Sunday, April 21, 2013

Congenital Ano-Rectal Anamalies,పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాలు

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Congenital Ano-Rectal Anamalies,పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మలద్వారం లేని మనిషిని వూహించగలమా? నవరంధ్రాల్లో అత్యంత కీలకమైన ఇటువంటి ఒక ద్వారం లేకుండా బిడ్డ పుడితే...? పుడితే కాదు.. తరతరాలుగా తరచూ ఎంతోమంది పిల్లలు సమస్యతో పుడుతూనే ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు ఇది చాలా క్లిష్ట సమస్య... ఇప్పుడు దీన్ని చక్కదిద్దే విషయంలో మన వైద్యరంగం ఎంతోపరిణతి సాధించింది. ఈ సమస్యను సమర్థంగానే సరిచేస్తుండటం.. చాలామందికి తిరిగి సాధారణ జీవనాన్ని అందించే స్థితికి చేరుకోవటం చెప్పుకోవాల్సిన విషయం!

ఎందుకంటే ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 9 మంది పుడుతూనే ఏదో ఒక రకమైన వైకల్యంతో జన్మిస్తున్నారు. ఈ అవకరాలు, లోపాలన్నీ కూడా తల్లిగర్భంలో పిండం ఏర్పడే సమయంలోనే తలెత్తుతాయి. ఇలా పుట్టుకతో వచ్చే లోపాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది- మలద్వారం సరిగా ఏర్పడకపోవటం! పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాల్లో- కొన్ని క్లిష్టమైనవైతే కొన్నింటిని తేలికగా.. చిన్నపాటి ఆపరేషన్‌తోనే సరిచేసే వీలుంటుంది. మరికొన్నిమాత్రం జీవితాంతం అటు పిల్లలకూ, ఇటు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా క్షోభ తెచ్చిపెడతాయి.

మనకు కొన్ని అవయవాల విలువ.. అవి సరిగా లేనప్పుడుగానీ తెలిసిరాదు.వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల విసర్జనావయవం! ఇదెంత కీలకమైనదంటే 'సరిగ్గా పనిచేసే మలద్వారమనేది.. మనం అంతగా గుర్తించని ఓ గొప్ప, అమూల్యమైన బహుమతి' వంటిదని చెప్పాడు పాట్స్‌ మహాశయుడు. ('A properly functioning rectum is an unappreciated gift of greatest price')

ముఖ్యంగా మలమూత్రాల విషయంలో- మనం విసర్జించాలనుకున్నప్పుడే విసర్జన జరిగేలా దానిపై పట్టు ఉండటం ఎంతో ముఖ్యమైన అంశం. అది లేకపోతే జీవితం దుర్భరంగా తయారవుతుంది. అందుకే ఈ సమస్యకు ఇంతటి ప్రాధాన్యం కూడా.

ఐదువేలలో ఒకరు!
ప్రతి 5 వేల కాన్పుల్లో ఒకరు మలాశయ, మలద్వార లోపాలతో పుడుతున్నారని అంచనా. ఇది ఆడ పిల్లల్లో (44%) కంటే మగపిల్లల్లో మరికాస్త (56%) ఎక్కువ. నిజానికి ఈ సమస్య కొత్తదేం కాదు. అనాదిగా చూస్తున్నదే. అందుకే దీన్ని సరిచేసేందుకు క్రీస్తు పూర్వం నుంచీ కూడా రకరకాల చికిత్సా పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రామాణికమైన చికిత్సలు మాత్రం 1835లో ఆరంభమై.. 1982లో ఒక నిర్దిష్టమైన పద్ధతికి చేరిందని చెప్పొచ్చు. ఒక జబ్బుకు సరైన చికిత్సా విధానాన్ని, సమర్థమైన పద్ధతిని ఆవిష్కరించటానికి నిరంతరం ఎంతటి కృషి చెయ్యాల్సి ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

