Thursday, September 25, 2014

Ligament Tear-లిగమెంట్‌ టేర్‌

  •  

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Ligament Tear-లిగమెంట్‌ టేర్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



బంధనాలు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాంటివైనా సరే.. తెగిపోవాలనే కోరుకుంటాం! మన స్వేచ్ఛకు ప్రతిబంధకాలుగా భావిస్తూ వాటిని పటాపంచలు చేసెయ్యాలని చూస్తుంటాం. కానీ ఇది మన శరీరానికి మాత్రం వర్తించదు! ఎందుకంటే ఒంట్లో కొన్ని రకాల బంధనాలు తెగిపోతే ఆ బాధ వర్ణనాతీతం.

క్రీడల్లోనో లేదా ఏదైనా ప్రమాదాల్లోనో.. మోకాలికి బలమైన దెబ్బ తగిలితే.. మోకీలులో ఉండే ఈ లిగమెంట్లు తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఇకసారి లిగమెంట్‌ తెగిందంటే ఇక పాట్లు తప్పవు. నడవాలంటే నొప్పి. కీలు స్థిరంగా ఉండదు. ఎప్పుడు బెసిగిపోయి పడిపోతామో భయం. ఒక రకంగా ఎముక విరిగినా దాన్నుంచి తేలికగానే బయటపడొచ్చేమోగానీ.. లిగమెంటు చినిగినా, తెగినా దాన్ని చక్కదిద్దుకోవటం అంత తేలిక కాదు. అది మళ్లీ అతుక్కుంటుందా? లేదా? సర్జరీతో సరవుతుందా? అసలు సరిచెయ్యాలా? వదిలేస్తే ఏమవుతుంది? ఇలా బోలెడన్ని సందేహాలు. అందుకే ఈ మోకీలు లిగమెంట్లకు సంబంధించిన సమగ్ర వివరాలను

కర్ర మీద కర్ర నిలబెట్టలేం. ఒకవేళ నిలబెట్టాలంటే ఏం చేస్తాం? వాటిని నిలబెట్టి.. రెండు పక్కలా.. వీలైతే రెంటి మధ్యలో కూడా.. తాళ్లో, మోకులో ఏవో ఒకటి బలంగా బిగించి కడతాం. మన కీళ్ల దగ్గర ఉండే లిగమెంట్లు కూడా సరిగ్గా ఈ తాళ్లలాంటి పాత్రే.. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే పెద్ద పాత్రే పోషిస్తుంటాయి! ఒకవైపు ఎముక మీద ఎముక బెసిగిపోకుండా నిలబడేలా చూస్తూనే.. కీలు అటూఇటూ కదులుతుండేందుకు.. స్వేచ్ఛగా వెనక్కీముందుకీ ఆడుతుండేందుకు ఈ లిగమెంట్లే మూలాధారంగా నిలుస్తాయి. మరీ ముఖ్యంగా మోకాలి కీలులో వీటి పాత్ర చాలా ఎక్కువ. అందుకే క్రీడల్లో లేదా ప్రమాదాల్లో మోకీలుకు బలమైన దెబ్బ తగిలితే.. ఎముకలు విరగొచ్చు. అంతే కాదు.. ఆ ఎముకలను పట్టి ఉంచే లిగమెంట్లు కూడా దెబ్బతినొచ్చు. అవి చిరగొచ్చు. పూర్తిగా తెగిపోనూ వచ్చు. ఇవే కాదు.. రెండు ఎముకల మధ్యా రబ్బరు కుషన్లలాగా ఉండే మినస్కస్‌ పొరలు కూడా చిరగొచ్చు, చిట్లిపోవచ్చు. ఈ స్థితిలో దెబ్బ తగిలిన వెంటనే పెద్ద ఇబ్బంది లేకపోయినా.. ఎక్స్‌రేలో అంతా బాగానే ఉన్నట్టనిపించినా.. క్రమేపీ మోకాలు వాచిపోయి అడుగు కదపాలంటే కష్టంగా తయారవ్వచ్చు. కీలు స్థిరత్వం పోయి.. నడుస్తుంటే పట్టు వదిలేస్తున్నట్టనిపించొచ్చు. మోకీలు బిగిసిపోయినట్లవ్వచ్చు. దీంతో నరకం కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ఎముక విరగటం కంటే కూడా తీవ్రమైన.. కనబడకుండా ఇబ్బందిపెట్టే సమస్య. ఎముక అతుక్కున్నంత తేలికగా ఈ లిగమెంట్స్‌ అతుక్కోవు. ఈ స్థితిలో పరిస్థితిపై అవగాహన లేకపోతే.. దీన్ని గుర్తించటం, చక్కదిద్దుకోవటం పెద్ద సమస్యగా తయారవుతుంది.

బంధనాలు భద్రంగా ఉంటేనే..!
మన ఒంట్లోని ప్రతి కీలులోనూ ఎముక బంధనాలుంటాయి. వీటినే 'లిగమెంట్లు' అంటాం. ఇవి కీలులోని రెండు ఎముకలూ ఒకవైపు కదులుతూనే.. బిగువుగా, దగ్గరగా పట్టుకుని ఉండేందుకు దోహదం చేస్తాయి. ఈ బంధనాల వల్ల కీలు కదులుతూనే ఉంటుంది.. అలాగని ఎలా పడితే అలా కదిలిపోకుండా, బెసిగిపోకుండా స్థిరంగా కూడా ఉంటుంది. అందుకే కీలుకు లిగమెంట్లు అంత్యత కీలకమైనవి. అయితే వీటితో పాటు.. కీలు మొత్తాన్నీ కప్పి ఉండే కాప్స్యూల్‌ పొర, కొంత వరకూ కండరాలనూ-ఎముకలనూ పట్టి ఉంచే టెండాన్ల వంటివీ కీలు స్థిరత్వానికి సహకరిస్తుంటాయిగానీ వీటిలో ప్రధాన పాత్ర మాత్రం లిగమెంట్లదే. ఇవి దృఢంగా, భద్రంగా ఉంటేనే కీలు చక్కగా కదులుతుంటుంది. మన మోకాలి కీలులో ఈ లిగమెంట్ల పాత్ర మరీ కీలకం. ఎందుకంటే శరీరం బరువు మొత్తాన్నీ ఈ మోకీలే మోస్తుంటుంది, దానిచుట్టూ పెద్దగా దృఢమైన కండరాలూ అంతగా ఉండవు. అయినా మనం ఒంటి కాలు మీద కూడా స్థిరంగా నిలబడగలుగుతున్నామంటే అందుకు లిగమెంట్లు, కొంతవరకూ కీలు చుట్టూ ఉండే కాప్స్యూలే మూలం.

