Tuesday, September 8, 2009

మొలలు (ఫైల్స్ ),Piles(Haemorrhoids)




మొలలు , ఫైల్స్ , హేమరాయిడ్స్ , పేరేదైనా తరచూ వినిపించే సమస్యల్లో ఇదొకటి . వంశ పారంపర్యంగా ఏర్పడే వ్యాధులలో అర్శమొలలు ఒకటి. అంతేగాక ఆనారోగ్య ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వంటి కారణాల వల్ల మల విసర్జన ద్వారంలోపల పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వ్యాధులు ఏర్పడతాయి. సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం , మలబద్ధకం , వంటి వాటితో ఈ సమస్య తలెత్తుతుంది . మలాశయం లోపల బయట చిన్న చిన్న బుడిపెలు రూపం లో మొలలేర్పడి ఇబ్బంది పెడతాయి . మలద్వారము చివరిలో సిరలు గోడలలో మార్పులవల్ల అవి ఉబ్బి మొలలు గా ఏర్పడతాయి. వీటిలో నాలుగు డిగ్రీలు ఉన్నాయి . 1st డిగ్రీ -ఏభాదలేకుండా చిన్న మొలలు ఉండడం , 2nd డిగ్రీ -- మొలలు బయటకు కనిపిస్తాయి , విరోచనం అయినపుడు మంటా , దురద ఉంటుంది , 3rd డిగ్రీ -- మొలలు పెద్దవిగా ఉంది విరోచనం అయినప్పుడు రక్తం పడుతూ .. నొప్పి , మంట ఉంటుంది . 4th డిగ్ర్రీ ఫైల్స్ -- ప్రోలాప్సుడ్ (prolapsed) మొలలు పెద్దవిగా ఉంటూ రక్తం కారుతుంది . . నొప్పి , మంట ఉంటాయి .

సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :
  • నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .
  • పొడిగా ఉండే ఆహారమే తీసుకున్తు పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.
  • గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .
ఆహార నియమాలు :
  • మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడంఅన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
  • కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
  • వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
ట్రీట్మెంట్ :
  • pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
  • Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
  • Duolaxin ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
  • Hedensa ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి .
పై మందుల వల్ల తగ్గనిచో ఆపరేసన్ చేయించుకోవాలి . దీనికి లేజార్ ట్రీట్మెంట్ కలదు .. బాగానే ఫలితాలు ఉన్నాయి.

మొలలు ముళ్ల మీది జీవితం! /Dr.Varghees Mattaih Ano-Rectal surgeon... ,yasoda hos hyd@eenadu sukhibhava.

    ప్రాణాల మీదికేమీ రాకపోవచ్చుగానీ....అనుక్షణం ముల్లుగా గుచ్చుకుంటూ.. నిత్యం నరకం చూపించే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొలలు. కూర్చోవాలంటే కష్టం. నడవాలంటే నరకం. ఇక మలవిసర్జనకు వెళ్లాలంటే మహా భయం. తెల్లారుతోందంటే చాలు... ఎక్కడ రక్తం కళ్ల జూడాల్సి వస్తుందో.. చివరికి ఇదెక్కడికి దారి తీస్తుందో... ఈ భయాల పరంపరకు అంతుండదు. దినదిన గండంలా అనిపించే... నిత్యం ఎంతోమందిని వేధించే ఈ సర్వసాధారణ మొలలకు పరిష్కారం ఎక్కడ? బయటకు చెప్పుకోలేక.. భయాలు దాచుకోలేక.. చాలామంది నాటువైద్యాలను ఆశ్రయించి తీవ్ర ఇక్కట్ల పాలవుతుంటారు. నిజానికి అవగాహన పెంచుకుంటే మొలలను తేలికగానే వదిలించుకోవచ్చు. దీనికి అత్యాధునికమైన విధానాలూ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఒక రకంగా... గత దశాబ్దకాలంలో మొలల పట్ల వైద్యరంగం అవగాహనే చాలా వరకూ మారిపోయింది.

