Wednesday, October 6, 2010

పిల్లలు నోట్లో వేలేసుకోవటం, Thumb Sucking habit in children



నోట్లో వేలేసుకొన్నట్టు--అమాయకంగా ఉండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పసిపాపలకు నోట్లో వేలేసుకోవటం అలవాటుగా ఉంటుంది. పపిపాపలు అమాయకంగా ఉండటం సహజం. అలా అమాయకంగా ఎవరైనా ఉన్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇది కొన్నిసార్లు వ్యంగ్య ధోరణిలో కూడా వినిపిస్తుంటుంది. 'నేనేమైనా నోట్లో వేలేసుకున్న వాడిలా కనిపిస్తున్నానా?' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంటుంది.

థంబ్ సకింగ్ అలవాటు పుట్టిన బిడ్డ రొమ్ము పాలు తాగేందుకు ఉపయోగపడే ఒక నాడీమండల రిప్లెక్ష్ . అనుకోకుండా ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది . బిడ్డ సుమారు 4 మాసాల వయసు లో ఇది ఉండకుండా పోతుంది . ఇది సహజమైనది .

పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే గానీ.. అదొక అలవాటుగా మారితేనే తంటా. ఇది చూడటానికి అసహ్యంగానే కాదు దవడలు, పళ్ల ఆకారం మారిపోవటానికీ దోహదం చేస్తుంది. ఈ అలవాటును మాన్పించటానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. వేలికి గుడ్డలు చుట్టటం, చేదుగా ఉండే పదార్థాలు రాయటం వంటివెన్నో చేస్తుంటారు. ఇలాంటి తల్లిదండ్రుల అవస్థలను తీర్చటానికే బ్రిటన్‌లో ఇటీవల మొట్టమొదటిసారిగా ఓ ప్రత్యేక ఆసుపత్రి వెలిసింది. ఇప్పటికే ఎంతోమంది పిల్లలను వేలు వేసుకునే అలవాటు నుంచి మాన్పించామనీ అక్కడి వైద్యులు చెబుతున్నారు.

పిల్లలు 3-6 ఏళ్ల వయసు వరకు నోట్లో వేలు వేసుకున్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. నిజానికి చాలామంది ఆ లోగానే దానిని మానేస్తుంటారు కూడా. కానీ కొందరు మాత్రం ఆ అలవాటును వదల్లేరు. ఇది దవడల పెరుగుదలను అడ్డుకుంటుంది. వంకర పళ్లకు దారి తీస్తుంది. చక్కగా రావాల్సిన ముందుపళ్లు ముందుకు వంగి ఎత్తుపళ్లగా తయారవుతాయంటున్నారు. పై దవడకి, పళ్లకి, పెదవికి ఒత్తిడి కలగటంతో పై పెదవి సమానంగా ఉండకుండా చిన్నదిగా తయారవుతుందని.. దాంతో ఎంతో అందమైన కళ్లు, ముక్కు ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది .

ఎన్నో ఏళ్లుగా వీటికి చికిత్స చేస్తున్న డా.నీల్‌ కౌనిహన్‌కు దీనికోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. వెంటనే దానిని కార్యరూపంలో పెట్టేశారు. ఇంతకీ ఈ అలవాటును మాన్పించటానికి కొత్త ఆసుపత్రిలో ఏం చేస్తారు? పిల్లల నోట్లో ప్రత్యేక పరికరాలను పెట్టి అసౌకర్య భావన కలిగించటమో.. లేదంటే సంప్రదాయ పద్ధతిలో బొటనవేలికి త్వరగా ఊడిరాని ప్లాస్టిక్‌ కవచాన్ని బిగించటమో చేస్తారు. ఇలాంటి విధానాలెన్నో అక్కడి వైద్యులు రూపొందిస్తున్నారు.

చికిత్సా విధానము :
పిల్లలకి బలవంతంగా ఈ అలవాటును మాన్పిస్తే మానసికంగా దెబ్బతింటారని కొంతమంది చెబుతుంటారుగానీ, అయితే అలాంటిదేమీ లేదని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.

నోట్లో వేలు వేసుకునే అలవాటు మానని పిల్లల్లో చదువుపట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుందనీ, వారికి వయసుతోపాటు మానసిక వికాసం తగ్గుతుంది . అందుకనే చిన్నారుల్ని ఈ అలవాటు నుంచి ఐదు సంవత్సరాల వయస్సులోపే మాన్పించాలని, లేకపోతే వారు ఎత్తుపళ్ల బారిన పడవచ్చు.

పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఆ చేతివేళ్లను చీకటంవల్ల మట్టిలోని క్రిములు కడుపులోకి పోవటం, దానివల్ల పొట్ట పురుగులు పట్టడం , వాంతులు , విరోచనాలు , కడుపునొప్పికి గురవటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకనే.. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే కనిపెట్టుకుని, ఒకవేళ ఈ అలవాటు ఉన్నట్లయితే మాన్పించే ప్రయత్నం చేయాలి.

ఈ క్రమంలో పిల్లలు నిద్రపోతున్న సమయంలో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి. కొద్దిగా వయస్సు వచ్చిన పిల్లలు ఆ అలవాటును మానకపోతే వేళ్లన్నింటికీ స్టిక్కింగ్ ప్లాస్టర్ అంటించి చూడాలి లేదా ఏదైనా చేదుపదార్థం రాయాలి.

