Saturday, September 13, 2014

Premature Overian failure-ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Premature Overian failure-ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


   అండాశయాలు కొందరిలో నలభైఏళ్లకన్నా ముందుగానే తమ పనిని ఆపేస్తాయి. దాంతో ముందే నెలసరులు ఆగిపోతాయి. ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి! మెనోపాజ్‌ లక్షణాలు ముందుగానే కనిపించే ఈ సమస్యనే 'ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌' అంటారు.

అండాశయాలు.. స్త్రీ లక్షణాలు ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణం. స్త్రీ ఆకృతి, నెలసరులూ, సంతాన సాఫల్యత ఇవన్నీ అండాశయాల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మెనోపాజ్‌ దశలోనే ఇవి తన పనితీరు ఆపేస్తాయి. దాంతో నెలసరులు ఆగిపోవడం.. ఎముకలు గుల్లబారడం ఇలా చాలా సమస్యలొస్తాయి. కానీ మెనోపాజ్‌ రాకుండానే కొందరిలో అండాశయాలు తన పనితీరు ఆపేస్తాయి. దాన్నే 'ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌' అంటారు. దాంతో ఈస్ట్రోజెన్‌ హార్మోను అందదు. అండాలు సరిగ్గా విడుదల కావు. ఫలితంగా సంతాన సాఫల్యతా తగ్గుతుంది.

లక్షణాలివి..
నెలసరిలో తేడాలు మొదలవుతాయి. రక్తస్రావం ఎక్కువగా లేదా తక్కువగా కావచ్చు. రోజులతరబడి ఉండొచ్చు. మరికొన్నిసార్లు నెలల తరబడి అసలు నెలసరే రాకపోవచ్చు. ఈ సమస్య సాధారణంగా ప్రసవమయిన వారిలో, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం ఆపేశాక ఎదురుకావచ్చు. ఒంట్లో ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, జననేంద్రియాలు పొడిబారడం, మంటగా అనిపించడం, లైంగికవాంఛలు తగ్గడం వంటివి దీని లక్షణాలు.

ఎందుకిలా..
అసలు అండాశయాల పనితీరు ఎలా ఉంటుందనేదీ తెలుసుకోవాలి. సాధారణంగా నెలసరి సమయంలో పిట్యూటరీ గ్రంథి కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. వాటి ద్వారా అండాలున్న ఫాలికల్స్‌ విడుదలవుతాయి. వాటిలో ఒక్క ఫాలికల్‌ మాత్రమే పరిణతి చెందుతుంది. ఇది ఫెలోపియన్‌ ట్యూబుల్లోకి చేరి, వీర్యకణాలతో కలిసి ఫలదీకరణ చెందుతుంది. గర్భం వస్తుంది. అయితే.. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ ఉన్నవారిలో ఈ ప్రక్రియ ఇంత సజావుగా సాగదు. ఇందుకు దారితీసే కారణాలివి..

ఫాలికల్‌ డిప్లీషన్ ‌: ఇందుకు రెండు కారణాలుంటాయి. ఒకటి వంశపారంపర్యం. ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌ గురించి చెప్పుకోవాలి. ఈ సమస్య ఉన్న స్త్రీలకు రెండు ఉండాల్సిన ఎక్స్‌ క్రోమోజోమ్‌ ఒకటే ఉంటుంది. మానసిక సమస్య మొదలవుతుంది. ఇక రెండో కారణం.. కీమోథెరపీ రేడియేషన్‌ చికిత్సలు వంటివి తీసుకోవడం. ఈ చికిత్సలు శరీరంలోని కణాలపై ప్రభావం చూపుతాయి. సిగరెట్‌ పొగా, రసాయనాలూ, క్రిమి సంహారకాలూ, కొన్నిరకాల వైరస్‌లు కూడా అండాశయాల పనితీరుపై ప్రభావం చూపుతాయి.

ఫాలికల్‌ డిస్‌ఫంక్షన్ ‌: కొన్నిసార్లు అండాశయాల్లోని కణజాలానికి వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఇవి అండాల విడుదలపై ప్రభావం చూపుతాయి. ఇమ్యూనో డిసీజ్‌ పరీక్షల్లో ఈ యాంటీబాడీల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తేలలేదు. వైరస్‌ ఒక కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండానే అండాశయాల పనితీరు మందగిస్తుంది. అలాంటప్పుడు ఇమ్యూనో డిసీజ్‌ పరీక్షతోబాటు మిగతావీ చేయించాలి. చాలాసార్లు ముప్ఫైఅయిదు, నలభైఏళ్ల మధ్య ఈ సమస్య మొదలయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

తల్లి కాలేకపోవచ్చు..
ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలామంది మహిళలు కెరీర్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే గర్భం దాల్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అలా ఆలస్యంగా గర్భం దాల్చేవారిలో అండాశయాల పనితీరు సరిగ్గా లేకపోతే తల్లయ్యే ఆనందాన్ని పూర్తిగా దూరం చేసుకోవాల్సి రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో అరుదుగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను కీలకంగా పనిచేస్తుంది. వాటి స్థాయులు తగ్గడం వల్ల నలభైల్లోనే ఎముకలు బలహీనమై పెళుసుబారడం మొదలవుతాయి. చిన్నవయసులోనే ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ.

సంతాన సాఫల్యత తగ్గడం, ఇతర సమస్యలూ, వేడి ఆవిర్లూ, చెటమలు పట్టడం... లాంటివన్నీ ఆ స్త్రీలను మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.

