ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -(Kidney Care)మూత్రపిండాల జాగ్రత్తల అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఇటీవల జాతీయ కిడ్నీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా తమకి కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు కూడా తెలియదట! ప్రత్యేక లక్షణాలు ప్రారంభ దశలో లేకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు గ్రహించారు. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవాళ్లు.. అంటే డయాబెటిస్, అధిక రక్తపోటు లాంటి వాటితో బాధపడేవారు తరచూ కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవటం అవసరమని అంటున్నారు.
నాష్‌విల్లే, వ్యాండర్ బిల్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వారు 401 మందిని , నెఫ్రాలజిస్ట్‌లతో పరీక్షించారు. వీరిలో డెబ్బై ఐదు శాతం మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ 3వ దశలో ఉంది. 94 శాతం మందిలో మూత్రపిండాల ఇబ్బంది ఉందని తేలింది. వీరిలో 30 శాతం మందికి తమకి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఇందుకు అవగాహనా రాహిత్యమే కారణమంటున్నారు పరిశోధకులు.
అందుకే మూత్రపిండాల నిర్మాణం గురించి, అవి చేసే పనుల గురించి, అవి దెబ్బతినే కారణాల గురించి, దెబ్బ తినకుండా తీసుకునే చర్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాకుండా పరిశోధకులు 34 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అభ్యర్థులకిచ్చారు. వాటివల్ల తేలిందేంటంటే 78 శాతం మందికి లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి వృద్ధి చెందుతుందని. ఇంకా విచిత్రమేమిటంటే 32 శాతం మందికి మూత్రం కిడ్నీల ద్వారానే వస్తుందని తెలియదు.
‘కిడ్నీ డిసీజ్ చాలా సైలెంట్‌గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, వంశపారంపర్య చరిత్ర ఉన్నవారు తరచూ కిడ్నీ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాల’ని అంటున్నారు పరిశోధకుల్లో ఒకరైన డా.జోసఫ్ వ్యాసలోటి.
సకాలంలో వ్యాధి ఉన్నట్లు గుర్తించగలిగితే కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్, రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కొన్ని మందులు మూత్రపిండాలకి హాని కల్గిస్తాయి. అందుకని ఏ మందులు పడితే ఆ మందులు వైద్యుని సలహా లేకుండా తీసుకోకూడదు. ఈ జాగ్రత్తలతో మూత్రపిండాల వ్యాధులు ప్రబలకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.
అపరిశుభ్రత వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది తరచూ ఈ ఇబ్బందికి లోనవుతుంటారు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్స్, మూత్రపిండాలలో రాళ్లు లాంటివి కలుగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డేకి ప్రధానాంశం "కిడ్నీ జబ్బులతో గుండెకు ప్రమాదం" అని, గుండెకి అధిక రక్తపోటుకి సంబంధం ఉంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు వస్తే నొప్పి కూడా తెలియదు డయాబెటిస్ ఉన్నవారికి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇదే కాదు మూత్రపిండాల జబ్బులు సైలెంట్ కిల్లర్స్ తీవ్రమయ్యే వరకూ ఎటువంటి లక్షణాలు కనిపించవు. అలాగే అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రభావం కిడ్నీల మీదా ఉంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే ఈ అనారోగ్య ప్రభావం క్రమంగా గుండె మీదా పడే అవకాశముంది. అందుకని కిడ్నీల ఆరోగ్యం జాగ్రత్త. కిడ్నీ ఆరోగ్యంతోపాటు గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అని హెచ్చరిస్తుంది ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే.
మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.
-నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.
-గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు చెడు :
-మన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.
కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు :
-టైప్-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్- 2 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.
1. మూత్రంలో అల్బుమిన్ : అల్బుమిన్ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.
2. రక్తంలో సిరమ్ క్రియాటిన్ : మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని ( ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్-ఈజీఎఫ్‌ఆర్(ను లెక్కించి... కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్ క్రియాటినైన్ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్ క్రియాటినైన్ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్’ లెక్కిస్తారు.
3. బ్లడ్ యూరియ : కిడ్నీ పనితనము తగ్గిందంటే రక్త్మ లో యూరియా శాతము పెరిగిపోతుంది . ఇది సాదారణము గా 40 మి.గ్రా/100 మి.లీ లోపు ఉంటుంది . దీని స్థాయిని బట్తి మనము మూత్ర పిండాల సామర్ధ్యము తెలుసుకోవచ్చును .
కిడ్నీలను కాపాడుకోవాలంటే?
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.
- updates :
'దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి' అంటే..?
