Saturday, January 2, 2010

రొమ్ము క్యాన్సర్ , Breast Cancer


రొమ్ము క్యాన్సరు- స్తనంలోని కంతులు (గడ్డలు) ,రొమ్ము గడ్డలు .

రొమ్ము క్యాన్సరు స్త్రీలలో వచ్చే క్యాన్సరులలో అతి సాధారణమైనవి. క్యాన్సరు వల్ల స్త్రీలలో కలిగే మరణాలలో రెండవ స్థానంలో వున్నది. స్త్రీ జీవిత కాలంలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు 1 నుంచి 9 వరకు వుంటాయి.

లక్షణాలు

* రొమ్ములో గడ్డ
* చనుమొనల నుంచి ద్రవాలు స్రవించడం (కారణం)
* వెనుదిరిగిన చనుమొనలు (సాధారణంగా బయటకు వచ్చినట్టు వుండాలి.)
* ఎఱ్ఱగా, కందినట్టుగా వుండే చనుమొనలు
* రొమ్ములు పెద్దవిగా అయివుండడం.
* రొమ్ములు కుంచించుకు పోయినట్టు వుండడం.
* రొమ్ములు గట్టిపడడం
* ఎముకలలో నొప్పి
* నడుము నొప్పి

హానికలిగించే, (అపాయం కలిగించే) అంశాలుః-

* కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుండడం.
* స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే అపాయం పెరుగుతూ పోతుంది.
* ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చివున్న చరిత్ర
* ముందుగా రొమ్ములకు సంబంధించిన జబ్బులు వచ్చి ఉండడం, రొమ్ములలో అసాధారణ మార్పులు వచ్చి వుండడం.
* జన్యు పరమైన లోపాలు లేదా మార్పులు (అరుదైన మార్పులు)
* 50సం,, దాటిన తరువాత బహిష్టులు ఆగిపోవడం (కొద్దిగా ఆలస్యంగా)
* పిల్లలు కలుగక పోవడం
* మధుపానం, ఆహారంలో ఎక్కువ క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం, పీచు పదార్థాలు తక్కువగా వున్న ఆహారం తీసుకోవడం, ధూమపానం, అధిక బరువు, ముందుగా వున్న అండాశయ క్యాన్సరు, పెద్ద పేగుల క్యాన్సరు.

చికిత్స
రొమ్ము క్యాన్సరు యొక్క చికిత్స ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి వుంటుంది.

* చికిత్స తీసుకునే స్త్రీ బహిస్టులు ఎండిపోయే వయసుకు చేరుకొని వున్నదా,
* రొమ్ము క్యాన్సరు ఎంత మేరకు వ్యాపించి ఉన్నది,
* రొమ్ము క్యాన్సరు లోని కణాల నమూనా (రకం),

రొమ్ము క్యాన్సరు యొక్క వ్యాప్తి క్రింది విధంగా నిర్వచించబడుతాయి.

* రొమ్ములో ఏ స్థానంలో ఏర్పడి వున్నది,
* క్యాన్సరు ఏ వంతున శోష గ్రంధులలోకి వ్యాపించి ఉన్నది.
* రొమ్ము లోపలి లోతుగా వున్న కండరాలలోనికి క్యాన్సరు వ్యాపించడం,
* మెదడు మరియు ఎముకలు మొ,, ఇతర అవయవాలకు క్యాన్సరు వ్యాపించడం.
* రొమ్ము క్యాన్సరు కణాలలో కూడా రకాలు వుండవచ్చును.
* త్వరితగతిని విభజన చెందే కణాలు కొద్దిగా తక్కువ వేగంతో విభజన చెందే కణాలు దీనికి తోడు కణాలపై గ్రాహకాలు వుంటాయి. దీవి ఉనికి రొమ్ము క్యాన్సరు చికిత్సకు ప్రతిస్పందన అధికం చేస్తుంది.

పైన చెప్పిన అంశాల ఆధారంగా వైద్యులు క్రింద చూపిన నిర్ణయాలు తీసుకొనడం జరుగుతుంది.

రొమ్ములోని గడ్డను దాని చుట్టూ వున్న కణజాలాన్ని తీసివేయడం దీనితోపాటు వికిరణ చికిత్స ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు.

* పూర్తిగా రొమ్మును తొలిగించడటం
* రొమ్మును (రెండు) వీటితో పాటు శోషరస గ్రంథులను కూడా తొలగించడం.

