Monday, July 25, 2011

శ్రావ్యమైన స్వరం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు , care to preserve good voice



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శ్రావ్యమైన స్వరం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు (care to preserve good voice)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మనిషికి జంతువుకున్న తేడా మాట్లాడటమే. తల్లిగర్భం నుంచి బయటపడిన శిశువు ఏడుపుతో మాట్లాడతాడు. తర్వాత ఒక్కో అక్షరం, పదాలు నేర్చుకుంటాడు. ఎదుటివారు చెప్పేదానికి స్పందించి సమాధానమిస్తారు. దీనికంతటికి కారణం గొంతులో ఉండే స్వరపేటిక. దీన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే శ్రావ్యమైన గొంతు మన సొంతమవుతుంది. స్వరపేటికకు వచ్చే వ్యాధులు, చికిత్స, జాగ్రత్తల గురించి .

ఎదుటివారి చెప్పిన మాటను విన్న తర్వాత శబ్దతరంగాలు చెవి ద్వారా మెదడుకు చేరతాయి. వీటిని మెదడు విశ్లేషిస్తుంది. మనం ఏం చెప్పాలనుకున్న దాన్ని మెదడు సందేశం ద్వారా స్వరపేటికకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడాలంటే కీలకమైంది స్వరపేటిక (లారింగ్స్‌). స్వరపేటికలో కంపించే (వైబ్రేటింగ్‌) నిర్మాణం ఉంటుంది. వీటిని వొకల్‌కార్డ్స్‌ అంటారు. వొకల్‌కార్డ్స్‌కు సంబంధించిన కండరాలు, వీటిని నియంత్రించే నరాలుంటాయి. ఇదంతా మెదడు నియంత్రణలో ఉంటుంది. మాట్లాడటానికి మెదడు ఆదేశం ఇచ్చే క్రమంలో మనం శ్వాసలోపలికి పీల్చుకుని గాలిని బయటికి వదిలినప్పుడు వొకల్‌కార్డ్స్‌ కంపిస్తాయి (వైబ్రేట్‌). దీని వల్ల బేసిక్‌ వాయిస్‌ 'ఆ...' పుడుతుంది. ఈ శబ్దం నోట్లో నుంచి వచ్చినప్పుడు నాలుక, నాలుక చుట్టున్న కండరాలు దీనికి శబ్దరూపాన్నిస్తాయి. శబ్దానికి గాలిగదుల్లాంటి సైనస్‌లు, దాని నిర్మాణం ఒక టోన్‌ని ఇస్తాయి. కొంత మంది పాడితే శ్రావ్యంగా ఉంటుంది. వీరికి పుట్టుకతో ఏర్పడిన సైనస్‌లే కారణం. అందుకే కొంత మంది గాయకులకు మధురమైన గొంతు ఉంటుంది. పుట్టుకతోనే మంచి టోన్‌ ఉంటుంది. గాయకులు లతామంగేష్కర్‌, బాలసుబ్రమణ్యం ఈ కోవకు చెందినవారే.

ఎలా బయటపడతాయి ?

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల 'లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌' వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

ఐదు రకాల సమస్యలు

సాధారణంగా స్వరపేటికకు సంబంధించి వచ్చే సమస్యలు...వొకల్‌కార్డ్‌ ఎపిథీలియంపై నీటిపొర ఉంటుంది. ఇది ఎండిపోవడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

వొకల్‌ నాడ్యుల్స్‌ : రోజులో ఎక్కువ సమయం మాట్లాడేవారిలో, అకస్మాత్తుగా స్వరాన్ని పెంచేవారి (రాక్‌ సింగర్స్‌ వాయిస్‌)లో ఈ సమస్య వస్తుంది. వొకల్‌కార్డ్‌లో మూడు భాగాలుంటాయి. మొదటి, చివరి భాగాల మధ్య ఉన్న భాగంలోని పొర చిన్న చిన్నగా చిట్లడం మొదలువుతుంది. తొలిదశలో చిట్లి తర్వాత మానుతుంది. కానీ ఇలా చిట్లడం మళ్లీ మళ్లీ జరిగినప్పుడు చిట్లిన చోట కండ తయారవుతుంది. దీంతో తరంగ ధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) మారుతుంది. నెమ్మదిగా కండలోకి రక్తప్రసరణ పెరుగుతుంది. తొలిదశలో దీన్ని మైక్రోస్కోప్‌ ద్వారా గుర్తించి పరీక్షించాలి. వాయిస్‌ స్పీచ్‌ మాడ్యులేషన్‌తో చికిత్స చేయొచ్చు. ఈ దశలో కూడా నియంత్రించకుండా నిర్లక్ష్యం చేస్తే వోకల్‌ నాడ్యుల్స్‌ పరిమాణం పెరిగి శస్త్రచికిత్స వరకు వెళ్లే అవకాశముంది. ఒక నాడ్యుల్‌కు ఒకసారి మాత్రమే ఆపరేషన్‌ చేస్తారు. ఇది మానిన తర్వాతే ఇంకో నాడ్యుల్‌కు ఆపరేషన్‌ చేస్తారు.

