Friday, October 22, 2010

పాల సీసా.. గుండెకు చేటు , Plastic feeding bottle..bad to heart



పిల్లలకు వాడుతున్న ప్లాస్టిక్‌ పాలసీసాలు ఎంత వరకూ సురక్షితం? దీనిపై అంతర్జాతీయంగా చాలా కాలంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే ఈ తరహా ప్లాస్టిక్‌ సీసాల తయారీలో 'బిస్ఫెనోల్‌ ఎ (బీపీఏ)' అనే రసాయనం వాడతారు. ఈ రసాయనం ప్రమాదకరమైనదని పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా దీని కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని తాజాగా జరిపిన విస్తృత అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్మోన్ల పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం చూపే రసాయనం ఇది. ఇది కేవలం ప్లాస్టిక్‌ సీసాల్లోనే కాదు, డ్రింకుల సీసాలు, ఆహారం పార్సిల్‌ చేసేందుకు వాడే ప్లాస్టిక్‌ వస్తువుల వంటివాటన్నింటిలోనూ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో నూటికి 90 మంది ఏదో రూపంలో ఈ రసాయనం ఉన్న వస్తువులను వాడుతూనే ఉన్నారు. మూత్రంలో ఈ రసాయనం అధికంగా గలవారికి గుండె జబ్బుల ముప్పు 33 శాతం ఎక్కువగా ఉంటోందని 'నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వే' సమాచారం ఆధారంగా గుర్తించారు. గతంలో ఈ బీపీఏ రసాయనం మధుమేహం, లివర్‌ ఎంజైమ్‌ల వంటివాటి పైనా ప్రభావం చూపుతోందని భావించేవారు. అయితే తాజా అధ్యయనంలో వాటికి సంబంధించిన దుష్ప్రభావాలు కొంత తక్కువేగానీ గుండె జబ్బులు ముప్పును మాత్రం నిర్లక్ష్యం చేయటానికి లేదని తేలటం విశేషం.

బీపీఏ అనేది ఒంట్లో హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని 'ఎండోక్రైన్‌ డిజ్రప్టర్‌' అనీ అంటున్నారు. ఇది శరీరంలోని స్త్రీహార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌తో పాటు పురుష హార్మోన్లను కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ఈ రసాయనం సృష్టించే దుష్ప్రభావాలపై ప్రజల్లోనూ, ప్లాస్టిక్‌ వస్తువుల తయారీదారుల్లో కూడా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని... వీలైంత వరకూ ఆహార పదార్ధాల కోసం ఈ తరహా ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ పేపర్లు వాడకపోవటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

source : Eenadu Sukhibhava
  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పసిబిడ్డ సంరక్షణ ,Infant care and protection


  • పసిబిడ్డను సంరక్షించుకోవడం ,Infant care and protection

కానీ మన దేశంలో పుడుతున్న ప్రతి 1000 మంది పిల్లల్లో... 57 మంది మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు. ఈ 57 మందిలో 40 మంది మొదటి నెలలోనే చనిపోతున్నారు. ఈ 40 మందిలో 20 మంది మొదటి వారంలోనే చనిపోతున్నారు. ఈ 20 మందిలో ఎక్కువ మంది పుట్టిన ఒకటిరెండు రోజుల్లోనే చనిపోతున్నారు. ఇదో కఠోర సత్యం!

అందుకే మనందరం పసిబిడ్డ సంరక్షణలో మొదటి వారం రోజులూ అత్యంత కీలకమైనవని గుర్తించాలి. బిడ్డ పుట్టగానే ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదు..? అన్న అవగాహన పెంచుకుని.. పురిటి బిడ్డని.. పుట్టిన మరుక్షణం నుంచీ జాగ్రత్తగా సంరక్షించుకోవటం అవసరం.


తొమ్మిది నెలల పాటు వెచ్చగా.. హాయిగా.. శుభ్రంగా.. ఎటువంటి రణగొణ ధ్వనులూ లేకుండా.. అమ్మ కడుపులో సౌకర్యవంతంగా పెరిగిన బిడ్డ..
'' ముందు సూక్ష్మక్రిముల బారి నుంచి రక్షించండి. అమ్మో, బాగా చలి నుంచి నన్ను కాపాడండి.. పొడిగా తుడిచి.. బట్ట చుట్టి.. కాస్త వెచ్చగా పెట్టండి.. ఏడ్వనివ్వండి..

పసిబిడ్డ సంరక్షణలో అత్యంత కీలకమైనవేవి? పుట్టగానే ఏడ్చేలా చూడాలి, బిడ్డను వెచ్చగా పెట్టాలి, తల్లిపాలు పట్టాలి, ముట్టుకునేటప్పుడు చేతులు కడుక్కోవాలి! ఇంతకు మించి పెద్దగా చెయ్యాల్సిందేం లేదు. ఈ ప్రకృతిలో జీవితం ఎంతో సహజంగా, చాలా సులభంగా ఉంటుంది. తెలిసీతెలియక దాన్ని మనమే గందరగోళం చేసుకుంటున్నాం! ఎందుకంటే చాలా జంతువులకు కూడా ఉండే ఈ కనీస అవగాహన.. కొన్నిసార్లు మనకు కరవు అవుతుండటం వల్ల ఎంతోమంది పసిబిడ్డలను దక్కించుకోలేకపోతున్నాం. ఇందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. చేతుల్లేకపోయినా.. ఆవు, గేదె, గొర్రె ఇలా చాలా జంతువులు పుడుతూనే తన దూడను తాకటానికి ప్రయత్నిస్తాయి. నాలుకతో తల నుంచి తోక దాకా ఒళ్లంతా శుభ్రంగా నాకుతూ.. ఆ ఆత్మీయ స్పర్శతో బిడ్డకు నేనున్నానే భరోసా కల్పిస్తాయి. పుట్టిన రోజే పాలివ్వటం మొదలు పెట్టేస్తాయి. అది చాలు, దూడ చెంగున ఎగురుతూ, హాయిగా పెరగటానికి! ఇక చాలా చిన్న మెదడు ఉన్న కోడి కూడా.. తన పిల్లలను రెక్కల కింద కప్పుతూ వెచ్చగా ఉంచుతుంది. పసిగుడ్డుకు ఆ వెచ్చదనమే పెద్ద బలం. ఇక కుక్కల్లాంటి జంతువులు కూడా ఈనిన తర్వాత.. తన పిల్లల వైపు ఎవరూ రాకుండా భయంకరమైన కాపలా కాస్తాయి. ఎవరైనా అటుపోతే చీరేస్తాయి.

బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టటం, వెచ్చగా ఉంచటం, కొద్దిమందే ముట్టుకోవటం, వాళ్లు కూడా శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాతే ముట్టుకోవటం.. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూత్రాలే! వాటిని మనం విస్మరించకూడదు!

* పుట్టిన మొదటి అరగంట లోపే... బిడ్డకు తల్లిరొమ్ము పట్టాలి. ఈ పని చెయ్యగలిగితే మనం ఒక్క మన దేశంలోనే 2.5 లక్షల బిడ్డలను రక్షించుకోగలుగుతాం.

* చాలామంది కాన్పుకాగానే పాలు రావని భావిస్తుంటారు, అది సరికాదు.. బిడ్డ చీకుతుంటే పాలు అవే వస్తాయి. పట్టకపోతే రావు. తల్లికి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసినా కూడా తొలిగంటలో పాలు ఇవ్వటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక రకంగా బిడ్డకు పాలివ్వటం ఆ సమయంలో తల్లికీ మేలు చేస్తుంది. ఎందుకంటే తల్లిపాలివ్వటాన్ని కాన్పులో 'నాలుగో దశ'గా కూడా పిలుస్తారు. ఎందుకంటే తొమ్మిదినెలలుగా పెద్దగా సాగిన బిడ్డసంచీ.. కాన్పు తర్వాత తిరిగి చిన్నగా మరాలంటే అది బాగా సంకోచించాలి. అందుకు 'ఆక్సిటోసిన్‌' అనే హార్మోను చాలా అవసరం. బిడ్డ తల్లి రొమ్ము పట్టుకుని చీకటం మొదలుపెట్టిన వెంటనే ఆ హార్మోను విడుదలై... గర్భసంచీ సంకోచించటం మొదలుపెడుతుంది, వెంటనే రక్తస్రావం కూడా ఆగిపోతుంది. కాన్పు తర్వాత ఇలా రక్తస్రావం సత్వరమే ఆగటం చాలా అవసరం. కాబట్టి బిడ్డకు వెంటనే పాలు పట్టటమన్నది బిడ్డకే కాదు.. తల్లికి కూడా మేలు చేస్తుందని గుర్తించాలి.

* బిడ్డ పుట్టగానే పాలు అవే పడతాయిలే అని వదిలేస్తూ.. రెండుమూడు రోజుల పాటు తేనె నాకించటం, పంచదార నీళ్లు, గ్లూకోజు నీళ్ల వంటివి పట్టటం చెయ్యకూడదు. తల్లిపాలు తప్పించి బిడ్డకు మరేమీ ఇవ్వకూడదు. తొలిగా వచ్చే ముర్రుపాలు ఎంతో శ్రేష్ఠమైనవి, అవి బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముర్రుపాలను పిండెయ్యటం సరికాదు.. వాటిని బిడ్డకే పట్టాలి.

* పాప పుట్టగానే తల్లికి దూరం చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టటానికి బదులు.. తల్లి దగ్గరే, తల్లి పక్కనే ఉంచాలి. తల్లికి సిజేరియన్‌ చేసినా కూడా తల్లి దగ్గరనేపడుకోబెట్టాలి. తల్లీపిల్లల మధ్య ఈ స్పర్శ ముఖ్యం. ఇలా ఉంచితే బిడ్డ ఎప్పుడు పాలు కావాలంటే అప్పుడు ఇవ్వటం సాధ్యపడుతుంది. ఎప్పుడు ఆహారం కావాలన్నది బిడ్డకు తెలుసు. బిడ్డ కోరినప్పుడల్లా తల్లి పాలిచ్చేలా అనుకూల వాతావరణం, ప్రోత్సాహం ఇవ్వాలి.

* బిడ్డ ఏడుస్తుంటే నోట్లో తేనెపీక వంటివి పెట్టటం మంచిది కానేకాదు. సీసా పాలు పట్టటం అసలు మంచిది కాదు. దీనివల్ల బిడ్డకు కావాల్సిన పోషకాలు అందవు, పైగా విరేచనాల వంటి సమస్యలు పట్టుకుంటాయి. సీసా- తల్లీ బిడ్డల మధ్య అది ఎడాన్ని కూడా పెంచుతుంది.

* బిడ్డకు ఆర్నెల్ల పాటు పూర్తిగా తల్లిపాలే పట్టాలి. ఈ సమయంలో మంచినీళ్లు కూడా పట్టాల్సిన పనిలేదు, వాటి బదులు కూడా తల్లిపాలే ఇవ్వాలి! ఇక ఆర్నెల్ల తర్వాత అదనపు ఆహారంతో కనీసం రెండేళ్లపాటు తల్లిపాలు ఇవ్వచ్చు.

* తల్లులు అనవసరంగా గాభరా పడకుండా ఈ చర్యలన్నీ తీసుకుంటే పుట్టిన పిల్లలు గట్టెక్కుతారు, బరువు పెరుగుతారు, సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎదుగుతారు. వాళ్ల తెలివితేటలు (ఐక్యూ), సామాజిక జ్ఞానం (ఎస్‌క్యూ), భావోద్వేగ సమతౌల్యం (ఈక్యూ) అన్నీ పెరుగుతాయి.

పసిబిడ్డ జననం..(!డా|| పి.సుదర్శన్‌రెడ్డిసూపరింటెండెంట్‌-నీలొఫర్‌ హాస్పిటల్‌,హైదరాబాద్‌)

* పుట్టగానే బిడ్డ శ్వాస పీల్చాలి. అంటే ఏడ్వాలి! ఇది చాలా అవసరం. సాధారణంగా పిల్లలంతా కూడా పుడుతూనే తమకు తాముగా ఏడ్వటం, గాలి పీల్చటం మొదలుపెడతారు. కానీ కొంతమంది పిల్లలు ఇలా శ్వాస పీల్చుకోకపోవటం వల్ల.. మెదడుకు రక్తం, ఆక్సిజన్‌ సరిగా అందక మెదడు దెబ్బతిని జీవితాంతం బుద్ధిమాంద్యంతో, అంగవైకల్యంలో జీవించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఈ స్థితినే 'హైపాక్సిక్‌ ఇస్ఖీమిక్‌ ఎన్‌సెఫలోపతీ' అంటారు. గాలి పీల్చుకోక, మెదడుకు సరిగా ఆక్సిజన్‌ అందక తలెత్తే సమస్య ఇది. కాబట్టి పుట్టగానే బిడ్డ ఏడ్వకుండా, తనకు తానుగా శ్వాస తీసుకోకపోతుంటే.. మనం తక్షణం కల్పించుకుని తను శ్వాస తీసుకోవటం మొదలుపెట్టేలా సహకరించాలి. ముందు 'మ్యూకస్‌ సక్కర్‌'తో నోటిలో, ముక్కు రంధ్రాల్లో స్రావాలను తీసేసి శుభ్రం చెయ్యాలి. దీంతో గాలి పీల్చుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. ఒకటిరెండు నిమిషాల పాటు బిడ్డ గాలి తీసుకోలేదంటే నీలంగా మారిపోతుంటుంది. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తకుండా మనం వెంటనే 'ఆంబూ బ్యాగ్‌'ను సున్నితంగా నొక్కుతూ.. బిడ్డకు ఒక్క శ్వాస అందిస్తే చాలు.. వెంటనే అందుకుంటుంది! ఈ ఆంబూ బ్యాగ్‌ లేకపోతే నోటి మాస్కు ద్వారా, అదీ లేకపోతే కనీసం నోటితో ఒక్కసారి శ్వాస తీసుకునేలా వూదటం చాలా అవసరం.

* చాలామంది పుట్టగానే బిడ్డ ఏడ్వక, శ్వాస తీసుకోకపోతుంటే తిరగేసి పట్టుకుని వీపు మీద కొట్టటం, ముఖం మీద చల్లటి నీరు పొయ్యటం, ఉల్లిపాయలు ముక్కు దగ్గర పెట్టటం, స్పిరిట్‌ చల్లటం.. ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. తప్పు! కేవలం బిడ్డ వీపు మీద, అరికాళ్లలో కొద్దిగా రుద్ది, మర్దన చేస్తూ.. బిడ్డ స్పందించేలా చేస్తే చాలు.

* అలాగే కొన్నిసార్లు కాన్పు కష్టమైనప్పుడు ఉక్కిరిబిక్కిరై బిడ్డ లోపలే మలవిసర్జన చేసేస్తుంది. ఆ మలం ముక్కు ద్వారా లోపలకు పోయి శ్వాస ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఉమ్మ నీరు మామూలుగానే ఉందా? లేక ఆకుపచ్చగా, నల్లగా రంగు మారిందా? అన్నది చూడటం మంచిది. ఒకవేళ రంగు మారితే.. బిడ్డకు లోపలే ఏదో కష్టమైందని గుర్తించి వెంటనే ప్రత్యేక వైద్య సంరక్షణ కల్పించాలి.