నివారణోపాయాలు

* ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం
* సం.,నికి ఒకసారి వైద్యనిపుణులతో రొమ్ముల పరీక్ష
* పౌష్ఠికాహాకారాన్ని తీసుకోవడం
* రొమ్ములో గడ్డలు (చిన్నవికానీ, పెద్దవికానీ) వున్నట్టు ఎంత మాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* రొమ్ము క్యాన్సరు త్వరగా కనుక్కొని చికిత్స తీసుకుంటే నయం చేసుకొవచ్చు, ఆలస్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చును.

రొమ్ము క్యాన్సర్‌-- స్క్రీనింగ్‌ ఒకటే మార్గం (డా.పి.రఘురామ్‌):

రొమ్ము క్యాన్సర్‌.. ఆధునిక మహిళను భయపెడుతున్న పెద్ద సమస్య. మహిళలు నిరంతరం మనసులో ఈ భయంతో ఎందుకు సతమతమవుతుండాలి? క్యాన్సర్‌ ఉంటే దాన్ని ముందే గుర్తించాలి. లేదంటే క్యాన్సర్‌ లేదన్న భరోసా, నిశ్చింత అయినా ఉండాలి! ఈ రెండూ కూడా ఒక్క 'స్క్రీనింగ్‌'తోనే సాధ్యం!
ప్రతి మహిళా.. క్రమం తప్పకుండా ప్రతి ఏటా రొమ్ములకు స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవటం ద్వారా.. క్యాన్సర్‌ మరణాలను గణనీయంగా తగ్గించగలమని అధ్యయన పూర్వకంగా నిరూపించారు -ప్రొఫెసర్‌ లాస్లో తాబార్‌. స్వీడన్‌కు చెందిన ఈ రేడియాలజీ ప్రొఫెసర్‌ ఇటీవలే హైదరాబాద్‌లో 'ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వైద్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సీఈవో, బ్రెస్ట్‌ సర్జన్‌ డా. పి.రఘురామ్‌తో కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రతి మహిళా క్రమం తప్పకుండా రొమ్ముల స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరమేమిటో వివరించారు.

రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ప్రతి మహిళకూ అవసరమేనా? దానికి అంతటి ప్రాధాన్యం ఉందా?

రొమ్ము కాన్సర్‌ ఎందుకొస్తుందో ఇప్పటి వరకూ మనకు నిర్దిష్టంగా తెలియదు. మరో రకంగా చెప్పాలంటే దీనికి చాలాచాలా అంశాలు కారణమవుతున్నాయి. కాబట్టి ఏ మహిళ అయినా రొమ్ము క్యాన్సర్‌ను నివారించుకోవటం, అసలా సమస్య రాకుండా చూసుకోవటమన్నది కష్టం. కాబట్టి మన ముందున్న ఒకే ఒక మార్గం ఏమంటే- రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించి.. సాధ్యమైనంత తొలిదశలోనే దాన్ని పూర్తిగా నిర్మూలించటం! దీనికి అద్భుతంగా సహాయపడే విధానమే రొమ్ముల స్క్రీనింగ్‌ పరీక్షలు. క్రమం తప్పకుండా రొమ్ములను స్క్రీన్‌ చెయ్యటం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. 1. భరోసా: రొమ్ము క్యాన్సర్‌ అనేది ఒక పెద్ద అనుమానం, మానసికంగా వేధించే పెద్ద కలవరం. ఈ స్క్రీనింగ్‌ పరీక్ష చేసి.. క్యాన్సరేదీ లేదని నిర్ధారించుకుంటే ఆ అనుమానాలు, భయాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి స్క్రీనింగ్‌ వల్ల చక్కటి భరోసా లభిస్తుంది. నిశ్చింతగా ఉండొచ్చు. 2. సత్వర చికిత్స: ఒకవేళ ఈ పరీక్షల్లో క్యాన్సర్‌ ఆనవాళ్లున్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్స చెయ్యటం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. క్యాన్సర్‌ బయటకు వ్యాపించకుండా ఇంకా రొమ్ములో ఉన్నప్పుడే గుర్తించి వెంటనే చికిత్స చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. కాబట్టి క్యాన్సర్‌ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించేందుకు స్క్రీనింగ్‌ ఒక్కటే మార్గం!

స్క్రీనింగ్‌ ఎవరికి అవసరం? ఎంత తరచుగా చేయించుకోవాలి? ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలేమిటి?