వొకల్‌ పాలిప్స్‌ : స్వరపేటికలోని పొరలో నీరు చేరి ఉబ్బుతాయి. దీన్ని పాలిప్స్‌ అంటాం. ఉబ్బిన తర్వాత చిన్న కణతిలాగా మారుతుంది. ఇది క్రమంగా పెరుగుతుంది. దీన్ని మందులతో నయం చేయలేం. మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ ద్వారా చికిత్స చేసి తొలగిస్తారు.

వొకల్‌కార్డ్‌ ఎడిమ: వొకల్‌కార్డ్‌ కింద ఉన్న పొరపై నీరుచేరి వాపు వస్తుంది. దీంతో స్వరంలో తేడా కనిపిస్తుంది. దీన్ని మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ, మైక్రోఫ్లాప్‌ టెక్నిక్‌ సర్జరీతో చికిత్స చేస్తారు.

స్వరపేటిక క్యాన్సర్‌ : ధూమపానం, మద్యపానం వల్ల స్వరపేటిక క్యాన్సర్‌ వస్తుంది. తొలిదశలో గొంతుబొంగురుపోతుంది. దీన్ని గుర్తించి క్యాన్సరా? కాదా? అనేది నిర్ధారించాలి. మొదటి దశలోనే దీన్ని గుర్తించి రేడియేషన్‌ ద్వారా చికిత్స చేస్తే 99 నుంచి 100 శాతం వరకు క్యాన్సర్‌ నయమవుతుంది.

వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ : స్వరపేటికలో కదలిక ఉండదు. స్తబ్దుగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి గొంతు బొంగురుపోతుంది. ఏమైందని పరీక్షిస్తే స్వరపేటికి పనిచేయడం లేదని అర్థమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు చికిత్స చేయడానికి ముందు 6 నుంచి 18 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో స్వరపేటిక తనంతట తాను సవరించుకుని, స్వరం మామూలు స్థాయికి చేరుకుంటుంది. అప్పటికీ ఇంకా సమస్య ఉంటే 'టైప్‌-1 థైరోప్లాస్టీ' అనే ఆపరేషన్‌ ద్వారా చికిత్స చేస్తారు. వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ ఎడమవైపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఛాతిలో ఏర్పడిన గడ్డ వొకల్‌కార్డ్‌కు వెళ్లే నరాన్ని వత్తుతుంది. అందుకే పెరాలసిస్‌ వచ్చినప్పుడు ఛాతి ఎక్స్‌రే తీసి, గడ్డలున్నాయో చూస్తారు. కొన్నిసార్లు మెదడు, మెడ భాగం సిటి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. గుండె వాచి నరం ఒత్తిడికి గురైనప్పుడు కూడా పెరాలసిస్‌ వచ్చే అవకాశముంది. దీన్ని హార్ట్‌నెస్‌ సిండ్రోం అంటాం. థైరాయిడ్‌ సర్జరీ, గుండె శస్త్రచికిత్స తర్వాత నరానికి గాయమై సమస్య కలగొచ్చు.

స్వర సంరక్షణ

కొంతకాలం వరకు కేవలం గాయకులు మాత్రమే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు టీవీలు, ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాల వల్ల యాంకర్ల పాత్ర పెరిగింది. అనర్గలంగా మాట్లాడాల్సి వస్తోంది. మంచి స్వరంతో ఆకట్టుకునే విధంగా హవభావాలతో మాట్లాడాలి. ఇలాంటి వారిని 'ప్రొఫెషనల్స్‌ వాయిస్‌ యుజర్స్‌' అని పిలుస్తున్నారు. ఈ క్రమంలో తమ స్వరాన్ని ఎలా సంరక్షించుకోవాలనే సందేహం వీరిలో కలుగుతుంది. స్వరం సంరక్షణలో వాయిస్‌ హైజీన్‌ కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రతి ఒక్కరూ తమ స్వరం 'పిచ్‌ రేంజ్‌'ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు. తమకు లేని స్వరాన్ని అంటే ఇతరుల స్వరాన్ని అనుకరిస్తూ ఎక్కువసేపు మట్లాడడం, అదనపు ఒత్తిడిని ఉపయోగించి మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రాక్టీస్‌ వల్ల అనుకరణ చేయొచ్చు. అదికూడా ఎక్కువ సమయం చేయకూడదు.