* బిడ్డ ఏడ్చి, శ్వాస పీల్చుకోవటం మొదలుపెట్టగానే.. బిడ్డను శుభ్రంగా తుడిచి, పొడిగా చెయ్యాలి. బిడ్డ నీళ్లతో ఉంటే చల్లగా అయిపోతుంది. అందుకే ఇప్పుడే స్నానాల వంటివి చేయించకుండా శుభ్రంగా తుడిచి, వెచ్చటి బట్ట చుట్టాలి. పుట్టగానే ఈ వెచ్చదనం చాలా ముఖ్యం!

* కొందరు సంప్రదాయంగా పసిబిడ్డలను పాత బట్టలు, దుమ్ము పట్టిన గుడ్డల వంటి వాటిలో చుడుతుంటారు. అవి ఏ బట్టలైనా సరే, శుభ్రంగా ఉతికినవే పసిబిడ్డ కోసం ఉపయోగించాలి.

* బట్ట చుట్టిన తర్వాత.. బిడ్డను తల్లి దగ్గరే, తల్లి శరీరం మీదనే ఉంచాలి. ఒకవేళ తల్లికి సిజేరియన్‌ సర్జరీల వంటివి పూర్తి చెయ్యాల్సి ఉంటే.. అప్పటి వరకూ బిడ్డను వెచ్చగా లైట్‌ కింద ఉంచి.. అది పూర్తవుతూనే బిడ్డను తల్లి పక్కకు చేర్చాలి. తల్లి 'ప్రకృతి సహజమైన ఇంక్యుబేటర్‌' అన్న విషయం మర్చిపోవద్దు. తల్లి ఇచ్చే వెచ్చదనం ఎవరూ ఇవ్వలేరు. తల్లీబిడ్డలను వేరు చెయ్యకూడదు. ఒకవేళ బిడ్డ చాలా బరువు తక్కువగా పుడితే.. బిడ్డను తల్లి రెండు రొమ్ముల మధ్యా ఉంచి.. పైన బట్ట చుట్టాలి. దీన్నే 'కంగారూ మదర్‌ కేర్‌' అంటారు. ఇది ఇంక్యుబేటర్‌లో పెట్టటంతో సమానం!

* ఇలా వెచ్చదనంలో పెరిగే బిడ్డల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని గుర్తించాలి. లేకపోతే తాగిన పాల శక్తి అంతా బిడ్డ తన శరీరాన్ని వెచ్చగా పెట్టుకోవటానికే ఖర్చయిపోతుంది. దీంతో పెరుగుదలా దెబ్బతింటుంది. కనీసం ఆర్నెల్ల వరకూ బిడ్డలను వెచ్చగా ఉంచటం అవసరం.

* మన చుట్టూ ఎన్నో కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిడ్డ ఈ సూక్ష్మక్రిముల బారినపడకుండా మనం పూర్తి శుభ్రత, సురక్షిత చర్యలు తీసుకోవాలి. కాన్పు చేసేవారు చేతులు సబ్బుతో రుద్దిరుద్ది కడుక్కోవాలి, గ్లౌజులు వేసుకోవాలి. ఎవరైనా సరే... చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే పసిబిడ్డను ఎత్తుకోవాలి. అంతా 'తలో చెయ్యీ వెయ్యటం' కాకుండా.. బిడ్డను ఒకరిద్దరే ఎత్తుకోవటం, పట్టుకోవటం మంచిది.

* బిడ్డ పుట్టిన అర గంటలోపే తల్లిపాలు పట్టించటం ప్రారంభించాలి. దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగటం మొదలవుతుంది. అందుకే తల్లిపాలను వ్యాధులు రాకుండా మనం ఇచ్చే 'తొలి టీకా' అంటారు.

* ఆసుపత్రుల్లో కాన్పు చేస్తే మరో ప్రయోజనమేమంటే వైద్యులు- బిడ్డ పుట్టగానే వైద్యులు కండ్లు, ముక్కు, చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం వంటివన్నీ చక్కగా ఉన్నాయా? లేదా? పుట్టుకతో ఏదైనా లోపాలున్నాయా? శ్వాస సరిగా తీసుకుంటోందా? లేదా? గుండె తక్కువ కొట్టుకుంటోందా? ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే కొందరిలో మలద్వారం సరిగా ఉండదు. దాని మీద ఒక పొర ఉంటుంది. దాన్ని గుర్తిస్తే వెంటనే చికిత్స లేదంటే సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.

* పుట్టగానే బిడ్డ బరువు చూడటం, టీకాలు ఇవ్వటం తప్పనిసరి

హైరిస్క్‌ పిల్లలు
కొందరు పుడుతూనే కొన్ని ఇబ్బందులతో పుడతారు.. వీరిని 'రిస్కు ఎక్కువగా ఉన్న పిల్లలుగా' గుర్తించి మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్లను గుర్తించేదెలా?

* 1800 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టినా.
* 34 వారాల కంటే ముందే పుట్టిన బిడ్డలు
* రొమ్ములు చీకాలన్న స్పందనల్లేక, పాలు తాగలేకపోతున్న బిడ్డలు
* నిరంతరం ఏడుస్తూనే ఉన్న పిల్లలు
* ఎటువంటి కదలికలూ లేకుండా మొద్దులా ఉండిపోతున్న పిల్లలు
* చర్మం రంగు నీలంగా, లేదా పాలిపోయినట్లున్న పిల్లలు, లేదా పుట్టిన 24 గంటల్లో చర్మం పసుపుపచ్చగా మారుతున్న పిల్లలు
* బాగా చల్లగా ఉన్న బిడ్డలు
* మొదటి 48-72 గంటల్లోపు జ్వరం వచ్చిన బిడ్డలు...
* పాలు తీసుకున్న ప్రతిసారీ మొత్తం వాంతి చేసుకుంటున్న పిల్లలు
* కడుపు బాగా ఉబ్బి ఉన్న బిడ్డలు
* శ్వాస వేగంగా తీసుకుంటూ.. ఎగశ్వాస వస్తున్న బిడ్డలు..
* మొదటి 48 గంటల్లోపు కళ్లు పుసులు కడుతుండటం, లేదా బొడ్డు చీము పడుతున్నట్టుండటం, చర్మం మీద చీము పొక్కుల వంటివి కనబడిన పిల్లలు..
* ఫిట్స్‌ వచ్చిన బిడ్డలు..
* ఎక్కడి నుంచైనా రక్తస్రావం అవుతున్న పిల్లలు..
* పుట్టిన 24 గంటల్లోపు మల విసర్జన చెయ్యకపోయినా.. 48 గంటల్లోపు మూత్ర విసర్జన చెయ్యకపోయినా..

వీరందరినీ హైరిస్క్‌ బిడ్డలుగా గుర్తించి.. తప్పనిసరిగా సత్వరమే వైద్యులవద్దకు తీసుకువెళ్లాలి. ముందీ లక్షణాలను గుర్తించి వెంటనే స్పందించటం చాలా ముఖ్యం.

* బిడ్డ కడుపు ఉబ్బితే.. 'సహజమేలే' అని వదిలెయ్యటం;
* పాలు తాగలేకపోతుంటే 'ఆ.. అలవాటైతే అదే తాగుతుందిలే' అని నిర్లక్ష్యం వహించటం;
* ఫిట్స్‌ వస్తుంటే 'ఒక్కసారే గదా వచ్చింది, మళ్లీ వస్తే చూద్దాం' అనుకోవటం;
* బిడ్డ చాలా చిన్నగా పుడితే 'అదే పెరుగుతుందిలే, బక్కవాళ్లు బతకటం లేదా' అని వదిలెయ్యటం.. ..ఇలా సర్దుకుపోతూ తాత్సారం చెయ్యటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇవన్నీ ప్రమాద సూచికలని గుర్తించి తక్షణం వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.

Updates :
శిశువుకు.. వెచ్చని తోడు


అప్పుడే పుట్టిన పిల్లలు వెచ్చగా ఉండేలా చూడటం ఎంతో అవసరం. ఎందుకంటే పెద్దవారిలాగా శిశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేరు. కాబట్టి సరైన ఉష్ణోగ్రతలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టే పిల్లలు, బరువు తక్కువ పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే కొన్నిసార్లు చనిపోయే ప్రమాదమూ ఉంది. ఆధునిక సౌకర్యాలు లేని గ్రామాల్లో ఈ ప్రమాదం ఎక్కువ. మనదేశంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యిమంది శిశువుల్లో ఏటా సుమారు 50 మంది చనిపోతున్నారని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే చవకైన 'ఇన్‌ఫాంట్‌ వార్మర్‌'లను సరఫరా చేయాలని జీఈ హెల్త్‌కేర్‌, ఎంబ్రేస్‌ స్వచ్ఛందసంస్థలు సంకల్పించాయి. చిన్నపాటి పడుకునే సంచీలా ఉండే వీటిని వచ్చే సంవత్సరం నుంచి పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

సంప్రదాయ ఇంక్యుబేటర్లతో పోలిస్తే ఈ 'ఎంబ్రేస్‌ ఇన్‌ఫాంట్‌ వార్మర్‌' ధర ఒక శాతం కన్నా తక్కువే కావటం గమనార్హం. ఇది విద్యుత్తు సరఫరా లేకపోయినా గంటల కొద్దీ శిశువు వేడిగా ఉండేలా చూస్తుంది. శిశు సంరక్షణను మెరుగుపరచేందుకు ముందుగా వీటిని గ్రామాల్లో పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇన్‌ఫాంట్‌ వార్మర్‌లో.. వేడి చేసే పరికరం లేదా వేడి నీటి బ్యాగు, లక్కతో కూడిన సంచీ, పడుకునే సంచీ ఉంటాయి. ముందు వేడి పరికరాన్ని విద్యుత్తుతో వేడిచేస్తారు. విద్యుత్తు సౌకర్యం లేనిచోట వేడినీటిని నింపే రకాలు కూడా ఉన్నాయి. వేడి చేసిన పరికరాన్ని లక్కతో కూడిన సంచీలో వేసి దానిపై శిశువును పడుకోబెడతారు. అనంతరం పడుకునే సంచీని చుట్టూ చుడతారు. దీంతో శిశువుకు అవసరమైన వేడి నిరంతరం అందుతుంటుంది. పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచితే త్వరగా పెరిగే అవకాశమూ ఉంది. కాబట్టి ఇంక్యుబేటర్‌ సదుపాయం లేని ప్రాంతాల్లో ఇది శిశువులకు సంజీవనిలా ఉపయోగపడగలదని నిపుణులు చెబుతున్నారు.
  • ---------------------------------------------------------
source : Eenadu sukheebhava
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, October 21, 2010

ఫిస్టులా , Fistula in Ano,భగంధరం వ్యాధి



కొన్ని వ్యాధులు కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తాయి. అలాంటి వాటిలో ఫిషర్, ఫిస్టులా (భగందరం), పైల్స్ (అర్శమొలలు), ఆబ్సిస్ (Abscess-చీము గడ్డ) మలద్వారంలో వచ్చే నాలుగు ప్రధాన సమస్యలు. కాకపోతే, ఈ నాలుగింటిలోనూ స్వల్పమైన తేడాలతో ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒక వ్యాధిని మరో వ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. కాకపోతే నాలుగింట్లో ఏ వ్యాధి వచ్చినా చాలా మంది అర్శమొలలే అనుకుంటారు.
  • ఫిస్టులా:
ఈ వ్యాధిని కొందరు ''లూటి'' అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు.''భగంధరం'' వ్యాధి అని కూడా అంటారు . మలవిసర్జన మార్గము ప్రక్కన ఎటో ఒకవైపు కురుపు ఏర్పడి అది పెరుగుతూ పోయి లోపల పెద్దపేగు చివర భాగములో రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. బయటి చర్మము మరియు లోపల ప్రేగుకు రెండువైపులా రంధ్రము ఏర్పడడాన్ని ఫిస్టులా అంటారు.  ఫిస్టులా అన్నది ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే సమస్య. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్లు ఎందుకు వస్తాయన్నది ఇంతవరకూ ఖచ్చితముగా తెలియదు. ఇకపోతే మలబద్ధకం వల్ల అంతకు ముందే ఉన్న ఫిస్టులా సమస్య ఎక్కువవుతుందే తప్ప మలబద్ధకం వల్ల ఫిస్టులా రాదు. అలాగే దూరప్రయాణాలు, మాంసాహారం, మసాలా పదార్థాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. మలద్వారం చుట్టూ గడ్డలు వస్తాయి. తరువాత చీము పడుతుంది. ఈ సందర్భంలో సరైన చికిత్స చేయకపోవడం వల్ల భగంధరం ఏర్పడుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాల్లో చేసే శస్త్ర చికి త్స వల్ల ఫిస్టులా సమస్య ఎప్పుడూ పూర్తిగా పోదు. కొంత కాలం ఉపశమనంగా ఉన్నా కొన్నాళ్లకు మళ్లీ ఆ సమస్య మొదలవుతుంది. ఎక్కువ కాలం ఈ సమస్య ఇలాగే కొనసాగితే అక్కడ ఏర్పడిన చీము పేగుల్లోకి కూడా వెళ్లి మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.

  • పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు తక్కువ గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.
ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.్

ప్రేరేపించే కారణాలు :
  • జీర్ణవ్యవస్థలోని లోపాలు, ఆ కారణంగా వచ్చే మలబద్ధకం సమస్యే ప్రధాన కారణం.
  • ఆహారంలో పీచుపదార్థాలు తక్కువగా ఉండడం,
  • నీరు తక్కువగా తాగడం,
  • శరీర శ్రమ లేకపోవడం,
  • స్థూలకాయం,
  • ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం,
  • గంటల పర్యంతం వాహనాలు నడపడం
  • గర్భంలోని శిశువు బరువు కారణంగా కూడా కొంత మంది స్త్రీలు ఈ సమస్యలను ఎదుర్కొంటారు.
  • పెద్ద వ్యవధి లేకుండా వెంట వెంట ప్రసవాలు జరిగినప్పుడు .

లక్షణాలు

  • నొప్పి,
  • రక్తస్రావం,
  • చీము-జిగురు పడటం,
  • దురద
ఇవే ప్రధానంగా కనిపించినా మరి కొన్ని ఉప లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో
  • జీర్ణక్రియ, విసర్జన క్రియ సరిగా లేకపోవడం.
  • ఆహారం మీద ఆసక్తి లేకపోవడం,
  • కడుపు ఉబ్బరం,
  • నోటినుంచి మలద్వారందాకా మంటగా ఉండడం,
  • కడుపులో శబ్దాలు రావడం,
  • బరువు తగ్గడం,
  • తేన్పులు రావడం,
  • రక్తహీనత ఏర్పడటం,
  • కళ్లు తిరిగినట్లు అనిపించడం,
వ్యాధి నిర్ధారణ : 
  • చికి్త్సకు ముందు వ్యాధి నిర్ధారణ చాలా ముఖ్యము. దానికోసము -- ట్రాన్స్ యానల్ స్కాన్‌, ఫిస్టులోగ్రామ్‌, యం.ఆర్.ఐ.ఫిస్తులా, లాంటి పరీక్షలు చేసి ... కాన్సర్ కాదని బలపడిన తరువాత ముందుకు సాగాలి.
చికిత్స :
  • ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా హైరానా పడే వ్యక్తులో దురదలు పెట్టే వ్యాధులు ఎక్కువగానే కనిపిస్తాయి. చాలారకాల చర్మవ్యాధులు మానసి కంగా నలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా బహిర్గతమవు తాయి. ఈ తరహా సమస్యలున్నప్పుడు కేవలం శరీరానికే కాకుండా మనస్సుకు కూడా చికిత్స చేయాల్సిఉంటుంది.

