Saturday, October 20, 2012

Emotion - ఆవేశము
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Emotion - ఆవేశము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మనిషి ఎందుకు నవ్వుతాడు? ఎందుకేడుస్తాడు. హుషారుగా ఉంటాడెందుకని? కోపం తెచ్చుకుంటాడెందుకు? కొన్ని భయాలు మనిషిని ఎందుకు వెంటాడుతాయి? ఇవన్నీ మనుషుల్లో సాధారణంగా మనం గమనించే కొన్ని ఆవేశాలు. ఎందుకు ఇలా జరుగుతుందనే దృగ్విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఉదాహరణకు ఒక ప్రత్యేక సందర్భానికి స్పందించిన ఒక వ్యక్తి మరోసారి పిచ్చి కోపంగా ప్రవర్తిస్తాడు. సరిగ్గా అటువంటి సందర్భానికే మరొక వ్యక్తి మౌనంగా ఉండిపోతాడు. ఫోబియాలతో వ్యక్తిత్వాన్ని మసక బార్చుకుంటారు కొంతమంది. అసలు ఆవేశాలు అంటే ఏంటి? ఆలోచన, ఆవేశం మానవజాతి ప్రత్యేక సొత్తు. ఇదంతా మనసుకు సంబంధించిన వ్యవహారం. ప్రకృతిలో మానవజాతి అవతరించే వరకూ కూడా దేహం మాత్రమే పరిణామానికి గురవుతూ వచ్చింది. మానవావతవరణ నుండీ మనస్సు పరిణామం చోటుచేసుకొంది. ఇక్కడి నుంచీ వేదనలు, భావనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆవేశం వల్ల తీవ్రమైన కలతకు గురవుతాడు మనిషి. ఇవి మానసికంగా మొదలవుతాయి. ఫలితంగా  స్పృహలో ఉండే అనుభవాలతో, అంతరంగాలలో చర్యల ఫలితంగా ఈ ఆవేశాలు ఉత్పన్నమవుతాయి.ఉత్సాహం, సంతోషం, ఆశ, ప్రేమ,కోపం, అసూయ, అనుమానం, నిరాశ, భయం, నిస్పృహ.... ఆవేశాలు అంటే ఇవే. మనిషి ఆవేశాలు, దానితో ముడిపడి వున్న అతని ప్రవర్తన అటు మానసిక శాస్త్రవేత్తలకు ఇటు సామాన్య జనానికి ఆసక్తికరమైన అంశంగా తయారయింది. అయితే ఆవేశాల ప్రభావం మనిషి శారీరక, మానసిక వ్యవస్థలపై తీవ్రంగా ఉంటుందనే విషయం స్పష్టమయింది.

ఆవేశాలు - విశేషాలు

ఆవేశాలు మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. సామాజిక అనుబంధాలు, ఇతర ప్రేరణల కారణంగా మనిషి ఆవేశానికి లోనవుతాడు. ఆవేశానికి గురయిన వ్యక్తి ఆలోచనా, కారణాలను మర్చిపోతాడు. కోపంతో రగిలిపోతున్న వ్యక్తికి తార్కికవాదం పనిచేయదు. ఒక్కో ఆవేశానికి ఒక్కో రకంగా ప్రతి చర్య ఉంటుంది. మనిషి కోపంగా ఉన్నప్పుడు ఏ మాట విన్నా మరింత కోపోద్రిక్తుడవుతాడు. అదే మనిషి భయం పొరల్లో ఇరుక్కుపోతుంటే పారిపోయే ప్రయత్నంలో ఉంటాడు.

మానవ ఆవేశాలు చాలా విస్తృతంగా ఉంటాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. అనుకూల లేదా ఆనందకరమైన ఆవేశాలు. రెండవ రకం ప్రతికూల లేదా ఆనందరహిత ఆవేశాలు. ఆనందకరమైన ఆవేశాలంటే ఉత్సాహం, సంతోషం, ఆశ, ప్రేమ, అంగీకరించడం వంటివి. ఆనంద రహిత ఆవేశాలంటే కోపం, అసూయ, అనుమానం, నిరాశ, భయం, నిస్పృహ. ఈ ఆనంద రహిత ఆవేశాలు మనిషి మానసిక, శారీరక స్థితులకు హాని చేస్తాయి. ఉదాహరణకు మనిషి అసూయతో ఉన్నాడంటే అది అతని మానసిక ధోరణిని, ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇది ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చకపోగా అనారోగ్యాన్ని సృష్టిస్తుంది. అసూయ అనేది ఉద్యోగస్తులలోనే కాదు, సామాన్య జనంలో కూడా ఎక్కువగానే వుంటుంది. ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితుల ఉన్నతిని చూసి ఓర్వలేనివారు ఉంటారు. వీరు ఇతరులతో పోల్చుకుంటూ అసూయకు బానిసలై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు.

