మనం ఏ సౌందర్య సాధనం తీసుకున్నా దానిలో- నీరు, ఆయిల్స్‌తో పాటు తప్పనిసరిగా మరికొన్ని పదార్ధాలుంటాయి. అవి:
* ఎమల్సిఫయర్స్: నీరు, నూనెలను కలిపే పదార్ధాలివి. వీటిని జోడిస్తే ఆ రెండూ చక్కగా కలిసి, క్రీములా తయారవుతాయి.
* ప్రిజర్వేటివ్స్: బ్యాక్టీరియా, ఫంగస్ చేరకుండా చూసేందుకు.
* థికెనర్స్: క్రీము చిక్కగా ఉండేందుకు.
* ఫ్రాగ్రెన్సెస్: సువాసన కోసం. జంతువుల నుంచి, మొక్కల నుంచి తీసినవి లేదా రసాయనికంగా తయారైన సింథటిక్ పదార్ధాలివి.
* స్టెబిలైజర్స్: పాడైపోకుండా చాలా రోజులు నిల్వ ఉండేందుకు.
* కలరింగ్ ఏజెంట్స్: ఆకర్షణీయమైన రంగు కోసం. పింక్, వైలెట్ వంటి రకరకాల రంగు రసాయనాలు వాడతారు.
వీటిలో మొట్టమొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్! ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్. మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడకుండా ఉండటం కోసం, ఆకర్షణీయమైన రంగు కోసం ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు..ఈ మూడే చాలా చర్మ సమస్యలకు మూలం!
ఏయే సమస్యలు ఎక్కువ?
* కాంటాక్ట్ ఇరిటెంట్ డెర్మటైటిస్: కాస్మెటిక్స్‌లోని ఏదైనా పదార్థం పడకపోయినా.. దాన్ని పూసుకున్న వెంటనే వచ్చే సమస్య ఇది. వెంటనే చర్మం ఎర్రగాకందిపోయి, వాచి దురద మొదలవుతుంది. నీరూ కారొచ్చు.
* కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్: రాసుకున్న పదార్థం లోపలికి వెళ్లి, అక్కడ అలర్జీ కలిగించటం వల్ల వచ్చే సమస్య ఇది. కాబట్టి సాధారణంగా రాసుకున్న 3, 4 రోజులకు బాధలు మొదలవుతాయి.
* ఫోటో సెన్సిటివిటీ: కొన్ని కాస్మెటిక్స్ రాసుకుని ఎండలోకి వెళితే.. అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముఖం, ఎండ సోకిన భాగాలన్నీ నల్లగా మారేలా చేస్తాయి.
* అర్టికేరియా: కొన్ని కాస్మెటిక్స్ రాసుకున్న తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చేస్తాయి. ఇది 'కాంటాక్ట్ అర్టికేరియా'.
* ఫాలిక్యులైటిస్: ముఖమంతా సూక్ష్మంగా ఉండే వెంట్రుకల కుదుళ్ల నుంచి చీముపొక్కులు వస్తాయి.
* గ్రాన్యులోమా: ముఖ్యంగా డియోడరెంట్‌ల వంటివి వాడినప్పుడు తీవ్రమైన దురదతో చర్మం మీద గడ్డలు వస్తాయి.
* మొటిమలు, మచ్చలు: కొన్ని కాస్మెటిక్స్‌తో మొటిమలు, బొల్లి వంటి తెల్ల మచ్చలు వస్తాయి.
* క్యాన్సర్లు: డియోడరెంట్ లాంటి కొన్ని కాస్మెటిక్స్‌లో వాడే 'ప్యారాబెన్స్' రకం ప్రిజర్వేటివ్‌లతో రొమ్ము క్యాన్సర్ల వంటివీ పెరుగుతున్నాయని ఇటీవల గుర్తించారు.
* కొందరికి అసలు ఏదైనా కాస్మెటిక్ రాస్తూనే.. వెంటనే భరించలేనంత మంట, ఎర్రబారటం, దురద వంటివన్నీ వచ్చేస్తాయి. దీన్ని 'కాస్మెటిక్ ఇన్‌టాలరెన్స్ సిండ్రోమ్' అంటారు. వీరు అసలా కాస్మెటిక్స్ జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. లేదంటే ముందే అది పడుతుందా? లేదా? 'ప్యాచ్ టెస్ట్' చేసుకోవాలి.
