Sunday, January 20, 2013

గర్భధారణ..ప్రసవం..వ్యాయామం అవగాహన -Awareness of exercise in pregnancy and delivery

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గర్భధారణ..ప్రసవం..వ్యాయామం అవగాహన -Awareness of exercise in pregnancy and delivery
--
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్ర్తీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. స్ర్తీ గర్భం దాల్చినప్పటి నుంచి నవమసాలు కొనసాగే వరకు అనేక అనుభూతులు పొందుతారు. యువతీ నుంచి మాతృమూర్తిగా మారే ఈ సమయంలో, బరువు పెరగడం, భంగిమల్లో మార్పులు చేకూరడం, కీళ్లలో కదిలికలు పెరగడం, కండరాల బలం క్షీణించడం వంటి మార్పులు స్ర్తీ యొక్క శరీరంలో సహజబద్ధంగా జరుగుతాయి. ఇవి కాకుండా చాలా వరకు సర్వసాధారణంగా నడుము నొప్పి, కాళ్ళ వాపులు వంటి చిన్న చిన్న సమస్యలతో కూడా బాధపడుతుంటారు.

-గర్భిణుల్లో అనేక అపోహలు తలెత్తుతాయి. ముఖ్యంగా వాళ్లు చేసే పనుల విషయంలో. కొందరేమో ఎంత ఎక్కువ పని చేస్తే కాన్పు అంత సులువుగా అవుతుంది అని ఆలోచిస్తారు. మరి కొందరేమో దీనికి పూర్తి విరుద్ధం. తల్లి, బిడ్డ ఇద్దరి ఆహారం తినాలని ఎక్కువెక్కువ తింటుంటారు. మరి మంచం అసలు దిగరు. రెండు ధోరణులు సరికాదు. సమపాల్లలో వ్యాయామం చేయడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా వ్యాయామం అనగానే అందం కోసం అనే అపోహలో ఉంటారు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత ఇంకా పెద్దగా అందానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం అనుకుంటారు. నిజానికి అందమే కాకుండా, వారి ఆరోగ్యం, జీవనశెైలి చురుకుగా మల్చడానికి వ్యాయామం తోడ్ప డుతుంది.గర్భిణిల్లో కాన్పుకు ముందు తరువాత సహజంగా జరిగే మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యకు సమర్థవంతంగా ఎదురుకొనుటకు వ్యాయామం  తోడ్పడుతుంది

గర్భధారణ మార్పులు-సమస్యలు
భంగిమలో మార్పు జరగడానికి అతి ముఖ్యమైన కారణం బరువు. నెలలు నిండే కొద్ది గర్భం పెరగడంతో పొట్ట పెరుగుతుంది. ఎత్తుగా కడుపు పెరిగే కొద్దీ స్ర్తీలు సమతుల్యం కోసం కొద్దిగా వెనక్కి వంగి నడవడం అవాటు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వెర్టిబ్రె (వెన్నెముక)పెైన తీవ్ర ఒత్తడి పడుతుంది. పెద్ద పొట్ట ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి కేంద్రం ముందుకు జరుగుతుంది. దీనిని వెనక్కి తీసుకురావడానికి కొద్దిగా వెనక్కి వాలటం అలవాటు చేసుకుంటారు. అందుచేత నడుము దగ్గర ఉండే కండరాలు అధిక శ్రమకు లోనవుతాయి. ఫలితంగా అవి బిగుసుపోవడం, నడుము నొప్పి రావడం జరుగుతుంది. రిలాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవ్వడం చేత కీళ్ల యొక్క కదలికలు మామూలుకంటే ఎక్కువ ఉండటంతో, సులువుగా బ్యాలెన్స్  అవుట్‌ అవ్వడం, చిన్న చిన్న ప్రమాదాలకు గురవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాళ్లలోని రక్తనాళాల్లో నిరోధకత తగ్గ డం, ఇంకా పొట్ట వద్ద ఉండే ప్రధానమైన సిరల మీద ఒత్తిడి పడటం వంటి రక్త సరఫరా లోపాల చేత ఎక్కువ శాతం గర్భిణుల్లో కాళ్ళ వాపులు కనిపిస్తుంటాయి.

