Sunday, July 17, 2016

Fasting , ఉపవాసం.. లాభ - నష్టాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Fasting , ఉపవాసం.. లాభ - నష్టాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  •  

  • Fasting , ఉపవాసం.. లాభ - నష్టాలు


ఒక క్రమం ప్రకారం ఉపవాసం చెయ్యటం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలున్నాయని ఇటీవలి కాలంలో వైద్యపరిశోధనా రంగం బలంగా విశ్వసించటం ఆరంభించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలూ కొత్తవిషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

ఉపవాసం..

 ఈ అనాది అలవాటుకు ఇప్పుడు శాస్త్ర పరిశోధనలూ అండగా నిలబడుతున్నాయి. ఉపవాసం ఒంటికి మంచిదనీ, లంఖణం పరమౌషధమనీ చాలాకాలంగా వింటూనే ఉన్నాం. ముప్పూటలా సుష్ఠుగా తినే వారికంటే ‘అర్థాకలితో ఉండే వారికి ఆయుర్దాయం ఎక్కువని’ చెప్పుకోవటమూ తెలిసిందే. అయితే ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా క్రమేపీ ఈ భావనలకు బలం చేకూరుస్తుండటం తాజా విశేషం. రోజులోనో, వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల (దీన్నే వైద్యపరిభాషలో ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ - ఐఎఫ్‌’ అంటున్నారు) శరీరంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు ఇటీవలి కాలంలో నిర్ధారణకు వస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని విఖ్యాత నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) పరిశోధకులు ఈ విషయంలో కొద్ది సంవత్సరాలుగా విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు. విఖ్యాత జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో న్యూరోసైన్స్‌ విభాగాధిపతిగానూ, అలాగే ఎన్‌ఐహెచ్‌లోని న్యూరోసైన్స్‌ ల్యాబొరేటరీ విభాగాధిపతి డా॥ మార్క్‌ మ్యాట్‌సన్‌ సారధ్యంలోని పరిశోధక బృందం దీనిపై స్వయంగా జంతువులపైనా, మనుషులపైనా పరిశోధనలు, అధ్యయనాలు చెయ్యటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చాలా అధ్యయన పత్రాలను కూడా పరిశీలించి.. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.

ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలూ తగ్గుతున్నాయని వీరు క్రమేపీ గుర్తిస్తున్నారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో- ఉపవాసం వల్ల వాటి ఆయుర్దాయం పెరగటమే కాకుండా నాడీమండల వ్యాధులూ, ముఖ్యంగా ఆల్జిమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి వ్యాధులు దరిజేరే అవకాశాలూ తగ్గుతున్నాయని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌’ పరిశోధనల్లో వెల్లడవటం విశేషం.

