Monday, May 23, 2011

బాలింతల ఆహారం పై ఆంక్షలు-అవగాహన,Food restrictions of milk-feeding mothers
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -బాలింతల ఆహారం పై ఆంక్షలు-అవగాహన(Food restrictions of milk-feeding mothers)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...--గర్భిణిగా ఉండగా కోరిన ఆహారాన్ని తినే అవకాశం ఉంటుంది. కానీ ప్రసవం అయిన తర్వాత ఒక్కసారిగా ఆహారంపై ఆంక్షలు మొదలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలింతలకి ఈ పరిస్థితి ఎదురవుతుంది. కారణం తీసుకొనే ఆహారంపై ఉండే అపనమ్మకాలే. అపనమ్మకాల కారణంగా ప్రసవానంతరం వారు సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొనే ఆహారంపై అవగాహన పెంచుకొంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు

పెరుగు తింటే జలుబు చేస్తుందా?
పాలిచ్చే తల్లులు పెరుగు, నారింజ, నిమ్మ వంటి పండ్లరసాలు తీసుకోవడం వల్ల బిడ్డకు జలుబు చేస్తుందని చాలామందిలో నమ్మకం. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. బిడ్డ కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమంలో జలుబు రావడానికి ఆస్కారం ఉంది. వాస్తవానికి పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల తల్లిపాలలో విటమిన్‌ 'సి' స్థాయులు తగినంతగా ఉంటాయి. ఫలితంగా బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

పప్పులతో కడుపునొప్పా..
రాజ్‌మా సెనగపుప్పు, మొలకలు వంటి వాటిని పాలిచ్చే తల్లులు తినడం వల్ల బిడ్డకు కడుపు నొప్పి వస్తుందని చాలా మంది అనుకొంటారు. అందువల్లే వీటితో చేసిన పదార్థాలని బాలింతలకి దూరంగా ఉంచుతారు. ఈ నమ్మకంలో ఏ మాత్రం వాస్తవం లేదు. బాలింతలకి చక్కని పోషకాహారం అంటే ఈ రకం తృణధాన్యాలతో చేసిన పదార్థాలే. వీటిల్లో
మాంసకృత్తులు, జింక్‌, ఇనుము పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి, ఉబ్బరం వస్తాయనడం సరికాదు. కాబట్టి నిస్సందేహంగా పప్పుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు.
అలాగే బాలింతలు చల్లని నీటిని తాకకూడదని.. వేడివేడి నీటిని తాగిస్తారు. ఇక్కడ వేడినీళ్లు చన్నీళ్లు అని కాదు. ఆ నీరు పరిశుభ్రంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. నీటిని కాచి వడకట్టి.. చల్లార్చి తాగినా ఏం కాదు. వేడినీటినే తాగాలనేది ఒక అపనమ్మకం మాత్రమే. అలాగే నీటిని అతిగా తాగడం వల్ల పాలు పలుచన అవుతాయని, అతిగా తాగొద్దని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. ఇందులో కూడా నిజం లేదు. నీటిని బాగా తాగడం వల్ల బిడ్డకు తగినన్ని అంటే 600 నుంచి 800 ఎమ్‌.ఎల్‌ పాలు అందుతాయి. ఆపైన నీరు మూత్రం రూపంలో బయటకు పోతుంది. అంతేకానీ తల్లి నీటిని తాగడం వల్ల బిడ్డకందే పాలపై ఎటువంటి ప్రభావం ఉండదు.

