Monday, June 21, 2010

నడుము నొప్పి - Back Ach (Lumbago)జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం లో నడుము నొప్పిని అనుభవించే ఉంటారు . దానికి ఎన్నో కారణాలు . కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది .

ఈ రోజుల్లో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలి విధానమే. ఒక ప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి ఆధునిక యుగంలో యుక్తవయస్కులను సైతం బాధిస్తుంది. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.


శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లే సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగడం వల్ల, నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

కారణాలు:

నడుము నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పు. (కార్టిలేజ్‌ వెన్నుపూసలు సులువుగా కదలడానికి తోడ్పడుతుంది) కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్లనొప్పి వస్తుంది. నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే. ఇంతేకాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నడుము నొప్పి..... ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే కొన్ని పనులకు... ముఖ్యంగా స్త్రీలు వంట పనులు చేస్తున్నప్పుడు వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు ఇది కలుగుతుంది.

- స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉప యాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం .
- పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
- కంప్యూటర్స్‌ ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం.
- తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం,
- ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పివస్తుంది.
- ఉద్యోగంలోని అసంతృప్తి అనారోగ్యాన్ని పెంచిపోషిస్తుందంటున్నాయి అధ్యయనాలు. వెన్నునొప్పికీ ఉద్యోగంలో ఎదుర్కునే అసంతృప్తులకు సంబంధం ఉందంటున్నాయి క్వీన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు. తక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్న తోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నవారిలో వెన్నునొప్పి తగ్గడానికి చాలాకాలం పడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు:

నడుము నొప్పి తీవ్రంగా ఉండి వంగటం, లేవటం, కూర్చోవటం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించ రాకుండా ఉంటుంది.

జాగ్రత్తలు:

- సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
- నడుము నొప్పి నివారణకు ప్రతిరోజు వ్యాయా మం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
- ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చు న్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
- వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
- సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
- నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
- శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
- శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
- స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
- పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి.

నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు
 • * కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
 • * వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
 • * మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.
 • * మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
 • * ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
 • * కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
 • * అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
 • * ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్స :
బుటాల్జిన్ అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున వాడినట్లయితే ఈ నడుము నొప్పి తగ్గుతుంది. అంటే వీటిని ప్రతి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి కాకపోతే బెరిన్ టాబ్లెట్లను రోజుకు రెండు చొప్పున వాడినా నడుము నొప్పి బాధ తగ్గతుంది.

దీనికి కొన్ని రకాల పైపూత మందులు(Dolorub, Zobid gel , Nobel gel etc.) కూడా వచ్చాయి. అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒకవేళ ఈ మందులు వాడినప్పటికీ నడుము నొప్పి తగ్గకపోయినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

నడుము నొప్పికి ఆయుర్వేదం :

కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు,
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల చేయాలి 10 సార్లు రోజు,

దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు,
వాన కాలం : 7 లేక 15 రోజులకు,
చలికాలం : రోజు,

1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి...పాత బెల్లం పావు కేజి...ఆవు లేక గేద నెయ్యి పావు కేజి...అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి ,వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా 40 రోజులు చేయలి .
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద అతికించాలి, అది వుడిపోదు..
3.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి
4.వెల్లుల్లి గారెలు :మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు...అల్లం 3 గ్రాములు...ఇంగువ 3 చిటికెలు...సైంధవలవణం పావు స్పూను...అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి,
5.బాదం పప్పు పావు కేజి,మునిగేటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి..పటిక బెల్లం పావు కేజి...అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి...ఇది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి,జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది

మధుమేహం - నడుము నొప్పి:
మధుమేహుల్ని వేధించే ఇబ్బందుల చిట్టా చేంతాడంత పెద్దది. ఆ వరసలో నడుము నొప్పీ ఉంటుందని చాలామందికి తెలియదు. వీరిలో ఇది.. ప్రత్యేకించి కూర్చున్నప్పుడు తగ్గుతూ, నడిచేటప్పుడు విజృంభిస్తుంటుంది. నడవటం మొదలుపెట్టగానే.. నొప్పి తీవ్రత పెరుగుతుంది. నడక ఆపితే, ఒక్కసారిగా తగ్గి, క్రమేపీ మాయమవుతుంది. అదే దీని ప్రత్యేకత.
మధుమేహులు ఈ తరహా నడుము నొప్పి విషయంలో పొరపాటు పడుతూ, లంబార్‌ స్పాండిలోసిస్‌, సయాటికా నొప్పి వంటివాటిని అనుమానిస్తారు. చాలా రోజులపాటు అలాగే తోసేసుకు తిరిగి, ఎట్టకేలకు ఎముకల వైద్యుల్ని సంప్రదిస్తారు. ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలన్నింటినీ వరసపెట్టి చేయించి, చివరికి క్యాల్షియం, నొప్పి నివారిణి మాత్రలు, వ్యాయామ సూచనలతో ఇంటిముఖం పడతారు. వీటన్నింటినీ పాటించినా సరైన ఉపశమనం కనిపించదు. ప్రతి నెలా డాక్టర్ల చుట్టూ తిరగటం, మందుల్ని మార్చటం, నొప్పితో బాధపడటం.. ఇదంతా కొనసాగుతూనే ఉంటుంది.

నడుము నొప్పా? యాంజైనా?
మధుమేహం లేని సాధారణ ఆరోగ్యవంతుల్లో నడుము నొప్పి వేధించటానికి మామూలుగా రెండు కారణాలు తోడవుతాయి. ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్‌ తాలూకు పాతనొప్పి తిరగదోడటం ఒకటైతే, అధిక బరువు, నడక తగ్గిపోవటం వంటివి రెండో కారణం. ఏ మాత్రం వ్యాయామం, వాకింగ్‌ చేయకుండా, గంటల తరబడి కూర్చోవటానికి అలవాటు పడితే.. నడుములో వెన్నుపూసలకు అనుసంధానంగా ఉండే కండరాలు, లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోతాయి. బిగుతుగా, బిరుసుగా మారతాయి. ఫలితంగా.. ఇలాంటి వారు వాకింగ్‌, శారీరక శ్రమ చేసినప్పుడు నడుము నొప్పి వేధిస్తుంది.

మరోవైపు.. మధుమేహ బాధితులకు నడుము, తొడల్లో నొప్పిగా ఉందంటే ఇతరత్రా కారణాల్ని అనుమానించాల్సిందే. వీరిలో సమస్యకు కారణం లిగమెంట్లు సాగే గుణాన్ని కోల్పోవటం మాత్రం కాదు. నడుము, తొడల ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గిపోవటం కూడా మధుమేహ బాధితుల్లో ఇలాంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలా రక్తప్రసరణ చాలీచాలకుండా జరగటాన్ని వైద్య పరిభాషలో 'యాంజైనా' అంటారు. గుండె గోడలకు రక్త ప్రసరణ సక్రమంగా అందకపోతే 'ఛెస్ట్‌ యాంజైనా' తలెత్తినట్లే.. నడుము కండరాలకు చాలీచాలని రక్తప్రసరణ జరుగుతున్నప్పుడు 'వెయిస్ట్‌ యాంజైనా', 'నడుము నొప్పి' రూపంలో సమస్య బయటపడుతుంది. ఛెస్ట్‌ యాంజైనాను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు తలెత్తినట్లే, నడుము యాంజైనాకు సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పాదాలకు రక్తసరఫరా తగ్గి గ్యాంగ్రీన్‌ సమస్య తలెత్తవచ్చు.

నొప్పెందుకు?
గుండె నుంచి కిందికి వచ్చే పెద్ద రక్తనాళం పొట్ట దాకా వెళ్లి అక్కడ కాలేయం, పేగులు వంటి అవయవాలకు శుద్ధమైన ఆక్సిజన్‌ను అందజేస్తుంది. ఇదే నాళం నడుము భాగంలోని కండరాలు, అవయవాలకు కూడా ఆక్సిజన్‌ అందజేస్తుంది. ఆ తర్వాత అది రెండుగా విడిపోయి ఎడమ, కుడి తొడలవైపు ఒక్కో నాళం వెళ్లి, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఈ నాళాల ద్వారా రక్తం పాదాల వరకూ చేరుతుంది.