-ఏం చెయ్యచ్చు?
* కాస్మెటిక్స్ కొనేటప్పుడు.. కొన్నేళ్లుగా మార్కెట్లో ఆదరణ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవటం, మంచి పేరున్న కంపెనీ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వటం కొంత మేలు.
* దానిలో వాడిన పదార్ధాలేమిటో రాసినవే చూసి కొనుక్కోవటం మంచిది.
* గాఢమైన వాసనలున్న, ఆల్కహాల్ ఎక్కువున్న ఉత్పత్తులు ఎంచుకోవద్దు.
* వాస్తవానికి 'హెర్బల్' ఉత్పత్తులు మంచివే అయినా.. ఏ నియంత్రణా లేకుండా వీటిని ఎవరెవరో రకరకాలుగా తయారు చేస్తున్న నేపథ్యంలో వీటినీ విశ్వసించే పరిస్థితి లేదు.
* అందానికి కాస్మెటిక్స్ మీద ఆధారపడటం కంటే కూడా.. నీరు ఎక్కువగా తాగటం, కంటి నిండా నిద్ర, పండ్లు-కాయగూరలు ఎక్కువగా తినటం ముఖ్యమని గుర్తించాలి!
సహజ సౌందర్యం
సౌందర్య పోషణ మనకు కొత్తేం కాదు. ప్రాచీన కాలం నుంచీ మనకు సౌందర్య సాధనాల వాడకం తెలిసిందే కాబట్టి మనం సాధ్యమైనంత వరకూ సహజమైన ప్రకృతి వనరుల మీద ఆధారపడటం ఉత్తమం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుళ్లు, శీకాకాయి, సున్నిపిండి వంటివి మంచివి. వీటితో అలర్జీలు, రియాక్షన్లకు ఆస్కారం తక్కువ. అలాగే కొబ్బరి నూనె, నువ్వుల నూనె వంటివి సహజమైన మాయిశ్చరైజర్లు. ఇక పొడి చర్మానికి ఆలివ్ ఆయిల్, పర్‌ఫ్యూమ్ కలపని పెట్రోలియం జెల్లీ(వాజ్‌లైన్) రాసుకోవచ్చు. మనం సాధ్యమైనంత వరకూ సహజంగా ఉండేందుకు, సౌందర్య పోషణకు కూడా సహజమైనవి ఎంచుకునేందుకు ప్రయత్నించటం మంచిది.
--అందరికీనా..?
ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ కొన్నికొన్ని పదార్ధాలు కొందరికి సరిపడవు కాబట్టి కాస్మెటిక్స్ విషయంలో జాగ్రత్తలు మాత్రం అందరికీ తప్పవు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ బాధలు ఎక్కువ. అలాగే అలర్జీ స్వభావం, ఆస్థమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలున్న వారికి కూడా ఈ రియాక్షన్లు ఎక్కువ. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మధుమేహం, థైరాయిడ్ సమస్యలున్న వారికీ, కిడ్నీ వ్యాధులున్న వారికీ, రకరకాల కారణాల వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికీ ఈ బాధలు అధికం. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
కళ్లు
మస్కారా, లైనర్స్, షేడ్స్.
వీటితో కొందరికి కళ్ల నుంచి నీరు, దురద, ఎర్రబటం, ఉబ్బటం వంటివి రావచ్చు.
జుట్టు
హెయిర్ డై, హెయిర్ స్ట్రెయిట్‌నర్స్, హెయిర్ కర్లర్స్, హెయిర్ రిమూవర్లు, షాంపూలు, హెయిర్ ఆయిల్స్.
