Tuesday, October 5, 2010

క్షయ వ్యాధి , T.B. disease




  • టి.బి. (క్షయ) అంటే ఏమిటి?
ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు .. 1.ఎముకలు, 2.కీళ్ళు, 3.లింపు గ్రంధులు, 4.మెదడు పొరలు, 5.మూత్ర పిండాలు, 6.గర్భ సంచి మొదలైనవి.

  • క్షయ అంటువ్యాధి. ఇది స్త్రీ, పురుషులకు ఏ వయసులోనైనా, ఎవరికైనా సోకవచ్చు. శరీరంలో ఏ భాగానికైనా రావొచ్చు. ఎక్కువగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీన్నే శ్వాసకోశ క్షయ అంటారు. జనాభాలో 100 మందిలో 40 మందికి పెద్ద వయసు వచ్చేసరికి క్షయ వ్యాధి సోకుతుంది. కానీ వీరిలోని రోగనిరోధక శక్తి వల్ల అది వ్యాధిగా మారదు. సెకనుకు ఒకరు క్షయ వ్యాధి బారినపడుతున్నారు. ప్రపంచ జనాభాలో మూడో వంతు మంది క్షయ బాధితులు. క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చీదినప్పుడు, మాట్లాడినప్పుడు, ఊసినప్పుడు క్షయ సూక్ష్మజీవులు ఇతరులకు గాలి ద్వారా సోకుతాయి. క్షయ వ్యాధి వచ్చిన వ్యక్తికి చికిత్స చేయకపోతే ఇతని ద్వారా సగటున ఏడాదిలో 10 నుంచి 15 మందికి క్షయ సోకుతుంది. కానీ క్షయ సూక్ష్మజీవి సోకిన వ్యక్తి అస్వస్థతకు గురవడం తప్పనిసరి కాదు. ఎందుకంటే ఈ వ్యక్తిలోని రోగనిరోధక శక్తి సూక్ష్మజీవిని చంపేస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనమైతే క్షయ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.
వ్యాధి లక్షణాలు :
  • 1. మూడు వారాలకి పైగా దగ్గు, కఫం
  • 2. సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం
  • 3. బరువు తగ్గుట, ఆకలి తగ్గుట
  • 4. దగ్గు కఫంతోపాటు రక్తంపడుతుంది

క్షయ- ఎయిడ్స్‌


  • మూడు వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి లేమి, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడడం - ఉంటే క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి. ఎయిడ్స్‌ వ్యాధి గల వారిలో క్షయ వ్యాధి ఎక్కువగా వస్తుంది. క్షయ వ్యాధికి 'డాట్స్‌' చికిత్స ఉంది. డాట్‌ ప్రొవైడర్‌ స్వయంగా మందులు మింగిస్తారు. క్షయ వ్యాధికి బిసిజి టీకా ఉంది. పిల్లలకు వీలున్నంత తొందరలో ఈ టీకా ఇప్పించాలి.

వ్యాపించే విధానం

  • 1. క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపించుతాయి
  • 2. క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకి పునాది వేస్తుంది.
నిరోధక చర్యలు :
  • 1. క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి.
  • 2. దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • 3. నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి.జి. టీకా ఇప్పించాలి.



నివారణ చర్యలు - లేబరిటరీ పరీక్షలు :

  • రక్త పరీక్షలు - Tc ,Dc , ESR , Hb% Blood sugar , HIV test , HBsAg test , etc .
  • నీరుడు పరీక్షలు - Alb , Sugar , Microscopic ,
  • ఛాతి ఎక్సురే ,
  • కెళ్ళ పరీక్ష ,
  • IgG /IgM Rapid test
  • ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌
Treatment:

  • వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫంప పరీక్ష జరిపి చికిత్స ప్రారంభించి మానకుండా పూర్తి కాలం వైద్యులు నిర్ణయించిన ప్రకారం మందులు వాడాలి.

శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

For more details in Telugu -> T.B in Telugu Wikipedia


  • క్షయ నిర్ధారణకు కొత్త పరీక్ష
క్షయవ్యాధిని వేగంగా, తేలికగా గుర్తించటానికి ఇప్పుడొక కొత్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ అనే ఇది మందులకు లొంగని క్షయ రకాన్ని కూడా పసిగడుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా క్షయను.. ముఖ్యంగా మందులకు లొంగని, హెచ్‌ఐవీ బాధితుల్లో వచ్చే రకాలను అరికట్టటంలో సఫలం కాలేకపోవటానికి నెమ్మదిగా, బండ పద్ధతుల్లో సాగుతున్న పరీక్షలూ దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం శిక్షణ పొందిన నిపుణులు సూక్ష్మదర్శిని ద్వారా చేసే ఈ పరీక్షలకు ఎంతో సమయం పడుతోంది. ఎప్పుడో 125 ఏళ్ల క్రితం కనుగొన్న పద్ధతుల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేవీ రాలేదు.

ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమయ్యే 10 ప్రధాన వ్యాధుల్లో క్షయ కూడా ఒకటి. ఇది సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, భారత్‌, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలకు ఎక్కువగా సోకుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లోనూ కనబడుతోంది. హెచ్‌ఐవీ బాధితుల్లో కూడా చాలామంది క్షయ బారినపడుతున్నారు. మందులకు లొంగని క్షయను గుర్తించటానికి నెలల సమయం పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. అందుకే దీనిని మరింత కచ్చితంగా, వేగంగా గుర్తించే కొత్త పరీక్షలు రావాల్సిన అవసరం ఉందని వైద్యులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. మందులకు లొంగని క్షయ ఉండే అవకాశం గల మొత్తం 1,730 మంది నుంచి కళ్లె నమూనాలు సేకరించి పాత, కొత్త పద్ధతుల్లో పరీక్షించారు. వీటిల్లో ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష 98 శాతం వరకు కచ్చితమైన ఫలితాన్ని అందించింది. క్షయ నివారణకు ఇచ్చే శక్తిమంతమైన మందు రిఫామైసిన్‌కు లొంగని జబ్బురకాన్ని కూడా ఇది గుర్తించింది. అదీ కేవలం 2 గంటల్లోనే. ఈ పరీక్ష త్వరగా పూర్తికావటమే కాకుండా ఎలాంటి మందులు వాడాలో అనేదానిపైనా ఒక అవగాహన కలిగిస్తుండటం విశేషం.

  • క్షయ పరీక్ష.. 100 నిమిషాల్లోనే updated 25/12/2010

క్షయ ఎంత సర్వసాధారణమైన వ్యాధో.. దాని నిర్ధారణ అంత కష్టమవుతుంది ఒక్కోసారి. వూపిరితిత్తుల్లో తలెత్తే క్షయను ఛాతీ ఎక్స్‌రే, కళ్లె పరీక్ష, మాంటో పరీక్ష వంటివాటితో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నా.. దాన్ని చాలాసార్లు కచ్చితంగా నిర్ధారించటం కష్టమవుతోంది. మరికొన్ని సందర్భాల్లో అనుమానంగా ఉన్న అవయవం నుంచి ముక్క తీసి కూడా పరీక్షించాల్సి వస్తుంటుందిగానీ... ఆ ఫలితం రావటానికి చాలా సమయం పడుతుంది. మొత్తానికి క్షయ నిర్ధారణ తరచుగా గందరగోళంగా తయారవుతోందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితమైన ఒక సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది.

వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా క్షయ వ్యాధి ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 94 లక్షల మంది దీని బారిన పడగా.. 17 లక్షల మంది మరణించటమే దీనికి నిదర్శనం. మొత్తం క్షయ కేసుల్లో మూడింట ఒకవంతు మనదేశంలోనే వెలుగు చూస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2009లో ప్రతి రెండు నిమిషాలకు ఒక కేసు నమోదు కావటం గమనార్హం. క్షయ ఒక్క భారత్‌లోనే ఏటా 5 లక్షల మందిని కబళిస్తోంది. వీరిలో 15-45 ఏళ్లలోపు వాళ్లే ఎక్కువగా ఉంటుండటంతో ఆర్థికంగా ఏడాదికి సుమారు రూ.13,500 కోట్ల నష్టమూ సంభవిస్తోంది.

