Wednesday, August 15, 2012

కోపము అవగాహం , Angry and awarenessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కోపము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...షడ్గుణాలలో ఒకటైన క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం... మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి, మరియు చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. కోపం అన్నది ఒక మానసిక ఉద్రేక స్థితి . అసలు మనము కోపం గా ఉన్నామని మనకి మొదట్లో తెలియదు . ఎదుటవారికి ... అంటే ఆ కోపాన్ని , దానివల్ల వచ్చే స్థితిని చూసి అనుభవించేవారికి మొదట తెలుస్తుంది . తను అన్నది కాదంటే బాబుకి కోపం , ఇలా ఉండకూడదు .. జాగ్రత్త అంటే పాపకి కోపం , భావాలు వ్యతిరిక్తమైనపుడు భార్యా భర్త ల మధ్య కోపం , చిన్నవాళ్ళు తమ మాట వినలేదని పెద్దవాళ్ళలో కోపము .తనని పట్టించుకోలేదని పెద్దవాళ్ళలో కోపము , తన నిస్సహాయితని చెప్పుకోలేక బలహీనుని కోపం ... ఇలా అందరి లోనూ కోపం కనబడుతూ ఉంటుంది .

  • తన కోపమె తన శత్రువు

కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు కెరోటిడ్‌ రక్తనాళాలు మందంగా మారిపోవడంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. తనకు అందరూ శతృవులవుతారు . కోపం ప్రకృతి పరమయిన సహజ ఉద్వేగం. ఇది జీవుల శరీర భౌతిక ధర్మం. నేలమీద మనుగడ సాగించే ప్రతిజీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చుకొనే పుడుతుంది. ఏ ఉద్వేగం కలిగినా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయత్త పరచే అడ్రినలిను, నారడ్రినలిను హార్మోనులు విడుదల అవుతాయి. దీనివల్ల బీపీ పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్ళూ చేతులకు రక్త ప్రసరణ ఎక్కువ కావటం, ఊపిరి ఎక్కువగా తీసుకోవటం లాంటి లక్షణాలు కనపడతాయి. అలా కోపం వచ్చినా, భయం వచ్చినా శరీరంలో జరిగే మార్పులు, కనపడే లక్షణాలు ఒకేలా ఉంటాయి.

మెదడులో భయం, కోపానికి సంబంధించిన కేంద్రాలు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం రావణ కాష్టంలా మండుతూనే(Fire)ఉంటాయి. అయితే వాటిని బయటకు పొక్కనీయకుండా బలవంతంగా ‘అణచి’(Inhibit)ఉంచే కేంద్రం కూడా ‘లింబిక్ లోబు’లోనే ఉంటుంది. ఈ కేంద్రాన్ని సడలిస్తే కోపం బయటకు వస్తుంది. ఎంత సడలింపు జరిగితే ఆ మేరకు కోపం వస్తుంది. అయితే ఈ సడలింపును అణచివేత కేంద్రం తనకు తానుగా ఇవ్వదు. మానవులలో సామాజిక ఆంశాలను పర్యవేక్షించే ‘ప్రీ ప్రాంటల్ కార్టెక్సు’ ఆదేశాలను అందుకొని దాని ప్రకారం సడలిస్తుంది. నిత్యం మనముందు జరిగే సామాజిక సంఘటనల ఆధారంగా ‘ప్రాంటల్ కార్టెక్సు’ (వ్యవహార సౌలభ్యం కోసం దీనే్న మనసు అనుకుందాం) స్పందిస్తుంది. కోపాన్ని తెప్పించే సంఘటన జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి సడలింపు ఆదేశాలను ఇస్తుంది. మనం ‘అదిపని’గా పట్టించుకోనంత వరకూ ఈ చర్య యథాలాపంగా జరిగిపోతుంది. కానీ మనం పట్టించుకుంటే మాత్రం సడలింపు ఆదేశాలు ఇవ్వటమా, వద్దా అనేది నూటికి నూరు పాళ్ళు‘మన’(Will power)అదుపులోకి తీసుకోవచ్చు.

