Tuesday, September 22, 2015

Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...ప్
  •  

  • Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్

జననాంగాలకు సంబంధించిన విషయాల గురించి మన సమాజంలో చక్కటి ఆరోగ్యకరమైన సమాచారం, చర్చ జరిగేదే తక్కువ. అందులో పురుషాంగం చివ్వర ఉండే ముందోలు వంటి చిన్నచిన్న నిర్మాణాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు, అందుకు ఇష్టపడరు కూడా. కానీ నిజానికి వీటికి సంబంధించిన విజ్ఞానం తెలిసి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. పురుషాంగం చివ్వర ఉండే ఈ సున్నితమైన చర్మాన్ని.. 'ముందోలు' అనీ, 'పూర్వచర్మం' అనీ (ఇంగ్లీషులో ప్రొప్యూజ్‌, ఫోర్‌స్కిన్‌).. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మగబిడ్డ పుట్టిన దగ్గరి నుంచీ పురుషుడికి మలివయసు వచ్చే వరకూ జీవితంలోని ప్రతి దశలోనూ దీనికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. చిన్న పిల్లల్లో ముందోలు బిగుతుగా ఉండి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు రావటమన్నది తరచుగా చూసేదే. అలాగే పెళ్త్లెన కొత్తలో తలెత్తేవి, శృంగార జీవితాన్ని ఉన్నట్టుండి ఇబ్బందిపెట్టే సమస్యలూ కొన్ని ఉంటాయి. ఈ నేపథ్యంలో ముందోలు గురించి, దీనికి వచ్చే సమస్యల గురించి కొంత తెలుసుకోవటం మంచిది.

పుట్టుకతో అతుక్కునే!
సాధారణంగా మగబిడ్డ పుట్టినపుడు- శిశువు అంగం ముందు భాగానికి (శిశ్నానికి), పైచర్మం అతుక్కొనే ఉంటుంది. మన వేలికి గోరు అతుక్కుని ఉన్నట్టు.. ఇంకా తేలికగా చెప్పుకోవాలంటే పుట్టగానే పిల్లిపిల్ల కనురెప్పలు అతుక్కుని ఉన్నట్టు.. శిశ్నం, దాని మీద చర్మం రెండూ అతుక్కుపోయే ఉంటాయి. పుట్టినపుడు కేవలం 4% మగ పిల్లల్లోనే ఈ ముందోలు చర్మం విడివడి కదులుతుంటుందని, సాధారణంగా మిగతా వారందరిలోనూ ఇవి అతక్కుపోయే ఉంటోందని వైద్యులు గుర్తించారు. బిడ్డ వయసు పెరుగుతున్నకొద్దీ నెమ్మదిగా శిశ్నం, దాని మీదుండే చర్మం క్రమేపీ విడివడతాయి. ఈ రెండూ పూర్తిగా విడివడితేనే.. పూర్వచర్మాన్ని వెనక్కిలాగటమన్నది (రిట్రాక్షన్‌) సాధ్యమవుతుంది. ఇవి పూర్తిగా విడివడటమన్నది 8-9 ఏళ్లకు గానీ పూర్తవదు. కొందరిలో మరి కొంతకాలం కూడా పట్టొచ్చు. కాబట్టి పూర్వచర్మానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే తప్పించి.. 8-10 ఏళ్లు వచ్చే వరకూ కూడా బలవంతంగా ఈ ముందోలును వెనక్కి లాగే ప్రయత్నం చెయ్యకూడదు. అలాంటి అవసరమేమీ ఉండదు. ఒకసారి ఈ రెండూ విడిపోతే శిశ్నం మీద పూర్వచర్మం ముందుకూ, వెనక్కూ తేలికగా కదులుతూ ఉంటుంది.