నిజం చెప్పాలంటే...'పైల్స్‌' అనేవి ఒక స్థాయిలో అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని 'పైల్స్‌' అని పిలవకుండా మలద్వారంలో ఉండే మొత్తటి పొరలు (యానల్‌ కుషన్స్‌) అంటాం. ఈ పొరలే సాగి, పెరిగి, జారి, ముదిరి సమస్యాత్మకంగా తయారైతే అప్పుడు వీటిని వ్యాధిలా గుర్తిస్తూ.. 'పైల్స్‌' అనీ, 'హెమరాయిడ్స్‌' అనీ పిలుస్తారు.

ఒకప్పుడు ఈ మలద్వారంలోని మెత్తటి పొరలకు ప్రత్యేకమైన ప్రయోజనమేదీ లేదని భావించేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో వీటిపై అవగాహనలో చాలా మార్పు వచ్చింది. ఈ మెత్తటి పొరలకు రెండు రకాల ప్రత్యేక ప్రయోజనాలున్నాయని గుర్తించారు.

1. సాంప్లింగ్‌ రిఫ్లెక్స్‌: మలద్వారం నుంచి బయటకు వస్తున్నదేమిటి? అనేది గుర్తించి మనకు తెలియజెప్పే అతి ముఖ్యమైన బాధ్యత నిర్వర్తించేది ఈ పొరలే. బయటకు వస్తున్నది గ్యాసా? విరేచనమా? వచ్చేది మెల్లగా వస్తోందా? మెత్తగా వస్తోందా? గ్యాసైతే దాన్ని నలుగురిలో ఉన్నప్పుడు విసర్జించొచ్చా? లేదా? ఇవన్నీ గుర్తించి మన మెదడుకు ఈ సమాచారాన్ని చేరవేసి.. దానికి తగ్గట్టుగా మలద్వారం స్పందించేలా చేసేది ఈ పొరలే. ఈ ప్రక్రియ అంతా మనకు తెలియకుండానే.. రేయింబవళ్లు జరిగిపోతూనే ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మల విసర్జన జరిగే అవకాశమున్నా ఇవి ఆ విషయాన్ని కూడా మనకు తెలిసేలా చేస్తాయన్నమాట.