  • కోపం అనచివేయడం :
మనం సామాజిక జీవులం కాబట్టి పుట్టుకతో వచ్చే సహజ ఉద్వేగాలను అలాగే వదిలేస్తే కుదరదు. వాటిని సమాజ పరిస్థితులకు తగ్గట్టు అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపు పుట్టుకతో రాదు. ఎదిగే కొద్ది ఎవరికి వారు నేర్చుకోవాలి. దీనినే 'సామాజకీకరణ'(Socialization)అంటాము. అందులో భాగంగా సహజ ఉద్వేగం అయిన కోపాన్ని మన అదుపులో ఉంచే ‘ఓర్పు నేర్చుకోవాలి. వ్యక్తి పెరిగే వాతావరణం, పరిసరాలు, కుటుంబ కట్టుబాట్లు, చుట్టూ ఉన్న సమాజం దన్నుగా ఓర్పు రూపొందుతుంది. ఇది ఎంత బలంగా ఏర్పడితే కోపాన్ని అణచే కేంద్రానికి అంత బలం చేకూరుతుంది. కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికో కారణం కావాలి. మన చుట్టు ఉండే వ్యక్తులు, పరిస్థితులు, సందర్భాలు కోపం రావటానికి కారణాలుగా ఉంటాయి. కారణ తీవ్రతను బట్టి విడుదల అయ్యే కోపం ఏ రూపంలో, ఎంత త్వరగా, ఎంత తీవ్రతతో ప్రదర్శించాలనే తేడాలు ఉంటాయి. సంఘటన పట్ల అవగాహన, దాన్ని అర్థం చేసుకునే తీరు, అలవర్చుకున్న ‘ఓర్పు’ తదితర అంశాలు దీన్ని నిర్ణయిస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే నిరంతరం రగులుతూ ఉండే కోపాన్ని బయటకు రానివ్వటమా, వద్దా అనేది మన మనసులో ఉన్న ‘అణచివేత-విడుదల’ బలా బలాలపై ఆధారపడి ఉంటుంది. కోపం రావటం అంటూ జరిగితే అటు పూర్తిగా జంతు ప్రవర్తన అయిన కొట్లాట నుండి ఇటు అత్యంత నాగరికమయిన సహాయ నిరాకరణ వరకూ ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఎంత తీవ్రంగా అయినా ఉండవచ్చు.

మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమయిన సహజ పరిస్థితుల (ప్రాణాపాయం, మనుగడ) కంటే సామాజిక పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం, తదితర అంశాలకు భంగం వాటిల్లినప్పుడు కోపంపై ఉన్న అణచివేత వైదొలుగుతుంది. వచ్చే కోపాన్ని వ్యక్తీకరించటంలో కూడా ఇదే వైవిధ్యం కనపడుతుంది. మిగతా జీవులు పోరాటం, పలాయనం అనే ఆదిమ పద్ధతుల్లో మాత్రమే కోపాన్ని వ్యక్తీకరిస్తాయి. మనుషులు అరవటం, తిట్టటం, అవమాన పర్చటం, చెయ్యి చేసుకోవడం, దాడి చేయడం, వస్తువులు పగలగొట్టటం లాంటి ‘చురుకు కోపపు’(Active Aggression)రూఫాలతో పాటు, మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగటం, సహాయ నిరాకరణ లాంటి ‘మెతక కోపపు’(Passive Aggression)రూఫాలలో కూడా చూపుతారు.


  • కోపాన్ని తగ్గించుకోగలమా?

