Monday, September 16, 2013

Heart attack-bypass surgery awareness,గుండె పోటు - బైపాస్‌ ఆపరేషన్‌ అవగాహన

  •  



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart attack-bypass surgery awareness,గుండె పోటు - బైపాస్‌ ఆపరేషన్‌ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పిడుగుపాటులా ముంచుకొచ్చే 'గుండె పోటు'  అనూహ్యంగా సంభవించే ఈ విలయాన్ని గుర్తించి తక్షణం నష్ట నివారణ చికిత్సలు మొదలుపెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం రావచ్చు.. ఒకవేళ ప్రాణాలు దక్కినా విపరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. గుండెపోటు ముంచుకొచ్చిన తర్వాత గడిచే ప్రతి ఘడియా.. ప్రతి గంటా... గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. గుండె అనేది బిగువుగా, దృఢంగా, సమర్థంగా కొట్టుకుంటూ ఉండే కండరం. గుండెపోటు తర్వాత సమయం గడుస్తున్న కొద్దీ క్రమేపీ ఇది చచ్చుబడిపోవటం మొదలవుతుంది. ఒకసారి ఈ చచ్చుబడటం ఆరంభమైతే... దాన్ని తిరిగి కోలుకునేలా చెయ్యటం, మళ్లీ నిలబెట్టటం చాలా కష్టంతో కూడుకున్న పని.

కొన్నిసార్లు వెంటనే ఆపరేషన్‌ చేసి సరిచెయ్యటం కూడా సాధ్యం కాదు.తర్వాత కొంత కాలానికి సరిచెయ్యాలన్నా క్లిష్టంగా తయారవుతుంది.

దీనితో ఇన్ని విపత్తులుంటాయని తెలిసి కూడా... చాలాసార్లు గుండెపోటును గ్యాస్‌ సమస్యగానో, అసిడిటీగానో పొరబడి విలువైన సమయాన్ని వృథా చేసి... గుండెకు తీవ్రమైన చేటు చేసుకుంటున్న వారు నేడు ఎంతోమంది! అందుకే ఛాతీలో నొప్పులన్నింటినీ తేలికగా తీసుకోవటం సరికాదు .

మన ప్రాణానికి మూలంగా నిలుస్తూ... జీవితాంతం నిర్విరామంగా కొట్టుకుంటూ... శరీరంలోని కణకణానికీ నిరంతరాయంగా రక్తాన్ని పంపింగ్‌ చేస్తుండే మన గుండె... స్థూలంగా చెప్పాలంటే ఓ దృఢమైన కండరం! ఈ కండరం ఇలా సమర్థంగా, సజీవంగా పని చేస్తుండాలంటే.. శరీరం మొత్తానికీ అవసరమైనట్లే.. ఈ కండరానికీ రక్తం, నిరంతరాయమైన రక్తసరఫరా అవసరం. అందుకే ఈ గుండె కండరానికి రక్తాన్ని అందించేందుకు గుండె గోడల్లోనే ప్రధానంగా మూడు రక్తనాళాలుంటాయి, వీటినే 'కరోనరీ ధమనులు' అంటారు.

ఈ కరోనరీ ధమనుల్లో ఎక్కడైనా కొవ్వు పూడికలు వచ్చి.. వీటి గుండా రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడితే.. తక్షణం మన గుండెలో పెను విలయం తలెత్తుతుంది. దీన్నే 'గుండెపోటు' అంటాం. ఆ రక్తనాళం ద్వారం రక్తం అందుకుంటుండే గుండె కండర భాగమంతా... రక్తప్రవాహం అందక... నిమిషాలు, గంటల్లోనే చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే 'గుండె నొప్పి', 'గుండె పోటు' అన్న అనుమానం వచ్చినప్పుడు తక్షణం వైద్య సహాయం కోసం ప్రయత్నించాలి. ఆసుపత్రికి వెళ్లగానే ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్‌ వంటి రకరకాల పరీక్షలు చేసి అది నిజంగా 'గుండె పోటేనా?' అన్నది కచ్చితంగా నిర్ధారించి, వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెడతారు, దీనివల్ల గుండె తిరిగి మామూలు స్థాయికి చేరుకునే అవకాశముంటుంది.

