Sunday, October 3, 2010

సంగీతము -ఆరోగ్యము , Music Therapy and health
శరీరం నలతగా ఉంటే ఒక మాత్ర, మనసు కలత గా ఉంటే ఒక మాత్ర ఇదీ ఆధునికుల వరుస. చివరికి శరీరం ఒక మందుల బీరువా అవుతోంది. నిజానికి ఇవేవీ లేకుండానే శరీరాన్నీ, మనసునూ ఆరోగ్యంగా ఉంచే మార్గాలు కూడా ఉన్నాయి.

వాటిలో సంగీతం వినడం అత్యంత ప్రధానమైనది. సంగీతం ఆరోగ్యాన్నీ, గొప్ప జీవచైతన్యాన్నీ ప్రసాదిస్తుంది. అందుకే సమయం లేదంటూ దాటేయకుండా రోజూ కాసేపు సంగీతం వినడానికి వెచ్చించమంటున్నారు నిపుణులు.

జీవన ప్రవాహంలో ప్రతి హృదయం ఎంతో కొంత అలజడికి లోనవుతూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సమస్యల గురించి విశ్లేషణలకు దిగితే అన్నీ అయోమయపు సమాధానాలే వస్తాయి. అసలే అలజడి మనసు. ఆ స్థితిలో వచ్చే విశ్లేషణలు సాలోచనగా ఎలా ఉంటాయి? అందుకు మనసును ముందుగా అలజడి కి అతీతంగా ఒక భావాతీత స్థితికి చేర్చాలి. అప్పుడే మనసు కాస్త కుదుటపడుతుంది. కుదురైన ఆలోచనలు చేస్తుంది. మనసును ఆ భావాతీత స్థితికి చేర్చడానికి సంగీతాన్ని వినడానికి మించిన మార్గం లేదు.

ధ్యానం వల్ల కూడా ఈ స్థితి సాధ్యం కావచ్చు. కానీ, ధ్యానానికి కొంత సాధన కావాలి. అలాంటి సాధన కానీ, మరో ప్రయత్నం కానీ లేకుండానే మనసు ఉన్నఫళాన ధ్యాన స్థితికి చేరడం అన్నది సంగీతం వల్లే సాధ్యమవుతుంది. అది పాడటం కావచ్చు. వినడం కావచ్చు. పాడే వారూ, వినే వారూ ఏకకాలంలో ఒక ధ్యానస్థితికి చేరడం అన్నది సంగీతంతో సాధ్యమవుతుంది.

దైనందిన జీవితపు ఆందోళనల నుంచి ఒక అలౌకిక అనందంలోకి తీసుకు వెళ్లే గొప్ప ఔషధమే సంగీతంలోని విశిష్టత. తాము ఆ ధ్యాన స్థితికి ఎలా చేరుకుంటున్నామనే విషయం తెలియకుండానే ఆ స్థితి వచ్చేస్తుంది. దాంతో మనసును ఎప్పటినుంచో నులిమేస్తున్న ప్రతికూల భావాలన్నీ ఇగిరిపోతాయి.గుండె ను పిండేస్తున్న భావ కాలుష్యాలన్నీ పక్కకు జారిపోతాయి. అప్పుడు సహజంగానే ఒక నిశ్చలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత మన సులో ఒక రసాయన సమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా అప్పటి వరకూ లేని ఒక సౌమ్యత, సరళత వారి అంతరంగంలో చోటుచేసుకుంటాయి. భావ వ్యక్తీకరణలో మునుపటి పరుషత్వమంతా పోయి అన్ని దశల్లోనూ మృదువుగామాట్లాడటం మొదలవుతుంది.


ఇవన్నీ పరిశీలించే కొంత మంది సంగీత నిపుణులు మ్యూజిక్ థెరపీని రూపొందించారు. మెదడులోని రసాయనాలను సమతుల్యంగా ఉంచడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. రసాయన ప్రక్రియ సమతుల్యంగా మారే కొద్దీ ప్రతికూల భావాలు అతి వేగంగా తగ్గుముఖం పడతాయి. అప్పుడు సచేతనమైన మెదడు ప్రభావం శరీరంపై పడుతుంది. అది శారీరక ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది. నిజానికి శరీరానికీ మనసుకూ మధ్య పెద్ద అంతరం ఏమీ లేదు. అందుకే శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు మనసులో నైరాశ్యం, ఉదాసీనత, ఒక కల్లోలం చోటుచేసుకుంటాయి. కోపం వచ్చినప్పుడు గుండె వేగం పెరగడం, కళ్లు ఎర్రబారడం అందరికీ అనుభవమే. పరిశీలిస్తే ప్రతి శారీరక అవస్థ వెనుక ఒక మానసిక కారణం, ప్రతి మానసిక అవస్థ వెనుక ఒక శారీరక కారణం మనకు కనిపిస్తాయి. ఈ వాస్తవాలే మ్యూజిక్ థెరపీకి మూలస్థంభాలయ్యాయి. ఈ సూత్రీకరణ ఆధారంగానే భావోద్వేగాలకు సంబంధించిన సంగీతం, శారీరక రుగ్మతలను నయం చేసే దిశగా అడుగులు వేసింది.

మ్యూజిక్ థెరపీలో రాగానిదే ప్రథమ స్థానం. అయితే ఏ సాహిత్యమూ లేని వాధ్య సంగీతం మనసుకు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అంతే తప్ప మనసుకు ఏ దిశా నిర్దేశమూ చేయదు. పాటలో సాహిత్యం ఉంటుంది కాబట్టి అందులో సానుకూల భావాలు ఉంటే అవి ఆ భావాల ద్వారా, తాత్విక విశ్లేషణల ద్వారా మనసుకు ఒక మార్గం చూపిస్తుంది. అందుకే వాధ్య సంగీతం కన్నా పాటలనే శ్రోతలు ఎక్కువగా ఇష్టపడతారు.

వ్యక్తి మానసికంగా కుంగిపోయినప్పుడు అతడు తన సహజ చైతన్యాన్ని కోల్పోతాడు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరుచూ రోగగ్రస్తుడవుతూ ఉంటాడు. ఇక్కడ చేయవలసిందేమిటి? అత డు కోల్పోయిన చైతన్యాన్ని తిరిగి అందించడమే. సరిగ్గా ఆ బాధ్యతనే నిర్వహిస్తుంది మ్యూజిక్ థెరపీ. ఏకకాలంలో శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది.
అయితే నిరంతరం మనసును శాంతింప చేసే రాగాలకో పాటలకో పరిమితమైనా ప్రమాదమే. ఎప్పుడూ అలాంటి పాటలకే పరిమితమైతే క్రమంగా అతడు అచేతనంగా మారి, దేని మీదా ఆసక్తి లేకుండా పోయి, చివరికి ఒక జీవచ్ఛవంలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఉత్తేజాన్నీ, పౌరుషాన్నీ నింపే పాటలను కూడా వింటూ ఉండాలి.

ఉదయాన్నే సంగీతం వినడం గొప్ప థెరపీ. నిద్రలేవగానే సంగీతం వినడం వల్ల ఒక మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. అది రోజంతా కొనసాగుతుంది. దైనందిన జీవితంలో అనుక్షణం చైతన్య వంతంగా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది.
  • ============================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.