ప్రతి వ్యక్తికీ ఏదో ఒకసందర్భంలో కోపం, ఉద్రేకం, ఆవేశం రాకుండా ఉండవు. కోపం వస్తే మనం దానిని ఏవిధంగా వ్యక్తం చేస్తామనే విష యంలో మనుష్యుల మధ్య తేడాలుంటాయి. కొంతమంది తాము కోపిష్టులమనీ, తమకు టెంపర్‌ ఎక్కువనీ చెప్పుకుంటారు. సాధారణంగా ఈ రకం మనుష్యులు తమ కోపాన్ని ఇంట్లో భార్య మీద, పిల్లల మీద చూపుతుంటారు. కానీ, తమ పైఅధికారిపై చూపించరు. అంటే అధికారి వద్ద కోపాన్ని అణచుకుంటారు. దీని అర్థం మనకు కోపాన్ని నిగ్రహించుకోవాలనే ఆలోచన ఉంటే కొంతవరకైనా తప్పనిసరిగా నివారించుకో గలుగుతాము. కోపం వలన చాలా సందర్భాలలో నష్టాలు ఎదురైనప్పటికీ, కొంత మేరకు లాభాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కంఠస్వరం స్థాయి పెంచి, గట్టిగా గద్దిస్తూ చెబితే తప్ప పనులు కావు. అయితే ఇలా గద్దించడంపై నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తే, పనులు జరుగవు సరికదా, నలుగురిలో మనం కోపిష్టులమనే చెడ్డపేరు కూడా వస్తుంది.

కోపం రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని వ్యాధులకు గురైన వారు కూడా అకారణంగా కోపాన్ని ప్రదర్శిస్తుంటుం టారు.
ఉదాహరణకు తలకు గాయమైన వారు, మూర్ఛవ్యాధి, కొన్ని రకాల మానసిక వ్యాధులకు గురైన వారు అకారణంగా ఇతరులపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
ప్రస్తుతం వ్యాధుల వలన కాకుండా, వ్యక్తిత్వంలో భాగంగా అతిగా కోపాన్ని ప్రదర్శించే వారి గురించి చర్చిద్దాం.
మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి కోపం రావడం ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతి త్వరగా కోపం ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం.
పెద్దవాళ్లు ప్రతి చిన్న విషయానికీ అరవడం, పిల్లలను కొట్టడం వంటిపనులు చేస్తుంటే, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. పరిస్థితుల ప్రభావం వలన మనకు కోపం వచ్చిన ప్పుడు పక్కవారిపై అరుస్తాము. అంతే త్వరగా మర్చిపోతాం కూడా.
కొంతమంది మాత్రం కోపం వస్తే బైటకు చెప్పలేక, లోలోపలే గంటల కొద్దీ ఆలోచించి, బాధపడి తమ ఆరోగ్యం పాడు చేసుకుంటారు.
అంటే కోపాన్ని బైటకు వ్యక్తం చేసినప్పుడు పక్కవాళ్లకు, వ్యక్తం చేయకపోతే కోపం వచ్చిన వాళ్లకు బాధ కలుగుతుంది.
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మునులు, సాధువులు, రుషులకే సాధ్యమని అంటారు. మనం కోపాన్ని నిగ్రహించులేకపోయినప్పటికీ, దానిని వీలైనంత తక్కువస్థాయికి తగ్గించుకో వచ్చు. అప్పుడే కోపాన్ని సరైన పద్ధతిలో వ్యక్తం చేయడం సాధ్యమవుతుంది.
ఈ విషయంలో మనం మారాలని అనుకున్నప్పుడు ముందుగా మనకు ఈ సమస్య ఉందని తెలుసుకోవాలి. తరువాత మారాలనే నిర్ణయం తీసుకోవాలి. కోపం కలుగడానికి పని వత్తిడి ఒక కారణమైతే, మన మాటకు ఎదుటివారు విలువ ఇవ్వడం లేదనే అంశం మరొక కారణం.
కోపాన్ని నిగ్రహించుకోవాలనుకునే వారు ముందుగా రెండువారాల పాటు తమ ప్రవర్తనను తామే అధ్యయనం చేసుకోవాలి.
ఏఏ సందర్భాలలో కోపం వస్తున్నదో సమీ క్షించుకోవాలి.
మన ప్రవర్తన ఎలా ఉంటున్నది? దీని వలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? అనే విషయాలను పరిశీలించాలి. వీటి ఆధారంగా మనలో మార్పు కోసం ఎటు వంటి ప్రయత్నాలు చేయాలో ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
పని భారం ఎక్కువై తన పైఅధికారిపై కోపం వచ్చినప్పుడు దానిని వ్యక్తీకరించలేక, ఇంట్లో భార్యాపిల్లల మీద చూపుతూ, తనలో తాను తిట్టుకోవడమే తప్ప మరేమీ చేయలేని స్థితిలో పడటం కొంత మందిలో గమనిస్తుంటాము.
వీరికి కోపం తెప్పించేవారిపై కాకుండా, దానిని భరించే వారిపై కోపాన్ని చూపడం అలవాటుగా మారుతుంది.
ఇంకొంత మందిలో తనలో తాను మాట్లా డుకోవడం అలవాటు ఉంటుంది. వీరు కోపాన్ని వ్యక్తం చేయకుండా, కోపానికి కారణ మైన వారిని తమ మనస్సుల్లోనే తిట్టుకుంటూ ఉంటారు. తమతో ఏకీభ వించే వారితో చర్చిస్తుంటారు. దీని వలన కోపం స్థాయి పెరగడమే తప్ప దానిని తగ్గించుకోవడం సాధ్యం కాదు.
ఇలా కోపంస్థాయి పెరుగుతున్నప్పుడే దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. తనలో తాను మాట్లాడుకోవడం (సెల్ఫ్‌ టాక్‌) ద్వారా ఒక దశ వరకూ మనం కోపాన్ని ఆపుకోగలం.

