24 గంటలు అపెండిక్స్ గండం
24 గంటల నొప్పి... అదే అపెండిక్స్... ఏ క్షణాన... తిప్పలు తెచ్చిపెడుతుందోనని ప్రతి ఒక్కరికీ భయమే. 'అపెండిసైటిస్' మన మనసుల్లో అంతటి భయాన్ని సృష్టించింది.
నిజానికి అపెండిక్స్ నొప్పి అంత ఇబ్బందికరమైనదే. ఎందుకంటే దీన్ని అనుమానించటం తేలిక. కానీ కచ్చితంగా నిర్ధారించుకోవటం కష్టం. ఒకవేళ నిర్ధారించినా వెంటనే ఆపరేషన్ అవసరమా? కాదా? అన్నది తేల్చి చెప్పటం మరో ఇబ్బంది. అయితే ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ అపెండిక్స్ పై మన అవగాహన చాలా పెరిగింది.
ఉండుకం... అపెండిక్స్.. అన్నది పెద్దపేగులో మొట్టమొదటి భాగం! చిన్నపేగూ, పెద్దపేగూ కలిసే చోట.. మొదట్లో ఉంటుందిది. కావటానికి ఇది పెద్దపేగులో మొదటి భాగమైనా మానవుల్లో దీనికేమంత ప్రాధాన్యం లేకపోవటం వల్ల.. పరిణామక్రమంలోనే పెద్దపేగుకు అతుక్కుని ఉండిపోయే చిన్న తిత్తిలా తయారైంది. సాధారణంగా ఇది 8 సెం.మీ. పొడవుంటుంది. అరుదుగా 12 సెం.మీ. వరకూ ఉంటుంది. అందరికీ ఒకే కోణంలో ఉండాలనేం లేదు. సాధారణంగా లోపలికి ఏవైనా పదార్ధాలు వెళుతుంటేనే పేగుల సైజు పెరుగుతుంది. ఈ ఉండుకం పేగుల్లో భాగమే అయినా ఇదొక ప్రత్యేక కోణంలో వంగి ఉండటం, దీని ప్రవేశ మార్గం చాలా చిన్నగా ఉండటం వల్ల దీనిలోకి ఎలాంటి పదార్థాలూ వెళ్లవు. కాబట్టి ఇది సైజు పెరగకుండా అలా చిన్నగానే ఉండిపోతుంది. ఉండుకంలో జిగురు స్రావాలు (మ్యూకస్) ఉత్పత్తి అవుతుంటాయి. చిన్నగా ఉండే దీని ప్రవేశ మార్గంలో నుంచి ఆ స్రావాలు ఎప్పటికప్పుడు పెద్దపేగుల్లోకి వచ్చి చేరుతుంటాయిగానీ పెద్దపేగుల్లోని ద్రవాలు, మలం, స్రావాల వంటివి మాత్రం దీన్లోకి వెళ్లవు.
నొప్పికి మూలం.. రెండు రకాలు!
* అపెండిసైటిస్... ఈ ఉండుకం నొప్పి ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు.
1. అబ్‌స్ట్రక్టివ్: అంటే పేగుల్లోని మలంగానీ, నులిపురుగుల వంటివిగానీ ఈ ఉండుకం మార్గానికి అడ్డుపడొచ్చు. అప్పుడు ఉండుకంలో తయారయ్యే మ్యూకస్ స్రావాలు బయటకు రావటం కష్టమవుతుంది కాబట్టి లోపలే ఉబ్బి.. వాపునకు కారణమవుతుంది.
2. ఇన్‌ఫెక్టివ్: మనం తీసుకున్న ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా వంటివి పేగుల్లోకి చేరి.. అక్కడ్నుంచి ఉండుకంలోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌కు దారితియ్యచ్చు.