చాలామంది ఒకపూట ఆహారం తీసుకోకపోతే డీలాపడిపోతామని భావిస్తుంటారుగానీ వాస్తవానికి మనం తీసుకునే ఆహారం ఇప్పటికిప్పుడే శక్తిగా మారిపోయి, మనకు వెంటనే అందుబాటులోకి రాదు. మనం తిన్న ఆహారం రెండుమూడు గంటల్లో జీర్ణమై, రక్తంలో కలిసి ప్రయాణించి, కాలేయంలో గానీ, కండరాల్లో గానీ కొవ్వులా నిల్వ ఉంటుంది. ఎలాగంటే ఆహారంలోని పిండి పదార్ధాలు గ్లూకోజుగా మారి, రక్తంలోకి వెళ్లి కాలేయంలో గానీ, కండరాల్లో గానీ గ్లైకోజెన్‌గా నిల్వ ఉంటాయి. అలాగే కొవ్వు పదార్ధాలు ఫ్యాటీ ఆమ్లాలుగా మారి, అంతిమంగా ట్రైగ్లిజరైడ్లగానో, కొలెస్ట్రాల్‌గానో మారతాయి. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా మారి, రక్తంలోకి వెళ్లి రకరకాల ప్రోటీన్లుగా మారతాయి. ఇలా మనం తీసుకున్నవన్నీ రకరకాల రూపాల్లో మారి, శరీరంలో నిల్వ ఉంటాయి. దీన్ని ‘పోస్ట్‌ అబ్జార్బిటివ్‌ ఫేజ్‌’ అంటారు. ఇలా నిల్వ ఉంచుకున్న వాటినే మన శరీరం శక్తి అవసరాలకు వాడుకుంటుంంది. కాబట్టి కొన్ని గంటల పాటు మనం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే- మన శరీరం తన శక్తి అవసరాల కోసం కండరాల్లో, కాలేయంలో, కొవ్వులో అప్పటికే దాచుకున్న నిల్వలను కరిగించుకోవటం మీద ఆధారపడటం మొదలుపెడుతుంది. కాబట్టి శక్తి లభ్యతకు ఇబ్బందేమీ ఉండదు. రెండోది- ఉపవాసం ఆరంభమై, శరీరానికి ఆహార లభ్యత ఆగిపోగానే మెదడు దాన్నొక సవాల్‌గా స్వీకరిస్తుంది. వెంటనే ఈ ఒత్తిడి పరిస్థితిని నెగ్గుకొచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకునే క్రమంలో ఒంట్లో వ్యాధుల ముప్పు తగ్గించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధనల్లో గుర్తించారు. మెదడులో ప్రోటీన్ల తయారీ మెరుగై, నాడీకణాల్లో మైటోకాండ్రియా కూడా పెరుగుతూ, నాడీకణాల మధ్య సంబంధాలూ మెరుగవుతున్నాయి. దీనివల్ల మెదడు పనితీరు, విషయగ్రహణ శక్తి మెరుగవ్వటమే కాదు, పార్కిన్సన్స్‌, ఆల్జిమర్స్‌ వంటి వ్యాధుల ముప్పూ తగ్గుతోందని డా॥ మాట్‌సన్‌ బృందం నిర్ధారణకు వచ్చింది.

వైద్య పరిశోధనా రంగం ఈ ఉపవాసం (ఐఎఫ్‌) అనేది ఎలా చేస్తే ఫలితాలు బాగుంటున్నాయన్న దానిపై ఇంకా ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేదనే చెప్పాలి. ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవటంమంచిదన్నది ప్రామాణికమైన సిఫార్సు. అందులో తేడా ఏమీ లేదు. రోజూ అలా పాటిస్తూ, మధ్యమధ్యలో ఒక రోజు 6, 12, 24.. ఇలా కొన్ని గంటల పాటు ఆహారం మానెయ్యటం లేదా వారంలో రెండు రోజులు బాగా తగ్గించెయ్యటం వరకూ.. రకరకాలుగా అధ్యయనాలు చేస్తున్నారు. మొత్తమ్మీద వారంలో 5 రోజులు సాధారణ ఆహారం తీసుకుంటూ 2 రోజులు చాలా పరిమితంగా తీసుకునే ఉపవాస విధానం (దీన్నే ‘5:2 డైట్‌’ అంటున్నారు) ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తోంది. ఉపవాసం ఉంటున్న రోజుల్లో కూడా పూర్తిగా నోరు కట్టేసుకోకుండా... రోజువారీ తినేదానిలో పావు భాగం (25% లేదా సుమారుగా 600 క్యాలరీలు) మాత్రమే ఆ రోజంతా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రోజులో కొన్ని గంటల నుంచి వారంలో రెండు రోజుల వరకూ.. ఉపవాసం ఎలా చెయ్యాలన్నది ఎవరి వెసులుబాటుకు తగ్గట్టుగా వాళ్లు నిర్ణయించుకోవటం మంచిదన్నది పరిశోధకుల భావన. అయితే ఉపవాసం ఎప్పుడు చేసినా ఒకే క్రమంలో, పద్ధతి ప్రకారం చెయ్యటం మాత్రం అవసరం. ఆహారాన్ని మానెయ్యటంలో కూడా ఒక క్రమాన్ని పాటించాలన్నది అందరూ చెబుతున్న విషయం. అలాగే ఉపవాస సమయంలో ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం కూడా ముఖ్యమే.