సాధారణంగా రక్తనాళాల గోడలకు కొవ్వు, కొలెస్ట్రాల్‌, క్యాల్షియం వంటివి పేరుకు పోతూంటే, రక్తనాళాలలో రక్తప్రసరణ మార్గం కుచించుకుపోతుందన్న సంగతి తెలిసిందే. దీనివల్ల అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. మధుమేహ బాధితుల్లో వ్యాయామం, క్రమశిక్షణ కొరవడితే రక్తంలో గ్లూకోజ్‌ పెరిగి పోతుంది. కొవ్వు, క్యాల్షియం పేరుకుపోవటంతో రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడతాయి. మధుమేహుల్లో.. ఈ రక్తనాళం రెండుగా విడిపడే నడుము భాగంలో అవరోధం ఏర్పడవచ్చు. దాంతో తొడలు, పాదాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా నడుము నొప్పి వేధిస్తుంది. ఈ పరిస్థితిని 'లెరిచ్‌ సిండ్రోమ్‌'గా వ్యవహరిస్తారు.

నిర్లక్ష్యానికి మూల్యమెక్కువ
నడుము యాంజైనాకు సరైన చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే.. పురుషాంగానికి రక్తప్రసరణ మందగించి, సామర్థ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండో సమస్య- పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవటం. దీనివల్ల పాదాల్లో తీవ్రమైన నొప్పితోపాటు కండ నల్లబారటం, గ్యాంగ్రీన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. సెక్సు సామర్థ్యాన్ని పదిల పరచుకోవటానికీ, పాదాల్ని పరిరక్షించుకోవటానికి మధుమేహులు నడుము యాంజైనా విషయంలో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే.

పెయిన్‌ కిల్లర్లు వద్దు
నడుము నొప్పితో బాధపడేవారు.. తరచూ డాక్టర్లను మార్చేస్తుంటారు. దీనితో వారు వాడే నొప్పినివారిణ మాత్రల (పెయిన్‌ కిల్లర్లు) బ్రాండ్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కొంతమంది డాక్టర్ని సంప్రదించటానికి బదులుగా, తమకు తామే నేరుగా మందుల దుకాణానికి వెళ్లి పలురకాల మాత్రల్ని తెచ్చుకుని వాడేస్తుంటారు. ఏ కొంచెం నొప్పిగా, నలతగా ఉన్నా వెంటనే మాత్ర వేసేసుకుంటారు. ఇలా పెయిన్‌ కిల్లర్లను ఏళ్ల తరబడి విచ్చలవిడిగా వాడటం వల్ల రెండురకాలుగా నష్టం వాటిల్లుతుంది. ఎలాగంటే.. నొప్పి నివారిణి మాత్రలతో నొప్పినుంచి ఉపశమనం పొందుతూ, నడుము యాంజైనాకు సరైన వైద్య చికిత్స తీసుకోకపోవటం వల్ల పాదం కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. రెండోవైపు- మూత్రపిండాల వైఫల్యం తెలెత్తే అవకాశం పెరుగుతుంది. పెయిన్‌ కిల్లర్లను ఎక్కువెక్కువగా వాడటమే ఇలాంటి సమస్యకు కారణం. ప్రత్యేకించి మధుమేహుల్లో పెయిన్‌ కిల్లర్లు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తాయి. కొంతలోకొంత ప్యారసెటమాల్‌ వంటివే కిడ్నీలకు సురక్షితమైన మాత్రలుగా తేలాయి.

నడుము నొప్పి.. ఏం చేయాలి?
నడుము నొప్పి సమస్య వేధిస్తుంటే.. పెయిన్‌ కిల్లర్లు వేసేసుకుని నొప్పి నుంచి ఉపశమనం పొందటం శాశ్వతమైన పరిష్కారం కాదన్న సంగతి గుర్తించాలి. మీరు మధుమేహులై, నడుము నొప్పితో కూడా బాధ పడుతున్నట్లయితే వెంటనే నడుము దగ్గర రక్తనాళాల పూడికలను కూడా అనుమానించటం మంచిది. తొడలు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల పరిస్థితి ఎలా ఉంది?రక్త సరఫరా సజావుగానే జరుగుతోందా అనేది నిర్ధారించుకోవాలి.

