పిల్లలకు వాడుతున్న ప్లాస్టిక్ పాలసీసాలు ఎంత వరకూ సురక్షితం? దీనిపై అంతర్జాతీయంగా చాలా కాలంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే ఈ తరహా ప్లాస్టిక్ సీసాల తయారీలో 'బిస్ఫెనోల్ ఎ (బీపీఏ)' అనే రసాయనం వాడతారు. ఈ రసాయనం ప్రమాదకరమైనదని పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా దీని కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని తాజాగా జరిపిన విస్తృత అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్మోన్ల పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం చూపే రసాయనం ఇది. ఇది కేవలం ప్లాస్టిక్ సీసాల్లోనే కాదు, డ్రింకుల సీసాలు, ఆహారం పార్సిల్ చేసేందుకు వాడే ప్లాస్టిక్ వస్తువుల వంటివాటన్నింటిలోనూ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో నూటికి 90 మంది ఏదో రూపంలో ఈ రసాయనం ఉన్న వస్తువులను వాడుతూనే ఉన్నారు. మూత్రంలో ఈ రసాయనం అధికంగా గలవారికి గుండె జబ్బుల ముప్పు 33 శాతం ఎక్కువగా ఉంటోందని 'నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే' సమాచారం ఆధారంగా గుర్తించారు. గతంలో ఈ బీపీఏ రసాయనం మధుమేహం, లివర్ ఎంజైమ్‌ల వంటివాటి పైనా ప్రభావం చూపుతోందని భావించేవారు. అయితే తాజా అధ్యయనంలో వాటికి సంబంధించిన దుష్ప్రభావాలు కొంత తక్కువేగానీ గుండె జబ్బులు ముప్పును మాత్రం నిర్లక్ష్యం చేయటానికి లేదని తేలటం విశేషం.
బీపీఏ అనేది ఒంట్లో హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని 'ఎండోక్రైన్ డిజ్రప్టర్' అనీ అంటున్నారు. ఇది శరీరంలోని స్త్రీహార్మోన్ అయిన ఈస్ట్రోజెన్‌తో పాటు పురుష హార్మోన్లను కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ఈ రసాయనం సృష్టించే దుష్ప్రభావాలపై ప్రజల్లోనూ, ప్లాస్టిక్ వస్తువుల తయారీదారుల్లో కూడా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని... వీలైంత వరకూ ఆహార పదార్ధాల కోసం ఈ తరహా ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పేపర్లు వాడకపోవటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
source : Eenadu Sukhibhava
- =================================
Visit my website - >
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.