Monday, March 1, 2010

తలనొప్పి , Headach






ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేక యంత్రాలతో పరుగెడుతూ, నిద్రాహారాలు లేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తలనొప్పి. తలనొప్పితో బాధపడేవారిలో అధికం స్త్రీలే. దీనికి కారణం - అంతర్గత మానసిక ఒత్తిడితోపాటు అధిక పనిభారం. తలనొప్పి వల్ల ఏ పని సరిగ్గా చేయలేక, ఎవరికి చెప్పుకోలేక అంతర్గతంగా మథనపడి, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు.

దాదాపుగా ప్రతిఒక్కరూ తలనొప్పి తో ఏదో ఒక సందర్భంలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. అయితే ఇవి ఎక్కువ తాత్కాలి కమైన ఇబ్బందులే. సాధారణంగా తలనొప్పులు తాత్కాలికం, అవి వాటంతటవే పోతుంటాయి. అయితే, నొప్పి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటానికి సిగ్గు పడకూడదు. వైద్యుడు తలనొప్పి తీవ్రంగా ఉన్నా, మరల -మరల వస్తున్నా లేదా జ్వరంతో పాటువస్తున్నదేమో పరీక్షించాలి.

మనిషికి ... మరే ఇతర సమస్యా . . తలనొప్పంత ఇబ్బందికరం కాదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధికంగా వైద్యుడిని సంప్రదించేందుకు కారణమయ్యే సమస్యలను ఒక పట్టికగా తయారు చేస్తే అందులో తలనొప్పిదే అగ్రస్థానం. తలనొప్పి కారణంగా వైద్యుడిని సంప్రదించే రోగులు మొత్తం రోగుల్లో 40 శాతం ఉంటారని అంచనా. ఒక సంవత్సరంలో సుమారు 90 శాతం మంది పురుషులు, 95 శాతం మంది స్త్రీలు తలనొప్పికి గురవుతారు. 99 శాతం మంది వ్యక్తులు జీవితకాలంలో కనీసం ఒకసారైనా తలనొప్పికి గురవుతారు.

తలనొప్పి కలవారిలో అధిక శాతం 'స్వయం చికిత్స చేసుకుంటూ ఉంటారు. అయితే మనం వాడే వాడే నొప్పి మాత్రలు (నాన్‌ స్టీరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ -NSAIDS ఔషధాలు. ఉదాహరణకు - ఇండోమెథాసిన్‌, అసిటామిన్‌ , డైక్లోఫెనాక్ , అసిక్లొఫెనాక్ , మొదలైనవి) కూడా తలనొప్పిని కలుగజేస్తాయి.

తలనొప్పి గురించిన కొన్ని అపోహలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1) అన్ని తీవ్రమైన తలనొప్పులకూ మెదడులో కంతులు కారణమా?.కాదు .
2) సైనస్‌ లేదా కంటి సమస్య తరచుగా కలిగే తలనొప్పికి ముఖ్యమైన కారణం. అవును .

లక్షణాలు
తలనొప్పి ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురును చూడలేకపోవడం, చూపు మసకబారి వాంతి వచ్చినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పి తలలో ఏదో ఒక వైపునే అధికంగా ఉంటే పార్శ్వ నొప్పి (మైగ్రేన్‌)గా భావించాలి.
పార్శ్వనొప్పి క్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండా ఉండి, తల దిమ్ముగా ఉంటుంది.

ప్రతి తలనొప్పికీ వైద్యమక్కరలేదు. కొన్ని తలనొప్పులు భోజనం సరియైన సమయంలో తీసుకోక పోవడంలో వల్లా లేదా కండరాల ఉద్రిక్తతవల్ల కలుగుతాయి, వాటికి తగుజాగ్రత్తలు ఇంటిదగ్గర తీసుకుంటే సరిపోతుంది. మరికొన్ని తలనొప్పులు ఏదో తీవ్రమైన స్ధితికి సంకేతాలు మరియు వాటికి తక్షణం వైద్యసాయం అవసరమవుతుంది.

