''రొమ్ములో నొప్పిగా ఉంటోంది..'' అని కొందరు ఫిర్యాదు చేస్తే.. ''అప్పుడప్పుడూ స్రావాలూ విడుదలవుతున్నాయి..'' ''తడుముతుంటే గడ్డల్లా తగులుతున్నాయి'' అంటుంటారు మరికొందరు. సమస్య ఎలాంటిదైనా క్యాన్సరేమో అనే భయం మాత్రం అందరిలోనూ ఉంటుంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది నిర్ధరించుకోవడం చాలా అవసరం.
పుట్టినప్పట్నుంచే స్త్రీల వక్షోజాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని సమస్యలూ ఎదురవుతాయి. సాధారణంగా రొమ్ములో నొప్పీ, అసాధారణ స్రావాలూ, గడ్డలూ, ఆకృతిలో తేడాల వంటి సమస్యల్ని చాలామంది ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. పైగా అవి పుట్టిన పాపాయి దగ్గర్నుంచీ, రుతుక్రమం మొదలైనప్పుడూ, యౌవనంలో, గర్భిణిగా ఉన్నప్పుడూ, బిడ్డకు పాలిచ్చేప్పుడూ, నడివయసు నుంచి మెనోపాజ్ వరకూ... ఇలా ఏ దశలోనయినా ఇబ్బందిపెట్టవచ్చు. వీటిలో ఏవి హాని కలిగించేవో తెలియాలంటే మొదట వక్షోజాల నిర్మాణం గురించి తెలుసుకోవాలి. రొమ్ముల్లో అతి ముఖ్యమైన భాగం పాల గ్రంథి అయినప్పటికీ ఇతర కణజాలం కూడా ఉంటుంది. చర్మం, కొవ్వు పదార్థం, మందమైన టిష్యూ పొర (ఫేసియా), కండరాలూ, పక్కటెముకలూ, చనుమొనల వంటివన్నీ వాటి నిర్మాణంలో భాగమే. ఇవన్నీ ఒక్కో వయసులో ఒక్కోరకమైన మార్పు చెందుతూ వస్తాయి. పాల గ్రంథులైతే హార్మోన్లకి ఎక్కువగా స్పందిస్తాయి.
నొప్పి ఎందుకంటే...
ప్రతి స్త్రీకి ఏదో ఒక వయసులో ఈ బాధ ఉంటుంది. చాలామంది ఈ నొప్పి క్యాన్సర్‌కి సంకేతం అని భయపడతారు. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైక్లికల్. అంటే రుతుచక్రంతో ప్రతినెలా వచ్చే నొప్పి. ఇది నెల మధ్యలో మొదలై నెలసరి సమయం వరకూ పెరుగుతూ ఉంటుంది. హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల వక్షోజాల్లోని కణాల్లో స్రావాలు ఎక్కువై, నొప్పి వస్తుంది. వక్షోజాలు కాస్త గట్టిగా అనిపిస్తాయి. ఈ నొప్పి మన శరీరధర్మంలో భాగం కాబట్టి భయం లేదు. నొప్పి నివారణ మందులు, విటమిన్ ఇ, ఈవెనింగ్ ప్రిమ్‌రోజ్ మాత్రల రూపంలో తీసుకోవడం, వక్షోజాలకు ఆసరా ఉండే లోదుస్తులు ధరిస్తే ఉపశమనం ఉంటుంది. నెలసరికి కొన్ని రోజుల ముందు కాఫీలూ, టీలూ, శీతలపానీయాలూ, వేపుళ్లూ తగ్గించుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. అయినా ఫలితం లేదనుకుంటే సమస్య తీవ్రతను బట్టి మూత్రవిసర్జన ఎక్కువ కావడానికి మందులూ సూచిస్తారు వైద్యులు. కొన్నిసార్లు రుతుక్రమంతో సంబంధం లేకుండా కూడా నొప్పి ఉంటుంది. రొమ్ములో స్రావాలు నిలిచిపోయి, చిన్నచిన్న నీటి బుడగల్లా తయారైనా, లేదా రొమ్ములోని పాల నాళాల్లో స్రావాలు గట్టిపడినా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు. ఒక్కోసారి రొమ్ముపైన సెగ్గడ్డల్లాంటివీ వస్తాయి. అప్పుడూ నొప్పి సహజం. అలాంటప్పుడు వైద్యులు పరీక్షించి కారణం తెలుసుకుని చికిత్స సూచిస్తారు.
చనుమొనల నుంచి స్రావాలు...
ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరులాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది చిక్కగా, నెత్తురులా ఉండటం, బూడిద రంగులో, చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఇటువంటి డిశ్ఛార్జి ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ లేదా పాల నాళాల్లో ప్యాపిలోమా గానీ క్యాన్సర్‌గానీ ఉందనడానికి సంకేతం. మామోగ్రామ్ చేస్తారు. ఆ స్రావాన్ని గాజుపలకపై సేకరించి పరీక్షిస్తారు. కారణం తెలుసుకుంటారు. కొన్నిసార్లు పాలలాంటి స్రావం కూడా చనుమొనల నుంచి వస్తుంది.
