Tuesday, July 9, 2013

Summer Diarrhoea and vomitings, వేసవి లో వాంతులు, విరేచనాలు





  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Summer Diarrhoea and vomitings, వేసవి లో వాంతులు, విరేచనాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వేసవి వస్తోందంటే చాలు.. సెలవులూ సంతోషాలూ ఆహ్లాదకరమైన సాయంత్రాలన్నీ బాగానే ఉంటాయిగానీ.. ఈ వేసవి వెంబడే కొన్ని చిన్నచిన్న బెడదలు మనల్ని వేధించుకుతినటం మొదలుపెడతాయి. వీటిలో ముఖ్యంగా, ముందుగా చెప్పుకోవాల్సింది... ఉన్నట్టుండి పొట్టలో మెలి తిప్పేస్తూ ముంచుకొచ్చే వాంతులు, విరేచనాలు! , మొదలయ్యాయంటే చాలు వెంటవెంటనే వెళ్లాల్సివస్తూ.. గంటల వ్యవధిలోనే ఒంట్లో నీరంతా ఒడిచేసి.. నీరసం ముంచుకొచ్చేలా చేస్తాయి. పిల్లల్లో ఇటువంటి సమస్య తలెత్తితే అది మరింత ప్రమాదకరం. వేసవి వెళ్లేలోపు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దీని బారినపడుతూనే ఉంటారంటే ఇదెంత విస్తృతమైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కొద్దిపాటి జాగ్రత్తలతో దీని బారినపడకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మొదలైనా.. అవగాహనతో వ్యవహరిస్తే తేలికగా దీన్నుంచి బయటపడొచ్చు.

వేసవి.. చెరువులూ దొరువులూ ఎండిపోయి... నల్లాలు నిలిచిపోయి.. స్వచ్ఛమైన తాగునీటి కరవు తాండవించే కాలమిది. మరోవైపు సెలవులూ, విహారాలూ పెరుగుతాయి కాబట్టి బయట చిరుతిళ్లు, భోజనాలూ పెరుగుతాయి కూడా. దీంతో రద్దీకి తగ్గట్టుగా సరఫరా తగ్గిపోయి.. నీరు, ఆహారం  కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో వేసవి ఆరంభమైన దగ్గరి నుంచీ  ఎంతోమంది ఆరోగ్యసమస్యల బారినపడుతుంటారు. ఇలా కలుషితాహారం, నీటి కారణంగా సంక్రమించే అతిపెద్ద సమస్యలు- వాంతులు, నీళ్ల విరేచనాలు! పెద్దల్లో కూడా ఈ సమస్య సహజమే అయినా పిల్లల్లో ఇది మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ సీజన్లో పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం.

