Friday, January 31, 2014

Mis-carriage,గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌)

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Mis-carriage,గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 నారు పోసిన వాడు నీరు పొయ్యడా.... అన్నది మనందరి నమ్మకం! గర్భం విషయంలో కూడా చాలామంది ఇలాగే అనుకుంటూ.. ఒకసారి గర్భం వస్తే చాలు.. ఇక తర్వాత అంతా సజావుగానే

జరిగిపోతుందని భావిస్తుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదుగానీ.. గర్భం విషయంలో మాత్రం అన్నిసార్లూ ఇలాగే జరగాలనేం లేదు. పైగా గర్భం పోవటం.. కడుపు నిలబడకపోవటమన్నది

మనందరం అనుకునేంత అరుదైన సమస్యేం కాదు. దాదాపు ప్రతి ఆరు గర్భాల్లో ఒకటైనా ఇలా అర్ధాంతరంగానే ముగిసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే చాలకాలంగా వైద్యరంగం గర్భం

పోవటం.. (మిస్‌ క్యారేజ్‌) పైన లోతుగా దృష్టిపెడుతోంది.

కారణమేదైనా, గర్భం దాల్చిన తొలి వారాల్లోనే జరిగినా లేక ఆ తర్వాత జరిగినా.. అర్ధాంతరంగా గర్భం పోవటమన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను మిగిల్చే అంశమే. గర్భం పోవటమన్నది

చాలా రకాలుగా జరగొచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి మొత్తం వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు ముక్కలన్నీ బయటకువెళ్లిపోయి గర్భసంచీ శుభ్రం కావటానికి వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి రావచ్చు.

ఇందుకోసం వైద్యులు మందులు ఇస్తారు. అవసరమైతే కొన్నిసార్లు మత్తు ఇచ్చి, చిన్నాపరేషన్‌ చేసి శుభ్రం చెయ్యాల్సి రావచ్చు. అయితే ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో

అనుమానాలు ముసురుకుంటాయి.మళ్లీ గర్భం వస్తుందా? రాదా? అసలు ఎందుకిలా జరిగింది? ఒకవేళ వచ్చినా నిలబడుతుందా? లేక మళ్లీ ఇలాగే అవుతుందా? మళ్లీ గర్భం కోసం ఎప్పుడు

ప్రయత్నించొచ్చు? ఇలాంటి సందేహాలు అనంతం.


గర్భం ఎందుకు పోతుంది?
తొలివారాల్లో గర్భం పోవటానికి చాలావరకూ క్రోమోజోముల లోపమే కారణం కావచ్చు. దీన్నో రకంగా జన్యుపరమైన పొరపాటు అనుకోవచ్చు. ఇది చాలా వరకూ ఆ గర్భానికి సంబంధించినదే కాబట్టి

మళ్లీ ఇలా జరగకపోవచ్చు కూడా. అయితే గర్భిణి వయసు పెరుగుతున్న కొద్దీ.. 35 ఏళ్లు పైబడితే ఇటువంటి జన్యుపరమైన పొరపాట్లకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి 35 ఏళ్లు పైబడిన గర్భిణులకు

గర్భంపోయే ముప్పు కాస్త ఎక్కువ ఉంటుదని గుర్తించాలి.

అలాగే- గర్భిణులు పొగతాగినా, మద్యం తాగినా, అలాగే అధిక బరువు ఉన్నా, గర్భాశయంలో నిర్మాణపరంగా ఏవైనా లోపాలున్నా, లేక గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) బలహీనంగా ఉన్నా,

దీర్ఘకాలిక వ్యాధులేవైనా ఉన్నా, మధుమేహం ఉండి - అది అదుపు తప్పినా.. ఇటువంటి సందర్భాల్లో కూడా గర్భం నిలబడకుండా మధ్యలోనే పోయే ముప్పు కాస్త ఎక్కువగా ఉంటుంది.

* ఇవేవీ కాదు: గర్భంపోతే.. తామేదో తప్పు చేశామనీ, అందుకే ఇలా జరిగిందని చాలామంది తమను తాము నిందించుకుంటుంటారు. ముఖ్యంగా బరువులు ఎత్తటం వల్లనో, పని ఎక్కువగా చెయ్యటం

వల్లనో, మలబద్ధకంగా ఉంటే బలంగా ముక్కటం వల్లనో, మానసిక ఒత్తిడికి లోనవ్వటం వల్లనో, శృంగారంలో పాల్గొనటం వల్లనో, లేకపోతే ఏవో తినకూడనివి తినటం వల్లనో ఇలా జరిగిందని తమలో

తామే మథనపడుతుంటారు. కానీ ఇవేవీ గర్భస్రావానికి కారణం కావు. ఇటువంటి అపోహలను మనసులో పెట్టుకుని ఎక్కువగా మథనపడాల్సిన పని లేదు. వైద్యులు కూడా వరసగా రెండుమూడు

దఫాలుగా గర్భం పోతుంటేనే కారణం ఏమిటన్నది తెలుసుకునేందుకు ప్రత్యేక పరీక్షల వంటివి చేయిస్తారు.

ఏది కాదు.. ఏది అవును?
గర్భం దాల్చిన తొలి 12 వారాల్లో కొద్దికొద్దిగా, ఎప్పుడన్నా ఎరుపు కనబడటం సహజం. దానర్థం గర్భం పోతోందనేం కాదు. సాధారణంగా ఈ సమయంలో వీరికి నొప్పి ఉండదు. దీన్నే 'థ్రెటెన్డ్‌

మిస్‌క్యారేజ్‌' అంటారు. వీరిలో చాలామందికి మెల్లగా స్రావం ఆగిపోతుంది, లోపల బిడ్డ కూడా ఆరోగ్యంగానే పెరుగుతుంది. చాలా కొద్దిమందిలో మాత్రమే ఇది గర్భం పోయే వరకూ వెళుతుంది.
గర్భం పోతుంటే.. లక్షణాలేమిటి?
* పొత్తికడుపులో తెరలుతెరలుగా నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం.. గర్భం పోయేటప్పుడు కనబడే సాధారణ లక్షణాలివి. క్రమేపీ యోని నుంచి ఎర్రటి రక్తపు గడ్డల్లా, కణజాలం, ముక్కల వంటివి

బయటకు రావచ్చు. దీనర్థం గర్భం పోయిందనే. నొప్పి దీని ప్రత్యేక లక్షణం.

* కొంతమంది గర్భిణులకు చిత్రంగా... నొప్పి, స్రావం వంటి లక్షణాలేవీ ఉండవు. లోపల బిడ్డ పెరుగుదల ఆగిపోతుంది, లేదా అది చనిపోతుంది. అయినా లోపలే ఉండిపోతుంది. ఉన్నట్టుండి వేవిళ్లు

ఆగిపోవటం, రొమ్ముల్లో సలపరింత తగ్గిపోవటం.. వంటి లక్షణాలు మాత్రమే ఉండొచ్చు. వీరి విషయంలో చాలాసార్లు వైద్యులు పరీక్షించే వరకూ కూడా గర్భం పోయిన విషయం బయటపడదు. (దీన్నే

వైద్యులు 'మిస్డ్‌ మిస్‌క్యారేజ్‌' అంటుంటారు.)

*కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి కడుపునొప్పి మాత్రం చాలా తీవ్రంగా, ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఇది తప్పకుండా వైద్యుల దృష్టికి

తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. వీరికి పిండం గర్భసంచీలో కాకుండా ఫలోపియన్‌ ట్యూబుల్లో పెరుగుతూ (ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ), అది చిట్లిపోయిందేమో చూడటం చాలా అవసరం. వీరికి అత్యవసరంగా

ఆపరేషన్‌ చెయ్యాల్సిన అసవరం కూడా రావచ్చు.
ఆసుపత్రికి వెళ్లాలా?
గర్భం దాల్చిన తర్వాత ఏ రూపంలో రుతుస్రావం కనబడినా తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. ఎందుకంటే రుతుస్రావం కనబడటానికి గర్భం పోవటం ఒక్కటే కారణం కానవసరం

లేదు. అందుకే వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటివి చేసి కారణం ఏమిటన్నది నిర్ధారిస్తారు. స్కానింగులో పిండం గుండె కొట్టుకుంటోందంటే చాలావరకూ గర్భస్రావం కాదనే అర్థం. గుండె కొట్టుకోవటం

ఆగిపోతే గర్భం పోయిందని అర్థం. ఒకవేళ స్కానింగులో ఇంత స్పష్టంగా తెలియకపోతే ఒకటిరెండు వారాల తర్వాత మళ్లీ స్కానింగుకు రమ్మని చెబుతారు. గర్భం పోయిందని నిర్ధారణ అయ్యి.. ఇతరత్రా

సమస్యలేవీ లేకపోతే... చాలామందికి ముక్కలవీ కొద్దిరోజుల్లో సహజంగానే రుతుస్రావంతో కలిసి బయటకు వెళ్లిపోయి మెల్లగా రుతుస్రావం ఆగిపోతుంది. దీనికి 14 రోజుల వరకూ పట్టొచ్చు. ఇతరత్రా

సమస్యలేవైనా ఉంటే మాత్రం వైద్యులు ఇలా సహజంగా అదే వెళ్లిపోతుందని వదిలెయ్యకుండా చికిత్సా మార్గాలను సూచిస్తారు. ముఖ్యంగా ముక్కలన్నీ శుభ్రంగా బయటకువెళ్లిపోవటానికి మందులను

సూచిస్తారు. ఇందుకు నోటి ద్వారా తీసుకునే మాత్రలుంటాయి, కొన్నింటిని యోనిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతో గర్భసంచీలోనిదంతా బయటకు వెళ్లిపోతుంది. దీనికోసం ఆసుపత్రిలో చేరాల్సిన

పని కూడా ఉండదు. దీనివల్ల ఓ మూడు వారాల వరకూ రుతుస్రావం అవ్వచ్చుగానీ, ఇదేమంత ఎక్కువగా ఉండదు. మూడు వారాల తర్వాత గర్భనిర్ధారణ పరీక్ష చేసి చూసుకోవటం అవసరం.

కొద్దిరోజుల్లో రక్తస్రావం ఆగకపోయినా, మరీ ఎక్కువ అవుతున్నా వైద్యులు చిన్నాపరేషన్‌ సూచించొచ్చు. మందులు కుదరకపోయినా, లేక మందులతో సరిగా అవ్వకపోయినా అప్పుడు వైద్యులు కొద్దిగా

మత్తు ఇచ్చి.. గర్భాశయ ముఖద్వారాన్ని వెడల్పుచేసి, లోపల మిగిలిపోయిన ముక్కల వంటివాటన్నింటినీ బయటకు తీసేస్తారు. దీంతో సమస్య సర్దుకుంటుంది. దీని తర్వాత జ్వరం వచ్చినా, లేక

దుర్వాసనతో స్రావాలు వస్తున్నా, పొత్తికడుపులో నొప్పి వస్తున్నా ఇన్ఫెక్షన్‌ వచ్చిందేమోనని అనుమానించి వైద్యులకు చూపించుకోవటం చాలా అవసరం. దీన్ని కూడా యాంటీబయాటిక్స్‌తో

సమర్థంగానే నయం చెయ్యొచ్చు.
మానసికంగానూ కోలుకోవాలి!
గర్భం పోయినట్లు తెలియగానే కాస్త బాధగా, వెలితిగా అనిపించటం సహజం. గర్భం కావాలనుకున్నది కాకపోయినా.. అది పోయిందని తెలిసినప్పుడు ఎంతోకొంత వేదనగా అనిపించొచ్చు. ఈ

సమయంలో మనసులో భావాలను ఇతరులతో పంచుకోవటం చాలా ఊరటనివ్వచ్చు. గర్భం వచ్చిన విషయం, అది పోయిన విషయం కుటుంబంలోని వారికి, స్నేహితులకు తెలియకూడదని

అనుకుంటుంటే వైద్యులతోగానీ, కౌన్సెలర్‌తోగానీ మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మనసులో రకరకాల భావోద్వేగాలు రేగుతూ.. పరిస్థితులు గందరగోళంగా అనిపించే అవకాశాలే ఎక్కువ.

ముఖ్యంగా భాగస్వామి నుంచి ఆశించినంత సహకారం దక్కుతోందా? ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎలా ఉన్నాయి? త్వరగా కోలుకుని రోజువారీ పనుల్లోకి వెళ్లిపోవాల్సిన అవసరం ఉందా? భవిష్యత్తులో మళ్లీ

గర్భం వస్తుందా? లేదా అన్న భయాలు.. ఇలాంటివన్నీ కలిసి.. మానసికంగా కల్లోలం రేగినట్లుండొచ్చు. వైద్యులు, లేదా కౌన్సెలర్ల సలహా తీసుకుంటే ఆత్మవిశ్వాసం, సాంత్వన లభిస్తాయి.
గర్భం పోయిన తర్వాత...
* గర్భం పోయిన తర్వాత.. చాలామందికి కొద్దిరోజుల్లో రుతుస్రావం ఆగిపోతుంది. కొందరికి మాత్రం రెండు వారాల వరకూ పట్టొచ్చు. మొత్తానికి చాలామందిలో ఎర్ర గడ్డల వంటివి పడొచ్చుగానీ

రుతుస్రావం మరీ ఎక్కువగా పోదు. బహిష్టు సమయంలో మాదిరిగానే కొద్దిగా నొప్పి ఉండొచ్చు. ఈ నొప్పికి కావాలంటే సాధారణ నొప్పి నివారణ మందులు తీసుకోవచ్చు.

* గర్భం పోయిన 4-6 వారాల తర్వాత మళ్లీ బహిష్టు మొదలవ్వచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, దుర్వాసన ఉన్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యులకు చూపించుకోవాలి. లోపల ఏదైనా ముక్క

మిగిలిపోయి, ఇన్ఫెక్షన్‌ ఆరంభమైతే ఇటువంటి లక్షణాలు కనబడతాయని గుర్తించాలి.