పూర్వచర్మం అనేది నిజానికి రెండు పొరల కలయిక. దీనిలో పైపొర పొడిగా, పైనుంచి వచ్చే పురుషాంగ చర్మంలాగే ఉంటుంది, లోపలి వైపు మాత్రం ఇది మృదువుగా మన కనురెప్పల్లోని, నోటిలోని జిగురుపొరల్లా ఉంటుంది. దీని నుంచి నిరంతరం కొన్ని స్రావాలు ఊరుతుంటాయి. లోపల ఎప్పటికప్పుడు ఊడి, రాలి పోతుండే మృత చర్మ కణాలూ, ఈ స్రావాలూ కలిసి.. శిశ్నం మీద తెల్లటి ముద్దలా, పెరుగు మీది తరకల్లా ఏర్పడుతుంటాయి. దీన్నే 'స్మెగ్మా' అంటారు. ఒకసారి పూర్వచర్మం విడివడి, దాన్ని వెనక్కి లాగటం సాధ్యమవుతున్న తర్వాత.. తరచుగా దాన్ని వెనక్కి తీసి, ఈ స్మెగ్మాను శుభ్రం చేసుకోవటం అవసరం. మన నాలుక కింద ఉండే కుట్టులా.. పూర్వచర్మాన్ని పురుషాంగానికి అనుసంధానిస్తూ- కిందివైపు చిన్న కుట్టు లాంటిది (ఫ్రెన్యులం) ఉంటుంది. ఈ చర్మం అవసరమైతే సాగేలా, మళ్లీ దగ్గరకు ముడుచుకునేలా ప్రత్యేక నిర్మాణాలూ ఉంటాయి. శిశ్నాన్ని కప్పుకొని ఉండే ఈ పూర్వచర్మం ముందువెనకలకు కదులుతూ.. పురుషాంగం స్తంభించినప్పుడు వెనక్కి వెళుతుంటుంది. ఇది బిగుతుగా ఉంటే సమస్యే.

పిల్లల్లో ఫైమోసిస్‌!
కొందరు పిల్లల్లో పురుషాంగం మీద ఉండే ముందోలు చాలా బిగుతుగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. దీన్నే 'ఫైమోసిస్‌' అంటారు. ఈ చర్మం బిగుతుగా ఉండటం వల్ల మూత్రం పోసుకునేటప్పుడు సమస్యలు రావచ్చు. ఈ బిగుతువల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా కొంత లోపలే ఉండిపోతుంటుంది. కొన్నిసార్లు మూత్రమార్గ రంధ్రాన్ని కూడా ఇది కప్పుకొని ఉండటం వల్ల మూత్రం ఈ చర్మం కిందకు వెళ్లిపోయి.. మూత్రవిసర్జన సమయంలో పురుషాంగం చివర బెలూన్‌లాగా ఉబ్బుతుంటుంది. అలాగే ముందోలు బిగువుగా ఉన్నవాళ్లు మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం తీసుకుంటారు. మూత్రం ధార కూడా చిన్నగా ఉంటుంది. వీళ్లు బాగా కష్టపడి విసర్జన చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ పూర్వచర్మం, శిశ్నం మధ్య మూత్రం చేరటం వల్ల ఇన్ఫెక్షన్లూ తలెత్తుతాయి. శిశ్నం వాచిపోయి 'బెలనోపాస్టయిటిస్‌' సమస్యకు దారితీయొచ్చు. అరుదుగా ఈ ఇన్ఫెక్షన్‌ మూత్ర నాళం ద్వారా పైకి పాకి మూత్రాశయం, కిడ్నీలకూ వ్యాపించొచ్చు. అందుకే పిల్లలకు పూర్వచర్మం బిగువుగా ఉండి, మూత్రవిసర్జనలో సమస్యలు ఎదురవుతుంటే సత్వరమే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అసవరం.

ఇలా మూత్ర విసర్జన సమయంలో అంగం ముందు భాగంలోని చర్మం ఉబ్బుతున్నపుడు, తరచుగా ఇన్ఫెక్షన్లు, జ్వరం వేధిస్తున్నప్పుడు, మూత్రం ధార సన్నగా వస్తున్నప్పుడు.. వైద్యులు సాధారణంగా సున్తీ చెయ్యటం అవసరమని సిఫార్సు చేస్తారు. దీనికి ముందు కొంతకాలం స్టిరాయిడ్‌ ఆయింట్‌మెంట్ల వంటివి రాసి చూడొచ్చుగానీ దీనికి సున్తీ శాశ్వత పరిష్కారం. సున్తీ ఇష్టం లేనివారికి ముందు చర్మాన్ని కొంత కత్తిరించే (స్లిట్‌) సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.