ఎందుకిలా?
పుట్టుకతో వచ్చే చాలా లోపాలకు కచ్చితమైన కారణాలను చెప్పటం కష్టం. జన్యు సంబంధమైనవి కావొచ్చు, రేడియోధార్మిక ప్రభావం వల్ల కావొచ్చు. గర్భిణుల్లో ఫోలిక్‌ యాసిడ్‌ వంటి విటమిన్ల లోపాల వల్ల పిల్లల్లో వెన్ను లోపాలు రావొచ్చు. కొన్ని రకాల మందులు కూడా కారణం కావొచ్చు. అయితే ఫలానా లోపం తలెత్తటానికి ఫలానాదే కారణమని ఇదమిత్థంగా చెప్పటం కష్టం. మలాశయ, మలద్వార లోపాలకు చాలావరకూ జన్యుపరమైన అంశాలే కారణమవుతుంటాయి. అందుకే కుటుంబంలో ఎవరైనా ఇలాంటి సమస్యతో పుడితే మరొకరికి వచ్చే అవకాశముంటుంది. తల్లి గర్భంలో పిండం తయారయ్యే క్రమంలో మలద్వారం, మలాశయం, మూత్ర, జననాంగాలు ఒక సంచిలా ఉంటాయి. 8-12 వారాల సమయంలో ఇవి ఎదుగుతాయి. 'యూరోరెక్టల్‌ సెప్టమ్‌' అనే పొర ఒకటి ఈ సంచీని రెండుగా విభజిస్తుంది. దీని కారణంగా 1. మలద్వారం, మలాశయం. 2. మూత్ర విసర్జన భాగం, జననేంద్రియాలుగా విడివడుతుంది. అయితే ఈ పొర సరిగా విలీనం కాకపోయినా మలద్వారం, మలాశయం సరిగా ఏర్పడవు.

మలద్వార లోపం గుర్తించేదెలా?
మలద్వార, మలాశయ లోపాలను శిశువు తల్లి గర్భంలో పెరుగుతుండగానే కనుక్కోవటం కష్టం. దీన్ని స్కానింగుల వంటివి సరిగా చెప్పలేవు. అందుకే కాన్పు జరగ్గానే బిడ్డను క్షుణ్ణంగా పరిశీలించాలి. సాధారణంగా మల విసర్జన అవయవ లోపాలేమైనా ఉంటే చూడగానే కనబడతాయి. ఇవేమీ గుండె జబ్బుల మాదిరిగా కనిపించకుండా ఉండిపోయేవి కావు. కాకపోతే చాలామంది ఒకప్పుడు 'ఆ.. ఉంటే ఏమవుతుందిలే' అని నిర్లక్ష్యం చేస్తుండేవారు. కానీ ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరగటం చెప్పుకోవాల్సిన అంశమే. ఒకవేళ వైద్యులు సరిగా గుర్తించకపోతే వినియోగదారుల న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కాన్పు కాగానే వైద్యులు శిశువును ఆమూలాగ్రం పరీక్షించి, లోపాలేమైనా కనబడితే తప్పనిసరిగా తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలి. కళ్లు, ముక్కు, నోరు వంటి నవరంధ్రాలు ఉండాల్సిన చోట, తీరుగా ఉన్నాయా? లేవా? ముఖ్యంగా మలద్వారం ఎలా ఉంది? అన్నది చూడాలి. మలద్వారం ఉందని గమనించిన తర్వాత దాని పరిమాణాన్ని కూడా చూడాలి.

మగపిల్లల విషయంలో....
1. మలద్వారం కనిపించకపోతే ఆ ప్రదేశంలో అసలేదైనా మార్గం ఉందా? అది నల్లగా గానీ, ఆకుపచ్చ కలిసిన నీలి రంగులో గానీ ఉందా? మల ద్వారం- అది ఉండాల్సిన చోటు నుంచి పురుషాంగం చివరి భాగం వరకూ విస్తరించి ఉందా? ఇలా అన్నీ పరిశీలించాలి.

2. పురుషాంగం చివరి భాగం నుంచి నల్లటి మలం ఏమైనా కనిపిస్తోందా? అన్నదీ గమనించాలి.

3. రంధ్రం చిన్నగా ఉండి, దానికి రెండుపక్కలా చర్మం మడతలతో రెండుగా కనిపిస్తుందేమో చూడాలి.

4. మలద్వారం ఉండాల్సిన చోటుకీ, జననాంగాలకూ మధ్య ఉండే ప్రాంతం(పెరీనియం)లో ఎక్కడైనా నల్లటి ద్వారం కనిపిస్తుంటే 'లో ఏఆర్‌ఎం' అయ్యుంటుందని అనుమానించాలి.

5. ఈ పెరీనియం చదునుగా ఉంటే అది కాస్ల క్లిష్టమైన లోపం (హై అనామలీ) అయ్యిండొచ్చు.