* రుతుస్రావం ఆగిపోయి, సౌకర్యవంతంగా అనిపించేంత వరకూ శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. సౌకర్యవంతంగా అనిపించేంత వరకూ కొద్దిపాటి విశ్రాంతి కూడా మంచిదే.

* గర్భం కావాలనుకుంటున్నవారు.. గర్భం పోయిన వెంటనే మళ్లీ ప్రయత్నించకుండా.. కనీసం ఒక రుతుచక్రం (బహిష్టు) అన్నా సాధారణంగా వచ్చి వెళ్లే వరకూ ఆగటం మంచిది. ఈ సమయంలో

గర్భనిరోధకాలు వాడుకోవచ్చు.

* గర్భం పోతే వెంటనే రక్తం గ్రూపు ఏమిటో చూపించుకోవాలి. ఒకవేళ గర్భిణిది నెగిటివ్‌ గ్రూపు అయితే.. గర్భం పోగానే 'యాంటీ డీ' ఇంజక్షన్‌ తీసుకోవటం అవసరం.
మరోసారి...?
గర్భం పోయిన తర్వాత చాలామందికి పట్టుకునే పెద్ద భయం.. మళ్లీ గర్భం వస్తుందా? రాదా? వచ్చినా నిలబడుతుందా? లేక మళ్లీ ఇలాగే అవుతుందా? అన్నది. నిజానికి గర్భం పోవటమన్నది

చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. దీనికి కూడా చాలాసార్లు కడుపులో ఉన్న పిండం సజావుగా లేకపోవటమే కారణమవుతుంటుంది. వరసగా రెండుసార్లు గర్భం పోవటమన్నది 5%

కంటే తక్కువమందిలోనే జరుగుతుంది, ఇక వరసగా మూడుసార్లు పోవటమన్నది 1% కంటే కూడా తక్కువ. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులుపడాల్సిన పని లేదు. గర్భం పోయిన

తర్వాత సహజంగా ఒక రుతుచక్రం అయ్యే వరకూ ఆగి, ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించొచ్చు. గర్భం వచ్చి, రెండు కంటే ఎక్కువసార్లు పోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం-పొగ వంటివాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలియాసిడ్‌ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా

చూసుకోవటం.. ఇవన్నీ తర్వాతి గర్భాలు ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేసే అంశాలు.
తరచూ పోతుంటే..?
మొదటి 23 వారాల్లోపే గర్భం పోతుండటం, ఇలా వరసగా మూడుసార్ల కంటే ఎక్కువగా జరిగితే దాన్ని వైద్యులు 'రికరెంట్‌ మిస్‌క్యారేజ్‌' అంటారు. ఇది మానసికంగా ఎంతో వేదన మిగిల్చే పరిస్థితి.

దాదాపు వందమందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంటుంది. వీరిలో ప్రత్యేకమైన సమస్యలేమైనా ఉన్నాయా? అని వైద్యులు లోతుగా పరీక్షిస్తారు. ఇందుకోసం కొన్ని రక్తపరీక్షలు, క్రోమోజోముల పరీక్షలు,

అల్ట్రాసౌండ్‌ వంటివి చేయిస్తారు. మరీ అవసరమైతే హిస్టెరోస్కోపీ, సోనోహిస్టెరోగ్రామ్‌ వంటివి చేయిస్తారు. వయసు ఎక్కువగా ఉండటంతో పాటు గతంలో గర్భాలు ఎన్ని ఎక్కువసార్లు పోతే.. మళ్లీ పోయే

రిస్కు అంత ఎక్కువగా ఉంటుంది. వైద్యులు జన్యుపరమైన లోపాల వంటివన్నీ చూస్తారు. అలాగే గర్భాశయ నిర్మాణం ఎలా ఉందన్నదీ పరిశీలిస్తారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌)

గర్భం పూర్తయ్యే వరకూ బిగువుగా ఉండాలి. కానీ కొద్దిమందిలో ఇది మధ్యలోనే బిగువు సడలిపోయి, 3-6 నెలల మధ్యే గర్భం పోయేలా చేస్తుంది. వీరిని అల్ట్రాసౌండ్‌ పరీక్షల్లో ముందుగానే

గుర్తించొచ్చు. ఇలాంటి వారికి వైద్యులు ముందస్తు జాగ్రత్తగా సర్విక్స్‌కు ఒక కుట్టు వేస్తారు. అండాశయాల్లో నీటితిత్తులు (పాలి సిస్టిక్‌ ఓవరీ) సమస్య ఉన్న వారికి హార్మోన్లు అస్తవ్యస్తమై గర్భం

పోవచ్చన్న భావన ఉందిగానీ పాలిసిస్టిక్‌ సమస్య వల్లే ఇలా జరుగుతుందని చెప్పేందుకు ప్రత్యేక ఆధారాలేవీ లేవు. అవసరాన్ని బట్టి వైద్యులు వీరికి హార్మోన్‌ చికిత్సలు అందిస్తారు. తరచూ గర్భాలు

పోతున్న వారిలో 15% మందికి 'యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబోడీ'లనేవి ఉంటాయి. వీటివల్ల గర్భం నిలబడే అవకాశాలు తక్కువ. వీరికి వైద్యులు పరిస్థితిని బట్టి రకరకాల చికిత్సా విధానాలు

సూచిస్తారు. తరచూ గర్భస్రావాలు ఎందుకు అవుతున్నాయన్నది అందరి విషయంలోనూ ఇదమిత్థంగా గుర్తించటం కష్టం కావచ్చు. ఒకవేళ గుర్తించలేకపోయినా దిగులుపడాల్సినదేమీ లేదు,

ఎందుకంటే ఏకారణమూ తెలియకుండా తరచూ గర్భస్రావాలు అవుతున్న 60-70 శాతం మంది కూడా.. ఆ తర్వాత చక్కగా గర్భం దాల్చి, పండంటి బిడ్డలను కంటున్నట్టు స్పష్టంగా గుర్తించారు.

కాబట్టి బెంబేలు పడిపోవాల్సిందేమీ లేదు, ఆశావహంగా ఉండటం ముఖ్యం!

Courtesy with : Dr.Pranathi Reddy (Rainbow hos.Hyd)@eenadu sukhibhava(28-Jan-14).
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, January 15, 2014

Care for prevention of heart & blood vessels diseases,గుండె పోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా జాగ్రత్తలు

  •  
 

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండె పోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...





