Saturday, May 4, 2013

Hormonal influenced Allergies,హర్మోన్ల ప్రభావంతో వచ్చే అలర్జీలు.

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hormonal influenced Allergies,హర్మోన్ల ప్రభావంతో వచ్చే అలర్జీలు.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 


బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రకృతి పరంగా జరగాల్సిన శారీరక, మానసిక మార్పులకు తోడ్పడుతూ రకరకాల జీవక్రియలను, అవయవాలను సంకేతాల ద్వారా శరీరంలోని హార్మోన్లు క్రమబద్ధీకరిస్తాయి. అయితే శారీరక, మానసిక అవలంబనలో ఒడిదుడుకుల వల్ల హార్మోన్లు అసమతుల్యతకు గురవుతుంటాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థతో సంయోగంతో నడిచే హార్మోన్లు ఎటువంటి అసమతుల్యత గురైనా ప్రతిస్పందన చర్యలతో రోగనిరోధక వ్యవస్థను కూడా ఇబ్బందులకు గురిచేస్తాయి. దాని పర్యవసానంగా ఏర్పడేవే అలర్జీలు.

ముఖ్య లక్షణాలు
బాల్యంలో: పుట్టిన పిల్లల్లో తల్లికి చెందిన ఈస్ట్రోజెన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా దద్దుర్లు, జలుబు, దగ్గు, రకరకాల చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాకుండా రొమ్మ పరిమాణం పెరగటం, యోని భాగం ఇన్‌ఫెక్షన్ల బారిన పడటం జరగవచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ సరైన చికిత్స లేకపోవటం వల్ల తరచు జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం మొదలైన ఇన్‌ఫెక్షన్లతో సతమతమవుతారు. తామర, గజ్జి, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

యవ్వనంలో: చాలామంది పిల్లల్లో యవ్వన దశలో జరిగే హార్మోన్ల అసమతుల్యత కారణంగా మగపిల్లల్లో రొమ్ము పరిమాణం పెరగటం, మీసాలు, గడ్డాలు, జనన అవయవాలు త్వరగా అభివృద్ధి చెందటం, ఆడపిల్లల్లో నెలసరి త్వరగా మొదలవటం లేదా ఆలస్యంగా మొదలవటం, నెలసరి సమస్యలు, తెల్లబట్ట వంటివి కనిపించవచ్చు. జుట్టు రాలటం, సైనసైటిస్, టాన్సిల్స్, ఆడినాయిడ్‌ల ఇన్‌ఫెక్షన్, చర్మ సమస్యలు ముఖ్య సంకేతాలుగా పరిగణించవచ్చు. అవగాహన లేక సరైన చికిత్స తీసుకోకపోవటం వల్ల యవ్వనంలో థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, ఒబేసిటి, సొరియాసిస్ వంటి వ్యాధులకు గురికావచ్చు. జ్ఞాపక శక్తి తగ్గటం, ఏకాగ్రత లోపాలు, ఆందోళన, సున్నితమైన మనస్తత్వం కనిపించవచ్చు.

మధ్య వయస్కులలో:
అలర్జీల ప్రభావం వల్ల సైనస్ తలనొప్పి, దీర్ఘకాలిక సైనస్ ఇన్‌ఫెక్షన్, ఆస్తమా లేదా బ్రాంకైటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, తినే ఆహారం జీర్ణం కాకపోవడం, విరేచన సమస్యలు, ఎగ్జిమా, అర్టికేరియా వంటి చర్మ సమస్యలు మొదలు కావచ్చు. దీర్ఘకాలిక అలర్జీల ప్రభావంతో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తలెత్తవచ్చు. స్త్రీలలో పిసిఓడి, ఫైబ్రాయిడ్ సమస్యలు, పురుషులలో వీర్య కణాల సమస్యలు, తర్వాత సంతానలేమి సమస్యలు ఎదురుకావచ్చు.

వృద్ధాప్యంలో: స్త్రీలలో నెలసరి ఆగిపోయే సమయంలో పిగ్‌మెంటేషన్ మొదలైన చర్మ సమస్యలు, ఎముకలు మెత్తబడి ఆస్టియోపొరోసిస్ లాంటివి మొదలు కావటం ఈస్ట్రోజెన్ హార్మోన్ అసమతుల్యత ప్రభావంగా పేర్కొనవచ్చు. పురుషులలో ప్రొస్టేట్ సమస్యలు, కీళ్ల నొప్పులు మొదలైనవి హార్మోన్, అలర్జీల సంయోగ ప్రభావం వల్ల మొదలవుతున్నట్లు శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడయింది.

ప్రేరేపకాలు
చిన్న పిల్లల్లో రకరకాల మందుల దుష్ప్రభావాలు, పిల్లలను వారి పేరెంట్స్ అతిగా నియంత్రించడం, పదిమందిలో తిట్టడం, దీంతో పిల్లల్లో ఆందోళన ఏర్పడటం వల్ల కూడా రకరకాల అలర్జీల రూపంలో బయటపడవచ్చు. అంతేగాక మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు, కృత్రిమ ఆహారం, పౌష్టికాహార లోపాలు, పని ఒత్తిడి, తగినంత శారీరక పరిశ్రమ లేకపోవటం, నిద్రలేమి, సొంతవైద్యం లాంటివి కూడా ముఖ్య ప్రేరేపకాలుగా గుర్తించవచ్చు.

దుష్పరిణామాలు
అలర్జీ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించకపోవటం లేదా సాధారణ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులలోకి దారితీయవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, డయాబెటిక్ స్పాండిలైటిస్, ఆస్టియోపొరోసిస్, థైరాయిడ్ సమస్యలు, ఒబేసిటి మొదలైన వ్యాధులకు దారితీయవచ్చు. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినటం వల్ల టిబి, న్యుమోనియా, థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లివర్, కిడ్నీల వైఫల్యానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంది.

నిర్దారణ పరీక్షలు
ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించటం చాలా సులభం. ఇఎస్ఆర్, సిబిపి, ఐజిఇ, ఇసినోఫిల్ కౌంట్, సిఆర్‌పి, ఆర్ వంటివి సాధారణ పరీక్షలు. వీటితోపాటు టిఎస్‌హెచ్, టి3, టి4, ఈస్ట్రోజెన్, స్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల పరీక్షల ద్వారా రెండింటికి గల సంబంధం తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలిక ప్రతిస్పందనల వల్ల కేన్సర్ సంబంధిత పరీక్షలు చేయించుకోవలసిన అవసరం కూడా రావచ్చు.

- డా. శ్రీకర్ మను @ Andhrajyothi-04 May 2013.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.