- గర్భధారణ వయసు పదిహేనేళ్ల నుంచి నలభై తొమ్మిదేళ్లు వరకు ఉంటుంది. నలభై ఐదేళ్ల నుంచి అండాలు క్రమంగా తగ్గుతాయి. ఒక దశకొచ్చే సరికి అండాలు మాయమవుతాయి. దీంతో మెదడు నుంచి సంకేతాలు పంపినా ప్రయోజనం ఉండదు. అండాలు తగ్గి, పరిపక్వమవడానికి అవకాశం ఎప్పుడు ఉండదో అప్పుడు మెనోపాజ్ దశ (రుతుక్రమం నిలిచిపోవడం) వస్తుంది. ఇవన్నీ మహిళల జీవితంలో పెనవేసుకున్న మార్పులు. పుట్టినప్పటి నుంచి రుతుక్రమం మొదలయ్యే దాక ఒక దశ, రుతుక్రమం నుంచి రుతుక్రమం నిలిచేదాక ఒక దశ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మెనోపాజ్ దశ రావడం సహజం.
మెనోపాజ్ ఆడవారి జీవితాన్ని చికాకుగా తయారు చేస్తుంది. పెరుగుతున్న వయసులో వచ్చే 'మెనోపాజ్' ఓ గ్రీకు పదం. మెనో అంటే 'నెల' అని, పాజ్ అంటే 'ఆగి' పోవటమని అర్థం. అంటే నెల నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోవడమన్నమాట.
45--50 సంవత్సరాల వయసు మహిళల్లో పీరియడ్స్ సరైన సమయంలో రావు. అండాశయం నుండి అండాలు వెలువడటం ఆగిపోతుంది. కొన్ని నెలల పాటు పీరియడ్స్ ఆగిపోతాయి. స్త్రీలోని సెక్స్ హోర్మోన్స్ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది.
ఇది ఆడవారి జీవితంలో అందరూ పొందే సామాన్య స్థితే. దీనివల్ల ఓవరీస్ నుండి వెలువడే అండోత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి క్రమంగా ఈస్ట్రోజెస్ (స్త్రీ సెక్స్ హోర్మోన్స్) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.
స్థితి మూడు దశల్లో ఉంటుంది.
ప్రీ మెనోపాజ్ : ఈ స్థితిలో ఓవరీస్ నెమ్మదిగా పని చేస్తాయి. ఋతుక్రమం మామూలుగానే వస్తుంది. కానీ కొన్ని లక్షణాలు బయటపడతాయి.
మెనోపాజ్ రెండవదశ : ఈ దశలో ఋతుక్రమం తప్పుతుంది. దీని లక్షణాలు బాధాకరంగా ఉంటాయి.
మూడవ దశ (పోస్ట్ మెనోపాజ్) : ఒక్కోసారి పీరియడ్స్ సంవత్సరం వరకూ పూర్తిగా ఆగిపోతాయి. దీనిని పోస్ట్ మెనోపాజ్ అంటారు.
మెనోపాజ్ లక్షణాలు ఇలా కూడా వుండే అవకాశం వుంది.
- రాత్రి నిద్ర పట్టకపోవటం,
- చెమట పట్టటం,
- ఆకస్మికంగా గుండె,
- మెడ, ముఖం మీద ఎరుపుదనం రావటం,
- వేడిగా అనిపించటంలాంటి ముఖ్య లక్షణాలు మెనోపాజ్‌లో కనిపిస్తాయి.
- ఈ సమయంలో యోని ద్వారం ఎండిపోయినట్టుగా ఉంటుంది.
- యోని చర్మం పల్చగా ఉంటుంది. ఈ కారణాల వల్ల యోని మూత్ర విసర్జన నాళంలో అంటు రోగాలు వ్యాపించే అవకాశముంటుంది.