2. మలంపై పట్టు: మలవిసర్జన పైన మనకు గట్టి పట్టు, నియంత్రణ ఉన్నాయంటే దానికి మలద్వారం లోపల ఉండే రెండు దృఢమైన కండర బంధనాలు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ యానల్‌ స్ఫింక్టర్స్‌), పొత్తికడుపు నుంచి పురీషనాళం వరకూ ఉండే 'ప్యూబో రెక్టాలిస్‌' కండరం.. ఇవి 99% వరకూ బలంగా తోడ్పడతాయి. ఆ మిగిలిన ఒక్కశాతం నియంత్రణకు.. ఈ మలద్వార పొరలు దోహదం చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. వీటికి రక్తసరఫరా అధికంగా ఉంటుంది. ఈ పొరలు రోజంతా ఉబ్బుతూ, తిరిగి మామూలు స్థాయికి వస్తూ ఉంటాయి. ఇవి ఉబ్బినపుడు మలద్వారం బిగుతుగా మూసుకుపోతుంది. ఇవి మామూలు స్థాయికి వచ్చినపుడు కాస్త వదులవుతుంటుంది. ఇలా ఈ మలద్వార పొరలు మలంపై పట్టుకు కూడా దోహదం చేస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తిచటం.. మొలల పట్ల, అలాగే మొలలకు చేసే చికిత్సల పట్ల మన అవగాహనలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఒకప్పుడు మొలలకు చికిత్సలో భాగంగా మలద్వారాన్ని తెరిచి.. సర్జరీ చేసి.. ఉబ్బి ఉన్న మొలలను పూర్తిగా తొలగించేవారు. కానీ వీటిని సాధ్యమైనంత వరకూ తొలగించాల్సిన అవసరం లేకుండా సమస్యను సరిదిద్దటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని గుర్తించి ప్రస్తుతం 'స్టేప్లర్‌' విధానాన్ని ఆవిష్కరించారు.
ఎప్పుడు సమస్య?
మలద్వారంలో పైల్స్‌ వంటి మెత్తటి పొరలు అందరికీ ఉంటాయి, అవసరం కూడా. అయితే వాటిల్లోంచి రక్తం పడుతున్నా, నొప్పిగా ఉంటున్నా, అవి పైకి పొడుచుకొచ్చినా, అవి మలద్వారం నుంచి బయటికి వస్తూ-పోతున్నా సమస్యగా పరిణమిస్తాయి. దీన్నే మనం సాధారణ భాషలో మొలల సమస్యగా (పైల్స్‌, హెమరాయిడల్‌ డిసీజ్‌) భావిస్తుంటాం. సమస్యగా పరిణమించినప్పుడు మాత్రమే వీటికి చికిత్స తప్పనిసరి అవుతుంది.
సమస్యగా ఎందుకు మారతాయి?
మొలల సమస్యకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యకారణం మల బద్ధకం, మల విసర్జన సమయంలో ముక్కటం! కొందరిలో వంశపారంపర్యంగా స్ఫింక్టర్లను మలద్వారానికి పట్టి ఉంచే కొలాజెన్‌ పొర బలహీనంగా ఉంటుంది. ఇదీ మొలలకు దోహదం చెయ్యొచ్చు. మల విసర్జన సమయంలో ముక్కితే పైల్స్‌తో కూడిన కండర బంధనం (లిగమెంట్‌) సాగిపోతుంది. తరచూ ఇలా జరుగుతుంటే కండర బంధనం పల్చబడుతుంది. దీంతో మలం గట్టిగా వచ్చినపుడు అది ఆ భాగానికి రుద్దుకొని రక్త స్రావమవుతుంది. కొన్నిసార్లు ఇవి బయటకు పొడుచుకొని రావొచ్చు. మలబద్ధకమే కాదు.. అతిగా విరేచనాలు కావటం కూడా మొలలకు దారితియ్యొచ్చు.

ముక్కినపుడు మలద్వారం వెనక భాగం లోపలికి పొడుచుకు రావటం ఆరంభమవుతుంది. ఇలా తరచుగా ముక్కుతుంటే కొద్దికొద్దిగా కిందికి వస్తూ.. చివరికి మొత్తమంతా తోసుకొస్తుంది. ఒకరకంగా దీన్ని పైల్స్‌ సమస్య తొలిదశ అనుకోవచ్చు.
పిల్లలకూ రావచ్చు!
పైల్స్‌ సమస్య పెద్దల్లో తరచుగా కనబడుతుంది. వయసుతో పాటు మొలల ముప్పూ పెరుగుతుంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్నకొద్దీ కండరాలు బలహీనపడుతుంటాయి, అదే సమయంలో పెద్దపేగు కదలికలు తగ్గి మలబద్ధకం సమస్యా పెరుగుతుంటుంది. దీంతో ముక్కటం, మొలల బారినపడటం చాలా ఎక్కువ. అయితే మొలలు పెద్దలూ, వృద్ధులకే కాదు... పిల్లల్లోనూ రావచ్చు. ముఖ్యంగా మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ. చాలామంది పిల్లలు రోజూ మల విసర్జన చేయరు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్తుంటారు. దీంతో ముక్కటం మొదలై మొలలకు దారి తీస్తుంది. అలాగే నేటి యువతరంలో పాశ్చాత్య జీవనశైలి, ఆహారపుటలవాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వీరిలోనూ మొలల సమస్య ఎక్కువగానే కనబడుతోంది.
అపోహ
* చాలాసేపు కూచొని పనిచేసే ఉద్యోగులకు మొలల సమస్య ఎక్కువని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మొలలకూ, చేసే ఉద్యోగాలకూ సంబంధం లేదు. అయితే సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేనివారికి మలబద్ధకం సమస్య ఎక్కువ. కాబట్టి వారికి మొలల బెడద ఎక్కువగానే ఉంటుంది.
మొలలు దశలు
* గ్రేడ్‌-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి ఉండదుగానీ రక్తం మాత్రం పడుతుంది. వీరిలో సాధారణంగా మల విసర్జనకు ముందుగానీ, తర్వాత గానీ రక్తం పడటం కనిపిస్తుంది. మలంతో కలిసిపోకుండా, విసర్జన సమయంలో తాజా రక్తం పడుతుంటే మొలల సమస్యగానే భావించాల్సి ఉంటుంది. కానీ మలంతో కలిసి రక్తం పడుతుంటే మాత్రం జాగ్రత్త పడాలి. క్యాన్సర్‌ ఉందేమో నిర్ధరించుకోవాలి.

