Friday, February 10, 2012

విద్యార్ధులు-పరీక్షల ఆందోళన అవగాహన , Fear of Exams in Students Awareness


  • image : courtesy with Andhra bhoomi news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విద్యార్ధులు-పరీక్షల ఆందోళన అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చాలామంది మంచి విద్యార్థులు పరీక్షల సమయంలో దెబ్బతినడానికి ఆందోళనే అసలు కారణం. పరీక్షల పట్ల పెంచుకున్న భయం, ఫోబియా ఆందోళనకు దారితీస్తుంది. పరీక్షల ఆందోళన మనసుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ దశలో మనసు, శరీరంలో ప్రతికూలతలు చోటుచేసుకుంటాయి. మనో, శారీరక ధర్మాలను గతి తప్పిస్తాయి. దీంతో విద్యార్థిలోని సామర్థ్యాలు దెబ్బతింటాయి. విద్యార్థుల్లో మానసిక అలజడి తలెత్తడానికి చదువుకునే విధానం, దృక్పథం, పరిసరాలు, పరిస్థితులు ప్రధాన కారణాలవుతాయి. ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం, అతిగా ఊహించుకోవడం, ఆందోళన మనస్తత్వం భయాన్ని కలిగిస్తుంది. అలాగే తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వారి ఆతృత, భయాలను పిల్లలపై రుద్ది, ఆందోళన రేకెత్తించడం జరుగుతుంటుంది. ఆత్మన్యూనత, మెతక స్వభావం, సెంటిమెంట్లు ఎక్కువగా వున్నవారు త్వరగా భయం, ఆందోళనకు గురవుతుంటారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేవారు, ప్రతికూలభావాలు ఆలోచనతో ఉన్నవారిలో సులభంగా ఒత్తిడి తలెత్తుతుంది. ఆహార లేమి, నిద్రలేమి, విశ్వాసలేమి, శక్తిహీనత, రక్తహీనత లాంటి పరిస్థితులు ఒత్తిడిని పెంచి పోషిస్తాయి. ఇలా రకరకాల కారణాలవల్ల పరీక్షల భయం, ఆందోళన తలెత్తి సామర్థ్యాలను దెబ్బతీస్తుంటాయి.

ఆందోళన లక్షణాలు గుర్తించాలి
పరీక్షల భయం, ఆందోళన లక్షణాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. చాలావరకు ఈ లక్షణాలను మానసిక, శారీరక, అనారోగ్య లక్షణాలుగా భావిస్తుంటారు. ఆ దృష్టితోనే వైద్యం చేయిస్తుంటారు. పరీక్షల సమయంలో వచ్చే జ్వరం, వాంతులు, విరేచనాలలో అధిక శాతం పరీక్షల భయంవల్ల అన్న విషయం గుర్తించి చికిత్స చేయాలి. సాధారణంగా పరీక్షల సమయంలో మానసిక అశాంతి మొదలవుతుంది. భయం, అసహనం, కోపం, నిరాసక్తి, నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిన భావన కలుగుతుంది. అరచేతుల్లో చెమట, పెదాలు తడారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. తలనొప్పి, జ్వరం, విరేచనాలు అవుతాయి. కడుపులో దేవినట్టు అనిపిస్తుంటుంది. కొంతమంది కళ్ళు తిరిగి క్రిందపడి పోతుంటారు. ఈ నేపథ్యంలో చదివింది మరచిపోవడం, తెలిసిన అంశాలను సరిగా రాయలేక బాధపడటం చేస్తుంటారు.

భయం వీడితే జయం
పరీక్షల భయం వీడితే తప్పకుండా జయం సిద్ధిస్తుంది. పరీక్షల భయం, ఆందోళన అధిగమించడానికి పలు మార్గాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా చదవడం మొదటి సూత్రం. ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి. బట్టీయం, కంఠస్థం చేయడం మాని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే విధానం అలవర్చుకోవాలి. అలా చేయడంవల్ల విషయ పరిజ్ఞానం పెరిగి స్వంతంగా రాయగల నేర్పు స్వంతమవుతుంది. రోజంతా పుస్తకాలకు అతుక్కుపోవడం, రాత్రంతా మేల్కొని చదవడం అసలు చేయరాదు. మధ్య మధ్యలో విరామమిచ్చి, విశ్రాంతి పొందాలి. అప్పుడప్పుడు ఒత్తిడినుంచి ఉపశమనం పొందాలి. సరైన విధంగా పునశ్చరణ చేయడం అలవర్చుకోవాలి. ప్రతి సబ్జెక్టు చదివేలాగా సమయ విభజన చేసుకోవాలి. అర్థంకాని అంశాలను గుడ్డిగా చదవడం మాని టీచర్లు, తల్లిదండ్రులు, స్నేహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పరీక్ష ఏదైనా ఒకటే అన్న విధంగా వుండాలి. మార్కులు తగ్గినా, పెరిగినా సానుకూలంగా స్పందించే స్వభావం అలవర్చుకోవాలి. చక్కటి వ్యాయామం, సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఉపశమన మార్గాలను ఆచరించాలి. తల్లిదండ్రులు, టీచర్లు తమపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేమన్న దిగులుకు చోటివ్వరాదు. పరీక్షల ముందు, అనంతరం స్నేహితులతో చర్చించడం చేయరాదు. పరీక్షల సమయంలో టెన్షన్, ఒత్తిడి తలెత్తినపుడు చదివింది కూడా మరచిపోతుంటారు. అలాంటి సమయంలో దీర్ఘశ్వాసలు తీసుకోవడం, మంచినీళ్లు తాగడంవల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పరీక్షలు రాసే సమయంలో కష్టమైన ప్రశ్నలతో కుస్తీ పట్టడం మాని తెలిసినవాటికి జవాబులు వ్రాయడం చేయాలి. పరీక్షలకు ముందు ధ్యానం, స్వీయ హిప్నాటిజం ద్వారా ఉపశమనం పొందడం చాలా ఉపయోగకరం.


డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి Psychologist
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.