సెక్స్ హోర్మోన్స్ తక్కువ కావటం వల్ల 'కలయిక' పట్ల ఆసక్తి తగ్గు ముఖం పడుతుంది. అయితే బాధలు తగ్గి, ఋతుక్రమం ఆగిపోయిన తరువాత ఆసక్తి మామూలు స్థితికి చేరుకుంటుంది. నెలనెలా వచ్చే పీరియడ్స్ సక్రమంగా రాక క్రమంగా ఆగిపోతాయి. కొంతమందిలో ఎక్కువ సమయం తీసుకుంటాయి.
ఈ లక్షణాలే కాకుండా మెనోపాజ్ స్థితిలో స్త్రీ మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. విసుక్కోవటం, చిరాకు పడటం జరుగుతుంది. అదే సమయంలో రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, ఆస్టియోపొరోసిస్, మూత్ర విసర్జనలో బాధ లాంటివి కూడా వచ్చే అవకాశం వుంది.
అలా అని సమస్య మరీ తీవ్రంగా వుంటుందని అనుకోవలసిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరంలో మెనోపాజ్ దశ ఒక వ్యాధి లక్షణం కాదు. ఇది ఒక సామాన్య స్థితి మాత్రమే.
మెనోపాజ్ దశకు చేరుకొన్న వారిలో రాత్రిపూట నిద్రాభంగం సహజం. కనీసం 3--4 సార్లు మెలకువ వస్తుంది. మళ్లీ నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రలేకపోవడంతో పాటు అలసట, నీరసం కలుగుతాయి. దాంతో మరుసటి రోజు చిరాకు, కోపం, విసుగువస్తాయి.
తల తిరగడం, ఒళ్లు తూలడం, దురదలు, తిమ్మిర్లు, మంటలు కనబడతాయి. కొందరిలో తలనొప్పి విపరీతంగా ఉంటుంది. దేనిమీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మతి మరుపు ఎక్కువ అవుతుంది. డిప్రెషన్ లక్షణాలు కలుగుతాయి.
మెనోపాజ్ బాధలు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు హోర్మోను రీప్లేస్‌మెంట్ థెరఫీ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు చేయించుకోవడం అవసరం. హిస్ట్రక్టమి ఆపరేషను చేయించుకున్న స్త్రీలకి కేవలం ఈస్ట్రోజను హోర్మోను ఇస్తే సరిపోతుంది. హిస్ట్రక్టమి ఆపరేషను అవని వాళ్లకి ఈస్ట్రోజను హోర్మోనుతోపాటు ప్రొజిస్టరోన్ హార్మోను కూడా ఇవ్వడం అవసరం.
మెనోపాజ్ వచ్చిన స్త్రీలు మానసికంగా కృంగిపోక హోర్మోను రీప్లేస్‌మెంట్ థెరఫీ పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తే సంసార సుఖం, మానసిక ఆనందం అలాగే నిలచి ఉంటాయి.
జీవితంలో మలిదశ.. మెనోపాజ్... అత్యంత కీలకం. ఇది ఆనందంగా సాగాలంటే.. శారీరకంగా చోటు చేసుకునే ప్రతి మార్పునీ గుర్తించగలగాలి.అవగాహన ఉంటేనే ఆ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండగలం. ఇంతకీ మెనోపాజ్ అంటే ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా కొనసాగిన రుతుక్రమం ఒక వయసొచ్చాక ఆగిపోవడం. ఈ దశకు ముందు, తరవాతా చోటు చేసుకునే రకరకాల మార్పులు స్త్రీని ఎంతో ప్రభావితం చేస్తాయి.