* గ్రేడ్‌-2: ఈ దశలో రక్తం పడొచ్చు, పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తుంటాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతుంటాయి. ఈ దశలో సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలిని పాటిస్తే.. మొలల సైజు తగ్గి, మొదటి దశలోకి మారిపోవచ్చు కూడా.

* గ్రేడ్‌-3: మల విసర్జన చేసినప్పుడు పైల్స్‌ బయటకు వస్తాయి. కానీ విసర్జన అనంతరం వాటంతట అవే లోపలికి పోవు. వేలితో నెడితే లోనికి వెళ్తాయి.

* గ్రేడ్‌-4: ఈ దశలో ఉన్న పైల్స్‌ మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.

మొలల సమస్య సాధారణంగా లోపలే ఆరంభమవుతుంది. మొలలతో కూడిన పొర కిందికి జారుతున్నకొద్దీ అవి బయటకు పొడుచుకురావటం, తోసుకురావటం ఎక్కువ అవుతుంది.

చికిత్సలు
సమస్యగా మారిన మొలలు ఉబ్బినట్టుగా, కాస్త పెద్దగా ఉంటాయి. ప్రోక్టోస్కోప్‌తో చూస్తే వాటిపై రక్తస్రావం అవుతున్న గుర్తులు కనిపిస్తాయి.

* మొలల సమస్య మొదటి దశలో ఉన్నవారికి- ముందు తగు ఆహారపుటలవాట్లు, జీవనశైలిని సూచిస్తారు. సమస్య చాలావరకూ వీటితోనే తగ్గిపోవచ్చు. అవసరమైతే వీరికి రక్తనాళాల బిగువును పెంచి, రక్తస్రావం కాకుండా చూసే కొన్ని రకాల మందులూ సూచిస్తారు. అయితే ఇవి అందరిలోనూ పనిచేయకపోవచ్చు. కాబట్టి ఆహార నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మందులు వాడినా రక్తస్రావం తగ్గకపోతే- దాన్ని ఆపేందుకు ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో అక్కడి రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స లేదా ఆ రక్తనాళంలోకి మందును ఎక్కించి అది మూసుకుపోయి, తొలగిపోయేలా చేసే 'స్ల్కెరోథెరపీ' వంటివి చేస్తారు.

* మొలలు రెండో దశలో ఉంటే 'రబ్బర్‌బ్యాండ్‌ లైగేషన్‌' బాగా పనిచేస్తుంది. ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్‌ను పైకి లాగి, దాని మూలం దగ్గర గట్టిగా రబ్బరు బ్యాండు వేసేస్తారు. దాంతో దానికి రక్తసరఫరా నిలిచిపోయి, పైల్స్‌ ఎండి, వారంలో రాలిపోతాయి. ఈ దశలో అవసరమైతే స్ల్కెరోథెరపీ, ఇన్‌ఫ్రారెడ్‌ చికిత్సలూ ఉపకరిస్తాయి.

