Sunday, February 12, 2012

Crying in infants , చిన్న పిల్లల ఏడుపు

  • image : courtesy with Eenadu News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - చిన్న పిల్లల ఏడుపు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఒక్కోసారి పిల్లలు గుక్కలుపెట్టి ఏడుస్తుంటారు... ఏం చేసినా ఆగరు.. మన గోడు పట్టించుకోరు. ఎందుకేడుస్తున్నారో.. ఆ బాధ ఏమిటో అర్థంకాదు. ఏం చెయ్యాలో పాలుపోదు. ఆ ఏడుపు చూసి చివరికి ఇంట్లోని పెద్దలూ కళ్ల నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంతకీ పిల్లలు ఇలా గుక్కలుపెట్టి.. విడవకుండా ఏడుస్తున్నారంటే.. దానర్థం ఏమిటి..? వాళ్లెందుకలా ఎందుకు ఏడుస్తున్నట్టు? దీనికి సర్వసాధారణ కారణాలు.. కడుపు నొప్పిగానీ, తలనొప్పిగానీ అనుకోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యల కారణంగా ఏడుపు ఆరంభించే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే పాప ఏడిచిందంటే అర్థం ఏమిటో.. కాస్తయినా అవగాహన పెంచుకోవటం ఉత్తమం!

నొప్పి.. ప్రాణి సహజం. పెద్దలకు మాత్రమే పరిమితం కాదు.. చిన్నపిల్లల్లోనూ రకరకాల నొప్పులు రావొచ్చు. వీరిలో తరచుగా కనిపించేవి కడుపునొప్పి, తలనొప్పి. అయితే వీరిలో ఆ నొప్పి ఎందుకు వస్తోంది? దానికి మూలం ఎక్కడ? అనేవి కనుక్కోవటం చాలా అవసరమేగానీ అదంత తేలిక కాదు. కుటుంబ సభ్యులకే కాదు.. కొన్నిసార్లు డాక్టర్లకూ వీటిని పోల్చుకోవటం కష్టమవుతుంటుంది. ముఖ్యంగా 5 నెలల్లోపు పిల్లల్లోనైతే పసిగట్టటం మరీ కష్టం. ఎందుకంటే ఏడవటం తప్ప పైకి వీళ్లేమీ చెప్పలేరు. కీలకమైన సంకేతాలూ ఉండవు. కేవలం పిల్లల ప్రవర్తన, చేష్టలతోనే అంచనా వేయాల్సి ఉంటుంది.

వేధించే కడుపునొప్పి : పిల్లల్లో కనిపించే నొప్పుల్లో ప్రధానమైంది కడుపునొప్పి. దీనికి చిన్న చిన్న కారణాలతో పాటు తీవ్రమైన సమస్యలూ కారణం కావొచ్చు. మామూలుగా వచ్చే కడుపునొప్పి త్వరగానే తగ్గిపోవచ్చు. కానీ వీటికి గల కారణమేంటో నిర్ధరించుకోవటం తప్పనిసరి.

* ఇన్‌ఫెక్షన్లు: వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు కడుపునొప్పిని తెచ్చిపెట్టొచ్చు. వీటితో వాంతులు, విరేచనాల వంటి సమస్యలు మొదలవ్వచ్చు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు త్వరగానే నయమవుతాయి. అయితే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు తగు యాంటీబయోటిక్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.

* పొట్టలో పురుగులు: ఏలికపాములు, నులిపురుగుల వల్ల కూడా కడుపునొప్పి రావొచ్చు. అపరిశుభ్ర ఆహారపుటలవాట్లే దీనికి దోహదం చేస్తాయి. కొన్నిసార్లు ఈ పురుగులు పేగుల్లో అడ్డంపడి, పేగులను చీల్చుకొని కడుపులోకి ప్రవేశించే ప్రమాదమూ లేకపోలేదు. అప్పుడు ప్రాణాంతకంగా పరిణమించొచ్చు.

* కలుషితాహారం: నిల్వ చేసిన, అపరిశుభ్ర ఆహారం తినటమూ కడుపు నొప్పికి దారితీస్తుంది. సరిపడని ఆహారం, ఎక్కువగా తినటం, లేదా గ్యాస్‌ సమస్యలతో పొట్ట ఉబ్బరం, వాంతులు, విరేచనాల వంటివీ పిల్లలకు ఈ ఇబ్బందిని తెచ్చిపెడతాయి.

