'పొట్ట' ఓ సంశయాల పుట్ట! ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది. మరోపూట తిన్నది అరిగినట్టనిపించదు. ఒక్కోరోజు ఎందుకో బరువుగా బిగువుగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏదో మెలితిప్పుతున్నట్టు బాధ. లేదంటే లోపల ఏదో గడబిడ. విరేచనాలు పట్టుకుంటాయి. ఇలా పొట్టలో వచ్చే ప్రతి మార్పూ.. ఎందుకో, ఏమిటో అర్థంకాక మనసును విపరీతంగా తొలుస్తుంది. చిన్నాచితకా నొప్పులూ, బాధలూ.. సంశయాలూ, సంకోచాలూ సహజమే! వాటి గురించి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పని లేకపోవచ్చు. కానీ కొన్నిసార్లు పొట్టలో మొదలయ్యే ఉపద్రవాలు.. ఎంతకీ వీడకుండా వేధిస్తూనే ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించటానికి లేదు. ముఖ్యంగా దీర్ఘకాలం విరేచనాలు వేధిస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.
విరేచనాలు, కడుపు నొప్పి వంటి బాధలు దీర్ఘకాలం వేధిస్తున్నాయంటే పేగుల్లో తలెత్తుతున్న ఇబ్బందికర మార్పులేవో దానికి కారణం కావచ్చు. ముఖ్యంగా పెద్దపేగుల్లో తలెత్తే వాపు, పూత వ్యాధులు ఇటువంటి బాధలనే తెచ్చిపెడతాయి. వీటినే 'ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్' అంటారు. ఒకప్పుడు కచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక వీటిని 'అమీబియాసిస్' వంటి సమస్యలుగా భావించి ఏవేవో వైద్యాలు చేసేవారు. మన పొట్ట లోపల ఏం జరుగుతోందో, సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో పరిశీలించే వెసులుబాటు లేని రోజుల్లో ఈ రోగులు అనుభవించిన ఆవేదనకు అంతులేదు.
కానీ.. ఇప్పుడీ పరిస్థితి సమూలంగా మారిపోయింది. మన పొట్ట ఏమాత్రం మిస్టరీల పుట్ట కాదు! సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంటరోస్కోప్, క్రోమో ఎండోస్కోపీ వంటి వాటితో మన పేగులను ఆమూలాగ్రం, అణువణువూ క్షుణ్ణంగా పరీక్షించే సదుపాయం ఉందిప్పుడు. ఫలితంగానే పెద్దపేగుల్లో పూత, వాపు, పుండ్లు, క్షయ వంటి సమస్యలను ఇప్పుడు కచ్చితంగా నిర్ధారించి వైద్యం చెయ్యటం సాధ్యపడుతోంది. వైద్యరంగం సాధించిన అత్యాధునికమైన పురోగతి ఇది.
ఎవరికైనా సరే... 30 రోజులకు మించి విరేచనాలు వేధిస్తున్నాయంటే సమస్య కాస్త మొండిగా, దీర్ఘకాలికంగా మారిందని అర్థం. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా లోతుగా పరిశీలించటం చాలా అవసరం. ఒకప్పుడు ఈ దీర్ఘకాలిక విరేచనాల వంటి సమస్యలకు 'అమీబియాసిస్' వంటివి కారణమవుతున్నాయని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో పేగులను క్షుణ్ణంగా పరీక్షించటానికి అవసరమైన ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావటంతో దీర్ఘకాలికంగా విరేచనాల సమస్యలతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మందిని పరిశీలించినప్పుడు వారికి పేగు పూత, వాపు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్) ఉంటోందని బయటపడుతోంది. పేగుల్లో క్షయ కూడా ఎక్కువగానే కనబడుతోంది.
పెద్దపేగు పూత, వాపు రకరకాలుగా, ఎన్నో రూపాల్లో ఉండొచ్చు. పెద్దపేగు లోపలి గోడలు ఎర్రగా వాచి.. పూసినట్లవటం, పుండ్లు పడటం.. వాటి నుంచి రక్తస్రావం అవుతుండటం.. వీటన్నింటినీ కలిపి పూత వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్)గా పరిగణిస్తారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రకాలు. 1. అల్సరేటివ్ కోలైటిస్. దీనిలో పేగుల్లో పూత, వాపుతో పాటు పేగుల గోడలకు పుండ్లు కూడా పడుతుంటాయి. కానీ ఇది చాలా వరకూ పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది. 2. క్రాన్స్ వ్యాధి. దీనిలో ప్రధానంగా కనబడేది పేగుల్లో పూత, వాపు. ఇది పేగుల్లో ఎక్కడైనా రావచ్చు. ఇక ఈ రెండూ కాకుండా పేగుల్లో క్షయ (టీబీ) కూడా రావచ్చు. వీటన్నింటిలోనూ కూడా ముఖ్యంగా కనిపించే లక్షణాలు.. కడుపు నొప్పి, దీర్ఘకాలం విడవకుండా వేధించే విరేచనాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే పేగులు దెబ్బతిని.. తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. కాబట్టి విడవకుండా విరేచనాలు వేధిస్తుంటే తప్పనిసరిగా ప్రత్యేక నిపుణులైన వైద్యులను సంప్రదించి మరిన్ని పరీక్షలు చేయించుకుని, సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేయించుకుని, చికిత్స తీసుకోవటం అవసరం.