మీరు ఈ క్రింది తలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీకు అత్యవసరంగా వైద్య సహాయం అవసరం:

* తీవ్రమైన, ఆకస్మికంగా తలనొప్పి వేగంగా, చెప్పలేని విధంగా వచ్చి "ఇది నా జీవితము లో దారుణమైన తలనొప్పి" అనిపించేది
* స్పృహతప్పటం, గందరగోళం, కంటి చూపులో మార్పులు లేదా యితర శారీరక బలహీనతలతో కూడిన తలనొప్పి
* మెడ బిగుసుకుపోవటం మరియు జ్వరంతో కూడిన తలనొప్పి

మీరు ఈ క్రిందితలనొప్పి లక్షణాలను కనుక అనుభవిస్తుంటే మీరు వైద్య సహాయం అవసరం:

* నిద్ర నుంచి మిమ్మల్ని మేలు కొలిపే తలనొప్పి
* తలనొప్పి స్వభావములో గానీ లేదా తరచూ ఎందుకొస్తుందో వివరించలేని మార్పులు
* మీ తల నొప్పి స్వభావం గురించి మీకు స్పష్టత లేనట్లైతే వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం.

  • ఆందోళన తలనొప్పి , 
  • క్లస్టర్ తలనెప్పి, 
  • పార్శ్వశూల ,
అనేవి తలనెప్పులలోని రకాలు. తల పగిలిపోయేంత, పార్శ్వశూల అనేవి రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులు. ఈ రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో భౌతిక శ్రమ . . తలనొప్పి బాధను అధికం చేస్తుంది. తలచుట్టూ ఉండే కణజాలములోని రక్తనాళాలు ఉబ్బుతాయి లేదా వాస్తాయి, దానివల్ల తల నెప్పితో బాధపడతాము. తల పగిలిపోయేంత (క్లస్టర్) తలనెప్పి పార్శ్వశూల తలనెప్పి కన్నా తక్కువగానే వస్తుంది, ఇది రక్తనాళాలకు సంబంధించిన తలనొప్పులలో సాధారణమైనది.
క్లస్టర్ తలనెప్పి వరుసగా అతివేగంగా వస్తుంది-వారాలు లేదా నెలలపాటు ఉంటుంది. క్లస్టర్ తలనెప్పి ఎక్కువగా మగవారికి వస్తుంది మరియు భరించరానంత బాధాకరమైనది.

కారణాలు
- అధిక మానసిక ఒత్తిడి వల్ల మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది.
- మెదడు కణాల్లో కంతులు ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
- తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల కాని, కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్ల వల్ల కాని తలనొప్పి వస్తుంది.
- కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల తలనొప్పికి గురి కావడం జరుగుతుంది.
- రక్తపోటు అధికంయ్యేతపుడు (BP) ముందుగా కొందరికి తలనొప్పి ఉంటుంది .

జాగ్రత్తలు
మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు శబ్దాలు లేని గదిలో, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పినుండి ఉపశమనం లభిస్తుంది.
పౌష్టికాహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌కు స్వస్తి చెప్పాలి.
ఆకు కూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
నీరు అధికంగా తీసుకోవాలి. వేళకు నిద్ర, ఆహారంపట్ల శ్రద్ధ చూపాలి.
సాయంత్రం ఆలస్యంగా తినడం, టి.వి. చూస్తూ ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం మానుకోవాలి.
ప్రతిరోజు 45 నిముషాలు ఉదయం నడవటం, లేదా ఇతర వ్యాయామాలు ఏమైన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి తలనొప్పి తగ్గుతుంది.


వ్యాధి నిర్ధారణ

అధికభాగం తలనెప్పులు తీవ్రస్థితిలో కలిగేవి కావు మరియు దుకాణాలలో దొరికే మందులతో చికిత్స చెయ్యవచ్చు. పార్శ్వశూల తలనెప్పి మరియు యితర తీవ్రమైన తల నెప్పులకు వైద్య పర్యవేక్షణ మరియు ఔషధచీటి అవసరమవ్వవచ్చు.