అల్లోపతి : నొప్పిగా ఉన్నప్పుడు నొప్పినివారణ మాత్రలు (Nimsulide, Ibuprofen , diclofenac, aceclofenac) వాడాలి . ఇన్‌ఫెక్షన్‌ అయి చీము , రసి కారుతున్నప్పుడు ఫిస్టులా దరిదాపుపా శుభ్రము చేస్తూఉండాలి. . . యాంటీబయోటిక్స్ (ciprofloxin +ornidazole) వాడాలి.
ఏమీ చెయ్యకుండా ఉండడము : రసి శుభ్రము చేస్తూ ఉండి విరోచనము సాఫీ గా అయ్యేటట్లు ఆహారనిమాలు మార్చుకోవాలి .
ఫిస్టులాని తెరచి ఉంచడం : మూసుకొని ఉన్న గాయాన్ని కట్ చేసి తెరచి ఉంచి క్లీనింగ్ చేస్తూ ఉండలి .. లోపనుంది మానుకుంటూ వస్తుంది . ఇన్‌ఫెక్షన్‌ అవకుండా యాంటీబయోటిక్స్ వాడాలి.
సర్జెరీ : మంచి శస్త్రచికిత్స వైద్యనిపుణుని సంప్రదించి తగిన సలహా , సహాయాన్ని పొందాలి .

  • ఆయుర్వేదము : క్షారసూత్ర ప్రక్రియ ద్వారా క్షార సూత్ర వైద్య ప్రక్రియతో భగంధరం దూరం అవుతుందని ఓరుగల్లు నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కెఎంవిడి ప్రసాద్‌ చెప్పారు. దీనిలో ఔషధాలు లేపనం చేసి ఒక నూలు దారాన్ని మలద్వారంనుంచి ఫిస్టులా మార్గంలోకి పంపి బైటనుంచి ముడి వేస్తారు. దారం లోపలినుంచి కోసుకుంటూ గాయాన్ని మాన్పుతూ బైటకు వస్తుంది. ఈ విధానమే కాకుండా ప్రారంభావస్థలో జాత్యాదిఘృతం వంటి రోపణ ఔషధాలను ప్రయోగించి కూడా వ్యాధిని తగ్గించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • చేపలు, కారం, మసాలలను, వాడకూడదు,
  • మద్యం సేవించడం, ధూమపానం, పనికిరాదు,
  • మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగాలి.
  • మలబద్దకం కాని కాయగూరలు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలి.
  • ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ సేపు కూర్చోవడం పనికిరాదు.
  • మనం కూర్చునే కుర్చి అడుగునుంచి గాలివచ్చేలా ఉండే కుర్చిలోనే కూర్చొవాలి.శరీరానికి చల్లగాలి అవసరం.
ఫిస్టులా-భగందరం.. లోలోపల భయం / ఈనాడు సుఖీభవ 18/11/2014 /డా.వర్ఘీస్ ముత్తయ్ -కొలొరెక్టర్ సర్జన్‌ .యశోదా హాస్పిటల్ ,హైదరాబాద్ .

    చెప్పుకోవాలంటే సిగ్గు. అలాగని వూరుకోవాలంటే భయం! నలుగురిలో ఎక్కడ నగుబాటుకు గురవుతామోనన్న శంక.. పట్టించుకోకుండా తిరిగితే ఇదెంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందోనన్న ఆందోళన. ఇవన్నీ నిరంతరం మనసును తొలి చేస్తుంటాయి. ఏ పని చెయ్యాలన్నా ఇదే బెరుకు. మలద్వారానికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఆ బాధలకు తోడు మనసు కూడా ఇలా పరిపరివిధాలుగా విలకమై పోతుంటుంది. ఇక భగందరం వంటి సమస్యలైతే ఈ బాధ మాటల్లో చెప్పలేం! మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో పుండులా మొదలవుతుంది. చిట్లి చీము కారుతూ వేధించి.. కొద్దిరోజుల్లో మానినట్లే ఉంటుంది. పోయిందిలెమ్మని అనుకుంటుండగానే మళ్లీ మొదటికి వస్తుంటుంది. ఇలా ఆ చుట్టు పక్కలే ఒకటి.. రెండు.. చాలా పుండ్లు మొదలవ్వచ్చు. పైపైన పుండ్లు మానినట్లే ఉంటాయి, కానీ ఎక్కడో లోపలి నుంచి మళ్లీ మొలుచుకొస్తుంటాయి. నిజానికి ఈ సమస్యకు మూలం పైన చర్మం మీద కాదు.. లోలోపల ఎక్కడో మలమార్గం నుంచే ఉంటుంది. దాన్ని ఆ లోపలి నుంచి సంపూర్ణంగా ముయ్యగలిగితేనేగానీ ఇది మానదు. ఇదే భగందరం! ఒక రకంగా మొండి సమస్య. సరైన నైపుణ్యంతో చికిత్స చెయ్యకపోతే.. మొదటికే మోసం వచ్చి, మలంపై పట్టు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని సరిగ్గా గుర్తించటం.. మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని.. అది సంపూర్ణంగా తొలగిపోయేలా సరైన చికిత్స తీసుకోవటం అవసరం.


మలద్వార బాధల గురించి మాటల్లో చెప్పటం కష్టం! అందుకే చాలామంది సాధ్యమైనంత వరకూ తోసేసుకు తిరిగేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇవి తెచ్చిపెట్టే చికాకు, బాధ, ఇబ్బందుల కారణంగా అట్టే కాలం వీటిని విస్మరించటం కష్టం. రెండోది- ముడ్డి దగ్గర వచ్చే సమస్యలన్నీ ఒకే రకం కూడా కాదు. వీటిల్లో మూలశంక, భగందరం, చీలికల వంటి చాలా సమస్యలు ఉంటాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు అంత ఇబ్బంది పెట్టకపోయినా మెల్లగా ముదిరి తీవ్ర ఇబ్బందులూ తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి మలద్వారం వద్ద ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వైద్యులకు చూపించుకుని.. అసలా సమస్య ఏమిటో నిర్ధారించుకోవటం, సత్వరమే వాటికి చికిత్స తీసుకోవటం ఉత్తమం. ఉదాహరణకు భగందరాన్నే తీసుకుంటే.. మామూలుగా ఎవరికి వారు దీన్ని గుర్తుపట్టటం కష్టం. ఎందుకంటే మలద్వారం చుటుపక్కల ఎక్కడో.. చిన్న సెగగడ్డలా మొదలవుతుంది కాబట్టి చాలామంది దీన్ని అసలు మలద్వారానికి సంబంధించిన సమస్య అనే అనుకోకపోవచ్చు. కానీ అది వదలకుండా మళ్లీమళ్లీ వేధిస్తూనే ఉంటుంది. చివరకు పగిలి చీము-రక్తం వస్తోందనో.. బట్టలు ఖరాబవుతున్నాయనో.. ఎప్పుడో వైద్యుల వద్దకు వస్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్‌ కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం మంచిది. దీనికి సర్జరీ ఒక్కటే సరైన చికిత్స! దీనిలో కూడా చాలా రకాలుంటాయి. ఈ మార్గాల మూలాలను గుర్తించటం, కండర వలయాలు దెబ్బతినకుండా నైపుణ్యంతో చికిత్స చెయ్యటం ముఖ్యం.

ఏమిటీ ఫిస్టులా?
తేలిక భాషలో చెప్పాలంటే.. గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తోందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై.. అక్కడ గోడను పాడుచేసి.. ఏదోవైపు నుంచి బయటకు వస్తుంటుంది. ఒక రకంగా భగందరం కూడా అంతే. మలద్వారం నుంచి బయటకు 'దారులు' ఏర్పడటం, ఇవి చుట్టుపక్కల చర్మం మీద ఎక్కడో పైకి తేలటం ఈ సమస్యకు మూలం. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.

మలద్వారం లోపలి గోడలకు కొన్ని గ్రంథులు (యానల్‌ గ్లాండ్స్‌) ఉంటాయి. ఇవి మల మార్గంలో జిగురులాంటి స్రావాలను విడుదల చేస్తూ.. మలవిసర్జన సాఫీగా జరిగేలా సహకరిస్తుంటాయి. వీటి మార్గాలు మలద్వారంలోకి తెరచుకొని ఉంటాయి. ఏదైనా కారణాన వీటి మార్గం మూసుకుపోతే వీటి నుంచి వచ్చే జిగురు స్రావాలు మలమార్గంలోకి రాకుండా లోపలే నిలిచిపోతాయి. మెల్లగా మలంలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల వంటివి దీనిలో చేరి చీము పడుతుంది. దీంతో ఇది చీముగడ్డలా (యానల్‌ ఆబ్సెస్‌) తయారవుతుంది. ఈ చీము బయటకు వచ్చే మార్గం లేక.. పక్కనున్న కండరాలను తొలుచుకుంటూ అక్కడి ఖాళీల మధ్య నుంచి క్రమంగా లోపల్లోపలే విస్తరించటం మొదలుపెడుతుంది. ఇది మెల్లగా మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో చోటకు చేరుకుని.. అక్కడ పైకి సెగగడ్డలా కనబడుతుంది. దీనికి రంధ్రం పడితే ఇందులోంచి చీము బయటకు వస్తుంటుంది. అయినా పైన ఇన్ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంది కాబట్టి తిరిగి మళ్లీ మళ్లీ చీము వస్తూనే ఉంటుంది. అందుకే చీము బయటకు పోయినా.. సమస్యకు మూలం గ్రంథిలో ఉంది కాబట్టి, దాన్ని తొలగిస్తేనే ఫిస్టులా పూర్తిగా నయమవుతుందని గుర్తించాలి.
అసలా మలద్వార గ్రంథులు ఎందుకు మూసుకుపోతాయన్నది కచ్చితంగా చెప్పటం కష్టం. కొందరిలో మలబద్ధకం వంటివి, మరికొందరిలో ఇతరత్రా కారణాలూ దీనికి కారణం కావచ్చు. మొత్తమ్మీద ఈ సమస్య స్త్రీలలో కంటే పురుషుల్లో అధికం. వృద్ధులకూ రావచ్చుగానీ యువకుల్లో ఎక్కువ. ఒకసారి గ్రంథులకు చీముపట్టి, లోపల దారులు ఏర్పడిన తర్వాత.. దానంతట అదే మానటం కష్టం. ఆ ఫిస్టులా మార్గాన్ని శుభ్రం చేసి వదిలేసినా ఉపయోగం ఉండదు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంటుంది కాబట్టి సమస్య మళ్లీమళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. సక్రమమైన చికిత్స తీసుకోకపోతే ఇది మానదు. నాటు విధానాలను ఆశ్రయిస్తే మల విసర్జన మీద పట్టు పోయే ప్రమాదం ఉండటం దీనితో ఎదురయ్యే పెద్ద ఇబ్బంది.

నిర్ధారణ ఎలా?
చీముగడ్డతో వచ్చినప్పుడు.. ముందుగా చీమును తొలగించి మార్గాన్ని శుభ్రం చేస్తారు. అక్కడి కండర కణజాలమంతా వాచి ఉంటుంది కాబట్టి నిపుణులైన వైద్యులు తప్పించి ఆ సమయంలో లోలపకు గొట్టం ప్రవేశపెట్టటం వంటివేవీ చెయ్యకూడదు. ఎందుకంటే ఆ గొట్టం వేరే భాగాల్లోకి చేరి, కొత్త మార్గాలను సృష్టించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమును తొలగించాక, అక్కడి కణజాలం వాపు వంటివన్నీ తగ్గిన తర్వాత.. పరీక్షలు చేసి ఫిస్టులాను కచ్చితంగా గుర్తిస్తారు.

* వేలితో పరీక్షించటం: ఫిస్టులాను చాలా వరకూ లక్షణాలను బట్టే గుర్తించొచ్చు. మలద్వారం బయటగానీ, లోపలికి గానీ వేలు పెట్టి చూస్తే రంధ్రం ఉన్న భాగం తగులుతుంది. నైపుణ్యాన్ని బట్టి మార్గం ఎక్కడికి వెళ్తుందో కూడా కొంతవరకూ తెలుసుకోవచ్చు.

* ఎండోయానల్‌ స్కాన్‌: సన్నగొట్టంలా ఉండే అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని మలద్వారంలోకి పంపి పరీక్షిస్తారు. దీంతో ఫిస్టులా మార్గం లోపలికి తెరచుకొని ఉంటే గుర్తించొచ్చు. సాధారణంగా మలద్వార కండరాల్లో ఎక్కడా గాలి ఉండదు. ఒకవేళ గాలి ఉన్నట్టు తేలితే అక్కడ మార్గం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇది చవకైన, తేలికైన పరీక్ష.

* ఎంఆర్‌ఐ: ఫిస్టులా దారులు మరీ సంక్లిష్టంగా ఉంటే ఎంఆర్‌ఐ స్కానింగు చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో ఎన్ని దారులు ఎలా ఉన్నదీ స్పష్టంగా తెలుస్తుంది.

వీటి ఆధారంగా వైద్యులు లోపల మార్గం ఒకటే ఉందా? చాలా మార్గాలున్నాయా? అవి మలద్వారానికి దగ్గరగా, కిందగానే ఉన్నాయా? లేక పైనుంచి ఉన్నాయా? ముఖ్యంగా మల నియంత్రణకు ఉపయోగపడే కీలకమైన రెండు కండర వలయాలకు (స్ఫింక్టర్‌కు) ఇవి దగ్గరగా ఉన్నాయా? వాటి మధ్య నుంచి వస్తున్నాయా? ఎక్కడి నుంచి మొదలై ఎటు వెళుతున్నాయి? వంటివన్నీ గుర్తిస్తారు. చికిత్సకు ఇది ఏరకమన్నది గుర్తించటం చాలా కీలకం.
చికిత్స ఏమిటి?
సాధారణంగా భగందరం దానంతట అదే మానిపోవటమనేది ఉండదు. చాలాసార్లు దీనికి సర్జరీ తప్పదు. ఏ చికిత్స చేసినా ఇది మళ్లీ మళ్లీ రాకుండా పూర్తిగా మూసుకుపోయేలా చూడటం ముఖ్యం. రెండోది- ఈ చికిత్సా క్రమంలో మలవిసర్జనను నియంత్రించే రెండు కండరవలయాలూ (స్ఫింక్టర్లు) దెబ్బతినకుండా చూడటం మరింత ముఖ్యం. దీనికోసం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రామాణిక సర్జరీ విధానాలతో పాటు ఇటీవలి కాలంలో కొత్తరకాలూ అందుబాటులోకి వచ్చాయి. భగందరం మార్గం ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఉంది? స్ఫింక్టర్లకు దగ్గరగా ఉందా? వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్యులు వీటిలో ఏ విధానం ఉత్తమమన్నది నిర్ధారిస్తారు.