మనకు గుండె జబ్బులు రాకుండా చూసుకోవటమెలాగో తెలుసు. గుండెను ఆరోగ్యకరంగా కాపాడుకోవటమెలాగో బాగానే తెలుసు. ఈ విజ్ఞానానికి కొదవ లేదు. అయినా ఈ దారిలో ప్రయాణించటంలో, ఈ గమ్యాన్ని చేరుకోవటంలో మనం ఘోరంగా విఫలమవుతున్నాం. ఇందుకు ఏటా 1.73 కోట్ల మంది గుండె, రక్తనాళాల వ్యాధులతో దుర్మరణం పాలవుతుండటమే ప్రత్యక్ష తార్కాణం! నేడు ప్రపంచ వ్యాప్తంగా మనుషులను అత్యధికంగా కబళిస్తున్న అతిపెద్ద ముప్పు... 'నంబర్‌ ఒన్‌ కిల్లర్‌'.. గుండె పోటు, రక్తనాళాల వ్యాధులే కావటం ఇందుకు ప్రబల నిదర్శనం! వీరిలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు.. యువకులు.. అన్ని వయసుల వారూ ఉంటున్నారు. పైగా పేద దేశాల వారే ఎక్కువ ఉంటున్నారు. ఇల్లు గడిపేవారూ, సంసారాన్ని నడిపే వారూ.. అందరూ ఉంటున్నారు. దీనివల్ల కుటుంబాలు కకావికలమైపోతున్నాయి. సమాజం అతలాకుతలమవుతోంది. నిజానికి ఇవన్నీ చాలావరకూ నివారించదగ్గ మరణాలే! మనం చక్కటి దారిలో నడిస్తే చాలు.. ఆరోగ్యకరమైన బాటలో పయనిస్తే చాలు... ఈ జబ్బులు మన జోలికి రావు. గుండెపోటు, పక్షవాతం వంటి రక్తనాళాల వ్యాధులకు కారణమవుతున్న ముప్పుల్లో చాలాభాగం నివారించుకోదగ్గవీ, నియంత్రించుకోదగ్గవే! కాబట్టి దారి తెలిసిన తర్వాత గమ్యం తప్పటం అర్థరహితం. అందుకే ఈ ఏటి 'ప్రపంచ హృదయ దినం' సందర్భంగా... మనందరం 'ఆరోగ్యకరమైన బాట పడదాం...World heart day, prevention of heart disease,ప్రపంచ హృదయ దినం,గుండె జబ్బుల నివారణ.


క్రమం తప్పకుండా బీపీ చూపించుకోండి
పక్షవాతం, గుండె జబ్బులకు అతిపెద్ద ముప్పు కారకం.. హైబీపీ! మనకు బీపీ ఎక్కువున్నా ఎటువంటి హెచ్చరికలూ, లక్షణాలూ, సంకేతాలూ ఉండవు. లోపల్లోపల అది చెయ్యాల్సిన నష్టం చేస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని 'సైలెంట్‌ కిల్లర్‌' అంటారు. తరచూ మీరే బీపీ చూపించుకోండి.

వెంటనే పొగకు--వీడ్కోలు పలకండి!
పొగ మానేసిన 2 ఏళ్లకు గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. కానీ దాని ప్రభావం పూర్తిగా తగ్గి... ఆ ముప్పు అస్సలు పొగ అలవాటు లేనివారి స్థాయికి చేరటానికి 15 ఏళ్లు పడుతుంది. కాబట్టి తక్షణం పొగ మానెయ్యండి. ఇందుకు అవసరమైతే వైద్యులు, నిపుణుల సహాయం తీసుకోండి.

రక్తంలో 'షుగరు'--పరీక్ష తప్పనిసరి
రక్తంలో గ్లూకోజు ఎక్కువుండటం మధుమేహానికి సంకేతం. మధుమేహుల్లో 60% మరణాలకు గుండెపోటు, పక్షవాతాలే కారణం. కాబట్టి ఇప్పటికే మనకు తెలియకుండా మధుమేహం ఉన్నా, లేక తెలిసీ అది నియంత్రణలో లేకున్నా.. అనవసరంగా మనం గుండెపోటు, పక్షవాతం ముప్పు పెంచుకుంటున్నట్టే. దానిపై కన్నేయండి!

చురుకైన శారీరక--శ్రమ చెయ్యండి!
రోజుకు 30 నిమిషాల చొప్పున ఒక మోస్తరు వ్యాయామం వారానికి ఐదుసార్లు చేసినా గుండెపోటు, పక్షవాతాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. వ్యాయామం కోసం పని గట్టుకుని జిమ్‌లకు వెళ్లక్కర్లేదు. శక్తిని ఖర్చుచేస్తూ, కండరాలకు బలాన్నిచ్చే ఏ పనైనా.. అంటే పిల్లలతో ఆడటం, నడవటం, నాట్యం.. ఏం చేసినా మంచిదే.

ఏం తింటున్నామో--ఒక కన్నేయండి!
నూనె, కొవ్వులు, ఉప్పు.. ఇవి ఎక్కువగా తిన్నకొద్దీ గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. కొవ్వు ఎక్కువైతే రక్తనాళాలు పూడికలతో మూసుకుపోయే ముప్పు పెరుగుతుంది. రడీమేడ్‌ ఆహారంలో ఉప్పూ, కొవ్వూ.. రెండూ ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకర ఆహారాన్ని తినటం అలవరచుకోండి.

మీ వ్యక్తిగత అంకెలు--తెలుసుకోండి
మన జీవితం హాయిగా సాగుతుండాలంటే కొన్ని అంకెలు ముఖ్యం. మన ఎత్తుబరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 లోపుండాలి. బీపీ 120/80కి దగ్గరగా ఉండాలి. రక్తంలో గ్లూకోజు పరగడుపున 100లోపు, తిన్న తర్వాత రెండు గంటలకు 140 లోపుండాలి. కొలెస్ట్రాల్‌ 200 లోపుండాలి. ఆర్నెల్లకోసారైనా ఈ అంకెలు చూసుకుంటూ ఉండటం ఆరోగ్యప్రదం.

హెచ్చరిక--ఏటా దాదాపు 30 లక్షల మంది కేవలం తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్లే మరణిస్తున్నారు. నిజానికి ఇవన్నీ నివారించదగ్గ మరణాలే!

మనం ఎక్కువగా అనారోగ్యకర ఆహారానికి అలవాటు పడిపోతున్నాం. అర్ధాంతర మరణాలకు కారణమవుతున్న పది ముప్పు కారకాల్లో కనీసం 4 దీనివల్లే సంప్రాప్తించే ప్రమాదం ఉంది. అవి- 1. హైబీపీ 2. మధుమేహం 3. వూబకాయం. 4. అధిక కొలెస్ట్రాల్‌.

పొగాకు తెచ్చిపెట్టే వ్యాధులతో ప్రపంచవాప్తంగా రోజుకు 15,000 మంది మరణిస్తున్నారు. పొగతాగే ప్రతి ఇద్దరిలో ఒకరు పొగ సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. వీళ్లే కాదు.. వీళ్లు వదులుతున్న పొగ పీల్చిన కారణంగా ఏటా దాదాపు 6,00,000 మంది -ఎలాంటి పొగ అలవాటూ లేనివారు కూడా- మరణిస్తున్నారు, వీళ్లలో పిల్లలూ ఉంటున్నారు.