స్థూలంగా చెప్పుకోవాలంటే.. మన కిడ్నీలు దెబ్బతిని, వాటి వడపోత సామర్థ్యం క్రమేపీ తగ్గిపోతుండటం! మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఏ తీరుగా ఉందో తెలుసుకునేందుకు 'జీఎఫ్‌ఆర్' (గ్లోమరులో ఫిల్టరేషన్ రేట్) అనేది లెక్కిస్తారు. ఈ వడపోత సామర్థ్యం నిమిషానికి కనీసం 90 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అంతకు మించి తగ్గుతుంటే కిడ్నీ సామర్థ్యం తగ్గుతోందని అర్థం. ఇది 60 ఎంఎల్ కంటే తక్కువుంటే 'దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి(సీకేడీ)'గా అనుమానిస్తారు, మూడు నెలల కాలంలో పలుమార్లు పరీక్షించినా ఇలాగే ఉంటే 'సీకేడీ'గా నిర్ధారిస్తారు. అయితే కొన్నిసార్లు వడపోత సామర్థ్యం బాగానే ఉన్నా.. అంటే 'జీఎఫ్‌ఆర్' తగ్గినా తగ్గకున్నా కూడా.. వీడకుండా మూత్రంలో సుద్ద (ప్రోటీను) పోతున్నా, మూత్రంలో రక్తం పడుతున్నా.. వారిని కూడా 'సీకేడీ' బాధితులుగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇలా వడపోత సామర్థ్యం తగ్గటం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతూ నానారకాల బాధలు మొదలవుతాయి, చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ ముప్పు ఎక్కువగా ఉన్నవారు.. ముందు నుంచే కిడ్నీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అవసరం.
సీకేడీ: కారణాలేమిటి?
ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం, అధిక రక్తపోటు! ఈ రెండింటి కారణంగానే అధిక సంఖ్యాకులు దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు బారినపడుతున్నారు. ఇవి కాకుండా మూత్రంలో సుద్ద (ప్రోటీను) పోతున్నవారు, పుట్టుకతో మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలున్నవారు, కిడ్నీల్లో నీటితిత్తుల వంటివి ఉన్నవారు.. వీరందరికీ కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
ఇవే కాకుండా..
* మూత్రనాళ ఇన్ఫెక్షన్లు: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కిడ్నీకి పాకి (పైలోనెఫ్రైటిస్) దానివల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు. దీనివల్ల కిడ్నీ విఫలమయ్యే ముప్పూ ఉంటుంది. మధుమేహుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువేం కాదుగానీ.. అవి వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
* ప్రోస్టేటు: పురుషుల్లో పెద్దవయసుకు వచ్చేసరికి ప్రోస్టేటు గ్రంథి పెద్దదై (బీపీహెచ్)... దానివల్ల మూత్రం ధార తగ్గి.. కొంత మూత్రం లోపలే నిల్వ ఉండిపోతుంటుంది, కొన్నిసార్లు వెనక్కిపోతుంది కూడా. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి కిడ్నీలు దెబ్బతిని, వ్యాధిగ్రస్తం కావచ్చు.
* రాళ్లు: కిడ్నీల్లో రాళ్ల వల్ల మూత్ర ప్రవాహం, పీడనాల్లో తేడాలొచ్చి.. అది వెనక్కి ప్రవహించి.. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చి.. అవి దీర్ఘకాలిక వ్యాధిలోకి వెళ్లే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు కిడ్నీలకు క్షయ, కిడ్నీ క్యాన్సర్ వంటి వాటి వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు.
* వయసు: మధుమేహం, అధిక రక్తపోటువంటివేమీ లేకున్నా కూడా.. సహజంగానే వయసుతో పాటు మన కిడ్నీల పనితీరు తగ్గుతుంటుంది. అందువల్ల వృద్ధాప్యానికి దగ్గరపడుతున్న వారిలోనూ సీకేడీ ఎక్కువ.
* మందులు: కొన్ని రకాల ముందులు, ముఖ్యంగా నొప్పి నివారిణి (ఎన్‌ఎస్‌ఏఐడీ) మందులు, కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినొచ్చు.
* గతంలో కిడ్నీ వైఫల్యం: ఆపరేషన్లు, గర్భం-కాన్పులు, తీవ్రమైన నీళ్ల విరేచనాలు, గుండె జబ్బులు.. ఇలాంటి సందర్భాల్లో కొందరికి ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమయ్యే అవకాశాలుంటాయి. దీన్నే 'అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్' అంటారు. ఇలాంటివారు డయాలిసిస్ వంటి చికిత్సలతో సత్వరమే పూర్తిగా కోలుకున్నా కూడా... కిడ్నీ ఒకసారి దెబ్బతిన్నది కాబట్టి భవిష్యత్తులో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుదని మర్చిపోకూడదు. వీరు జీవితాంతం మూత్రపిండాల ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉండటం అవసరం.
