Tuesday, May 8, 2012

Difference between Gastric Ulcer and Gastric Cancer,గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా.


  • image : Courtesy with http://gastriculcer.blogspot.in

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గ్యాస్ట్రిక్ అల్సర్స్ కి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తేడా- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-నీరు తక్కువ తాగటం వల్లనో, లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి ఒక్కరు జీవితకాలంలో ఏదో ఒక దశలో అల్సర్‌కు గురవటం సహజమే. అందుకనే విద్యార్థులలో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాము. సాధారణంగా మూడు, నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్స్ అంతకంటే ఎక్కువగా ఉండి తరచుగా బాధిస్తూ ఉంటే ఎవ్వరినైనా అనేక అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నోటి పూతతో పాటు, పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఈసోఫీగల్ అల్సర్స్, కదలలేని పరిస్థితులలో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్, హెర్పిస్ వంటి ఎస్‌టీడీ వల్ల, ఈస్పీ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల జెనిటల్ అల్సర్లు, డయాబెటీస్ వల్ల కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లు, పెప్టిక్ అల్సర్లు ఎక్కువగా చూస్తూంటాము. చిన్న పేగు మెదట్లో ఉండే ఈ అల్సర్లను డుయోడినమ్ అల్సర్స్ అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత చాలా తక్కువగా క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది.

జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను గ్యాస్ట్రిక్ అల్సర్లు అంటారు. పెప్టిక్ అల్సర్ల కంటే ఇవి తక్కువగా కనిపించినప్పటికీ గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువ. అన్నవాహికలో అల్సర్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. నోటిపూతకు స్ట్రెస్, విటమిన్ల లోపం, బి విటమిన్ లోపిం ప్రధాన కారణమైతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన మిగతా అల్సర్స్‌కు హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం.

1980 వరకు అల్సర్‌కు మసాలా ఆహారం, కారం, ఒత్తిడి అనుకునే వారు, ఆల్కహాల్ వల్ల పోట్ట, పేగులకు సంబంధించిన పూతకు కారణాలు అనుకునే వారు. దాదాపు వంద సంవత్సరాల వరకు అల్సర్లకు కారణాలు అదే అనుకుని వీలైనంత వాటికి దూరంగా ఉండమని సలహాలు ఇచ్చే వారు. 1982లో టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే ఇద్దరు డాక్టర్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లకు కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు. దీనికి వారికి నోబెల్ బహుమతి ప్రధానం కూడా జరిగింది. మన జనాభాలో 90 శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాక్టీరియాకు గురవుతూ ఉంటారు. కానీ ఒత్తిడి, ఎసిడిటి, పొగతాగడం, ఆల్కహాల్ వంటి కారణాల వల్లనో లేకవారి శరీరతత్వాన్ని బట్టి జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఉన్నపుడు వారికి ఈ బాక్టీరియా వల్ల అల్సర్లు ఏర్పడటం జరుగుతుంది. పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడే వారికి ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. జీర్ణవ్యవస్థలో అల్సర్ ఉన్నవారికి కడుపులో నొప్పితో పాటు ఆకలి తగ్గడం, వికారం, వెక్కిళ్లు, తేన్పులు, మలంలో రక్తం పడటం, రక్తపు వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సాధారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అయితే ఈ లక్షణాలు అల్సర్ ఏ స్థాయిలో ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. మెదటి దశలో కడుపులో మంటగా ఉండటం ఏమైనా తినగానే కొంచెం సేపు తగ్గి, తర్వాత కొద్దిసేపటికి మళ్లీ కడుపులో ఇబ్బందిగా ఉండటం జరుగవచ్చు. రెండు వారాలు యాంటి బయాటిక్ మందులు వాడటం వల్ల ఈ అల్సర్ పూర్తిగా నయమవుతుంది.

