పాత కణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ ఎముకల్లోనూ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసుబారిపోయే ఆస్టియో పొరోసిస్ వ్యాధి మొదలవుతుంది. వీరిలో అతి చిన్న దె బ్బకు లేదా చిన్న బెణుకుకే ఎముకలు విరిగిపోవచ్చు లేదా ఎముకలు పగుళ్లు బారవచ్చు. అందుకే శరీర అస్థిత్వాన్ని నిలబెట్టే అస్థిపంజరాన్ని జీవితమంతా నిలబెట్టుకోవడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు అవసరమవుతాయి.
శరీరం నిలబడేదే ఎముకల మీద ఆ ఎముకలే బలహీనపడితే ఏమైపోవాలి ?
అదేదో అత్యంత సహజంగా తనకు తానే నిలబడిపోయే వ్యవస్థ అనుకుంటామే గానీ, అవసరమైన ఆహార, వ్యాయామాలు లేకపోతే ఎముకలన్నీ పెళుసుబారిపోతాయనే విషయం చాలా సార్లు మన దృష్టికి రాదు. ఎముకలు క్షీణించిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. వాటిలో వయసు పైబడిన కారణంగా ఎముకలు సన్నబడిపోవడం ఒక కారణం. ఇక స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయి (మెనోపాజ్) ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు లవణాల సాంద్రత తగ్గిపోవడం మరో కారణం.
నిజానికి ఆస్టియోపొరోసిస్ సమస్యలు చాలా ఎక్కువ మందిలోనే ఉన్నాయి. కానీ, వారిలో 50 శాతం మంది కూడా ఈ పరీక్షలకు వెళ్లడం లేదు. ఆస్టియో పొరోసిస్ వ్యాధి వృద్ధాప్యం కారణంగా వచ్చే సమస్య కాబట్టి దీన్ని నివారించడం పూర్తిగా అసాధ్యమన్న భావనే చాలా మందిలో ఉంది. అలాగే రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలే ఈ సమస్యకు గురవుతారన్న భావన కూడా బలంగానే ఉంది.
నిజానికి స్త్రీ పురుషులు ఇరువురూ దాదాపు అన్ని వయసుల్లోనూ ఈ సమస్యలకు గురవుతారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల మంది స్త్రీలు, రెండు కోట్ల మంది పురుషులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
ఎలా తెలుస్తుంది ?
ఆస్టియో పొరోసిన్ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఏమీ కనిపించవు. కానీ ఎముకలు లోలోపల క్షీణిస్తూనే ఉంటాయి. ఎప్పుడో సమస్య మరీ తీవ్రమై ఎముకలు విరిగిపోయినప్పుడు గానీ, ఆ విషయం స్పురణకు రాదు. ఇంటర్నేషనల్ ఆస్టియోపొరోసిన్ ఫౌండేషన్ (ఐఓఎఫ్) వారి అధ్యయనంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఇద్దరు స్త్రీలలోనూ ఒకరు ఈ వ్యాధితో ఉన్నారని తేలింది. .
ఎందుకిలా ?
శరీర శ్రమ లేకపోవడం, అతిగా మద్యపానం చేయడం, పొగతాగడం వంటివి ఆస్టియోపొరోసిస్ రావడానికి గల కారణాల్లో కొన్ని. ఇవే కాకుండా నూనె, మసాలాలు విరివిగా వాడే ఆహార పదార్థాలు, దీర్ఘకాలికంగా మందులు వాడటం, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల కారణంగా చాలా రోజులుగా స్టెరాయిడ్లు వాడుతూ ఉండడం, మూర్ఛరోగం మందులు కూడా ఇందుకు కారణమవుతాయి.
కొందరిలో మూత్రపిండాల వ్యా«ధులు కూడా ఈ సమస్యలను కలిగించవచ్చు. ఈ వ్యాధి పీడితుల ఎముకలు విరిగిపోవడానికి ఎంతో ఎత్తునుంచి పడిపోవలసిన అవసరం లేదు. మామూలుగా నడిచి వెళుతున్న సమయంలో కూడా విరిగిపోవ చ్చు.