క్షయ వ్యాధిని గుర్తించే పరీక్షలు మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటం, ఫలితం తేలటానికి చాలా సమయం పడుతుండటం వంటివి క్షయ విజృంభించటానికి దోహదం చేస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కేవలం 100 నిమిషాల్లోనే క్షయను గుర్తించే కొత్త పరీక్షకు ఆమోదం తెలిపింది. దీనిని ప్రయోగశాలల్లోనే కాకుండా బయట కూడా చేసే వీలుండటమూ విశేషం. ప్రస్తుతం చాలా వరకు వందేళ్ల క్రితం రూపొందించిన కళ్లె పరీక్షతోనే క్షయను గుర్తిస్తున్నారు. తాజా పరీక్షను డీఎన్‌ఏ పరిజ్ఞానం ఆధారంగా రూపొందించారు. ఎన్‌ఏఏటీ (న్యూక్లియక్‌ యాసిడ్‌ ఆంప్లికేషన్‌ టెస్ట్‌) అని పిలుచుకునే ఇది క్షయను తొలిదశలోనే కాదు.. మందులకు లొంగని మొండి క్షయను, హెచ్‌ఐవీతో కూడిన సంక్లిష్టమైన క్షయనూ కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ పరీక్షకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు లభించినందున ఇప్పుడు దీనిని వివిధ దేశాల్లో అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సంకల్పించింది. ఇది మందులకు లొంగని మొండి క్షయ, హెచ్‌ఐవీతో ముడిపడిన క్షయను గుర్తించటంలో మూడు రెట్లు మెరుగైన ఫలితాలు అందిస్తుందని భావిస్తున్నారు. దీనిని తయారుచేసిన కంపెనీ భారత్‌ వంటి బడుగు దేశాలకు ధరను 75 శాతం తగ్గించి ఇస్తుండటం వల్ల ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.

'క్షయ' భరితం!-భవిష్యత్‌ ప్రమాదకరమే-పిల్లల్లో పెరుగుతున్న తీవ్రత-నియంత్రణ అంతంత మాత్రమే---> -ఈనాడు - హైదరాబాద్‌ సౌజన్యము తో .
క్షయనివారణకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఉచితంగా ఖరీదైన మందులు ఇస్తున్నా, వ్యాధి నివారణ జరగకపోగా చిన్నారుల్లో క్షయ తీవ్రత ఆందోళనకరంగా మారుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అయిదేళ్లలోపు పిల్లల్లో ఏటా 12 వేలకు పైగా క్షయ కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, అయిదారు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వైద్య
ఆరోగ్యశాఖకు చెందిన అధికారులే అంగీకరిస్తున్నారు. మరో తీవ్రమైన విషయం.. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వూపిరితిత్తులతో పాటు ఇతర అవయవాల్లో క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. క్షయ వ్యాధి సోకినవారికి పూర్తిస్థాయిలో చికిత్స అందకపోవడం వల్ల, వారి ద్వారా ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. దీని తీవ్రతను గుర్తించి, వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌ భయానకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నయం కాకపోతే..: ఒక క్షయరోగికి వ్యాధి నయం కాకపోతే, అతని ద్వారా ఏడాదికి 10- 15 మందికి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు ఒకసారి దగ్గినపుడు దాదాపు 40 వేలదాకా వ్యాధికారక క్రిములు గాల్లో కలుస్తాయి. ఇవి మనం పీల్చేగాలి ద్వారా శరీరంలోకి చేరుతాయి. చివరికి రోగ నిరోధకశక్తి తగ్గినప్పుడు ''క్షయ''గా మారుతోంది. కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం... మన జనాభాలో 33.3%(మూడో వంతు) మంది శరీరాల్లో క్షయ వ్యాధికారక క్రిములు అంతర్గతంగా ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకర పరిణామం. దీన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 1993లోనే క్షయను ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించింది. అయితే.. వ్యాధి నియంత్రణ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్య వైఖరి ఫలితంగా మందులకు కూడా లొంగని రీతిలో క్షయ వ్యాధికారక బ్యాక్టీరియా శక్తిమంతంగా మారింది. గత ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6991 మందిని పరీక్షించగా... దాదాపు 1561 మందిలో మందులకు లొంగని క్షయ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పేద ప్రజానీకంలో క్షయవ్యాధి ఉన్నట్లు తెలిసినా, చాలామంది మందులు కూడా వాడడం లేదని వైద్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి 'ఈనాడు'తో చెప్పారు.