ముఖ్యంగా- గుండెలోని ఒకటి లేదా రెండు రక్తనాళాల్లో మాత్రమే పూడికలుంటే 'యాంజియోప్లాస్టీ' ప్రక్రియ ద్వారా బయటి నుంచి గుండెలోకి ఒక తీగగొట్టం పంపించి, దాని సాయంతో పూడికను తెరుస్తూ.. అదే సమయంలో అక్కడ మళ్లీ పూడిక రాకుండా, అవరోధాలు ఏర్పడకుండా స్ప్రింగుల వంటి 'స్టెంట్లు' అమరుస్తారు. వీటితో సమస్య చాలావరకూ సర్దుకుంటుంది. అలా కాకుండా..... ఛాతీనొప్పి కొనసాగుతూ, యాంజియోగ్రామ్‌ పరీక్షలో మొత్తం మూడు కరోనరీ రక్తనాళాల్లోనూ పూడికలున్నట్టు కచ్చితంగా గుర్తిస్తే సత్వరమే రక్తాన్ని పునరుద్ధరించేందుకు 'బైపాస్‌' ఆపరేషన్‌ చేసి.. మరో రక్తనాళాన్ని తెచ్చి అతకటం ద్వారా.. గుండె కండరానికి రక్తసరఫరా నిలిచిపోకుండా, అది చచ్చుబడకుండా కాపాడగలుగుతారు. ఈ ఆపరేషన్‌ను వీలైనంత త్వరగా చేస్తేనే ఫలితం ఉంటుంది. ఎందుకంటే గుండెపోటు వచ్చిన తర్వాత తొలి 12 గంటల్లో గుండె కండరం బలంగానే ఉంటుంది. గానీ అక్కడి నుంచీ సమయం గడిచే కొద్దీ అది రకరకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గుండె పనితీరుకు, సామర్థ్యానికి తీవ్ర విఘాతం కలగొచ్చు. ఆ సమయంలో ఆపరేషన్‌ చేసి.. సరిచెయ్యటం కూడా కష్టం కావచ్చు. అందుకే ఇటువంటి సమయంలో వైద్యులు ముందు ఆ తీవ్ర విలయం నుంచి గుండెను బయటపడేసేందుకు.. స్థిరపరిచేందుకు కృషి చేస్తారు. తర్వాత...నెమ్మదిగా జరిగిన నష్టం ఏమిటి? ఎంత మేర జరిగింది? దాన్ని చక్కదిద్దేందుకు ఆపరేషన్‌ చెయ్యొచ్చా? చేస్తే మరమ్మతు ఎలా చెయ్యాలన్నది ఆలోచించి.. చికిత్స అందిస్తారు. గుండెపోటు వచ్చినప్పుడు సకాలంలో సత్వర చికిత్స అందించలేకపోతే.. గుండె కండరానికి ఎటువంటి నష్టాలు సంభవించే అవకాశం ఉందో చూద్దాం.

నష్టాలు :
గుండెలోని మూడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, గుండెపోటు వచ్చినప్పటికీ వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోకపోతే దీనివల్ల గుండెలో రకరకాల సమస్యలు తలెత్తచ్చు. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి చూద్దాం.

* గుండె లోపల మచ్చ: మన శరీరం మీద ఎక్కడన్నా దెబ్బ తగిలి, మానిపోయిన తర్వాత అక్కడ మందపాటి మచ్చ మిగిలిపోతుంది కదా.. గుండెపోటు తర్వాత గుండె కండరం మీద కూడా ఇలాగే మచ్చ భాగం తయారవ్వచ్చు. ఎందుకంటే గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరంలో కొంత భాగానికి రక్తం అందక.. అది బలహీనపడి దెబ్బతింటుంది. క్రమేపీ 3-6 వారాల సమయంలో అక్కడ ఈ మచ్చలాంటి భాగం తయారవుతుంది. సమస్యేమంటే- పక్షవాతానికి గురైన అవయవంలాగా ఆ కాస్త భాగం పని చేయదు. ముఖ్యంగా కరోనరీ ధమనుల్లో కుడి ధమనిలో పూడిక మూలంగా గుండెపోటు వచ్చినవారు సాధారణంగా బాగానే కోలుకుంటారు.. వస్తే వీరిలో గుండె కొట్టుకునే లయకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మొత్తానికి వీరిలో గుండె కండరం పెద్దగా దెబ్బతినదు. కానీ ఎడమవైపు ఉండే ప్రధాన రక్తనాళంలో (ఎల్‌ఏడీ) పూడిక ఏర్పడి, దాని మూలంగా గుండెపోటు వస్తే మాత్రం- తక్షణ ప్రాణాపాయం సంభవించొచ్చు. ఒకవేళ దీన్నుంచి బయపడినా.. దీనివల్ల గుండె కండరానికి జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. అది బాగా దెబ్బతింటుంది.