నొప్పి లక్షణాలు ముఖ్యం
అపెండిసైటిస్ సమస్య... ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం.. ఈ నాలుగూ ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ను నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
* నొప్పి: అపెండిసైటిస్ నొప్పి తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ముందు బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ వస్తుంది. క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటు అయిన కుడివైపు పొత్తికడుపు భాగానికి (రైట్ ఇలియాక్ ఫోజా) మళ్లుతుంది. అందుకే దీన్ని 'షిఫ్టింగ్ పెయిన్' అంటారు. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6-8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. దీన్ని అపెండిసైటిస్ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. ఈ నొప్పి ఇలా మారటానికి కారణం- పొట్టలో ప్రధాన నాడులన్నీ బొడ్డు దగ్గర కేంద్రీకృతమవుతాయి కాబట్టి.. కడుపులో ఎక్కడ సమస్య తలెత్తినా ముందు బొడ్డు దగ్గరే నొప్పి ఆరంభమవుతుంది. ఇక ఇన్ఫెక్షన్ ముదిరి, వాపు పెరిగిన కొద్దీ క్రమేపీ ఉండుకం ఉండే దగ్గరే నొప్పి ఎక్కువగా తెలుస్తుంటుంది.
* జ్వరం: నొప్పి ఆరంభమైన తర్వాత జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడూ 100.4 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. మధ్యమధ్యలో తగ్గటమన్నది ఉండదు.. జ్వరం ఎప్పుడూ ఒకేలాగ ఉంటుంది.
* వాంతులు: కొందరిలో ఒకట్రెండు వాంతులు అవుతాయి. కొందరిలో అవీ ఉండకపోవచ్చు కూడా. ఈ వాంతులు పేగుల్లో అవరోధాల మూలంగా వచ్చేవి కావు. నాడుల్లో స్పందనల మూలంగా వస్తాయి. అందుకే వీటిని 'రిఫ్లక్స్ వామిటింగ్స్' అంటారు.
* ఆకలి లేకపోవటం: అపెండిసైటిస్ అనేది పేగులకు సంబంధించిన సమస్య కాబట్టి ఆకలి తగ్గిపోయి ఆహారం సయించదు. - ఈ లక్షణాలు కనబడినప్పుడు అపెండిసైటస్ అని అనుమానించాలి.
వైద్యులేం చూస్తారు?
ఇవాళ ఎన్నో రకాల అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా అపెండిసైటిస్‌ను నిర్ధారించే విషయంలో వైద్యులు స్వయంగా చేసే పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వైద్యుల పరీక్షతో దీన్ని తేలికగానే గుర్తించగలుగుతారు. దాన్ని నిర్ధారించుకునేందుకుఆల్ట్రాసౌండ్ పరీక్ష, రక్తపరీక్షలు చేయిస్తారు. వీటితో కచ్చితంగా నిర్ధారించటం సాధ్యమవుతుంది.
నొప్పి కేంద్రం.. మెక్‌బర్నీస్ పాయింట్
కడుపు నొప్పి వచ్చినప్పుడు.. అది ఉండుకం వాచి.. అపెండిసైటిస్ కారణంగా వచ్చిన నొప్పేనా? అన్నది గుర్తించటానికి ఒక సూత్రం ఉంది. కుడివైపు కటి ఎముక (ఇలియాక్ స్పైన్) నుంచి బొడ్డు వరకూ ఒక గీతను ఊహించుకోండి. దీన్ని 'స్పైనో అంబ్లికల్ లైన్' అంటారు. ఈ గీతను మూడు భాగాలు చేసి బొడ్డు నుంచి రెండు భాగాలు దాటిన తర్వాత మూడో భాగం మొదట్లో పాయింట్ ముఖ్యమైంది. దీనికిందే ఉండుకం ఉంటుంది. అపెండిక్స్ వాపు వచ్చినపుడు ఈ పాయింట్ వద్ద వేలితో నొక్కితే రోగి నొప్పితో విలవిల్లాడిపోతారు. దీన్నే 'మెక్ బర్నీస్ పాయింట్' అంటారు. పొత్తికడుపు అంతా ఎక్కడ నొక్కినా పెద్దగా స్పందించరుగానీ.. ఈ 'పాయింట్' వద్దకు రాగానే చేత్తో కూడా తాకనివ్వరు. నొప్పి ఉండుకానికి సంబంధించినదేనని చెప్పేందుకు ఇది కీలకమైన సంకేతం.