ఉపవాసం మూలంగా రక్తంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు ప్రక్రియల సూచికలు తగ్గుతున్నట్టు.. ఇవి వృద్ధాప్యం, వృద్ధాప్యంతో ముంచుకొచ్చే సమస్యల ముప్పు తగ్గుతుందనటానికి నిదర్శనాలని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో ఇన్సులిన్‌, గ్లూకోజు స్థాయులు.. క్యాన్సర్లను తెచ్చిపెట్టే గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 1 (ఐజీఎఫ్‌-1) స్థాయులు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. అందువల్ల ఉపవాస పద్ధతి క్యాన్సర్‌ నివారణకూ మెరుగైన విధానంగా ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.తేలికగా ఉపవాసం
* మొదట్లో ఆహారం ఏకబిగిన అరపూట, పూట మానేసే కంటే కొద్ది గంటల పాటు మానేస్తూ క్రమేపీ శరీరానికి అలవాటు చెయ్యటం మంచిది.

* ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం తేలికగా ఉంటే మంచిది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తేలికపాటి మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం ముగిస్తున్నామని ఆబగా తినెయ్యకుండా.. మిగతా రోజుల్లో ఎలా తీసుకుంటారో ఆ రోజూ అలాగే తినాలి.

* పని ఎక్కువగా ఉన్న రోజున ఉపవాసం పెట్టుకుంటే మనసులో రోజంతా తిండి గురించే ఆలోచించటమన్నది తగ్గిపోతుంది.

* ఉపవాసం రోజున తేలికపాటి, ఉల్లాసభరితమైన పనులు చెయ్యటం వల్ల శరీరం, మనుసూ.. రెండూ తేలికపడతాయి.

* ఒకవేళ ఆహారం కోసం తహతహ ఆరంభమైతే కొద్దిదూరం నడకకు వెళ్లటమో.. మిత్రులతో మాటలు కలపటమో.. టీవీ చూడటమో.. ఇలా ఏదో ఒకటి చేసి తిండి మీంచి మనసు మళ్లించటం మంచిది.

* ఉపవాస సమయంలో నీరు, ద్రవాహారం మాత్రం దండిగా తీసుకోవాలి. ఒంట్లో నీరు తగ్గకూడదు. అయితే తీపి పానీయాలు, చక్కెర వేసిన కాఫీ టీలకు దూరంగా ఉండాలి.

* ఎంత ప్రయత్నించినా ఇక తినకుండా ఉండలేమని అనిపించినప్పుడు.. మొండిగా అలాగే ఉండిపోకుండా తేలికపాటి ఆహారం తీసేసుకోవటం ఉత్తమం.

* ఇలా నాలుగైదు వారాలు ప్రయత్నించే సరికి శరీరం ఉపవాసం, ఆ కొత్త దినచర్యకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఉపవాసం ఉల్లాసంగా గడుస్తుంది.

వీరు వద్దేవద్దు
చిన్నపిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, మధుమేహలు... వీరంతా ఉపవాసాలు చెయ్యకూడదు. అలాగే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నవారు కూడా వైద్యులతో చర్చించిన తర్వాతే ఉపవాసం గురించి ఆలోచించాలి.

మధుమేహులకూ వద్దు! ఎందుకంటే...

మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అంటారు. పిండిపదార్ధాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్ధాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్ధాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్‌, ఎసిటాల్డిహైడ్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్ధాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్‌ బోడీస్‌’ అంటారు. శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, వూపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి.

-- Dr.P.V.Rao ..director ,Diabetes research center ,Ramdeo rao Hospital Kukatpalli , Hyderabad.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. Good information on your blog.. About the Eye Surgery is critical subject to my body. But latest technology is very helpful and successful for the hospitals. This technology is very costly so my country is former country. He does not offer table this costly surgery. But Dr.Rajeev Hardia Eye Surgery in indore provided this surgery is very low cost. They have very Well knowledgeable and experienced “Doctors” in these hospitals.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.