* ఫిస్టులాటమీ: చాలకాలంగా అనుసరిస్తున్న, ఇప్పటికీ ప్రామాణికమైన విధానం ఇది. భగందరం మార్గం లోపలా బయటా స్పష్టంగా ఉన్నప్పుడు దాని గుండా గొట్టాన్ని పంపటం, మార్గం మొత్తాన్ని తెరవటం, శుభ్రం చేసి.. చీముపట్టిన గ్రంథిని తీసేసి.. వదిలేయటం ద్వారా దానంతట అదే మానేలా చూస్తారు. దీనివల్ల చాలాసార్లు బాగానే మానుతుంది. ఫిస్టులా మార్గం కండరంలో తక్కువ భాగానికే పరిమితమైనప్పుడు ఇది ఉత్తమమైన విధానం. ఈ విచక్షణ ముఖ్యం కాబట్టి నిపుణులైన వైద్యుల వద్ద చేయించుకోవటం ముఖ్యం.

* 'లిఫ్ట్‌' సర్జరీ: ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఈ 'లైగేషన్‌ ఆఫ్‌ ఇంటర్‌ స్ఫింక్టరిక్‌ ఫిస్టులా ట్రాక్ట్‌' పద్ధతితో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. మన మలద్వారం వద్ద అంతర, బాహ్య కండర వలయాలకు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ స్ఫింక్టర్లు) తోడు కటి-మలద్వార (ప్యూబోరెక్టాలిస్‌) కండరం కూడా ఉంటుంది. బాహ్య, అంతర కండర వలయాలు రెండూ ఒకదానితో మరోటి అనుసంధానమై పని చేస్తాయి. మలాన్ని పట్టి ఉంచటంలో కటి-మలద్వార కండరం ప్రధానమైంది. ఇది దెబ్బతింటే మల విసర్జనపై పట్టు పోతుంది. అందుకని ఇవేవీ దెబ్బతినకుండా.. ఈ లిఫ్ట్‌ పద్ధతిలో అంతర, బాహ్య కండర వలయం మధ్యలోంచి లోపలికి వెళ్లి, ఫిస్టులా మార్గాన్ని గుర్తించి.. దాన్ని మధ్యలో కత్తిరిస్తారు. రెండు వైపులా శుభ్రం చేసి, అటూఇటూ ముడివేసేస్తారు. ఈ ప్రక్రియతో ఫిస్టులా నయం కావటమే కాకుండా మల విసర్జన మీద పట్టు కూడా దెబ్బతినదు, 90% వరకూ మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉండటం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

* సీటన్‌ విధానం: కొన్ని రకాల ఫిస్టులాలకు- భగందర మార్గం లోపలి నుంచి దారం వంటిదాన్ని లోపలికి పంపి, మలద్వారం గుండా బయటకు తెచ్చి ముడివేసే విధానం బాగానే ఉపయోగపడుతుంది. క్రమేపీ బిగువుగా ముడి వేస్తూ.. కొన్ని నెలల సమయంలో మార్గం దానంతట అదే మానిపోయేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. క్షారసూత్రం పేరుతో మన దేశంలో కూడా ఈ విధానం చిరకాలంగా అమల్లో ఉంది. కండరం ఎంత భాగం ప్రభావితమైందో తెలియనప్పుడు తాత్కాలికంగా ఈ చికిత్స చేసి తర్వాత పూర్తిగా మానేలా చేయటానికి ఏ విధానాన్ని అనుసరించాలో నిర్ధరిస్తారు. ఏ రకం భగందరానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నది గుర్తించి చికిత్స చెయ్యటం కీలకం.

* ఫిబ్రిన్‌ గ్లూ: భగందర మార్గాన్ని శుభ్రం చేసి.. దానిలోకి జిగురువంటి పదార్ధాన్ని ఎక్కించి.. రెండు వైపులా కుట్టేస్తారు. దీనివల్ల తాత్కాలికంగా మార్గం మూసుకుపోయి మానినట్లే అనిపించినా దీర్ఘకాలంలో మళ్లీ వస్తున్నట్టు గుర్తించారు. అలాగే 'ఫిస్టులా ప్లగ్‌' అనే మరో విధానం కూడా ఉంది. దీనిలో జంతుచర్మం నుంచి తయారు చేసిన ప్లగ్‌ను అమర్చి మార్గాన్ని మూసేస్తారుగానీ వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ, దీర్ఘకాలంలో మళ్లీ వచ్చే అవకాశం ఉంటోంది. అందుకని సర్జరీని తట్టుకోలేని వృద్ధులు, కండరాలు బాగా బలహీనపడిన వారికి దీనిని సిఫార్సు చేస్తుంటారు.

సర్జరీ తర్వాత..
ఆపరేషన్‌ తర్వాత వైద్యులు అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌తో పాటు నొప్పి తెలియకుండా మందులు సిఫార్సు చేస్తారు. అలాగే మలవిసర్జన ఇబ్బంది లేకుండా సాఫీగా అయ్యేందుకు కూడా మందులు ఇస్తారు. ఇవాల్టిరోజున అందుబాటులో ఉన్న సమర్థ విధానాలతో సర్జరీ చేస్తే ఫిస్టులా మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.
స్త్రీలలో మరింత సమస్యాత్మకం!
కొందరు స్త్రీలకు భగందరం- యోని వద్ద ముందు భాగంలో తెరచుకొని ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంట యోని వైపున కండర వలయం పల్చగా ఉంటుంది. రెండోది కాన్పు అయిన వారిలో ఈ కండరం మరింతగా సాగినట్త్లె దృఢత్వాన్ని కూడా కోల్పోయి ఉంటుంది. పురుషులతో పోలిస్తే వీరిలో మలంపై పట్టు కోల్పోయే ముప్పు మరింత ఎక్కువ. అందుకే స్త్రీలు, వృద్ధులకు సర్జరీ మరింత జాగ్రత్తగా చెయ్యాల్సి ఉంటుంది.
  • ===============================

ఫిషర్ , Fissure in ano



ఫిషర్‌: ఫిషర్ అంటే మలద్వారం చర్మంపై పొడవాటి పగుళ్లు ఏర్పడడమే . ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

మలవిసర్జన సమయంలో నొప్పి వస్తే ఏమీ కాదులే అనుకుంటూ చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. సమస్య తీవ్రమైతే కానీ డాక్టర్ దగ్గరకు పరుగెత్తరు. మలద్వారానికి పగుళ్లు ఏర్పడే ఈ ఫిషర్ వ్యాధి ప్రమాదకరం కాకపోయినప్పటికీ రోజువారీ జీవితాన్ని మాత్రం నరకప్రాయం చేస్తుంది. నిర్లక్ష్యం చేస్తూ ఆ బాధను భరించడం కంటే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం. దీనికి ఆయుర్వేదంలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. మలద్వార ప్రాంతంలో రక్తసరఫరా తక్కువగా ఉండడం వల్లే అక్కడ పగుళ్లు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది.

లక్షణాలు
మలద్వారం కింది భాగం చాలా సున్నితమైనది. ఫిషర్ వచ్చిన వెంటనే ముందుగా మనకు కనిపించే లక్షణం, ఆ భాగంలో నొప్పిగా అనిపించడం. మల విసర్జన సమయంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ నొప్పి గంట వరకూ అలానే ఉండి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఒకవేళ ఫిషర్ తీవ్రంగా, చర్మంలోతు వరకూ ఉంటే మలద్వారంతోపాటు పెల్విస్‌లోనూ నొప్పి ఉంటుంది. అంతేకాదు మలవిసర్జన పూర్తి అయిన తర్వాత గంటల తరబడి ఆ నొప్పి అలాగే ఉంటుంది.

మలంలో రక్తం కనిపిస్తుంది. సమస్య తీవ్రమైతే వాపు, దురద కూడా ఉంటుంది.

రకాలు
ఫిషర్‌ను ఎక్యూట్, క్రానిక్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సమస్య ఆరువారాల కాలవ్యవధిలోపైతే దాన్ని సాధారణమైనదిగాను, ఆరువారాలు దాటితే ఉధృతమైనదిగాను పరిగణిస్తారు. సమస్య ఉధృతమైతే మలద్వారంలో పగుళ్లు చాలాలోతు వరకూ ఉంటాయి.

కారకాలు
మలబద్దకమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మలబద్దకం ఉన్న వాళ్లు మలవిసర్జన కోసం ఎక్కువగా కష్టపడడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరిగి చర్మం చిట్లిపోతుంది.

ఎక్కువ సార్లు గర్భం దాల్చడం, దీర్ఘకాలంగా లాక్సాటివ్ మందులు వాడడం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు.

పైల్స్‌కు శస్త్రచికిత్స సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాల్లో అంతర్గతంగా ఉండే అల్సరేటివ్ కొలైటిస్, సుఖ వ్యాధులు, క్యాన్సర్ కూడా దీనికి కారణమవుతాయి.

పాటించాల్సినవి-పాటించకూడనివి
నీరు ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

పడుకునే ముందు ఒకగ్లాసు వేడి పాలను తాగడం వల్ల మర్నాడు ఉదయం మలవిసర్జన సాఫీగా అవుతుంది.

మలబద్దకం ఉన్నవారు వేడి పాలలో కొంచెం ఆముదం కలుపుకుని తాగవచ్చు.

రోజులో మూడుసార్లు వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

మలబద్దకం ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కాయగూరలు, సలాడ్లు, తాజా ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది.
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, October 20, 2010

అతిగా కూచున్నా అరిష్టమే ,Longtime siting not good for health.




అతి సర్వత్ర వర్జయేత్‌ అంటారు. అదేపనిగా కూచోవటానికీ ఇది వర్తిస్తుందని మీకు తెలుసా? విశ్రాంతి సమయాల్లోనైనా ఎటూ కదలకుండా అదేపనిగా గంటల తరబడి కూచోవటం మంచిది కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది మరి. దీంతో త్వరగా మరణం ముంచుకొచ్చే ప్రమాదమూ ఉంది. అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ శాస్త్రవేత్తలు దాదాపు 1.20 లక్షల మందిని పరిశీలించి ఈ సంగతిని గుర్తించారు.

విశ్రాంతి సమయాల్లో రోజుకి మూడు గంటల సేపు కూచునేవారితో పోలిస్తే.. ఆరు గంటల పాటు కూచునే వారు ముందే మరణిస్తున్నట్టు అధ్యయనంలో బయటపడింది. ఇది పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఎక్కువగా ఉంటోంది కూడా. శారీరక శ్రమ, బాడీమాస్‌ ఇండెక్స్‌, పొగ తాగే అలవాటు వంటి వాటితో ప్రమేయం లేకుండానే ఇది సంభవిస్తుంటం గమనార్హం. ఎక్కువసేపు కూచోవటం వల్ల అధికంగా తినటం వంటి అనారోగ్యకర అలవాట్ల బారినపడే ఆస్కారముంటుందని, వీటివల్లే మరణం ముప్పు ముంచుకు వస్తుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే జీవక్రియల దుష్ప్రభావాలు కూడా ఇందుకు దోహదం చేస్తుండొచ్చని చెబుతున్నారు. అందుకే రోజు మొత్తమ్మీద కూచునే సమయాన్ని తగ్గించటం, శారీరక శ్రమను ప్రోత్సహించటం అవసరమని సూచిస్తున్నారు.

కదలకుండా కూరునినే చేసే ఉద్యోగాలయితే " కడుపులో చల్ల కదలకుండా ఉంటాయని " గతం లో పెద్దలు అనేవారు . చల్ల కదలకపోవడము , కదడాల సంగతి పక్కన పెడితే కొవ్వుపేరుకు పోవడము మాత్రం ఖాయము . చేసే వృత్తి ఉద్యోగాలమీద మహా ప్రేమవున్న వారు సైతము అలాడెస్క్ లకు అతుక్కుపోయి కూర్చోకూడదని పరిశోధకులు పేర్కోంటున్నారు . ఇలా గంటల కొద్దీ కదలకుండా కూర్చుండిపోతే ఆరోగ్యము పాడౌతుంది .

45 -65 సం.రాల నడుమగల 63 వేలమంది పై విస్తృత అధ్యయనాలు నిర్వహించారు . 4 గంటల్కకంటే తక్కువ , 4-6 గంటలు , 6-8 గంటలు , 8 గంటలు కంటే ఎక్కువ కూర్చునే స్థితిగతులపై అధ్యయనము చేసారు. ఎక్కువసేపు కూర్చునే వారిలో దీర్ఘకాలిక వ్యాధులు పెరిగినట్లు గుర్తించారు. 6 గంటలు కూర్చున్నచోటనిండి కదలకుండా ఉన్నవారికి డయాబిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ . ఇక 8 గంటలు కూర్చునే వారికి రిష్క్ మరీ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆఫీషులో కూర్చున్నవారికే కాదు గంటలకొద్దీ డ్రైవింగ్ చేసే వారికీ వర్తిస్తుంది . శారీరంగా తక్కువ చురుకుదనము గలవారికి , చురుకుదనము ఎక్కువగా గలవారికంటే దీర్ఘాకాలిక వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ కావున వీలైనన్ని సార్లు కూర్చున్నచోటనుండి లేచి అటూ ఇటూ కొన్ని నిముషాలు నడవడము ముఖ్యము .

కూర్చునే సమయము దీర్ఘ్కాలికవ్యాధులు పెరగడానికి కారణమవుతాయా, వ్యాధులు కూర్చునే సమయాన్ని ప్రభావితం చేస్తాయా అన్నది పరిశోధకులు స్పస్టముగా పేర్కొనలేదుగాని , మొత్తము మీద ఈ రెండింటికి లింక్ ఉన్నట్లు నిర్ధారించారు .

నివారణోపాయాలు : 

మధ్య మధ్యలో  లేచి , ప్రతిగంటకు ఒకసారి 2-3 నిముషాలు అటు ఇటూ తిరగాలి ,
ఎలివేటర్ కు బదులుగా మెట్లు ఎక్కాలి ,
ఆఫీషుకు మరీ దూరము కాకపోతే నడిచి వెళ్ళాలి,
కొన్ని సింపుల్ డెస్క్ ఎక్సరసైజ్ లు  అనగా మన ఫీల్స్ మనమే మోసుకోవడము , మనకు కావలసినవి మనమే తెచ్చుకోవడము , మన బెంచీని , కుర్చీని, టేబుల్ ని మనమే క్లీనింగ్ చేసుకోవడము మున్నగు పనులు చేసుకోవాలి .

  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఈత-మంచి వ్యాయామం,Swimming-good exercise





శరీరాకృతిని తీర్చిదిద్దటంలో ఈతను మించిన వ్యాయామం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే కొద్దిదూరం ఈదినా శరీరంలోని అన్ని ముఖ్యమైన కండరాలు పాలు పంచుకుంటాయి. దీంతో శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. ఇక వేగం కూడా పెంచితే ఏరోబిక్‌ వ్యాయామం చేసినట్టే. ఈత కొవ్వును కరిగింటచంలోనూ బాగా తోడ్పడుతుంది. మనకు సాధ్యమైనంత వేగంతో ఈదొచ్చు, లేదంటే నెమ్మదిగా కదలొచ్చు. కావాలంటే అలా చాలాసేపు సాగొచ్చు కూడా. కొవ్వును కరిగించే వ్యాయామాల్లో ఇలా శక్తిని క్రమంగా ఖర్చు చేస్తుండటం చాలా కీలకమైన విషయమని గుర్తించుకోవాలి. ఈదుతున్నప్పుడు మనం శరీర బరువుని మోయాల్సిన పనిలేదు. దీంతో కీళ్ల మీద ఒత్తిడీ పడదు. మోకాళ్లు, తుంటి, వెన్నెముకల మీద బరువు వేయకుండానే వ్యాయామం అయిపోతుంది. నడుంలోతు నీటిలో ఈదితే కీళ్ల మీద పడే ఒత్తిడి 50 శాతం, ఛాతీలోతు నీటిలో ఈదితే 75 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. గాయాల కారణంగా నడవటం, పరుగెత్తటం వంటివి చేయలేనివారికీ ఈత మంచి వ్యాయామమే. అయితే ఈత ఎంతమంచి వ్యాయామమే అయినా.. బరువును మోయటంతో పనిలేకపోవటం వల్ల ఆస్టియోపోరోసిన్‌తో ఎముకలు గుళ్లబారేవారికి అంతగా ప్రయోజనం ఉండదు. ఇలాంటివారు ఇతర రకాల వ్యాయామాలు ఎంచుకోవటం మంచిది.