ప్రతి ఆవేశం ఒక్కొక్క రకమైన స్పందనను సృష్టిస్తుంది. భయం మనిషిలో 'తిరగబడు', 'పారిపో' అనే అనుక్రియలను కల్గిస్తుంది. కోపం కలహ ధోరణిని రెచ్చగొడుతుంది. సంతోషం, ప్రేమ వంటివి ... అభిమానాన్ని, ఆప్యాయతను సృష్టిస్తాయి. ఆవేశానికి లోనయిన మనిషి చేతులకు చెమట పడుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు ఎక్కువవుతుంది. శరీరంలోని అవయవాలకు రక్త సరఫరాలో, ముఖ కవళికల్లో మార్పు కన్పిస్తుంది.

''షాక్‌ వార్త విని ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది'' అంటుంటారు. అంటే ఆవేశాలకు గుండె ఒక గుర్తు. మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆవేశం మార్పు తీసుకొస్తుంది. ఆవేశ, సందిగ్ధ పరిస్థితులలో మనిషికి శ్వాస స్థంభించినట్లవుతుంది. కనుపాపలు ఆవేశానికి ప్రతిరూపంగా కన్పిస్తాయి. కోపం, నొప్పి, ఉద్రేకం వంటివి వచ్చినప్పుడు కనుపాపలు పెద్దవవుతాయి. శరీరంలోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. నోరు పొడారిపోతుంది.

ఎక్కువ ఒత్తిడి, ఆతృత వల్ల శరీరంలో అల్సర్లు వస్తాయని వైద్య విజ్ఞానంలో నిరూపితమైంది. రక్తంలోని అంశీభూతాల నిర్మాణ నిష్పత్తిలో కూడా తేడాలు వస్తాయి. రక్తంలోకి విడుదలయ్యే అడ్రినల్‌ హార్మోన్‌ అవేశ సమయంలో మనిషి శారీరక స్థితిని బాగా ప్రభావితం చేస్తుంది. ఆనందం, సంతోషం, ఉత్సాహం వంటి అనుకూల ఆవేశాలు శరీరానికి మేలు చేస్తాయి. సంతోషం స్థాయి ఉప్పొంగిపోయే స్థితి నుండి పారవశ్యం చెందేవరకు ఉండొచ్చు. ప్రతికూల ఆవేశాలు అయిన దుఃఖం, అసహ్యం, భయం, కోపం వంటివి వినాశనకర ఫలితాలు తెచ్చిపెడతాయి. నిద్రలేమి కల్గుతుంది.

ఏం చెయ్యాలి?

మనిషి తనను తాను అదుపు చేసుకోగల్గాలి. ప్రతికూల ఆవేశాలకు లొంగకుండా అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. ముఖ్యంగా మానసిక క్రమశిక్షణతో అసూయ, ఏవగింపు, కోపం, భయం వంటి ఆవేశాలను దరిచేరకుండా జాగ్రత్తపడొచ్చు. యోగా, ధ్యానం, సంగీతం వంటి వాటిని ఆశ్రయిస్తే ఈ ప్రతికూల ఆవేశాలను జయించగల్గుతారు. ఈ ప్రతికూల ఆవేశాలు తెచ్చే అనర్థాలను అర్థం చేసుకుని, వాటికి లొంగకూడదని నిర్ణయించుకుంటే సుఖసంతోషాలతో ఉండడమే కాక తమ మానసిక శక్తిని ఉత్పాదక పనులకు వినియోగించుకో గల్గుతాడు. ఆవేశాలను అర్థం చేసుకోవాలి. ప్రతికూల ఆవేశాల నుండి తప్పించుకోవాలనుకుని, వాటిని ఆచరణలో పెట్టాలి. దీనికి బోలెడంత కృషి కావాలి. కొంత సమయం పడుతుంది. అయినా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయి.

- C.V.Sarveswarasharma @prajasakti news paper... Edited / Dr.Seshagirirao -MBBS
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.