మోకీలుకు మూలాధారం 4 లిగమెంట్లు!
మోకీలులో- పైనుంచి వచ్చే తొడ ఎముక (ఫీమర్‌), కింది నుంచి వచ్చేపిక్క ఎముక (టిబియా).. ప్రధానంగా ఈ రెండూ ఒకదాని మీద మరోటి మడత బందులా ఆడుతుంటాయి. ఇవి ముందుకూ-వెనక్కూ మాత్రమే కాదు.. కొద్దిగా గుండ్రంగా, కాస్త పక్కలకు కూడా కూడా తిరుగుతుంటాయి. దీనివల్ల మనం నడిచేటప్పుడు చటుక్కున అటూఇటూ తిరిగినా, పక్కకు ఒరిగినా.. ఆ అనూహ్యమైన కుదుపును తట్టుకునే శక్తి కీలుకు ఉంటుంది. దీనికింతటి వెసులుబాటును తెచ్చేందుకు కీలులో ప్రధానంగా 4 లిగమెంట్లు ఉంటాయి. రెండు- కీలుకు రెండువైపులా తాళ్లలా గట్టిగా పట్టుకుని ఉండే 'కొల్లేటరల్‌' లిగమెంట్లు. మరో రెండు- కీలు లోపల రెండు ఎముకల మధ్యలో వాటిని కలుపుతూ 'X' ఆకారంలో ముందు నుంచి వెనక్కూ, వెనక నుంచి ముందుకూ బిగువుగా పట్టుకుని ఉంటాయి. వీటిలో ముందు నుంచి వెనక్కి ఉండేదాన్ని 'యాంటీరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌)' అనీ, అలాగే వెనక నుంచి ముందుకు ఉండేదాన్ని 'పోస్టీరియర్‌ క్రూసియేట్‌ లిగమెంట్‌ (పీసీఎల్‌)' అనీ అంటారు. మొత్తానికి- కీలుకు మధ్యలో 2, కీలుకు రెండు పక్కలా మరో 2.. ఈ నాలుగూ కలిసి కీలుకు చక్కటి స్థిరత్వాన్ని ఇస్తుంటాయి. వీటికి ఉండే ప్రత్యేక గుణం- ఇవి సాగిపోవు. అలాగని అస్సలు సాగకుండా ఉండవు. కీలును ఒక పరిధి వరకూ అటూఇటూ వంగనిస్తాయి.

సాగటం.. తెగటం!
సాధారణంగా లిగమెంట్లు ఎన్నేళ్త్లెనా దృఢంగానే ఉంటాయి, వీటికి ఎలాంటి జబ్బులూ రావు. కాకపోతే ఆటల్లోనో, ప్రమాదాల్లోనో.. మన మోకీలు మీద విపరీతమైన ఒత్తిడి పడి.. అసాధారమైన కదలికలు వచ్చినప్పుడు.. ఇవి విపరీతంగా సాగిపోవచ్చు. ఇంకా ఒత్తిడి పడితే ఏకంగా తెగిపోవచ్చు. లేదూ, ఏదో ఒక వైపు నుంచి చిన్న ఎముక ముక్కతో సహా వూడిరావచ్చు. ఇవే పెద్ద సమస్యలు! ఇలాంటివి క్రీడాకారుల్లో ఎక్కువ. అలాగే బరువు ఎక్కువ ఉండే వారిలో, లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, నడుస్తుంటే ముందుకు తూగటం.. పడిపోవటం వంటి అసాధారణ కదలికలు వచ్చినప్పుడు ఇవి గాయపడే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి జరిగే నష్టం.. ఒత్తిడి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

* లిగమెంట్‌ బెణకటం (స్ప్రెయిన్‌): కీలు మీద తీవ్రమైన ఒత్తిడి పడి.. లిగమెంట్‌లోని తంత్రుల్లో చాలా కొద్దిగా మాత్రమే తెగితే దీన్ని గ్రేడ్‌-1 స్ప్రైన్‌ అంటారు. దీనివల్ల లిగమెంట్‌ బలం పెద్దగా తగ్గదుగానీ.. కొద్దిగా నొప్పి, వాపు ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రత ఎక్కువగా ఉండి ఇది బాగా సాగి లూజుగా తయారవ్వచ్చు (గ్రేడ్‌-2). మొత్తానికి ఇవి చిన్న తరహా గాయాలే.

* లిగమెంట్‌ తెగిపోవటం (టేర్‌): లిగమెంట్‌ తట్టుకోలేనంతటి స్థాయిలోఅసాధారణ కదలికలు, ఒత్తిడి ఎదురైతే లిగమెంట్‌ తెగిపోవచ్చు. దీనిలో ప్రధానంగా రెండు రకాలు.

1. లిగమెంట్‌ ఎముకను అతుక్కునే చోట తెగి.. ఎముక ముక్కతో సహా పెళ్లలా వూడిరావటం. దీన్నే 'అవల్షన్‌' అంటారు, దీన్ని సర్జరీ చేసి.. తిరిగి వెనక్కి తీసుకువెళ్లి దాని స్థానంలో ఉంచి, స్క్రూలతో బిగించేస్తే ఎముకా-ఎముకా తేలిగ్గా అతుక్కుపోతాయి, ఇది పూర్తిగా నయమైపోతుంది.