ఇవన్నీ చేసినా పిల్లలు నోట్లో వేలేసుకోవటం మాననిపక్షంలో పళ్ల వైద్యుల వద్దకు తీసుకెళ్లినట్లయితే, వారు పిల్లల నోట్లో ముళ్లు ఉండే ప్లేటును అమర్చుతారు. అలవాటుగా పిల్లలు నోట్లో వేలు వేసుకున్నట్లయితే ఈ ప్లేటులోని ముళ్లు గుచ్చుకుని. వారు నోట్లో వేలు వేసుకునేందుకు సాహసించరు. అలా క్రమంగా పిల్లలు నోట్లో వేలు వేసుకోవటం మానివేస్తారు.

ఈ అలవాటు కేవలం పిల్లల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పెద్దల్లోనూ కనిపిస్తుంది. చిన్నతనంలో లేకపోయినా వారికి ఆ అలవాటు అబ్బటం విశేషం. మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌తో దీని నుంచి తప్పించుకోవచ్చు.

updates :
ఈనాడు సుఖీభవ -- 23112010
ఏడాదిలోపు పిల్లలు నోట్లో వేలేసుకోవటం సహజమే. ఆకలి అనిపించినప్పుడు, ఒంటరిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు, పాలు చీకాలనే కోరికను తీర్చుకోవటానికి.. ఇలా వివిధ సందర్భాల్లో పిల్లలు నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు. ఆకలి వేసినప్పుడు పిల్లలు ఒక వేలు మాత్రమే కాదు, చేయి అంతటినీ నోట్లో కుక్కుకుంటారు కూడా. సాధారణంగా తల్లిపాలు తాగే పిల్లల్లో కన్నా సీసా పాలు పట్టే చిన్నారుల్లో నోట్లో వేలు వేసుకునే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సీసాతో పాలు పట్టేటప్పుడు అవి త్వరగా అయిపోతాయి. దీంతో పాలు చీకాలనే కోరిక పూర్తిగా తీరకపోవటంతో నోట్లో వేలు వేసుకొని తృప్తి పడుతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు ఈ అలవాటును స్వతహాగానే మానేస్తుంటారు. ఆట వస్తువులు, ఇతర అంశాల మీదికి దృష్టి మళ్లుతున్న కొద్దీ నోట్లో వేలేసుకోవటాన్ని మరచిపోతుంటారు. కాబట్టి వయసుకు తగ్గట్టుగా పిల్లల మనసుకి నచ్చే ఆట వస్తువులను అందుబాటులో ఉంచుతూ, వేళకు ఆహారం తినిపిస్తే చాలావరకు ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగకుండా చూసుకోవచ్చు నిద్రపోతున్నప్పుడో, అలసిపోయినప్పుడో ఒకట్రెండు సార్లు నోట్లో వేలేసుకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.

సాధారణంగా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ 68 ఏళ్లు వచ్చేసరికి నోట్లో వేలు వేసుకోవటం మానేస్తారు. ఒకవేళ అప్పటికీ మానకపోతుంటే ఇందుకు తీవ్రమైన ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, మానసికంగా చిన్నబుచ్చుకోవటం వంటివి కారణాలు కావొచ్చు. ఇలాంటి సమయాల్లో పిల్లలు ఆ అలవాటు నుంచి బయటపడటానికి పెద్దవాళ్లు సహకరించాలి. బలవంతంగా, భయపెట్టి మాన్పించటం సరికాదు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నకొద్దీ పిల్లలు తమకుతాముగానే ఆత్మ నిగ్రహాన్ని నేర్చుకుంటారు. ఇతరులను చూసి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారు. కాబట్టి పిల్లలను కొట్టటం, తిట్టటం వంటివి చేయరాదు.

** పిల్లలు నోట్లో వేలు వేసుకుంటుంటే పెద్దవాళ్లు ముందుగా దానిని పట్టించుకోనట్టే వ్యవహరించాలి. తిట్టటం, కొట్టటం వల్ల ఈ అలవాటు మరింత ముదిరే ప్రమాదం ఉంది.
** పిల్లలను ఇతర వ్యాపకాల వైపు దృష్టి మళ్లించేలా చూడాలి.
** ఏదైనా మంచి అలవాటును నేర్చుకుంటే బహుమతి ఇవ్వటం ద్వారా పిల్లల్లో మార్పు తీసుకురావొచ్చు. నోట్లో వేలు వేసుకోని సందర్భాల్లో పిల్లలను మెచ్చుకోవటం, బహుమతి ఇవ్వటం వంటివి చేసి ఆ అలవాటు నుంచి బయటపడేలా ప్రోత్సహించాలి.
** పిల్లల్లో చాలా శక్తి ఉంటుంది. వారికి కాగితం, పెన్సిల్‌, బిల్డింగ్‌ బ్లాక్స్‌ వంటివి ఇస్తే వాటితో గడపటంలో మునిగిపోతారు.
** ఒకవేళ పిల్లలు నోట్లో వేలు వేసుకునే అలవాటు మానలేకపోతుంటే పిల్లల మానసిక వైద్యుడికి చూపించటమూ మంచిదే.

  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.