దీనిపై విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. అన్నీ కూడా.. ఏడాదిన్నర నుంచి రెండేళ్లకు ఒకసారి (18-24 నెలలకు ఒకసారి) స్క్రీనింగ్‌ పరీక్ష చేస్తే రొమ్ము క్యాన్సర్‌ మరణాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నామని తేల్చాయి. 40-74 మధ్య వయసున్న స్త్రీలందరికీ ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు అవసరమని నిర్ధారించాయి. మళ్లీ దీనిలో కూడా వయసును బట్టి ప్రత్యేక సిఫార్సులున్నాయి. 40-54 ఏళ్ల మధ్యవయసు స్త్రీలు 18 నెలలు మించకుండా పరీక్ష చేయించుకోవాలి. అలాగే 55 ఏళ్ల పైబడిన స్త్రీలంతా 24 నెలలు దాటకుండా పరీక్ష చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేయించుకోవటం మరీ ఉత్తమం.

రొమ్ముల స్క్రీనింగ్‌ పరీక్షలో భాగంగా ఏమేం చేస్తారు?

స్క్రీనింగ్‌లో ప్రధానంగా వైద్యులు చేతితో నొక్కి పరీక్షించటం, రెండోది రొమ్ములకు ప్రత్యేక ఎక్స్‌రే 'మామోగ్రామ్‌' పరీక్ష చేస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కూడా చేస్తారు. క్యాన్సర్‌ ఆనవాళ్లు చాలావరకూ ఈ పరీక్షల్లోనే బయటపడతాయి. ఇక రొమ్ముక్యాన్సర్‌ రిస్కు, అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికైతే రొమ్ములకు ఎమ్మారై(MRI) పరీక్ష కూడా సిఫార్సు చేస్తారు.

పేద ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌ వంటి దేశాల్లో ఈ వయసు స్త్రీలంతా ప్రతి ఏటా ఈ పరీక్షలన్నీ చేయించుకోవటమంటే చాలా కష్టం. దీనికి మార్గం ఏమిటి?
రొమ్ము క్యాన్సర్‌ రిస్కు దృష్ట్యా- స్క్రీనింగ్‌ అన్నది కచ్చితంగా అవసరం. కాకపోతే దేశ కాలమాన పరిస్థితులను బట్టి అందుకు అనుసరించే విధానాలే మార్చుకోవాల్సి ఉంటుంది. ఏం చేసినా.. ఎలా చేసినా.. రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, తొలిదశలోనే గుర్తించటమన్నది అవసరం. మన దేశంలో రొమ్ము క్యాన్సర్‌ కేసులను సగటున గడ్డ సైజు 5 సెం.మీ. కన్నా పెద్దగా పెరిగిన తర్వాతే గుర్తిస్తున్నారు. గడ్డ 5 సెం.మీ. కంటే ఎక్కువ ఉందంటే దానర్థం అది మూడు, నాలుగు స్టేజీల్లోకి వెళ్లిపోయిందని! సుశిక్షితులైన నర్సులు, లేదా వైద్యసిబ్బంది క్రమం తప్పకుండా చేతితో నొక్కి చూసే పరీక్ష చేసినా కూడా వీటిని ఇంతకంటే ముందే, ఇంత సైజు వరకూ పెరగటానికి కొంత ముందే గుర్తించొచ్చు. తద్వారా రొమ్ము క్యాన్సర్‌ మరణాలనూ తగ్గించొచ్చు. ఇక 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒక్కసారి మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోగలిగితే చాలు.. క్యాన్సర్‌ గడ్డలు చేతికి తగలటానికంటే చాలా చాలా ముందే గుర్తించే వీలుంటుంది, అలా గుర్తిస్తే దాన్ని మనం పూర్తిగా నయం చేసే వీలూ ఉంటుంది. కాబట్టి అంతా స్క్రీనింగ్‌ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వటం అవసరం.