2. లిగమెంట్‌ మధ్యలో చిరిగినట్లుగా తెగిపోవటం. ఇలా తరచుగా తెగేది.. కీలు మధ్యలో ఉండే ఏసీఎల్‌. దీనితో ఎదురయ్యే పెద్ద సమస్యేమంటే- ఇది ఉండేదే ఒక అంగుళం. తెగిపోతే తిరిగి అతకటానికి, కుట్టటానికి ఆధారంగా కూడా ఏమీ ఉండదు. అందుకే ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ తెగితే.. కచ్చితంగా మరో ప్రత్యామ్నాయం ఏదైనా తీసుకొచ్చి.. మరమ్మతు చెయ్యాల్సిందేగానీ వీటినే తిరిగి కుట్టటానికి ఆస్కారం ఉండదు. పక్కలనుండే కొల్లేటరల్స్‌ తెగితే వాటిని సర్జరీతో సరిచేస్తారు.


  •  
* కొన్నికొన్ని ప్రత్యేక సందర్భాల్లో దెబ్బలు, గాయాల తీవ్రతను బట్టి రెండు, మూడు లిగమెంట్లు కూడా తెగిపోతాయి. ముఖ్యంగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్లో ఏసీఎల్‌, ఎన్‌సీఎల్‌ రెండే కాదు.. కీలులో కింది వైపున ఉండే మినస్కస్‌ పొర కూడా దెబ్బతింటుంది.తెగటం.. ఎవరిలో ఎక్కువ?
లిగమెంట్లు, ముఖ్యంగా ఏసీఎల్‌ తెగిపోవటమన్నది క్రీడాకారులు, డ్యాన్సర్లలోనే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువే. అలాగే టీనేజీ ఆడపిల్లల్లో ఎక్కువ. పడిపోవటం, మోకాలు బలంగా నేలనుగానీ మరేదైనా గట్టి తలాన్ని ఢీకొనటం, నడుస్తూనో మెట్లు దిగుతూనే కాలు బెసగటం.. ఇలా ఏ సందర్భంలోనైనా ఇవి తెగిపోవచ్చు.

లక్షణాలు.. వెంటనే కనబడకపోవచ్చు!
లిగమెంట్లు బెణికినా, తెగినా.. వెంటనే నొప్పి, వాపు, నడక కష్టం కావటం వంటి సాధారణ లక్షణాలు ఉండొచ్చు. అయితే ఇవి అన్నిసార్లూ అంత తీవ్రంగా ఉండాలనేం లేదు. ముఖ్యంగా ఏసీఎల్‌ తెగినా.. వెంటనే లేచి తిరుగుతారు. మెల్లగా వాపు వంటివన్నీ తగ్గిపోతాయి కూడా. కానీ ఒకటి, రెండు వారాల తర్వాత కొద్దిగా వాపు, నడిచేటప్పుడు పట్టు వదిలేసినట్టు.. కీలు తొలిగిపోయినట్లు అనిపించటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఎక్స్‌-రే తీసినా అంతా బాగున్నట్టే అనిపించొచ్చు. ఎందుకంటే సాధారణ ఎక్స్‌రేలో ఎముకలు మాత్రమే కనబడతాయి. లిగమెంట్‌ల పరిస్థితి తెలియదు. అందుకని డాక్టరు స్వయంగా కీలును, చుట్టుపక్కల కండరాలను రకరకాల కోణాల్లో తిప్పి, నొక్కి పరీక్షించి లిగమెంట్‌ తెగిందని అనుమానిస్తారు. అవసరాన్ని బట్టి.. కీలును కొద్దిగా ఎడంగా లాగిపట్టి స్ట్రెస్‌-ఎక్స్‌రే తీస్తే ఎముకలు రెండింటి మధ్యా దూరం ఎక్కువ కనబడుతుంటుంది. ఎక్కువ దూరం జరుగుతున్నాయంటే లిగమెంట్‌ తెగిందని అనుమానిస్తారు. ఎమ్మారై స్కానింగు చేస్తే.. తెగిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. అరుదుగా ఇందులో కూడా స్పష్టత రాకపోతే.. కీలులోకి కెమేరా గొట్టం (ఆర్థ్రోస్కోపీ) పంపి.. ప్రత్యక్షంగా చూడటం ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.

చికిత్స ఏమిటి?
* ఓ మోస్తరు బెణుకు అయితే పెద్దపెద్ద చికిత్సల అవసరం ఉండదు. కొద్దిరోజులు ఐస్‌ కాపడం, ఎత్తు మీద పెట్టటం, నొప్పి తగ్గే మందులు, కొద్దిపాటి విశ్రాంతి, వాపు తగ్గిన తర్వాత వ్యాయామాలు చేస్తే చాలా వరకూ సర్దుకుంటుంది.

* పూర్తిగా తెగిపోతేనే సమస్య. కీలుకు పక్కవైపున ఉండే కొల్లేటరల్‌ లిగమెంట్లు తెగితే.. వాటికి సత్వరమే ఆపరేషన్‌ చేసి.. దగ్గరకు తెచ్చి అతుకుతూ కుట్లు వెయ్యటం అవసరం. ఆరువారాల విశ్రాంతితో ఇవి అతుక్కుపోతాయి. ఇక ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ తెగితే.. అది మొత్తం అంగుళం కూడా ఉండదు, అదీ పీచుపీచుగా అయిపోతుంది. వాటిని దగ్గరకు తెచ్చి కుట్లు వేయటం కూడా కష్టం. అందుకని వీటి విషయంలో రకరకాల మార్గాలను అనుసరించాల్సి వస్తుంది.

