Thursday, October 28, 2010

Self Medication , సొంత వైద్యముతిండి తింటారా? మాత్రలేసుకుంటారా?

ఆలస్యం అమృతం విషయం అంటారు. కానీ దాన్ని ‘అలక్ష్యం ఔషధం విషం’ అని మార్చుకోవచ్చు. వైద్యుల సిఫార్సుతో వాడితే అద్భుతంగా పనిచేసే దివ్యౌషధాలు సైతం... ఇష్టం వచ్చినట్టు వాడితే తీవ్ర పరిణామాలే కలిగిస్తాయ్.
అస్సలు వైద్యుల ప్రమేయం లేకుండానే తలనొప్పికి అనాల్జిన్, ఆస్పిరిన్, జ్వరానికి పారాసెట్‌మాల్... గుండె నొప్పి, క్యాన్సర్లకు ఆస్పిరిన్... ఇలా సొంత వైద్యంతో మందులు మితిమీరి వాడుతున్నారు. ఆధునిక మందులన్నీ రసాయనాలే. వైద్యుల సలహాలు లేకుండా ఇవి మింగితే విషంతో సమానం.
ప్రొద్దుట్నుంచి కడుపులో బాగా నొప్పిగా ఉంది. మంచి టాబ్లెట్ ఇవ్వండి. ‘గొంతు బాగా వాచింది. నీళ్ళు కూడా మింగుడు పడట్లేదు. రెండు ఎరిత్రో మైసిన్ టాబ్లెట్స్ ఇవ్వండి’ ఏ మందుల షాపులకెళ్లినా కనబడే దృశ్యాలివి. వినబడే మాటలివి.
ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో ఎవరికో మలేరియా వచ్చిందని తెలియగానే అందరికన్నా ముందుగా వాలిపోయి ముందుజాగ్రత్త అంటూ మందులు మింగేసే సొంత డాక్టరు బాబాయిలకు సంగం నుంచి సిలికాన్ దాకా కొదవలేదు.
చాలాసార్లు ఆ సలహాలు బాగానే పనిచేస్తాయి. కానీ ఒక్కోసారి విపరిణామాలకూ దారితీస్తాయి. ఎందుకంటే ఒకరికి సరిపోయిన డోసు మరొకరి శరీరతత్వానికి ఎక్కువ అవుతుంది. కొంతమంది కయితే అసలు పడదు.
అసలు సొంత వైద్యానికి అనేక కారణాలున్నాయి. ప్రజల అమాయకత్వం, అన్నీ తెలిసిన వారి నిర్లక్ష్యం, ఎంతో రోగమైన ఇట్టే తగ్గాలనే తత్వం, ప్రభుత్వ వైద్యసేవల్లో లోపం, చిన్నా చితకా అనారోగ్యానికి ప్రైవేట్ డాక్టర్స్ చేతిలో పోసే స్థోమత లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మందుల షాపులను ఆశ్రయించాల్సివస్తుంది. సొంత వైద్యాన్ని తీసుకోవాల్సి వస్తుంది.
అసలు ఆధునిక మందులన్నీ విషంతో సమానం. కావాలంటే చూడండి... ఏ మందు తీసుకున్నా అందులో అతి తక్కువ మోతాదులోనే అయినా రసాయనాలు ఉంటాయి. అలాంటి మందులను వైద్యులు సిఫారసుతో వాడినప్పుడే రోగుల విభిన్న శరీరతత్వాలను బట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చెప్పడం కష్టం. మరలాంటి వాటిని సొంతంగా వాడటం ఎంత ప్రమాదకరం. అలాగని చిన్నచిన్న తలనొప్పులకుకూడా వైద్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం లేదు. నిజానికి మామూలు తలనొప్పి, జ్వరం లాంటి తేలికపాటి అనారోగ్యాలు ఏ మందూ తీసుకోక పోయినా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఎంతటి రోగమైనా మంత్రించినట్టు మాయమవ్వాలన్న కోరికలతో మందులు వాడతారు.
చిన్నపాటి అనారోగ్యాలను ఒకటి, రెండు టాబ్లెట్లు వాడటం తప్పుకాదు. కానీ తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాల్సిందే. చిన్నపాటి అనారోగ్యాలకు అల్లోపతి వైద్యం కన్నా వంటింటి వైద్యమే మిన్న. ఉదాహరణకు చంటిపిల్లలకు కడుపునొప్పి వస్తే తమలపాకుకు ఆముదం రాసి దాన్ని వెచ్చబెట్టి పొట్టమీద పెట్టండి. పెద్దవాళ్లకు కడుపు నొప్పి వస్తే కాస్త వామూ, ఉప్పూ కలిపి నమిలి వేడినీళ్ళు తాగాలి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కి గోరు వెచ్చటి నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించడం, విరోచనాలు తగ్గడానికి పెరుగులో మెంతులు నానబెట్టి తినడం, అరుగుదలకు కరివేపాకు, పసుపు, ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి పరగడుపునే కుంకుడు గింజ పరిణామంలో తీసుకోవడం ఉత్తమం.
ఇలా ఎన్నో వున్నాయి. పైగా వీటివల్ల మన అనారోగ్యం తగ్గినా, తగ్గకపోయినా దుష్ప్రభావాలైతే ఉండవు. వాటికీ తగ్గకపోతే మాత్రం ఒకటి, రెండు మాత్రలు వేసుకోవచ్చు. అయినప్పటికీ ఉపశమనం లభించకపోతే మాత్ర తప్పనిసరిగా డాక్టరు దగ్గరకు వెళ్లాలి తప్ప తగ్గేదాకా చూద్దాం అనుకుంటూ అదే పనిగా సొంత వైద్యం తీసుకుంటూ, లేనిపోని మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు.
అలాగే ఆయుర్వేద మందులు వాడేవారు వైద్యులు అనుమతి లేకుండా అల్లోపతి మందులు అస్సలు వేసుకోకూడదు. వైద్యల్ని సంప్రదించకుండా గర్భిణీలు, చిన్నపిల్లలు, బాలింతలు, వృద్దులు స్వంత వైద్యం చేయనేకూడదు. అది ఎన్నో విపత్కర పరిణామాలకు దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