స్త్రీలకూ ముఖ్యమే
* స్త్రీలకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు తక్కువని చాలామంది నమ్ముతుంటారుగానీ ఇది తప్పు. స్త్రీలు ఎక్కువ మంది మృత్యువు పాలవుతుండటానికి తొలి ముఖ్య కారణం గుండె జబ్బులే! ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా నిమిషానికి ఒక మహిళ చనిపోతున్నారు.

* గుండె జబ్బుల కారణంగా మృత్యువాతపడే ముప్పు మధుమేహం ఉన్న పురుషులకంటే కూడా మధుమేహం ఉన్న స్త్రీలకు చాలా ఎక్కువ. గర్భిణులకు హైబీపీ, మధుమేహం పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. పుట్టే బిడ్డలకూ రకరకాల ముప్పులు సంప్రాప్తిస్తాయి.

* నెలసరి నిలిచిపోయిన స్త్రీలకు హైబీపీ ముప్పు ఎక్కువ. గుండె జబ్బు, పక్షవాతాలకు హైబీపీ అతిపెద్ద కారకం. కాబట్టి స్త్రీలు తరచూ బీపీ చూపించుకోవటం చాలా ముఖ్యం.

* పొగతాగే పురుషుల కంటే కూడా పొగతాగే స్త్రీలకు పురుషుల కంటే కూడా పక్షవాతం ముప్పు ఎక్కువ. తాము తాగకున్నా ఇంట్లో ఇతరులు వదిలే పొగ పీల్చినా స్త్రీలకు గుండె జబ్బుల ముప్పు 15% పెరుగుతుంది.

* స్త్రీలకు గుండెపోటు వస్తే పురుషుల్లో మాదిరిగా ఛాతీ నొప్పి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, పైగా వీరిలో వికారం వాంతులు, నడుము నొప్పి, దవడ నొప్పి, శ్వాస కష్టం కావటం వంటి సాధారణ లక్షణాలే ఉండొచ్చు. దీన్ని గుర్తుపట్టలేకపోతే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి స్త్రీలు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించటం, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం వారికే కాదు.. యావత్‌ కుటుంబానికీ కూడా మంచిది.

పిల్లల్లోనే బీజం!
చిన్నవయసులోనే మనం ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పిస్తే పిల్లలు పెరిగి పెద్త్దెన తర్వాత కూడా అదే అలవాట్లను కొనసాగిస్తారు. మూడింట రెండొంతుల అకాల మరణాలకూ, పెద్దవారిలో కనిపించే మూడింట ఒక వంతు వ్యాధులకూ యుక్తవయస్సులోనే బీజాలు పడుతున్నాయి. పొగాకు వాడకం, వ్యాయామానికి బద్ధకించటం, అనారోగ్యకర ఆహారపుటలవాట్ల వంటివి ఈ వయసులోనే ఆరంభమవుతాయి.

* పొగ, పొగాకు బానిసల్లో చాలామంది యుక్తవయుస్సులోనే దాన్ని మొదలుపెడుతున్నారు. ఇక తల్లిదండ్రులు పొగతాగేవారైతే వారి పిల్లలకు ఈ అలవాటు అంటుకునే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.
* చిన్నవయసులోనే అధిక బరువు, వూబకాయం ఉన్న పిల్లలు.. పెద్దయ్యాకా స్థూలకాయులుగానే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. వీరికి మధుమేహం, గుండె జబ్బుల వంటివి చిన్నవయసులోనే వచ్చే అవకాశం మరింత అధికం.

* చిన్నప్పుడే వ్యాయామాన్ని అలవాటు చేస్తే.. అది పెద్దయ్యాకా కొనసాగుతుంది. దీంతో మున్ముందు మధుమేహం, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయి.

* చూడగానే ఆకట్టుకునేవి, 'అబ్బ ఎంతబాగుందో' అనిపించేవి చిన్నపిల్లలనూ, యుక్తవయసువారినీ బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన ఆరోగ్యకర పదార్థాలు, వాళ్లు ఇష్టపడే వ్యాయామాలు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. మంచి ఆహారం తింటూ బాగా వ్యాయామం చేసే పిల్లలు బడుల్లో, చదువుల్లో, ఆటల్లో అన్నింటా రాణిస్తారు. ఏకాగ్రతా పెరుగుతుంది.

* పిల్లల్లో మంచి అలవాట్లకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఇంట్లో పెద్దలు ఆరోగ్యకర ఆహారం తినటానికి, వ్యాయామం చెయ్యటానికి ప్రయత్నిస్తుంటే.. పిల్లలూ అదే బాట పడతారు. అందరూ ఆరోగ్యంగా ఉండటం కుటుంబ శ్రేయస్సుకు ముఖ్యమన్న భావన వారిలోనూ కలుగుతుంది.

* తాము ఆడలేని ఆటలు, చెయ్యలేని వ్యాయామాల గురించి చెబితే పిల్లలు చేయరు. కాబట్టి వాళ్లు చేయగలిగినవే వారికి చెప్పాలి. వాటిని ఒక పనిలా కాకుండా వినోదం అందించేలా మలచాలి. ఆటల్లో గెలిస్తే మెచ్చుకుంటూ, బహుమతులు ఇస్తూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. సైకిల్‌ తొక్కటం, ఈత, నడక వంటివి పిల్లలకు తేలికగా నేర్పించొచ్చు.

* టీనేజి పిల్లలపై తోటివారి ప్రభావం ఎక్కువ. కాబట్టి స్నేహితులతో ఆడుకునే అవకాశాలు కల్పించాలి. ఆటలంటే ఫుట్‌బాల్‌ వంటివే కానక్కర్లేదు, కలిసి డ్యాన్స్‌ చెయ్యటం, స్కూలుకు నడిచి వెళ్లటం వంటివీ మంచివే. వీటివల్ల పిల్లల్లో ఆరోగ్య స్పృహతో పాటు కలుపుగోలుతనమూ పెరుగుతుంది.

* టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేమ్స్‌ ముందు కూచునే సమయాన్ని పరిమితం చేయాలి. శారీరకంగా చురుకుగా ఉండేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉంచాలి.

* కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేస్తే పిల్లలు చెడు తిండ్ల వైపు మళ్లే అవకాశం తగ్గుతుంది. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఆహారం పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. అందువల్ల రకరకాల కూరగాయలతో వంటలు వండేలా చూసుకోవాలి. వీలైతే కూరగాయలు కొనేందుకు పిల్లలనూ వెంట తీసుకెళ్లాలి. ఏయే కూరగాయలు వండాలో వారినే ఎంచుకోమని చెప్పాలి. సాయంత్రం, రాత్రి ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వుల వంటివి బాగా తగ్గించి.. తప్పనిసరిగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూడాలి.

* పిల్లలు నానాటికీ బయట మార్కెట్లో ప్యాకెట్లలో అమ్మే తినుబండారాల పట్ల మోజు పెంచుకుంటున్నారు. వీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యకర కొవ్వులూ ఎక్కువే. కాబట్టి వీటిని బాగా తగ్గించెయ్యాలి.