తెగిన వెంటనే.. ఎటువంటి ప్రత్యేక చికిత్సా అవసరం ఉండదు. కొద్దివారాల పాటు విశ్రాంతి, నొప్పి తగ్గే మందులు, కీలుకు అవసరమైతే బ్రేసెస్‌తో సపోర్టు ఇస్తే సరిపోతుంది. ఈ దశలో కూడా కీలు కదల్చటం ముఖ్యం. లేకపోతే బిగిసిపోతుంది. ఇలా ఓ 40 రోజుల పాటు కొద్దిపాటి కదలికలు, విశ్రాంతి ఇస్తే నొప్పి, వాపు తగ్గుతాయి. ఈ స్థితిలో కీలు కదలికలను, రోగి జీవనశైలిని బట్టి చికిత్స ఏమిటన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. క్రీడాకారుల వంటివారు కానప్పుడు సర్జరీ తొలి ప్రాధాన్యం కాదు. ఒకప్పుడు అంతగా శారీరక శ్రమ చెయ్యని, పెద్దవయసు వారికి సర్జరీ చేసి.. లిగమెంట్లను రిపేరు చెయ్యనవసరం లేదని భావించేవారుగానీ.. వీటిని సరిచెయ్యకపోతే కీలు అస్థిరంగా తయారవుతుంది. కొంతకాలం పాటు అలాగే ఉంటే అటూఇటూ కదిలిపోతూ త్వరగా కీలు అరిగిపోతోందని గుర్తించారు. అందుకని అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్యులు లిగమెంట్లను మరమ్మతు చెయ్యటానికే ప్రయత్నిస్తారు. మరీ పెద్ద వయసు వారికి.. అది కుదరని పక్షంలో ఫిజియో థెరపీ చేస్తూ.. మోకీలు మీద భారాన్ని తగ్గించేలా మోకాలు వెనకాల ఉండే హ్యామ్‌స్ట్రింగ్‌ కండరాలను బలపరచటం వంటివి సిఫార్సు చేస్తారు. ఏసీఎల్‌ చేసే పనిని కొంతవరకూ హ్యామ్‌స్ట్రింగ్స్‌ తీసుకుంటాయి కాబట్టి దానివల్ల కీలు బెసగకుండా ఉంటుంది. క్రీడాకారులు, యువతీయువకుల వంటివారికి మాత్రం వీటిని మరమ్మతు చెయ్యక తప్పదు.

లిగమెంట్‌ తెగిపోయినప్పుడు మరీ వృద్ధులకు కాకపోయినా.. క్రీడాకారులు, యువతీయువకుల వంటివారికి మాత్రం వాటిని మరమ్మతు చెయ్యటం మేలు.

సర్జరీ
ఏసీఎల్‌, పీసీఎల్‌ మరమ్మతు ఎలా?

ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ మధ్యలో తెగిపోతే అవి తిరిగి అతుక్కోవటం కష్టం. దానికి ఉన్న ఒకటే మార్గం.. దీనికి ప్రత్యామ్నాయం కల్పించటం! ఇందుకోసం ఒకప్పుడు కృత్రిమంగా తయారు చేసిన లిగమెంట్లను ప్రయత్నించారుగానీ అవి దీర్ఘకాలం మన్నటం లేదని తేలింది. కాబట్టి ఒంట్లోనే వేరే చోటి నుంచి లిగమెంట్‌లా దృఢంగా ఉండే భాగాన్ని తీసుకువచ్చి అతకొచ్చు (ఆటోగ్రాఫ్ట్‌). లేదంటే ఇతరుల నుంచి సేకరించినది తెచ్చి పెట్టచ్చు (ఆలోగ్రాఫ్ట్‌).

శరీరంలోనే ఇతర భాగం నుంచి సేకరించేందుకు ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. 1. మోచిప్పకు అతుక్కుని ఉండే 'పటిల్లార్‌ టెండన్‌' నుంచి కొంత భాగం కత్తిరించి తీసుకొచ్చి వెయ్యచ్చు. 2. మోకాలు వెనకాల దృఢంగా ఉండే హ్యామ్‌స్ట్రింగ్‌ కండరం ముక్కను తీసుకొచ్చి అతకొచ్చు. ఇందుకోసం ఒకప్పుడు మోకాలిని పూర్తిగా తెరిచి సర్జరీ చెయ్యాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ విధానంలో కేవలం చిన్న రంధ్రాలు ద్వారానే పూర్తి చేస్తున్నారు. (సర్జరీ విధానం బాక్సులో)

మరమ్మతు తర్వాత సుమారు 40 రోజుల్లో కొత్తగా అతికిన లిగమెంట్‌లు అతుక్కుంటాయి. ఈలోపు జాగ్రత్తగా వ్యాయామాలు చేస్తూ వాటిని కుదురుకోనివ్వాలి. ఇవి దీర్ఘకాలం మన్నుతున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. సర్జరీ తర్వాత కనీసం ఆర్నెల్ల పాటు వ్యాయామాల వంటివి చెయ్యాలి. దీంతో అవి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి.
మినస్కస్‌లు చినిగిపోతే!
కీలు లోపల.. అడుగువైపున అర్ధ చంద్రాకారంలో రెండు రబ్బరు వాషర్ల వంటి పొరలు ఉంటాయి. వీటినే మినస్కై అంటారు. దూకినప్పుడు, ఎగరటం వంటివి చేసినప్పుడు.. ఎముకలు గట్టిగా రుద్దుకోకుండా రబ్బరు కుషన్లలా ఇవి రక్షణ ఇస్తుంటాయి. వీటికి రక్తప్రసారం పెద్దగా ఉండదు. కాబట్టి ఇవి చిట్లితే అతుక్కోవటం కొంత కష్టం. సాధారణ నడకలో మన బరువుకు నాలుగు రెట్ల బరువు వీటి మీద పడుతుంది. అదే పరుగెడుతున్నప్పుడైతే దాదాపు పది రెట్లు ఎక్కువ పడుతుంది. ఎంత గట్టిగా ఉన్నా.. అసాధారణమైన ఒత్తిడి పడినప్పుడు ఇవి కూడా చినిగిపోవచ్చు. కీలులో ఈ చినిగిన ముక్కలు అడ్డుపడటం వల్ల లోపలి నుంచి శబ్దాలు, విపరీతమైన నొప్పి, కీలు బిగిసిపోయినట్లుండటం, పట్టు వదిలేసినట్టుండటం వంటి లక్షణాలు కనబడతాయి. వెంటనే వాపు రాకపోవచ్చు, మెల్లగా మర్నాటికి రావొచ్చు. ఒక్కోసారి ఏసీఎల్‌తో పాటు ఈ మినస్కస్‌లూ దెబ్బతింటాయి. ఇవి బయటివైపు చిరిగితే తిరిగి అతికించి కుడతారు. ఇలా 10% మందిలోనే సాధ్యపడుతుంది. అదే లోపలి వైపు చినిగితే.. సర్జరీ చేసి.. ఆ కాస్త ముక్క తీసెయ్యటం తప్పించి మరో మార్గం లేదు.