  • కోపాన్ని తగ్గించుకునే మార్గాలు :
ప్రతి ఒక్కడూ ఇతర్లని సంస్కరించే పనిలో వుంటాడు. ఇతర్లకు నీతులు బోధిస్తూ వుంటాడు. మనిషి నిజానికి సంస్కరించాల్సింది సమాజాన్ని కాదు. వ్యక్తుల్ని కాదు. తనను తాను సంస్కరించుకోవాలి. తనను తాను అనుక్షణం పరిశీలించుకోవాలి. చిన్నప్పటినుంచీ మనకు తెలీకుండా సమాజం ద్వారా, కుటుంబం ద్వారా మనకు ఎన్నో లక్షణాలు అలవడి వుంటాయి. వాటిని బట్టే మనం నడుచుకుంటూ వుంటాం. మన ఆనందం, దుఃఖం వాటిని బట్టే వుంటాయి.
అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మనల్ని మనం పరిశీలించుకుంటే ఏవి మంచివో ఏవి చెడ్డవో తెలిసి వస్తాయి. అపుడు ఏ లక్షణాల్ని మనం నిలుపుకోవాలో వేటిని మనం వదిలిపెట్టాలో తెలిసివస్తుంది. ఆ చైతన్యం కలిగితే మనం ఎదిగే అవకాశం వుంది. అప్పుడు మనం యింకొరిలాకాక మనం మనంగా వుండే వీలుంటుంది. ఉదాహరణ :
ఆర్మీనియా దేశంలోగూర్జియేఫ్ అన్న తాత్వికుడు జన్మించాడు. గత శతాబ్దం ఏడో దశకంలో పుట్టి ఈ శతాబ్దం ఐదో దశకం దాకా జీవించాడు. పుస్తకాల ద్వారా కాక అనుభవాల నుండి జీవితాన్ని మలచుకోవడం గురించి ఆయన చెప్పాడు.
జీవితంతో ఆయన ప్రయోగాలు చేశాడు. ఆయన పద్ధతులు మోటుగా వుండేవి. ఆయన స్వతంత్ర చింతనగలవాడు. స్వేచ్ఛగా పెరిగాడు. తండ్రి ఎంతో ప్రేమగా పెంచాడు. ఎన్నో విషయాలు నేర్పించాడు.
గూర్జియేఫ్ తండ్రి మరణశయ్యపై వున్నపుడు కొడుకును దగ్గరకు పిలిచాడు. కొడుక్కి గొప్ప సలహాయిచ్చాడు. యిప్పటిదాకా ఏ తండ్రీ ఏ కొడుక్కీ అంత గొప్ప సలహా ఇచ్చి వుండడు. అప్పటికి గూర్జియేఫ్ వయసు తొమ్మిదేళ్ళు.
తండ్రి ‘బాబూ! నిజానికి యిప్పుడు నేను చెప్పే మాటల్ని నువ్వు అర్థం చేసుకుంటావో లేదో నాకు తెలీదు. నీది చిన్నివయసు.
ఐనా యిప్పుడు చెప్పక తప్పదు. ఎందుకంటే యివి నా చివరిమాటలు. వీటిని జీవితాంతం గుర్తుపెట్టుకో. నువ్వు పెద్దవాడయ్యాకా వాటి గురించి ఆలోచిస్తావన్నాడు. కొడుకు తప్పకుండా గుర్తు పెట్టుకుంటానన్నాడు.