* పంపింగ్‌ సామర్థ్యం దెబ్బతినం: గుండె కండరం దృఢంగా పనిచేసేదే రక్తాన్ని బలంగా 'పంపింగ్‌' చెయ్యటం కోసం. అలాంటి కండరం గుండెపోటు తర్వాత చచ్చుబడినట్త్లెతే.. దాని పంపింగ్‌ సామర్థ్యం బాగా దెబ్బతినొచ్చు. ముఖ్యంగా గుండెకు అవసరమైన శక్తిలో మూడోవంతు శక్తిని- గుండెలోని రెండు జఠరికల మధ్య ఉండే గోడ అందిస్తుంటుంది. గుండెపోటు మూలంగా ఈ గోడ భాగంలో మచ్చ ఏర్పడితే పంపింగ్‌ సామర్థ్యం పడిపోతుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన గుండె పంపింగ్‌ సామర్థ్యం 60-65% ఉంటుంది. గుండెపోటు మూలంగా ఆ గోడ దెబ్బతింటే ఈ సామర్థ్యం 35 శాతానికి పడిపోతుంది. దీంతోఏమాత్రం పనిచేసినా.. చివరికి కాస్త దూరం నడిచినా ఆయాసం వస్తుంది. క్రమేపీ రోజువారీ పనులూ కష్టంగా తయారవుతాయి.

* రక్తం గడ్డకట్టటం: గుండెలో కొంతభాగం సరిగా కదల్లేక.. సంకోచ వ్యాకోచాలు సరిగా లేకపోవటం వల్ల కొంత రక్తం గుండె గదుల్లోనే నిల్వ ఉండిపోతుంటుంది. ఇలా పేరుకున్న రక్తం గడ్డకట్టే అవకాశమూ పెరుగుతుంది. ఇలా ఏర్పడ్డ చిన్నచిన్న రక్తం గడ్డలు.. రక్తప్రవాహంలో కలిసిపోయి బృహద్ధమనిలోకి, మెదడులోకి.. ఇలా శరీరంలోని ఏ భాగానికైనా చేరుకుని.. పక్షవాతం నుంచి రకరకాల తీవ్ర సమస్యలు తెచ్చిపెట్టొచ్చు.

* కవాట ద్వార బంధనాలు తెగిపోవటం: గుండె గదుల మధ్య ఉండే కవాటాలకు రెక్కల్లాంటి ద్వారాలుంటాయి. అవి తెరుచుకుంటూ, మూసుకుంటూ ఉండటానికి వీలుగా కింది నుంచి వాటికి తాళ్లలాంటి నిర్మాణాలు అతుక్కుని ఉంటాయి. వీటినే 'పాపిలరీ మజిల్స్‌' అంటారు. గుండెపోటు కారణంగా గదుల మధ్య గోడ, కొంత కండరం దెబ్బతిన్నప్పుడు- ఈ తాళ్లు బలహీనపడి తెగిపోవచ్చు. దీంతో కవాటాల రెక్కలు తెరచుకోవటం, మూసుకోవటం కష్టమై లీకైపోతూ... రక్తం పంపింగ్‌ కష్టమై తీవ్ర విపత్తు రావచ్చు. దీన్ని 'సివియర్‌ అక్యూట్‌ ఎంఆర్‌' అంటారు.

* చినిగే గుండె: గుండెపోటు వచ్చిన తర్వాత ఎడమ జఠరికల గోడలు చచ్చుబడినట్త్లె బలహీనపడి క్రమేపీ పల్చబడి.. చిరిగిపోవచ్చు. దీన్నే 'ఫ్రీ వాల్‌ రప్చర్‌' అంటారు. దీంతో గుండెలో నుంచి రక్తం బయటకు, అంటే ఆ కుహరంలోకి వచ్చేస్తుంది. ఫలితంగా గుండె చుట్టూ రక్తం చేరిపోయి.. అసలు గుండెను వ్యాకోచించనివ్వకుండా నొక్కేస్తూ.. ప్రాణాల మీదికి వస్తుంది.