ఒక వయసు వచ్చాక నెలసరి ఎందుకు నిలిచిపోతుందో తెలియాలంటే.. అసలు రుతుక్రమం విధానం.. దానిని నియంత్రించే అంశాలపై అవగాహన అవసరం.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయిలో అండాశయాలు లేక ఓవరీల్లోని అండాలు (ఓవ ఎగ్స్) తయారవుతాయి. అవి ఇరవై వారాల గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు 70 లక్షల అండాల పూర్వదశ ఉండి, క్రమంగా తగ్గి పాప జన్మించేటప్పటికి 20 లక్షలు, రజస్వల సమయానికి మూడు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో పునరుత్పత్తి వయసులో నాలుగైదు వందల అండాలు మాత్రమే విడుదలవుతాయి. మిగిలినవి వాటికవే అట్రీషియా అనే ప్రక్రియతో నశించిపోతాయి.
ఇలా అండాల సంఖ్య క్షీణించడంతో హార్మోన్ల విడుదల స్థాయీ తగ్గుతూ వస్తుంది. చివరకు అండాశయాల్లోని ఊసైట్స్ బాగా తగ్గిపోయినప్పుడు పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే గోనాడోట్రోపిన్ హార్మోన్లు కూడా ఇతర హార్మోన్ల, అండాల విడుదలకు ప్రేరేపించవు. ఈ మార్పులు మెనోపాజ్‌కి దాదాపు పదేళ్ల ముందే చోటు చేసుకుంటాయి. నెలసరి పూర్తిగా ఆగిపోవడమనేది చివరి మెట్టు. అందువల్లే హార్మోన్ల స్థాయి తగ్గుముఖం పట్టినప్పటి నుంచీ కొందరు స్త్రీలకు మెనోపాజ్ సంబంధ సమస్యలు మొదలవుతాయి.
అండాశయాలు పూర్తిగా ముడుచుకుపోయి పని చేయడం ఆగిపోయే దశలో శరీరంలో అనేక మార్పులు తప్పవు. మెదడు నుంచి చర్మం దాకా, గోళ్ల నుంచి శిరోజాల వరకు, జ్ఞాపకశక్తి మొదలుకొని లైంగిక సంపర్కం.. ఇలా స్త్రీ శరీర ధర్మాలన్నింటిపై హార్మోన్ల లేమి ప్రభావం ఉంటుంది.
చెప్పాలంటే.. ఈ దశ 45-55 ఏళ్ల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. విదేశాలలో ఈ సగటు వయసు 51 ఏళ్లయితే, మన దేశంలో 48. ఇది ఎప్పుడు ఆగిపోతుందో గుర్తించలేం కానీ.. తల్లి మెనోపాజ్ వయసును తెలుసుకోగలిగితే... కొంతవరకు అంచనా వేయవచ్చు.
కొందరికి అసాధారణంగా నలభయ్యేళ్ల కంటే ముందే ఆగిపోతుంది. దీన్ని 'ప్రిమెచ్యూర్ మెనోపాజ్', అరవయ్యేళ్ల దాకా కొనసాగుతుంటే... 'డిలేయిడ్ మెనోపాజ్'గా పేర్కొంటాం. ఇవి రెండూ అసహజమైనవే. ఇతర సమస్యలు తెచ్చిపెట్టేవే.
సహజమైన మెనోపాజ్ అయితే.. వయసు వల్ల అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు విడుదల ఆగిపోవడమే కారణం. అయితే అండాశయాలను నిర్వీర్యం చేసే ఇతర కారణాలూ మెనోపాజ్ సంభవించేలా చేస్తాయి.
సర్జికల్ మెనోపాజ్: ఏ కారణం వల్లనైనా అండాశయాలను తొలగించడమే సర్జికల్ మెనోపాజ్. సహజ మెనోపాజ్ అయితే.. హార్మోన్లు క్రమేపీ తగ్గుతాయి కాబట్టి శరీరం అలవాటు పడుతుంది. కానీ ముందురోజు వరకూ మామూలుగానే ఉన్న హార్మోన్లు మర్నాటికల్లా మాయం కావడంతో మెనోపాజ్ లక్షణాలన్నీ ఒక్కసారి విజృంభించి వేధిస్తాయి.