మాత్రలు మింగడంలో మెలకువలు

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తాజా పరిశోధనల రీత్యా వైదులు సెలివిస్తున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి చేసుకున్న అలవాట్లు రీత్యా కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు లేదా నీళ్లు వాడుతుంటారు.

అయితే వీటన్నటిల్లో నీళ్ళతో మాత్రం తీసుకోవడం క్షేమకరమని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్లు కాక ఇతర ద్రవపదార్దాలు వాడటం మాత్రలు చేసే ప్రక్రియకు భంగం కల్గిస్తాయని వీరు సృష్టం చేస్తున్నారు.

కాఫీ, టీలతో మాత్రల్ని తీసుకుంటే పలు సమస్యలను మనకు మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. ఎందుకంటే ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్‌ దెబ్బతీస్తుంది. పైగా సైడ్‌ ఎఫెక్టులు అధికం కావచ్చు. అంతే కాదు కెఫీన్‌ కడుపులో మంటను పెంచుతుంది. పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, లేదా కాయగూరల రసాలతో మాత్రలు తీసుకుంటే కొన్ని మందుల ప్రభావం తగ్గిపోతుంది.

ద్రాక్షరసం తీసుకుంటే అందులోని ఎంజైములు కొన్ని మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.గుండె జబ్బులకు ఉపయోగించే కొన్ని రకాల మందులు, యాంటీ ఫంగల్‌ మందులు పనిచేయక పోగా సైడ్‌ ఎఫెక్టులకు దారి తీయొచ్చు. పైకారణాల చేత మాత్రలు మింగటానికి అన్నిటి కంటే మంచి నీళ్ళే శ్రేష్టమైన మార్గం.

చాలామంది వైద్యుల సలహా లేకుండానే విటమిన్లు, ఇనుము, క్యాల్షియం వంటి మాత్రలను వేసుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. నిజానికి ఇలాంటి సూక్ష్మపోషకాలు ఆహారం ద్వారా లభిస్తేనే శరీరం బాగా గ్రహిస్తుంది. పోషకాహార లోపానికి మాత్రలు ప్రత్యామ్నాయం కావని గుర్తించటం ఎంతో అవసరం. కానీ కొందరికి మాత్రం తప్పకుండా మాత్రల రూపంలో పోషకాలను అందించాల్సిన అవసరం ఉంటుంది. వారికివి శక్తిని అందించి మేలు చేస్తాయి.

ఇలాంటివి ఉంటే..
* రోజురోజుకీ మీ బలం క్షీణిస్తోందా?
* మీకు పొగ, మద్యం అలవాట్లున్నాయా?
* సరిగా నిద్ర పట్టటం లేదా?
* తరచుగా తీపి పదార్థాలు తినాలనో.. రోజుకి మూడు కప్పుల కన్నా ఎక్కువ టీ, కాఫీ తాగాలని అనిపిస్తోందా?
* బరువు తగ్గేందుకు చాలాకాలంగా డైటింగ్‌ చేస్తున్నారా?

- వీటికి సమాధానాలు 'అవును' అయితే మీరు రోజూ తీసుకునే ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగా అందటం లేదనే అర్థం. అంటే వీరు జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.