* మైట్రల్‌ కవాటం లీకేజీ: గుండె కండరానికి రక్త సరఫరా తగ్గి, కండరం బలహీనపడి.. కొంతభాగం మచ్చలా ఏర్పడి.. సమర్థంగా పనిచెయ్యనప్పుడు పంపింగ్‌ సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల గుండెలో ఎక్కువ రక్తం నిల్చిపోతూ 3, 4 నెలల తర్వాత గుండె గది పెద్దగా అవుతుంది. క్రమేపీ మైట్రల్‌ కవాటం లీక్‌ కావటమూ ఆరంభమవుతుంది. దీన్ని 'ఇస్కీమిక్‌ మైట్రల్‌ రిగర్జిటేషన్‌' అంటారు. ఇది క్రమేపీ గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

* గోడకు రంధ్రం: కొందరికి గుండెపోటు తర్వాత గుండె లోపల ఒత్తిడి పెరిగి.. గదుల మధ్య ఉండే గోడలాంటి కండరానికి రంధ్రం పడొచ్చు. దీన్ని 'పోస్ట్‌-ఇన్‌ఫార్‌క్షన్‌ వెంట్రిక్యులార్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌' అంటారు.

'బైపాస్‌' పని చేయదా?
గుండెలోని రక్తనాళాల్లో రక్తప్రవాహానికి పూడికలు అడ్డుపడుతుంటే... ఆ అడ్డును తప్పించి.. దానిలో తిరిగి రక్తం ప్రవహించేలా ఒక కొత్త రక్తనాళాన్ని అతకటం బైపాస్‌ ఆపరేషన్‌ లక్ష్యం. అయితే ఇలా ఒకసారి రక్తనాళాల్లో పూడికల కారణంగా గుండెపోటు వచ్చి.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతిన్నప్పుడు కేవలం రక్తాన్ని పునరుద్ధరించే బైపాస్‌ ఆపరేషన్‌ సరిపోదు. ఆ దెబ్బతిన్న భాగమేమిటో.. దానివల్ల తలెతున్న నష్టమేమిటో గుర్తించి.. దాన్ని కూడా చక్కదిద్దాల్సి ఉంటుంది. ఇదో రకంగా బాంబులు పడి దెబ్బతిన్న వూరిని బాగుచెయ్యటం లాంటిది! అందుకే ఇలాంటి సమయంలో చేసే సర్జరీని 'సంక్లిష్టమైనది'గా గుర్తించాల్సి ఉంటుంది. కేవలం రక్తనాళాల్లో పూడికలు మాత్రమే ఉండి, ఇతరత్రా సమస్యలేమీ లేనప్పుడు తేలికగా మరో రక్తనాళాన్ని తెచ్చి అతికితే సరిపోతుంది. దీన్ని 'సింపుల్‌ బైపాస్‌' అంటారు. వీరిలో 99% మంది ఎటువంటి సమస్యలూ లేకుండా బాగానే బయటపడతారు. అయితే ఇలా గుండెపోటు మూలంగా కండరం దెబ్బతిని, తీవ్ర నష్టం సంభవించినప్పుడు- రక్తసరఫరాను పునరుద్ధరించే బైపాస్‌ ఆపరేషన్‌తో పాటే.. జరిగిన నష్టాన్ని చక్కదిద్దేందుకు క్లిష్టమైన మరమ్మతూ చెయ్యాల్సి వస్తుంది. నేటి అత్యాధునిక వైద్యరంగం వీటన్నింటినీ సమర్థంగానే అధిగమించగలుగుతోంది. సమస్యను బట్టి మరమ్మతు ఆపరేషన్‌ చేస్తారు.

'మొన్నే గుండెకు బైపాస్‌ చేయించా..!'
 గుండెలోని రక్తనాళాలు ఎక్కువగా పూడుకుపోయి గుండెపోటు దాపురించినా, లేదా వచ్చే పరిస్థితి నెలకొన్నా.. దాన్నుంచి బయటపడెయ్యటంలో 'బైపాస్‌' ఆపరేషన్‌ ఎంతో అద్భుతంగా అక్కరకొచ్చే మాట నిజం. అయితే గుండెపోటు విషయంలో సకాలంలో స్పందించకుండా కాలయాపన చేస్తే... గుండె కండరం బాగా దెబ్బతిని... ఈ బైపాస్‌ ఆపరేషన్‌తో కూడా పరిస్థితిని చక్కదిద్దటం కష్టమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడా ఓటి గుండెను నానారకాల క్లిష్టమైన ఆపరేషన్లతో ఎలాగోలా నిలబెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కొన్నిసార్లు అదీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే గుండెపోటు అనుమానం తలెత్తితే సత్వరమే స్పందించటం, వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం చాలాచాలా అవసరం.