క్యాల్షియం అవసరాలు
విదేశీయులతో పోలిస్తే ఆస్టియోపొరోసిస్ వ్యాధికి గురయ్యే వారిలో భారతీయులే ఎక్కువ. వీరికి క్యాల్షియం, డి- విటమిన్ చాలా తక్కువగా అందడమే కారణం. నిజానికి సగటున ప్రతి మనిషికీ రోజుకు 1200 నుంచి 1500 మి. గ్రాముల క్యాల్షియం అందవలసి ఉంటుంది.గుండె కండరాలు, నరాలు సరిగా పనిచేయడానికి కూడా క్యాల్షియం అవసరం.
వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఉండడానికి చక్కగా నడవడానికి కూడా క్యాల్షియం తప్పనిసరి. అందుకు పాలు లేదా పాల ఉత్పత్తులు రోజూ తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు, చేపలు, వేరుశనిగలు, రాగులు అలాగే లవణాలు ఇచ్చే ఇతర పదార్థాలు కూడా తరుచూ తీసుకోవాలి.
అవసరమైతే క్యాల్షియం మాత్రలు తీసుకోవాలి. క్యాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉండే పళ్లు కూరగాయలు కూడా బాగా తీసుకోవాలి.
విటమిన్-డి
ఎముకల నిర్మాణంలో క్యాల్షియం గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. కానీ, చాలా మంది డి-విటమిన్ విషయాన్ని మరిచిపోతారు. నిజానికి ఆస్టియోపొరోసిస్ సమస్యను నివారించడంలో డి-విటమిన్ ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. ఉదయం వేళ నీరెండ పడుతున్న సమయంలో రోజూ 90 నిమిషాల పాటు గడిపితే శరీరానికి అవసరమైన డి-విటమిన్ లభిస్తుంది.
ఆస్టియోపొరొసిస్ - మందులు
ఆస్టియోపొరొసిస్ నివారణలో మందులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి మూడు రకాలు. ఆస్టియోబ్లాస్టిక్ క్రియను పెంచే మందులు, ఆస్టియోక్లాస్టిక్ క్రియను తగ్గించే మందులు, మహిళల్లో వాడే ప్రత్యేక మందులు.
ప్రో ఆస్టియోబ్లాస్టిక్ మందులు : ఈ మందులు ఎముకల్లోని కొత్త కాల్షియాన్ని ఇతర మూలకాలను పెంచుతాయి.
కాల్షియం మూల మందులు : మార్కెట్‌లో రకరకాల రూపాలలో కాల్షియం లభ్యమవుతున్నది. కాల్షియం ఫాస్పేట్, కాల్షియం కార్బొనేట్, కాల్షియం సిట్రేట్, కాల్షియం సిట్రేట్ మాలేట్, కాల్షియం ఫ్రక్టోబొరేట్, కాల్షియం ఆస్పర్టేట్, అయానిక్ కాల్షియం, ట్రైబేసిక్ కాల్షియం, ఛీలేటెడ్ కాల్షియం వంటి అనేక రకాలు వివిధ లోహధాతువులతో (జింక్, మెగ్నీషియం, బోరాన్, మాలిబ్డినం, స్ట్రాన్షియం, ఫాస్సరస్) కలగలిసి విటమిన్-డి సహితంగా లభిస్తాయి. సాధారణంగా ఇవి సిరప్స్ రూపంలోనూ, టాబ్లెట్ రూపంలోను, సాఫ్ట్‌జెల్ క్యాప్సుల్స్ రూపంలోనూ లభిస్తాయి. వ్యాపార ప్రకటనలకు లోబడకుండా ప్రతీ వ్యక్తి కాల్షియం మందులు వాడడంలో ఈ జాగ్రత్తలు వహించాలి. అవి...