సున్తీ అనేది చిన్నపాటి సర్జరీ ప్రక్రియేగానీ దీన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయించటం మంచిది. ఈ సర్జరీకి ముందు కొన్ని రక్తపరీక్షలు, ముఖ్యంగా రక్తం గడ్డకట్టే సమయం (బ్లీడింగ్‌, క్లాటింగ్‌ టైమ్‌) వంటి పరీక్షలు చేయటం అవసరం. రక్త సమస్యలేవైనా ఉంటే సున్తీ చెయ్యకూడదు. అలాగే పిల్లలకు నొప్పి, బాధ తెలియకుండా మత్తుమందు ఇచ్చి, ముందుగా ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజక్షన్‌ ఇచ్చి సున్తీ చెయ్యాలి.

సంశయం అక్కర్లేదు..
నిజానికి మగపిల్లలకు పుట్టగానే లేదా చిన్నవయసులోనే చిన్నపాటి సర్జరీ వంటి ప్రక్రియతో ముందోలు తొలగించటమన్నది (సున్తీ) మతాచార కారణాలరీత్యా చాలా సమూహాల్లో, చాలా సమాజాల్లో పరంపరాగతంగా వస్తోంది. సున్తీ వల్ల హెచ్‌ఐవీ వంటి వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గుతోందని, పురుషాంగ క్యాన్సర్లూ రావటం లేదని వైద్యరంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ముందోలు గురించి, అసలు దీనికేదైనా ప్రాధాన్యం ఉందా? లేదా? అన్నదాని గురించీ వైద్య పరిశోధనా రంగంలోనూ, బయటా కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు దీనికి ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం లేదంటే మరికొందరు జీవపరిణామంలో ప్రాధాన్యం లేని అవయవమేదీ కొనసాగదంటూ రకరకాలుగా విశ్లేషిస్తుంటారు. మరి దేనిమీదా లేనంతటి విస్తృత చర్చ ఈ చిన్న చర్మం పొర మీద జరుగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ పూర్వచర్మం బిగుతుగా ఉండి ఇబ్బందిపెట్టటం వంటి సమస్య ఏదైనా తలెత్తినప్పుడు ముందోలును తొలగించటానికి సందేహించాల్సిన అవసరం లేదని వైద్యరంగం స్పష్టంగా సిఫార్సు చేస్తోంది.

పెద్దయ్యాకా రావచ్చు
పెద్దవయసులో ముందోలు బిగుతుగా మారి, అది ఫైమోసిస్‌ సమస్యగా తయారవటమన్నది సాధారణంగా మూడు దశల్లో ఎక్కువగా చూస్తుంటాం.

1. పెళ్త్లెన కొత్తలో. ఇది చాలా వరకూ పూర్వచర్మం బిగుతుగా ఉండటం వల్ల సంభోగ సమయంలో నొప్పి, బాధ, గట్టిగా ప్రయత్నిస్తే చర్మం చినిగి, చిట్లినట్లవటం వంటి కారణాల వల్ల వస్తుంది.

2. నడి వయసులో, అంటే 35-40 ఏళ్ల వయసులో పూర్వచర్మం ముందుకూ వెనక్కూ కదలకుండా బిగిసినట్త్లె, వాచి ఫైమోసిస్‌ రావచ్చు. ఈ వయసులో ఇలా వచ్చిందంటే చాలా వరకూ మధుమేహం వచ్చి, దాన్ని గుర్తించకపోవటమే కారణమవుతుంటుంది.

3. వృద్ధాప్యంలో. ఉన్నట్టుండి పూర్వచర్మం వాచి, బిగిసిపోయి 'ఫైమోసిస్‌' రావచ్చు. ఈ వయసులో ఇలా వస్తే అంగం చివరి నుంచి రక్తం, చీము వంటి స్రావాలు వస్తున్నాయేమో చూడటం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు పురుషాంగ క్యాన్సర్‌లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఏ వయసులోనైనా పూర్వచర్మం కదలటం కష్టంగా తయారై, బాధలు మొదలైతే దాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం ఉత్తమం.