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్స్‌లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. స్టమక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్. అందుకే ఒకసారి అల్సర్ వచ్చి తగ్గినవారు రెండోసారి అలాంటి లక్షణాలు కనిపించినా అల్సర్‌కు వాడిన మందులు వాడి తర్వాత తగ్గటం లేరదని డాక్టర్‌ను సంప్రదించడం జరుగుతుంది. అందుకనే ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేసి అనుమానంగా ఉంటే సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ పరీక్షలు చేసి స్థాయిని నిర్థారిస్తారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ చికిత్స కూడా కణితి వచ్చిన ప్రదేశం, క్యాన్సర్ స్థాయి, వయసు, ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటాయి. పొట్టలో కణిత వచ్చిన ప్రదేశాన్ని బట్టి పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి గ్యాస్ట్రెక్టమీ లేక పొట్టని మొత్తంగా తీసివేయటంతో పాటు చుట్టు ఉన్న లింఫ్‌నోడ్స్, చిన్న పేగులో కొంత భాగాన్ని అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేయటం జరుగుతుంది.

క్యాన్సర్‌ను కొంచెం ఆలస్యంగా గుర్తించినపుడు పొట్ట మొత్తాన్ని తీసివేసి అన్నవాహికను చిన్న పేగులతో కలిపి వేస్తారు. సర్జరీ తర్వాత ఆహారం తీసుకోలేక పోవడం, వాంతులు, వికారం, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీ ముందు చేసి తర్వాత కీమో, రేడియో థెరపీలు ఇచ్చినా లేక కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత సర్జరీ చేసినా ఈ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ విషయంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ సర్జరీ తర్వాత సప్లిమెంట్లు, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12 ఇంజక్షన్ల అవసరం చాలా ఎక్కువ. పొట్టని తీసివేసినపుడు ఆహారం నేరుగా చిన్నపేగులలోకి వెళ్లటం వల్ల డంపింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఆహారం తక్కువగా, ఎక్కువ సార్లు తీసుకోవడం ఆహారం ముందు తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవటం వంటి అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను మరీ లేటుగా గుర్తించడం జరిగి కణితి ఆహారం తీసుకోవడానికి అడ్డంకుగా ఉన్నపుడు, లేజర్ థెరపి, రేడియేషన్ థెరపీలలో కణితిని చిన్నగా చేసి పేగులలో స్టంట్‌ను అమరుస్తారు. మెటల్ లేక ప్లాస్టిక్‌తో తయారయిన ఈ ట్యూబ్ ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళుతుంది. కాని ఇలాంటి పరిస్థితులు ఏర్పడినపుడు, క్యాన్సర్ మరీ ముదిరి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో అంత ప్రస్ఫుటంగా ఉండవు. అనుమానించేంత స్థాయిలో లక్షణాలు బయట పడ్డాయి అంటే క్యాన్సర్ స్థాయి పెరిగిందని అనుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపితంగా దాదాపు 8 లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు.

-హెలికో బ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా దాదాపు 60 -80 శాతం వరకు ఈ క్యాన్సర్‌కు కారణం. ఇంకా స్మోకింగ్, మద్యం, జన్యుపరమైన కారణాలు దోహదపడ్తాయి. కాబట్టి అల్సర్‌కు సరియైన చికిత్సలు తీసుకోవడం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తాజాగా ఉండే ఆహారం పరిశువూభమైన నీరు తీసుకోవడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కడుపుబ్బరం, తేన్పులు, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే ఎవరికి వారు యాంటాసిడ్లు వాడటం కాకుండా ఒకసారి డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపి చేయించుకోవడం మంచిది.

కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి ఇలాంటి లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడ అందరూ ఎదుర్కొనేవే అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తున్నా సరియైన పరీక్షలు, అవసరమైన మందులు వాడటం తప్పనిసరి అని అర్థం చేసుకోవడం మంచిది.


Article : Courtesy with Dr.Ch.Mohana Vamsy @NamastheTelangana.com

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.