* రెండోది పెరిటోనైటిస్: అపెండిక్స్ వాచిన తర్వాత క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఇన్‌ఫెక్షన్ కడుపులోని ఇతర పొరలకూ వ్యాపించి ఆ ప్రాంతంలో పెరిటోనైటిస్‌కు దారి తీస్తుంది. అప్పుడు పొత్తికడుపు కండరం నొక్కితే గట్టిగా తయారవుతుంది. దీన్ని 'మజిల్ గార్డింగ్' అంటారు.
మరికొన్ని సంకేతాలు..
* అపెండిక్స్ వాపు వచ్చినపుడు దగ్గితే ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎక్కడో కచ్చితంగా చూపించగలుగుతారు కూడా.
* ఎడమ కాలు కదపమంటే తేలికగా కదుపుతుంటారు. కానీ కుడికాలు కదపమంటే భయంభయంగా, నొప్పితో కదపలేకపోతుంటారు. ఎందుకంటే కుడికాలు కదిపినప్పుడు 'ఇలియోసోయాస్' అనే కండరం కదులుతుంది, ఇది లోపల ఉండుకాన్ని తాకుతుంది. దీంతో కుడికాలు కదుపుతుంటే లోపల నొప్పి తీవ్రమవుతుంది. అయితే.. బొద్దుగా ఉండే పిల్లల్లో ఆ ప్రాంతంలో నొక్కినా వారు వెంటనే స్పందించకపోవచ్చు. అందుకే వీరిలో అపెండిసైటస్ ముదిరిపోయి.. అది లోపల చీముతో పగిలిపోవటమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. అందువల్ల బొద్దు పిల్లల్లో అపెండిక్స్ ప్రాంతంలో నొప్పి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
తేల్చిచెప్పే ఆల్ట్రాసౌండ్
వైద్యులు స్వయంగా వివిధ రకాలుగా పరిశీలించిన తర్వాత అపెండిక్స్ వాపు అని బలంగా అనుమానిస్తే.. కచ్చితమైన నిర్ధారణ కోసం ఇతర పరీక్షలు చేయిస్తారు. వీటిల్లో ఆల్ట్రాసౌండ్ ముఖ్యమైంది.
* ఆల్ట్రాసౌండ్ పరీక్షలో అపెండిక్స్ వాపును కచ్చితంగా గుర్తించొచ్చు. నిజానికి వాపులాంటి సమస్యలేమీ లేకుండా అపెండిక్స్ ఆరోగ్యంగా ఉంటే ఆల్ట్రాసౌండ్ పరీక్షలో కనిపించటం కష్టం. అపెండిక్స్ వాచినపుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అపెండిక్స్ గోడ మందంగా కూడా మారినట్టు తెలుస్తుంది. దీని మందం 6 ఎం.ఎం. కన్నా ఎక్కువుంటే అపెండిక్స్ వాచిందని అనుమానం, 9 ఎం.ఎం. కన్నా ఎక్కువుంటే కచ్చితంగా వాపేనని నిర్ధారణ చేస్తారు. అపెండిక్స్ చుట్టూ చీము లేదా ద్రవం ఏవన్నా చేరి ఉన్నాయా అన్నదీ (పెరీ ఎపెండిక్యులర్ కలెక్షన్) తెలుస్తుంది. వీటితో చాలా వరకూ అపెండిసైటిస్ అని కచ్చితంగా తెలిసిపోతుంది.
