Saturday, September 21, 2013

Presbiosmia,ప్రెస్బయోస్మియా,వృద్ధులలో ఘ్రాణ శక్తి తగ్గడం,వృద్ధులలో వాసనలు తెలియకపోవడం

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Presbiosmia,ప్రెస్బయోస్మియా,వృద్ధులలో ఘ్రాణ శక్తి తగ్గడం,వృద్ధులలో వాసనలు తెలియకపోవడం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కాస్త 'వయసు మళ్లిన' వారికి రుచ్చ్చులు తినాలనిపెస్తుంది ...  నిజానికిది తిండి కోసం వెంపర్లాట కాదు. రకరకాల రుచుల కోసం పాకులాటా కాదు. వృద్ధాప్యానికి సంబంధించిన చాలా సమస్యల లాగే ... 'చవి చచ్చిపోవటమన్నదీ' అలాంటిదే. వృద్ధులకు 'రుచి' తెలియకపోవటం, 'వాసన' తెలియకపోవటమన్న సమస్యలు చాలా
ఎక్కువ. పైగా ఈ రెండూ ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడిన అంశాలు! ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతూ... వృద్ధాప్యంపై పరిశోధనలు, అధ్యయనాలు
విస్తృతమవుతున్న కొద్దీ మలి వయసుకు సంబంధించిన ఇటువంటి రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యపరంగా వీటిని ఎలా ఎదుర్కోవాలన్న చర్చలూ పెరుగుతున్నాయి.

రుచి, వాసన అన్నవి మన జీవితానికి మౌలికమైన అంశాలు. వర్షం పడిందంటే మట్టివాసన ముక్కుపుటాలకు తాకుతుంది. ఆ ఘ్రాణ శక్తి లేకపోతే మనం వాతావరణాన్నిఅనుభవించలేం. ఇదొక్కటే కాదు.. కమ్మటి కాఫీ వాసన.. సుతిమెత్తటి గులాబీల పరిమళం.. మనం గుర్తించంగానీ ఇవన్నీ తెలియనప్పుడు జీవితం దుర్భరంగానే ఉంటుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ.. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత ఆఘ్రాణ శక్తి క్రమేపీ తగ్గుతుంది. చాలామంది వృద్ధులు ఈ విషయాన్ని గుర్తించను కూడా లేరు. అంత నెమ్మదిగా వస్తుందీ మార్పు. ఒక రకంగా వయసుతో పాటు మన చూపు, వినికిడి సన్నగిల్లినట్టే ఈ ఆఘ్రాణ శక్తీ తగ్గుతుందని భావించొచ్చు. అందుకే దీన్ని
'ప్రెస్బయోస్మియా' అంటారు. ఈ క్రమంలో చాలామంది తమకు తెలియకుండానే కుళ్లిన, బాగా చెడిపోయిన పదార్థాలను తినేస్తుంటారు. ప్రమాదకరంగా వంట గ్యాస్‌ వంటివి లీకవుతున్నా కనిపెట్టలేకపోతుంటారు. చాలాసార్లు ఇలాంటి ఘటనలేవైనా జరిగితేగానీ ఈ లోపం బయటపడదు. సాధారణంగా జలుబు చేసినప్పుడు, అలర్జీల వల్ల కూడా వాసనలు తెలియకపోవచ్చుగానీ అది తాత్కాలికం. ఆయా సమస్యలు తగ్గగానే ఆఘ్రాణ శక్తి తిరిగి మెరుగువుతుంది. అలాగే తలకు బలమైన దెబ్బల వంటివి తగిలినప్పుడూ, సైనస్‌ ఇన్ఫెక్షన్లు ముదిరినప్పుడూ వాసనలు తెలియని స్థితి ఎదురవ్వచ్చు. దానికి స్పష్టమైన కారణాలు మనకు కనబడుతూనే ఉంటాయి. కానీ వృద్ధుల్లో సమస్య ఇలా ఉండదు. అది క్రమేపీ వాళ్లకు కూడా తెలియకుండా పెరిగే సమస్య!