.
లక్షణాలేమిటి?
* విరేచనాలు, రక్తం పడటం
* కడుపు నొప్పి
* జ్వరం, తీవ్ర అలసట
* బరువు తగ్గిపోవటం
* ఆకలి మందగించటం
* మలద్వారం చుట్టుపక్కల పుండ్లు
చాలామందిలో ఈ లక్షణాలు ఓ మోస్తరుగానే ఉంటాయి. కొద్దిమందిలో మాత్రం తరచూ జ్వరం, రక్తంతో కూడిన విరేచనాలు, వికారం, భరించరాని కడుపు నొప్పి ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్‌లో విరేచనాల బాధ ఎక్కువ, క్రాన్స్ డిసీజ్‌లో కడుపునొప్పి బాధ ఎక్కువ.
పేగులకే పరిమితమా?
ఎందుకలా జరుగుతుందో ఇప్పటి వరకూ స్పష్టమైన కారణం తెలియదుగానీ.. పేగుల్లో వాపు, పూత మొదలైనప్పుడు దీనివల్ల ఒంట్లోని ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమవుతున్నాయని వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా:
* కళ్లు ఎర్రబడి వాచటం, నొప్పి, అరుదుగా చూపు మందగించటం
* చర్మం మీద నొప్పితో బుడిపెలు, లేదంటే లోతుగా పుండ్లు పడటం
* మోకాలు కీళ్లు, వెన్నుపూసలకు ఆర్త్థ్రెటిస్ రావచ్చు. ముఖ్యంగా 'ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్' రకం వెన్ను బాధలు, ఎముకలు బోలుగా తయారయ్యే ఆస్టియోపొరోసిస్ ఎక్కువ..
* పైత్యరస నాళం మూసుకుపోవటం వంటి కొన్ని రకాల లివర్ సమస్యలు.
* ఈ పేగుల్లో వాపు, పూత బాధితుల్లో రక్తహీనత, కిడ్నీల్లో రాళ్ల బాధ ఎక్కువగా కనబడుతున్నాయి.
ఎందుకొస్తుందీ పూత?
పేగులకు వాపు, పూత వ్యాధులు ఎందుకు వస్తాయో కచ్చితంగా చెప్పటం కష్టం. జన్యుపరంగా, వంశంలో ఇంతకు ముందు ఉన్నవారికి రావచ్చు. ముఖ్యంగా క్రాన్స్ వ్యాధి ఇలా జన్యుపరంగా వచ్చేరకం. తల్లిపాలు లేకుండా పోతపాల మీద పెరగటం, రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పేగుల మీద దాడి చెయ్యటం, పేగుల్లో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి రసాయనాల స్థాయులు ఎక్కువగా ఉండటం.. ఇటువంటివన్నీ దోహదం చేస్తుండవచ్చని భావిస్తున్నారు. కచ్చితమైన కారణం తెలియదు కాబట్టి ఈ పూత వ్యాధులు రాకుండా ముందే నివారించుకోవటం కష్టం.
పరీక్షలు ఎందుకు?
కొంత కాలంగా విడవకుండా విరేచనాలు అవుతున్నప్పుడు లోతుగా పరీక్షించాల్సిన అవసరం ఏమిటి? అన్నది కీలకమైన ప్రశ్న. ఆ విరేచనాలకు కారణం పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటివి కారణమా? అన్నది ముందే గుర్తిస్తే వెంటనే చికిత్స ఆరంభించి అవి ముదిరిపోకుండా చూడొచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రతరం కావటమే కాకుండా.. పేగులు మూసుకుపోవటం, లేదా పేగులు సన్నబడిపోవటం, ఆపరేషన్ చేసి పేగుల్లో ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కొన్నిసార్లు పెద్దపేగుల్లో ఈ పూత వ్యాధులు క్యాన్సర్‌కు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు. కాబట్టి వీటిని సత్వరమే గుర్తించి, ముదరకుండా నియంత్రించటం చాలాచాలా అవసరమని గుర్తించాలి.