రేడియేషన్, కీమోథెరపీ: జనేంద్రియాల క్యాన్సర్ల చికిత్సలో భాగంగా ఇచ్చే ఈ థెరపీలు అండాశయాలపై ప్రభావం చూపి మెనోపాజ్‌కు దారితీస్తాయి.
ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ (పీఓఎఫ్): నలభయ్యేళ్లు నిండకుండానే మెనోపాజ్ రావడాన్ని పీఓఎఫ్ అంటారు. జన్యు సమస్యల వల్ల అండాశయాలు లోపభూయిష్టంగా ఉండటం.. లేదా శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ గాడితప్పడమే ముఖ్యకారణం.
హిస్టెరెక్టమీ లేదా గర్భాశయాన్ని తొలగించిన తరవాత మామూలుగా కన్నా నాలుగేళ్లు ముందుగానే మెనోపాజ్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే పౌష్టికాహారలోపం ఉన్నవారికి ఇది రెండేళ్లు ముందుగానే వస్తుంది.
మెనోపాజ్ దశలో వయసు పైబడటం వల్లా మధుమేహం, కీళ్లనొప్పులు వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు కమ్ముకొని పీడిస్తాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే శారీరక, మానసిక దృఢత్వం అవసరం. వృద్ధాప్యం వచ్చాక కాక ముందునుంచీ ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరి.
మహిళల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే దశ (మెనోపాజ్) ఎప్పటినుంచి మొదలవుతుందో ముందుగానే పసిగట్టవచ్చునని అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. మెనోపాజ్ దశను ముందుగా గుర్తించే ఓ వినూత్న పరీక్షా విధానాన్ని వీరు కనుగొన్నారు.
మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ పరిశోధన గురించి వివరాలందించారు. ఈ పరిశోధన ప్రకారం... రక్తంలోని హార్మోన్ల స్థాయిని బట్టి, ప్రత్యుత్పత్తి దశ ఇంకెంత కాలం ఉంటుందో అంచనా వేయవచ్చు. మెనోపాజ్ దశ వచ్చేందుకు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలుసుకోవడం వల్ల గర్భం పొందే ఆలోచన ఉన్న నడివయసు మహిళలు ముందుగా, సంసిద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.
పై పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరీ ఫ్రాన్ సోవర్స్ "డైలీ మెయిల్" పత్రికకు అందించిన వివరాల ప్రకారం... తమ పరిశోధనలకుగానూ సుదీర్ఘ కాలం పాటు 600 మంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను అధ్యయనం చేసినట్లు తెలిపారు.
యాంటీ మల్లెరియన్ హార్మోన్, ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ లాంటి హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పులను పసిగట్టడం వల్ల మెనోపాజ్‌ను ముందుగానే గుర్తించవచ్చని సోవర్స్ వెల్లడించారు. ఈ రకంగా మెనోపాజ్‌ను దశను ముందుగానే గుర్తించటం, దానికి మహిళలు సంసిద్ధంగా ఉండటం వల్ల... వారు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వీలుంటుందని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మెనోపాజ్ దశలో స్త్రీలు పడే ఇబ్బందులు , Sympotoms of Menopause :
అతి కోపం.. చిరాకు.. విపరీతమైన ఆందోళన..జ్ఞాపకశక్తి క్షీణించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే.. మెనోపాజ్ దశలో స్త్రీలు రకరకాల భావోద్వేగాలకు లోనవుతారనే భావన ఎప్పట్నుంచో ఉంది. అలాంటి పరిస్థితులకు దారితీసే అంశాలు, తద్వారా ఎదురయ్యే ఇతర సమస్యలపైన దృష్టి సారిద్దాం.
