Monday, October 21, 2013

No fear of heart attack if change in lifestyle,లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకుంటే హార్ట్ ఎటాక్ భయం ఉండదు






-


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --No fear of heart attack if change in lifestyle,లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకుంటే హార్ట్ ఎటాక్ భయం ఉండదు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



45 ఏళ్లు పైబడిన వారికే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అనుకుని మీరు గుండెపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉండిపోతే... ఏ క్షణమైనా గుండెపోటు రావచ్చు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్ల ఇప్పుడు యుక్త వయస్సులోనే గుండె జబ్బులు వచ్చిపడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవడంతో పాటు లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవాలి. అప్పుడే హార్ట్ ఎటాక్ భయం ఉండదని అంటున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండల్‌రావు.

అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో 60 ఏళ్లు పైబడిన వారిలో గుండె జబ్బులు కనిపిస్తే మనదేశంలో 40 ఏళ్లకే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కువ మరణాలు గుండె జబ్బుల మూలంగానే సంభవిస్తున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, జీవనవిధానమే అయినా ఇతర కారణాలు కూడా గుండె జబ్బులను తెచ్చిపెడుతున్నాయి.
ఫ్యామిలీ హిస్టరీ : కుటుంబంలో తల్లి లేక తండ్రికి గుండె జబ్బు ఉన్నట్లయితే వారి పిల్లలకు హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

స్మోకింగ్ : టీనేజ్‌లోనే గుండె జబ్బులు రావడానికి మరో కారణం స్మోకింగ్. ఫ్యాషన్‌గా మొదలైన ఈ అలవాటు తరువాత వ్యసనంగా మారుతుంది.
లైఫ్‌స్టయిల్ : సెడెంటరీ లైఫ్‌స్టయిల్ గడిపే వారిలోనూ గుండెపోటు అవకాశాలు ఎక్కువ. అంటే శారీరక శ్రమ లేకపోవడం, పిల్లలు టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, శారీరక శ్రమ ఉండే ఆటలకు దూరం కావడం వంటివి కారణమవుతున్నాయి.

స్థూలకాయం : అధిక బరువు మరో కారణం. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు అలవాటు పడటం, పిజ్జాలు, బర్గర్లు తినడం, వేపుళ్లు ఎక్కువగా ఇష్టపడటం, స్వీట్స్ తినడం వంటి ఆహారపు అలవాట్లు అధిక బరువుకు కారణమవుతాయి. అధిక బరువు గుండె జబ్బులు రావడానికి దోహదం చేస్తుంది.
డయాబెటిస్ : కొందరు యుక్త వయసులోనే షుగర్ వ్యాధి బారినపడతారు. అటువంటి వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది.
ఒత్తిడి : వృత్తి పరమైన ఒత్తిడి, కుటంబపరమైన ఒత్తిడి కూడా గుండె జబ్బులకు కారణమవుతోంది.

డిప్రెషన్ : డిప్రెషన్ కూడా గుండె జబ్బులకు కారణమవుతుంది. డిప్రెషన్ వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా హార్ట్ఎటాక్ రిస్క్ పెరుగుతుంది.
హై బీపీ : అధిక రక్తపోటు కూడా ఒక కారణం. యుక్తవయస్కుల్లో ప్రిహైపర్‌టెన్షన్ కనిపిస్తుంది. అంటే రక్తపోటు 130/90 లేక 140/100 ఉంటుంది. ఈ దశలో బీపీని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావచ్చు. లేదంటే రిస్క్ పెరుగుతుంది.

ఏం జరుగుతుంది?
రక్తంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినపుడు రక్తనాళాల్లోని గోడల్లో పేరుకుపోతుంది. ఫలితంగా గుండె రక్తసరఫరా జరగక హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోకుండా చూస్తుంది. ఒకవేళ మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు బ్లాక్స్ ఏర్పడి హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది.

తల్లిదండ్రుల పాత్ర కీలకం
పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మూలంగా స్థూలకాయం సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ కొరవడితే వాళ్లు యుక్తవయస్సు వచ్చే సరికే గుండె జబ్బులు వస్తాయి. దీంతోపాటు స్మోకింగ్ వల్ల కలిగే నష్టాన్ని పిల్లలకు వివరించాలి. బాల్యంలో నేర్పించిన అలవాట్లు జీవితాంతం ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఏం చేయాలి?
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. నూనె ఎక్కువగా వాడకూడదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేకన్నా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. పిల్లలకు బాల్యం నుంచే మంచి ఆహారపు అలవాట్లను నేర్పించాలి. కుటుంబసభ్యుల్లో ఎవరైనా గుండె జబ్బులతో బాధపడుతుంటే వారి పిల్లలు మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. చెమట అధికంగా వస్తున్నా, ఆయాసంగా అనిపిస్తున్నా, ఏమాత్రం సందేహంగా అనిపించినా వైద్యులను సంప్రదించాలి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే ఆహార నియమాలు పాటించాలి. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే డైట్ కంట్రోల్ చేయడం ద్వారా తగ్గేలా చూసుకోవాలి. మందుల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చిన్న వయసులో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.

Courtesy with : డాక్టర్ కొండల్‌రావు,సీనియర్ కార్డియాలజిస్ట్,యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్, హైదరాబాద్@sakala of andhrajyothy news paper
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.