6. బిడ్డ ఏడ్చినప్పుడు పెరీనియం ప్రాంతం ఉబ్బుతుంటే అది 'లోయర్‌ అనామలీ'గా భావించాలి.

ఆడపిల్లల విషయంలో...
మూడు రంధ్రాలూ ఉన్నాయా?ఉంటే మూడూ ఒకే చోట ఉన్నాయా? అవి ఉండవలసిన చోటే ఉన్నాయా? అనేది జాగ్రత్తగా గమనించాలి. మలద్వారం ఏమైనా యోని భాగంలో ఉందేమో, రెండూ కలిసి ఉన్నాయేమో పరిశీలించాలి. యోని, మలద్వారం మధ్య అడ్డుగా చర్మపొర ఉందో లేదో చూడాలి. ఒక్కోసారి యోని రంధ్రం నుంచి మలం బయటకు వస్తుండొచ్చు, దాన్ని 'రెక్టో వజైనల్‌ ఫిస్టులా' అంటారు. మలద్వారం గనక యోని కింది భాగంలో, చాలా దగ్గరలో ఉంటే 'రెక్టో వెస్టిబ్యూలార్‌ ఫిస్టులా' అంటారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత.. అనుమానం బలంగా ఉంటే నిపుణులైన వైద్యుల వద్దకు పంపటం మంచిది. లోపాలున్నా కూడా ఏదో దారిలో మల విసర్జన జరుగుతూనే ఉంటే అత్యవసరంగా ఆపరేషన్‌ అవసరం ఉండకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి 'లో అనామలీ'ల్లో ఆపరేషన్‌ అత్యవసరం కాకపోవచ్చు. అసలు విసర్జన అయ్యే పరిస్థితి లేకపోతే మాత్రం దాన్ని తక్షణం ఏదో రీతిలో విసర్జన మార్గాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంటుంది.

ఇతర లోపాలూ ఉండొచ్చు!
పుట్టుకతో ఒక లోపం తలెత్తిన పిల్లల్లో.. ఇతరత్రా మరికొన్ని లోపాలూ ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వెన్ను లోపాలు, అన్నవాహిక, శ్వాసనాళం కలిసిపోయి ఉండటం, మూత్రపిండాల లోపాల వంటివి కొన్ని కలగలిసి ఉండొచ్చు. కాబట్టి శిశువును కూలంకషంగా పరీక్షించాలి. ఏదైనా అనుమానం తలెత్తితే తప్పనిసరిగా- ముక్కు ద్వారా ట్యూబును పంపి అన్నవాహిక సరిగానే ఉందా? లేదా? అలాగే మలద్వారం గుండా ట్యూబ్‌ పంపి అదెలా ఉందన్నది పరీక్షిచాలి.

ద్వార లోపాలు మూడు రకాలు
మలాశయ, మలద్వార లోపాలు ప్రధానంగా మూడు రకాలు.
1. లోపం కిందిస్థాయిలోనే ఉండే రకం (లో ఆనోరెక్టల్‌ అనామలీ)

2. మధ్యస్థంగా ఉండే రకం (ఇంటర్మీడియెట్‌ ఆనోరెక్టల్‌ అనమలీ)

3. పైస్థాయిలో ఉండటం (హై ఆనోరెక్టల్‌ అనామలీ).

వీటిలో ఒక్కో రకానికి ఒక్కో రకం దిద్దుబాటు ఆపరేషన్‌ అవసరమవుతుంది. ఏ రకమన్నది గుర్తించేందుకు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్షతో పాటు 'ఇన్‌వెంటోగ్రామ్‌' అనే పరీక్ష కూడా అవసరమవుతుంది. దీనికోసం బిడ్డను తలక్రిందుగా ఉంచి ఒక ప్రత్యేక పద్ధతిలో ఎక్స్‌-రే తీస్తారు. వీటితో లోపాన్ని కచ్చితంగా నిర్ధారించేంత వరకూ ఆపరేషన్‌ చెయ్యకూడదు. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్‌ చేశాక దాన్ని తిరిగి సరిచేయటం చాలా కష్టమవుతుంటుంది.