================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పిల్లలు కంప్యూటర్‌ గేమ్స్‌ ,Children and Computer-Games





మీ పిల్లలు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఈ అలవాటు త్వరగా వ్యసనంలా మారే ప్రమాదమే కాదు.. దాంతో దుష్ఫ్రభావాలూ కలిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్‌ గేమ్‌లు పిల్లలకు దెబ్బలు తగలకుండా, వినోదం కలిగించే మాట నిజమే గానీ.. ఇతర ఆటల ద్వారా కలిగే సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని చెబుతున్నారు. ప్రస్తుతం కంప్యూటర్‌ గేమ్‌లకు అతుక్కుపోవటాన్ని ఒక వ్యసనంలా గుర్తించకపోయినప్పటికీ వీటికి ఆకర్షితులవుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుండటం పట్ల నిపుణులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పిల్లలు ఏకాకులుగా మారతున్నారని.. కుటుంబ సభ్యులతో గడపటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారని భయపడుతున్నారు.


ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు రోజులో 6 నుంచి 8 గంటలసేపు కంప్యూటర్‌ గేమ్‌ల్లో మునిగిపోవటం సాధరణమైపోతోంది. దీంతో కొందరిలో దుష్ఫ్రభావాలూ తలెత్తే అవకాశమూ ఉంది. వాటిల్లో కొన్ని..
* మణికట్టు వద్ద కండరాల నొప్పి
* మెడనొప్పి
* కుంగుబాటు
* భావోద్రేకాల్లో మార్పులు
* గేమ్‌లను ఆడొద్దంటే కోపంతో రెచ్చిపోవటం
* కుటుంబంలో, బయటా జరితే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం
* స్నేహితులతో చనువుగా మెలగకపోవటం
* భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
* హోంవర్క్‌ పూర్తి చేయకపోవటం
* తరగతుల్లో పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం


కంప్యూటర్‌ గేమ్‌ల్లో మునిగిపోయిన పిల్లలు నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతున్నా, ఆందోళనతో కనిపిస్తున్నా ముప్పు పొంచి ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇవి వారి మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే కంప్యూటర్‌ గేమ్‌లకు పిల్లలు ఎక్కువగా అతుక్కుపోతున్నట్టు గమనిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించటానికి వెంటనే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడుతుండాలి.
* కంప్యూటర్‌ వాడకంలో ముందే పరిమితి విధించాలి.
* అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్‌ను ఉంచాలి.
* అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారన్నదీ గమనిస్తుండాలి.
* కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవటమూ మంచిదే.
* పిల్లలతో కలిసి తరచూ షికార్లకు వెళ్తుండాలి.

  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/

Melasam, Black spots on Face , మంగు,నల్లశోబి


-
  • In males
  • in Females
మన ప్రమేయం లేకుండానే.. ముఖం మెల్లగా అక్కడక్కడ వివర్ణమైపోతుంటుంది. ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా ఏ ఇబ్బందీ పెట్టని ఈ మచ్చలు.. మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. ఎందుకిలా? వీటితో నలుగురిలోకి వెళ్లేదెలా..? ఈ మచ్చల బెడద వదలించుకునేదెలా?

నిజానికి ఈ 'మంగు' మచ్చలను నిర్ధారించటానికి పెద్దపెద్ద పరీక్షలేం అవసరం లేదు. వైద్యులు చూస్తూనే సులభంగా పట్టుకుంటారు కానీ.. వీటిని పూర్తిగా నయం చెయ్యటం మాత్రం అంత సులభం కాదు. వీటికి ఎన్నో రకాల చికిత్సా విధానాలున్నాయి. వీటితో కొద్దిమందికి మచ్చలు పూర్తిగా పోయినా.. చాలామంది విషయంలో మచ్చల రంగు, తీవ్రత తగ్గించటం మాత్రమే సాధ్యం కావచ్చు. మొత్తానికి ఈ 'మంగు' మచ్చల విషయంలో 'ఓర్పు' మాత్రం చాలా అవసరం.
మంగు బాధితుల్లో 90% మంది మహిళలే. ఇది పురుషుల్లోనూ కనిపిస్తుంది కానీ.. మహిళలతో పోలిస్తే వీరిలో తక్కువ.
మంగు చిన్న పిల్లల్లో.. అంటే రజస్వలకు ముందు కనిపించదు. 30-40 ఏళ్ల వయసులో, మళ్లీ ముట్లు నిలిచిపోయే దశలో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంగా గర్భిణుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే వీటిని 'మాస్క్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ' అనీ అంటారు.
మంగు వల్ల కేవలం మచ్చల బెడద తప్పించి ఇతరత్రా మంట, దురద వంటి బాధలు, లక్షణాలేమీ ఉండవు. కాకపోతే చూడటానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా కనబడతాయి కాబట్టి చాలామంది అంద వికారంగా తయారవుతున్నామేమిటా? అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు.
ముఖాన మచ్చలను చూస్తూనే... అవేమిటో గుర్టుపట్టెయ్యచ్చు! అదే మంగు ప్రత్యేకత. ఈ మచ్చలనే వైద్య పరిభాషలో 'మెలాస్మా' అంటారు. (గ్రీకులో 'మెల్‌' అంటే నలుపు, 'ఆస్మా' అంటే రంగు అని. దాన్నుంచి వచ్చిందే ఈ పదం!) ఈ రకం మచ్చలు స్త్రీలలో ఎక్కువ. గర్భిణుల్లో కనిపించే ఈ మచ్చలు కాన్పు అయిన తర్వాత తగ్గొచ్చు.. అయితే ఆ తర్వాత కాలంలో మళ్లీ రావచ్చు కూడా. మంగు మచ్చలు తెల్లవారిలో కంటే మనలాంటి నల్ల జాతీయుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన ప్రాంతంలో మంగు చాలా తరచుగా కనిపిస్తుంటుంది.

ఎందుకు వస్తుంది?
మంగు రావటానికి మూడు ప్రధానమైన కారణాలున్నాయి...
1. జన్యు సంబంధ కారణాలు: మంగు రావటానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం.. చర్మానికి ఎండ తగలటం. అలాగని ఇది ఎండలో తిరిగిన అందరికీ రాదు. కాబట్టి దీనికి జన్యుసంబంధ కారణాలూ దోహదం చేస్తాయి.

2. ఎండ తగలటం: ఎంతోకొంత ఎండ తగలకపోతే మంగు రాదు. చాలామంది 'మేం బయటకు ఎక్కడికీ వెళ్లటం లేదు కదా. ఎందుకొస్తుంది?' అని పొరపడుతుంటారు. కానీ మనకు తెలియకుండా, అనుకోకుండా కూడా సూర్యరశ్మి ప్రభావానికి గురవుతుంటాం. కేవలం ఒకరోజు ఎండ తగిలినా మెలాస్మా రావొచ్చు. యాత్రలకు వెళ్లినపుడో, దూరప్రాంతాలకు పోయినప్పుడో సూర్యరశ్మి తగలొచ్చు. కొందరు సముద్ర తీర ప్రాంతాలకు విహారానికి వెళ్తుంటారు. అలాంటి సమయంలో నీళ్లు, సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు.. రెండూ కలిసి వీటి ప్రభావంతో త్వరగా మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండలో తిరగటమంటే కేవలం వేసవిలోనే అని భావించాల్సిన పని లేదు. మబ్బుగా ఉన్న రోజుల్లో కూడా పగటి వెలుతురులోనూ అతినీలలోహిత కిరణాలు (విజిబుల్‌లైట్‌, యూవీ-ఏ, యూవీ-బీ) ఉంటాయి.మంగుకు ఇవన్నీ కారణం కావచ్చు.

3. హార్మోన్ల ప్రభావం: మంగు విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం హార్మోన్లు. మన శరీరంలో స్త్రీ హార్మోన్త్లెన ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్ల మధ్య సమతౌల్యం తప్పినప్పుడు.. మంగు వచ్చే అవకాశం ఎక్కువ. గర్భనిరోధక మాత్రలు వేసుకునే వారిలో మంగు ఎక్కువగా కనిపించటానికి కూడా కారణం ఇదే. అలాగే ముట్లుడిగిపోయే వయసులోనూ స్త్రీశరీరంలో హార్మోన్ల మధ్య సమతౌల్యం మారిపోతుంది, ఫలితంగా మంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ హార్మోన్ల వ్యత్యాసం, దీనికి సూర్యరశ్మి, జన్యు కారణాలు కూడా ఒకదానికి ఒకటి తోడైతే మంగు త్వరగా వస్తుంది.

ఇవి కాకుండా..
* కొన్నిరకాల మందులు కూడా 'మంగు' మచ్చలు రావటానికి కారణమవుతాయి. మూర్ఛ, క్యాన్సర్‌, మానసిక సమస్యలకు వాడే కొన్ని మందుల వల్ల కూడా మంగు వస్తుంది. టెట్రాసైక్లిన్‌, నొప్పి తగ్గటానికి వాడే కొన్నిరకాల మందులతోనూ ఇవి రావొచ్చు. అయితే ఈ మందులతో పాటు సూర్యరశ్మి ప్రభావం తోడైనప్పుడే మంగు రావటానికి ఆస్కారం మరింతగా ఉంటుంది. థైరాయిడ్‌, గర్భాశయ కణుతుల వంటి సమస్యలున్న వారికీ రావచ్చు.
* సౌందర్య సాధనాల వల్ల కూడా మంగు రావచ్చన్నది కొందరి అభిప్రాయం. అయితే దీన్ని సాధారణంగా 'ఫొటో కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌'గా భావిస్తుంటారు.
* కొందరిలో హార్మోన్లు, ఎండ, జన్యు కారణాల వంటివేవీ లేకుండా కూడా మంగు కనబడుతుంటుంది, దీనికి పైకి కనిపించకుండా ఏర్పడే హార్మోన్ల వ్యత్యాసం వంటివి కారణమవుతాయి.
* కొందరు ముఖానికి వెల్లుల్లి/నిమ్మరసం వంటివి రాసుకుంటూ ఉంటారు, వాటివల్ల 'పిగ్మెంటేషన్‌' పెరిగి.. నల్లమచ్చలు రావచ్చు. వాటిని మంగు మచ్చలుగా పొరబడే అవకాశం ఉంటుంది.
మచ్చల్లో మూడు రకాలు
శరీరం మీద మచ్చలు వచ్చే ప్రాంతాన్ని బట్టి 'మంగు' ప్రధానంగా 'సెంట్రో ఫేషియల్‌', 'మాలార్‌', 'మాండిబ్యులర్‌' అని 3 రకాలు.
* సెంట్రో ఫేషియల్‌: ఇది ముక్కు, ముక్కుకు ఇరువైపులా చెక్కిళ్ల దగ్గర, వీటితో పాటు నుదురు, ఒకోసారి పెదవుల పైభాగంలోనూ కూడా వస్తుంటుంది. ముక్కు-చెక్కిళ్ల ప్రాంతంలో ఈ మచ్చలు సీతాకోక చిలుక ఆకారంలో కనిపించటం వల్ల దీనిని 'బటర్‌ఫ్త్లె రాష్‌' అనీ అంటారు.
* మాలార్‌: కొందరికి ఇది కేవలం చెక్కిళ్ల కిందనే వస్తుంది.
* మాండిబ్యులార్‌: ఈ రకం మంగు దవడల ప్రాంతంలో వస్తుంది.
మంగు మచ్చలు చాలా వరకూ ముఖం మీదే వచ్చినప్పటికీ కొందరికి మెడ మీద, ఛాతీ మధ్య భాగంలో కూడా వస్తాయి. అరుదుగా ముంజేతుల మీదా కనిపిస్తుంది.

రంగుల్లో మూడు రకాలు..
* చాలామందికి గోధుమ రంగులో గానీ, గోధుమ.. నలుపు కలగలిసిన రంగులో గానీ వస్తాయి. * కొందరికి బూడిద రంగులోనూ ఉండొచ్చు. * మరికొందరికి బూడిద, నీలం కలిసిన రంగులో ఉంటాయి. ఇలాంటి వారిలో మంగు చర్మం లోపలి పొరల నుంచీ ఉందని అర్థం.

లోతులోనూ మూడు రకాలు
* ఎపిడెర్మల్‌ మెలాస్మా: వీరిలో మచ్చ కేవలం చర్మం పైపొర మీదే ఉంటుంది. * డెర్మల్‌ మెలాస్మా: ఇది చర్మం కింది పొరలోనూ ఉంటుంది. * డెర్మో, ఎపిడెర్మల్‌ మెలాస్మా: ఇది రెండు పొరల్లోనూ కలగలసి ఉంటుంది.

ఎలా గుర్తిస్తారు?
మంగు మచ్చలను చూస్తూనే వైద్యులు గుర్తుపట్టేస్తారు. ఇక మచ్చలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలుసుకోవటానికి 'వుడ్స్‌ ల్యాంప్‌' అనే పరికరం బాగా ఉపయోగపడుతుంది. దీని కింద చూసినపుడు మంగు మచ్చలు పైపైపొరల్లోనే ఉన్నాయా? కింది నుంచీ ఉన్నాయా? అన్నది తెలుస్తుంది.