నెయ్యి మంచిదేనా
పూర్వపు రోజుల్లో అమ్మాయిలకి చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు అయ్యేవి. ఆ వయసులోనే వారు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఫలితంగా తీవ్రమైన పోషకాహార లేమి. ఆ సమయంలో నెయ్యిని ఆహారంలో చేర్చడం వల్ల కొంతవరకు శరీరానికి మేలు జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పైగా నెయ్యిలో అధిక కెలొరీలు ఉంటాయి. దీనివల్ల అతిగా బరువు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. తప్పనిసరిగా నెయ్యిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బిడ్డ పుట్టుకతో పచ్చకామెర్లతో బాధపడుతుంటే తల్లి గుడ్డు, మాంసాహారం భుజించకూడదని అనుకొంటారు. నిజానికి మామూలు కామెర్లకు.. పుట్టకతో వచ్చే నియోనేటల్‌ జాండిస్‌కి పోలిక లేదు. తల్లి తినే ఆహారం బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపించదు. కాబట్టి గుడ్డు ఇతరత్రా పోషకాహారంతోపాటు ఎండు ఫలాలు మితంగా తీసుకోవచ్చు. వీటిలో అధిక కెలొరీలు ఉంటాయి కాబట్టి ఆ మితం పాటించాలి.

పోషకాహారంతో.. పాలు
బిడ్డ మెదడు పనితీరు చురుగ్గా చలాకీగా ఉండాలన్నా, తగినంత బరువు ఉండాలన్నా, ఐక్యూ స్థాయిలు బాగుండాలన్నా తల్లిపాలే కీలకం. ఆరునెల్ల వరకు తప్పనిసరిగా అందించాల్సిన తల్లిపాలు పోషకభరితం కావాలంటే అమ్మ తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండాలి. పోషకాహారం అంటే.. మాంసకృత్తులు, ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు, ఇనుము, క్యాల్షియం, ఫోలిక్‌ ఆమ్లం, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ సి ఆహారంలో ఉండాలి. ప్రతి మూడు గంటలకి
ఆహారాన్ని తీసుకోవాలి. అలాని కెలొరీలు మాత్రమే ఉండే చాక్లెట్లు, శీతల పానీయాలను తీసుకోకూడదు. మాంసకృత్తులు అధికంగా ఉండే పాలు, గుడ్లు.. పెరుగు, చీజ్‌, చిక్కుడు జాతి గింజలు, సోయా పాలు, చేపలు, పండ్లు, మొలకలు తినాలి. ఇనుము అధికంగా ఉండే.. ఎండు ఫలాలు, ఆకుకూరలు, చేపలు తీసుకోవాలి. అలాగే విటమిన్‌ సి పుష్కలంగా లభించే జామ, టమాటాలు, నిమ్మ, ఉసిరి, దోస వంటివి ఎంచుకోవచ్చు. బిడ్డకు మేలు చేసే ఫొలేట్‌ లభ్యమయ్యే పదార్థాలు.. ఆకుకూరలు.. తోటకూర, పుదీనా, పాలకూర, కొత్తిమీర, గింజలు, చిక్కుడు జాతి గింజలు రోజువారీ ఆహారంలో ఉండాలి. వీటి నుంచి బీటాకెరటిన్‌ సమృద్ధిగా అందుతుంది. పాలు, పెరుగు, టోఫు, చీజ్‌, వెన్నల నుంచి క్యాల్షియం బాగా పొందవచ్చు. అలాగే తృణధాన్యాలు, పుచ్చకాయ, కర్బూజా, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, అంజూర, యాపిల్‌ వంటి పండ్ల వల్ల.. రాగి, జొన్నలు, గోధుమలు, దంపుడు బియ్యంతో చేసిన పదార్థాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల పీచు అందుతుంది. వీటితో పాటు మూడు లీటర్లకి తక్కువ కాకుండా నీటిని తాగాలి.

పచ్చళ్లకు దూరం..
పచ్చళ్లు, మైదా ఉత్పత్తులు.. బయట అమ్మేవాటికి దూరంగా ఉండాలి. పంచదార, తేనె, జామ్‌, కేకులు, పేస్ట్రీలు, బిస్కట్లు, పఫ్‌లు తినడం వల్ల బరువు పెరిగిపోతారు. టీ, కాఫీలు అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి ఇనుము అందదు.


సంప్రదించాల్సిన వైద్యనిపుణులు .......... డా. జానకీ శ్రీనాథ్ ‌-- ఫోన్‌: 040 66637920

  • ================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.