చికిత్స
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మలం బయటకు రావటానికి మలద్వారం చుట్టూ వాతలు పెట్టటం, కొందరు కత్తితో చిన్నగాటు పెట్టటం వంటి పనులు చేస్తున్నారు. ఇవి చాలా సమస్యలు తెచ్చిపెట్టటమే కాదు, బిడ్డ భవిష్యత్తును దెబ్బతీస్తాయి కూడా. ఒకసారి పొరపాటుగా వైద్యం చేస్తే ఆ తప్పును రెండోసారి సరిదిద్దటం అసాధ్యం. కాబట్టి నాటువైద్యాల జోలికి వెళ్లకూడదు. ఇటువంటి సమస్యలకు అనుభవం ఉన్న 'పిల్లల శస్త్రచికిత్స' నిపుణులే ఆపరేషన్‌ చేయాలి. ఎందుకంటే మలద్వార లోపానికి తొలిసారి చేసే ఆపరేషనే చాలా కీలకం. మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు ఆపరేషన్‌ చేస్తే ఆ బిడ్డ జీవితాంతం వేదన పడకుండా కాపాడొచ్చు. ఆపరేషన్‌ ప్రధాన సూత్రం ఒక్కటే- మనం బిడ్డకు మల విసర్జనపై మంచి పట్టు, నియంత్రణ ఉండేలా మలద్వారాన్ని ఏర్పాటు చెయ్యగలగాలి! చూడటానికి కూడా అది సరైన ప్రదేశంలో, తీరుగా ఉండాలి. మల విసర్జనపై నియంత్రణ లేకపోతే నిరంతరం మలం బయటకు వస్తుంటుంది. ఇది పిల్లలకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దుర్వాసన వస్తుంటే స్కూల్లో తోటి విద్యార్థులెవరూ దగ్గరికి రానివ్వరు. పిల్లలను ఎక్కడకు తీసుకు వెళ్లాలన్నా ఇబ్బందే. ఇది తల్లిదండ్రులకూ ఎంతో వేదన కలిగిస్తుంది. ఈ వేదన భరించలేక 'మాకెందుకీ శిక్ష' అని నిరాశలోకి జారిపోయే వాళ్లూ ఉంటారు. నిజానికి ఇవాల్టి రోజున ఇంతటి వేదన అవసరం లేదు. ఈ సమస్యలను సరిదిద్దటానికి చక్కటి విధానాలు ఉన్నాయి.

* మగ పిల్లలకు గానీ, ఆడ పిల్లలకు గానీ మలద్వార లోపం కిందిస్థాయిలోనే ఉంటే (లో ఆనోరెక్టల్‌)... అంటే చర్మంతో మూసుకుపోయి ఉండటం, కలిసిపోయి ఉండటం వంటి సమస్యలుంటే ఆనోప్లాస్టీ అనే చిన్న ఆపరేషన్‌తోనే సరిచేసి, ద్వారం ఏర్పాటు చేస్తారు.

* ఆడపిల్లలకు మలద్వారం యోనికి దగ్గరగా ఉంటే రెండు దశల్లో ఆపరేషన్‌ అవసరమవ్వచ్చు. ముందు 'కట్‌బ్యాక్‌ ఆనోప్లాస్టీ' చేస్తారు. 9-12 నెలల తర్వాత మలాశయాన్ని యోని నుంచి వేరుచేసి దూరంగా, సరైన స్థానంలో ఉంచే ఆపరేషన్‌ చేస్తారు.

* ఇక మధ్యస్థాయి (ఇంటర్‌మీడియేట్‌) లోపానికి వైద్యుల అనుభవాన్ని బట్టి మొదటిసారే పూర్తిస్థాయి ఆపరేషన్‌ చేయొచ్చు. లేదంటే ముందు మలం బయటకు రావటానికి చిన్న ఆపరేషన్‌ చేసి, 12 నెలల తర్వాత పూర్తిస్థాయి ఆపరేషన్‌ చెయ్యచ్చు.

* ఇక సమస్య పైఎత్తున.. అదీ సంక్లిష్టంగా ఉండే 'హై ఆనోరెక్టల్‌ అనామలీ'ల విషయంలో- ముందు పొట్టమీద చిన్నరంధ్రం చేసి లోపల పెద్దపేగు నుంచి నేరుగా బయటకు ఒక గొట్టాన్ని అమరుస్తారు. దీన్ని 'కొలాస్టమీ' అంటారు. ఇది మలం బయటకు వచ్చేందుకు కృత్రిమంగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసే మార్గం. అనంతరం 3వ నెలలో లేదా.. 9-12 నెలలలోపు పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేస్తారు. చిన్నవయసులోనే చెయ్యటం వల్ల- నియంత్రణకు సంబంధించి మెదడు నుంచి ఆదేశాలు రావటం, అలవాటవ్వటం తేలిక అవుతుంది.