* ఆహారం: పేగు పూత బాధితులు సాధారణ ఆహారం తీసుకోవచ్చు. కొందరికి పాల పదార్థాలు ఇబ్బంది పెడతాయి, వారు వీటిని మానేస్తే మేలు. క్రాన్స్ వ్యాధి బాధితులు మాత్రం పీచు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
* గర్భం: పేగు వాపు తీవ్రంగా లేని మహిళలు గర్భం ధరించవచ్చు. తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు అబార్షన్లు, ముందే కాన్పు రావటం వంటివి జరగొచ్చు. కాబట్టి గర్భిణులకు బాధలు ఎక్కువైతే చికిత్సతో దాన్ని నియంత్రణలో పెట్టటం తప్పనిసరి.
ఇవీ సమస్యలు!
అల్సరేటివ్ కోలైటిస్
* ఏమిటి: పెద్దపేగు లోపల వాపు, పూతతో పాటు పుండ్లు కూడా పడతాయి. చాలా వరకూ పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది.
* ఎవరికి: 1540 ఏళ్ల మధ్య వయసు వారికి ఎక్కువ. స్త్రీపురుషులు ఇరువురిలోనూ కనబడుతుంది.
* నిర్లక్ష్యంతో: చికిత్స తీసుకోకుండా దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం కావటం, పెద్దపేగు ఉబ్బిపోవటం, రంధ్రాలు పడటం, క్యాన్సర్ వంటి దుష్ప్రభావాలుంటాయి.
* చికిత్స: ఇది కొంతకాలం తగ్గుతూ, కొంతకాలం ఉద్ధృతమయ్యే రకం సమస్య. కాబట్టి దీర్ఘకాలం చికిత్స తప్పదు. దీనికి ప్రధానంగా మెసలాజైన్ వంటి అమినోశాల్సిలేట్లు, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచే అజిథియోప్రైన్ వంటి ఇమ్యూనో సప్రసెంట్లు సిఫార్సు చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే కొంతకాలం స్టిరాయిడ్లు కూడా ఇచ్చి క్రమేపీ తగ్గించేస్తారు. పెద్దపేగు చివరి భాగం ప్రభావితమైతే మెసలాజైన్ లేదా స్టిరాయిడ్ ఎనిమాలు ఇవ్వాల్సి ఉంటుంది. మందులతో ప్రయోజనం లేని కొందరికి సర్జరీ చేసి.. ప్రభావితమైన ఆ పేగు భాగాన్ని తొలగించాల్సిన అవసరం కూడా వస్తుంది.
క్రాన్స్ వ్యాధి
* ఏమిటి: ప్రధానంగా కనబడేది పేగుల్లో పూత, వాపు. ఇది పేగుల్లో ఎక్కడైనా రావచ్చు.
* ఎవరికి: ఏ వయసులోనైనా రావచ్చు. 2030 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువ. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ. పొగతాగేవారికి ముప్పు ఎక్కువ.
* నిర్లక్ష్యంతో: పేగుల్లో ఈ సమస్య ఎక్కడ తలెత్తింది, ఎంత తీవ్రంగా ఉందన్నది ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే చిన్నపేగు మూసుకుపోవటం, మలద్వారం చుట్టుపక్కల చీము గడ్డలు, రంధ్రాలు పడటం, పేగులకు రంధ్రాలు పడటం, రక్తహీనత, పోషకాహార లోపం వంటివి ముంచుకొస్తాయి.
* చికిత్స: పూర్తిగా నయం చెయ్యటం కష్టం. కానీ పేగుల్లో వాపు, జ్వరం, విరేచనాల వంటివి తగ్గించి వ్యాధిని నియంత్రణలో పెట్టచ్చు. దీనికి వాపు తగ్గించే మెసలాజైన్ వంటి అమినోశాల్సిలేట్లు, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచే అజిథియోప్రైన్ వంటి ఇమ్యూనో సప్రసెంట్లు, స్టిరాయిడ్లు సిఫార్సు చేస్తారు. వీటితో పాటు కొంచెం ఖరీదైనవే అయినా ఇన్‌ఫ్లిక్సిమాబ్ వంటి 'బయలాజికల్స్' రకం మందులతో చాలా ప్రయోజనం ఉంటోందని గుర్తించారు. అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్, విరేచనాలు తగ్గించే మందులూ, పోషకాహార లోపం ఉంటే విటమిన్ సప్లిమెంట్లూ తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్సలతో ప్రయోజనం లేకపోతే సర్జరీ చేసి వాపు ఉన్న పేగు భాగాన్ని తీసెయ్యాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలానికి ఆ పక్క భాగంలో మళ్లీ వాపు కనబడే ప్రమాదం ఉంటుంది.