* యూరిక్ ఆమ్లం: రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉన్న వారికి (హైపర్ యూరిసీమియా) దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వీరిలో కొందరికి కీళ్లు వాచే 'గౌట్' సమస్యా ఉండొచ్చు. కాబట్టి గౌట్ బాధితులు కూడా కిడ్నీ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* కుటుంబ చరిత్ర: కుటుంబంలో మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ జబ్బుల వంటివి ఉన్నవారు కూడా.. కిడ్నీ వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించి.. ముందు నుంచే పరీక్షలు చేయించుకోవటం అవసరం.
* వూబకాయం: వూబకాయుల్లో కిడ్నీల మీద వడపోత భారం ఎక్కువ అవుతుంది. దీనివల్లా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు.
* గుండె జబ్బు: దీర్ఘకాలంగా గుండె జబ్బులున్న వారిలో రక్తపీడనంలో తేడాలు వచ్చి.. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. (కార్డియో రీనల్ సిండ్రోమ్) గుండె రక్తనాళాలను దెబ్బతీసే అంశాలే కిడ్నీలనూ దెబ్బతియ్యచ్చు.
చికిత్స ఏమిటి?
* మధుమేహం ఉన్నవాళ్లు, హైబీపీ ఉన్నవాళ్లు వాటిని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవటం ప్రధానం. కిడ్నీ వ్యాధి ఆరంభమైందని నిర్ధారణ అయితే 'ఏసీఈ ఇన్‌హిబిటార్', 'ఏఆర్‌బీ' రకం మందులు సిఫార్సు చేస్తారు. ఇవి హైబీపీనీ, కిడ్నీ జబ్బునీ రెంటినీ నియంత్రించుకోవటానికి ఉపకరిస్తాయి. కొంత వరకూ మధుమేహ నివారణకూ ఉపకరిస్తాయి. వీరిలో కొలెస్ట్రాల్ వంటివీ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి 'స్టాటిన్స్' రకం మందులూ ఇస్తారు. వీటివల్ల మూత్రపిండ వ్యాధిలోకి వెళ్లకుండా ఉంటారు.
* వూబకాయులు బరువు తగ్గటంతో పాటు మెట్‌ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. మధుమేహుల్లోనూ ఇది కిడ్నీ వ్యాధిని నివారించటానికి ఉపయోగపడుతుంది.
* పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటిని ఆపెయ్యాలి.
* ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ల వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. విటమిన్ ఇ, సి తీసుకోవటం కూడా ఉపయోగపడే అంశమే.
అవగాహనతో చక్కటి పోషకాహారం తీసుకోవటం, రోజూ కొద్దిపాటి వ్యాయామం, బీపీ మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉండటం.. ఇవన్నీ ముఖ్యం. వీటివల్ల కిడ్నీ వ్యాధి ఉన్నా.. చాలాకాలం సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవితం గడపొచ్చు.
ఆహారంపై శ్రద్ధ ముఖ్యం!
మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఆహారంలో మాంసకృత్తులు (ప్రోటీను) తక్కువగా తినాలి. శాకాహార ప్రోటీను కంటే కూడా మాంసాహార ప్రోటీను వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి శాకాహార ప్రోటీను తీసుకోవటం, దాన్నీ తక్కువగానే తీసుకోవటం మంచిది. జంతుసంబంధ ప్రోటీనులో కూడా- 'హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్' అనేవి ఉంటాయి.. ముఖ్యంగా పాలు, గుడ్డులో తెల్లసొన వంటివి. వీటిని తీసుకోవచ్చు, అదీ మితంగానే! ఇలా ప్రోటీన్లను తగ్గించి తినటాన్ని 'లోప్రోటీన్ డైట్' అంటారు. కొందరికి వీటిని ఇంకా తగ్గించటం (వెరీ లోప్రోటీన్ డైట్) కూడా బాగా ఉపయోగపడుతుందని గుర్తించారు, కాకపోతే వీరికి బయటి నుంచి కొన్ని పోషకాలను తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వీరు పోషకాహార లోపంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
* పిండి పదార్థాలు: ప్రోటీను పదార్థాలు బాగా తగ్గించినా.. వీరు ఆహారపరంగా శక్తి దండిగా అందించే పదార్థాలు (క్యాలరీలు) తీసుకోవటం అవసరం. లేకపోతే శరీరం శక్తి కోసం వీరిలోని ప్రోటీనును వాడుకోవటం మొదలవుతుంది. దీనివల్ల కిడ్నీల మీద భారం మరింతగా పడుతుంది. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా పిండి పదార్థాల వంటివి తగినంతగా తీసుకోవాలి.
* కొవ్వు: నూనె, నెయ్యి వంటివి బాగా తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ వ్యాధి బాధితుల్లో చాలామందికి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటివీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొవ్వులను మితంగా తీసుకోవాలి.
