Friday, February 10, 2012

గొంతు(లారింక్స్) క్యాన్సర్ అవగాహన,Throat(Laryngeal) cancer Awareness


  • image : courtesy with Andhra bhoomi news paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గొంతు(లారింక్స్) క్యాన్సర్ అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • Introduction :
ఇటీవల పాటలపై మక్కువ కనబరిచే యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరితో పాటు నిత్యం సంగీత సరస్వతి సాధనలో కుస్తీపడుతూ అటు డబ్బింగ్ ఆర్టిస్టులు, ఇటు నేపథ్యగాయకులతో పాటు సంగీత విద్యాంసులు కూడా గొంతుకకు తమకు తెలియకుండానే అవిరళ శ్రమ కలిగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి వారి స్వరపేటిక దెబ్బతినడం, సున్నితమైన ప్రదేశాల్లో శస్తచ్రికిత్సలు ఇటీవల సాధారణమయ్యాయి. కేవలం ఈ రంగంలోని వారికే కాక ఇతరులూ ఇటువంటి గొంతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గొంతుక సమస్యలను నిర్లక్ష్యం చేసినట్లయితే అది త్రోట్(లారింక్స్) క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలూ లేకపోలేదు. లారింక్స్ అనేది శ్వాసనాళానికి ఉపరితలాన ఉంటుంది. దీనే్న తెలుగులో స్వరపేటిక అంటారు. గొంతులో అతి ముఖ్యమైన ఈ భాగం 2 అంగులాల వెడల్పు కలిగి ఉంటుంది. వోకల్ కార్డ్స్‌ను అనుసంధానం చేయడానికి ఇది తోడ్పడుతుంది. లారింక్స్‌కు ముఖ్యంగా మూడు ఉపభాగాలుంటాయి. వీటిలో పైన ఉన్నదాన్ని సుప్రాగ్లాటిస్, మధ్యలో ఉన్నదాన్ని గ్లాటిస్, కింద ఉన్నదాన్ని సబ్‌గ్లాటిస్‌గా వ్యవహరిస్తారు. లారింక్స్ వల్లనే మనం శ్వాస పీల్చడం, మాట్లాడడం, మింగడం వంటివి చేయగలుగుతాం. సహజంగా లారింక్స్ క్యాన్సర్ లక్షణాలు 55 ఏళ్ళకు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించినా ఇటీవల 30 ఏళ్ళ వారిలో కూడా అటువంటి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

  • గొంతు క్యాన్సర్ కణాలు...
సాధారణంగా కణాలు పెరిగి శరీర అవసరానికి తోడ్పడతాయి. అవి మృతకణాలుగా మారిన సమయంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే, కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా శరీరానికి అవసరం లేకున్నప్పటికీ కొత్తకణాలు పుట్టుకురావడం, దెబ్బతిన్న కణాలు అలాగే ఉండిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రదేశాల్లో గడ్డలు తయారవుతుంటాయి. ఇటువంటి వాటిలో క్యాన్సర్‌కు దారితీసేవి కూడా ఉంటాయి. లారిక్స్ క్యాన్సర్ విషయానికొస్తే లారింక్స్‌లో క్యాన్సర్ కణాలు ఇలా తయారైన గడ్డను ఛేదించుకుంటూ విస్తరిస్తాయి. ఇవి శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముంది. ఒకవేళ మీకు లారింక్స్ క్యాన్సర్ ఉన్నట్లు తేలితే, దానికి కారణాలను ఒక్కోసారి వైద్యులు కూడా నిర్ధారించలేని పరిస్థితి ఉంటుంది. పొగాకు ఉత్పత్తులను చాలా కాలం ఉపయోగించినా, అతిగా మద్యం సేవించినా ఈ వ్యాధి బారిన పడే అవకాశముంది. ఇవే కాక గొంతులో హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయా అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. గుండె నుంచి గొంతుకు ఏదైనా ద్రవం బ్యాక్‌వర్డ్ ఫ్లో కారణంగా కూడా వ్యాధి కారకాలకు ఒకటిగా భావిస్తున్నారు.

  • లక్షణాలు...
నెలరోజులకు పైబడినా తగ్గని గొంతులో గరగర, ఏది తిన్నా మింగలేనంత గొంతునొప్పి, మెడలో ముద్దలా తయారవడం వంటివి గొంతు క్యాన్సర్‌కు ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. శ్వాసపీల్చడంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక చెవిపోటు, దగ్గు వంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా వ్యాధి నిర్ధారణ ప్రాథమిక దశలో జరిగితే సులువుగా నయం అయ్యే అవకాశాలున్నాయి. ఇన్‌డైరెక్ట్ లారింగోస్పోపి, డైరెక్ట్ లారింగోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధి సోకిందా లేదా అనే విషయం తెలుసుకోవడంతో పాటు వ్యాధి తీవ్రతను కూడా నిర్ధారించవచ్చు. ప్రాథమిక దశలో ఉన్న గొంతు క్యాన్సర్(స్టేజి 0, 1, 2) సాధారణంగా ఒక చిన్న గడ్డలా ఉండి క్యాన్సర్ కణాలనేవి రక్తంలో తెల్లకణాలు కలిగిన ద్రవం ద్వారా వ్యాపిస్తాయి. అలాగే, స్టేజి 3, 4గా చెప్పబడే అడ్వాన్స్డ్ క్యాన్సర్ రక్తప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపింపజేస్తుంది.

  • చికిత్స...
సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా లారింక్స్ క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు. అడ్వాన్స్డ్ దశలో ఉంటే రెండు, మూడు చికిత్సా విధానాలను కలిపి ఉపయోగిస్తారు. అయితే, ఇవి రోగి శరీర పరిస్థితి, రోగనిరోధకశక్తి, క్యాన్సర్ తీవ్రతను బట్టి ఉంటాయి. అయితే, ఇటువంటి చికిత్సలు చేయాలంటే ఒక స్పెషలిస్టుల బృందం ఉండి తీరాలి. సాధారణంగా లారిక్స్ క్యాన్సర్‌కు చికిత్స చేయాలంటే ఈఎన్‌టి సర్జన్, జనరల్ నెక్ అండ్ హెడ్ సర్జన్లు, మెడికల్, రేడియేషన్ ఆంకాలజిస్టుల అవసరం ఉంటుంది. ఒక్కోసారి డెంటిస్ట్, ప్లాస్టిక్ సర్జన్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, హెల్త్ కౌంసలర్లు అవసరం కూడా ఉంటుంది.

  • ఇవి పాటిస్తే మేలు...
గొంతు క్యాన్సర్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మద్య, ధూమపానాలు పూర్తిస్థాయిలో నియంత్రించగలగాలి. పొగాకును ఏ రూపంలోనూ సేవించకూడదు. దీంతో పాటు సమయపాలన పాటిస్తూ క్రమపద్ధతిలో పౌష్ఠికాహారం తీసుకోవాలి. భోజనంలో విటమిన్-ఎ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం వంటివి చేయాలి.

  • -డాక్టర్ నచికేత్ దేశ్‌ముఖ్ ఎం.ఎస్.(ఈఎన్‌టి)

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.