దుబాట్లు, కార్యనిర్వహణ, విజయ సాధన లాంటి అంశాలను మానసిక స్థితి ప్రభావితం చేస్తుంది. వ్యక్తుల ప్రగతి, పతనాలు వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటాయ. సహజంగా పరిపూర్ణ ఆరోగ్యవంతులు ఈ కింది లక్షణాలు కలిగి వుంటారు.
  • -ఆరోగ్యవంతుల ఆలోచనలు, భావాలు, తెలివితేటలు, గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ప్రవర్తన సహజ రీతిలో ఉంటాయి.
  • -మానసిక ప్రశాంతత, సర్దుబాటుతత్వం కలిగి వుంటారు.
  • -ఆత్మవిశ్వాసం, ప్రేమతత్వం, సంతృప్తి సొంతం చేసుకుంటారు.
  • -కుటుంబ, పౌర, మానవ సంబంధాలు సక్రమంగా నిర్వహిస్తారు.
  • -బరువు, బాధ్యతలు మోయడానికి సిద్ధంగా ఉంటారు.
  • -నిర్ణయాత్మక శక్తి, సమస్యల పరిష్కార యుక్తి కలిగి చాకచక్యంగా ముందుకు దూసుకెళ్తారు.
  • -సామాజిక స్పృహతో, సాంఘిక దృష్టితో వ్యవహరిస్తుంటారు.
  • -కరుణ, జాలి, దయ, సహానుభూతి లాంటి మానవీయ గుణాలు కలిగి వుంటారు.
  • -తమలోని శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం, కౌశలాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తారు.
  • -స్వీయ పరిశీలన, నైతిక నిబద్ధత, క్రమశిక్షణ, విలువల ప్రాతిపదికగా పయనిస్తుంటారు.

  • మానసిక లోపాలు, రుగ్మతలు
ధర్మామీటరు, ఎక్స్‌రే, స్కానింగ్‌లతో శారీరక రోగాలను నిర్థారించినట్టు మానసిక లోపాలను గుర్తించలేము. వ్యక్తిత్వ వైఫల్యాలు, అసహజ ప్రవర్తన, విపరీత ధోరణులు, ప్రతికూల ఉద్వేగాలు ఇతర లోపాలను పరిశీలించాకే మానసిక రుగ్మతలు వెలుగులోకి వస్తాయ. దాదాపుగా 100 ఏళ్ళనుంచే మానసిక వైద్యం, మనో విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా రూపుదాల్చాయి. ఇవి 21వ శతాబ్దంలో అతివేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మానసిక రుగ్మతల్ని నయం చేయడానికి రకరకాల పద్ధతులు, చికిత్సలు రూపుదిద్దుకుంటున్నాయి. చిన్న చిన్న లోపాలు, సమస్యలను గమనించి సరిదిద్దుకుంటే, ఈ రుగ్మతల్ని దరి చేరకుండా చూసుకోవచ్చు. సూక్ష్మంగా పరిశీలిస్తే అలాంటి లోపాలను సులభంగా గమనించవచ్చు.
-మామూలుగా మానసిక లోపాలున్నవారి ఆలోచనల్లో ప్రతికూలతలు, భావాలలో అపసవ్యతలు, ఏకాగ్రతలో లోపం, ఉద్వేగాలలో విపరీతాలు కనిపిస్తాయి.
  • -వైర స్వభావం, క్రూర ప్రవర్తన, హింసాధోరణి, పరులను అవమానించే గుణం, వేధించే తత్వం కలిగి వుంటారు.
  • -హత్యలు, ఆత్మహత్య ఊహలు కలిగి వుంటారు.
  • -ఈర్ష్య, ద్వేషం, కోపం, అసహనం, విసుగు, చిరాకు అనవసర భయాలు వ్యక్తం చేస్తుంటారు.
  • -తరచు భ్రమలు, భ్రాంతులకు లోనవుతుంటారు.
  • -నిరంతరం తలనొప్పి, మైగ్రయిన్, వంటినొప్పులు, నిద్రలేమి, మలబద్ధకం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు.
  • -ఆత్మన్యూనత, స్వీయసానుభూతి, ఆత్మ నిందలతో కుంగిపోతుంటారు.
  • -నేర ప్రవృత్తి, వ్యభిచారం తదితర దుర్వ్యసనాలపట్ల మొగ్గుచూపుతుంటారు.
  • -బాధ్యతల్ని తప్పించుకుంటూ, బంధాలకు దూరమవుతూ వుంటారు.
  • -విపరీతమైన సిగ్గు, అసంకల్పిత చర్యలకు పాల్పడుతుంటారు.

  • కారణాలు - పరిష్కార మార్గాలు
మానసిక లోపాలు, బలహీనతలు, సమస్యలు, రుగ్మతలకు ప్రత్యేకించి ఒక కారణాన్ని చెప్పలేం. పలు అంశాల సమష్టి ప్రభావంవల్ల పలు మానసిక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అవి ముదిరి ఇలాంటి రుగ్మతలకు దారితీస్తుంటాయి. శారీరక, జన్యుపర, వంశానుగత అంశాలు కొన్నిసార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, చెడు స్నేహాలు కారణాలవుతుంటాయి. తలకు బలమైన గాయాలు కావడం, నాడీ వ్యవస్థలో తలెత్తే లోపాలు సమస్యలకు పునాది వేస్తుంటాయి. సరైన వ్యక్తిత్వం, మంచి అలవాట్లు, ఉన్నతమైన విలువలు, సానుకూల ఆలోచనలు, సామాజిక సర్దుబాట్లు కలిగి వున్న వ్యక్తులు సులభంగా తమలో తలెత్తే మానసిక సమస్యలను అధిగమించగలరు. చిన్న సమస్యలను ఎవరికివారు పరిష్కరించుకోవచ్చు. అందుకు వ్యక్తిత్వ వికాస శిక్షణ, సాహిత్యం ఉపయోగపడుతుంది.

/-డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి Psychologist ,
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.