సహాయపడే రక్తపరీక్షలు: అపెండిక్స్ వాచినపుడు రక్తంలో తెల్లకణాలు (డబ్ల్యూబీసీ) అధిక సంఖ్యలో ఉంటాయి. నొప్పితో పాటు క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 10 వేల కన్నా ఎక్కువ తెల్లకణాలుంటే అపెండిసైటస్ అని భావించొచ్చు. ఈ తెల్లకణాల్లోనూ న్యూట్రోఫిల్స్ సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువుంటాయి. ఇక సీ-రియాక్టివ్ ప్రోటీన్ 6 కన్నా ఎక్కువుంటే ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు అర్థం.
చికిత్స ఏమిటి?
వైద్యుల పరీక్ష, ఆల్ట్రాసౌండ్‌లలో అపెండిక్స్ వాచినట్టు స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్‌కు వెళ్లిపోవటం మంచిది. ఒకవేళ ఆల్ట్రాసౌండ్ ఫలితం స్పష్టంగా లేకపోతే.. రక్తపరీక్ష ఫలితాలను చూస్తారు. అప్పటికీ ఉండుకం నొప్పేనా? కాదా? అన్నది స్పష్టంగా తేలక అనుమానంగా ఉంటే బాధితులను ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రంగా లేకపోయినా, ఆల్ట్రాసౌండ్ పరీక్షలో స్పష్టంగా కనిపించకపోయినా, రక్తంలో తెల్లకణాలు అంత ఎక్కువగా లేకున్నా.. యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయొచ్చు. ఈ సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఇలా 24-48 గంటల్లో అపెండిక్స్ వాపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు తిరిగి పరీక్షించి మందులతో చికిత్స చేయాలా? ఆపరేషన్ చేయాలా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ తగ్గకుండా నొప్పి పెరుగుతూ అపెండిక్స్ వాపు లక్షణాలు స్పష్టమవుతుంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
* అపెండిక్స్ వాచినట్టు ఒకసారి గుర్తిస్తే ఆపరేషన్ చేసి తొలగించటం తప్ప మరో మార్గం లేదు! వాపును మందులతో తాత్కాలికంగా తగ్గించినా కొద్దిరోజుల తర్వాత అది తిరిగి వాచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీ చేయటం ఉత్తమం.
* అపెండిసైటస్ అని నిర్ధారణ అయ్యి, నొప్పి తీవ్రంగా ఉంటే.. సాధ్యమైనంత త్వరగా.. 24 గంటల్లోపే సర్జరీకి వెళ్లటం ఉత్తమం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సమయం వృథా చేసినకొద్దీ అది పగిలి.. అందులోని చీము, మలం పొట్ట అంతా అవ్వచ్చు. దీంతో ప్రాణానికీ ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకవేళ ఆపరేషన్ చేసి అదంతా శుభ్రంగా కడిగినా కూడా.. పేగులు అతుక్కుపోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అది స్పష్టంగా అపెండిసైటిస్ అని తేలితే ఆపరేషన్‌కు వెళ్లటం.. అనుమానంగా ఉంటే ఉండుకాన్ని కాపాడటానికి మందులతో ప్రయత్నించటం మంచిది.
నొప్పులన్నీ ఉండుకానివే కావు!
పొట్టలో కుడివైపు వచ్చే నొప్పులన్నీ ఉండుకం నొప్పులే కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరత్రా ఎన్నో సమస్యల్లో కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు.. నీళ్ల విరేచనాలు పట్టుకున్నప్పుడు.. మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. పొట్టలోని లింఫ్ గ్రంథులు వాచినప్పుడు.. ఆడపిల్లల్లో పొత్తికడుపు వాపు (పీఐడీ) సమస్యలో.. కాలేయంలో చీము వంటి సమస్యలు తలెత్తినప్పుడు.. చివరికి కుడివైపు వూపిరితిత్తి కింది భాగంలో న్యూమోనియా వచ్చినపుడు కూడా... నొప్పి ఇలాగే ఉండొచ్చు. అందుకే అది 'అపెండిసైటస్' నొప్పేనని నిర్ధారించే ముందు వైద్యులు ఒకటికి రెండుసార్లు తరచి చూస్తారు!