లక్షణాలు!
ఉన్నట్టుండి కొద్దిపాటి పొట్టలో నొప్పితో పల్చగా, నీళ్లు నీళ్లుగా విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు తీవ్రంగా 10-15 సార్లు కూడా కావచ్చు. కొద్దిపాటి జ్వరం కూడా ఉండొచ్చు. విరేచనం పెద్దగా ఉండొచ్చు. ఒకటి రెండు రోజులు వాంతులు కూడా అవుతాయి. తర్వాత వాంతులు తగ్గినా నీళ్ల విరేచనాలు మరికొద్ది రోజుల పాటు వేధించొచ్చు.  సమస్య విరేచనాలే అయినా...నీళ్ల విరేచనాలతో తలెత్తే పెద్ద సమస్య- ఒంట్లో నీరు, లవణాలు, తగ్గిపోవటం! నిజానికి నీళ్ల విరేచనాల వల్ల ప్రమాదం ముంచుకొచ్చేది ఒంట్లో నీరు, లవణాలు అధికంగా తగ్గిపోతుండటం వల్లే. పిల్లలుగానీ, పెద్దలుగానీ నీళ్ల విరేచనాలు అవుతున్నాయంటే వాళ్లు నీరు, ద్రవాహారం ఎంత తాగితే అంత మంచిది. మన శరీరంలో 4% నీరు తగ్గిపోయే వరకూ పైకి ఏ
ప్రభావమూ కనబడదు. 5% కానీ, అంతకంటే ఎక్కువగానీ తగ్గిపోతే డీహైడ్రేషన్‌ లక్షణాలు స్పష్టంగా కనబడటం మొదలవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. పిల్లల్లోఇది మరీ ప్రమాదకరం. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు విరేచనాల ద్వారా ఎంత నీరు బయటకు పోతోందో అంతకంటే ఎక్కువ నీరు, ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి! ఇది కీలకమైన అంశం. ద్రవపదార్ధాలను తరచుగా, ఎక్కువగా తాగుతుండాలి. పోతున్న నీటిని తిరిగి పూడ్చుకోవటానికి నోటి ద్వారా ఇవ్వాల్సిన ద్రావణాన్ని ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)' అంటారు. దీన్నిప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలతో తీసుకోవటం, పిల్లలకు కూడా జాగ్రత్తగా పట్టటం ముఖ్యం.
* పెద్దలు ద్రవాహారం సాధ్యమైనంత ఎక్కువగా తీసుకుంటూ తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
* పిల్లలకు ఒక్కో విరేచనానికి ఎంత నీరు పోతోందో తప్పనిసరిగా అంతకంటే ఎక్కువే 'ఓఆర్‌ఎస్‌' ద్రావణం తాగించాలి.
* పిల్లలకు ఓఆర్‌ఎస్‌తో పాటుగా- బియ్యంతో లేదా సగ్గుబియ్యంతో తయారు చేసిన గంజి వంటివి, కొద్దిగా ఉప్పు కలిపిన పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, క్యారెట్‌ సూప్‌ వంటివి తాగించటం చాలా అవసరం.
* చాలామంది పిల్లలకు డయేరియా రాగానే అంతకుముందు వాళ్లకు రోజూ పెడుతున్న ఆహారాన్ని ఆపేస్తారు. ఇలా చెయ్యకూడదు. పిల్లలు తింటుంటే రోజువారీ ఇచ్చే ఆహారం ఆపాల్సిన అవసరం ఉండదు.
* తల్లిపాలైతే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. పాలు తాగే పిల్లలైతే అవే పట్టాలి. పోతపాలైతే ఎప్పటిలాగే ఇవ్వాలి, ప్రత్యేకించి పల్చన చెయ్యాల్సిన పని కూడా లేదు. సీసాతో తాగే పిల్లలైతే మాత్రం ఆ సీసా తీసేసి కప్పుతోనో, చెంచాతోనో పట్టించాలి.
* తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, ఉప్మా, అటుకులు, మరమరాల వంటివన్నీపెట్టొచ్చు. విరేచనాలు తగ్గిపోయి పిల్లలు కోలుకుంటున్న దశలో- అంతకు ముందుకంటే కొద్దిగా ఆహారాన్ని పెంచి ఇవ్వటం అవసరం.
* విరేచనాల తీవ్రత ఎక్కువగా ఉన్నా, ఒకట్రెండు రోజులైనా తగ్గకపోతే వెంటనే డాక్టరుకి చూపించటం తప్పనిసరి.

డీహైడ్రేషన్‌ తలెత్తితే!
* మొదట్లో దాహం ఉంటుంది. తర్వాత పిల్లలైతే విపరీతంగా ఏడుస్తారు.పెద్దల్లో చికాకు స్వభావం, నిస్త్రాణ మొదలవుతాయి. కళ్లు లోపలికి పోవటం ఆరంభమవుతుంది. నోటిలోను, నాలుక మీద తేమ తగ్గిపోతుంది. కళ్లు నీరు లేక పొడిగా మారతాయి. డీహైడ్రేషన్‌ తీవ్రమైతే చర్మం వేలాడినట్లవుతుంది. మూత్రం తగ్గిపోతుంది. మరీ తీవ్రమైతే పిల్లలు షాక్‌లోకి వెళతారు. నాడి తక్కువగా కొట్టుకుని సొమ్మసిల్లినట్లు, స్పృహ తప్పుతారు. కాబట్టి పరిస్థితి అసలు ఇక్కడి వరకూ రాకుండా చూడటం, ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

మందులేమిటి?
చాలామంది ఠక్కున విరేచనాలు కట్టేసే బిళ్లలు కావాలని మందులు వేసేసుకుంటుంటారు. కానీ నీళ్ల విరేచనాలను అరికట్టటానికి 'యాంటీ డయేరియల్‌' రకం మందులేవీ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి పేగుల కదలికలను తగ్గిస్తాయి. దీంతో అక్కడ ఉన్న బ్యాక్టీరియా సంఖ్య పెరిగిపోతుంది. వాటి నుంచి వెలువడే విషపదార్ధాల స్థాయీ పెరుగుతుంది. మందు ఇవ్వగానే విరేచనాలు తగ్గిపోయినట్లు అనిపిస్తుందిగానీ ఆ తర్వాత విరేచనాలు అంతకంటే ఎక్కువ కావచ్చు. అందుకని ఈ మందులు వాడకపోవటమే ఉత్తమం.
* ఉన్నట్టుండి ముంచుకొచ్చే ఈ తరహా 'అక్యూట్‌ డయేరియా' దానంతట అదే తగ్గిపోతుంది. మనం చెయ్యాల్సిందల్లా ఒంట్లో నీరు, లవణాలు తగ్గకుండా (డీహైడ్రేషన్‌) రాకుండా చూసుకోవటం ఒక్కటే. నీరు, లవణాలతో పాటు ఈ సమయంలో పోషకాహారం తగ్గకుండా చూడాలి. పిల్లలకు అవసరమైతే కొద్దిగా పెంచాలి కూడా. ఈ విధంగా చేస్తే చాలా త్వరగా కోలుకుంటారు.