నడుము నొప్పితో బాధపడే మధుమేహులకు... వ్యాస్కులర్‌, కార్డియో థొరాసిక్‌ సర్జన్లు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. డాప్లర్‌, సీటీ యాంజియోగ్రఫీ, ఎంఆర్‌ యాంజియోగ్రఫీ వంటి రోగనిర్ధారణ సౌకర్యాలతోపాటు, లింబ్‌ బైపాస్‌ సర్జరీ, స్పైనల్‌ సర్జరీ వంటి శస్త్రచికిత్సలు చేసే అవకాశాలుండే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవటం శ్రేయస్కరం.

పొగ వద్దేవద్దు
మధుమేహులకూ, పొగకూ ఆమడ దూరం. పొగాకుగానీ, పొగనుగానీ చేరదీస్తే రెండుకాళ్లకీ ముప్పు కొనితెచ్చుకోవటం ఖాయమన్న సంగతి మరవద్దు. మధుమేహుల విషయంలో.. ధూమపానం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది. మధుమేహుల్లో కాళ్లు, పాదాలకు రక్తసరఫరా తగ్గుతుంది, దీనికి తోడు పొగాకు నమలటం, సిగరెట్‌ తాగటం వంటి అలవాట్లవల్ల సమస్య మరింత తీవ్రమై పాదాల్లో గ్యాంగ్రీన్‌ ఏర్పడి, కాళ్లు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇవేకాదు.. పొగాకు వినియోగం వల్ల లింబ్‌ బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు చేసిన తర్వాత కోలుకోవటం కూడా కష్టతరమవుతుంది. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా పొగతాగటం మాననట్లయితే.. కృత్రిమంగా అమర్చిన స్టెంట్‌ నాళాలు సైతం కుంచించుకుని సమస్యలకు దారితీస్తాయి. సిగరెట్లు తాగే సంఖ్యను నెమ్మదిగా తగ్గించటం వల్ల వైద్యపరంగా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. మొత్తంగా మానేస్తేనే చికిత్స పనిచేస్తుంది.

చికిత్స సౌకర్యాలేమిటి?
యాంజియోగ్రఫీ చేయటం ద్వారా.. కాళ్లూ, పాదాలకు రక్తసరఫరా చేసే రక్తనాళం ఎక్కడ, ఎంతమేర మూసుకుపోయిందనేది తెలుస్తుంది. దీంతో ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయించవచ్చు. మెజారిటీ కేసుల్లో ఆర్టీరియల్‌ బైపాస్‌ సర్జరీ అవసరమవుతుంటుంది. ఇందులో కృత్రిమ రక్తనాళాల్ని అమర్చుతారు. మరికొంతమందిలో స్టెంట్లు అమర్చటం ద్వారా మూసుకుపోయిన నాళాల్ని తెరుచుకునేలా చేస్తారు. అయితే.. ఇలాంటి చికిత్సల తర్వాత రోగి ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగవ్వాలంటే.. క్రమం తప్పకుండా నడవటం, వ్యాయామం తప్పనిసరి.

నడుము నొప్పికి ఆసనాలు -Back Ach Exercises

నడుము నొప్పి అపోహలు ,Backach and false belief

మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు నడుము నొప్పి బాధను అనుభవించినవారే. ప్రతి 10 మందిలో కనీసం 8 మంది ఏదో సమయంలో దీని బారినపడుతున్నట్టు అంచనా. ఈ నడుము నొప్పిపై అపోహలూ ఎక్కువే. వ్యాయామం చేస్తేనో, బరువులు ఎత్తితేనో నడుము నొప్పి వస్తుందని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇది వస్తే పూర్తిగా మంచంపై విశ్రాంతి తీసుకోవాల్సిందేనని భావిస్తుంటారు. అసలు ఇలాంటి అపోహల్లో నిజమెంత?