  • Courtesy with : Dr.K.Krushnayya (Orthopaedic surgeon) Medicity hos.Hyderabad@eenadu sukhibhava..23-09-2014
  • =========================

Saturday, September 13, 2014

Premature Overian failure-ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Premature Overian failure-ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


   అండాశయాలు కొందరిలో నలభైఏళ్లకన్నా ముందుగానే తమ పనిని ఆపేస్తాయి. దాంతో ముందే నెలసరులు ఆగిపోతాయి. ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి! మెనోపాజ్‌ లక్షణాలు ముందుగానే కనిపించే ఈ సమస్యనే 'ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌' అంటారు.

అండాశయాలు.. స్త్రీ లక్షణాలు ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణం. స్త్రీ ఆకృతి, నెలసరులూ, సంతాన సాఫల్యత ఇవన్నీ అండాశయాల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మెనోపాజ్‌ దశలోనే ఇవి తన పనితీరు ఆపేస్తాయి. దాంతో నెలసరులు ఆగిపోవడం.. ఎముకలు గుల్లబారడం ఇలా చాలా సమస్యలొస్తాయి. కానీ మెనోపాజ్‌ రాకుండానే కొందరిలో అండాశయాలు తన పనితీరు ఆపేస్తాయి. దాన్నే 'ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌' అంటారు. దాంతో ఈస్ట్రోజెన్‌ హార్మోను అందదు. అండాలు సరిగ్గా విడుదల కావు. ఫలితంగా సంతాన సాఫల్యతా తగ్గుతుంది.

లక్షణాలివి..
నెలసరిలో తేడాలు మొదలవుతాయి. రక్తస్రావం ఎక్కువగా లేదా తక్కువగా కావచ్చు. రోజులతరబడి ఉండొచ్చు. మరికొన్నిసార్లు నెలల తరబడి అసలు నెలసరే రాకపోవచ్చు. ఈ సమస్య సాధారణంగా ప్రసవమయిన వారిలో, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం ఆపేశాక ఎదురుకావచ్చు. ఒంట్లో ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, జననేంద్రియాలు పొడిబారడం, మంటగా అనిపించడం, లైంగికవాంఛలు తగ్గడం వంటివి దీని లక్షణాలు.

ఎందుకిలా..
అసలు అండాశయాల పనితీరు ఎలా ఉంటుందనేదీ తెలుసుకోవాలి. సాధారణంగా నెలసరి సమయంలో పిట్యూటరీ గ్రంథి కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. వాటి ద్వారా అండాలున్న ఫాలికల్స్‌ విడుదలవుతాయి. వాటిలో ఒక్క ఫాలికల్‌ మాత్రమే పరిణతి చెందుతుంది. ఇది ఫెలోపియన్‌ ట్యూబుల్లోకి చేరి, వీర్యకణాలతో కలిసి ఫలదీకరణ చెందుతుంది. గర్భం వస్తుంది. అయితే.. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ ఉన్నవారిలో ఈ ప్రక్రియ ఇంత సజావుగా సాగదు. ఇందుకు దారితీసే కారణాలివి..

ఫాలికల్‌ డిప్లీషన్ ‌: ఇందుకు రెండు కారణాలుంటాయి. ఒకటి వంశపారంపర్యం. ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌ గురించి చెప్పుకోవాలి. ఈ సమస్య ఉన్న స్త్రీలకు రెండు ఉండాల్సిన ఎక్స్‌ క్రోమోజోమ్‌ ఒకటే ఉంటుంది. మానసిక సమస్య మొదలవుతుంది. ఇక రెండో కారణం.. కీమోథెరపీ రేడియేషన్‌ చికిత్సలు వంటివి తీసుకోవడం. ఈ చికిత్సలు శరీరంలోని కణాలపై ప్రభావం చూపుతాయి. సిగరెట్‌ పొగా, రసాయనాలూ, క్రిమి సంహారకాలూ, కొన్నిరకాల వైరస్‌లు కూడా అండాశయాల పనితీరుపై ప్రభావం చూపుతాయి.

ఫాలికల్‌ డిస్‌ఫంక్షన్ ‌: కొన్నిసార్లు అండాశయాల్లోని కణజాలానికి వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఇవి అండాల విడుదలపై ప్రభావం చూపుతాయి. ఇమ్యూనో డిసీజ్‌ పరీక్షల్లో ఈ యాంటీబాడీల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తేలలేదు. వైరస్‌ ఒక కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండానే అండాశయాల పనితీరు మందగిస్తుంది. అలాంటప్పుడు ఇమ్యూనో డిసీజ్‌ పరీక్షతోబాటు మిగతావీ చేయించాలి. చాలాసార్లు ముప్ఫైఅయిదు, నలభైఏళ్ల మధ్య ఈ సమస్య మొదలయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

తల్లి కాలేకపోవచ్చు..
ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలామంది మహిళలు కెరీర్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే గర్భం దాల్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అలా ఆలస్యంగా గర్భం దాల్చేవారిలో అండాశయాల పనితీరు సరిగ్గా లేకపోతే తల్లయ్యే ఆనందాన్ని పూర్తిగా దూరం చేసుకోవాల్సి రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో అరుదుగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను కీలకంగా పనిచేస్తుంది. వాటి స్థాయులు తగ్గడం వల్ల నలభైల్లోనే ఎముకలు బలహీనమై పెళుసుబారడం మొదలవుతాయి. చిన్నవయసులోనే ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ.