* డయేరియా: పిల్లల్లో కడుపునొప్పితో పాటు నీళ్ల విరేచనాలు కూడా తరచుగా కనబడే సమస్యే. ఇది చాలావరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల మూలంగానే వస్తుంది. సాధారణంగా ఇది 72 గంటల్లో (మూడు రోజులు) తగ్గుతుంది కానీ కొన్నిసార్లు చాలా రోజుల పాటు వేధించొచ్చు. కొందరిలో మలంలో రక్తమూ పడొచ్చు. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌కు చూపించాలి. తాత్సారం చేయరాదు.

* వృషణాల్లో నొప్పి: కొందరు మగపిల్లలు వృషణాల్లో వచ్చే నొప్పిని కడుపు నొప్పిగా పొరపడుతుంటారు. నొప్పి కలుగుతున్న భాగాన్ని చెప్పలేక కడుపులో నొప్పి వస్తుందని చెబుతుంటారు. వృషణాలు మడత పడటం (టార్షన్‌)తో దానికి రక్తసరఫరా జరగక ఇలాంటి నొప్పి వస్తుంటుంది. దీన్ని తర్వగా గుర్తిస్తే తేలికగా చికిత్స చెయ్యచ్చు. జాప్యమైనకొద్దీ నష్టం జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు కడుపు నొప్పి వస్తోందని అంటే వృషణాల్లో ఏమైనా నొప్పి పుడుతోందా? అని అడగటం తప్పనిసరి.

* దద్దుర్లు: కడుపునొప్పిని తెచ్చిపెట్టే కొన్ని తీవ్ర సమస్యలతో చర్మంపై దద్దుర్లు కూడా కనబడతాయి. కాబట్టి కడుపునొప్పితో పాటు దద్దుర్లు కనిపిస్తే నిర్లక్ష్యం పనికిరాదు.

* విషపూరితాలు: పిల్లలు కొన్నిసార్లు సబ్బులను తినటం, రంగులను నోట్లో పెట్టుకోవటం వంటివి చేస్తుంటారు. దీంతో అందులోని రసాయనాలు కడుపులోకి వెళ్లి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. ఐరన్‌ మాత్రలు, జ్వరానికి వాడే అసిటమినోఫెన్‌ మాత్రల వంటి వాటిని పొరపాటున మింగటం కూడా కడుపునొప్పికి దారితీయొచ్చు.

* మలబద్ధకం: పీచు తక్కువగా ఉండే ఆహారంతో పిల్లల్లో తీవ్రమైన మలబద్ధకం ఏర్పడి కడుపునొప్పి రావొచ్చు. ఇది చాలావరకు కడుపు ఎడమ భాగంలో వస్తుంటుంది.

* శస్త్రచికిత్స సంబంధమైనవి: వీటిల్లో ముఖ్యమైంది అపెండిక్స్‌ వాపు. అలాగే కడుపులో మిసెంట్రిక్‌ లింఫ్‌ అడినైటిస్‌, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, మలబద్ధకం, పేగులు మడత పడటం, పేగుల్లోని ఒక భాగం మరో భాగంలోకి చొచ్చుకొనిపోవటం, మెకల్స డైవెర్టికులైటిస్‌.. కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమమస్యలు, కడుపులో కణితులు.. వంటి సమస్యలకు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కామెర్ల వంటి వాటికీ ఆపరేషన్‌ అవసరపడొచ్చు.

* మూత్ర సమస్యలు: మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూడ్రపిండాల వాపు, మూత్రపిండాల్లో విల్మ్స్‌ కణితులు కూడా కడుపునొప్పిని కలిగిస్తాయి.

* ఇతర సమస్యలు: పెరిటినైటిస్‌, పాంక్రియాటైటిస్‌, మూత్రపిండాలకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, మధుమేహం, పర్పూర, ఎరిత్రోమైసిన్‌ వంటి మందులు తీసుకోవటం వల్ల వచ్చే కడుపునొప్పి.. ఊపిరితిత్తుల్లో వచ్చే నొప్పి, నిమోనియా, ప్లూరసీ, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు.. మానసిక సంబంధ నొప్పి.. వీటిలో కూడా నొప్పి ఉండొచ్చు.

నాటు వైద్యం వద్దు
చిన్నపిల్లల్లో కడుపునొప్పి, తలనొప్పి ఉన్నట్టు అనుమానం కలిగిన వెంటనే ముందు శిశు/కుటుంబ వైద్యుడికి చూపించాలి. నాటువైద్యం పనికిరాదు. కామెర్ల వచ్చాయని కళ్లల్లో ఆకురసం పోయించటం, వాతలు పెట్టించటం, తావీదులు కట్టించటం వంటివి అసలే చేయరాదు. చిన్నపిల్లలు ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు కాబట్టి నిర్లక్ష్యం అసలు పనికిరాదు. కారణాన్ని కచ్చితంగా నిర్ధారణ చేయటమూ తప్పనిసరి. అవసరమైతే ఎక్స్‌రే, రక్త పరీక్షలు, కాలేయ పరీక్షలు, అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌ వంటివీ చేయాల్సి రావొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా చిన్నపిల్లల్లో నొప్పికి తగు కారణాన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించి వెంటనే చికిత్స చేయాలని మరవరాదు.