* హెయిర్ డై: జుట్టుకు వేసుకునే ఈ రంగుల్లో 'పారా ఫినిలిన్ డయామిన్(పీపీడీ)' అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది 2% కంటే తక్కువుండాలి. కానీ కొన్నింటిలో 3-4% కూడా ఉంటోంది. చాలామందిలో 'కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్'కు ఇదే కారణం. దీనివల్ల డై వేసుకున్న తర్వాత.. ముందు సున్నితమైన కనురెప్పల మీదా, కణతల దగ్గరా, చెవుల మీదా, చెవుల వెనకా, తల మీదా ఎర్రగా వాచినట్లు, బొబ్బలు పుండ్లు వస్తాయి. విపరీతమైన దురద. అరుదుగా ఒళ్లంతా రావచ్చు. హెయిర్‌డైలతో ఉన్న అతి పెద్ద సమస్య ఇది. కాబట్టి డై వేసుకునే ముందే.. చెవి వెనక చిన్న చుక్క పెట్టుకుని 24-48 గంటలు గమనించాలి. అక్కడ ఎరుపు, వాపు, దురద.. ఏమీ లేకపోతేనే ఆ డై వేసుకోవాలి. డై వాడుతున్నప్పుడు కూడా ఎప్పుడన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక మెరుస్తుండే మెటాలిక్ రంగు హెయిర్‌డైల వల్ల జుట్టు చిట్లిపోతుంది. డై పడనివారు హెన్నా వంటి సహజ ఉత్పత్తులు వాడుకోవచ్చు.
* హెయిర్ రిమూవర్స్: సాధారణంగా ఈ 'డిపైలేటర్స్'తో పెద్దగా సమస్యలుండవుగానీ.. ఈ క్రీములు నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సేపు మన చర్మం మీద ఉంటే మాత్రం తీవ్రమైన 'అలర్జిక్ డెర్మటైటిస్' రావచ్చు. ముఖ్యంగా సున్నిత జననాంగాల వద్ద ఈ క్రీములను ఎక్కువ సేపు ఉండనిస్తే దురద, వాపు వంటి రియాక్షన్లు తీవ్రంగా ఉంటాయి.
* షాంపూలు: నురుగుతో తల మీది జిడ్డును తేలికగా వదిలించాలి కాబట్టి వీటిలో 'సోడియం లారైల్ సల్ఫేట్', 'ఫార్మాల్డిహైడ్' వంటి 'సర్ఫాక్టెంట్స్' ఉంటాయి. ఒకరకంగా ఇవి మన డిటర్జెంట్ సబ్బుల్లాంటివి. వీటివల్ల అరుదుగా తల మీద 'ఇరిటెంట్ డెర్మటైటిస్' రావచ్చు. ఇక షాంపూల్లో వాడే రంగుల వల్ల- జుట్టు గడ్డిలా పొడిగా తయారవ్వటం, చిట్లిపోవటం, రంగు మారిపోవటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి.
ముఖం
ఫౌండేషన్ క్రీమ్స్, బ్లీచింగ్ ఏజెంట్స్, కలర్ మాస్కర్స్, ఫెయిర్‌నెస్ క్రీమ్స్.
* బ్లీచింగ్ ఏజెంట్స్: ఫేషియల్స్, బ్లీచ్ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్ కార్నియమ్) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే 'కాస్మొటిక్ ఇన్‌టాలరెన్స్ సిండ్రోమ్' వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.
* బ్లీచ్ కోసం.. రకరకాల ఫ్రూట్ పీల్స్, ఫ్రూట్ యాసిడ్స్ వాడటం వల్ల మొటిమలు, చీము పొక్కులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. పీల్స్ గాఢంగా ఉంటే చర్మం నలుపు తిరిగే అవకాశమూ ఉంటుంది. అలాగే పీల్స్ చేయించుకోగానే ఎండలోకి వెళితే చర్మం నల్లబారే అవకాశం ఎక్కువ.
* ఫెయిర్‌నెస్ క్రీములు: వీటితో ముఖం మీద వెంట్రుకలు దట్టంగా పెరిగే అవకాశాలుంటాయి.
* బిందీ: కుంకుమ, తిలకం వంటి వాటిలో 'ఫ్లోర్‌సిన్ డై'లు వాడతారు.ఇవి సూర్యరశ్మితో చర్య జరిపి.. ముందు నల్లటి మచ్చలు, కొంత కాలానికి బొల్లిలా తెల్లటి మచ్చలు వస్తాయి. కాబట్టి తేడాగా అనిపిస్తే వెంటనే బొట్టు మార్చాలి. ఆ ప్రదేశంలో చర్మం మీద జింక్ ఆక్సైడ్ వంటి క్రీములు మందంగా రాసుకుని, దాని మీద నల్లతిలకం వంటివి పెట్టుకోవచ్చు. లేదంటే విభూతి వంటివి దట్టంగా పెట్టుకుని, దాని మీద చిన్న బొట్టు పెట్టుకుని చూడొచ్చు. స్టిక్కర్ల వెనక ఉండే జిగురు కారణంగా 'కాంటాక్ట్ అలర్జీ'లూ ఎక్కువే.