తండ్రి ‘నీ కోసం నేను ఎట్లాంటి ఆస్తిపాస్తులూ కూడబెట్టలేదు. నీకు యివ్వడానికి నాదగ్గర ఈ మాటలు మాత్రమేవున్నాయి. అవి ఏమిటంటే ఏదయినా సందర్భంలో ఎవరయినా నిన్ను తిట్టినా, రెచ్చగొట్టినా ఆవేశపడకుండా ‘నాకు ఇరవై నాలుగు గంటల సమయమివ్వండి. నేను యింటికి వెళ్ళి మీరు చెప్పిన విషయాలగురించి ఆలోచించుకుని వస్తాను. వాటిలోని తప్పొప్పుల గురించి విచారిస్తాను. అపుడు నాకు ఏది సయింది? ఏది కాదు? అని తెలిసివస్తుంది. అపుడు మీకు సమాధానమిస్తాను’ అని చెప్పు అన్నాడు.
గూర్జియేఫ్ తండ్రి మాటల్ని జీవితాంతం ఆచరించాడు.
గూర్జియేఫ్ ఒకవూరి గుండా వెళుతూ వుంటే ఎవరో ఆయన్ని ఆపి వాదనకు దిగారు. తిట్టారు.. ఆయనవాళ్ళ మాటలన్నీ ఓపిగ్గా విని ‘నాకు ఒక రోజు సమయమివ్వండి. మీ మాటలకు రేపు బదులిస్తాను’ అన్నాడు.
వాళ్ళు ఆశ్చర్యంగా ‘చిత్రంగా వుందే. యిట్లా సమాధానమిచ్చిన మనిషిని యిప్పటిదాకా మేము చూడలేదు. మేము కోపంగా తిట్టాం. వాటిని నువ్వు శాంతంగా విన్నావు. తిరిగి తిట్టలేదు. పైగా రేపు వచ్చి చెబుతానంటున్నావు. నువ్వుపిచ్చివాడిలా వున్నావ్’ అన్నారు.
గూర్జియేఫ్ ‘నేను యింటికి వెళ్ళి మీరు చెప్పిన మాటల్ని పునరాలోచించుకుంటాను. నా గురించి నేను తప్పు చేసినట్లు, నాది పొరపాటని నిందించారు. ఆ విషయం నిజమో కాదో ఆలోచించుకుంటే తప్ప నాకు అంతుబట్టదు, అందుకని సమయం కోరుతున్నా’ అన్నాడు. వాళ్ళు చిత్రంగా చూసి వెళ్ళిపోయారు.
గూర్జియేఫ్ యింటికి వెళ్ళి ఆ విషయాల గురించి మనసులో చర్చించుకుని మరుసటి రోజు తనని తిట్టిన వాళ్ళదగ్గరికి వెళ్ళి ‘మీరు చెప్పింది సరైందే. నాలో తప్పులున్నాయి నన్ను మన్నించండి’ అని క్షమాపణ కోరాడు.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.