* మూడు, నాలుగో దశల్లో ఉన్న మొలలకు సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. గతంలో వీటికి మలద్వారాన్ని తెరిచి, తొలగించే 'ఓపెన్‌ ఆపరేషన్‌' చేస్తుండేవారు. ప్రస్తుతం స్టేప్లర్‌, డిజీహాల్‌ ప్రక్రియలతో తేలికగా పూర్తిచేసే అధునాతన సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.
మొలలు-క్యాన్సర్లు
మొలలను చాలా వరకూ రోగి చెప్పే లక్షణాల ఆధారంగా, మలద్వారంలోకి ప్రోట్రోస్కోప్‌ పంపి చూడటం ద్వారానే నిర్ధరిస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలో మలద్వారం నుంచి రక్తం పడుతుంటే మొలలుగా కొట్టిపారెయ్యకుండా.. తప్పనిసరిగా కొలనోస్కోపీతో గానీ సిగ్మాయిండోస్కోపీతో గానీ పరీక్షించాలి. మలాశయంలో వారికి క్యాన్సరేమైనా ఉందేమో చూడాలి. ఎందుకంటే మలద్వార క్యాన్సర్‌లోనూ మలంలో రక్తం పడటం వంటి మొలల లక్షణాలే కనిపిస్తాయి. దాన్ని మనం గుర్తించలేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పైగా- మొలలతో పాటు క్యాన్సర్‌ కూడా ఉన్నవారికి ఆ విషయం గుర్తించకుండా కేవలం మొలలకు మాత్రమే ఆపరేషన్‌ చేస్తే... క్యాన్సర్‌ కణాలు అక్కడికి వచ్చి స్థిరపడి అక్కడ పెరగటం మొదలుపెడతాయి. దీంతో మలద్వారం, పురీషనాళం మొత్తం తొలగించాల్సి ఉంటుంది. అదే క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ఆ భాగాన్ని మాత్రమే తొలగిస్తే సరిపోతుంది.