ఆపరేషన్ రెండు రకాలు
అపెండిక్స్‌ను తొలగించటానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొట్టమీద కోతపెట్టి చేసేది, రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటిద్వారా కెమేరా గొట్టంతో ఉండుకాన్ని తొలగించే ల్యాప్రోస్కోపిక్ పద్ధతి. రెండూ సమర్థమైనవే. కాకపోతే ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తే త్వరగా కోలుకుంటారు. కండరాలను పెద్దగా కొయ్యాల్సిన పని ఉండదు కాబట్టి కండరాల నొప్పి అంతగా ఉండదు. త్వరగా లేచి తిరుగుతారు. పొట్ట మీద పెద్ద మచ్చలూ ఉండవు.
విశేషాల అవశేషం..!
* పట్టణాల్లో ఎక్కువ: ఉండుకం నొప్పి.. అదే అపెండిసైటిస్.. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ. పల్లెల్లో తక్కువ. దీనికి పట్టణ ఆహారంలో పీచు తక్కువ ఉండటం కూడా కారణం కావచ్చు. పీచు తక్కువగా తినేవారిలో మలబద్ధకం అధికం. మలం లోపల నిల్వ ఉన్నప్పుడు పేగుల్లో.. లోపల ఆహారద్రవాల కదలికలు తగ్గొచ్చు. ఫలితంగా ఉండుకంలోని జిగురు స్రావాలు బయటకు రాకుండా లోపలే ఉండిపోయి.. అవే ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు.
* యుక్తవయసు బెడద: అపెండిక్స్ వాపు ఏ వయసువారిలోనైనా రావొచ్చుగానీ.. కానీ 12-19 ఏళ్ల యుక్తవయస్కుల్లో అధికం! నాలుగేళ్ల లోపు పిల్లల్లో చాలా అరుదు. ఆరేళ్లలోపు వారిలో కొంత అరుదు. 6-12 ఏళ్ల వారిలో కొంచెంగా కనిపించొచ్చు.
* అమ్మాయిల్లో ఆపరేషన్: అపెండిక్స్ తొలగించే శస్త్రచికిత్స అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే 2.5 రెట్లు ఎక్కువ. ఎందుకంటే బాలికల్లో పునరుత్పత్తి అవయవాలు ఉండుకం దగ్గర్లోనే ఉంటాయి. ముఖ్యంగా ఫలోపియన్ ట్యూబు ఈ ఉండుకానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అపెండిసైటస్ వస్తే ఆ ఇన్‌ఫెక్షన్ వల్ల పొత్తికడుపులో వాపు పెరిగి.. ట్యూబులకు ఇన్ఫెక్షన్ వస్తే వాటిలో అవరోధాలు తయారై.. భవిష్యత్తులో సంతాన రాహిత్యం సంభవించవచ్చు. అందుకనే అమ్మాయిల్లో అపెండిసైటస్ అని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆపరేషన్ చేస్తుంటారు.
* వేసవి బెడద: పేగు సమస్యలైన నీళ్లవిరేచనాల వంటివన్నీ వేసవిలో ఎక్కువ. పేగుల్లో సమస్యల వల్ల ఈ అపెండిసైటస్ కూడా రావచ్చు.
* గండం తగ్గింది: 24 గంటల కడుపు నొప్పి... అపెండిసైటస్‌పై ప్రజల్లో చైతన్యం పెరగటం వల్ల ఇప్పుడు త్వరగా స్పందిస్తున్నారు. దీంతో అపెండైసిటిస్ మూలంగా మరణాల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఇప్పటికీ దీనిబారిన పడిన ప్రతి 200 మందిలో ఒకరికి ప్రాణ ప్రమాదం ఉంటోంది!