పేగుల్లో క్షయ
పేగుల్లో క్షయ ఎవరికైనా రావచ్చు. మన దేశంలో మరీ ఎక్కువ. దీని లక్షణాలు చాలావరకూ పేగుపూత, వాపు లక్షణాల్లాగే ఉంటాయి. కాబట్టి దీన్ని ఐబీడీ నుంచి పూర్తి భిన్నంగా గుర్తించాల్సి ఉంటుంది. చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట ఎక్కువగా కనబడుతుంటుంది. నిర్ధారణ కచ్చితంగా చేసి.. వీరికి క్షయ మందులు వాడితే సంపూర్ణంగా తగ్గిపోతుంది.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)
కొందరికి చూడటానికి పేగుల్లో ఏ లోపం ఉండదుగానీ పేగుల పని తీరు మాత్రం అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం, కడుపు ఉబ్బరం, కొంతకాలం మలబద్ధకం లేదంటే విరేచనాలు.. ఇలా వేధిస్తుంటాయి. దీన్ని నిర్ధారించుకోవటానికి పరీక్షలన్నీ చేసి, ఇతరత్రా పేగుపూత వంటి సమస్యలేవీ లేవని తేల్చుకోవటం ముఖ్యం. దీనితో నొప్పి, అలసట వంటివి తప్పించి తీవ్రమైన దుష్ప్రభావాలేమీ ఉండవు, లక్షణాలను బట్టి వైద్యం చేస్తారు.
గుర్తించేదెలా?
చాలావరకూ బాధితులు చెప్పే లక్షణాల ఆధారంగానే వైద్యులు వీటిని గుర్తించగలుగుతారు. రక్త, మల, మూత్ర పరీక్షలు కూడా కొంత కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. అయితే వీటిని కచ్చితంగా నిర్ధారించుకోవటానికి కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరి. ముఖ్యంగా ఎండోస్కోపీకొలనోస్కోపీ పరీక్షల్లో నోటి ద్వారా లేదా మల ద్వారం గుండా కెమేరా గొట్టాన్ని లోపలికి పంపించి.. పేగుల్లో వాపు, పూత, పుండ్లు వంటివి ఉన్నాయేమో టీవీ తెర మీద స్పష్టంగా చూస్తారు. సమస్య క్రాన్స్ వ్యాధా? లేక అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధా? ఈ రెండూ కాక క్షయ ఉందా? లేక పేగుల్లో ఏ సమస్యా లేకుండానే లక్షణాలు బాధిస్తున్నాయా? ఇవన్నీ కీలకమైన ఈ పరీక్షల్లోనే కచ్చితంగా నిర్ధారణ అవుతాయి.
ముఖ్యంగా: సిగ్మాయిడోస్కోపీ పరీక్షతో మలద్వారం, పెద్దపేగు చివరిభాగాలను పరీక్షించవచ్చు. కొలనోస్కోపీతో పెద్దపేగు మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించవచ్చు. అవసరమైతే అదే కెమేరా గొట్టంతో పేగుల నుంచి చిన్నముక్క తీసి (బయాప్సీ) పరీక్షకు పంపించవచ్చు. అలాగే 'డబుల్ బెలూన్ ఎంటరోస్కోపు'తో మొత్తం చిన్నపేగును తనిఖీ చెయ్యచ్చు. వీటిలో అవసరమైన ప్రాంతాన్ని టీవీ తెర మీద పెద్దగా చేసుకుని చూడటానికి, సమస్య ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా చూడటానికి మాగ్నిఫికేషన్, క్రోమోఎండోస్కోపీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి. పేగు పూత, వాపు సమస్యలను గుర్తించటంలో ఇవి కీలకమైన పరీక్షలు. సమస్య ఏమిటన్నది కచ్చితంగా నిర్ధారించటంలో 'బయాప్సీ' ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు బేరియం ఎనిమా వంటి మరికొన్ని పరీక్షలూ చేయవచ్చు. ఈ తరహా పూత, పూత సమస్యలను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. కానీ చికిత్సతో వాటిని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం.. బాధల నుంచి బయటపడటానికేకాదు, భవిష్యత్తులో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవటానికి కూడా చాలా అసవరం.
-డా. కె.జగన్మోహనరావు, చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,నాగార్జున హాస్పిటల్, విజయవాడ.
- =============================