యుక్తవయసులో
కొందరికి యుక్తవయసు వచ్చిన తర్వాత కూడా పూర్వచర్మం, అది తెరుచుకునే మార్గం సన్నగా ఉంటుంది. దీంతో పెళ్లయ్యాక శృంగారంలో పాల్గొన్నప్పుడు.. చర్మం బలంగా వెనక్కి లాగినట్త్లె.. ఆ సున్నితమైన చర్మం చిరిగి, గాట్లు పడుతుంది. కొందరికి అంగం మామూలుగా ఉన్నప్పుడు చర్మం తేలికగానే వెనక్కి వస్తున్నప్పటికీ.. స్తంభించినప్పుడు అంగం పరిమాణం పెరిగి చర్మం వెనక్కి రావటం కష్టమవుతుంటుంది. దీంతో చర్మం చిరిగినట్త్లె రక్తస్రావం అవుతుంది. క్రమేపీ ఇది మానిపోవచ్చుగానీ ఆ మానిన చోట చర్మం కొంత బిగువుగా ఉంటుంది. దీంతో ఆ తర్వాత మళ్లీ వెనక్కిలాగినప్పుడు అదే ప్రదేశంలో మళ్లీ చినుగుతుంటుంది. ఇలా తరచూ చిట్లటం, మానటం జరుగుతూ.. ఇదో ఇబ్బందికర వ్యవహారంగా తయారవుతుంది. యుక్తవయసులో, ముఖ్యంగా పెళ్త్లెన కొత్తలో, శృంగారంలో పాల్గొన్నపుడు ఈ సమస్య బాగా బాధిస్తుంటుంది. కొందరికి అసలు ముందోలు వెనక్కే రాకపోవచ్చు, మరికొందరికి కొంత భాగమే వెనక్కి వచ్చి, తరచూ చిరుగుతుండొచ్చు.

చికిత్స: పూర్వచర్మం బిగుతుగా ఉంటే.. రోజూ దాన్ని నెమ్మదిగా, కొద్దికొద్దిగా వెనక్కిలాగేందుకు ప్రయత్నించటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కొందరికి వైద్యులు స్టిరాయిడ్‌ క్రీములు ఇచ్చి.. రోజూ రెండుమూడుసార్లు పూర్వచర్మం మీద రాస్తుండమని చెబుతారు. దీనివల్ల చర్మం పల్చబడి, మృదువుగా వెనక్కిలాగటం తేలికయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరి విషయంలోనూ ఈ క్రీములతో అంత ఉపయోగం ఉండకపోవచ్చు. వీరికి చిన్న సర్జరీ చేసి, పూర్వచర్మాన్ని తీసెయ్యటం (సున్తీ) తేలికైన పరిష్కారం. పాశ్చాత్య దేశాల్లో కొందరు పూర్వచర్మాన్ని తీసేయించుకోవటానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి 'ప్రొప్యూజియోప్లాస్టీ' లేదా 'వై-వీ ప్లాస్టీ' వంటివి చేసే అవకాశం ఉంటుందిగానీ వీటితో ఫలితాలు అంత సహజంగా కనిపించకపోవచ్చు. సున్తీ అనేది సాధారణంగా అక్కడే మత్తు ఇచ్చి చేసేస్తారు, చాలా తేలికైన సురక్షితమైన పద్ధతి, కొద్ది గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. కాకపోతే దీనితో ఉండే ఒకే సమస్య ఒకట్రొండు రోజులు కొంత నొప్పి ఉండొచ్చు. ముఖ్యంగా అప్పటి వరకూ పూర్వచర్మం కింద ఉండిపోయిన శిశ్నం- ఒక్కసారిగా బయటపడినట్లయ్యే సరికి కొద్దిరోజులు అది సున్నితంగా అనిపిస్తూ, ఏది తగిలినా జివ్వుమనటం, బట్టలు వేసుకోవటం కష్టం కావటం వంటి ఇబ్బందులుండొచ్చు. ఇది 5-7 రోజుల్లో దానంతట తగ్గిపోతుంది. ఈ లోపు శిశ్నం మరీ సున్నితంగా అనిపించకుండా, కాస్త మొద్దుబారినట్లయ్యేందుకు దాని పైనరాసే క్రీముల వంటివి ఇస్తారు.