వ్యాధికారక బ్యాక్టీరియాలో మార్పులు: మన దేశ జనాభాలో క్షయకారక క్రిములు ఇప్పటికే చాలామంది శరీరాల్లో నిద్రాణ స్థితిలో ఉన్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గగానే వ్యాధిగా విజృంభించే అవకాశం ఉంది. క్షయ సోకినవారిలో దాదాపు 35 శాతం మంది వ్యాధి సంపూర్ణంగా నయమయ్యేంత వరకు మందులు వాడడం లేదు. దీనివల్ల వారిలో వ్యాధికారక బ్యాక్టీరియా మందులను కూడా తట్టుకునే స్థితికి చేరుకుంది. ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న వ్యక్తులు దగ్గినపుడు వ్యాధికారక క్రిములు గాల్లో కలిసి ఎక్కువ మందికి వ్యాప్తి చేయడానికి దోహదం చేస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా అందరి శరీరాల్లోకి చేరితే, వ్యాధిని నయం చేయడం ఎలా అన్నదే ఇప్పుడు వైద్యవర్గాలను ఆందోళనలో ముంచెత్తుతున్న అంశం. దీనికి మరింత శక్తిమంతమైన కొత్తరకం మందులు అవసరం. వాటిని కనుక్కోవాల్సి ఉంది. మరోవైపు.. శక్తిమంతమైన మందులు వాడితే, వాటిని తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. దీనివల్ల వివిధ రకాల కొత్త ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొత్త సవాలు: ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో క్షయ.. వైద్యరంగంలో ఒక సవాలుగా మారుతోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో శరీరంలోని వివిధ భాగాల్లో కణితుల రూపంలో, పేగుల్లో, మెదడు, ఎముకలకు సోకుతోంది. క్షయ రోగి ఉన్న కుటుంబంలో అయిదేళ్లలోపు పిల్లలుంటే, వారికి వ్యాధి సోకకుండా ముందస్తుగా మందులు ఇవ్వాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. మన దేశంలో కూడా ఈ తరహా విధానం అమలు చేయాలని అయిదేళ్ల కిందట నిర్ణయించినా, ఇప్పటి వరకు కార్యాచరణకు నోచుకోలేదు. బ్యాక్టీరియా మందులకు లొంగని రీతిలో మార్పులు చెందుతున్నతీరు, ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో క్షయ భారతంగా మారుతుంది.

క్షయ విశ్వరూపం
*మన దేశంలో ప్రతి రోజు 1000 మంది క్షయతో మృత్యువాత పడుతున్నారు.
*మన రాష్ట్రంలో ఏటా కొత్త కేసుల్లో 1.8% మందులకు లొంగని క్షయ కేసులు నమోదవుతున్నాయి.
*పాత కేసుల్లో 11.8% మందులకు లొంగని క్షయ కేసులు ఉన్నాయి.
*జైళ్లలోఉన్న రిమాండ్‌ ఖైదీల్లో క్షయవ్యాధి ఎక్కువగా ఉంది. సాధారణ ప్రజలతో పోలిస్తే 10- 20 రెట్లు ఎక్కువ కేసులు జైళ్లలో నమోదవుతున్నాయి.
*అనంతపురం, కర్నూలు, నెల్లూరు, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.
*క్షేత్రస్థాయిలో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు పెంచాలి. వ్యాధిగ్రస్తులకు మందులతో పాటు అవి వాడే విధంగా వారికి అవగాహన పెంపొందించాలి.


  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

15 comments:

  1. dear sir, Meeru Ichina Information Very useful. than q sir, Thulasiram, Tirupati

    ReplyDelete
  2. Sir, Many Many thanks for this useful information

    ReplyDelete
  3. చాలా బాగా తెలియజేశారు thanks for providing such informatin

    ReplyDelete
  4. thank u for providing valuable informationinformation

    ReplyDelete
  5. చాలా బాగా తెలియజేశారు thanks for providing such informatin

    ReplyDelete
  6. sir thnku sir miru ichina information very use ful sir
    inka padi mandiki cheppe avakasam icharu sir

    ReplyDelete
  7. thank you sir thank you .this very important massage. andariki theliyali

    ReplyDelete
  8. Thank u sir very usefull information thank u so much

    ReplyDelete
  9. Thank u sir very usefull information thank u so much

    ReplyDelete
  10. Thank you sir this is very useful information for TB patients and their families

    ReplyDelete
  11. Thank you sir this is very useful information for TB patients and their families

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.