అపోహ: ఎప్పుడూ నిటారుగానే కూచోవాలి.
* ముందుకు వంగి కూచోవటం వల్ల వెన్నెముకకు హాని కలుగుతుందన్నది నిజమే. కానీ పూర్తి నిటారుగా, చాలాసేపు అలాగే కూచున్నా వెన్నెముక త్వరగా అలసిపోతుంది. కాబట్టి ఎక్కువ సమయం కూచోవాల్సి వస్తే.. కుర్చీ వెనక భాగానికి వెన్ను ఆనించి, కొద్దిగా ముందుకు వంగి కూచోవాలి. కాళ్లు నేలను తాకుతుండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూచునే ఉండకుండా.. గంటకోసారి లేచి కాస్త అటూఇటూ నడవటం.. ఫోనులో మాట్లాడటం వంటి పనులను నిలబడే చేస్తుండటం మంచిది.

అపోహ: మరీ బరువైన వస్తువులను ఎత్తరాదు.
* ఎవరికైనా శక్తికి మించిన బరువులను ఎత్తటం శ్రేయస్కరం కాదు. అయితే నడుమునొప్పి విషయంలో ఎంత బరువు ఎత్తుతున్నామన్న దానికన్నా ఎలా పైకి లేపుతున్నామన్నదే కీలకం. ఆయా వస్తువులను దూరం నుంచి వంగి ఎత్తటం కాకుండా.. వాటికి దగ్గరగా వచ్చి మోకాళ్ల మీద కూర్చుని పైకెత్తాలి. వెన్ను నిటారుగా ఉండేలా, శరీరం బరువు కాళ్లపై సమంగా పడేలా చూసుకోవాలి. ఈ సమయంలో శరీరం పక్కలకు తిరిగినా, వంగినా వెన్నెముకను దెబ్బతీస్తుంది.

అపోహ: పూర్తి విశ్రాంతి తీసుకోవటమే మంచి చికిత్స.
* చిన్న చిన్న గాయాలు, బెణుకుల వంటి కారణంగా హఠాత్తుగా నొప్పి వస్తే విశ్రాంతి తీసుకోవటం మంచిదే. అయితే పూర్తిగా మంచం మీదే పడుకోవాలనేది మాత్రం అపోహ. ఒకట్రెండు రోజులు కదలకుండా పూర్తిగా మంచం మీదే ఉండిపోతే నడుము నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.

అపోహ: గాయాల వల్లనే నొప్పి కలుగుతుంది.
* ఒక్క గాయాలే కాదు.. వయసుతో పాటు వచ్చే వెన్నుపూసల అరుగుదల, రకరకాల కండరాల సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, జన్యు పరమైన కారణాల వంటివి కూడా నడుము నొప్పికి కారణమవుతాయి.

అపోహ: బక్క పలుచని వారికి నొప్పి రాదు.
* బరువు ఎక్కువ ఉన్న వారికి నడుమునొప్పి బాధలు ఎక్కువన్న మాట నిజమేగానీ అలాగని బక్కగా ఉండే వారికి నడుము నొప్పి రాదనుకోవటానికి లేదు. నడుము నొప్పి ఎవరికైనా రావొచ్చు. నిజానికి ఆహారం సరిగా తీసుకోకుండా చాలా సన్నగా ఉండేవారికి ఎముక క్షీణత ముప్పూ ఎక్కువే. ఇలాంటి వారికి నొప్పులే కాదు, వెన్నెముక విరిగే ప్రమాదమూ ఉంటుంది.

అపోహ: వ్యాయామం వెన్నెముకకు హాని చేస్తుంది.
* ఇది చాలా పెద్ద అపోహ. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నునొప్పి రాకుండా నివారించుకునే వీలుంది. తీవ్ర గాయాల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నవారికి వైద్యులు ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తారు. ఇక నొప్పి తగ్గిన తర్వాత తగు వ్యాయామాలు చేయటం ద్వారా మున్ముందు మళ్లీ నడుము నొప్పి బారినపడకుండా చూసుకోవచ్చు.
 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

 1. నమస్తే డాక్టరు గారూ,
  T3-0.34, T4-1.52, TSH-100కంటె ఎక్కువగా ఉంది. ఇది ప్రమాదకర పరిస్తితా? మందులు వాడుతున్నాను.ఇది పూర్తిగా తగ్గిపోతుందా? జీవితాంతం
  మందులు వాడుతూఉండాలా?

  ReplyDelete

Your comment is very important to improve the Web blog.