పెళ్త్లెన కొత్తలో కుట్టు తెగితే...
* పెళ్త్లెన కొత్తలో తరచుగా చూసే సమస్య ముందోలుకు కిందగా ఉండే చిన్న కుట్టు తెగిపోవటం. కొందరికి ఇది మరీ చిన్నగా, బిగుతుగా ఉండి.. పెళ్త్లెన కొత్తలో సంభోగానికి ప్రయత్నించగానే అది చినిగినట్త్లె నొప్పి బాధతో పాటు దాన్నుంచి కొద్దిగా రక్తం కూడా వస్తుంటుంది. ఇలా ఫ్రెన్యులం చినిగి, ఇబ్బందిగా ఉన్నవాళ్లు సంభోగ సమయంలో కదలికలు మృదువుగా ఉండేందుకు లూబ్రికెంట్ల వంటివి (కేవై జెల్లీ, లూబిజెల్‌ లేదంటే మామూలు కొబ్బరినూనె అయినా సరే) వాడటం మంచిది. ఫ్రెన్యులం పొట్టిగా ఉండి, సరైన స్రావాలు లేకుండా సంభోగానికి ప్రయత్నిస్తే అదిచినిగే, తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెగినది దానంతట అదే మానుతుంది, అప్పటి వరకూ సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. ఒక వారం పది రోజులకు అది మానిపోతుంది, అప్పుడు లూబ్రికెంట్‌ వాడుకుంటూ మళ్లీ సంభోగానికి ప్రయత్నించొచ్చు. మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తి.. కుట్టు దగ్గర తరచూ చినుగుతుంటే మాత్రం- వీరికి ఇతరత్రా ముందోలు బిగువుగా ఉండటం వంటి సమస్యలేమీ లేకపోతే వైద్యులు 'ఫ్రెన్యులోప్లాస్టీ' అనే చిన్న సర్జరీ చేసి, ఆ కుట్టును తిరిగి దగ్గరకు లాగి సరిచేస్తారు.

బిగిసిపోతే...
* కొత్తగా పెళ్త్లెన వారిలో చాలా తరచుగా చూసే మరో సమస్య... ముందోలు కొంత బిగువుగా ఉండి, సంభోగ సమయంలో అది వెనక్కివచ్చి అక్కడే ఒక రింగులా బిగిసిపోవటం! దీన్నే 'పారా ఫైమోసిస్‌' అంటారు. ఇలా బిగిసిన దాన్ని ముందుకు లాగటం చాలా బాధాకరంగా, కష్టంగా తయారవుతుంది. దీంతో చాలామంది నొప్పికి భయపడి, దాన్ని రెండు-మూడు రోజుల పాటు అలాగే వదిలేస్తారు. ఇది చాలా ఇబ్బందిపెట్టే సమస్య. దీన్ని సాధ్యమైనంత త్వరగా.. అంటే సంభోగం తర్వాత అరగంట లోపైనా మెల్లగా ముందుకు తేవటం మంచిది. అలా చెయ్యకుండా వదిలేస్తే ఆ చర్మం వాచిపోతుంది. ఆ స్థితిలో దాన్ని ముందుకు లాగటం మరీ కష్టం, వదిలేస్తేనేమో వాపు ఇంకా పెరుగుతుంటుంది. రింగులా తయారై ఈ చర్మం వాచినకొద్దీ శిశ్నం మీదా ఒత్తిడి పెరిగి, అదీ వాచిపోవటం ఆరంభమవుతుంది. కొన్నిసార్లు ఆ రింగులాంటి చర్మానికి రక్తసరఫరా తగ్గిపోయి, అది పుండులా తయారవటం వంటివీ జరుగుతాయి. ఈ స్థితిలో సాధ్యమైనంత త్వరగా పూర్వచర్మాన్ని ముందుకు లాగటం ముఖ్యం. అవసరమైతే వైద్యులు ఆ కాస్త ప్రదేశానికీ మత్తు ఇచ్చి అయినా.. దాన్ని ముందుకు తెస్తారు. మరీ ఇబ్బందిగా ఉంటే చిన్న కోతబెట్టి దాన్ని వదులు చెయ్యాల్సి వస్తుంటుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారికి అవసరమైతే ఆ వాపు, బాధలన్నీ తగ్గిన తర్వాత సున్తీ చేస్తారు.