మలిదశలో స్త్రీలకు ఎదురయ్యే మానసిక సమస్యలకు ఎన్నో కారణాలున్నాముఖ్యమైనవి .... ఈస్ట్రోజెన్ హార్మోను తగ్గిపోవడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపడటం. వేడి, చెమటలతో నిద్ర పట్టకపోవడం. ఆ వయసులో తరచూ ఎదురయ్యే ఒత్తిళ్లు... ప్రధానమైనవి.
నిరాశ : పురుషులతో పోలిస్తే.. మహిళల్లో నిరాశ పాళ్లు ఎక్కువని ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. రుతుక్రమం మొదలైనప్పుడు, ఆగిపోయేప్పుడు.. నెలసరికి ముందు, కాన్పుల తరవాతా డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని తేల్చిచెప్పాయి. అయితే ఇది కచ్చితంగా మెనోపాజ్ వల్లే వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాల్లేవు. ఈ సమయంలో బాధించే డిప్రెషన్‌కు పరిష్కారంగా యాంటీ డిప్రెసెంట్ మందుల్నే మొదటి చికిత్సా విధానంగా పరిగణిస్తారు.
ఒత్తిడి : అకారణంగా ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, అర్థంలేని భయాలు దీని లక్షణాలు. ఇవి ఎక్కువైతే 'ప్యానిక్ ఎటాక్స్' కనిపిస్తాయి. కొందరు స్త్రీలలో మెనోపాజ్ దశలో హాట్ ఫ్లషెస్ వచ్చేముందు ఇవి కనిపించవచ్చు.
జ్ఞాపకశక్తి: ఏకాగ్రత లేదని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇది మెనోపాజ్ లేని స్త్రీలలోనూ కనిపిస్తుంది. దీనికి మెనోపాజ్ కారణాలకన్నా... వయసుతో పాటూ కలిగే ఒత్తిడి, డిప్రెషన్, పని భారం, ఆరోగ్యం క్షీణించడం వంటివి ప్రధానంగా దోహదం చేస్తాయి.
నిద్ర: వయసు మీరినకొద్దీ నిద్ర పట్టడంలేదని, చీమ చిటుక్కుమన్నా మెలకువ వస్తోందనీ వయసు మళ్లిన స్త్రీలు చెబుతుంటారు. శారీరక శ్రమ తగ్గడం, వయసు పెరగడంతోపాటు ఒత్తిడి, హార్మోన్లు తగ్గిపోవడం కూడా దీనికి కారణాలు కావచ్చు.
సాధారణంగా మెనోపాజ్ సమయంలో వేధించే హాట్‌ఫ్లషెస్, మానసిక సమస్యలతో పాటు శరీరంలోని ఇతర వ్యవస్థలలోనూ కొన్ని మార్పులుకనిపిస్తాయి. చర్మం, జుట్టు, కండరాలు... ఇలా శరీరంలో దాదాపుగా మార్పులుంటాయి. వీటిలో చాలావరకూ వయసుతో వచ్చే మార్పులయితే కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఈస్ట్రోజెన్ హార్మోను తగ్గిపోవడం వల్ల చోటుచేసుకుంటాయి.
చర్మం: దీనిపై ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం చాలానే ఉంటుంది. ఈస్ట్రోజెన్ రిసెప్టార్స్‌తో కలిసి చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. మెనోపాజ్ తరవాత ఈస్ట్రోజెన్ లభించనప్పుడు చర్మం పొడిబారుతుంది. కొలాజిన్ తగ్గిపోవడం వల్ల ముడతలు కనిపిస్తాయి. చర్మం పల్చబడి నరాలు తేలి కనిపిస్తాయి. గోళ్లూ నిగారింపు కోల్పోయి పెళుసుగా మారి.. తరచూ విరిగిపోతూ ఉంటాయి.
అవాంఛిత రోమాలు: మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గడంతో ఆండ్రోజెన్ లేక పురుష హార్మోను నిష్పత్తి ఎక్కువవుతుంది. దాంతో పురుషుల నుదురులా పెద్దదైపోవడం... పై పెదవి, చుబుకంపై అవాంఛిత రోమాలు పెరిగే ఆస్కారమూ ఉంటుంది.