చికిత్స
1. సూర్యరశ్మికి దూరంగా ఉండటం: మెలాస్మా చికిత్సలో ఇది అతి ముఖ్యమైంది. ఎండకు దూరంగా ఉండకపోతే మంగు మచ్చలను తగ్గించటం కష్టమనే చెప్పాలి.
2. సన్‌స్క్రీన్‌ లోషన్లు: సూర్యరశ్మిలోని వెలుతురు, యూవీ-ఏ, యూవీ-బీ వంటి వాటన్నింటినీ రక్షణ కోసం 'బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ సన్‌స్క్రీన్‌' లోషన్లు బాగా ఉపయోగపడతాయి. ఈ లోషన్లు రాసుకోకుండా ఎలాంటి చికిత్స చేసినా ప్రయోజనం ఉండదు. వీటిలో టైటానియమ్‌ డయాక్సైడ్‌, జింక్‌ ఆక్సైడ్‌లు అనే సన్‌స్క్రీన్స్‌ ముఖ్యమైనవి. ఇవేకాకుండా కెమికల్‌ సన్‌స్క్రీన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిజికల్‌ సన్‌స్క్రీన్స్‌ రాసుకుంటే తెల్లగా పైకి కనిపిస్తాయి. జిడ్డుగా ఉంటాయి. అదే కెమికల్‌ సన్‌స్క్రీన్స్‌ పైకి కనిపించవు గానీ 2-3 గంటల సేపే పనిచేస్తాయి. ఫిజికల్‌ సన్‌స్క్రీన్స్‌ 4-6 గంటల పాటు.. కొన్నిసార్లు 8 గంటల వరకూ పనిచేస్తాయి. ఇప్పుడు రెండింటినీ కలిపి కొత్తరకం సన్‌స్క్రీన్స్‌ని కూడా తయారు చేస్తున్నారు. వీటిని ప్రతి 3-4 గంటలకు ఓసారి రాసుకోవాలి. బయటకు వెళ్లటానికి అరగంట ముందే రాసుకోవాలి. ఎక్కువసేపు బయట గడపాల్సి వస్తే రెండు, మూడుసార్లు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.
3. బ్లీచింగ్‌ ఏజెంట్స్‌: ముదురు రంగు తీవ్రతను తగ్గించే రసాయనాలివి. వీటిల్లో హైడ్రోక్వినోన్‌ అనే క్రీము ఎక్కువగా వాడకంలో ఉంది. అయితే వీటిని ఎక్కువగా రాసుకుంటే ఆ భాగంలో తెల్లటి మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వైద్యుల పర్యవేక్షణలోనే, చెప్పినట్టుగానే వాడుకోవాలి.
* అజెలాయిక్‌ యాసిడ్‌, కోజిక్‌ యాసిడ్‌లతో చేసిన క్రీములు కూడా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు వీటిల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, బెర్రీ పళ్ల సారం కలిపినవీ దొరుకుతున్నాయి. ఇంకా అధునాతన క్రీములు ఉన్నప్పటికీ అవన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.
* స్టిరాయిడ్‌ క్రీమ్స్‌ని వాడటం అంత మంచిది కాదు. వీటితో మొదట్లో మంగు తగ్గినట్టు అనిపించినా ఆ తర్వాత మళ్లీ ఉద్ధృతంగా.. దాడి చేసినట్టుగా వచ్చేస్తుంది.
4. కెమికల్‌ పీల్స్‌: ప్రధానంగా ఇవి కూడా రసాయనాలే. వీటిని రాసి, కొంతసేపు ఉంచి తర్వాత తొలగించాల్సి ఉంటుంది. కెమికల్‌ పీల్స్‌ను కూడా బ్లీచింగ్‌ ఏజెంట్స్‌గా వాడుతున్నారు. వీటిల్లో సింగిల్‌ పీల్‌, కాంబినేషన్‌ పీల్‌, కాక్‌టెయిల్‌ పీల్‌, సీక్వెన్షియల్‌ పీల్‌.. ఇలా రకరకాలున్నాయి. ఏ రకం పీల్‌ దేనికి ఉపయోగపడుతుంది? ఎంతసేపు ఉంచుకోవాలనేది వైద్యులు అనుభవం ద్వారా గుర్తించి, సూచిస్తారు.
* పీల్స్‌ను ఎక్కువగా వాడితే ఆ భాగం మరీ తెల్లగా (బొల్లి మచ్చల్లా) అయ్యే ప్రమాదం కూడా ఉంది. పైగా వీటితో కొన్నిసార్లు దురద, మంట (కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌, కాంటాక్ట్‌ అలర్జిటిక్‌ డెర్మటైటిస్‌) వంటి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కొందరికి రాసినంత మేరా చర్మం చాలా సున్నితంగా కూడా తయారవ్వచ్చు.
* హెర్పిస్‌ సింప్లెక్స్‌, చర్మం మీద దళసరి కీలాయిడ్స్‌ వచ్చే స్వభావం ఉన్నవారు ఈ కెమికల్‌ పీల్స్‌ను వాడరాదు.
5. డెర్మాబ్రేజన్‌: ఇందులో ప్రత్యేక పరికరాలతో చర్మం మీది పైపొరలను గీరేసినట్టుగా తొలగిస్తారు (డెర్మాబ్రేజన్‌). ఇది మెలనోసైట్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. లేకపోతే రంగు మరింతగా ముదిరే ప్రమాదం ఉంది. ఇది మన భారతీయుల చర్మాలకు అంతగా ఉపయోపడదు.
6. లేజర్‌: వీటిల్లోనూ చాలా రకాలున్నాయి. ఎపిడెర్మల్‌ మెలాస్మాలోనే లేజర్లు బాగా ఉపయోగపడతాయి. డెర్మల్‌ మెలాస్మా, మిక్స్‌డ్‌ మెలాస్మాకు కష్టం. పైగా ఇవి భారతీయుల్లో తిరిగి రంగు ముదిరేలా (పిగ్మెంటేషన్‌) చేస్తాయి. తెల్ల చర్మం గల వారిలో మాత్రం జాగ్రత్తగా వాడితే ఫలితం ఉంటుంది. మంగు చికిత్సలో లేజర్లను ముందుగా వాడటం ప్రమాదం. ఇతరేతర చికిత్సలతో ఫలితం కనబడనప్పుడు, చివరి దశలోనే దీనిని ఉపయోగించాలి.
ఓర్పు ప్రధానం
మంగును సంపూర్ణంగా నయం చేసే పూర్తిస్థాయి చికిత్స ఏదీ ఇప్పటి వరకూ అందుబాటులో లేదు. కాకపోతే ఆ మచ్చల రంగు, తీవ్రత బాగా తగ్గిపోయేలా చేసే చికిత్సలు మాత్రం చాలా ఉన్నాయి. కొన్నిసార్లు తగ్గిపోయిన తర్వాత రెండేళ్లకో, మూడేళ్లకో మళ్లీ వచ్చే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఈ చికిత్స తీసుకునే వారికి ఓర్పు చాలా అవసరం.
* మెలాస్మా కేవలం 5 శాతం మందిలోనే పూర్తిగా తగ్గుతుంది. గర్భం వచ్చినపుడు వచ్చే మంగు మచ్చలు కొందరిలో కాన్పు తర్వాత వాటంతట అవే పోతాయి.
* చాలామందిలో మంగు మచ్చలు 50-60 శాతం వరకు తగ్గుతాయి. మచ్చలు పైకి పెద్దగా, ఎబ్బెట్టుగా కనబడకుండా చికిత్స చేయటం సాధ్యమే. దీంతో చాలామంది, చాలావరకూ సంతృప్తి పడతారు.
* ఈ చికిత్సలు వేటితోనూ సంతృప్తికర ఫలితం లేకపోతే కొన్నిసార్లు మచ్చలు చర్మం రంగులో కలిసిపోయినట్టు కన్పించేలా చేసే పైపూతలనూ వాడుకోవచ్చు.

జీవన శైలి
* టమోటా, క్యారెట్‌, దోసకాయ, ద్రాక్ష, రేగు, నేరేడు, దబ్బపండ్ల వంటివి ఎక్కువగా తినటం మంచిది. వీటిల్లోని లైకోపేన్‌, విటమిన్లు, పండ్ల ఆమ్లాలు మేలు చేస్తాయి. అలాగే ఆకుకూరలు, క్యారట్‌ వంటి ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగుపై జరిపిన అధ్యయనాల్లో- విటమిన్‌ సి, విటమిన్‌ ఈ, ఐసోఫ్లేవనాయిడ్లు, పండ్ల నుంచి తీసిన ఆమ్లాలతో కూడిన ఆహారాన్ని తినిపించి చూశారు. ఇది మంచి ఫలితాన్ని కనబర్చింది.

ఎండ సోకితే ఏమవుతుంది?
మన చర్మంలో 'మెలనోసైట్స్‌' అనే ప్రత్యేక కణాలుంటాయి. ఇవి 'మెలనిన్‌' అనే రంగు పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మన చర్మానికి ఆ రంగు వచ్చేది ఈ మెలనిన్‌ వల్లే! అయితే ఎండ సోకినపుడు, హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మెలనోసైట్స్‌.. మెలనిన్‌ రంగు పదార్ధాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమస్యకు మూలం.

మన చర్మంలో 'మెలనోసైట్స్‌' అనే ప్రత్యేక కణాలుంటాయి. ఇవి 'మెలనిన్‌' అనే రంగు పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మన చర్మానికి ఆ రంగు వచ్చేది ఈ మెలనిన్‌ వల్లే! అయితే ఎండ సోకినపుడు, హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మెలనోసైట్స్‌.. మెలనిన్‌ రంగు పదార్ధాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమస్యకు మూలం.


పిగ్మెంటేషన్ , Pigmentation--Treatment

ఈమధ్యకాలంలో పిగ్మెంటేషన్ పెద్ద సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖంలో వచ్చే పిగ్మెంటేషన్ భయపెట్టి, బాధపెడుతోంది. ఒకవిధమైన ఆత్మ న్యూనతలో పడేస్తోంది.

పిగ్మెంటేషన్ వల్ల ముఖంలో రంగు మారి గ్లామర్ తగ్గుతుంది. దాంతో చాలామంది కుంచించుకుపోతారు. కాంప్లెక్స్ కు లోనవుతారు. నలుగురిలోకీ వెళ్ళడానికి భయపడుతుంటారు. ఆ సమస్య నుండి బయట పడేందుకు మార్కెట్లో దొరికే క్రీములు, సొల్యూషన్లు ప్రయోగిస్తూ ఉంటారు. ఒకవేళ తగ్గితే సరే, గొప్ప రిలీఫ్ పొందుతారు. తగ్గలేదో.. మళ్ళీ కొత్త టిప్స్, రెమెడీస్, మెడిసిన్స్ కోసం అన్వేషణ మొదలవుతుంది.

ఈ నేపథ్యంలో పిగ్మెంటేషన్ కు బ్రహ్మాండమైన దివ్య ఔషధం గురించి చెప్పుకుందాం. ఇందులో ఎలాంటి కెమికల్సూ లేవు. పూర్తిగా హెర్బల్. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. ఖర్చు పెట్టాల్సిందీ లేదు. కష్టపడాల్సిందీ లేదు. ఇంతకీ ఎలా చేయాలంటే - ఒక గుప్పెడు లేత వేపాకులో చిన్న పసుపుకొమ్ము, కుంకుడు గింజల్లోని పప్పులు పది తీసుకుని కొన్ని నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టును రాత్రిపూట ముఖానికి రాసుకుని, ఉదయం కడిగేయాలి. ఇలా ఒక వారంపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ పేస్టు కళ్ళలోకి వెళ్ళకుండా చూడాలి. అయినప్పటికీ ముఖానికి రాసుకున్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు కారతాయి. అందుకు భయపడనవసరం లేదు.


  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, October 18, 2010

అపెండిసైటిస్‌ , Appendicitis




24 గంటలు అపెండిక్స్‌ గండం

24 గంటల నొప్పి... అదే అపెండిక్స్‌... ఏ క్షణాన... తిప్పలు తెచ్చిపెడుతుందోనని ప్రతి ఒక్కరికీ భయమే. 'అపెండిసైటిస్‌' మన మనసుల్లో అంతటి భయాన్ని సృష్టించింది.

నిజానికి అపెండిక్స్‌ నొప్పి అంత ఇబ్బందికరమైనదే. ఎందుకంటే దీన్ని అనుమానించటం తేలిక. కానీ కచ్చితంగా నిర్ధారించుకోవటం కష్టం. ఒకవేళ నిర్ధారించినా వెంటనే ఆపరేషన్‌ అవసరమా? కాదా? అన్నది తేల్చి చెప్పటం మరో ఇబ్బంది. అయితే ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ అపెండిక్స్‌ పై మన అవగాహన చాలా పెరిగింది.
ఉండుకం... అపెండిక్స్‌.. అన్నది పెద్దపేగులో మొట్టమొదటి భాగం! చిన్నపేగూ, పెద్దపేగూ కలిసే చోట.. మొదట్లో ఉంటుందిది. కావటానికి ఇది పెద్దపేగులో మొదటి భాగమైనా మానవుల్లో దీనికేమంత ప్రాధాన్యం లేకపోవటం వల్ల.. పరిణామక్రమంలోనే పెద్దపేగుకు అతుక్కుని ఉండిపోయే చిన్న తిత్తిలా తయారైంది. సాధారణంగా ఇది 8 సెం.మీ. పొడవుంటుంది. అరుదుగా 12 సెం.మీ. వరకూ ఉంటుంది. అందరికీ ఒకే కోణంలో ఉండాలనేం లేదు. సాధారణంగా లోపలికి ఏవైనా పదార్ధాలు వెళుతుంటేనే పేగుల సైజు పెరుగుతుంది. ఈ ఉండుకం పేగుల్లో భాగమే అయినా ఇదొక ప్రత్యేక కోణంలో వంగి ఉండటం, దీని ప్రవేశ మార్గం చాలా చిన్నగా ఉండటం వల్ల దీనిలోకి ఎలాంటి పదార్థాలూ వెళ్లవు. కాబట్టి ఇది సైజు పెరగకుండా అలా చిన్నగానే ఉండిపోతుంది. ఉండుకంలో జిగురు స్రావాలు (మ్యూకస్‌) ఉత్పత్తి అవుతుంటాయి. చిన్నగా ఉండే దీని ప్రవేశ మార్గంలో నుంచి ఆ స్రావాలు ఎప్పటికప్పుడు పెద్దపేగుల్లోకి వచ్చి చేరుతుంటాయిగానీ పెద్దపేగుల్లోని ద్రవాలు, మలం, స్రావాల వంటివి మాత్రం దీన్లోకి వెళ్లవు.

నొప్పికి మూలం.. రెండు రకాలు!
* అపెండిసైటిస్‌... ఈ ఉండుకం నొప్పి ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు.

1. అబ్‌స్ట్రక్టివ్‌: అంటే పేగుల్లోని మలంగానీ, నులిపురుగుల వంటివిగానీ ఈ ఉండుకం మార్గానికి అడ్డుపడొచ్చు. అప్పుడు ఉండుకంలో తయారయ్యే మ్యూకస్‌ స్రావాలు బయటకు రావటం కష్టమవుతుంది కాబట్టి లోపలే ఉబ్బి.. వాపునకు కారణమవుతుంది.

2. ఇన్‌ఫెక్టివ్‌: మనం తీసుకున్న ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా వంటివి పేగుల్లోకి చేరి.. అక్కడ్నుంచి ఉండుకంలోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌కు దారితియ్యచ్చు.

నొప్పి లక్షణాలు ముఖ్యం
అపెండిసైటిస్‌ సమస్య... ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం.. ఈ నాలుగూ ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ను నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

* నొప్పి: అపెండిసైటిస్‌ నొప్పి తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ముందు బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ వస్తుంది. క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటు అయిన కుడివైపు పొత్తికడుపు భాగానికి (రైట్‌ ఇలియాక్‌ ఫోజా) మళ్లుతుంది. అందుకే దీన్ని 'షిఫ్టింగ్‌ పెయిన్‌' అంటారు. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6-8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. దీన్ని అపెండిసైటిస్‌ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. ఈ నొప్పి ఇలా మారటానికి కారణం- పొట్టలో ప్రధాన నాడులన్నీ బొడ్డు దగ్గర కేంద్రీకృతమవుతాయి కాబట్టి.. కడుపులో ఎక్కడ సమస్య తలెత్తినా ముందు బొడ్డు దగ్గరే నొప్పి ఆరంభమవుతుంది. ఇక ఇన్ఫెక్షన్‌ ముదిరి, వాపు పెరిగిన కొద్దీ క్రమేపీ ఉండుకం ఉండే దగ్గరే నొప్పి ఎక్కువగా తెలుస్తుంటుంది.

