మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. మోకాలి సమస్యలకు కారణాలు, వాటి నివారణకు అవసరమైన చర్యలను తెలుసుకుందాం .
సాధారణంగా మోకాలినొప్పి అనగానే వయసును బట్టి ఆ సమస్యను విశ్లేషించాలి. మోకాలి నొప్పికి వేరు వేరు వయసుల్లో వేర్వేరు అంశాలు కారణమవుతాయి.
కారణాలు: మోకాలి నొప్పులకు పిల్లల్లో, పెద్దల్లో కారణాలు వేరుగా ఉండవచ్చు.
చిన్నవారిలో--మూడు నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లల్లో మోకాలి నొప్పికి ఇవీ కారణాలు…
పటెల్లార్ సబ్‌లాక్సేషన్(patellar sublaxation): దీన్నే పటెల్లార్ డిజ్‌లొకేషన్‌గా కూడా చెప్పవచ్చు. మోకాలిచిప్పను పటెల్లా అంటారు. చాలామంది చిన్నపిల్లలు మోకాలి చిప్పను అటూ, ఇటూ జరపడం చూస్తుంటాం. ఇలాంటప్పుడు ఒక్కోసారి మోకాలి ఎముక స్థానభ్రంశం చెందుతుంది. కొన్ని సందర్భాల్లో మోకాలికి బలమైన గాయం తగలడం వల్ల కూడా ఈ మోకాలి చిప్ప తన స్థానం నుంచి తొలగిపోతుంది. దీనితో నొప్పి రావచ్చు.
టిబియల్ అపోఫైసిటిస్(Tibial Apophysities): చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లో, వేగంగా పరుగెత్తే పిల్లల్లో మోకాలికి ముందు భాగంలో నొప్పి వస్తుంది. మోకాలి చిప్ప కంటే కిందన, కాలి కండరం మోకాలికి అంటుకునే ప్రాంతంలో ఈ నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనికి నిర్దిష్టంగా కారణం తెలియదు.
జంపర్స్ నీ(Jumper knee): ఈ సమస్య కూడా ఇంచుమించు టిబియల్ అపోఫైసిటిస్‌లాగే ఉంటుంది. చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లోనే ఇది వస్తుంటుంది. సాధారణంగా లాంగ్‌జంప్ చేసే ఆటగాళ్లలో ఈ తరహా నొప్పి ఎక్కువ. ఇది కూడా మోకాలిచిప్ప ఎముక స్థానభ్రంశం వల్లనే వస్తుందిగానీ, ఈ నొప్పి మోకాలి ముందుభాగంలో ఉంటుంది.
రిఫర్‌డ్ పెయిన్(Reffered pain): తొడ ఎముక తుంటి దగ్గర కలిసే ప్రదేశం (గ్రోత్ ప్లేట్)లో ఎముకలు స్థానభ్రంశం కావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా కాస్త స్థూలకాయం ఉండే పిల్లల్లో ఇది ఎక్కువ. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వస్తుండటంతో పిల్లలు మోకాలిపై భారం పడకుండా నడిచే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో కుంటుతున్నట్లుగా కనిపిస్తుంటారు. సమస్య తొడ ఎముక తుంటి వద్ద కలిసే ప్రదేశంలో వచ్చినా ఈ నొప్పి మాత్రం మోకాలి వద్ద ఉంటుంది. అందుకే దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు.
ఆస్టియోకాండ్రయిటిస్(Osteo chondritis): ఎముకల్లోని మృదులాస్థి (కార్టిలేజ్)లో పగుళ్ల కారణంగా ఈ నొప్పి వస్తుంది. దీనికి పోషకాహారం లోపం కూడా ఒక కారణం. ఇక మితిమీరి ఆటలాడే పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది.
యువకులు, పెద్దవారిలో
సాధారణంగా పిల్లలు, వృద్ధులతో పోల్చి చూస్తే యుక్తవయస్కులు మొదలు పెద్దవారి వరకు మోకాలి నొప్పికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి.