ఇంకో ముఖ్యమైన విషయమేమంటే రొమ్ము క్యాన్సర్‌ వస్తే చికిత్స చెయ్యటం తప్పించి.. అసలు అది రాకుండా ముందు నుంచే మనం చెయ్యగలిగిందేం లేదు. కాబట్టి దీని విషయంలో మన చేతుల్లో ఉన్నది రెండే రెండు పద్ధతులు. ఒకటి- ప్రతి మహిళా తన రొమ్ములపై తాను అవగాహన పెంచుకోవాలి. అవి నెల పొడవునా సాధారణంగా ఏ సమయంలో ఎలా అనిపిస్తాయో అవగాహన పెంచుకుని.. (దీన్నే 'బ్రెస్ట్‌ అవేర్‌నెస్‌' అంటారు) దాన్లో ఎటువంటి తేడాగా కనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. రెండోది- 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒకసారి మామోగ్రామ్‌ చేయించుకోవాలి. ఈ రెండింటితో రొమ్ముక్యాన్సర్‌ను చాలా త్వరగా గుర్తించే వీలుంటుంది. సత్వరం గుర్తించటం, సమర్థంగా చికిత్స చేయటం.. వీటితో మహిళ ఆయుర్దాయాన్ని కాపాడొచ్చు. ఆమె రొమ్ము క్యాన్సర్‌తో మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించొచ్చు. అలాగే భారతదేశంలో ప్రత్యేకంగా రొమ్ములకు సంబంధించిన సమస్యలకే చికిత్స అందించే బ్రెస్ట్‌ సెంటర్స్‌ మరిన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకుంటే.. ప్రత్యేక నైపుణ్యం గల స్పెషలిస్ట్‌లు సమస్యను మరింత ముందుగా గుర్తిస్తారు, సమర్థ వైద్యమూ అందించగలుగుతారు.

ఇప్పటి వరకూ ప్రతి మహిళా నెలలో కొన్నికొన్ని సమయాల్లో తన రొమ్ములను తాను స్వయంగా పరీక్షించుకోవాలని (సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌) సూచిస్తున్నారు. అది సరిపోదంటారా? స్క్రీనింగ్‌ పరీక్షలతో ఫలితం అంతకంటే మెరుగ్గా ఉంటుందా?
ప్రతి మహిళా స్వీయ పరీక్ష చేసుకోవటం అవసరం, అది ముఖ్యమైనదే.అయితే మన లక్ష్యం రొమ్ముల్లో గడ్డలు చేతికి తగిలేంత సైజుకు పెరిగినతర్వాత గుర్తించటం కాదు. దాన్ని అంతకంటే చాలా చాలా ముందే గుర్తించాలి! ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఎవరికి వారు చేసుకునే స్వీయ పరీక్ష సరిపోదు. అందుకని స్క్రీనింగ్‌ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెండోది- వారివారి రొమ్ముల సహజ స్వభావంలో ఏ కొంచెం తేడాగా అనిపించినా వైద్యులను సంప్రదించాలి.

నియంత్రించలేని కారకాలు :
  • లింగము : మగవారిలోకన్నా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది .
  • వయస్సు : వయస్సు అనేది మరొక అతిపెద్ద క్యాన్సర్ కారకము . . మీ వయస్సు ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటుంది . నిపుణుల అధ్యయనములో తేలినది ఏమంటే ... 30 నుండి 39 సంవత్సరాల వయస్సు గలస్త్రీలలో ప్రతి 233 మందిలో ఒకరికి , 60 సం. పైబడిన స్త్రీలలో ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోంది .
  • కుటుంబ నేపధ్యము : మీ దగ్గరి బంధువులకు (అమ్మ , సోదరి , కూతురు ) క్యాన్సర్ ఉన్నట్లైతే మీకు కూడా వచ్చే అవకాశము ఎక్కువ .
  • వ్యక్తిగత నేపధ్యము : మీకు ఇదివరకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లైతే అదే బ్రెస్ట్ లోకాని ప్రక్క బ్రెస్ట్ లోకాని మరల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • జాతి : నల్లజాతి స్త్రీలతో పోలిస్తే తెల్లజాతి స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే శాతము మరింత ఎక్కువ .
  • ఈస్ట్రోజన్‌ : ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థనాల్లోని కణాలను ఉత్తేజ పరుస్తుంది . దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజన్‌ హార్మొన్‌కు గురికావడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశము ఎక్కువ . అయితె ఈస్ట్రోజన్‌ నియంత్రించడం అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండదు . ఉదాహరణకు చిన్న వయసులోనే అంటే 12 సం. కన్న తక్కువ వయస్సులోనే నెలసరి ప్రారంభము కావడము . అదేవిధంగా 55 సం .ల తరువాత బహిస్టలు పోవడము . (మెనోపాజ్ ) అంటే దీర్ఘకాలము పాటు నెలసరి కొనసాగితే క్యాన్సర్ వచ్చే అవకాశము కూడా అంత ఎక్కువ. ఆవిధంగానే బయటి వాతావరణము నుండి శరీరములోకి ప్రవేశించే ఈస్ట్రోజన్‌ ఉదా: మాంసాహారము లో ఉండే హార్మోనులు , ఇతర ఆహారములలో ఉండే పురుగు మందులల అవశేషాలు మన శరీరములో ఈస్ట్రోజన్‌ ను పోలిన అవశేషాలను విడుదలచేస్తాయి .
  • గర్భము మరియు స్థనపానము : గర్భము మరియు స్థనపానము అనృవి నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. 30 సం.లు పైబడే వరకు గర్భము ధరించని స్త్రీలకు లేదా అసలు గర్భము ధరించని స్త్రీలకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశము ఎక్కువ . దీర్ఘకాలముపాటు అంటే 1.5 లేదా 2 సం.లు వరకు స్థన్యము ఇచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశము తక్కువ . అయితే అంత సుదీర్ఘ కాలము పాలు ఇచ్చే తల్లులు కనబడడం లేదు . మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ--- మంచి ఆహారముపు అలవాట్లు , వ్యాయామము -- మనచేతిలొ లేని అనేక కారణాల వలన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూఉంటుంది . ఇది వచ్చినపుడు ... అదేదో మనము చేసిన తప్పిదము వలన వచ్చినట్లుగా కృంగిపోకూడదు.