కీళ్లూ, కండరాలు: నడివయసులో తరచూ ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు బాధిస్తున్నాయంటారు చాలామంది. వయసు కారణంగా కీళ్లు అరిగిపోవడం సహజమే. మెనోపాజ్‌తో ఎముకల్లోని కొలాజిన్ తగ్గిపోవడంతో ఆ ఇబ్బందులు మరింత వేధిస్తాయి. మెనోపాజ్ మొదటి అయిదేళ్లలోనే ముప్ఫై శాతం కొలాజిన్ తగ్గిపోతుందని అంచనా.
కళ్లు: ఈస్ట్రోజెన్ హార్మోన్‌కీ, కళ్లకీ దగ్గరి సంబంధం ఉంది. నెలసరి సమయంలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. అంతెందుకు శరీరంలో హార్మోన్లు మార్పు చెందినప్పుడల్లా కంటి తడిలో, చూపులోనూ మార్పులు వస్తాయనేది నిజం. తడి తగ్గిపోయి కళ్ల మంటలు, ఎర్రగా మారడం, నలుసులు.. వంటివి పొడిబారిన కళ్లకు లక్షణాలు. అలాగే ఈ దశలో చత్వారం రావడం కూడా సహజమే. ఈస్ట్రోజెన్ హార్మోన్ శుక్లాలు లేక క్యాటరాక్ట్ నుంచి రక్షణ కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్ తరవాత కాటరాక్ట్ పెరుగుదల ఎక్కువవుతుంది.
బరువు: రుతుక్రమం నెలనెలా అవుతుంటే బరువు పెరగమనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అందుకే మెనోపాజ్ రాగానే బరువు పెరిగాం అనుకుంటారు. సాధారణంగా ఈ వయసులో ఎక్కువ మంది రెండు నుంచి రెండున్నర కేజీల బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి ముఖ్యకారణం.. ఆహారపుటలవాట్లు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడమే.మెనోపాజ్‌తో కండరాల పరిమాణం, బలం తగ్గుతాయి. పెరిగే బరువులో అధికశాతం నడుము, పిరుదుల చుట్టూనే పెరుగుతుందనేది వాస్తవం. ఆహారం విషయంలో నియమాలు, తగిన వ్యాయామం చేస్తే... మునుపటిలా అందమైన ఆకృతి కొనసాగుతుంది.
- ===================================================
mam,namaste. na age 51. periods irregulargaa ayyaka 1 1/2 year taruvaata malli bleeding avutondi. but 4days matrame.. after 45 days malli menses laagaane4 days bleeding ayindi. skan cheste 1.2 sizelo fybroid undannaru.hystrectomy chestamannaru. avasaramaa? telupagalaru..thyroid TSH 9.36 undi .25mg medicine vadutunna..lakshmi.
ReplyDeleteలక్ష్మి గారు స్కాన్ లో పైబ్రాయిడ్ ఉందన్నారు . అదికాక మీరు థైరాయిడ్ మెడిషన్ వాడుతున్నారు. మీకు హిస్టెరక్టమీ అవసరము ఉండదు . కొన్నాళ్ళు వేచి చూడండి . ఒకసారి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోండి.
ReplyDeletemam,namaste. na age 46. periods irregulargaa vasthunnai 2 years back thyroid vachindi 75mg medicine vadutunna.
ReplyDeleteover bleeding avutonte doctor 6months course vadamannaru vadina 6 months regularga vachai .2 months nundi periods raaledu.
mam,namaste. na age 46. periods irregulargaa vasthunnai 2 years back thyroid vachindi 75mg medicine vadutunna.
ReplyDeleteover bleeding avutonte doctor 6months course vadamannaru vadina 6 months regularga vachai .2 months nundi periods raaledu.