కాదు వ్యర్థం.. కాదు అవశేషం..!
ఒకప్పుడు ఉండుకం (అపెండిక్స్)ను.. పరిణామంలో మిగిలిపోయిన ఒక వ్యర్థ అవయవంగా, అవశేషంగా భావించేవారు. కానీ క్రమేపీ వైద్యపరంగా వైద్యపరిశోధనా రంగం అభివృద్ధి చెందిన కొద్దీ... ఈ ఉండుకం మరీ అంత వ్యర్థమైనదేం కాదన్న అవగాహన పెరుగుతోంది.
* పహారా సైన్యంలో భాగం: మన శరీరంలో వ్యాధికారకాలతో పోరాడే పెద్ద వ్యవస్థ ఉంది. దీన్నే మనం రోగనిరోధక వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక భాగాలు శరీరమంతా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి- గొంతులోని టాన్సిల్స్; పేగుల్లో.. మరీ ముఖ్యంగా పెద్ద-చిన్న పేగులు కలిసే చోట అధికంగా ఉండే పేయర్స్ ప్యాచెస్; పేగుల గోడల్లో ఉండే లింఫ్ గ్రంథులు; ఈ ఉండుకం! ఇవన్నీ కలిసి రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. అందుకే వీటన్నింటినీ కలిపి 'గట్ అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ' అంటారు. పేగుల్లో ఏవైనా రోగకారకాలు, వ్యాధికారకాలు చేరితే ఇవన్నీ కలిసి.. వాటిని సమర్థంగా ఎదుర్కొంటాయి. కాబట్టి ఉండుకానికి ఇప్పుడు మనం ఎటువంటి ప్రయోజనమూ లేదని భావించటానికి లేదు!
* ఆపదలో ఆసరా: ఒకప్పుడు ఏ ఆపరేషన్ కోసం పొట్ట తెరిచినా... ఈ ఉండుకాన్ని తొలగించటం పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే ఈ ధోరణిలోనూ మార్పు వస్తోంది. ఎందుకంటే పొట్టలో ఎక్కడైనా చిన్న నాళం, గొట్టం (కాండ్యూట్) అవసరమైతే దీన్ని వినియోగించటం విస్తృతంగా వాడకంలోకి వస్తోంది. ముఖ్యంగా కాలేయం నుంచి వచ్చే నాళాలు, మూత్రనాళాలు, ఫలోపియన్ ట్యూబుల వంటివి కొంతభాగం దెబ్బతిన్నప్పుడు ఆ దెబ్బతిన్న నాళం స్థానే ఉండుకాన్ని అమరుస్తున్నారు. అలాగే కొందరు పిల్లలకు మలమూత్రాలపై పట్టు ఉండదు. 'న్యూరోజెనిక్ బ్లాడర్, బవెల్' సమస్యల్లో వారికి ఈ ఉండుకాన్ని లోపల.. మూత్రాశయానికిగానీ, పెద్దపేగు మొదటిభాగానికి గానీ అతికించి.. రెండో కొనను బొడ్డు దగ్గర ఉంచుతారు. దీని ద్వారా మూత్ర విసర్జన చేయటానికి వీలు కలుగుతుంది. అలాగే పెద్ద పేగుల్లోపలికి నేరుగా ఎనిమా ఇవ్వటం ద్వారా ఒకేసారి మలవిసర్జన సాధ్యపడతాయి.
courtesy Eenadu : డా|| ఎ.నరేంద్రకుమార్, ప్రొఫెసర్, పీడియాట్రిక్ సర్జరీ, నీలొఫర్ హాస్పిటల్, హైదరాబాద్
ధన్యవాదాలు చాలా వివరంగా అదీ తెలుగు లో రాసారు
ReplyDeletehai sir my name is k.venkatakrishnaiah degree final year i have a problem naku left hand side pain heavy ga vundi sir please took my problem i want talk to you please give me your mobile number my mobile no 7207401814
ReplyDelete