వయసును బట్టి స్పందనలు, సంకేతాలు
* నెలలోపు పిల్లలు నొప్పిని ఏమాత్రం భరించలేరు. నొప్పికి చాలా తీవ్రంగా స్పందిస్తారు. వీరికి నొప్పి వస్తే శరీరం మొత్తాన్ని కదిలించటంతో పాటు బాగా గుక్కపెట్టి ఏడుస్తారు.
* నెలాఖరుకల్లా నొప్పిగా అనిపించినప్పుడు శరీరంలో కొంత భాగాన్ని కదిలించటం ఆరంభిస్తారు.
* 3-4 నెలల పిల్లలు నొప్పి వస్తున్న భాగాన్ని కొద్దిగా గుర్తించగలరు. కాళ్లు లాక్కోవటం, మల విసర్జన చేయటం, వెక్కిళ్లు పెట్టటం, వాంతులు చేసుకోవటం వంటివి చేస్తారు.
* 6 నెలల తర్వాత పిల్లలు నొప్పికి సంబంధించి- గత అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవటం, అందుకు తగ్గట్టుగా స్పందించటం నేర్చుకుంటారు. కాబట్టి బాగా ఎదిరించే ప్రయత్నం చేస్తారు. డాక్టర్లను చూడగానే భయంతో మరింత ఏడ్చేస్తారు. వారి నుంచి దూరంగా వెళ్లాలని చూస్తుంటారు. నర్సులు దగ్గరికి వస్తే ఏడవటం, తోసేయటం వంటివి చేస్తారు.

పెద్దపిల్లల్లో సైగలు
పాకే వయసులో పిల్లలకు నొప్పి వస్తే ఫలానా చోట నొప్పి ఉన్నట్టు సైగలు చేస్తారు. అంతకు ముందు నొప్పి కలిగిన నాటి జ్ఞాపకం, శారీరక ప్రతిఘటన, భావాల వంటి వాటిని జోడించి.. ఆ భాగాన్ని వెనక్కి లాక్కునేందుకు ప్రయత్నిస్తారు. దంతాలు బిగపట్టటం, అటూఇటూ దొర్లటం, విపరీతంగా ఏడవటం, కోపంతో ప్రవర్తించటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇంకాస్త పెద్దగా అవుతుంటే నొప్పి కలుగుతున్న భాగాన్ని స్పష్టంగా గుర్తించి, చూపించగలుగుతారు. ఎక్కడ నొప్పి కలుగుతుందో చెప్పమంటే వేలితో చూపిస్తారు కూడా. బడికి వెళ్లే వయసు వచ్చేసరికి నొప్పి గురించిన పూర్తి అవగాహన అంటూ ఉండదు గానీ.. దాని గురించి చెప్పగలిగే స్థాయికి చేరుకుంటారు.

లక్షణాలే ఆధారం
నొప్పికి కారణమేంటో స్పష్టంగా తెలియని సందర్భాల్లో కొన్ని లక్షణాలను బట్టి నిర్ధారణ చేసే అవకాశం ఉంది.
1. తల నుంచి కాళ్ల వరకు శరీరం మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించటం.
2. పిల్లాడు చిరాకు పడుతున్నాడా? అస్థిమితంగా ఉన్నాడా? శరీరంలో ఏ భాగాన్నైనా రుద్దుకుంటున్నాడా? వంటి చేష్టలను గమనించటం.
3. గుండె ఎలా కొట్టుకుంటోంది? ఎన్నిసార్లు కొట్టుకుంటోందనేవి చూడటం.
4. శ్వాస తీసుకునే విధానం ఎలా ఉందోనని పరిశీలించటం.
5. చెమట ఎక్కువగా పోస్తోందా అని గమనించటం.
6. ముఖం నల్లబడటం, కనుపాప పెద్దది కావటం వంటి ముఖ కవళికలను పరీక్షించటం అవసరం.