ఆందోళనవల్ల కలిగే తలనెప్పి(Tension headach):

* ఆందోళన వల్ల లేదా కండరం ముడుచుకోవటం వల్ల కలిగే తలనెప్పి అన్నది అత్యంత సాధారణమైన తలనెప్పి, మరియు అవి వత్తిడి పెరిగే దశలతో తరచూ ముడిపడి ఉంటాయి.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నది స్థిరంగా మరియు మందంగా ఉండిమరియు నుదురు, కణతలు మరియు మెడవెనుక భాగం లో లోనవుతాము.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి అన్నదాన్ని తలచుట్టూ గట్టిగా కట్టివేసినట్లుంటుందని ప్రజలు తరచూ వర్ణిస్తారు.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి దీర్ఘకాలం ఉండవచ్చు కానీ వత్తిడి తగ్గగానే సాధారణముగా మాయమవుతాయి.
* ఆందోళన వల్ల కలిగే తలనెప్పి కి మరేయితరలక్షణాలతో సంబంధం లేదు మరియు పార్శ్వశూలతలనెప్పిలాగా తలనెప్పికి ముందు వ్యాధిలక్షణాలు ఏవీ కనిపించవు. అన్నిరకాల తలనెప్పులలో ఆందోళన వల్ల కలిగే తలనొప్పులు 90శాతము.



సరణి(సైనస్)తలనొప్పులు

సరణి(సైనస్)తలనొప్పులకు సరణి సంక్రమణం(అంటువ్యాధి) లేదా సహించకపోవటం(ఎలర్జీ) వల్ల కలుగుతాయి. జలుబు లేదా ఫ్లూ జ్వరము తరువాత ముక్కు ఎముకలకు ఎగువన, దిగువున ఉండే గాలి కుహరాలు సరణి మార్గాలు మంటకుగురికావడం, సరణితలనెప్పు కలుగుతుంది.ఈ సరణి చిక్కబడటం లేదా క్రిమిపూరితం అయినా తలకు నెప్పి కలిగించేకారణమవుతుంది. ఈ నెప్పి తీవ్రంగా,కొనసాగుతూ ఉంటుంది,ఉదయాన్నే మొదలవుతుంది మరియు ముందుకు వంగితే మరింతదారుణంగా మారుతుంది.

సరణి(సైనస్)తలనొప్పుల సాధారణ లక్షణాలు:

* చెక్కిళ్ళమీదుగా మరియు నుదుటిపై,కళ్ళచుట్టూ నెప్పి మరియు వత్తిడి,
* పైపళ్ళు నెప్పిగా ఉన్న భావన,
* జ్వరము మరియు వణుకు,
* ముఖం వాయటం,

సరణి(సైనస్)తలనొప్పులలో వచ్చే ముఖం నెప్పులకు వేడిద్వారా మరియు  మంచుద్వారాఉపశమనం కలిగిస్తారు.

మైగ్రేన్

తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి(మైగ్రేన్)ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషికి మనిషికి  వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.

లక్షణాలు
మైగ్రేన్ లక్షణాలు సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు వస్తుంటాయి. తేలిక పాటి తల నొప్పి తో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి వస్తున్నట్లుగాను మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి వుంటుంది. అధిక వెలుతురును  శబ్దాలను భరించలేరు. కళ్ళముందు వెలుతురు చుక్కలాగా కనిపించవచ్చు.

* ఈ లక్షణాలు మొదలైన కొన్ని నిముషాలకు ముఖములో ఒక భాగములో కాని, ఒక చేయి కాని , ఒక కాలు కాని తిమ్మిర పట్టడము. సూదులతో గుచ్చినట్లు అనుభూతి కల్గడం జరుగుతుంది.
* కళ్ళు తిరగడం , బలహీనత, మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడం జరగవచ్చు. ఈ లక్షణాలు తీవ్రమైన లేక తగ్గుదల కనిపించిన తరువాత విపరీతమైన తలనొప్పి సుత్తి తో బాదినట్లు వస్తుంది.
  • ఆకలి మందగిస్తుంది.
  • ఈ లక్షణాలు సాధారణంగా 6 గం నుండి 8 గం వరకు వుంటుంది.
  • స్త్రీలకు బహిస్టు సమయంలో మైగ్రేన్ తల నొప్పి వస్తుంటాయి.