* ఉప్పు: హైబీపీకి ప్రధాన సమస్య ఉప్పు. హైబీపీ లేకపోయినా కూడా కిడ్నీ జబ్బులుంటే మాత్రం ఉప్పు తగ్గించుకోవాల్సిందే. (కొంతమందిలో మాత్రం కొన్ని రకాల లవణాలు ఎక్కువ పోతుండే నెఫ్రోపతి సమస్యలుంటాయి, వారికి మాత్రం ఉప్పు నియంత్రణ అవసరం ఉండదు, వారు వైద్యుల సలహా సూచనల మేరకు నడుచుకోవాలి.)
* పొటాషియం: పొటాషియంను ఒంట్లోంచి బయటకు పంపటంలో ప్రధాన పాత్ర కిడ్నీలదే. కాబట్టి కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు పొటాషియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే.. అది బయటకుపోక.. ఒంట్లోనే పేరుకుని రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఈ పొటాషియం- పండ్లు, కొబ్బరి నీళ్లు, పప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. కొన్ని కూరగాయల్లోనూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి పొటాషియం చాలా ఎక్కువగా ఉండే పదార్థాలేమిటో చూసుకుని, వాటికి దూరంగా ఉండటం ముఖ్యం. లేకపోతే వీరికి కండర పక్షవాతం, గుండె లయ సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
* కూరగాయలు: కూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చిన్నముక్కలుగా తరిగి, నీళ్లలో కొంతసేపు నానబెట్టి.. ఆ నీళ్లు పారబోసేసి అప్పుడు వండుకు తినాలి. దీన్నే 'లీచింగ్' అంటారు.
* కిడ్నీ వ్యాధి ఏ దశలో ఉన్నా కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించటం అవసరం. ముఖ్యంగా మూడో దశ నుంచీ మరింత కచ్చితంగా పాటించటం అనివార్యం.
కిడ్నీలు విఫలమైపోతే..?
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఐదో దశలోకి వెళితే.. కిడ్నీలు దాదాపుగా విఫలమైపోయాయని అర్థం. ఇక వీరికి కృత్రిమంగా రక్తశుద్ధి చేసే 'డయాలసిస్' చికిత్స తప్పనిసరి అవుతుంది. లేదంటే కిడ్నీ మార్పిడి చెయ్యాల్సి వస్తుంది.
* డయాలసిస్‌లో- హీమో, పెరిటోనియల్ అని రెండు రకాలుంటాయి. మొదటి రెండేళ్లూ పెరిటోనియల్ డయాలసిస్‌కు వెళ్లొచ్చు. ఎందుకంటే అప్పటికి ఇంకా కొంత కిడ్నీ పనితీరు మిగిలే ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత డయాలసిస్ నాణ్యతను బట్టి హీమోడయాలసిస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
హైబీపీ, మధుమేహంతో కిడ్నీ జబ్బెందుకు?
మన కిడ్నీల్లో 'గ్లోమరులస్' అనే చిన్న విభాగాలు లక్షల్లో ఉంటాయి. ప్రధానంగా రక్తాన్ని శుద్ధిచేసే వడపోత విభాగాలివే. హైబీపీ ఉన్నవారికి రక్తం పీడనంతో వీటిలోకి వెళ్లటంతో వీటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో వీటి గోడలు మందంగా తయారై (స్ల్కిరోసిస్).. వడపోత తగ్గిపోవటం మొదలవుతుంది. అలాగే మధుమేహుల్లో రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తం వడపోత కోసం గ్లోమరులస్‌లోకి వెళ్లినప్పుడు.. ఇది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. దీంతో ప్రోటీను పోవటం ఆరంభమై.. కిడ్నీల వడపోత సామర్థ్యం దెబ్బతినిపోతుంది.
సీరం క్రియాటినైన్ ఒక్కటే చాలదు
చాలామంది సీరం క్రియాటినైన్ చూస్తే.. దాన్లో కిడ్నీ పనితీరు తెలిసిపోతుందని భావిస్తుంటారు. క్రియాటినైన్ బాగుంటే కిడ్నీలు బాగున్నట్టుగానే పరిగణిస్తుంటారు. కానీ ఇది సరికాదు. నిజానికి క్రియాటినైన్ పెరగటం ఆరంభమయ్యే సరికే కిడ్నీలు కొంత దెబ్బతిని ఉంటాయని గుర్తించాలి. కిడ్నీల పనితీరు సామర్థ్యం ప్రభావితమైనా కూడా వెంటనే క్రియాటినైన్‌లో అది ప్రతిఫలించకపోవచ్చు. అందుకే 'ఈజీఎఫ్‌ఆర్' పరీక్ష మీద ఆధారపడటం మంచిది.
--Dr.K.V.Dakshinamurty - Nephrologist ,Hyderabad.
- ===========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.