Monday, September 16, 2013

How to reduce belly?,బొజ్జ తగ్గేదెలా?

  •  ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How to reduce belly?,బొజ్జ తగ్గేదెలా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


 బొజ్జ రావటానికి ఆహారంతో పాటు జీవనశైలీ దోహదం చేస్తుంది. బియ్యంలోని పిండి పదార్థాలు త్వరగా ఖర్చు కాకుండా కొవ్వు రూపంలో కడుపు వద్ద పేరుకుపోతుంటాయి. కాబట్టి అన్నం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. బొజ్జ తగ్గటానికి ఆహార నియమాలతో పాటు ఇతర మార్గాలపైనా దృష్టి పెట్టటం మేలు.

ఒత్తిడికి దూరం
బరువు ఎక్కువగా లేకపోయినా బొజ్జ ఉన్నట్టయితే ఇందుకు ఒత్తిడి మూలంగా పేరుకునే కొవ్వు కారణం కావొచ్చు. ఒత్తిడి పెరిగినప్పుడు ఆకలిని పుట్టించే కార్టిజోల్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. దీంతో ఎక్కువెక్కువ తింటారు. ఇది కడుపు వద్ద కొవ్వు పేరుకోవటానికి దారితీస్తుంది.

మద్యపానానికి దూరం
మద్యం ద్వారా కేలరీలు అందటమే కాదు.. అది కొవ్వును శక్తిగా మార్చే శరీర సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. మద్యం శరీరంలో అసిటేట్‌గా మారుతుంది. అసిటేట్‌ మోతాదులు పెరిగితే కొవ్వు ఖర్చయ్యే ప్రక్రియ కూడా మందగిస్తుంది.

ఎముకల దృఢత్వం
ఎముకలు గుల్లబారితే వెన్నెముకలోని పూసలు నొక్కుకుపోయినట్లై వెన్ను పొడవు తగ్గిపోతుంది. ఫలితంగా కడుపు భాగం ముందుకు తోసుకొచ్చి, కుచించుకుని బొజ్జలా రావొచ్చు. కాబట్టి ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం, విటమిన్‌- డి అందేలా చూసుకోవాలి.

మానెయ్యాల్సినవి
అతిగా శుద్ధిచేసిన పిండి పదార్థాలతో చేసిన బ్రెడ్డు, బిస్కట్లు, కేకుల వంటివి తగ్గించాలి. మేక, గొర్రె మాంసం.. చిప్స్‌, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌లో సంతృప్తకొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కడుపు వద్ద కొవ్వు పేరుకునేలా చేస్తుంది. కూల్‌డ్రింకులు, స్వీట్ల వంటివీ బొజ్జకు దారితీస్తాయి.

తినాల్సినవి
బాదంపప్పు, నువ్వులు, వేరుశనగలు, సోయా తినాలి. మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గల ఆవనూనె, తవుడు నూనె వంటివి వంటకు ఉపయోగించాలి. రోజుకి నాలుగైదు సార్లు కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వీటిల్లోని పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీవక్రియను పెంచటానికి తోడ్పడతాయి. తేలికైన మాంసకృత్తులు గల గుడ్డులోని తెల్లసొన, చేపలు, కోడిమాంసం.. చిక్కుళ్లు, పొట్టుతీయని ధాన్యాలు కూడా బొజ్జ రాకుండా చూస్తాయి.

ఇవీ పనిచేస్తాయి
నవ్వినప్పుడు కడుపులోని అన్ని కండరాలూ పనిచేస్తాయి. కాబట్టి హాయిగా నవ్వేందుకు ప్రయత్నించండి. వీలుంటే ఈతకూ వెళ్లొచ్చు. ఈత మూలంగా కడుపులోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. స్ట్రెచింగ్‌ వ్యాయామాలు బొజ్జ తగ్గటానికి తోడ్పడతాయి. యోగాసనాలు కూడా కడుపు వద్ద కండరాలను దృఢంగా, బిగుతుగా చేస్తాయి.
  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.