కారణాలు

* మానసిక వత్తిడి – తలనొప్పి,
* అధిక శ్రమ,
* ప్రకాశవంతమైన వెలుతురు కళ్ళ మీద పడినప్పుడు,
* రుతు క్రమములో తేడాలు.
* కొందరిలో గర్బనిరోధక మాత్రలు మైగ్రేన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది.
* మత్తుపానీయాలు – పొగత్రాగుట,

 మైగ్రేన్ లక్షణాలు తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం వలన ప్రారంభమవుతుంది. ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించుట వల్ల ... తలనొప్పి వస్తుంది.

మెదడుకు నొప్పి తెలియదు
శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా ఆ సంకేతాలు మెదడుకే చేరుతున్నా, నిజానికి మెదడుకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. మెదడు (బ్రెయిన్‌ పారంకైమా) నొప్పిని గ్రహించలేదు. అయితే మెదడుపై ఉన్న రక్షణ కవచాలు (డ్యూరా), 5, 7, 9, 10 క్రేనియల్‌ నరాలు, రక్తనాళాలు, తల చర్మం, మెడ కండరాలు, సైనస్‌లలోని మ్యూకోసా, దంతాలు మొదలైనవి నొప్పిని గ్రహించ గలవు.

మైగ్రేన్‌ రకాలు :
మొత్తం జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నారు. మళ్లీ మళ్లీ కలిగే తీవ్రమైన తలనొప్పులకు మైగ్రేన్‌ సమస్య ఒక ప్రధాన కారణం. మైగ్రేన్‌ను రెండు ముఖ్యమైన రకాలుగా విభజించవచ్చు. అవి - క్లాసికల్‌ మైగ్రేన్‌, కామన్‌ మైగ్రేన్‌.

క్లాసికల్‌ మైగ్రేన్‌ : ఈ రకం ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. తలనొప్పి ఒక పక్క చెవిపైన మొదలై మొత్తం సగభాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమపక్క కలుగవచ్చు. ఈ తలనొప్పిని 'థ్రాబింగ్‌, పల్సేటివ్‌, పౌండింగ్‌ తలనొప్పిగా వర్ణిస్తారు.ఎక్కువగా పల్సేటివ్‌ తలనొప్పి కనిపిస్తుంటుంది. మద్యం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు తలనొప్పికి కారణం అవుతాయి. విశ్రాంతి, నిద్ర, చీకటి గదిలో పడుకోవడం వల్ల నొప్పికి ఉపశమనం కలుగుతుంది. సుమారు 20 శాతం మందిలో ఆరా(Aura) కనిపిస్తుంది. కంటి ముందు మెరుపులు, కొంతభాగంలో చూపు కోల్పోవడం, అడ్డదిడ్డంగా మెరిసే రంగురంగుల కాంతులు కనిపించడం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు మొదలైనవాటికి తిమ్మిర్లు పట్టడం వంటివి సంభవించవచ్చు.

కామన్‌ మైగ్రేన్‌ : సాధారంగా కనిపించే మైగ్రేన్‌ రకం ఇది. మధ్యవయస్కుల్లో, స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రాంటల్‌, టెంపొరల్‌, ఆక్సిపిటల్‌, ఆర్బిటాల్‌ భాగాల్లో ఎక్కడైనా ఈ తలనొప్పి కలుగవచ్చు. తరచూ రెండువైపులా ఈ రకమైన తలనొప్పి కలుగుతుంది. నొప్పి మంద్రంగా, కళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది.

మైగ్రేన్‌ ట్రిగ్గర్స్‌ : కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది. పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.

క్లస్టర్‌ హెడేక్‌
ఇది 30 - 50 సంవత్సరాల వయస్కుల్లో, ముఖ్యంగా పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది. తలనొప్పి 30 నిముషాలనుంచి రెండు గంటలపాటు ఉంటుంది. రాత్రిపూట అధికంగా ఉంటుంది. కంటి లోపలా, కంటి చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. కన్ను ఎరుపుగా మారి నీరు కారుతుంది. ముక్కు కూడా మూసుకుపోయి నీరు కారుతుంది. మద్యం తీసుకునే వారిలో ఈ సమస్య కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ తలనొప్పి వరుసగా 6 నుంచి 12 వారాలు కలుగుతుంది. ప్రతియేటా ఒకే సమయంలో వస్తుంది. కనురెప్ప తెరవడం కష్టమవుతుంది.