ఈ మధ్య టీవీల్లో రియాల్టీ షోలు పెరుగుతున్నాయి. ఇందులో పాటల కార్యక్రమాల్లో పిల్లలతో పాడిస్తున్నారు. పాడించడానికి ముందు వీరితో గంటల కొద్దీ రీహాల్స్‌ చేయించడం వల్ల స్వరపేటికపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. నాలుగైదు ఎపిసోడ్స్‌ ఐదారు రోజుల్లో రికార్డు చేస్తారు. దీనికి ముందు 3,4 రోజులు 10 నుంచి 12 గంటలు పిల్లలతో పాటలు పాడడం ప్రాక్టీసు చేస్తారు. ఇలా చేయడానికి పిల్లల శరీరం, స్వరం పరివర్తన చెందిఉండదు. పాట సందర్భాన్ని బట్టి వారికి లేని స్వరంతో పాడటానికి ప్రయత్నం చేస్తుంటారు.

ఫలితంగా మానిసిక సంఘర్షణకు గురవుతుంటారు. పాట పాడేసమయంలో లయకు అనుగుణంగా శ్వాసతీసుకోవాల్సి ఉంటుంది. వందలో ఒకరిద్దరికే ఈ సామర్థ్యం ఉండే అవకాశముంది. కానీ కొంత మంది పిల్లల్లో ఊపిరితిత్తులకు ఆ సామర్థ్యం ఉండదు. ఈ సమస్యను గుర్తించి పిల్లలతో ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఎక్కువ విరామాలు తీసుకునేలా జాగ్రత్తపడాలి. పిల్లల పిచ్‌రేంజ్‌కు అనుగుణంగా వారికి తగ్గ పాటను ఎంపికచేయాలి. దీని వల్ల అనవసరంగా కలిగే ఒత్తిడినుంచి ఉపశమనం పొందొచ్చు.

శ్రావ్యమైన స్వరానికి నీళ్లు ఎక్కువ తాగాలి. మసాల, కారం ఎక్కువ ఉండే పదార్థాలు మానాలి. పోషకాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సమాయానికి ఆహారం తీసుకోవడం వల్ల ల్యారింగో ఈసొఫెగల్‌ రిఫ్లక్స్‌ సమస్య రాకుండా జాగ్రత్తపడొచ్చు. ధూమపానం, మద్యపానం మానాలి.

ఎక్కువ సమయం తరగతుల్లో పాఠాలు చెప్పేవారు ప్రతి 10 నిమిషాలకు కొద్దిపేపు విరామం తీసుకోవాలి. కాల్‌సెంటర్లో పనిచేసేవారు రిలాక్స్‌ అవుతుండాలి. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగే అవకాశముంది.

పిచ్‌ రేంజ్‌ తెలుసుకోవడం ఎలా ?

పిచ్‌ రేంజ్‌ తెలుసుకుని పాటలు పాడడం, ప్రసంగించడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. దీన్ని తెలుసుకోవడానికి 'వాయిస్‌ సాఫ్ట్‌వేర్‌' ఉపయోగపడుతుంది. పిచ్‌ రేంజ్‌ కనుక్కోవడే కాక నిమిషానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎంతసేపు పిచ్‌మేయిన్‌టేన్‌ అవుతుందో తెలుసుకోవచ్చు. స్ట్రొమోట్రొఫి అనే పరికరం ద్వారా తెల్లటి కాంతిని వేగంగా స్వరపేటికలోకి పంపించి, 'ఆ' అనే శబాన్ని పలికిస్తారు. అప్పుడు శబ్దానికి సంబంధించిన తరంగధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) తెలుస్తుంది. ఎక్కడ సమస్య ఉందో, స్వరానికి సంబంధించిన సమస్యలను తొలిదశలోనే గుర్తించేవీలుంది.

అటు-ఇటు

మగవాళ్లు ఆడపిల్లల గొంతుతో, ఆడవాళ్లు మగవారి గొంతుతో మాట్లాడడం మనం చూస్తుంటాం. ఇవి రెండుకాక ఒక్కోసారి కీచు గొంతుతో మాట్లాడతారు. దీన్ని 'వాయిస్‌ మ్యుటేషన్లు' అంటాం. అబ్బాయిలు, అమ్మాయిల్లో 10 నుంచి 11 ఏళ్ల వరకు ఒకే రకం గొంతు ఉంటుంది. తర్వాత హార్మోనుల ప్రభావం వల్ల అమ్మాయిల గొంతు శ్రావ్యంగా మారుతుంది. అబ్బాయిల గొంతు మగవారిలా మారుతుంది. 16 ఏళ్లయినా కూడా ఈ గొంతు మారకుంటే దీన్ని ప్యుమోఫోనియా అంటారు. ఈ సమస్య ఉన్నవారికి థైరొప్లాస్టీ సర్జరీ ద్వారా స్వరపేటికను సరిచేస్తారు.

-------------------------------------------------------------------------
source : prajasakti news paper>Raksha desk byడా|| కెవిఎస్‌ఎస్‌ఆర్‌కె శాస్త్రి,--కన్సల్టెంట్‌ ఇఎన్‌టి సర్జన్‌--యశోద హాస్పిటల్‌ సోమాజిగూడ, హైదరాబాద్‌.
  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.