నోటికీ ఇబ్బందే!
వాసన కూడా రుచిలో భాగమే! ఒక పదార్థం వాసన ఏమిటో మనకు తెలియకపోతే దాని రుచిని పూర్తిగా ఆస్వాదించలేం. మన నోట్లోనూ, గొంతులోనూ ప్రత్యేకమైన రుచి
మొగ్గలుంటాయి. ఒక్కో రుచి మొగ్గలోనూ చాలా రుచి కణాలుంటాయి. మనం ఆహారం నమిలేటప్పుడు ఈ కణాలు ప్రేరేపితమై.. వీటికి అనుసంధానంగా ఉన్న నాడుల ద్వారా ఆ సమాచారం మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు రుచి భావన కలుగుతుంది. ఈ రుచి మొగ్గలు నాలుక మీదా, నోట్లో పైభాగంలోనూ, గొంతులో కూడా  ఉంటాయి. పుట్టినప్పుడు మన నాలుక, నోరు, గొంతు, అంగిట్లో దాదాపు 10,000 రుచిమొగ్గలుంటే 50 ఏళ్లు పైబడిన తర్వాత ఈ మొగ్గల సంఖ్య కొంత తగ్గటం మొదలవుతుందని అధ్యయనాల్లో గుర్తించారు. దీనివల్ల వీరి నోటికి చాలా పదార్థాలు 'చప్పిడి'గా అనిపిస్తుంటాయి. అయితే వృద్ధుల్లో రుచి తగ్గటమన్నది ఆఘ్రాణ శక్తి తగ్గటమంత ఎక్కువగా కనబడదు. రుచి కంటే వాసనలు తెలియకపోవటమన్నదే ఎక్కువమందిని వేధిస్తుంటుంది. ఈ రెంటి మధ్యా సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి వీటిని పూర్తిగా వేరుచేసి చూడలేం. అందుకే చాలామంది తమకు వాసనలు సరిగా తెలియటం లేదన్న విషయాన్ని గుర్తించక.. పదార్థాలు రుచి మళ్లిపోయాయని, నోరు చవి చచ్చిపోయందనీ.. రకరకాలుగా భావిస్తుంటారు.
గొంతు నుంచీ వాసనలు రుచికీ, వాసనకూ మధ్యనున్న బంధం చాలా బలమైనది. ఎందుకంటే వాసనలన్నవి ముక్కు ద్వారానే కాదు.. గొంతు లోపలి పైభాగం ద్వారా కూడా ముక్కు కుహరం పైభాగంలో ఉండే 'ఆల్‌ఫ్యాక్టరీ' కణాలను చేరతాయి. మనం ఆహారం నమిలేటప్పుడు, తినేటప్పుడు ఘుమఘుమలతో ఆ కమ్మటి రుచికరమైన భావన కలగటంలో ఈ మార్గం కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే ఆఘ్రాణ శక్తి సన్నగిల్లటం వల్ల వీరిలో 'రుచి' సమస్యలూ పెరుగుతుంటాయి. జలుబు వంటివి చేసినప్పడు ఈ మార్గం మూసుకుపోతుంది, అప్పుడు కూడా రుచి తెలియక 'ఏం తిన్నా మట్టితిన్న' భావన కలుగుతుంటుంది.

నష్టాలేమిటి?
* వాసనలు తెలియని కారణంగా చాలామంది వృద్ధులు- తమకు తెలియకుండానే ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది తిండి సహించక తిండి
తగ్గించేసి, చాలా కొద్దిగానే తినటం ఆరంభిస్తారు. మరికొందరు కడుపు నిండిన భావన కలగక.. ఎక్కువ తినటం ఆరంభిస్తారు. రెండూ కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే.

* వాసన తెలియక రుచిని పూర్తిగా ఆస్వాదించలేరు కాబట్టి రుచి బాగా తెలియటం కోసం పదార్థాల్లో తీపి, ఉప్పు మోతాదు పెంచుతుంటారు. పక్కనే డబ్బా పెట్టుకుని ఉప్పు మరికాస్త వేసుకోవటం, పంచదార నంజుకోవటం వంటివి చేస్తుంటారు. ఈ వయసులో చాలామందికి సహజంగానే మధుమేహం, హైబీపీ వంటివి ఉంటాయి, ఈ మారిపోయిన ఆహారపుటలవాట్ల వల్ల అవి అదుపు తప్పుతుంటాయి. ఫలితంగా గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదకర సమస్యల ముప్పూ పెరగుతుంటుంది.

* కొంతమందిలో వాసనలు తెలియక, తిండి సయించక మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) కూడా పెరుగుతుంటుంది.

* మనకు రుచులు సరిగా తెలియకుండా పోతే సాధారణంగా ఆకలి మందగిస్తుంది. దీనివల్ల తిండి తగ్గిపోయి పోషకాహార లోపం, బలహీనం,రోగనిరోధక శక్తి తగ్గిపోవటం,
రక్తహీనత వంటి రకరకాల సమస్యలు బయల్దేరతాయి.

* వాసనలు తెలియకపోవటం వల్ల చెడిపోయిన పదార్థాలను గుర్తించలేక తినేస్తుండటం, గ్యాస్‌ లీకేజీలను కనిబెట్టలేకపోవటం, వంట సరిగా చెయ్యలేకపోవటం వంటి ఇబ్బందులే కాదు.. కొన్నిసార్లు పెద్ద సమస్యలూ పొంచి ఉంటాయి. ముఖ్యంగా ఆఘ్రాణ శక్తి తగ్గటమన్నది కొన్నిసార్లు పార్కిన్సన్స్‌, ఆల్జిమర్స్‌ వంటి మెదడు సంబంధ వ్యాధులకు తొలి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి వాసలు తెలియటం లేదని గుర్తించినప్పుడు తోసేసుకు తిరగకుండా ఒక్కసారి వైద్యులతో చర్చించటం కూడా అవసరం.