కాల్షియం, విటమిన్ డి3 కలిసి ఉన్నప్పుడు కనీస నిష్పత్తి 5:4 ఉండాలి. ఉదాహరణకు 500 మిల్లీగ్రాములు+విటమిన్-డి3 500 ఐయు కాల్షియం విటమిన్-డి4తో కలిసి ఉన్నప్పుడు విటమిన్-డి4 ఆల్ఫా కాల్సిడాల్ లేక కాల్సిట్రాల్ వంటి ఏ రూపంలో ఉన్నప్పటికీ కనీసం 0.25 మైక్రోగ్రాముల నుండి 1.0 మైక్రోగ్రాముల వరకు ఉండాలి. ఈ మోతాదులో విటమిన్-డి లేకుంటే కాల్షియం ఆ మందుల నుండి చాలా తక్కువ శాతం మాత్రమే ఎముక కణజాలం నుంచి గ్రహించగలుగుతుంది. ఎముకల బల సాంధ్రతలోని 'టి' స్కోరు -4 కన్నా తక్కువగా ఉన్న వ్యక్తుల్లో విటమిన్-డి4 కలిసిన కాల్షియం మాత్రమే దీర్ఘకాలం అంటే ఒకటి, రెండు ఏళ్లు కూడా వాడాలి. వీలైనంత వరకు కాల్షియం మాత్రలు రోజుకు కనీసం రెండు ఆహారానికి ముందుగానే తీసుకోవాలి.
విటమిన్ కె 2-7 : కొత్తగా లభ్యమవుతున్న ఈ మూలకం ఎముకల బలాన్ని పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
అనబాలిక్ స్టిరాయిడ్స్ : నాండ్రోలిన్ ప్రోపియోనేట్ అనే ఇంజక్షన్ 25 లేక 50 మిల్లీగ్రాములు వారానికి ఒకసారి, నాండ్రోలిన్ డెకోనేట్ అనే ఇంజక్షన్ 25 నుంచి 100 మిల్లీగ్రాముల వరకు నెలకోసారి వాడాలి. దీని వల్ల కాల్షియంతోపాటు ఎముకకు అవసరమైన ప్రోటీను పదార్థాలు బాగా పెరుగుతాయి.
ఆయుర్వేదిక్ మందులు : సల్లాకీ, వితానియా సోమ్నిఫెరా, అశ్వగంధ, వైట్ కొరియన్ జిన్సెంగ్, సెట్రం డయార్నం వంటి మందులు కూడా ఎముకల బలాన్ని పెంపొందిస్తాయి.
అతితీవ్ర ఆస్టియోపొరిసిస్‌ను ఆస్టియోమలేసియా అంటాం. ఈ వ్యాధికి విటమిన్-డి 3 - 50000 యూనిట్ల వరకు, విటమిన్-డి4- 50 మైక్రోగ్రాముల వరకు కూడా రోజువారీ క్రమంలో కాల్షియంతో పాటు వాడాలి.
ఆస్టియో క్లాస్టోసిస్ తగ్గించే మందులు : అధికంగా ఎముక నుండి కాల్షియం, విటమిన్-డి, ఇతర లోహ ధాతువులు బయల్పడకుండా ఆపడానికి, తద్వారా ఆస్టియోబ్లాస్టోసిస్ సక్రమంగా జరిగి ఎముకలు బలపడడానికి ఈ మందులు తోడ్పడతాయి. ఆస్టియోపొరొసిస్, ఆస్టియోమలేసియాలో రెండు రకాల మందులు కలిపి తప్పకుండా వాడాలి.
బిస్‌ఫాస్ఫోనేట్స్ మందులు ఐదు రకాలు
అలాండ్రోనేట్ : ఈ మాత్ర 70 మిల్లీగ్రాముల డోసులో వారానికి ఒక రోజు, ఒక మాత్ర ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున తీసుకోవాలి. తర్వాత అరగంట వరకు పడుకోకుండా, కూర్చొకుండా తిరుగుతూ ఉండాలి. దీనివల్ల మాత్ర పూర్తిగా జీర్ణప్రకియలో గ్రహింపబడి విధి నిర్వహిస్తుంది. ఈ విధంగా 12 నుండి 16 వారాలు వాడాలి.
ఎటిడ్రోనేట్ : ఈ మాత్రలు రోజుకు రెండు చొప్పున కనీసం 3 నుండి 6 నెలలు వాడాలి.