  • రొమ్ము కాన్సెర్ మామోగ్రఫీ
రొమ్ముక్యాన్సర్‌ ఉండొచ్చనే భయం ఓ వైపు వేధిస్తోన్నా.. వైద్యుల్ని సంప్రదించడానికి సంకోచం. అంతకన్నా ముందు.. పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలామందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ముక్యాన్సర్‌ ఉన్నా లేకపోయినా.. ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్‌ విధానం ఉంది.

మూడు రకాల్లో అందుబాటులో ఉండే ఈ విధానం వల్ల ఎలా మేలు జరుగుతుందో చూద్దాం.
  • స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌:
ఒక మహిళ గాని, వైద్యులు గాని... క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ పరీక్షను సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే.. సమస్య ఉన్నా లేకపోయినా కూడా.. నలభైఏళ్లు దాటినప్పటి నుంచీ ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకుంటే.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్స సాధ్యమవుతుంది. ఆ తరవాత త్వరగా కోలుకోగలుగుతారు కూడా.

  • సర్వైలన్స్‌ మామోగ్రామ్‌:
క్యాన్సర్‌ వచ్చి.. చికిత్స తీసుకుని రొమ్మును తొలగించని వారు ఏడాదికోసారి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష. దానివల్ల ఆ రొమ్ములోనే కాదు.. రెండోదానికీ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తొలిదశలోనే అంచనా వేయవచ్చు.

  • డయాగ్నొస్టిక్‌ మామోగ్రామ్‌:
రొమ్ములో కణితి లేదా కొత్తగా చోటు చేసుకున్న మార్పును గుర్తించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్థారించేందుకు తోడ్పడుతుందీ పరీక్ష. వైద్యులు స్వయంగా పరీక్ష చేయడం.. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ నిర్వహించడం (ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష) ఇందులో భాగం.

  • డిజిటల్‌ మామోగ్రామ్‌:
ఏ వయసువారిలోనైనా తొలిదశలోనే క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. సాధారణ మామోగ్రామ్‌తో పోలిస్తే.. ఇది అత్యాధునికమైన విధానం. ఇక, మన దేశంలో యువతుల్లోనూ క్యాన్సర్‌ ప్రమాదం కనిపిస్తోంది. అయితే యువతుల్లో రొమ్ము కణజాలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రారంభ దశలో ఆ లక్షణాలను త్వరగా గుర్తించలేం. అలాంటప్పుడు ఈ మామోగ్రఫీ చేయడం సరైన ప్రత్యామ్నాయం. దీనివల్ల పరీక్ష సమయంలో నొప్పితో పాటు రేడియేషన్‌ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ పరీక్షలో భాగంగా తీసిన చిత్రాలను రెండో అభిప్రాయం కోసం ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు. అయితే ఈ విధానం మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఖరీదూ కొద్దిగా ఎక్కువే.