సంతాన సాఫల్యత తగ్గడం, ఇతర సమస్యలూ, వేడి ఆవిర్లూ, చెటమలు పట్టడం... లాంటివన్నీ ఆ స్త్రీలను మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.

పరీక్షలున్నాయి..
అండాశయాల పనితీరు ఎంత వరకూ తగ్గుతోంది.. అసలు అదేనా సమస్య అన్నది గుర్తించేందుకు కొన్నిరకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి..

ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోను(ఎఫ్‌ఎస్‌హెచ్‌)టెస్ట్ ‌: వాస్తవానికి ఎఫ్‌ఎస్‌హెచ్‌ అనేది హార్మోను. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలై, అండాశయాల్లో ఫాలికల్స్‌ పెరిగేందుకు తోడ్పడుతుంది. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ సమస్య ఉన్నప్పుడు ఈ హార్మోను స్థాయుల్లో తేడా కనిపిస్తుంది.

ఈస్ట్రాడియాల్‌ టెస్ట్‌ : ఈస్ట్రాడియల్‌ అనేది ఈస్ట్రోజెన్‌ హార్మోనులో ఓ రకం. అండాశయాల పనితీరు తగ్గినప్పుడు రక్తంలో దీని శాతం తగ్గుతుంది.

ప్రొలాక్టిన్‌ టెస్ట్ ‌: ఇది సాధారణంగా తల్లిపాల ఉత్పత్తిని పెంచే హార్మోను. ప్రొలాక్టిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు అండం విడుదలలో తేడాలుంటాయి.

కార్యోటైప్ ‌: క్రోమోజోముల్లోని లోపాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షను చేస్తారు. ఇది నలభైఆరు క్రోమోజోములను పరీక్షిస్తుంది. అండాశయాల పనితీరు తగ్గినప్పుడు రెండు ఉండాల్సిన ఎక్స్‌ క్రోమోజోములకు ఒకటే ఉన్నా, క్రోమోజోములకు సంబంధించి ఇతర సమస్యలున్నా ఈ పరీక్షలో తెలుస్తుంది.

ఎఫ్‌ఎంఆర్‌ఐ జీన్‌ టెస్టింగ్ ‌: ఇది ఎక్స్‌ క్రోమోజోమ్‌కి సంబంధించింది. వాటిల్లో లోపం ఉన్నప్పుడు ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.

చికిత్స --
అండాశయాల పనితీరు ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజెన్‌ హార్మోను లోపం ఉంటుంది. అందువల్ల.. దాన్ని భర్తీ చేసే దిశగా చికిత్సకు ప్రాధాన్యం ఇస్తారు.

ఈస్ట్రోజెన్‌ థెరపీ : ఆస్టియోపోరోసిస్‌, ఆవిర్లూ లాంటి సమస్యల్ని నివారించేందుకు వైద్యులు ఈ చికిత్సను సూచిస్తారు. ఈస్ట్రోజెన్‌ని చికిత్స రూపంలో ఇస్తారు. అయితే ఈస్ట్రోజెన్‌ వల్ల క్యాన్సర్‌ సమస్యలు రాకుండా ప్రొజెస్టరాన్‌ని కూడా సూచిస్తారు. ఇది గర్భాశయంలోని ఎండోమెట్రియం పొరకి రక్షణగా ఉంటుంది. ఈ రెండింటినీ వాడటం వల్ల మళ్లీ రక్తస్రావం కనిపించవచ్చు. అలాగని అండాశయాలు మళ్లీ పనిచేస్తున్నట్లు కాదు. రోగి ఆరోగ్య పరిస్థితి, ఉన్న ఇతర సమస్యలను బట్టీ ఈ హార్మోన్లను యాభై ఒక్క ఏళ్ల వరకూ వాడొచ్చు. ఆ తర్వాతా తీసుకోవడం మంచిది కాదు. తీసుకుంటే గుండె సంబంధ సమస్యలూ, రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.

క్యాల్షియం, విటమిన్‌ డి : ఆస్టియోపోరోసిస్‌ని నివారించాలంటే ఈ రెండూ చాలా అవసరం. అండాశయాలకు సంబంధించిన సమస్యలున్నప్పుడు వైద్యులు బోన్‌డెన్సిటీ పరీక్ష చేసి మందుల్ని ఏ మోతాదులో వాడాలో నిర్ణయిస్తారు. సాధారణంగా పందొమ్మిది నుంచి యాభై ఏళ్లలోపు స్త్రీలు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియంని ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి. ఆ వయసు తర్వాత పన్నెండొందల మిల్లీగ్రాములు తీసుకోవాలి. విటమిన్‌ డిని మాత్రం రోజుకు 600 - 800 ఇంటర్నేషనల్‌ యూనిట్ల లెక్కన సూచిస్తారు. ఒకవేళ రక్తంలో విటమిన్‌ డి స్థాయి తక్కువగా ఉందని తేలితే ఆ మోతాదును ఇంకా పెంచుతారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఆహారంలోనూ క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతోపాటూ నడకా, బరువులెత్తే వ్యాయామాలూ చేయడం కూడా చాలా అవసరం.

కృత్రిమ పద్ధతుల్లో : అండాశయాలు విఫలమైనవారికి సంతానసాఫల్యత కూడా తగ్గుతుందని చెప్పుకున్నా. ఇలాంటివారు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ద్వారా గర్భం దాల్చాల్సి రావచ్చు.