మరమ్మతు ఎలా?
* గుండె కండరం చచ్చుబడినట్త్లె.. ఎక్కడ మచ్చ ఏర్పడినా ఆ కాస్త భాగాన్నీ తొలగించెయ్యక తప్పదు. లేకపోతే అది బాగున్న కండరాన్నీ సరిగా పనిచెయ్యనివ్వకుండా వెనక్కి గుంజుతుంటుంది. కాబట్టి మచ్చ పడిన భాగాన్ని సాధ్యమైనంత వరకూ కత్తిరించేసి, చివళ్లను లోనికి మడిచి కుట్టేస్తారు. దీనివల్ల క్రమేపీ గుండె ఆకృతి మెరుగుపడి, సమర్థంగా పనిచేస్తుంది. పంపింగ్‌ సామర్థ్యం 60 శాతానికి చేరుకోకపోయినా.. రోజువారీ పనులకు అవసరమైన 40% మేరకన్నా మెరుగవుతుంది. ముఖ్యంగా గుండెలో కదలికలేకుండా చచ్చుబడినట్లుండే (ఎకైనెటిక్‌) భాగమేదీ ఉండదు కాబట్టి రక్తం గడ్డకట్టే ముప్పు తప్పుతుంది.

* సాధారణంగా మన గుండె కింది భాగం శంఖంలా కోసుగా ఉంటుంది. అయితే గుండెపోటు వల్ల కండరం చచ్చుబడితే ఈ అడుగుభాగం గుండ్రంగా తయారైపోతుంది. అందుకే ఆపరేషన్‌ సమయంలో మచ్చ భాగాన్ని తొలగిస్తూనే, గుండె కింది భాగం తిరిగి సాధ్యమైనంత శంఖాకృతిలోకి వచ్చేలా చేస్తారు. ఇలాచేస్తే గుండె పంపింగ్‌ సామర్థ్యం మెరుగ్గా ఉంటోందని గుర్తించారు.

* గుండెపోటు మూలంగా గదుల మధ్య గోడకు రంధ్రాలు పడితే బైపాస్‌ ఆపరేషన్‌ సమయంలోనే వాటినీ మూసెయ్యటం, మైట్రల్‌ కవాటం నుంచి రక్తం లీకవుతుంటే తెగిన పాపిలరీ కండర తంత్రులను తిరిగి అతకటం వంటి మరమ్మతులూ చేస్తారు.

* ఎడమ జఠరిక చినిగిపోతే (రప్చర్‌ లెఫ్ట్‌ వెంట్రికల్‌) మాత్రం చికిత్స కష్టం. అయితే కొన్నిసార్లు అదృష్టవశాత్తూ ఆ చిరిగినచోట రక్తం గడ్డకట్టి అంటుకుపోయినట్టుగా తయారవుతుంది. దాన్ని త్వరగా గుర్తించి ఆపరేషన్‌ చేస్తే ఫలితముంటుంది. ఇదే కాదు, గదుల మధ్య గోడకు రంధ్రం (వీఎస్‌డీ), తీవ్రమైన మైట్రల్‌ కవాటం లీకేజీ వంటి సమస్యలకూ అత్యవసరంగా ఆపరేషన్‌తప్పదు. లేకపోతే వూపిరితిత్తులూ సరిగా పనిచెయ్యలేని విపత్తు ముంచుకొచ్చేస్తుంది.