పటెల్లో ఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్(patella-Femoral pain syndrome): ఇది ఒకరకంగా చూస్తే పెద్దల్లో వచ్చే ఆస్టియోకాండ్రయిటిస్ అనుకోవచ్చు. దీనిలో మోకాలి ముందు భాగంలో ఈనొప్పి వస్తుంది.
మీడియల్ ప్లైకా(Medial plica): ఇది పుట్టుకతో (కంజెనిటల్) వచ్చే సమస్య. మోకాలిలో ఉండే కండరాలు బిగుసుకుపోవడం వల్ల ఈ నొప్పి వస్తుంది.
పీస్ అన్సిరైటిస్ బర్సైటిస్(Pes anserine bursitis): ఈ సమస్యలో మోకాలి కింది భాగంలో లోపలివైపున నొప్పి ఉంటుంది. దీనికి ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు (ఎండోక్రైనల్ డిజార్డర్స్) కారణాలు. ఎక్కువగా ఆటలాడటం కూడా ఈ సమస్యకు ఒక కారణమే.
మెనిస్కల్ టేర్(Meniscal tear): మోకాలి ఎముకలో ఒక కుషన్ లాంటిది ఉంటుంది. ఈ కుషన్ చిరిగిపోవడం వల్ల వచ్చే సమస్యను మెనిస్కల్ టేర్ అంటారు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ ఆటలు ఆడేవారిలో, జిమ్నాస్టిక్స్ చేసేవారిలో ఈ తరహా సమస్య ఎక్కువ.
మైక్రో ట్రామా(Micro Trauma): అదేపనిగా ఒకే చోట గాయం కావడం, ఆ గాయంపై మాటిమాటికీ ఒత్తిడి పడి నొప్పి తిరగబెట్టడం వల్ల ఈ నొప్పి వస్తుంది. మోకాలు తిప్పడం వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు.
యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ సమస్య(Anterior crucial ligament problem): ఎముకనూ కండరాన్నీ కలిపే నిర్మాణాన్ని లిగమెంట్ అంటారు. యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ మోకాలికి స్థిరంగా ఉండేలా దోహదపడుతుంది. ఆటల్లో లేదా
వృద్ధుల్లో--ప్రమాదాల్లో గాయపడటం వల్ల ఈ లిగమెంట్ దెబ్బతిని ఈ తరహా నొప్పి వస్తుంది.
చిన్నపిల్లల్లో, యుక్తవయస్కుల్లో ఉండే కారణాల కంటే కాలక్రమంలో ఎముకల అరుగుదల వల్లనే ఈ వయసువారిలో మోకాలినొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అర్థరైటిస్: ఎముకల అరుగుదల వల్ల వచ్చే మోకాలి నొప్పి ఇది.
క్రిస్టల్ ఇండ్యూస్‌డ్ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థోపతి:రక్తంలో యూరిక్‌యాసిడ్ మోకాలి చిప్ప ప్రాంతంలో తయారవుతుంది. మోకాలిచిప్ప దగ్గర ఈ రాళ్లు కంకరలా అడ్డుపడుతుండటం వల్ల ఎముక ఒరుసుకుపోయి ఈ నొప్పి వస్తుంది.
గౌట్ : ఈ సమస్య కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు పెరగడం వల్లనే వస్తుంది. అయితే రాళ్లు ఏర్పడటం కాకుండా కండరాలు బిగుసుకుపోయి నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్) వల్ల ఈ నొప్పి వస్తుంది.
సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.
పాప్లీటియర్ సిస్ట్స్: కండరాల మధ్య వచ్చే నీటి బుడగల వల్ల వచ్చే నొప్పి ఇది. మోకాలి కింది భాగంలో ఈ నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉండటం వల్లకూడా ఇది రావచ్చు.
మోకాలి నొప్పి కంటిన్యువస్‌గా వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసువారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ అవసరం కావచ్చు.
అది మోకాలిపైన తొడ ఎముక (ఫీమర్), కాలి ఎముక (టిబియా)లు కలిసే ప్రాంతంలో ఉండి పైన మోకాలి చిప్ప (పటెల్లా) అనేక ఎముకలతో సంక్లిష్టమైన కండరాల బంధంతో ఉంటుంది. నిర్మాణంలో సంక్లిష్టతలు ఎక్కువ కాబట్టి అక్కడి నొప్పి ఎప్పుడూ అలక్ష్యం కూడదు.