పరీక్షలున్నాయి..
అండాశయాల పనితీరు ఎంత వరకూ తగ్గుతోంది.. అసలు అదేనా సమస్య అన్నది గుర్తించేందుకు కొన్నిరకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి..

ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోను(ఎఫ్‌ఎస్‌హెచ్‌)టెస్ట్ ‌: వాస్తవానికి ఎఫ్‌ఎస్‌హెచ్‌ అనేది హార్మోను. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలై, అండాశయాల్లో ఫాలికల్స్‌ పెరిగేందుకు తోడ్పడుతుంది. ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ సమస్య ఉన్నప్పుడు ఈ హార్మోను స్థాయుల్లో తేడా కనిపిస్తుంది.

ఈస్ట్రాడియాల్‌ టెస్ట్‌ : ఈస్ట్రాడియల్‌ అనేది ఈస్ట్రోజెన్‌ హార్మోనులో ఓ రకం. అండాశయాల పనితీరు తగ్గినప్పుడు రక్తంలో దీని శాతం తగ్గుతుంది.

ప్రొలాక్టిన్‌ టెస్ట్ ‌: ఇది సాధారణంగా తల్లిపాల ఉత్పత్తిని పెంచే హార్మోను. ప్రొలాక్టిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు అండం విడుదలలో తేడాలుంటాయి.

కార్యోటైప్ ‌: క్రోమోజోముల్లోని లోపాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షను చేస్తారు. ఇది నలభైఆరు క్రోమోజోములను పరీక్షిస్తుంది. అండాశయాల పనితీరు తగ్గినప్పుడు రెండు ఉండాల్సిన ఎక్స్‌ క్రోమోజోములకు ఒకటే ఉన్నా, క్రోమోజోములకు సంబంధించి ఇతర సమస్యలున్నా ఈ పరీక్షలో తెలుస్తుంది.

ఎఫ్‌ఎంఆర్‌ఐ జీన్‌ టెస్టింగ్ ‌: ఇది ఎక్స్‌ క్రోమోజోమ్‌కి సంబంధించింది. వాటిల్లో లోపం ఉన్నప్పుడు ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.

చికిత్స --
అండాశయాల పనితీరు ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజెన్‌ హార్మోను లోపం ఉంటుంది. అందువల్ల.. దాన్ని భర్తీ చేసే దిశగా చికిత్సకు ప్రాధాన్యం ఇస్తారు.

ఈస్ట్రోజెన్‌ థెరపీ : ఆస్టియోపోరోసిస్‌, ఆవిర్లూ లాంటి సమస్యల్ని నివారించేందుకు వైద్యులు ఈ చికిత్సను సూచిస్తారు. ఈస్ట్రోజెన్‌ని చికిత్స రూపంలో ఇస్తారు. అయితే ఈస్ట్రోజెన్‌ వల్ల క్యాన్సర్‌ సమస్యలు రాకుండా ప్రొజెస్టరాన్‌ని కూడా సూచిస్తారు. ఇది గర్భాశయంలోని ఎండోమెట్రియం పొరకి రక్షణగా ఉంటుంది. ఈ రెండింటినీ వాడటం వల్ల మళ్లీ రక్తస్రావం కనిపించవచ్చు. అలాగని అండాశయాలు మళ్లీ పనిచేస్తున్నట్లు కాదు. రోగి ఆరోగ్య పరిస్థితి, ఉన్న ఇతర సమస్యలను బట్టీ ఈ హార్మోన్లను యాభై ఒక్క ఏళ్ల వరకూ వాడొచ్చు. ఆ తర్వాతా తీసుకోవడం మంచిది కాదు. తీసుకుంటే గుండె సంబంధ సమస్యలూ, రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.

క్యాల్షియం, విటమిన్‌ డి : ఆస్టియోపోరోసిస్‌ని నివారించాలంటే ఈ రెండూ చాలా అవసరం. అండాశయాలకు సంబంధించిన సమస్యలున్నప్పుడు వైద్యులు బోన్‌డెన్సిటీ పరీక్ష చేసి మందుల్ని ఏ మోతాదులో వాడాలో నిర్ణయిస్తారు. సాధారణంగా పందొమ్మిది నుంచి యాభై ఏళ్లలోపు స్త్రీలు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియంని ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి. ఆ వయసు తర్వాత పన్నెండొందల మిల్లీగ్రాములు తీసుకోవాలి. విటమిన్‌ డిని మాత్రం రోజుకు 600 - 800 ఇంటర్నేషనల్‌ యూనిట్ల లెక్కన సూచిస్తారు. ఒకవేళ రక్తంలో విటమిన్‌ డి స్థాయి తక్కువగా ఉందని తేలితే ఆ మోతాదును ఇంకా పెంచుతారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఆహారంలోనూ క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతోపాటూ నడకా, బరువులెత్తే వ్యాయామాలూ చేయడం కూడా చాలా అవసరం.

కృత్రిమ పద్ధతుల్లో : అండాశయాలు విఫలమైనవారికి సంతానసాఫల్యత కూడా తగ్గుతుందని చెప్పుకున్నా. ఇలాంటివారు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ద్వారా గర్భం దాల్చాల్సి రావచ్చు.

  • Courtesy with : Dr.Praneetha Reddy(Uro.gyaenocologist) Hyd.@eenadu vasundhara.
  • ==========================

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.