 Source : sukhibhava@eenadu news paper - September 26, 2013
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, January 3, 2014

Brain surgery and awareness,మెదడుకు చేసే సర్జరీలూ అవగాహన





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మెదడుకు చేసే సర్జరీలూ అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • మెదడు
మన మనుగడకు మూలాధారం! మన ఆశలకూ, ఆలోచనలకూ.. అనుబంధాలకూ, ఆశ్చర్యాలకూ.. మేధకూ.. చివరికి బాధలకూ... అన్నింటికీ అదే భాండాగారం! ఎంత కీలకమో అంత సున్నితం! అందుకే 'శిరోధార్యం'లా.. మన తలలో పటిష్ఠమైన రక్షణ ఏర్పాట్ల మధ్య.. దృఢమైన కపాల ఎముకల గూడులో.. నీటి అలల నడుమ.. సుతారంగా తేలుతుంటుంది మన మెదడు! అక్కడి నుంచే అణువణువునూ నియంత్రిస్తూ.. ఆపాదమస్తకాన్ని శాసిస్తూ.. అంతా తానై మన జీవితాన్ని నడిపిస్తుంటుంది.

అందుకే మెదడులో ఏదైనా సమస్య తెలెత్తిందంటే భయంతో కంపించిపోతాం. ఇక ఆ సమస్యను తొలగించేందుకు మెదడు మీద కత్తి పెడతారంటే... ఎంత భయం ముసురుకుంటుందో అనూహ్యం! కపాల ఎముక తెరిచి... మెదడును ముట్టుకుని.. దాన్ని మరమ్మతు చేస్తారన్న వూహే వణుకుపుట్టిస్తుంది. కానీ మన ఆధునిక వైద్యరంగం, 'న్యూరో సర్జరీ' విభాగం ఈ దిశగా ఎంతో పురోగమించింది. నిత్యం మెదడు మీద అత్యంత క్లిష్టమైన సర్జరీలను సునాయాసంగా పూర్తిచేస్తూ.. మనిషికి భరోసాగా నిలబడుతున్న ఈ విభాగంపై అవగాహన పెరిగిన కొద్దీ మనలో భయాలు తొలగిపోతాయి. అందుకే దీనికి సంబంధించిన ఎన్నో అబ్బురపరిచే అంశాలు .

మన మెదడు ఓ విస్మయాల పుట్ట! నిజంగా చెప్పాలంటే అదో కొవ్వు ముద్ద. తనకంటూ ఒక ఆకృతి ఉండదు. బయటకు తీసి బల్ల మీద పెడితే ముద్దలా, సుద్దలా కూలబడుతుంది. అలాంటి మన మెదడు.. పుర్రె ఎముక గూడులో నీళ్లలాంటి ద్రవంలో తేలియాడుతూ.. ఆ ద్రవం ఒత్తిడికే ఆ ఆకృతిలో ఉంటుంది. మన మెదడు గురించి ఇటువంటి వింతలూ, విశేషాలూ ఎన్నో! ఇదే కాదు, మెదడుకు చేసే సర్జరీలూ ఇంతే ఆసక్తికరం.