  • రొమ్ముక్యాన్సర్‌ వచ్చిన వారిలో సందేహాలు-చికిత్సా విధానాలపై అవగాహన,

చికిత్సా విధానాలపై అవగాహన లేక ఈ పరిస్థి కానీ చికిత్స ప్రారంభించే ముందే రోగితో వైద్యులు రెండు అంశాలు చర్చిస్తారు.

* .క్యాన్సర్‌ వచ్చిన భాగంతో పాటు.. బాహుమూలాల్లో ఉన్న లింఫ్‌ గ్రంథులకూ ఆ కణాలు వ్యాపిస్తే, వాటినీ తొలగించడం.

* రక్త ప్రసరణ ద్వారా రొమ్ము నుంచి క్యాన్సర్‌ కణాలు ఇతర శరీర భాగాలకు చేరిన వాటిని నశింపచేయడం.. వాటికి పరిష్కారంగా శస్త్రచికిత్స, కీమో, రేడియో, హార్మోన్‌ లాంటి థెరపీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందరికీ కీమో, రేడియో, హార్మోన్‌ థెరపీలు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు.

శస్త్ర చికిత్స లక్ష్యం ఏమిటి?

* రొమ్ముక్యాన్సర్‌ నిర్థారణ అయిన చాలామంది మహిళలకు చేసే మొట్టమొదటి చికిత్స ఇది. అయితే కొందరిలో క్యాన్సర్‌ కణితి పరిమాణంలో పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని తగ్గించేందుకు శస్త్రచికిత్స కన్నా ముందు కీమో లేదా హార్మోన్‌ థెరపీ లాంటివి సిఫారసు చేయవచ్చు. శస్త్రచికిత్సకు ముందు కూడా రెండు అంశాలపై దృష్టి సారిస్తారు వైద్యులు. క్యాన్సర్‌ వచ్చిన రొమ్ముకు శస్త్రచికిత్స చేయడం అలాగే బాహుమూలల్లో ఉన్న లింఫ్‌ గ్రంథుల్ని తొలగించడం.

* ఒకవేళ క్యాన్సర్‌ కణితి నాలుగు సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే రొమ్మును పూర్తిగా తీసేయకుండా కోత పెట్టి కణితి ఏర్పడిన భాగంతోపాటు చుట్టూ ఉన్న కణజాలాన్ని కొంతవరకు తీసేస్తారు. అయితే ఆ తరవాత కొన్నిరోజులు రేడియోథెరపీ చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. దానివల్ల రొమ్ములో ఇంకెక్కడైనా చేరిన క్యాన్సర్‌ కణాలు పూర్తిగా నశిస్తాయి.

మాస్టెక్టమీ: క్యాన్సర్‌ కణితి నాలుగు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా, లేదా చనుమొన దగ్గర ఉన్నప్పుడు, రొమ్మును ఉంచలేని పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని పూర్తిగా తొలగిస్తారు. అయితే రొమ్మును తీసేసినప్పుడు చాలామంది మానసికంగా కుంగిపోతారు. అలాంటివారికి ఇప్పుడు మళ్లీ దాన్ని అమర్చుకునే అవకాశం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని శస్త్రచికిత్స చేసినప్పుడే కాకుండా ఆ తరవాత కూడా అమర్చుకునే అవకాశం ఉంటుంది.

గ్రంథులకు చికిత్స..--రొమ్ముక్యాన్సర్‌ వచ్చాక ఆ కణాలు మొట్టమొదటగా వ్యాపించేది బాహుమూలల్లోని లింఫ్‌ గ్రంథులకే. అందుకే క్యాన్సర్‌కు చికిత్స చేసే క్రమంలో వాటి పైనా దృష్టి సారిస్తారు వైద్యులు. అది ఎప్పుడంటే రొమ్ము క్యాన్సర్‌ నిర్థారణ చేసే క్రమంలో ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో భాగంగా మామోగ్రామ్‌తో పాటు బాహుమూలల్లోనూ అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ తప్పనిసరి. అప్పుడు ఆ భాగంలో లింఫ్‌ గ్రంథులు సహజంగా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఎలాంటి సమస్యా లేనప్పుడు సెంటినల్‌ నోడ్‌ బయాప్సీ సిఫారసు చేస్తారు. ఒకవేళ క్యాన్సర్‌ సూచన కనిపిస్తే ఆక్సిలరీ నోడ్‌ క్లియరెన్స్‌ని సూచిస్తారు.

