Monday, September 30, 2013

Salt-Our health,ఉప్పు-మన ఆరోగ్యము




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Salt-Our health,ఉప్పు-మన ఆరోగ్యము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



అతి సర్వత్ర వర్జయేత్‌ అంటారు. ఇది ఉప్పుకు అతికినట్టు సరిపోతుంది. ఆహారంలో ఉప్పు వాడకం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండెజబ్బు, పక్షవాతం ముప్పులూ పెరిగిపోతాయి. కాబట్టి ఉప్పు (సోడియం) వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. దీన్ని కొద్దిమోతాదులో తగ్గించినా పెద్ద ఫలితం కనబడుతుంది. రోజుకి 3 గ్రాముల ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే.. పక్షవాతం, గుండెపోట్ల ద్వారా సంభవించే మరణాల రేటు 75-80% పడిపోయినట్టు ఫిన్‌లాండ్‌లో జరిగిన అధ్యయనంలో తేలటమే దీనికి నిదర్శనం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం అన్ని రకాల ఆహార పదార్థాల నుంచి రోజుకి 5 గ్రాముల కన్నా ఎక్కువ (ఒక చెంచా) ఉప్పును తీసుకోకూడదు. కానీ మనదేశంలో రోజుకి సగటున 9 నుంచి 12 గ్రాముల వరకు తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణాల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంటోంది కూడా. మనదేశంలో అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య 2025 వరకు 21.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఉప్పు వాడకాన్ని తగ్గించటం తక్షణావసరమని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు మూలంగా శరీరంలోంచి నీరు బయటకు పోకుండా లోపలే ఉండిపోతుంది. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. దీన్ని పంప్‌ చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఉన్న సోడియాన్ని బయటకు పంపించటానికి మూత్రపిండాలపైనా అధిక భారం పడుతుంది. సోడియం వాడకాన్ని రోజుకి సుమారు 2.2 గ్రాములు తగ్గిస్తే.. పదేళ్ల కాలంలో 2.8 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కూరల్లో పరిమితంగా ఉప్పును వేసుకోవటం.. ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, సాస్‌లకు దూరంగా ఉండటం.. పెరుగు, మజ్జిగ వంటివి తింటున్నప్పుడు అదనపు ఉప్పును కలుపుకోకపోవటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఉప్పు వాడకాన్ని తగ్గించుకునే వీలుందని సూచిస్తున్నారు.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.