కారణాలేమిటి?
వయసుతో పాటు రుచి, వాసనలు మందగించటం సహజ పరిణామమే కావచ్చుగానీ మరికొన్ని ఇతరత్రా కారణాలు కూడా దీనికి దోహదం చెయ్యొచ్చు.

* కొన్ని రకాల మందుల వల్ల రుచులు మందగిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు చాలారకాల మందులు వేసుకుంటూ ఉంటారు. హైబీపీకి, కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు వాడే మందుల వల్ల నోట్లో రుచి మారిపోవచ్చు. అలాగే యాంటీబయాటిక్స్‌, అసిడిటీ తగ్గటానికి వాడే మందులతో కూడా నోట్లో ఏదోగా అనిపించొచ్చు. అలాగే ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులతోనూ రుచులు మారిపోతాయి. కొన్ని మందులతో నోటిలో లాలాజలం వూరటం తగ్గి, నోరు పొడిబారుతుంటుంది. దానివల్ల రుచులు మారిపోతుంటాయి. కొందరికి నోరు ఎప్పుడూ 'అరుచి'గానే ఉంటుంది. కొందరికి ఏమీ తినకపోయినా కూడా ఎప్పుడూ నోట్లో ఏదో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. ఇంకొందరికి విపరీతంగా నీళ్లూరుతుంటాయి. కాబట్టి రుచి సమస్యగా ఉంటే వీటి గురించి వైద్యులతో చర్చించటం మంచిది. మరికొన్ని మందుల వల్ల ఆఘ్రాణ శక్తి తగ్గుతుంది. అలర్జీల వల్ల వాసనలు తెలియకపోతుంటే.. దానికి సంబంధించిన మందులు వేసుకోవటంవల్ల ఆ ఘ్రాణ శక్తి మెరుగుపడుతుంది కూడా.

* వృద్ధుల్లో చిగుళ్ల వ్యాధులు ఎక్కువ. అలాగే చాలామంది వృద్ధులు కట్టుడు పళ్లు పెట్టుకుంటుంటారు. వీటివల్లా రుచి సమస్యలు తలెత్తవచ్చు.

* పొగ తాగేవారిలో, వూపిరితిత్తుల్లో ఇన్షెక్షన్లు ఉన్న వారిలో కూడా రుచులు మారిపోవచ్చు. క్యాన్సర్‌ చికిత్స తీసుకునే వారిలోనూ రుచి సమస్యలు తలెత్తుతుంటాయి.

చికిత్సలున్నాయా?
* రుచిని పెంపొందింపజేసే చికిత్సలేవీ ప్రస్తుతానికి లేకపోయినా వైద్యులను సంప్రదిస్తే దానికి మూలకారణమేంటి? మనం వాడుతున్న ఇతరత్రా మందుల వల్ల సమస్యలేమైనా తలెత్తుతున్నాయా? ఇన్ఫెక్షన్లు ఉన్నాయా? వాసనలు బాగానే చూడగలుగుతున్నారా? వంటివన్నీ పరిశీలించి తదనుగుణంగా చికిత్స అందించే
వీలుంటుంది.

* కేవలం రుచి సమస్య ఒక్కటే ఉంటే- పదార్థాలకు కమ్మటి వాసననిచ్చే సుగంధ ద్రవ్యాలను కలుపుకోవటం, ఆకర్షణీయంగా ఉండేలా వండుకోవటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. మొత్తమ్మీద రుచి తెలియటం లేదని తిండి మానేస్తే పోషకాహార లోపం తలెత్తుతుందన్న విషయం మాత్రం విస్మరించకూడదు. తిండి తినాలని అనిపించకపోతే... మనకు ఏదో జబ్బుచేసిన భావన కలుగుతుంది. రోజంతా అదే వేధిస్తుంటుంది. దానివల్ల కుంగుబాటు వంటి బాధలూ మొదలవుతాయి. కాబట్టి దీన్ని తోసేసుకు తిరగటం మంచిది కాదు.

పరిశోధనలు
ఆసక్తికరమైన అంశమేమంటే మన ఆఘ్రాణ శక్తికి మూలమైన ఆల్‌ఫ్యాక్టరీ కణాలు ముక్కు వెనకాల లోపలగా ఉంటాయి. అలాగే నాలుక మీది రుచి మొగ్గల్లో రుచి
కణాలుంటాయి. ఈ రెండు రకాల కణాలూ కూడా జీవితాంతం- పాతవి పోతూ, మళ్లీమళ్లీ కొత్తవి పుడూతూ ఉంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొత్త కణాల భర్తీ అనేది సన్నగిల్లుతుంటుంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్నాయి.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.