  • Courtesy with : Dr.Praneetha Reddy(Uro.gyaenocologist) Hyd.@eenadu vasundhara.
  • ==========================

Monday, September 1, 2014

Breast pain and scretions awareness-వక్షోజాల నొప్పి మరియు స్రావముల అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --వక్షోజాల నొప్పి మరియు స్రావముల అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


''రొమ్ములో నొప్పిగా ఉంటోంది..'' అని కొందరు ఫిర్యాదు చేస్తే.. ''అప్పుడప్పుడూ స్రావాలూ విడుదలవుతున్నాయి..'' ''తడుముతుంటే గడ్డల్లా తగులుతున్నాయి'' అంటుంటారు మరికొందరు. సమస్య ఎలాంటిదైనా క్యాన్సరేమో అనే భయం మాత్రం అందరిలోనూ ఉంటుంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది నిర్ధరించుకోవడం చాలా అవసరం.
పుట్టినప్పట్నుంచే స్త్రీల వక్షోజాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని సమస్యలూ ఎదురవుతాయి. సాధారణంగా రొమ్ములో నొప్పీ, అసాధారణ స్రావాలూ, గడ్డలూ, ఆకృతిలో తేడాల వంటి సమస్యల్ని చాలామంది ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. పైగా అవి పుట్టిన పాపాయి దగ్గర్నుంచీ, రుతుక్రమం మొదలైనప్పుడూ, యౌవనంలో, గర్భిణిగా ఉన్నప్పుడూ, బిడ్డకు పాలిచ్చేప్పుడూ, నడివయసు నుంచి మెనోపాజ్‌ వరకూ... ఇలా ఏ దశలోనయినా ఇబ్బందిపెట్టవచ్చు. వీటిలో ఏవి హాని కలిగించేవో తెలియాలంటే మొదట వక్షోజాల నిర్మాణం గురించి తెలుసుకోవాలి. రొమ్ముల్లో అతి ముఖ్యమైన భాగం పాల గ్రంథి అయినప్పటికీ ఇతర కణజాలం కూడా ఉంటుంది. చర్మం, కొవ్వు పదార్థం, మందమైన టిష్యూ పొర (ఫేసియా), కండరాలూ, పక్కటెముకలూ, చనుమొనల వంటివన్నీ వాటి నిర్మాణంలో భాగమే. ఇవన్నీ ఒక్కో వయసులో ఒక్కోరకమైన మార్పు చెందుతూ వస్తాయి. పాల గ్రంథులైతే హార్మోన్లకి ఎక్కువగా స్పందిస్తాయి.

నొప్పి ఎందుకంటే...
ప్రతి స్త్రీకి ఏదో ఒక వయసులో ఈ బాధ ఉంటుంది. చాలామంది ఈ నొప్పి క్యాన్సర్‌కి సంకేతం అని భయపడతారు. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైక్లికల్‌. అంటే రుతుచక్రంతో ప్రతినెలా వచ్చే నొప్పి. ఇది నెల మధ్యలో మొదలై నెలసరి సమయం వరకూ పెరుగుతూ ఉంటుంది. హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల వక్షోజాల్లోని కణాల్లో స్రావాలు ఎక్కువై, నొప్పి వస్తుంది. వక్షోజాలు కాస్త గట్టిగా అనిపిస్తాయి. ఈ నొప్పి మన శరీరధర్మంలో భాగం కాబట్టి భయం లేదు. నొప్పి నివారణ మందులు, విటమిన్‌ ఇ, ఈవెనింగ్‌ ప్రిమ్‌రోజ్‌ మాత్రల రూపంలో తీసుకోవడం, వక్షోజాలకు ఆసరా ఉండే లోదుస్తులు ధరిస్తే ఉపశమనం ఉంటుంది. నెలసరికి కొన్ని రోజుల ముందు కాఫీలూ, టీలూ, శీతలపానీయాలూ, వేపుళ్లూ తగ్గించుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. అయినా ఫలితం లేదనుకుంటే సమస్య తీవ్రతను బట్టి మూత్రవిసర్జన ఎక్కువ కావడానికి మందులూ సూచిస్తారు వైద్యులు. కొన్నిసార్లు రుతుక్రమంతో సంబంధం లేకుండా కూడా నొప్పి ఉంటుంది. రొమ్ములో స్రావాలు నిలిచిపోయి, చిన్నచిన్న నీటి బుడగల్లా తయారైనా, లేదా రొమ్ములోని పాల నాళాల్లో స్రావాలు గట్టిపడినా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్టిక్‌ డిసీజ్‌ అంటారు. ఒక్కోసారి రొమ్ముపైన సెగ్గడ్డల్లాంటివీ వస్తాయి. అప్పుడూ నొప్పి సహజం. అలాంటప్పుడు వైద్యులు పరీక్షించి కారణం తెలుసుకుని చికిత్స సూచిస్తారు.

చనుమొనల నుంచి స్రావాలు...
ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరులాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది చిక్కగా, నెత్తురులా ఉండటం, బూడిద రంగులో, చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఇటువంటి డిశ్ఛార్జి ఫైబ్రోసిస్టిక్‌ డిసీజ్‌ లేదా పాల నాళాల్లో ప్యాపిలోమా గానీ క్యాన్సర్‌గానీ ఉందనడానికి సంకేతం. మామోగ్రామ్‌ చేస్తారు. ఆ స్రావాన్ని గాజుపలకపై సేకరించి పరీక్షిస్తారు. కారణం తెలుసుకుంటారు. కొన్నిసార్లు పాలలాంటి స్రావం కూడా చనుమొనల నుంచి వస్తుంది.