రైసిడ్రోనేట్ : ఈ మాత్ర 35 మిల్లీగ్రాముల డోసులో వారానికి ఒకసారి వాడాలి. అలాండ్రోనేట్‌లా కాక దీన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. దీని దుష్ఫ్రభావాలు కూడా తక్కువ
ఇబాండ్రోనేట్ : ఈ మాత్ర 35 మిల్లీగ్రాముల డోసులో నెలకోసారి చొప్పున ఆరు నెలల నుంచి 12 నెలల వరకు వాడొచ్చు. మాత్రల రూపంలో దొరికే ఈ విభాగం మందుల్లో ఇది అత్యంత ప్రతిభావంతమైంది.
జోలెడ్రోనిక్ ఆసిడ్ : అత్యంత కొత్తది ఈ ఔషధం. ఇంజక్షన్ రూపంలో లభిస్తుంది. దీన్ని 100 మిల్లీగ్రాములు, నార్మల్ సెలైన్‌లో కలిపి నిమిషానికి 30 చుక్కల చొప్పున ఐవి రూట్ ద్వారా ఇవ్వాలి. సాధారణ ఆస్టియోపొరొసిస్ కేసులలో ఏడాదికి ఒక డోసు చొప్పున ఇవ్వాలి.
పారాథైరాయిడ్ గ్రంథిలోపం వల్ల ఏర్పడే అధిక ఆస్టియోక్లాస్టోసిస్‌ను నిరోధించడానికి ఒక ప్రత్యేకమైన మందు లభిస్తుంది.
సాల్మన్ కాల్సిటోనిన్ : ఇది ఇంజక్షన్, నేసల్ స్ప్రేరూపంలో లభిస్తుంది. ఈ మందును టెస్ట్‌డోస్ నిర్వహించి మాత్రమే వాడాలి.
మెనోపాజల్-ఆస్టియోపొరొసిస్
మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోను తగ్గిపోతుందని తెలుసుకున్నాం. ఈస్ట్రోజెన్ పునరుద్ధరించడానికి కొన్ని ప్రత్యేక మందులు లభిస్తున్నాయి. వీటిన్ సెర్మ్ ఏజెంట్స్ (స్పెసిఫైడ్ ఈస్ట్రోజెన్ రిసెప్టార్ మాడిఫయింగ్ ఏజెంట్స్) అంటారు. ఇవి రెండు రకాలు.
రాలోక్సిఫేన్ : రోజుకు 60 మిల్లీగ్రాముల చొప్పున ఆరు నెలల నుండి 12 నెలల వరకు ఇతర మందులతో కలిపి వాడాలి.
టిబోలోన్ : ఈ మందును కూడా ఇది విధంగా వాడాలి. అదనంగా స్త్రీలలో అదే సమయంలో ఏర్పడే తలనొప్పి, మానసిక ఆందోళన శరీర అధిక ఉష్ణోగ్రతకు కూడా తగిన మందులు.
ఐసోఫ్లేవాస్ : ఐసోఫ్లేవనాయిడ్స్ అనే ఈ పదార్థాలు సోయ, ఇతర పదార్థాల నుండి లభిస్తాయి. ప్రత్యేక అమైనో ఆమ్లాలు కలిగి మహిళల్లో మెనోపాజ్ దశలో ఎముకలు, ఇతర కణజాలాన్ని కూడా వృద్ధి చేస్తుంది. పైన పేర్కొన్న ఇతర మందులతోపాటు రోజుకు 60 మిల్లీగ్రాముల చొప్పున దీర్ఘకాలం వాడాలి.
శస్త్ర చికిత్సలు
ఆస్టియోపొరొసిస్‌లో ప్రత్యేక శస్త్ర చికిత్సలుండవు. కానీ పారాథైరాయిడ్ గ్రంథి కణతుల ద్వారా ఏర్పడే అధిక ఆస్టియోక్లాస్టోసిస్ నిరోధించడానికి ఈ వినాళగ్రంథిని 90 శాతం వరకు తొలగిస్తారు. ఆస్టియోపొరొసిస్ ద్వారా ఏర్పడే ఫ్రాక్చర్స్‌గానీ, ఆస్టియో ఆర్థ్రయిటీస్‌గానీ అవసరమైన చోట శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు.
- డాక్టర్ జె. భాను కిరణ్-ఆర్థొపెడిక్ సర్జన్,-డాక్టర్ వెంకట రామప్ప హాస్పిటల్,సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ,బెంగళూరురోడ్డు, అనంతపురం.,
- =====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.