Tuesday, May 14, 2013

MTP cum Abortion awareness,అబార్షన్‌ లేదా ఎంటీపీ అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -MTP cum Abortion awareness,అబార్షన్‌ లేదా ఎంటీపీ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 
    అబార్షన్‌.. కొందరు అవాంఛిత గర్భాన్ని వద్దనుకోవడానికి చేయించుకుంటే.. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి మరికొందరు. ఉన్నత చదువులూ, కెరీర్‌లో స్థిరపడాలనుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలూ... ఇలా కారణాలు ఏవయినా, అనుకోకుండా వచ్చే గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు  సమస్యల్నీ అంచనా వేసుకోవాలి. అవి ఇన్‌ఫెక్షన్ల నుంచి శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని కోల్పోయే దాకా ఉండొచ్చు.

కావాలనుకున్నప్పుడే తల్లయ్యేలా నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉన్నా.. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవాలనుకునే స్త్రీలు.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి సమక్షంలో, ఏ పద్ధతిలో అబార్షన్‌ చేయించుకోవాలనేదీ ఎంటీపీ చట్టం తెలియజేస్తుంది. ఎందుకంటే.. సరైన పద్ధతుల్లో అబార్షన్‌ చేయించుకోని వాళ్లలో చాలామంది ఎన్నో సమస్యల్ని  ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు మరణిస్తున్నారు కూడా. అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు నాలుగు కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయి. అలా  చేయించుకునే వారిలో కొందరు జీవితకాలం ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఏటా దాదాపు అరవై ఏడు వేలమంది కేవలం అబార్షన్ల వల్లే చనిపోతున్నారు. మన  దేశాన్ని మాత్రమే తీసుకుంటే ఏడాదికి ఒకటిన్నర కోట్ల అబార్షన్లు జరుగుతుంటే.. కోటి మంది ప్రమాదకర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకుంటున్నారు. దాంతో  అత్యధికంగా దాదాపు ఎనభై లక్షల మంది అబార్షన్ల వల్ల వచ్చే ఇతర సమస్యలతో జీవితాంతం బాధపడుతున్నారు. పదిహేను నుంచి ఇరవైవేల మంది మరణిస్తున్నారు.

గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికిగానీ, బిడ్డకు గానీ సమస్యలు ఎదురవుతాయి అనుకున్నప్పుడు అబార్షన్‌ చేయించుకోవాలి తప్ప.. అసలు అవాంఛిత గర్భాన్ని రాకుండా
చూసుకోవడమే మంచిది. ఒకవేళ వచ్చి అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నా దాన్ని కూడా సురక్షిత విధానంలోనే చేయించుకోవాలి.

సురక్షితమైన పద్ధతంటే..
అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నప్పుడు సొంతంగా తోచిన మాత్రల్ని వేసుకోకుండా మొట్టమొదటగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. దాన్ని కూడా అర్హత ఉన్న డాక్టర్‌ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. నెలల్ని బట్టి, ఇతర ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి ఏ పద్ధతిలో చేయించుకోవాలనేదీ డాక్టరే సూచిస్తారు. అలాగే గర్భస్రావం చేయించుకునే చోటూ, ఇతర పరిసరాలూ పరిశుభ్రంగా ఉండాలి. వాడే పనిముట్లన్నీ కూడా స్టెరిలైజేషన్‌ చేయాలి. అబార్షన్‌ చేస్తున్నప్పుడు ఆ స్త్రీకి అనుకోకుండా ఏదయినా సమస్య  ఎదురైతే మరో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లూ అందుబాటులో ఉండాలి. లాప్రోస్కోపీ, లాప్రోటమీ చేసి సమస్యను చక్కదిద్దే సౌకర్యం ఉన్న ఆస్పత్రినే ఎంచుకోవాలి.

వయసును బట్టి విధానం..
సాధారణంగా రెండు, మూడు నెలల లోపు చేయించుకోవచ్చు. ఒకవేళ ఇరవై వారాలు గడిచాక కూడా శిశువుకు ఏదయినా సమస్య ఉండి, అది తల్లి ప్రాణాలకు హాని  చేస్తుంది అనుకుంటే అప్పుడూ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం రెండో అభిప్రాయం కోసం మరో గైనకాలజిస్టు సలహా కూడా తీసుకోవడం చాలా అవసరం. ఇలా నెలల్ని బట్టి మందులు లేక శస్త్రచికిత్స పద్ధతిలో అబార్షన్‌ చేస్తారు. తొమ్మిది వారాల్లోపు అయితే మందులు వేసుకోవచ్చు. అయితే ముందు డాక్టర్‌ పరీక్ష చేసి  హిమోగ్లోబిన్‌ శాతం, ఇతరత్రా సమస్యలూ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి గర్భం గర్భాశయంలోనే ఉందా లేదా అన్నది తేల్చుకుంటారు. తప్పనిసరిగా డాక్టర్‌ సలహాతో ఆర్‌హెచ్‌  రక్తపరీక్ష కూడా చేయించుకోవాలి. ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ అని వస్తే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో గర్భం (ఎక్టోపిక్‌  ప్రెగ్నెన్సీ) ఉన్నప్పుడు మాత్రల్ని వాడితే తల్లి ప్రాణాలకు ముప్పు రావచ్చు. కాబట్టి ఇవన్నీ పరిగణించే మందుల్ని ఎంత మోతాదులో ఇవ్వాలనేదీ వైద్యులు నిర్ణయిస్తారు.