నీళ్లు కాకుండా... రక్తవిరేచనాలు, చీముబంక విరేచనాలు అవుతుంటే మాత్రం వైద్యులు వాటికి కచ్చితంగా యాంటీబయాటిక్‌, యాంటీఅమీబిక్‌ మందులు ఇస్తారు, వాటిని ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా తీసుకోవాలి.

ఓఆర్‌ఎస్‌
చాలామంది నీళ్లవిరేచనాలు ఆరంభం కాగానే ఎలక్ట్రాల్‌ వంటి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు తెచ్చుకుంటారుగానీ.. ఆ ప్యాకెట్‌ చించి ఎప్పటికప్పుడు రెండు మూడు చెంచాలు గ్లాసులో వేసి కలుపుకొని తాగుతుంటారు. ఇది సరికాదు. ఒక ప్యాకెట్‌ మొత్తాన్ని ఒక లీటరు నీటిలో కలిపెయ్యాలి. అప్పుడే ఆ నీటిలో లవణాలన్నీ సరైన మోతాదులో ఉంటాయి. ఇలా తయారు చేసిన ద్రావణం (అవసరమైతే 24 గంటలు కూడా నిల్వ ఉంచుకోవచ్చు) నుంచి కొద్దికొద్దిగా వేరే గ్లాసులోకి తీసుకుని తాగాలి.

వేసవిలో....
* వీధి పక్కని దుకాణాల్లోనే కాదు.. పెద్దపెద్ద హోటళ్లలో కూడా నీళ్ల విషయంలో, శుద్ధి చేసే విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారో చెప్పటం కష్టం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి.
* పండ్ల రసాలు, చెరుకురసం వంటివి దాహాన్ని తీర్చటంలో మంచివేగానీ వాటిని శుభ్రమైన ప్రదేశంలో తయారుచెయ్యటం ముఖ్యం. అలాగే వాటిలో కలిపే 'ఐసు' ఎక్కడి నుంచి తెచ్చారో, ఆ ఐసు తయారీదారులు శుభ్రత పాటించారో లేదో చెప్పటం కష్టం. కాబట్టి బయట వాడే ఐసుల జోలికి పోకపోవటం మేలు.
* మలం వ్యాధికారక క్రిముల నిలయం. కాబట్టి మలవిసర్జనకు వెళ్లొచ్చిన ప్రతిసారీ చేతులను తప్పనిసరిగా సబ్బుతోనే కడుక్కోవాలి. నీళ్లతో కడుక్కుంటే చాలదా? అనుకోవద్దు. సబ్బుతో రుద్ది కడిగితే మాత్రమే సూక్ష్మాతిసూక్ష్మమైన క్రిములు తొలగిపోతాయి.
* ఆహారాన్ని తయారుచేసే ముందు, వడ్డించేటప్పుడు, తినేటప్పుడు కూడా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. టాయ్‌లెట్‌లకు వెళ్లిరాగానే సబ్బుతో శుభ్రంగా చేతులు రుద్దిరుద్ది కడుక్కోవటం చాలా అవసరం. చేతులు కడుక్కునే విషయంలో తీసుకునే ఈ చిన్న జాగ్రత్త.. అసలు విరేచనాల బారినపడకుండా రక్షించటంలో చాలా కీలకమైనది.
* ఆహారాన్ని సాధ్యమైనంత వరకూ వేడివేడిగా తినాలి. ఇళ్లలో నీటిని కాచి తాగటం ముఖ్యం. అది కూడా నీరు మరిగే స్థాయికి వచ్చిన తర్వాత సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కూడా అదే గిన్నెలో ఉంచాలి. దానిపైన సరైన మూత ఉంచటం, అవసరమైనప్పుడు దాన్లోంచే గ్లాసులో వంపుకొని తాగటం మంచిది.
* నీళ్ల విరేచనాలే కాదు.. హెపటైటిస్‌-ఎ, ఇ వంటి వైరస్‌ల కారణంగాతలెత్తే కామెర్లు కూడా ఇలా కలుషిత పదార్ధాల ద్వారానే సంక్రమిస్తాయి.వేసవిలో వీటి బెడదా ఎక్కువే. అందుకే తాగునీరు, ఆహారం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.