* మొలలు క్యాన్సర్‌గా మారతాయేమోనన్న భయం మాత్రం అక్కర్లేదు.
మొలలు- ముక్కొద్దు
అసలు మొలలు రాకుండా నివారించుకోవాలంటే... ప్రతి ఒక్కరూ కూడా విరేచనం మెత్తగా, సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా- విసర్జన కోసమని బలంగా గంటల తరబడి ప్రయత్నించకూడదు. ముక్కకూడదు. పీచు ఎక్కువగా ఉండే పళ్లూ కూరగాయలూ నిత్యం ఎక్కువగా తీసుకోవటం, నీళ్లు ఎక్కువగా తాగటం ముఖ్యం. దీంతో విరేచనం ముక్కాల్సిన అవసరం లేకుండా మెత్తగా, తేలికగా, సాఫీగా అవుతుంది. ఇప్పటికే మొలలు ఉన్నవాళ్లు అవి ముదరకుండా చూసుకునేందుకు, అలాగే ఇప్పటికే ఒకసారి మొలలకు సర్జరీల వంటి చికిత్సలు చేయించుకున్న వారు మళ్లీ వాటి బారినపడకుండా ఉండేందుకు కూడా ఇవే జాగ్రత్తలు పాటించటం అవసరం.
మొలలు సర్జరీలు
*ఓపెన్‌ ఆపరేషన్‌: మలద్వారాన్ని తెరిచి.. మొలలను పూర్తిగా తొలగించే విధానం ఇది. మొలలు మరీ పెద్దగా ఉన్నప్పుడు కొందరికి ఇది ఇప్పటికీ తప్పకపోవచ్చుగానీ.. ఈ ఆపరేషన్‌ను సరిగా చేయకపోతే మాత్రం మలవిసర్జన మీద పట్టు కోల్పోయే (ఇన్‌కాంటినెన్స్‌) ప్రమాదముంది. విసర్జన మీద పూర్తి పట్టు ఉండాలంటే ఆ మెత్తటి పొరలు (పైల్స్‌) అవసరం. కానీ ఆపరేషన్‌ ద్వారా మొలలను తొలగిస్తే ఈ మేరకు కొంత పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొలలను తొలగించే సమయంలో కొన్నిసార్లు- లోపలి కండర వలయం (స్ఫింక్టర్‌) కూడా కొద్దిగా దెబ్బతినొచ్చు. దానివల్లా విసర్జన మీద పట్టు తప్పే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా- మొలలు చాలా పెద్దగా ఉండి, పూర్తిగా బయటకు పొడుచుకొచ్చి, వేలితో నెట్టినా లోపలికి వెళ్లని వారికి ఇప్పటికీ ఈ పద్ధతి తప్పదు.
*స్టేప్లర్‌: ఇది విరివిగా వాడకంలోకి వచ్చిన అధునాతన పద్ధతి. ఉబ్బి బయటకు పొడుకొచ్చిన పైల్స్‌ను తొలగించకుండా.. వాటిని లోపలికి నెట్టి.. అవి మళ్లీ కిందికి జారకుండా దానికంటే పైభాగాన్ని కత్తిరించి, దగ్గరకు లాగి కుట్లు వేయటం దీని ప్రత్యేకత. దీనిలో- ముందుగా గొట్టంలాంటి పరికరంతో బయటకు పొడుచుకొచ్చిన పైల్స్‌ను లోపలికి.. అంటే పైకి నెడతారు. దీంతో మలద్వారం లోపల.. తిత్తిలాగా.. కొంతభాగం సాగినట్లుగా తయారవుతుంది. దాన్ని స్టేప్లర్‌తో కత్తిరించి, దగ్గరకులాగినట్లుగా గుండ్రంగా కుట్లు వేసేస్తారు. దీంతో ఇక మొలలు కిందికి జారవు. మలద్వారం తిరిగి బిగువుగా తయారైపోతుంది. ఈ ప్రక్రియలో మొలలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనూ కొద్దిగా కత్తిరిస్తారు. దాంతో ఉబ్బిఉన్న మొలలు కాస్తా... ఆరు వారాల నుంచి మూడు నెలల్లోపు కుంచించుకుపోయి తిరిగా మామూలు ఆకారానికి వచ్చేస్తాయి. ఈ విధానం ప్రత్యేకత ఏమంటే పైకి పుండు, రక్తస్రావం వంటివేమీ కనబడవు. సర్జరీ అంతా లోపలే జరుగుతుంది, తెరుచుకున్నట్టుగా ఉండే పుండు ఏదీ ఉండదు. కాబట్టి వెంటనే పనులకు వెళ్లిపోయేటంత సౌకర్యం ఉంటుంది. సర్జరీ సమయంలో రక్తస్రావం, నొప్పి చాలా తక్కువ. తర్వాత స్టేపుల్స్‌ (పిన్నులు) వాటంతట అవే వూడి పడిపోతాయి. 3-5 రోజుల్లోనే తిరిగి మామూలుగా పని చేసుకోవచ్చు. ఇందులో విసర్జన మీద పట్టుకోల్పోయే అవకాశం అసలే ఉండదు. ఇన్‌ఫెక్షన్ల బెడదా ఉండదు. అయితే ఒకసారి ఉపయోగించిన స్టేప్లర్‌ను తిరిగి వాడటానికి అవకాశముండదు కాబట్టి.. దీనికయ్యే ఖర్చుకాస్త ఎక్కువగా ఉంటుంది.