గెలక్టోరియా: అంటే వక్షోజాల నుంచి పాలు స్రవించడం, పాలిచ్చేప్పుడు కాకుండా ఇతర సమయాల్లోనూ ఇలా స్రవిస్తుంటే దీనికి కొన్ని కారణాలుంటాయి. మొదటిది ప్రొలాక్టిన్‌ లేదా పాల హార్మోను ఎక్కువగా తయారుకావడం. ఇది మెదడులో ట్యూమర్లతో, లేదా మూత్రపిండాల వైఫల్యం, లేదా కొన్నిరకాల మందులు వాడటం వల్ల కావచ్చు. ఒత్తిడి నివారణకు సంబంధించిన మందులు వాడటం వల్లా కావచ్చు. ఫలితంగా ప్రొలాక్టిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఇలాంటప్పుడు నెలసరి ఆలస్యం అవుతుంది లేదా నిలిచిపోతుంది. ప్రొలాక్టిన్‌, థైరాయిడ్‌, ట్యూమర్‌ లేదని నిర్ధరించుకోవడానికి మెదడుకి సీటీస్కాన్‌ లాంటి పరీక్షలు అవసరం. ఒకవేళ వాడే మందులే కారణం అనుకుంటే వాటిని మానేయమంటారు వైద్యులు. మందులు సూచిస్తారు. ఇలాంటి స్రావాలు కనిపించగానే చాలామంది క్యాన్సర్‌ అనుకుంటారు కానీ తొంభై అయిదుశాతం పై కారణాలే ఉంటాయి.

వక్షోజాల్లో గడ్డలు...
చేతికి గడ్డలు తగులుతున్నాయని చెబుతుంటారు చాలామంది. చాలామంది పాలగ్రంథినే గడ్డ అనుకుని కంగారుపడతారు. అయితే రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రెండువేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే ఉంటాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి, పరీక్షించుకుంటే నిజంగానే గడ్డలు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఆ సందేహం ఉంటే గనుక వైద్యులు మామోగ్రఫీ సూచిస్తారు. దీన్ని అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా చేయొచ్చు. ఎక్స్‌రే ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు కూడా వ్యాధి నిర్ధరణ కాకపోతే ఎంఆర్‌ఐ చేస్తారు. నిజంగా గడ్డ ఉంటే గనుక తరవాత ఎఫ్‌.ఎన్‌.ఎ.సి. (ఫైన్‌ నీడిల్‌ యాక్టివేషన్‌ సైటాలజీ) పరీక్ష చేయించుకోమంటారు. సన్నటి సూదితో గడ్డలోని కణాలు సేకరించి వాటిని మైక్రోస్కోప్‌తో పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి బయాప్సీ చేస్తారు. బాగా అనుమానం ఉంటే గడ్డ తీసి పరీక్షిస్తారు. దానివల్ల అది క్యాన్సరా కాదా అన్నది తెలిసిపోతుంది.

సాధారణంగా చిన్నవయసులో చేతికి తగిలే గడ్డలు ఫైబ్రోఎడినోమా కావచ్చు. అవి తేలిగ్గా రొమ్ములో తగులుతాయి. చనుమొనల నుంచి ఎలాంటి స్రావాలూ విడుదలకావు. పెద్దగా ఉండి, వాటితో సమస్యలొస్తుంటే తప్ప చికిత్స అవసరంలేదు. వాటి పరిమాణం పెరుగుతూ, నొప్పీ ఉంటే గనుక శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించాలి. కొన్నిసార్లు వక్షోజాల్లోని కొవ్వంతా గడ్డకట్టి కూడా గడ్డలా తయారవుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు కూడా గడ్డలా చేతికి తగులుతుంది. అప్పుడు మాత్రం జ్వరం, గడ్డ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఆ గడ్డ గట్టిగా రాయిలా వక్షోజం లోపల అతుక్కుని ఉంటే పైన చర్మం కూడా దానికి అతుక్కుపోయి, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలూ వస్తుంటే క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

బాలింతల్లో...
పాపాయికి పాలుపట్టడం కోసం వక్షోజాలను గర్భం దాల్చినప్పటి నుంచి చనుమొనల విషయంలో శ్రద్ధ పెట్టాలి. వక్షోజాలపై చర్మానికి మాయిశ్చరైజర్‌ లేదా కొబ్బరినూనె, నెయ్యి లాంటివి రాసుకోవచ్చు. ప్రసవ సమయం దగ్గరపడుతున్నకొద్దీ చనుమొనల్లోని నాళాలు తెరచుకుని ఉన్నాయా లేదా గమనించుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే పాలివ్వడం మొదలుపెట్టాలి. లేదంటే పాలు తయారయ్యే సమయంలో రొమ్ములు బాగా గట్టిపడిపోయి, రెండుమూడు రోజులు నొప్పిగా అనిపిస్తాయి. వక్షోజాల్లో రక్తప్రసరణ ఎక్కువ కావడం, లింఫ్‌ గ్రంథుల్లో స్రావాలు పెరగడం దీనికి కారణం. ఈ సమయంలో కొందరికి బాహుమూలల్లో వాపు వచ్చేస్తుంది. ఇది సహజమైన వాపు. అలాగే చనుమొనలపై శ్రద్ధపెట్టకపోతే అవి పొడిబారి పగుళ్లు వచ్చి, బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశముంది. దాంతో విపరీతమైన నొప్పీ, వాపూ, ఎర్రబడటం, జ్వరం లాంటివి బాధిస్తాయి. ఇలాంటప్పుడు యాంటీబయోటిక్స్‌ వాడాల్సి రావచ్చు. ఆపరేషన్‌ చేసి చీము తొలగిస్తారు.

ఈ జాగ్రత్తలు అవసరం..
ప్రతినెలా నెలసరి అయిపోయిన వెంటనే వక్షోజాలను పరీక్షించి చూసుకోవాలి. ఏడాదికోసారి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉన్న స్త్రీలు ముప్ఫైఅయిదు సంవత్సరాల నుంచి, ఇతరులు నలభై ఏళ్ల నుంచి ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి.

courtesy with Dr.Y.Savithadevi@Eenadu vasundhara news paper 01/09/2014
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/