నివారణ ఇలా…
ఏదైనా పని మొదలు పెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించవద్దు. గబుక్కున లేవడం / కూర్చోవడం చేయవద్దు.
జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు నడవండి.
సమతలంగా ఉండే ప్రదేశంలోనే జాగింగ్‌గానీ, రన్నింగ్‌గానీ చేయండి. ఎగుడుదిగుడుగా ఉండే ప్రాంతాల్లో వద్దు.
మట్టి మృదువుగా ఉండే ప్రాంతంలోనే వాకింగ్, జాగింగ్ చేయాలి. కఠినంగా ఉండే బండల (హార్డ్ సర్ఫేస్)పై అలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు.
వ్యాయామం చేసే ముందర తగినంత వార్మప్ చేయండి.
మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు, దానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం కూడా అవసరం. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించండి.
కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షణలను ధరించండి. మహిళలు అయితే ఎక్కువగా హీల్ ఉండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. మీ బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోండి. బరువు పెరుగుతున్నకొద్దీ మోకాలిపై భారం పెరుగుతుంటుందని గుర్తుంచుకోండి
చికిత్స : కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది .
నొప్పి తగ్గడానికి :
Aceclofenac 100 mg 3 time / day ,లేదా
Diclofenac 50 mg 3 times / day ,లేదా
Brufen 400 mg 2-3 time /day , తీసుకోవాలి .
మోకాళ్ల నొప్పులు స్త్రీలకే ఎక్కువెందుకు?
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో 90 శాతం మంది స్త్రీలే. అయితే మనదేశంలో చాలామంది మహిళలు నొప్పిని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో తొలిదశలోనే చికిత్స తీసుకోవటం సాధ్యం కావటం లేదు. పైగా వయసుతో పాటే కీళ్ల నొప్పులూ వస్తాయని, వీటిని తప్పించుకోవటం అసాధ్యమనీ భావిస్తుంటారు. మెనోపాజ్ కూడా ఆ సమయంలోనే మొదలై ఎముకలు గుళ్ల బారటం ఎక్కువవుతుంది. ఇలాంటి సమస్యలెన్నో మోకాళ్ల నొప్పులను మరింత తీవ్రం చేస్తున్నాయి. అంతేకాదు శరీర నిర్మాణ పరంగానూ చిక్కులు ఎదురవుతున్నాయి.
* స్త్రీలకు తుంటి భాగం విశాలంగా ఉండటంతో కీలు దగ్గర తుంటి ఎముక లోనికి వంగి ఉంటుంది. దీంతో మోకాలుపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మోకాలి చిప్ప మృదులాస్థిని ఒరుసుకుంటూ పక్కలకు కదులుతుంది. తుంటి విశాలంగా ఉండటం వల్ల తొడ కండరాలు సాగి మోకాలి కండర బంధనాల్లో నొప్పి కలగజేస్తుంది.
* పురుషులతో పోలిస్తే స్త్రీలల్లో కండ శాతమూ తక్కువే. అందువల్ల వీరి మోకాళ్లకు కండరం దన్ను కూడా అంతగా ఉండదు. అలాగే స్త్రీలల్లో వదులుగా ఉండే కండరం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా గాయాల బారినపడేలా చేస్తుంది.
* మోకాలి కండర బంధనాలు కూడా వీరిలో చిన్నగా ఉంటాయి. దీంతో కీలు స్థిరంగా ఉండటమూ తగ్గుతుంది.
* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.
* మెనోపాజ్ తర్వాత ఎముకలు గుళ్ల బారటం మోకాళ్ల నొప్పికి ప్రధానంగా దోహదం చేస్తుంది.
- ===================================
I got A lot more useful information from your blog,
ReplyDeleteI will bookmark your post ,so keep writing the good things,
Thanks
Joint Pain Relief