* డిజీహాల్‌: 'డాప్లర్‌ గైడెడ్‌ హెమరాయిడ్‌ ఆర్టరీ లైగేషన్‌' అనే ఈ ప్రక్రియ అంత విస్తృత స్థాయిలో ప్రచారంలో లేదుగానీ దీనిలో- ధమనిలోని రక్తప్రవాహ శబ్దాన్ని పసిగట్టి వినిపించే డాప్లర్‌ గొట్టాన్ని మలద్వారంలోకి ప్రవేశపెడతారు. దాని సాయంతో సరిగ్గా ఆ ధమనిని పట్టుకుని, దాని మీద కుట్టు వేసేస్తారు. దీంతో పైల్స్‌కు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఉబ్బిన పైల్స్‌ కొద్దిగా కుంచించుకుపోతాయి. అయితే దీంతో పైల్స్‌ పూర్తిగా లోపలికి పోవటం లేదని గమనించి, ఈ ప్రక్రియను మరింత ఆధునికీరించారు. ఇదే 'డిజీహాల్‌ విత్‌ రెక్టో ఆనల్‌ రిపేర్‌'. ఇందులో చాలా కుట్లు కూడా వేసి మొలలు లోపలికి వెళ్లేలా చేస్తారు.

ఏ విధానంలో ఆపరేషన్‌ చేసినా... వీటితో మొలలు పూర్తిగా తగ్గిపోయినా కూడా.. ఆ తర్వాతా ముక్కకుండా ఉండటం, మలబద్ధకం తలెత్తకుండా ఆహార నియమాల వంటివి పాటించటం తప్పనిసరి. లేకపోతే తిరిగి మొలలు ఏర్పడే ప్రమాదముంటుంది.
ద్వారంలో రక్తపుగడ్డ.. పెరీయానల్‌ హెమటోమా
కొందరికి మలద్వారం వద్ద బుడిపెలా తోసుకొచ్చి విపరీతమైన బాధ మొదలవుతుంది. ఇది మొలల మాదిరిగానే కనబడుతుంది. కానీ నిజానికిది మొలల సమస్య కాదు. మొలలను నెడితే లోపలికి పోతాయి. కానీ ఇది మలద్వారం వద్ద చర్మానికే పరిమితమైంది కాబట్టి నెట్టినా అక్కడే ఉంటుంది. దీన్ని 'పెరీయానల్‌ హెమటోమా' అంటారు. మలద్వారం దగ్గర చర్మంలో చాలా రక్తనాళాలు ఉంటాయి. తీవ్రంగా ముక్కినపుడు ఆ రక్తనాళాలు పగిలి, అక్కడ రక్తం గడ్డ ఏర్పడుతుంది. ఇది విపరీతమైన నొప్పి కలిగిస్తుంది. కానీ సాధారణంగా ఈ గడ్డ ఏడు రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అందుకే దీన్ని 'సెవెన్‌ డేస్‌ వండర్‌ పెయిన్‌' అంటారు. నొప్పి ఎక్కువగా ఉంటే చర్మానికి మత్తు మందు ఇచ్చి, గడ్డను తొలగిస్తారు. మొలలున్నవారికీ ఇలా రక్తపు గడ్డ ఏర్పడే అవకాశముంది.
వృద్ధులకే కాదు, మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ.

  • =====================
visit my website : Dr.Seshagirirao MBBS

14 comments:

  1. how much cost for laser treatment please inform me

    ReplyDelete
  2. very very helpful information thank q

    ReplyDelete
  3. Thank you so much,
    this valuable information is helped me because I have piles problem last 6 months
    now, I am following your valuable precautions ...................
    I would like to say that thank you is not enough for this information / help.

    with regards

    ReplyDelete
  4. చంద్ర మోహనరావు విశాఖపట్టణం
    మీకు నా ధన్యవాదములు
    ఆరోగ్య సమస్యలమీద మంచి అవగాహన అందరికీ అర్దమయేలా వివరించారు

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.