* లిప్‌స్టిక్: లిప్‌స్టిక్‌లలో సాధారణంగా తేనె మైనం, ఫ్లోర్‌సిన్ డైలు, ఆల్కహాల్ ఉంటాయి. ఎర్రదనం కోసం వాడే ఈ ఫ్లోర్‌సిన్ డైలలో ఎక్కువగా వాడే రంగు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ముందు కొద్దిగా దురద రావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెదాలు ఎర్రగా మారి.. దురద వస్తుంది. రంగులో రంగు కలిసి పోతుంది కాబట్టి ఈ ఎర్రదనాన్ని చాలామంది గుర్తించరు. అక్కడి నుంచి పెదాలు పొడిబారిపోయి పగుళ్లు, నీరుగారటం మొదలవుతుంది. దీన్ని తగ్గించాలంటే చాలాకాలం పడుతుంది. దురద వస్తే వెంటనే లిప్‌స్టిక్ మానేసి.. కేవలం పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.
గోళ్లు
నెయిల్ పాలీష్, పాలీష్ రిమూవర్లు, ఆర్టిఫీషియల్ నెయిల్స్
* పాలీష్: చిక్కగా ఉండి, త్వరగా గట్టిపడటానికి పాలీష్‌లలో 'ఫార్మాల్డిహైడ్' తప్పనిసరిగా వాడతారు. దీనివల్ల కొన్నిసార్లు అసలుకే మోసం వచ్చి గోరు ఊడిపోయే ప్రమాదం ఉంది. గోరుచుట్లు, గోరుపైని చర్మం వాచి నొప్పి, చీముకూడా పట్టొచ్చు. గోరు రూపమే మారిపోవచ్చు. మందంగా అవ్వచ్చు, లేదా పల్చబడిపోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి పాలీష్ వేసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ వరసగా వేసుకుంటుంటే ఈ రసాయనాలు గోరులో పేరుకుపోయి.. కొంత కాలానికి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
రెండోది- నెయిల్‌పాలీష్ వేసుకున్న వారు ఆ చేతితో ఏదో ఒక సమయంలో కళ్లు నులుముకోవటం, మెడ మీద గోకటం వంటివి చేస్తారు. దీంతో సున్నితమైన కంటి చర్మం దగ్గర, మెడ మీద రియాక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు ఆడపిల్లలు క్లాసుల్లో బుగ్గన చెయ్యిపెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు గోళ్ల రంగులోని రసాయనాలు చాలాసేపు చెంపలకు అంటుకుంటాయి. వాళ్లు బయట ఎండలోకి వచ్చినప్పుడు అవి సూర్యరశ్మితో చర్య జరిపి.. చెంపల మీద అలర్జీ రియాక్షన్లకు కారణమవుతుంటాయి. ముందు ఎర్రగా ఉబ్బినట్టు వచ్చి.. నల్లగా తయారయ్యే ఈ రకం మచ్చలు అంత త్వరగా తగ్గవు కూడా!
* పాలీష్ రిమూవర్స్: దీనిలో ప్రధానంగా రంగును కరిగించే సాల్వెంట్ రసాయనం 'అసిటోన్' ఉంటుంది. దీనివల్ల గోరుచుట్టూతా ఎర్రగా వచ్చి దురదలూ, మచ్చలు, నీరు కారటం వంటి దుష్ప్రభావాలన్నీ ఉంటాయి. ఈ సమస్యలు అందరికీ రాకపోవచ్చు. కానీ అవి మొదలైనప్పుడు వెంటనే గుర్తించటం చాలా అవసరం.
ఒళ్లు
మాయిశ్చరైజర్లు, యాంటీపర్‌స్పిరెంట్లు, డియోడరెంట్లు, పెర్‌ఫ్యూములు, సన్‌స్క్రీన్లు
* యాంటీ పర్‌స్పిరెంట్స్: చెమటను నిరోధించే వీటిలో అల్యూమినియం క్లోర్‌హైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, 'క్వాటనరీ అమ్మోనియం కాంపౌండ్లు' ఉంటాయి. ఇవి చెమట తగ్గిస్తాయి. కానీ నేరుగా చర్మానికి తగలటం వల్ల చంకల్లో విపరీతమైన అలర్జీ దురదలు, బొబ్బలు, కొందరిలో గడ్డల వంటివీ వస్తాయి.