భయంతోనూ వెనకడుగు
మాట్లాడే వయసులో కొందరు పిల్లలు నొప్పి కలుగుతున్నా బయటికి చెప్పటానికి ఇష్టపడరు. ఎక్కడైనా దెబ్బ తగిలితే.. తల్లిదండ్రులు కోప్పడతారనో, డాక్టర్‌ దగ్గరికి వెళ్తే సూది ఇస్తారనో భయపడి ఆ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పటానికి వెనకాడతారు. ఇలాంటి సమయంలో 'వాంగ్‌-బేకర్‌ ఫేసెస్‌ పెయిన్‌ రేటింగ్‌' కొలమానం బాగా ఉపయోగపడుతుంది. దీంతో నొప్పి తీవ్రతను పసిగట్టొచ్చు. అంకెలు, పదాలు, రంగులు, ముఖ కవళికలు, నడవడి వంటి వాటితో నొప్పి స్థాయిని గ్రహించొచ్చు.
* నెలలోపు పిల్లలు నొప్పి వచ్చినపుడు కళ్లు గట్టిగా మూసుకుంటారు. నోరు వెడల్పుగా తెరుస్తారు. నుదురు చిట్లిస్తారు. ముక్కు రంధ్రాలను వేగంగా కదిలిస్తారు. చెవిలో నొప్పి పుడుతుంటే చెవులు లాక్కొంటారు. తలనొప్పిగా ఉంటే తలను ఒక వైపు నుంచి మరోవైపునకు తిప్పుకుంటారు. ఒకేవైపు పడుకొని, కాళ్లు పొట్టలోకి ముడుచుకొంటారు. నొప్పి ఉన్న భాగాన్ని కదల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.


కలవరపెట్టే తలనొప్పి : పెద్దలకు వచ్చినట్టుగానే పిల్లలకూ తలనొప్పి వస్తుంది. అయితే నొప్పి తీవ్రత, లక్షణాల్లో కొంతమేరకు తేడా కనబడుతుంది.

* పార్శ్వనొప్పి: ఇది పెద్దలకు తలకు ఒక భాగంలోనే వస్తే.. పిల్లల్లో రెండు వైపులా ఉంటుంది. వాంతులు, కడుపునొప్పి కూడా ఉంటాయి. చప్పుళ్లకు, వెలుతురుకు విపరీతంగా స్పందిస్తారు. మరీ చిన్నపిల్లలైతే అకారణంగా ఏడుస్తుంటారు కూడా. ఈ సమయంలో తల పట్టుకుంటారు. ఈ నొప్పి కొద్దిసేపే ఉండిపోతుంది.
* టెన్షన్‌ తలనొప్పి: ఇందులో రెండు కణతల దగ్గర బాగా నొక్కినట్టుగా నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి అంత తీవ్రంగా ఉండదు. వాంతులు అవకపోతే త్వరగానే తగ్గుతుంది. ఇది పార్శ్వనొప్పి కూడా అయ్యిండొచ్చు.
* క్లస్టర్‌ తలనొప్పి: రోజుకి ఐదు కన్నా ఎక్కువసార్లు.. అలా 5-8 రోజుల పాటు తలనొప్పి అనిపిస్తే క్లస్టర్‌ నొప్పి కావొచ్చు. ఇందులో అలసట, ముక్కులోంచి నీరు కారటం, చిరాకు పడటం, అస్థిమితంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* మెనింజైటిస్‌: మెదడుపైని మూడు పొరల్లో ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఇది వస్తుంది. తలనొప్పి, జ్వరంతో పాటు వాంతులు అవుతాయి. మెడ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది.
త్వరగా తగ్గేవే
చిన్న చిన్న కారణాలతో వచ్చే కడుపునొప్పి త్వరగానే తగ్గిపోతుంది. గ్యాస్‌తో గానీ, విరేచనాలతో గానీ వచ్చే నొప్పి సాధారణంగా 24 గంటల్లోనే తగ్గుతుంది. ఎలాంటి కడుపునొప్పైనా 24 గంటలు దాటినా తగ్గకపోతే వెంటనే వైద్యుడికి చూపించటం తప్పనిసరి.