సాధారణంగా మనకు రోజుకి సుమారు 80 మి.గ్రా. 'విటమిన్‌ సి' సరిపోతుంది. కానీ పొగ తాగే అలవాటున్నా.. తరచుగా ఒత్తిడికి గురవుతున్నా రోజుకి 1,000 మి.గ్రా. అదనంగా కావాలి. స్వీట్లు ఎక్కువగా తింటే అధికమొత్తంలో 'విటమిన్‌ బి' ఖర్చయిపోతుంది. ఇది అలసట, నిస్సత్తువకు దారితీస్తుంది. మామూలు జీవనశైలి గలవారికి రోజుకి 'విటమిన్‌ ఇ' 30 ఐయూ సరిపోతుంది. అదే ఒత్తిడితో కూడిన జీవనం గడిపేవారికి మాత్రం 400 ఐయూ కావాలి. తక్కువ కొవ్వుగల ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటున్నా శరీరంలో విటమిన్‌ ఇ నిల్వ తగ్గిపోతుంది.

ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవనశైలి పెరుగుతున్న నేపథ్యంలో.. పోషకాల అవసరమూ గణనీయంగా పెరుగుతోంది. అదనంగా పోషకాలు తీసుకోవాల్సిన అవసరమూ ఏర్పడుతోంది. కానీ వీటిని సహజమైన పద్ధతుల్లోనే భర్తీ చేసుకోవటానికి ప్రయత్నించాలి. విటమిన్లు, ఖనిజాల లోపం మరీ ఎక్కువైతేనే మాత్రల రూపంలో తీసుకోవాలి. వీటిల్లో పెద్ద మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అయితే వీటిని ఎవరెవరు, ఎప్పుడు తీసుకోవాలన్నది తెలుసుకోవటం అవసరం.

ప్రోటీన్ల బలం
మీరు శాకాహారం తీసుకుంటుంటే రోజుకి 20-30 గ్రా. మాంసకృత్తులు లభిస్తాయి. కానీ రోజుకి మహిళలకు 55 గ్రా., పురుషులకు 65 గ్రా. ప్రోటీన్లు అవసరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేస్తోంది. ఒకవేళ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మరిన్ని అంటే.. శరీర బరువులో ప్రతికిలోకి 1 గ్రా. అదనపు ప్రోటీన్లు అవసరం. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం, వెంట్రుకలు రాలిపోతుండటం, గోళ్లు పెళుసుబారటం, నిద్ర సరిగా పట్టకపోవటం, వ్యాయామం చేయాలంటే భారంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఇలాంటి సమయాల్లో ముందుగా ప్రోటీన్లు దండిగా ఉండే గుడ్లు, పనీర్‌, సోయాతో చేసిన పదార్థాలు తీసుకోవాలి. అప్పటికీ ఈ లక్షణాలు తగ్గకపోతేనే ప్రోటీన్లు అందించే మాత్రల వైపు దృష్టి సారించాలి.

విటమిన్‌ సి రక్షణ
పొగ తాగే అలవాటు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం, తరచుగా జలుబు చేస్తుండటం, తేలికగా చర్మం కమిలిపోవటం, పొడి చర్మం, కొలెస్ట్రాల్‌ మోతాదు ఎక్కువగా ఉండటం, మధుమేహం, గుండెజబ్బు.. ఇలాంటివి ఉన్నవారికి రోజుకి 500 మి.గ్రా. విటమిన్‌ సి కావాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలతో పాటు దీనిని అదనంగా తీసుకోవాలి.

విటమిన్‌ బి తోడు
స్వీట్లు ఎక్కువగా కూరగాయలు తక్కువగా తినటం, మరీ మెత్తగా ఉడికించిన కూరగాయలు, నిద్రమాత్రలు, ఆస్ప్రిన్‌, యాంటీ బయాటిక్స్‌, టీ, కాఫీలు, బిస్కట్లు, త్వరగా ఉడికే నూడిల్స్‌ వంటివి తీసుకోవటం వల్ల ఒంట్లో బి విటమిన్లు తగ్గిపోతాయి. విటమిన్‌ బి లోపం ఉన్నట్టు గుర్తిస్తే ముందు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీ, బిస్కట్లను తగ్గించాలి. అయినప్పటికీ అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించటం, ఆకలి తగ్గిపోవటం.. చర్మం, వెంట్రుకల నిగారింపు తగ్గటం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్‌ బి కాంప్లెక్స్‌ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.

క్యాల్షియం బాసట
ఎముకలు పెళుసుగా ఉన్నవారికి, బరువు పెరగాలని అనుకుంటున్నవారికి, 40 ఏళ్లు దాటిన మహిళలకు, అధిక రక్తపోటు గలవారికి, థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారికి అదనపు క్యాల్షియం అవసరమవుతుంది. ఇలాంటివారు పాలు, బాదంపప్పు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే రోజుకి 500 మి.గ్రా. క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చు. అయితే వీటిని పాలతో పాటు తీసుకోవాలి. ఎందుకంటే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించాలంటే కొంత కొవ్వు కూడా కావాలి మరి.

  • ===============================================
Visit my website -> dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.