వ్యాయామం కీలకపాత్ర
నొప్పి నివారణ: సాధారణంగా నొప్పి తగ్గడానికి ఐ.ఎఫ్‌.టి., అల్ట్రాసౌండ్‌ వంటి కరెంట్‌ పరికరాలతో చికిత్స చేస్తారు. అయితే గర్భిణీ స్ర్తీలకు వాటితో చికిత్స చేయకూడదు. అందుకు వ్యాయామమే కీలకం. నొప్పి వేధిస్తున్నప్పుడు, ఏ ఏ కండరాలు సమస్యకు కారణమవుతున్నాయో గుర్తించి, బిగుసుకు పోయిన కండరాలకు (సెలెక్టివ్‌ స్ట్రెట్చింగ్‌) క్షీణించిన కండరాలను బలోపేతం చేసేందుకు వ్యాయామం సూచిస్తారు.

వాపుల నియంత్రణ
ఎక్కువ సమయం నిల్చోవడం, కాలు కిందకు పెట్టి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం చేయకూడదు. ప్రతి గంటకు 309 సెకండ్లు పాదాలను పెైకి కిందకి వీళెైనంతవరకు కదిలించడం చేత మంచి ఉపయోగం ఉంటుంది.

సులువెైన ప్రసవం
పెల్విక్‌ ఫ్లోర్‌ అవసరమైన కండరాలను సురక్షితమైన వ్యాయామంతో బలోపేతం చేయడంతో కాన్పు సులువుగా జరుగుతుంది. విసర్జన సమస్యలు కూడా నివారించవచ్చు.

చురుకు, ఆరోగ్యకరమైన బిడ్డ
పూర్వం గర్భిణులు వ్యాయామం చేస్తే గర్భానికి జరగవలసిన రక్త సరఫరా, వ్యాయామం చేసే గర్భిణి కండరాలకు జరుగుతుందని వ్యాయామాన్ని నిర్దేశించేవాళ్లు. అయితే ఆధునిక పరిశోధన, వారానికి 5 రోజులు, 30 నిమిషాల పాటు నడక (వాకింగ్‌), సైక్లింగ్‌, కుదిరితే ఈత (స్విమ్మింగ్‌) వంటి సులువెైన ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం చేత గర్భిణికి ఎటువంటి హానీ జరగదు అంతే కాకుండా పరిమిత బరువు, చురుకు, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవిస్తారని తేల్చి చెప్పారు.

కంగుబాటు
కొందరు అనవసరంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి రిలాక్సేషన్‌, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు ఉపయోగపడతాయి.

సలహాలు-సూచనలు
కాన్పు తరువాత బిడ్డ యొక్క ఆలనా పాలనా చూసుకునే సమయంలో తల్లి తన భంగిమలపెైనం పెద్దగా దృష్టి వహించదు. వీటికి సంబంధించిన సలహాలు-సూచనలు పాటించడం వల్ల అనేక ఇబ్బందులను నివారించవచ్చు.

ముఖ్య గమనిక
స్ర్తీలు గర్భం దాల్చినప్పుడు లేక ప్రసవం తరువాత వ్యాయామం మొదలుపెట్టే ముందు... ఫిజీయోథెరపిస్ట్‌ని సంప్రదించి వారి సలహా మేరకు పాటించడం మంచిది. స్ర్తీ యొక్క శారీరక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించి వారికి సురక్షితమైన వ్యాయామం సలహాలు సూచించగలరు.

Courtesy with - డా ఎ. సుష్మజ--సీనయర్‌ ఫిజియోథెరపిస్ట్‌, గమన్‌ ఫిజియోకేర్‌@Surya Telugu Daily-Dec3,2012
 

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.