  • కీలకంలో అత్యంత కీలకం!
మెదడులోని భాగాలన్నీ కీలకమైనవే అయినా... కొన్ని ప్రాంతాలు మరింత కీలకం! వీటినే 'ఎలోక్వెంట్‌ ఏరియా'లంటారు. వీటికి ఏపాటి నష్టం జరిగినా ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు మన రెండు చెవులకూ పైభాగాన ఉండే మెదడు భాగం (మోటార్‌ కార్టెక్స్‌) దెబ్బతింటే.. ఏ వైపు దెబ్బతిందో దానికి అభిముఖంగా ఉండే శరీర భాగం బలహీనపడుతుంది. అలాగే స్పర్శలను తెలియజెప్పే 'సెన్సరీ కార్టెక్స్‌', మాటలకు కేంద్రమైన 'బ్రోకాస్‌' ప్రాంతం, జ్ఞాపకశక్తికి కీలకమైన 'హిప్పోకాంపస్‌', 'టెంపోరల్‌' లంబిక.. ఇలా ఏవి దెబ్బతిన్నా సమస్యే. మరోవైపు ఫ్రాంటల్‌, టెంపోరల్‌, ఆక్సిపిటల్‌ లంబికలకు ఆపరేషన్‌ చేసి, వీటి నుంచి కొంత భాగాన్ని తొలగించినా కూడా చెప్పుకోదగ్గ సమస్యలుండవు. అందుకే మెదడు సర్జరీల్లో.. ఎక్కడ ఎంత వరకూ తియ్యచ్చు? దేన్ని ముట్టుకోకూడదు? అన్నది కీలకం. ఈ ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు న్యూరో సర్జన్లు 'నావిగేషన్‌' వంటి అత్యాధునిక విధానాలను అనుసరిస్తుంటారు.
  • నొప్పి తెలియదు!
మన ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ మనకు తెలియజెప్పేది మెదడే అయినా.. స్వయానా దాని నొప్పులు మాత్రం దానికి తెలియవు. మెదడును ముట్టుకున్నా, సర్జరీ చేసినా, కొంత భాగం తొలగించినా కూడా నొప్పి ఉండదు. సర్జరీ సమయంలో తల మీద ఉండే చర్మాన్ని కట్‌చేసి తెరిచేప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. సాధారణంగా మెదడు సర్జరీలన్నీ పెద్దమత్తు (జనరల్‌ అనస్థీషియా) కిందే చేస్తారు. కానీ మెదడులోని కీలక ప్రాంతాల్లో కణితుల్లాంటివి ఉంటే, అవసరాన్ని బట్టి స్థానికంగా మత్తు ఇచ్చి సర్జరీ పూర్తి చేస్తారు. మెదడు మీద కొన్ని ప్రాంతాల్లో చేత్తో ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుందిగానీ కొన్ని ప్రాంతాల్లో అదీ తెలియదు. సాధారణంగా మెదడులోని నాడీకణాలన్నీ విద్యుత్‌ ప్రచోదనాలకే ఉత్తేజితమై, ప్రేరణ పొందుతాయి. అందుకే స్థానిక మత్తుతో ఆపరేషన్‌ చేస్తుంటే అవసరాన్ని బట్టి కొన్ని మెదడు ప్రాంతాలను గుర్తించేందుకు కరెంట్‌తో ప్రేరేపిస్తుంటారు కూడా!
  • మాట్లాడుతూనే సర్జరీ
మాటలకు, సంభాషణలకు కీలకమైన 'బ్రోకాస్‌' ప్రాంతం వంటి వాటికి సర్జరీ చెయ్యాల్సి వస్తే- మనం ఎంత ప్రాంతం తొలగిస్తున్నామన్నది తెలుసుకోవటం ముఖ్యం. లేకపోతే సర్జరీ తర్వాత రోగి మాట్లాడలేకపోవచ్చు కూడా. అందుకే స్థానికంగా మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేస్తూ... రోగిని మాట్లాడమని, అంకెలు లెక్కించమని చెబుతూ బ్రోకాస్‌ ప్రాంతాన్ని కరెంట్‌తో ప్రేరేపిస్తారు. ఆ ప్రాంతం ప్రేరేపితమైతే వెంటనే లెక్కించటం ఆగిపోతుంది. ఆగిపోయిందంటే అది 'బ్రోకాస్‌' ప్రాంతమని గుర్తించి, ఆ ప్రాంతంలో కణితి ఉన్నా.. దాన్ని ముట్టుకోకుండా, మిగతా ప్రాంతంలోని కణితిని తొలగించి సర్జరీ పూర్తి చేస్తారు. 'మోటార్‌ కార్టెక్స్‌' విషయంలోనూ ఇంతే. ఇవి రోగి స్పృహలో మాట్లాడుతుండగానే మెదడుకు చేసే సర్జరీలన్న మాట!
  • అపోహ
చాలామంది మెదడులోని కొంత ప్రాంతాన్ని తొలగిస్తే రోగికి మానసికసమస్యలు తలెత్తుతాయని, పిచ్చివాళ్లవుతారని.. రకరకాలుగా భయపడుతుంటారు. అది నిజం కాదు. కొన్నికొన్ని భాగాలను తొలగించినప్పుడు ఆ ప్రాంతం నిర్వహించే పనులను మెదడులోని మిగతా భాగాలు చేపడుతుంటాయి. కాబట్టి చాలామందిలో పెద్ద తేడా కనబడదు. మెదడుకు ఈ సర్దుబాటు శక్తి ఉంది. కీలక ప్రాంతాలు తప్పించి, మిగతా మెదడులో కణితుల వంటివి వచ్చి, కొద్దిభాగం తొలగించినా కూడా సాధారణ జీవితం గడపటానికి పెద్ద ఇబ్బందేం ఉండదు.
మెదడు సర్జరీ: ఎలా చేస్తారు?
ముందు మెదడులో ఏ ప్రాంతానికి సర్జరీ చెయ్యాలో కచ్చితంగా గుర్తించి.. ఆ ప్రాంతంలో తలపై గల చర్మాన్ని వలిచి పక్కకు తీస్తారు. అప్పుడు ఆధునిక పరికరాలతో ఆ కాస్త ప్రాంతం పుర్రె ఎముకకు కోతబెట్టి, దాన్ని తీసి పక్కనబెడతారు. పుర్రె ఎముక తియ్యగానే కింద 'మినింజెస్‌' అనే పొరలు కనబడతాయి. వాటిని కత్తిరించి ఒకవైపునకు తీస్తే కింద ద్రవంలో (సీఎస్‌ఎఫ్‌) మెదడు ప్రత్యక్షంగా కనబడుతుంది. దానిపైన సర్జరీ పూర్తి చేస్తారు. వెంటనే మళ్లీ మినింజెస్‌ను కప్పి కుట్టేసి, ఎముకను తెచ్చి యథాస్థానంలో అమర్చి, పైన చర్మాన్ని మూసి కుట్లేస్తారు. మనం ఒంటి మీద చర్మం ఎక్కడైనా కట్‌ చేస్తే క్రమేపీ అది మానిపోయి, పూడుకుపోతుంది. కానీ మెదడు ఇలా కాదు.. అది కలుస్తుందిగానీ... ఆ ప్రాంతం పనితీరు మెరుగవ్వదు. అందుకే ఎప్పుడూ కూడా మెదడులో అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాల ద్వారానే సర్జరీ చెయ్యాలని చూస్తుంటారు.
  • లంబికల అమరిక :
* నుదురు వెనకాలే ఉండే మెదడు భాగం ఇది. ఈ లంబికల్లో కణుతుల వంటివి పెరిగితే భావోద్వేగపరమైన సమస్యలు ఎక్కువ. కణుతులు లంబికలకు పైవైపున ఉంటే మానసిక కుంగుబాటు వంటి సమస్యలు ఎక్కువ, అదే కిందివైపు ఉంటే తిట్టటం, కొట్టటం వంటి ఉద్రేకపూరిత ప్రవర్తనలు ఎక్కువ. అలాగే వెనక వైపున వస్తే శరీర భాగాల కదలికలు ప్రభావితమవుతాయి.

* వినికిడి, జ్ఞాపకాలు, దృశ్యరూప జ్ఞాపకాలు, ముఖ్యంగా మాటలు, సంభాషణలకు కీలక ప్రాంతం ఇది.

* చెవి పైభాగాన ఉండే లంబికలు. సాధారణ స్పర్శలతో పాటు నొప్పి, వేడి-చల్లదనం వంటివన్నీ మనకు తెలియజెప్పే భాగాలివే. భాష, అంకెలు, లెక్కలు, గణకాలన్నింటికీ కూడా ఇవే కీలకం. అలాగే మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ఏవి ఎక్కడుంటాయి? అన్న పరిసర స్పృహకు కూడా ఇదే కారణం. ఈ లంబికలో కణితుల వంటివి పెరిగి, ఇది దెబ్బతింటే మనం ఇంటికి వెళ్లటం, ఇంట్లో ఏ గది ఎక్కడుందో తెలియటం కూడా కష్టం కావచ్చు.

* తల వెనక భాగాన ఉంటుంది. పరిమాణంలో చిన్నదైనా కంటి చూపునకు కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైనా కణితి పెరిగితే చూపు సమస్యలు తలెత్తుతాయి.
  • సాధారణ దుష్ప్రభావాలు
మెదడుకు సర్జరీ అనగానే చాలామంది రకరకాల దుష్ప్రభావాల గురించి భయపడుతుంటారు. నిజానికి 90% మెదడు సర్జరీలు విజయవంతంగా పూర్తవుతాయి. కేవలం ఓ 10% కేసుల్లో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. మొత్తానికి ఇతర సర్జరీలతో పోలిస్తే మెదడు సర్జరీలతో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం కాస్త ఎక్కువనే చెప్పాలి. కాకపోతే ఇవన్నీ కూడా తాత్కాలిక దుష్ప్రభావాలు. దీర్ఘకాలం మిగిలిపోయేవి కేవలం 1-2% మాత్రమే ఉంటాయి.

తక్షణ దుష్ప్రభావాలు
*మగత: సర్జరీ సమయంలో ఏదైనా తేడా వస్తే రోగి మత్తు నుండి త్వరగా బయటకు రాలేకపోవచ్చు. లేదంటే స్పృహకు కీలకమైన హైపోథాలమస్‌ వంటివి దెబ్బతింటే 4-5 రోజులు మగతగా ఉంటారు. ఇలాంటి వారిని కొద్దిరోజులు 'ఐసీయూ'లో ఉంచి చికిత్స చేస్తే క్రమేపీ మెలకువలోకి వస్తారు.

* ఫిట్స్‌: సర్జరీ సమయంలో ఎంతోకొంత మెదడు చికాకుకు గురవుతుంది. దీనివల్ల సర్జరీ తర్వాత ఫిట్స్‌ రావచ్చు. ఏ రకమైన మెదడు సర్జరీకైనా ఈ బెడద తప్పదు. అందుకే వారికి మూర్ఛ రాకుండా మందులు ఆరంభించి, వాటిని క్రమేపీ కొంతకాలానికి తగ్గిస్తారు.