* జ్వరం: నొప్పి ఆరంభమైన తర్వాత జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడూ 100.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువగా ఉంటుంది. మధ్యమధ్యలో తగ్గటమన్నది ఉండదు.. జ్వరం ఎప్పుడూ ఒకేలాగ ఉంటుంది.

* వాంతులు: కొందరిలో ఒకట్రెండు వాంతులు అవుతాయి. కొందరిలో అవీ ఉండకపోవచ్చు కూడా. ఈ వాంతులు పేగుల్లో అవరోధాల మూలంగా వచ్చేవి కావు. నాడుల్లో స్పందనల మూలంగా వస్తాయి. అందుకే వీటిని 'రిఫ్లక్స్‌ వామిటింగ్స్‌' అంటారు.

* ఆకలి లేకపోవటం: అపెండిసైటిస్‌ అనేది పేగులకు సంబంధించిన సమస్య కాబట్టి ఆకలి తగ్గిపోయి ఆహారం సయించదు. - ఈ లక్షణాలు కనబడినప్పుడు అపెండిసైటస్‌ అని అనుమానించాలి.

వైద్యులేం చూస్తారు?
ఇవాళ ఎన్నో రకాల అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా అపెండిసైటిస్‌ను నిర్ధారించే విషయంలో వైద్యులు స్వయంగా చేసే పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వైద్యుల పరీక్షతో దీన్ని తేలికగానే గుర్తించగలుగుతారు. దాన్ని నిర్ధారించుకునేందుకుఆల్ట్రాసౌండ్‌ పరీక్ష, రక్తపరీక్షలు చేయిస్తారు. వీటితో కచ్చితంగా నిర్ధారించటం సాధ్యమవుతుంది.

నొప్పి కేంద్రం.. మెక్‌బర్నీస్‌ పాయింట్‌
కడుపు నొప్పి వచ్చినప్పుడు.. అది ఉండుకం వాచి.. అపెండిసైటిస్‌ కారణంగా వచ్చిన నొప్పేనా? అన్నది గుర్తించటానికి ఒక సూత్రం ఉంది. కుడివైపు కటి ఎముక (ఇలియాక్‌ స్పైన్‌) నుంచి బొడ్డు వరకూ ఒక గీతను ఊహించుకోండి. దీన్ని 'స్పైనో అంబ్లికల్‌ లైన్‌' అంటారు. ఈ గీతను మూడు భాగాలు చేసి బొడ్డు నుంచి రెండు భాగాలు దాటిన తర్వాత మూడో భాగం మొదట్లో పాయింట్‌ ముఖ్యమైంది. దీనికిందే ఉండుకం ఉంటుంది. అపెండిక్స్‌ వాపు వచ్చినపుడు ఈ పాయింట్‌ వద్ద వేలితో నొక్కితే రోగి నొప్పితో విలవిల్లాడిపోతారు. దీన్నే 'మెక్‌ బర్నీస్‌ పాయింట్‌' అంటారు. పొత్తికడుపు అంతా ఎక్కడ నొక్కినా పెద్దగా స్పందించరుగానీ.. ఈ 'పాయింట్‌' వద్దకు రాగానే చేత్తో కూడా తాకనివ్వరు. నొప్పి ఉండుకానికి సంబంధించినదేనని చెప్పేందుకు ఇది కీలకమైన సంకేతం.

* రెండోది పెరిటోనైటిస్‌: అపెండిక్స్‌ వాచిన తర్వాత క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఇన్‌ఫెక్షన్‌ కడుపులోని ఇతర పొరలకూ వ్యాపించి ఆ ప్రాంతంలో పెరిటోనైటిస్‌కు దారి తీస్తుంది. అప్పుడు పొత్తికడుపు కండరం నొక్కితే గట్టిగా తయారవుతుంది. దీన్ని 'మజిల్‌ గార్డింగ్‌' అంటారు.

మరికొన్ని సంకేతాలు..
* అపెండిక్స్‌ వాపు వచ్చినపుడు దగ్గితే ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎక్కడో కచ్చితంగా చూపించగలుగుతారు కూడా.

* ఎడమ కాలు కదపమంటే తేలికగా కదుపుతుంటారు. కానీ కుడికాలు కదపమంటే భయంభయంగా, నొప్పితో కదపలేకపోతుంటారు. ఎందుకంటే కుడికాలు కదిపినప్పుడు 'ఇలియోసోయాస్‌' అనే కండరం కదులుతుంది, ఇది లోపల ఉండుకాన్ని తాకుతుంది. దీంతో కుడికాలు కదుపుతుంటే లోపల నొప్పి తీవ్రమవుతుంది. అయితే.. బొద్దుగా ఉండే పిల్లల్లో ఆ ప్రాంతంలో నొక్కినా వారు వెంటనే స్పందించకపోవచ్చు. అందుకే వీరిలో అపెండిసైటస్‌ ముదిరిపోయి.. అది లోపల చీముతో పగిలిపోవటమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. అందువల్ల బొద్దు పిల్లల్లో అపెండిక్స్‌ ప్రాంతంలో నొప్పి వస్తే జాగ్రత్తగా ఉండాలి.

తేల్చిచెప్పే ఆల్ట్రాసౌండ్‌
వైద్యులు స్వయంగా వివిధ రకాలుగా పరిశీలించిన తర్వాత అపెండిక్స్‌ వాపు అని బలంగా అనుమానిస్తే.. కచ్చితమైన నిర్ధారణ కోసం ఇతర పరీక్షలు చేయిస్తారు. వీటిల్లో ఆల్ట్రాసౌండ్‌ ముఖ్యమైంది.

* ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో అపెండిక్స్‌ వాపును కచ్చితంగా గుర్తించొచ్చు. నిజానికి వాపులాంటి సమస్యలేమీ లేకుండా అపెండిక్స్‌ ఆరోగ్యంగా ఉంటే ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో కనిపించటం కష్టం. అపెండిక్స్‌ వాచినపుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అపెండిక్స్‌ గోడ మందంగా కూడా మారినట్టు తెలుస్తుంది. దీని మందం 6 ఎం.ఎం. కన్నా ఎక్కువుంటే అపెండిక్స్‌ వాచిందని అనుమానం, 9 ఎం.ఎం. కన్నా ఎక్కువుంటే కచ్చితంగా వాపేనని నిర్ధారణ చేస్తారు. అపెండిక్స్‌ చుట్టూ చీము లేదా ద్రవం ఏవన్నా చేరి ఉన్నాయా అన్నదీ (పెరీ ఎపెండిక్యులర్‌ కలెక్షన్‌) తెలుస్తుంది. వీటితో చాలా వరకూ అపెండిసైటిస్‌ అని కచ్చితంగా తెలిసిపోతుంది.

సహాయపడే రక్తపరీక్షలు: అపెండిక్స్‌ వాచినపుడు రక్తంలో తెల్లకణాలు (డబ్ల్యూబీసీ) అధిక సంఖ్యలో ఉంటాయి. నొప్పితో పాటు క్యూబిక్‌ మిల్లీలీటర్‌ రక్తంలో 10 వేల కన్నా ఎక్కువ తెల్లకణాలుంటే అపెండిసైటస్‌ అని భావించొచ్చు. ఈ తెల్లకణాల్లోనూ న్యూట్రోఫిల్స్‌ సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువుంటాయి. ఇక సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 6 కన్నా ఎక్కువుంటే ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు అర్థం.

చికిత్స ఏమిటి?
వైద్యుల పరీక్ష, ఆల్ట్రాసౌండ్‌లలో అపెండిక్స్‌ వాచినట్టు స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్‌కు వెళ్లిపోవటం మంచిది. ఒకవేళ ఆల్ట్రాసౌండ్‌ ఫలితం స్పష్టంగా లేకపోతే.. రక్తపరీక్ష ఫలితాలను చూస్తారు. అప్పటికీ ఉండుకం నొప్పేనా? కాదా? అన్నది స్పష్టంగా తేలక అనుమానంగా ఉంటే బాధితులను ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రంగా లేకపోయినా, ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో స్పష్టంగా కనిపించకపోయినా, రక్తంలో తెల్లకణాలు అంత ఎక్కువగా లేకున్నా.. యాంటీబయాటిక్‌ మందులతో చికిత్స చేయొచ్చు. ఈ సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్‌ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఇలా 24-48 గంటల్లో అపెండిక్స్‌ వాపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు తిరిగి పరీక్షించి మందులతో చికిత్స చేయాలా? ఆపరేషన్‌ చేయాలా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకుండా నొప్పి పెరుగుతూ అపెండిక్స్‌ వాపు లక్షణాలు స్పష్టమవుతుంటే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.

* అపెండిక్స్‌ వాచినట్టు ఒకసారి గుర్తిస్తే ఆపరేషన్‌ చేసి తొలగించటం తప్ప మరో మార్గం లేదు! వాపును మందులతో తాత్కాలికంగా తగ్గించినా కొద్దిరోజుల తర్వాత అది తిరిగి వాచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీ చేయటం ఉత్తమం.

* అపెండిసైటస్‌ అని నిర్ధారణ అయ్యి, నొప్పి తీవ్రంగా ఉంటే.. సాధ్యమైనంత త్వరగా.. 24 గంటల్లోపే సర్జరీకి వెళ్లటం ఉత్తమం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సమయం వృథా చేసినకొద్దీ అది పగిలి.. అందులోని చీము, మలం పొట్ట అంతా అవ్వచ్చు. దీంతో ప్రాణానికీ ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకవేళ ఆపరేషన్‌ చేసి అదంతా శుభ్రంగా కడిగినా కూడా.. పేగులు అతుక్కుపోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అది స్పష్టంగా అపెండిసైటిస్‌ అని తేలితే ఆపరేషన్‌కు వెళ్లటం.. అనుమానంగా ఉంటే ఉండుకాన్ని కాపాడటానికి మందులతో ప్రయత్నించటం మంచిది.
నొప్పులన్నీ ఉండుకానివే కావు!
పొట్టలో కుడివైపు వచ్చే నొప్పులన్నీ ఉండుకం నొప్పులే కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరత్రా ఎన్నో సమస్యల్లో కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు.. నీళ్ల విరేచనాలు పట్టుకున్నప్పుడు.. మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు.. పొట్టలోని లింఫ్‌ గ్రంథులు వాచినప్పుడు.. ఆడపిల్లల్లో పొత్తికడుపు వాపు (పీఐడీ) సమస్యలో.. కాలేయంలో చీము వంటి సమస్యలు తలెత్తినప్పుడు.. చివరికి కుడివైపు వూపిరితిత్తి కింది భాగంలో న్యూమోనియా వచ్చినపుడు కూడా... నొప్పి ఇలాగే ఉండొచ్చు. అందుకే అది 'అపెండిసైటస్‌' నొప్పేనని నిర్ధారించే ముందు వైద్యులు ఒకటికి రెండుసార్లు తరచి చూస్తారు!
ఆపరేషన్‌ రెండు రకాలు
అపెండిక్స్‌ను తొలగించటానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొట్టమీద కోతపెట్టి చేసేది, రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటిద్వారా కెమేరా గొట్టంతో ఉండుకాన్ని తొలగించే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతి. రెండూ సమర్థమైనవే. కాకపోతే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చేస్తే త్వరగా కోలుకుంటారు. కండరాలను పెద్దగా కొయ్యాల్సిన పని ఉండదు కాబట్టి కండరాల నొప్పి అంతగా ఉండదు. త్వరగా లేచి తిరుగుతారు. పొట్ట మీద పెద్ద మచ్చలూ ఉండవు.
విశేషాల అవశేషం..!
* పట్టణాల్లో ఎక్కువ: ఉండుకం నొప్పి.. అదే అపెండిసైటిస్‌.. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ. పల్లెల్లో తక్కువ. దీనికి పట్టణ ఆహారంలో పీచు తక్కువ ఉండటం కూడా కారణం కావచ్చు. పీచు తక్కువగా తినేవారిలో మలబద్ధకం అధికం. మలం లోపల నిల్వ ఉన్నప్పుడు పేగుల్లో.. లోపల ఆహారద్రవాల కదలికలు తగ్గొచ్చు. ఫలితంగా ఉండుకంలోని జిగురు స్రావాలు బయటకు రాకుండా లోపలే ఉండిపోయి.. అవే ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు.

* యుక్తవయసు బెడద: అపెండిక్స్‌ వాపు ఏ వయసువారిలోనైనా రావొచ్చుగానీ.. కానీ 12-19 ఏళ్ల యుక్తవయస్కుల్లో అధికం! నాలుగేళ్ల లోపు పిల్లల్లో చాలా అరుదు. ఆరేళ్లలోపు వారిలో కొంత అరుదు. 6-12 ఏళ్ల వారిలో కొంచెంగా కనిపించొచ్చు.

* అమ్మాయిల్లో ఆపరేషన్‌: అపెండిక్స్‌ తొలగించే శస్త్రచికిత్స అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే 2.5 రెట్లు ఎక్కువ. ఎందుకంటే బాలికల్లో పునరుత్పత్తి అవయవాలు ఉండుకం దగ్గర్లోనే ఉంటాయి. ముఖ్యంగా ఫలోపియన్‌ ట్యూబు ఈ ఉండుకానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అపెండిసైటస్‌ వస్తే ఆ ఇన్‌ఫెక్షన్‌ వల్ల పొత్తికడుపులో వాపు పెరిగి.. ట్యూబులకు ఇన్ఫెక్షన్‌ వస్తే వాటిలో అవరోధాలు తయారై.. భవిష్యత్తులో సంతాన రాహిత్యం సంభవించవచ్చు. అందుకనే అమ్మాయిల్లో అపెండిసైటస్‌ అని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆపరేషన్‌ చేస్తుంటారు.

* వేసవి బెడద: పేగు సమస్యలైన నీళ్లవిరేచనాల వంటివన్నీ వేసవిలో ఎక్కువ. పేగుల్లో సమస్యల వల్ల ఈ అపెండిసైటస్‌ కూడా రావచ్చు.

* గండం తగ్గింది: 24 గంటల కడుపు నొప్పి... అపెండిసైటస్‌పై ప్రజల్లో చైతన్యం పెరగటం వల్ల ఇప్పుడు త్వరగా స్పందిస్తున్నారు. దీంతో అపెండైసిటిస్‌ మూలంగా మరణాల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఇప్పటికీ దీనిబారిన పడిన ప్రతి 200 మందిలో ఒకరికి ప్రాణ ప్రమాదం ఉంటోంది!
కాదు వ్యర్థం.. కాదు అవశేషం..!
ఒకప్పుడు ఉండుకం (అపెండిక్స్‌)ను.. పరిణామంలో మిగిలిపోయిన ఒక వ్యర్థ అవయవంగా, అవశేషంగా భావించేవారు. కానీ క్రమేపీ వైద్యపరంగా వైద్యపరిశోధనా రంగం అభివృద్ధి చెందిన కొద్దీ... ఈ ఉండుకం మరీ అంత వ్యర్థమైనదేం కాదన్న అవగాహన పెరుగుతోంది.