ఆక్సిలరీ నోడ్‌ క్లియరెన్స్‌: క్యాన్సర్‌ వచ్చిన లింఫ్‌గ్రంథుల్ని పూర్తిగా తొలగిస్తారు. అయితే ఈ పద్ధతి వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా భుజాల నుంచి చేతుల వరకు పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారడం, సూదిపెట్టి గుచ్చినట్లు అనిపించడం లాంటి సమస్యలు కొన్ని నెలలపాటు ఎదురవుతాయి. అరుదుగా మాత్రం చేయంతా శాశ్వతంగా వాచినట్లు ఉండిపోతుంది. ఈ సమస్యలన్నీ ప్రతి వందమందిలో ఐదు నుంచి పది శాతం వారికి మాత్రమే ఎదురవుతాయి.

సెంటినల్‌ నోడ్‌ బయాప్సీ: ఇది అత్యాధునికమైన పద్ధతి. క్యాన్సర్‌ కణాలు వ్యాపించిన మొదటి లింఫ్‌ గ్రంథుల్ని సెంటినల్‌ నోడ్స్‌ అంటారు. శస్త్రచికిత్స కన్నా ముందు వైద్యులు నిర్వహించే ట్రిపుల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో భాగంగా అల్ట్రాసౌండ్‌ చేసినప్పుడు కొన్నిసార్లు క్యాన్సర్‌ లక్షణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పద్ధతిని ఎంచుకుంటారు. రొమ్ముకు శస్త్రచికిత్స చేసే ముందు బ్లూ డై, రేడియో యాక్టివ్‌ ఫ్లూయిడ్‌ను క్యాన్సర్‌ వచ్చిన రొమ్ములో ప్రవేశపెడతారు. అవి అసహజంగా ఉన్న లింఫ్‌ గ్రంథుల దగ్గరకు చేరతాయి. మత్తు ఇచ్చాక రొమ్ముకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడే బాహుమూలల్లో చిన్న రంధ్రం చేసి పరీక్షలు చేస్తారు. దీన్ని ఫ్రోజెన్‌ సెక్షన్‌ అంటారు. ఇరవై నిమిషాల్లో క్యాన్సర్‌ కణాలు ఆ భాగానికి సోకాయా లేదా అన్నది తెలుస్తుంది. క్యాన్సర్‌ లేదనప్పుడు ఇక మిగతా గ్రంథుల్ని తీయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఒకటి లేదా రెండు గ్రంథుల్లో ఉందని తేలితే.. ఆ కోతను పెద్దగా చేసి ఆక్సిలరీ విధానాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.

రంగుల'తో రొమ్ముక్యాన్సర్‌ దూరం!
రకరకాల పండ్లు, కూరగాయలను తరచుగా తినటం మంచిదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నదే. వీటిల్లో ఉండే రంగు పదార్థాలైన కెరోటినాయిడ్లు.. విటమిన్‌ ఏ లోపం తలెత్తకుండా, త్వరగా వయసు మీదకుండా కాపాడతాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్‌ ముప్పునూ తగ్గిస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా.

కెరోటినాయిడ్ల స్థాయిలు, రొమ్ముక్యాన్సర్‌ మీద గతంలో చేసిన ఎనిమిది అధ్యయనాలను బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ ఆసుపత్రి, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు. రక్తంలో కెరోటినాయిడ్ల స్థాయిలు ఎక్కువగా ఉండటానికీ, రొమ్ముక్యాన్సర్‌ ముప్పు.. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ సంబంధ ఈఆర్‌-నెగెటివ్‌ రొమ్ముక్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ గణనీయమైన సంబంధం ఉంటున్నట్టు గుర్తించారు. ఇలాంటి రొమ్ముక్యాన్సర్ల విషయంలో నివారించుకోదగిన ముప్పు కారకాల్లో కెరోటినాయిడ్ల స్థాయులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఈ అధ్యయనం నొక్కిచెబుతోంది. అందువల్ల కెరోటినాయిడ్లు ఎక్కువగా గల ఆహారాన్ని తీసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. క్యారెట్‌, పాలకూర, టమోటా, చిలగడ దుంప వంటి కూరగాయల్లో.. మామిడి, బొప్పాయి, పంపర పనస వంటి పండ్లలో కెరటినాయిడ్లు దండిగా ఉంటాయి. సాల్మన్‌ చేపలు, పాలు, గుడ్డులోని పచ్చసొనతోనూ ఇవి లభిస్తాయి.--Sukhibhava@eenadu news paper
  • ===================================
Visit my website -> Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.