* మామూలు కడుపు నొప్పులు చాలావరకు కడుపు మధ్య భాగంలో కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో పిల్లలు బొడ్డు చుట్టూ చేతులను రుద్దుకుంటారు. ఇక ఇతర భాగాల్లో నొప్పి వస్తుంటే తాత్సారం చేయరాదు. ముఖ్యంగా బొడ్డు కింద కుడివైపున నొప్పి వస్తుంటే అపెండిసైటిస్‌ కావొచ్చు. అదే ఎడమవైపున ఉంటే అమీబియాసిస్‌ అయ్యిండొచ్చు. బొడ్డుకు రెండు వైపులా నొప్పి వస్తుంటే మూత్రపిండాల్లో రాళ్లు గానీ కణితి నొప్పి గానీ కావొచ్చు. పక్కటెముక కింది భాగంలో నొప్పి ఉంటే ఫ్లూరసీ గానీ కాలేయానికి సంబంధించిన నొప్పి గానీ కావొచ్చు. ఆడపిల్లల్లో బొడ్డుకు చాలా కింద కటిభాగంలో ఉంటే ఫలోపియన్‌ ట్యూబ్‌ సంబంధ నొప్పి అయ్యిండొచ్చు. కటి వలయంలో చీము కూడా ఉండి ఉండొచ్చు.
* కడుపునొప్పితో పాటు ముఖం పాలిపోవటం, చెమట పోయటం, ఎప్పుడూ నిద్రపోతుండటం లేదా నిస్సత్తువతో మందకొడిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడికి చూపించాలి. ఆడుకుంటున్న సమయంలోనూ నొప్పిని మరచిపోలేకపోవటం, చాలాసేపటి వరకు ఏమీ తినకపోవటం, తాగటానికీ ఇష్టపడకపోవటం వంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయరాదు.
* కడుపునొప్పితో పాటు పిల్లలు చాలాసార్లు వాంతులు కూడా చేసుకుంటారు. ఇది అన్నిసార్లూ తీవ్ర సమస్యలకు సంబంధించింది కాకపోవచ్చు. అయితే నొప్పి వచ్చిన తర్వాత వాంతులు అవుతుంటే తీవ్ర సమస్య ఏమైనా ఉందేమో క్షుణ్ణంగా పరీక్షించాలి. పచ్చ రంగు వాంతులతో కూడిన నొప్పి అయితే పేగుల్లో అడ్డంకులు ఉన్నాయేమోనని అనుమానించాలి. రక్తంతో కూడిన వాంతులు, కడుపునొప్పి ఉంటే పేగుల్లోని కొంత భాగం మరో భాగంలోకి పొడుచుకొని రావటం కారణం కావొచ్చు. ఇలాంటి సమస్యలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.


పరీక్షలు : నొప్పి ఉన్నట్టు అనుమానం కలిగిన వెంటనే పిల్లలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

1. ప్రధాన లక్షణాలు: జ్వరం కనబడితే ఇన్‌ఫెక్షన్‌ లేదా వాపు ఉండొచ్చు. నిమోనియా, మూత్రపిండాల్లో చీము ఉంటే వణుకుతో పాటు జ్వరం కూడా తీవ్రంగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవటం, శ్వాస వేగంగా తీసుకోవటం, రక్తపోటు ఎక్కువగా ఉండటం వంటివి ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లో సమస్యలకు సూచికలు కావొచ్చు.

2. పొట్ట పరీక్ష: పిల్లాడు మాట్లాడుతున్నట్టయితే పొట్టనిండా గాలిని పీల్చుకొని వదలమని చెప్పాలి. దీంతో పొట్టలో ఏ భాగమైనా మిగతా భాగానికన్నా తక్కువగా కదులుతుందేమోననేది తెలుస్తుంది. దీని ద్వారా ఆ భాగంలోని అవయవంలో ఏదైనా సమస్య ఉంటే బయటపడుతుంది. నొప్పి కలుగుతున్న చోట నెమ్మదిగా నొక్కుతుంటే.. 'అబ్బా నొప్పి' అని అంటే ఆ భాగంలోని అవయవంలో సమస్య ఉండొచ్చని అర్థం.

3. మలద్వార పరీక్ష: కొన్నిసార్లు మలద్వారం గుండా లోనికి వేలు పెట్టి పరీక్షించాల్సి రావొచ్చు. దీంతో లోపల పాలిప్స్‌, పేగు చొచ్చుకొని రావటం వంటివేవైనా ఉంటే తెలుస్తాయి.

4. వ్యాధి సంబంధ లక్షణాలు: కామెర్లు వస్తే రక్తం పలుచబడుతుంది. దీన్ని సికిల్‌సెల్‌ ఎరోజన్‌ అంటారు. పక్కటెముక కింద కుడివైపున కొద్దిగా నొక్కి వదిలినపుడు విపరీతమైన నొప్పి వస్తుంటే పిత్తాశయం ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉండొచ్చు. బొడ్డు నీలంరంగులోకి మారితే పొట్టలో ఎక్కడైనా రక్తస్రావం జరుగుతుండొచ్చని అనుమానించాలి.


  • Dr.Hanumantharayadu (paediatric surgen)karnulu_A.P
  • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.