గెలక్టోరియా: అంటే వక్షోజాల నుంచి పాలు స్రవించడం, పాలిచ్చేప్పుడు కాకుండా ఇతర సమయాల్లోనూ ఇలా స్రవిస్తుంటే దీనికి కొన్ని కారణాలుంటాయి. మొదటిది ప్రొలాక్టిన్ లేదా పాల హార్మోను ఎక్కువగా తయారుకావడం. ఇది మెదడులో ట్యూమర్లతో, లేదా మూత్రపిండాల వైఫల్యం, లేదా కొన్నిరకాల మందులు వాడటం వల్ల కావచ్చు. ఒత్తిడి నివారణకు సంబంధించిన మందులు వాడటం వల్లా కావచ్చు. ఫలితంగా ప్రొలాక్టిన్ స్థాయులు పెరుగుతాయి. ఇలాంటప్పుడు నెలసరి ఆలస్యం అవుతుంది లేదా నిలిచిపోతుంది. ప్రొలాక్టిన్, థైరాయిడ్, ట్యూమర్ లేదని నిర్ధరించుకోవడానికి మెదడుకి సీటీస్కాన్ లాంటి పరీక్షలు అవసరం. ఒకవేళ వాడే మందులే కారణం అనుకుంటే వాటిని మానేయమంటారు వైద్యులు. మందులు సూచిస్తారు. ఇలాంటి స్రావాలు కనిపించగానే చాలామంది క్యాన్సర్ అనుకుంటారు కానీ తొంభై అయిదుశాతం పై కారణాలే ఉంటాయి.
వక్షోజాల్లో గడ్డలు...
చేతికి గడ్డలు తగులుతున్నాయని చెబుతుంటారు చాలామంది. చాలామంది పాలగ్రంథినే గడ్డ అనుకుని కంగారుపడతారు. అయితే రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రెండువేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే ఉంటాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి, పరీక్షించుకుంటే నిజంగానే గడ్డలు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఆ సందేహం ఉంటే గనుక వైద్యులు మామోగ్రఫీ సూచిస్తారు. దీన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చేయొచ్చు. ఎక్స్‌రే ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు కూడా వ్యాధి నిర్ధరణ కాకపోతే ఎంఆర్‌ఐ చేస్తారు. నిజంగా గడ్డ ఉంటే గనుక తరవాత ఎఫ్.ఎన్.ఎ.సి. (ఫైన్ నీడిల్ యాక్టివేషన్ సైటాలజీ) పరీక్ష చేయించుకోమంటారు. సన్నటి సూదితో గడ్డలోని కణాలు సేకరించి వాటిని మైక్రోస్కోప్‌తో పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి బయాప్సీ చేస్తారు. బాగా అనుమానం ఉంటే గడ్డ తీసి పరీక్షిస్తారు. దానివల్ల అది క్యాన్సరా కాదా అన్నది తెలిసిపోతుంది.
సాధారణంగా చిన్నవయసులో చేతికి తగిలే గడ్డలు ఫైబ్రోఎడినోమా కావచ్చు. అవి తేలిగ్గా రొమ్ములో తగులుతాయి. చనుమొనల నుంచి ఎలాంటి స్రావాలూ విడుదలకావు. పెద్దగా ఉండి, వాటితో సమస్యలొస్తుంటే తప్ప చికిత్స అవసరంలేదు. వాటి పరిమాణం పెరుగుతూ, నొప్పీ ఉంటే గనుక శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించాలి. కొన్నిసార్లు వక్షోజాల్లోని కొవ్వంతా గడ్డకట్టి కూడా గడ్డలా తయారవుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా గడ్డలా చేతికి తగులుతుంది. అప్పుడు మాత్రం జ్వరం, గడ్డ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఆ గడ్డ గట్టిగా రాయిలా వక్షోజం లోపల అతుక్కుని ఉంటే పైన చర్మం కూడా దానికి అతుక్కుపోయి, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలూ వస్తుంటే క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.
బాలింతల్లో...
పాపాయికి పాలుపట్టడం కోసం వక్షోజాలను గర్భం దాల్చినప్పటి నుంచి చనుమొనల విషయంలో శ్రద్ధ పెట్టాలి. వక్షోజాలపై చర్మానికి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరినూనె, నెయ్యి లాంటివి రాసుకోవచ్చు. ప్రసవ సమయం దగ్గరపడుతున్నకొద్దీ చనుమొనల్లోని నాళాలు తెరచుకుని ఉన్నాయా లేదా గమనించుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే పాలివ్వడం మొదలుపెట్టాలి. లేదంటే పాలు తయారయ్యే సమయంలో రొమ్ములు బాగా గట్టిపడిపోయి, రెండుమూడు రోజులు నొప్పిగా అనిపిస్తాయి. వక్షోజాల్లో రక్తప్రసరణ ఎక్కువ కావడం, లింఫ్ గ్రంథుల్లో స్రావాలు పెరగడం దీనికి కారణం. ఈ సమయంలో కొందరికి బాహుమూలల్లో వాపు వచ్చేస్తుంది. ఇది సహజమైన వాపు. అలాగే చనుమొనలపై శ్రద్ధపెట్టకపోతే అవి పొడిబారి పగుళ్లు వచ్చి, బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశముంది. దాంతో విపరీతమైన నొప్పీ, వాపూ, ఎర్రబడటం, జ్వరం లాంటివి బాధిస్తాయి. ఇలాంటప్పుడు యాంటీబయోటిక్స్ వాడాల్సి రావచ్చు. ఆపరేషన్ చేసి చీము తొలగిస్తారు.
ఈ జాగ్రత్తలు అవసరం..
ప్రతినెలా నెలసరి అయిపోయిన వెంటనే వక్షోజాలను పరీక్షించి చూసుకోవాలి. ఏడాదికోసారి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న స్త్రీలు ముప్ఫైఅయిదు సంవత్సరాల నుంచి, ఇతరులు నలభై ఏళ్ల నుంచి ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి.
courtesy with Dr.Y.Savithadevi@Eenadu vasundhara news paper 01/09/2014
- ==========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.