వీటిని వేసుకోవడం సులువైనా కొన్ని సమస్యలు మాత్రం ఎదురవుతాయి. మాత్రల వల్ల నూటికి పది, పదిహేను శాతం మందిలో గర్భాశయంలో చిన్నచిన్న ముక్కలు  మిగిలిపోతాయి. అలాంటప్పుడు ఎక్కువ రక్తస్రావం కావడం, నొప్పి లాంటి సమస్యలూ పెరుగుతాయి. దాంతో మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.  గర్భసంచిలో చిన్నచిన్న ముక్కలు మిగిలిపోయినప్పుడు అబార్షన్‌ పూర్తి కాదు కాబట్టి కొన్ని భాగాలకు చీము పడుతుంది. ఆ ఇన్‌ఫెక్షన్‌ కటివలయానికీ కూడా వ్యాపిస్తుంది.  ఆ ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడానికి రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. సమస్య ఉంటే వాక్యూమ్‌ యాస్పిరేషన్‌ పద్ధతిలో గర్భాశయాన్ని శుభ్రం చేస్తారు.

కొన్నిసార్లు గర్భాశయంలో రక్తం నిలిచి సంచిలా తయారవుతుంది. అలాంటప్పుడు ఆ రక్తాన్ని తొలగించి గర్భసంచిని శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తయితే  ... మరికొన్నిసార్లు ఫెల్లోపియన్‌ ట్యూబులు, పొట్ట, కటివలయం, అండాశయాల్లాంటి భాగాలకు కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించవచ్చు. దాంతో ఆ భాగాల్లో చీము పడుతుంది.  ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఫెల్లోపియన్‌ ట్యూబులు మూసుకోవడం వల్ల ఆ తరవాత గర్భం దాల్చడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు శాశ్వతంగా పిల్లల్ని కనే అవకాశాన్నీ కోల్పోవచ్చు. ఆ ఇన్‌ఫెక్షన్‌ దీర్ఘకాలికంగా కొనసాగి (క్రానిక్‌ పీఐడీ) జీవితాంతం సమస్యలు వేధించవచ్చు. ముఖ్యంగా విపరీతమైన పొత్తికడుపు నొప్పి, వైట్‌ డిశ్ఛార్జి, కలయిక సమయంలో నొప్పి.. నెలసరి తరచుగా, ఎక్కువగా అవుతుండటం లాంటివి బాధిస్తాయి.

శస్త్రచికిత్స: దీన్ని వాక్యూమ్‌ యాస్పిరేషన్‌ పద్ధతిలో చేస్తారు. జననేంద్రియ భాగం నుంచి సన్నటి ట్యూబ్‌ లాంటిదాన్ని ప్రవేశపెట్టి నెగెటివ్‌ ప్రెషర్‌తో గర్భాన్ని తొలగిస్తారు. దీనివల్ల ఎదురయ్యే నొప్పిని నివారించేందుకు మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స చేసిన రోజే  ఇంటికెళ్లిపోవచ్చు. అదే నెలలు గడిచేకొద్దీ దీన్ని చేయడం కూడా కష్టం అవుతుంది. గర్భాశయ ద్వారం తెరుచుకోవడానికి మందులు వాడి ఆ తరవాత చేయాల్సి రావచ్చు. ఇది కూడా కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెడుతుంది. అయితే అబార్షన్‌ని  సురక్షితమైన పద్ధతుల్లో చేయించుకున్నా కూడా రెండు లక్షలమందిలో ఒకరికి దానివల్ల సమస్య తప్పదు.  

ప్రమాదకరం...
శస్త్రచికిత్స ద్వారా అబార్షన్‌ చేసేటప్పుడు అరుదుగా గర్భాశయం చిల్లులు పడి, విపరీతమైన రక్తస్రావం కావచ్చు. అలా జరిగినప్పుడు నెగెటివ్‌ ప్రెజర్‌ వల్ల గర్భసంచికీ, పేగులకీ, మూత్రాశయానికీ చిల్లులు పడే ప్రమాదం కూడా ఉంది. అలాంటివి నిర్థరించడానికి మళ్లీ లాపరోస్కోపీ చేయాల్సి ఉంటుంది. చిల్లులు పడిన చోట మళ్లీ కుట్లు వేయాలి. కొన్నిసార్లు ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. నలభై ఏళ్ల క్రితం సెప్టిక్‌ అబార్షన్లు ఎక్కువగా ఉండేవి. అంటే సరైన సదుపాయాల్లేని చోట్ల ఎవరితో పడితే వాళ్లతో గర్భస్రావం చేయించుకోవడం అన్నమాట. దాంతో సెప్టిక్‌ షాక్‌ సిండ్రోమ్‌ సమస్యతో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే వాళ్లు. మరీ అంతటి సమస్యలు రావు కానీ సొంతంగా  మాత్రలు వేసుకోవడం, రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల అధికరక్తస్రావం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ తప్పవు. వాటి బారిన పడకుండా ఉండాలంటే, గర్భనిరోధక  సాధనాలు వాడుతూ అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యంగా ఉంటూ, అబార్షన్‌ అవకాశం ఉంది కదా అనుకోకూడదు.

-courtesy with Dr.Y.Savithadevi@Eenadu vasundara
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.