టెన్షన్‌ హెడేక్‌
స్త్రీ, పురుషులిద్దరికీ ఏ వయస్సులోని వారికైనా కలుగవచ్చు. తలచుట్టూ లేదా తలపైన వెర్టెక్స్‌ భాగంలో నొక్కుతున్నట్లు నొప్పి ఉంటుంది. తలచుట్టూ ఏదో గట్టిగా కట్టిన భావన కలుగుతుంది. ఒత్తిడి సమయంలో తలనొప్పి ఎక్కువ అవుతుంది. సాయంత్రం, లేదా రాత్రి సమయంలో అధికమవుతుంది. తలలో కంతులున్నాయేమోననే భయం నొప్పిని అధికం చేస్తుంది. ఇతర ఆందోళనా లక్షణాలు కనిపిస్తాయి. తల, మెడ భాగంలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం (స్పాజమ్‌) ఈ నొప్పికి కారణమని భావిస్తారు.

సైకోటిక్‌ హెడేక్‌
మధ్య వయస్కుల్లో, స్త్రీ, పురుషులకు సమానంగా కలుగుతుంది. నొప్పి ఒక స్థలంలో ఉందని చెబుతారు. ఏదో నొక్కుతున్న, లేదా బరువు పెట్టిన భావన ఉంటుంది. అన్ని సమయాల్లోనూ తలనొప్పి ఉంటుంది. ఏ పనీ చేయనివ్వదు. నొప్పి తగ్గడమంటూ ఉండదని బాధితులు చెబుతారు. నిద్రలేమి, తరచుగా ఏడవడం, బరువు తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వాస్తవానికి వీరికి సైకోసిస్‌ ఉండదు.

రోగి తన నొప్పిని ఒక వేలితో చూపిస్తాడు. తలలో గడ్డ తగులుతున్నదని, క్రిములు తిరుగుతున్నాయని చెబుతారు. వీరికి అక్కడ ఏమీ లేదని చెప్పినా ధైర్యం కలగదు. వీరు తమకు స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తారు. పరీక్షల్లో ఏమీ తేలకున్నా వీరికి నమ్మకం ఉండదు.

క్రేనియల్‌ ఆర్టిరైటిస్‌
అరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో తలనొప్పి కలిగినప్పుడు ముందుగా ఈ స్థితి గురించి పరీక్షించాలి. టెంపొరల్‌ లేదా ఇతర క్రేనియల్‌ ఆర్టరీస్‌ ఉన్న భాగంలో వాపు, ఎరుపుదనం, తాకితే నొప్పి ఉంటాయి. తల మొత్తం నొప్పిగా ఉండవచ్చు. ఇ.ఎస్‌.ఆర్‌., సి.ఆర్‌.పి. (సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌) అధికంగా ఉంటాయి. ఈ పరీక్షల్లో వీటి పరిమాణం పెరిగినట్లు ఉంటే వెంటనే స్టీరాయిడ్స్‌ ఆరంభించాలి. లేనిపక్షంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో 50 శాతం మందికి చూపు పోయే అవకాశాలుంటాయి.

నివారణ

* ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండి స్వల్ప మార్పుల తో సాధారణ జీవిత విధానాన్ని అలవరచుకోవాలి
* ఇంటిలో వున్నప్పుడు చీకటి రూములో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
* ద్రవ పదార్దాలు నీళ్ళు ఎక్కువ మోతాదుల లో తాగాలి.
* నీటిలో తడచిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి తీసుకొన్న కొంత ఉపశమన ఉంటుంది.
* ఏ మాత్రము సందేహము వున్నా గర్బ నిరోధక మాత్రలు తీసుకోకూడదు. ఇతర కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించాలి.
* కొందరు స్త్రీ ల లో మెనోపాజ్ వయస్సు రాగానే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
* డాక్టరు ను సంప్రదించి మాత్రమే వైద్యం చేయించుకోవాలి.