ఏ పద్ధతిలోనైనా మలాశయాన్ని 'ప్యూబోరెక్టల్‌ కండరం' గుండా తీసుకొచ్చి మలద్వారం ఉండే ప్రదేశంలో చర్మానికి అతుకుతారు. కండరాలను సరిగ్గా గుర్తించి.. సమర్థంగా ఆపరేషన్‌ చెయ్యటానికి ఇప్పుడు మజిల్‌ స్టిమ్యులేటర్‌, మోనిటర్‌ వంటి అత్యాధునికమైన సదుపాయాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. పిల్లల్లో ఈ అవయవ నిర్మాణం తీరుతెన్నుల పట్ల వైద్యుల్లో అవగాహన బాగా పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆపరేషన్‌ తర్వాత జాగ్రత్తలు చాలా ముఖ్యం. వైద్యులు చెప్పినట్టే చేస్తూ, ఆ భాగాన్ని పొడిగా ఉండేలా చూడాలి. కృత్రిమంగా ఏర్పాటు చేసిన మలద్వారం ముడుచుకుపోయే అవకాశముంటుంది. కాబట్టి దాన్ని అప్పుడప్పుడు ఎలా వెడల్పు చెయ్యాలో వైద్యులు తల్లిదండ్రులకు నేర్పిస్తారు. ఒకట్రెండు నెలల వరకూ ఇలా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మలాశయ, మలద్వార లోపాలకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు కూడా బాగుంటున్నాయి. కాబట్టి నిరాశ చెందాల్సిన పని లేదు. ఈ జాగ్రత్తలతో పాటు బిడ్డకు సంబంధించి పోషణ, తల్లిపాలు పట్టటం, టీకాల వంటివన్నీ యథాప్రకారం జరిగేలా చూడటం అవసరం.
కచ్చితంగా లోపం ఏమిటన్నది నిర్ధారించేంత వరకూ ఆపరేషన్‌ చెయ్యకూడదు. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్‌ చేశాక దాన్ని తిరిగి సరిచేయటం చాలా కష్టమవుతుంది. దీనికి తొలిసారి చేసే ఆపరేషనే చాలా కీలకం. మంచి నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులు ఆపరేషన్‌ చేస్తే ఆ బిడ్డ జీవితాంతం వేదన పడకుండా కాపాడొచ్చు.
కొలాస్టమీతో భయం లేదు
మలం బయటకు వెళ్లేందుకు పొట్ట మీద అమర్చే గొట్టం 'కొలాస్టమీ' గురించి తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి. ఇది తాత్కాలికమేనని గుర్తించాలి. ఇలా పొట్ట మీది నుంచి మలం బయటకు వచ్చినా ఏమీ కాదు. తరచుగా మలాన్ని తొలగిస్తూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని బొడ్డుకు పక్కగా కుడివైపున గానీ ఎడమవైపున గానీ చేస్తారు. శిశువును సాయంత్రం పూట ఎండలో ఉంచాలి. దీంతో ఆ పక్కన చర్మం పొడిగా ఉంటుంది. ఒకోసారి పేగు సాగి పొడవుగా (ప్రొలాప్స్‌) అవుతుంది. భయపడాల్సిన పనిలేదు. కొనిసార్లు వీరికి విరేచనాలు అధికంగా కావచ్చు. ఈ సమయంలో శిశువుకు ఎక్కువ ద్రవాలను ఇవ్వాలి. ఈ పిల్లలను ఎక్కువగా ఏడ్పించకూడదు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తే వెంటనే డాక్టరుకు చూపించాలి. మధ్య మధ్యలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పరీక్షిస్తుండాలి. ముఖ్యంగా అధైర్యపడరాదు. ఈ సమస్యలకు చేసే శస్త్రచికిత్సలతో ఇప్పుడు మంచి ఫలితాలు ఉంటున్నాయి. క్లిష్టమైన సమస్యలున్నా ఆపరేషన్‌ తర్వాత ఎంతోమంది పిల్లలు ఇప్పుడు సాధారణ జీవితం గడపగలుగుతున్నారన్నది పెద్ద ఊరటనిచ్చే అంశం.

--Dr.Hanumantharayudu ,PaediatricSurgeon @Eeandu sukhibhava
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.