ఆపరేషన్‌ ఎప్పుడు?
గుండెపోటు వచ్చి 12 గంటలు దాటినా స్థిరంగా ఉండి, ఎడమ జఠరిక సరిగా పనిచేయకుండా ఉన్నవారికి.. కేవలం గుండె కండరం మాత్రమే దెబ్బతిని ఛాతీ నొప్పి, వూపిరితిత్తులు నిండిపోవటం వంటి ఇతరత్రా సమస్యలు లేనివారికి.. అలాగే వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాస కల్పించాల్సిన అవసరం లేకుండా కొంత బాగానే ఉన్న వారికి- ఆపరేషన్‌ విషయంలో కొంతకాలం వేచి చూడొచ్చు. ముందు వీరికి మందులతో చికిత్స చేసి కుదుటపడేలా చేస్తారు. ఓ వారంపది రోజుల తర్వాత ఎమ్మారై పరీక్ష చేసి- కండరం ఎంత దెబ్బతింది? మచ్చ ఎక్కడ పడిందన్నది తెలుసుకుంటారు. అప్పుడు దీన్ని ఎంతమేర తొలగించి సరిచెయ్యొచ్చో గుర్తించి... మెల్లగా ఆపరేషన్‌ చేస్తారు.

మందులు మానేస్తే మరీ అనర్థం
* కొందరికి గుండెపోటు వచ్చినా కేవలం ఒక రక్తనాళంలోనే పూడిక ఉంటుంది. ఇలాంటి వారికి వైద్యులు సాధారణంగా మందులతోనే చికిత్స చేస్తుంటారు. వీరికి స్టెంట్‌ అమర్చటం, ఆపరేషన్‌ వంటివేమీ అక్కర్లేదు. అయితే వీరు కొంతకాలం మందులు వాడి మానెయ్యటం వంటివి చేస్తే... మళ్లీ గుండెలోని రక్తనాళాలు పూడుకుపోవచ్చు. మళ్లీ గుండెపోటు రావొచ్చు. ఈ దఫా గుండె కండరంలో మిగతా భాగం దెబ్బతినొచ్చు. దీన్ని గుర్తించకపోతే 2, 3 వారాల తర్వాత తీవ్ర ఆయాసం వంటి లక్షణాలు బయటపడతాయి. వీరికి ఎమ్మారై పరీక్ష చేస్తే చాలాచోట్ల గుండెలో మచ్చలు కనబడతాయి. ఇలా గుండె కండరం చాలాచోట్ల దెబ్బతిని.. చాలాచోట్ల చచ్చుబడిన వారికి (మల్టీ టెరిటరీ నాన్‌ వయబుల్‌ మయో కార్డియం) బైపాస్‌ చేయటంగానీ, దెబ్బతిని మచ్చపడిన భాగాలను తొలగించటం గానీ కుదరదు. వీరికి బైపాస్‌ సర్జీరీ చేసినా గుండె సామర్థ్యం మెరుగు పడటానికి పెద్దగా అవకాశం ఉండదు. పైగా ప్రాణాలకు ముప్పూ చాలా ఎక్కువ. మచ్చల మూలంగా హఠాత్తుగా గుండె లయ దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి వారికి.. గుండె మీద ఎక్కువ భారం పడకుండా కేవలం మందులు, ఉప్పు తక్కువగా తినటం వంటి జాగ్రత్తలు మాత్రమే సూచిస్తారు. గుండెలో ఇలా చాలాచోట్ల మచ్చలు ఏర్పడినవారు ఎక్కువ కాలం జీవించటం కూడా కష్టం.

గ్యాస్‌ నొప్పే అనుకోవద్దు!-బైపాస్‌తో అయిపోతుందని భ్రమపడొద్దు!
ఛాతీనొప్పిగా అనిపించినప్పుడు.. ఒకవేళ అది అసిడిటీ నొప్పే అయినా గుండె పోటు కాదని నిర్ధారించుకోవటం అన్నివిధాలా మేలు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్లు గుండెనొప్పి విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి. ఛాతీలో నొప్పి వస్తుంటే అదే తగ్గుతుందిలే అని తోసేయకుండా ఓసారి 'ఈసీజీ' వంటి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ఒకవేళ అది గుండెనొప్పి అయితే సత్వర చికిత్సతో గుండెకు మరింత నష్టం జరగకుండా.. గుండె కండరం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గుండెనొప్పిని గ్యాస్‌ నొప్పిగా పొరబడి తోసేసుకు తిరుగుతుంటే.. రెండు మూడు వారాల తర్వాత పరిస్థితి మరింత విషమిస్తుంది. అప్పుడు గుండెకు క్లిష్టమైన మరమ్మతులు చెయ్యాల్సి రావచ్చు.. కొన్నిసార్లు ఆ అవకాశమూ ఉండకపోవచ్చు కూడా!

courtesy with Dr.Mannam  Gopichand -chief cardiologist , Star hospital , Hyd.@eenadu sukhibhava
  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.