* డియోడరెంట్స్: వాస్తవానికి వీటిని నేరుగా చర్మం మీద స్ప్రే చేసుకోకూడదు. బట్టల మీదో, దూరం నుంచో స్ప్రే చెయ్యాలి. కానీ చాలామంది నేరుగా వాడతారు. వీటిలో బిథియొనాల్ వంటి 'క్లోరినేటెడ్ ఫినాల్స్' ఉంటాయి. వీటిని స్ప్రే చేసుకుని, సూర్యరశ్మిలోకి వెళితే 'ఫోటో సెన్సిటైజేషన్' వచ్చి, నల్లగా అయిపోవచ్చు. చంకల్లో చర్మం నల్లగా, దళసరిగా మారటం, దురద, అక్కడి చర్మం బాగా పల్చబడి నీరుగారుతుండటం వంటి సమస్యలన్నీ వస్తాయి.
* పర్‌ఫ్యూమ్: కేవలం అత్తర్లు, సెంటు, పర్‌ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్‌ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.
* మాయిశ్చరైజర్స్: పొడి చర్మం వారికి వీటి అవసరం ఎక్కువ. వీటిలో రెండు రకాలుంటాయి. చర్మం నుంచి నీరు ఆవిరైపోకుండా అడ్డుకునే 'అక్లూసివ్స్' కొన్నైతే.. నీరును చర్మానికి అందించే 'హ్యుమాక్టిన్స్' కొన్ని. ఎక్కువగా వాడితే ఇవి చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయి. చీముపొక్కులూ వస్తాయి. కాబట్టి వీటిని మితంగా వాడాలి. కొద్దిమందిలో ఇరిటేషన్ కూడా రావచ్చు.
* సన్‌స్కీన్ లోషన్లు: రాసుకుంటే బయటకు కనబడకుండా ఉండే రసాయనిక స్క్రీన్‌లలో 'ప్యారాఅమినో బెంజాయిక్ యాసిడ్' వల్ల చాలా మందికి, 'సినమేట్స్'తో కొద్దిమందికి రియాక్షన్లు వస్తాయి. ఇక పైకి కనిపిస్తుండే స్క్రీన్స్‌లో (క్రీడాకారులు ముఖానికి రాసుకునేలాంటివి) జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ వంటివాటితో రియాక్షన్లు తక్కువ. కాబట్టి ఈ రెండూ కలిసి ఉండే ఉత్పత్తులు వాడుకోవటం మంచిది. అలాగే లోషన్‌ను ముందు ఒకరోజు రాసుకుని.. 24 గంటలు చూసి.. ఏ సమస్యా లేకపోతేనే కొనసాగించాలి.
ఆహారం-కాస్మెటిక్స్-మందులు
మనం తీసుకునే ఆహారం, మందులు.. మనం వాడే కాస్మెటిక్స్.. మధ్య చాలా సంబంధం ఉంటుంది. అందుకు ఈ కింది సందర్భాలే ఉదాహరణ.
* 'అమినోఫిలిన్' ఉబ్బసానికి వాడే మందు. కొన్ని రకాల కాస్మెటిక్స్‌లో 'ఇథలీన్ డయామిన్' వంటి స్టెబిలైజర్స్ ఉంటాయి. ఈ కాస్మెటిక్స్ వాడి, అమినోఫిలిన్ మందు తీసుకునే వారిలో తీవ్రమైన రియాక్షన్లు రావచ్చు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.
* హెయిర్ డైలో 'పారా ఫినిలిన్ డయామిన్' ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్ధాల్లో వాడే రంగుల్లో కూడా ఇదే రంగు ఉంటుంది. ఆ హెయిర్‌డై వేసుకున్నవాళ్లు ఆ రకం ఆహారపదార్ధాలు తింటే 'క్రాస్ సెన్సిటివిటీ'తో కూడా కొన్నిసార్లు అలర్జీలు వస్తాయి.
మూలము : తెలుగు పల్లకి / Sathyaram.ch
- ===========================================