మధ్యవయసులో..
35-40 ఏళ్ల వయసులో ఈ ముందోలు వాపు, నొప్పి, బిగిసిపోవటం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే 'బెలనోపాస్టయిటిస్‌' అంటారు. ఇలా వస్తే మనం తక్షణం చెయ్యాల్సిన పని- మధుమేహం ఉందేమో పరీక్ష చేయించుకోవటం! ఎందుకంటే మధుమేహుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చాలామందిలో మధుమేహం తొలిసారిగా ఇలాగే బయటపడుతుంటుంది కూడా. మధుమేహుల మూత్రంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ మూత్రం పూర్తిగా బయటకు వెళ్లకుండా కొంత లోపలే చేరటం వల్ల ఈ ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అయితే నొప్పి, ఎర్రగా వాచిపోవటం వంటి లక్షణాలుంటాయి. యాంటీబయోటిక్స్‌ చికిత్సతో ఇది తగ్గుతుంది. కొందరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా క్యాండిడ్‌ వల్ల వచ్చేవే ఎక్కువ. దీని లక్షణం ప్రధానంగా దురద. పెరుగు తరకల్లా తెల్లటి స్రావం వెలువడుతుంటుంది. పెళ్త్లెన వారిలో, ముఖ్యంగా మధుమేహులకు ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎవరికైనా సరే, మధ్య వయసులో 'ఫైమోసిస్‌' వస్తే ముందుగా గ్లూకోజు పరీక్ష చేయించుకొని, మధుమేహం ఉందేమో చూసుకోవాలి. వైద్యులు యాంటీబయాటిక్స్‌ లేదా యాంటీఫంగల్‌ మందులు సిఫార్సు చేస్తారు, వీటితో సమస్య తగ్గిపోతుంది. ఆ తర్వాత మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుని, రోజూ పురుషాంగ శుభ్రత పాటిస్తే ఇబ్బంది మళ్లీ రాకపోవచ్చు. వీరికి చాలావరకూ సున్తీ అవసరం కూడా ఉండదు. అలా కాకుండా తరచూ ఈ సమస్య ఎదురవుతూ, యాంటీబయాటిక్స్‌ వాడాల్సి వస్తుండటం, మధుమేహం నియంత్రణలో ఉన్నా కూడా ఇన్ఫెక్ఫన్లు రావటం వంటి సందర్భాల్లో వీరికీ సున్తీ చెయ్యటం మంచిది.

తెల్లబడిపోవటం
ముందోలు విషయంలో తరచుగా చూసే మరో సమస్య 'బెలనైటిస్‌ జెరోటికా ఒబ్లిటరాన్స్‌ (బీఎక్స్‌వో)'. ముందోలు చర్మమంతా తెల్లగా తయారై ఇబ్బంది మొదలవుతుంది. మూత్రంలో ఉండే అమ్మోనియా ఎప్పుడూ తగులుతుండటం వల్ల ఈ చర్మం చికాకుకు గురై, ముందోలు, శిశ్నం తెల్లగా తయారవుతాయి. దీనివల్ల పూర్వచర్మం బిగుతుగా కూడా తయారై ఫైమోసిస్‌ రావచ్చు. ముఖ్యంగా తరచూ అమ్మోనియా తగలటం వల్ల మూత్రమార్గం సన్నబడిపోవచ్చు. ఇలాంటివారికి సున్తీ చేసి ముందోలు తీసేస్తేనే అయిపోదు, సన్నబడిన మూత్రమార్గాన్ని కొద్దిగా వెడల్పు కూడా చెయ్యాల్సి (డైలేషన్‌) రావచ్చు.