పార్శ్వనొప్పికి బొటాక్స్‌
తలనొప్పుల్లో పార్శ్వనొప్పి (మైగ్రేన్‌) తీరే వేరు. మాటిమాటికీ వేధించి జీవితాన్నే అస్తవ్యస్తం చేసేస్తుంది. కాబట్టే దీనికి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌డీఐ ఇటీవల పెద్దవారిలో పార్శ్వనొప్పిని నివారించేందుకు బొటాక్స్‌ (బొటులినుమ్‌టాక్సినా) వాడకానికి అనుమతించింది. ఈ చికిత్సలో మున్ముందు తలనొప్పి రాకుండా బొటాక్స్‌ ఇంజెక్షన్లను 12 వారాలకు ఒకసారి తల, మెడ చుట్టూ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి బొటాక్స్‌ను ముఖం మీది మడతల చికిత్సలో ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని తీసుకున్నవారిలో విచిత్రంగా పార్శ్వనొప్పి లక్షణాలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ కొత్త చికిత్స రూపుదిద్దుకుంది.



తలనొప్పికి చికిత్స :
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి ,
  • పారాసిటమాల్ + ఇబుఫ్రోఫెన్ కలిసిఉన్న మాత్రలు (Combiflam) ఒక మాత్ర ఉదయము , ఒకమాత్ర సాయంత్రముతీసుకోవాలి .
  • దైక్లోఫెనాక్ + పారసేతమాల్ కలిసిఉన్న మాత్రలు (Dipal-F) ఉదయము , సాయంత్రము తీసుకోవాలి
పై మాత్రలు భాదనివారనకే పనిజేస్తాయి , ఇలా మూడు రోజులు వాడినా తగ్గక పోతే డాక్టర్ని సంప్రదించాలి .


వేసవిలో తలనొప్పా?
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రత కారణంగా కొందరికి విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. దీని నుంచి తప్పించుకోవటానికి ఏం చేయాలి?

* 3 లీటర్ల నీరు: ఒంట్లో నీటిశాతం తగ్గిపోకుండా చూసుకోవటం ప్రధానం. ఇందుకు రోజుకి 2-3 లీటర్ల నీరు తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరినీరు వంటి వాటితోనూ డీహైడ్రేషన్‌ ఏర్పడకుండా చూసుకోవచ్చు. అయితే కెఫీన్‌ ఎక్కువగా ఉండే పానీయాల జోలికి వెళ్లకపోవటమే మంచిది.
* నియమిత వ్యాయామం: వేసవిలోనూ వ్యాయామాన్ని మానరాదు. అయితే వ్యాయామం చేసినపుడు చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, డీ హైడ్రేషన్‌ ఏర్పడకుండా ఆ సమయంలో తగు మోతాదులో నీరు తాగటం మరవరాదు.
* మసాలాలకు దూరం: మసాలాలతో నిండిన ఆహారంతో తలనొప్పి మరింత పెరగొచ్చు. సాధ్యమైనంతవరకు మసాలాలు, నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. అలాగే మరీ చల్లగా ఉండే ఐస్‌క్రీమ్‌ల వంటి వాటికి అలవడటానికి శరీరం కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అలాంటివీ మానెయ్యాలి
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. chalamandi thalanoppi ragane paracetmol tablets vesukuntaru kani adi e vidamaina noppo alochincharu, konthamandi anavasara apohalaku poyi bayapaduthuntaru, andariki artham ayyela undi mee article, nice article, we are providing information of jwaram thalanoppi

    ReplyDelete
  2. Thank you sir
    Sir పారాసిటమాల్ + ఇబుఫ్రోఫెన్ కలిసిఉన్న మాత్రలు (Combiflam)
    దైక్లోఫెనాక్ + పారసేతమాల్ కలిసిఉన్న మాత్రలు (Dipal-F)
    Ee tablets kakunda Aurvadic medicine Ledha sir

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.