* పహారా సైన్యంలో భాగం: మన శరీరంలో వ్యాధికారకాలతో పోరాడే పెద్ద వ్యవస్థ ఉంది. దీన్నే మనం రోగనిరోధక వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక భాగాలు శరీరమంతా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి- గొంతులోని టాన్సిల్స్‌; పేగుల్లో.. మరీ ముఖ్యంగా పెద్ద-చిన్న పేగులు కలిసే చోట అధికంగా ఉండే పేయర్స్‌ ప్యాచెస్‌; పేగుల గోడల్లో ఉండే లింఫ్‌ గ్రంథులు; ఈ ఉండుకం! ఇవన్నీ కలిసి రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. అందుకే వీటన్నింటినీ కలిపి 'గట్‌ అసోసియేటెడ్‌ లింఫాటిక్‌ టిష్యూ' అంటారు. పేగుల్లో ఏవైనా రోగకారకాలు, వ్యాధికారకాలు చేరితే ఇవన్నీ కలిసి.. వాటిని సమర్థంగా ఎదుర్కొంటాయి. కాబట్టి ఉండుకానికి ఇప్పుడు మనం ఎటువంటి ప్రయోజనమూ లేదని భావించటానికి లేదు!

* ఆపదలో ఆసరా: ఒకప్పుడు ఏ ఆపరేషన్‌ కోసం పొట్ట తెరిచినా... ఈ ఉండుకాన్ని తొలగించటం పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే ఈ ధోరణిలోనూ మార్పు వస్తోంది. ఎందుకంటే పొట్టలో ఎక్కడైనా చిన్న నాళం, గొట్టం (కాండ్యూట్‌) అవసరమైతే దీన్ని వినియోగించటం విస్తృతంగా వాడకంలోకి వస్తోంది. ముఖ్యంగా కాలేయం నుంచి వచ్చే నాళాలు, మూత్రనాళాలు, ఫలోపియన్‌ ట్యూబుల వంటివి కొంతభాగం దెబ్బతిన్నప్పుడు ఆ దెబ్బతిన్న నాళం స్థానే ఉండుకాన్ని అమరుస్తున్నారు. అలాగే కొందరు పిల్లలకు మలమూత్రాలపై పట్టు ఉండదు. 'న్యూరోజెనిక్‌ బ్లాడర్‌, బవెల్‌' సమస్యల్లో వారికి ఈ ఉండుకాన్ని లోపల.. మూత్రాశయానికిగానీ, పెద్దపేగు మొదటిభాగానికి గానీ అతికించి.. రెండో కొనను బొడ్డు దగ్గర ఉంచుతారు. దీని ద్వారా మూత్ర విసర్జన చేయటానికి వీలు కలుగుతుంది. అలాగే పెద్ద పేగుల్లోపలికి నేరుగా ఎనిమా ఇవ్వటం ద్వారా ఒకేసారి మలవిసర్జన సాధ్యపడతాయి.

courtesy Eenadu : డా|| ఎ.నరేంద్రకుమార్‌, ప్రొఫెసర్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, నీలొఫర్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

Vitamins , విటమిన్లు




విటమిన్లు (Vitamins) సూక్ష్మమైన పోషక పదార్దములు .ఇవి శక్తినిచ్చే పదార్ధములు కావు . శరీరములొని వివిధ జీవక్రియలను పరోక్షముగా నియంత్రిస్తాయి . వీటి లోపము వలన అనేక వ్యాధులు కలుగుతాయి . ఎ,బి,సి,డి,ఇ,కె అనే ఆరు విటమిన్లు ఉన్నాయి. విటమిన్ల అధ్యయనం చేసే శాస్తాన్ని " విటమినాలజీ " అని అంటారు . జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ మొదటి సారిగా 1912లో ప్రతిపాదించాడు. ఇతనిని " విటమిన్ల పితామహుడు " అంటారు . తరువాత కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి 'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ ఎంజైము (Coenzymes) లుగా పనిచేస్తాయి.
  • మానవులలో ముఖ్యమైనవి 6 విటమిన్లు గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.

ఎ. కొవ్వులలో కరిగే విటమిన్లు:
1.విటమిన్A,
2.విటమిన్D,
3.విటమిన్E,
4.విటమిన్K
విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. ఇవి శోషరసం ద్వారా వివిధ భాగాలకు అందుతాయి.
బి. నీటిలో కరిగే విటమిన్లు:
1.విటమిన్ B-complex,విటమిన్ H(Biotin)
2.విటమిన్ C ,

విటమిన్లు నీటిలో కరిగేవి. ఇవి పేగులో నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి.



  • విటమిన్లు - చెడు ప్రభావము

మనిషి ఆరోగ్యముగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరమెంతోవుంది. విటమిన్ల లోపము వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్నిపూరించినట్లైతే ఆయా వ్యాధులు ఇట్టే మాయమవుతాయి. అయితే వచ్చిన చిక్కేమిటంటే విటమిన్ల లోపాలను పూరించే ఆదుర్దాలో విటమిన్లు పుష్కలముగా ఉండే తాజా పండ్లు,ఆకు కూరలకు బదులు ఏకంగా విటమిన్ గుళికలు మింగడము వల్ల ప్రయోజనానికి బదులు కీడే ఎక్కువ జరుగుతుందని ఐరోపా శాస్త్రజ్ఞులు అంటున్నారు. డెన్మార్క్ లోని కోపెన్ హెగాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన 'గోరన్ బెలకోవిచ్'నాయకత్వములో జరిగిన పరిశోధనలో ..విటమిన్ ఎ ,విటమిన్ ఇ ,బీటాకెరోటిన్లను గుళికల రూపంలో తీసుకుంటే ఏకంగా ప్రాణహాని సంభవిస్తుందని తేలింది. అయితే విటమిన్ సి ,సెలీనియం లను ఈవిధంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదన్నారు. గతంలో కొన్ని పరిశీలనలు విటమిన్ గుళికలలో వుండే యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపాయి. ప్రస్తుత పరిశోధనా ఫలితాలు అందుకు విరుద్ధముగా ఉన్నాయి. 180,938 మంది ప్రజలపై చేసిన పరిశోధనల వల్ల మొత్తము మీద 5 శాతము ప్రజలు విటమిన్ గుళికల వలన మరణిస్తారని తేలింది. వివిధ రకాల విటమిన్లు వేరు వేరుగా పరిశీలించినపుడు

* బీటా కెరోటిన్ వల్ల 7 శాతము,
* విటమిన్ A వల్ల 16 శాతము,
* విటమిన్ E వల్ల 4 శాతము మంది మరణించారు అని పరిశోధనల వల్ల తెలిసింది. సెలీనియం వల్ల 10శాతము మరణపు రేటు తగ్గిందని గమనించారు.



విటమిన్ ఎ : click here for more details in Telugu

కంటి చూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్ ఎ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా కంటిలో బిటాట్ స్పాట్ (తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చ) తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది.


  • లోపానికి గురైనప్పుడు అంధత్వం వస్తుంది. మనిషి ఆరోగ్యంగా పెరగడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందడానికి, నేత్రదృష్టి బాగా ఉండటానికి ......... విటమిన్‌ ఎ (A)అవసరం.


విటమిన్‌ డి (Vitamin D) : click for more details
  • విటమిన్ D3 చర్మానికి సూర్యరశ్మి (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.


బి విటమిన్‌ : B విటమిన్స్ జాబితా--22 రకాలు మిళితమై ఉన్నాయి. అందులో కొన్నే మానవులకు ఉపయోగపడతాయి.
  • * విటమిన్ B1 (thiamine),
  • * విటమిన్ B2 (రిబోఫ్లేవిన్-riboflavin),
  • * విటమిన్ B3 (నియాసిన్ లేదా niacinamide),
  • * విటమిన్ B4 (అడెనీన్-adenine),
  • * విటమిన్ B5 (పాంతోతేనిక్-pantothenic acid),
  • * విటమిన్ B6 (pyridoxine, pyridoxal, లేదా pyridoxamine, ),
  • * విటమిన్ B7 (biotin),
  • * విటమిన్ B8 "'(adenosine),
  • * విటమిన్ B9 (ఫోలిక్ ఆమ్లం-folic acid),
  • విటమిన్‌ భ10 (PABA)పారా అమినో బెంజోయిక్ యాసిడ్ ),
  • * విటమిన్ బి 12 (వివిధ cobalamins; విటమిన్ సప్లిమెంట్స్ లో సాధారణంగా cyanocobalamin),
*some rare B-vitamins
  • * విటమిన్ B11: ఫోలిక్ ఆమ్లం యొక్క ఒక రూపం ఇది pteryl-hepta-glutamic acid-కొంతమంది పెరుగుదల అంశం. తరువాత మానవులకు అవసరమైన ఐదు folates ఒకటి కనుగొన్నారు . విటమిన్ S లేదా కారకం (factor)ఎస్ అని కూడా పిలుస్తారు
  • * విటమిన్ B13: orotic యాసిడ్, ఒకప్పుడు విటమిన్‌ గా భావించేవారు .. ఇప్పుడు తెలిసినది ఒక విటమిన్ కాదు అని .
  • * విటమిన్ B14: ఎర్ల్ ఆర్ నోరిస్ ద్వారా కనుగొబడినది. పేరు cell proliferant, రక్తహీనత, ఎలుక పెరుగుదల అంశం, మరియు antitumor pterin ఫాస్ఫేట్. 0.33ppm వద్ద మానవ మూత్రాన్ని (తరువాత రక్తంలో) నుండి వేరుచేయబడినది కానీ మరింత సాక్ష్యం తో నిర్ధారించ బడ లేదు. తరువాత అతని ద్వారానే నిరాకరించబడింది . అతను కూడా ఈ xanthopterin లేదని పేర్కొన్నారు .
  • * విటమిన్ B15: pangamic యాసిడ్,
  • * విటమిన్ B16: dimethylglycine (DMG),
  • * విటమిన్ B17: nitrilosides, amygdalin లేదా Laetrile. ఈ పదార్థాలు విత్తనాలు, మొలకలు, బీన్స్, tubers, మరియు ధాన్యాలలో గుర్తించవచ్చు. పెద్ద పరిమాణంలో విష ము అని ప్రతిపాదకులు ఇది అంగీకరించారు .శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం ఆదరణపొందలేదు . క్యాన్సర్ చికిత్స మరియు నివారణ లో పనిచేయునని వాదించారు.
  • విటమిన్ B18:
  • విటమిన్ B19:
  • విటమిన్ B20: carnitine,
  • విటమిన్ B21:
  • విటమిన్ B22: తరచూ అలోవేరా నుండి వెలికితీయుదురు యొక్క ఒక మూలవస్తువుగా కాని పలు ఇతర ఆహారాలు లో పేర్కొన్నారు. అని ఒక మూలం ద్వారా పేర్కొన్నారు విటమిన్ B12b.

బి విటమిన్ ఉపయోగాలు :
పిండిపదార్థాల జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్‌గా విటమిన్‌ బి పని చేస్తుంది. ఆహా రంలో లోపిస్తే ఆకలి మందగిం చడం, చేతులు కాళ్లు మొద్దుబారడం, గుండెదడ,అలసట, నీరసం వంటి లక్షణాలు సంభవిస్తాయి.



విటమిన్‌ సి :(for more details in Telugu click here)
  • లోపిస్తే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. నోటిలో పుండ్లు పడటం, చిగుళ్లనుంచి రక్తం కారడం, దంతాలు కదలడం, చర్మం కింద ఉండే కేపిల్లరీస్‌ చిట్లి రక్తస్రావం కావడం జరుగుతాయి. గాయాలు త్వరగా మానడానికి విటమిన్‌ సిను ఇస్తారు.





  • విటమిన్లు Table :
    నీటిలో కరిగే విటమిన్లు
    విటమిన్
    రసాయనిక నామము
    లభించే పదార్ధాలు
    నూన్యత వలన కలిగే వ్యాధులు
    బి 1 ధయామిన్ గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు, నువ్వు గింజలు , పాలు, మాంసము, చేప, గుడ్లు, కాయ గూరలు. బెరి బెరి, ఆకలి మందగించటం
    బి 2 రైబోఫ్లేవిన్ పాలు, గుడ్లు, కాలేయము , మూత్రపిండము, ఆకు కూరలు నోటిపూత, నోటి మూలల్లో పగలటం
    బి 6 పైరిడాక్సిన్ పాలు, కాలేయము, మాంసము, గుడ్డులోని సొన, చేపలు, ధాన్యాలు, చిక్కుడు జాతి కాయలు, కాయకూరలు. రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో లోపాలు
    B9-ఫోలిక్ ఆమ్లము ఫోలిక్ ఆమ్లము కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకు కూరలు రక్తహీనత, అతిసారము, తెల్ల రక్త కణాలు నష్ట పోవటము
    బి 12 సయానో కో బాలమైన్ ఆహార పదార్ధాలలో లభించదు. పేగులోని బాక్టీరియములు దీన్ని సంశ్లేషణము చేసి శరీరానికి అందిస్తాయి హానికర రక్తహీనత
    సి ఆస్కార్బిక్ ఆమ్లము నిమ్మ జాతి ఫలాలు (సిట్రస్) , టమోటాలు , కాయకూరలు, బంగాళ దుంపలు, కాలిఫ్లవర్, కొన్ని పండ్ల జ్యూసులు, పచ్చిమిరపకాయలు. స్కర్వె
    B5--పాంటోథినక్ ఆమ్లము పాంటోథినక్ ఆమ్లము తాజాకాయకూరలు, కాలేయము, మూత్ర పిండము, ఈస్ట్, గుడ్డులోని సొన, మాంసము, చిలగడ దుంపలు, వేరుశనగ, తేనె కాళ్ళు మండటము
    బయోటిన్ vitamin B7 బయోటిన్ పప్పు దినుసులు, గింజలు, కాయకూరలు, కాలేయము, మూత్రపిండము కండరాల నొప్పులు, నాడీ మండలంలో తేడాలు, అలసట


    కొవ్వులో కరిగే విటమిన్లు

    విటమిన్
    రసాయనిక నామము
    లభించే పదార్ధాలు
    నూన్యత వలన కలిగే వ్యాధులు
    కెరోటిన్ కాలేయము, గుడ్లు, వెన్న, పాలు, చేప, మాంసము, కాడ్, షార్క్ చేపలనూనె, బచ్చలి, తోటకూరలు, క్యారెట్ , టమోటా, గుమ్మడి, బొప్పాయి, మామిడి రేచీకటి, జిరాఫ్ థాల్మియా, శుక్ల పటలము పగలటం, చర్మం మీద పొలుసులు
    డి కాల్సిఫెరాల్ కాలేయము, గుడ్డులోని సొన, వెన్న, కాడ్ చేప నూనె, షార్క్ చేప నూనె రికెట్స్ ఎముకలు పెళుసుగా అవుతాయి
    టోకోఫెరాల్ పాలు, కాయకూరలు, బాదంపప్పు , మొలకెత్తిన గింజలు , మాంసము, గుడ్డులోని సొన, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నూనె, పత్తి గింజల నూనె పురుషులలో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావము, ఎర్ర రక్త కణాల జీవిత కాలపరిమితి తగ్గటము
    కె యాంటిహేమరేజ్ ఆకు కూరలు , ఆవు పాలు రక్తము ఆలస్యంగా గడ్డ కడుతుంది
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కీళ్ళ నొప్పులు , Arithritis

మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi2cGk2BDJl9kffoor7u4Bfs2cDy1ytQSKy6fvM2nEbrhBk6zRCtWX7qLDbPlIf1PIoloRhw6aNnaN_ERyttDjkwzTvKR1AUxUnScI-66FzlCyOeLfLN_r0-F-W_gLQMhAvIHwClEGPpTSr/s1600/Arthritis+Day.jpg

****************************************
For more details
- >click here Arthritis
****************************************
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/