వృద్ధుల్లో..
ఎవరికైనా- అప్పటి వరకూ ఎలాంటి సమస్యా లేకుండా అంతా బానే ఉండి, వృద్ధాప్యంలో ఉన్నట్టుండి పూర్వచర్మం బిగిసిపోయిందంటే వెంటనే మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దేశంలో పురుషాంగ క్యాన్సర్‌ ఎక్కువ. వృద్ధాప్యంలో పూర్వచర్మం బిగిసిపోవటంతో పాటు పురుషాంగం నుంచి రక్తం లేదా చీములాంటిది వస్తుంటే ముందుగా క్యాన్సర్‌ను అనుమానించాలి. శిశ్నం మీద కణితి ఏర్పడితే సైజు పెరుగుతుంది కాబట్టి ముందోలు వెనక్కి రావటం కష్టమవుతుంది. చిన్నప్పుడు సున్తీ చేయించుకున్నవారికి పురుషాంగ క్యాన్సర్‌ రావటం అరుదు. కానీ ఇలాంటి ఆచారం లేనివారిలో సరైన పరిశుభ్రత పాటించకపోవటం, హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ల వంటివి పురుషాంగ క్యాన్సర్‌కు దోహదం చేస్తాయి. ఇది ప్రధానంగా అంగ శుభ్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి మన దేశంలో ఇది కొంత ఎక్కువగానే కనబడుతోంది. అందువల్ల వృద్ధాప్యంలో హఠాత్తుగా ముందోలు బిగుసుకుపోతే క్యాన్సర్‌ను అనుమానించాలి. ఇలాంటివారిలో శిశ్నాన్ని పట్టుకొని చూస్తే చేతికి గట్టిగా తగలటం గమనించొచ్చు. అనుమానం వస్తే బయాప్సీ చేసి క్యాన్సర్‌ను నిర్ధరిస్తారు. వీరికి సున్తీ చేస్తే పుండు మానటం వంటివన్నీ కష్టమవుతాయి కాబట్టి పూర్వచర్మం మీద 'డోర్సల్‌ స్లిట్‌' అనే పద్ధతిలో చిన్న కోత పెట్టి లోపల ఏముందో చూస్తే కణుతుల వంటివి ఉంటే కనబడతాయి. వాటి నుంచి అవసరమైతే ముక్క తియ్యటం, లేకుంటే కొన్నిసార్లు సున్తీ చేసి, ఆ పూర్వ చర్మాన్ని పరీక్షకు పంపించటం వంటివి చెయ్యాల్సి ఉంటుంది.
శుభ్రత ప్రధానం
చిన్నపిల్లల్లో ముందోలును బలవంతంగా వెనక్కి లాగాల్సిన పనిలేదు. వయసుతో పాటు దానంతట అదే వదులవుతుంది. అది వెనక్కి వస్తున్న పిల్లలు, పెద్దలంతా కూడా ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు ఒక్కసారి పూర్వచర్మాన్ని వెనక్కి తీసి, శిశ్నాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవటం అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే దీన్ని అలవాటుచెయ్యటం మంచిది. దానివల్ల సమస్యలు చాలా వరకూ రావు.


--డా .హనుమంతరావు , పిడియాట్రిక్ సర్జెన్‌ ,జనరల్ హాస్పిటల్ , కర్నూల్ .
--డా.కె.సుభ్రమణ్యం ,యూరోలజిస్ట్ ,అపోలో హాస్పిటల్ , హైదరాబాద్ 
  •  ==================================

3 comments:

  1. sir, telugu lo chala chakkaga artamayyelaga wrasharu sir ,yukta vayassu pillalaku ,kottaga pelleyinavariki chala chala chitanyam vache tattuluga vundi

    ReplyDelete
  2. సార్ నాకు 10yeers vunapudu nundi eppativaraku.ఇపుడునాకు 21yeers na pennice nu chetito రోజుకి రెండు సార్లు చేసుకుని త్రుప్తి పరుచుకునె వాని ఇపుడు చిన్నగా..మెత్తగా.. నరాలు తేలి.sex చేసేటపుడు .తొందరగా పోతవున్ది నకుపేల్లైన్ది.1yeer ; పిల్లలు పుట్టలేదు నేనుఏమిచేయలి ఏమిమన్దులు వాడాలి ప్లీజ్ సార్ చెప్పండి www.ramasri213@gmail.com

    ReplyDelete
  3. NICE POST!

    If you would like to have bigger size, there Is A GREAT “ Buy 1 Get 1 Free Offer ” For Prolargent Size, The BEST Male Enhancement Product: BUY 1 GET 1 FREE
    ORDER NOW !!

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.