* రక్తస్రావం: మెదడులో రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. శరీరంలోని మిగతా భాగాల్లో అయితే సర్జరీ సమయంలో రక్తనాళాలను కట్టటం, నొక్కటం వంటివి చేసి రక్తస్రావం ఆపొచ్చు. కానీ మెదడులో సూక్ష్మమైన రక్తనాళాలుంటాయి కాబట్టి అది సాధ్యం కాదు. అందుకే సర్జరీ సమయంలో వాటిని రసాయనాలతో ఆపటం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు సర్జరీ తర్వాత బీపీ పెరగటం వంటివి జరిగితే మెదడులో రక్తస్రావం కావచ్చు. ఇలా చిన్న రక్తం గడ్డ ఏర్పడితే మందులతో తగ్గించొచ్చుగానీ.. మరీ పెద్దగా ఉంటే మాత్రం మళ్లీ సర్జరీ చేసి.. మొత్తం తెరిచి, దాన్ని తొలగించాల్సి వస్తుంటుంది.

* గాలి-నీరు: సర్జరీ సమయంలో మెదడు పొరల్లో ఉండే నీరు బయటకు వస్తుంది. ఆ సమయంలో దాని స్థానంలో గాలి చేరి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి ఆ గాలి లోపల వ్యాకోచించి పీడనం పెంచుతుంది. దీంతో రోగికి మగత, ఫిట్స్‌ వంటివి రావచ్చు. వీరికి బయటి నుంచి అధిక మొత్తంలో ఆక్సిజన్‌ ఇస్తే శ్వాస ప్రక్రియ ద్వారా ఆ గాలి మెల్లగా బయటకుపోయి, దాని స్థానంలో ఆక్సిజన్‌ చేరుతుంది. సమస్య సర్దుకుంటుంది. ఇది పని చెయ్యకపోతే- చిన్న రంధ్రం చేసి, ఆ గాలిని బయటకు లాగెయ్యాల్సి ఉంటుంది.

మొత్తానికి ఇవన్నీ కూడా తాత్కాలికమైన దుష్ప్రభావాలే. వీటిని వైద్యులు సమర్థంగా ఎదుర్కొంటారు.
  • అపోహ
మెదడుకు సర్జరీ అంటే చాలామంది.. తలపైని పుర్రె ఎముక మొత్తాన్ని డిప్పలాగా కట్‌ చేసి పక్కనపెట్టి.. మెదడుకు మరమ్మతుచేసి.. మళ్లీ దాన్ని వెనక్కిపెట్టేస్తారని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మెదడులో ఏ ప్రాంతంలో సమస్య ఉందో ముందే గుర్తిస్తారు కాబట్టి.. కేవలం ఆ కాస్త భాగం దగ్గర మాత్రమే పుర్రె ఎముకను కట్‌ చేసి, మెదడు సర్జరీ పూర్తిచేస్తారు. డిప్పలా మొత్తం తియ్యటం ఉండదు.

  • నావిగేషన్‌: మెదడు మొత్తం ఓ మ్యాప్‌
మెదడు మీద సర్జరీ చేసేటప్పుడు.. తాము ఏ ప్రాంతాన్ని ముట్టుకుంటున్నామో, ఎక్కడున్నామో సర్జన్లకు తెలియటం అత్యంత కీలకం. ఇందుకోసం అద్భుతంగా ఉపయోగపడే పరిజ్ఞానం 'నావిగేషన్‌'. దీనికోసం ఆపరేషన్‌ థియేటర్లో 'ఇన్‌ఫ్రారెడ్‌ కెమేరాలు' అమర్చి ఉంటాయి. సర్జరీకి ముందు రోజే రోగి మెదడులో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాలు ఎలా ఉన్నాయనే వివరాలన్నింటినీ ఒక మ్యాప్‌లాగా దానిలో నిక్షిప్తం చేస్తారు. సర్జరీ రోజున రోగిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లగానే తలకు కెమేరాలకు అనుసంధానించిన ఫ్రేమ్‌ను అమరుస్తారు. ఇక అక్కడి నుంచీ అది కచ్చితంగా సర్జన్‌- మెదడు మీద ఏ ప్రాంతంలో ఉన్నారో, ఆ ప్రాంతం ఎలాంటిదో, దాన్ని తొలగించవచ్చో లేదో ఎప్పటికప్పుడు (జీపీఎస్‌ లాగా..) హెచ్చరిస్తుంటుంది. కాబట్టి తప్పు జరిగే ఆస్కారమే ఉండదు. కణితుల వంటివి మెదడు ఉపరితలం మీద ఉంటే స్పష్టంగా కనబడతాయిగానీ లోపలగా ఉంటే వాటిని గుర్తించటం కష్టం. ఇలాంటి సందర్భాల్లో 'నావిగేషన్‌' పరిజ్ఞానం బాగా ఉపకరిస్తుంది. గతంలో చిన్న కణితులను తొలగించాల్సి ఉన్నా.. దాన్ని చేరుకోవటానికి తల మీద పెద్ద ప్రాంతం తెరవాల్సి వచ్చేది. ఇప్పుడు నావిగేషన్‌ సాయంతో కచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడో గుర్తించి.. అక్కడే తెరిచి... వాటిని తొలగించొచ్చు.

  • ఇవీ సర్జరీలు--కణితులకు సర్జరీ
  •  
మెదడుకు సంబంధించిన సమస్యల్లో కణితులు ముఖ్యమైనవి. ఇవి మెదడులో ఎక్కడైనా రావచ్చు. వీటిలో దాదాపు 60% క్యాన్సర్‌ కణితులే. సాధారణ కణితిని సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ కాన్సర్‌ కణితులను తొలగించటంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివీ అవసరమవుతాయి. మెదడులో వచ్చే క్యాన్సర్‌ కణితుల్లో 4 గ్రేడులు ఉంటాయి. సాధారణంగా ఇతరత్రా క్యాన్సర్లు 1వ దశతో మొదలై.. క్రమేపీ ముదిరి 4వ దశకు చేరతాయి. కాబట్టి తొలిదశలో గుర్తిస్తే వాటిని దాదాపు నయం చేసే వీలుంటుంది. కానీ మెదడు కణితులు ఇలా కాదు. అవి క్రమేపీ ఒక దశ నుంచి మరోదశకు వెళ్లటమన్నది ఉండదు. మొదలవుతూనే 3వ, 4వ దశల్లో కూడా ఉండొచ్చు. కణితి 1, 2 గ్రేడుల్లో ఉంటే చికిత్సతో దాదాపు పదేళ్ల వరకూ కూడా బాగానే జీవించగలుగుతారు. 4వ దశ కణితులు తీవ్రమైనవి, వీరు ఎక్కువకాలం జీవించటం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగులో అది గ్రేడ్‌-1, 2 లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన పనిలేదు. అది పెరుగుతుంటే, 2-3 సెం.మీ. కంటే పెద్దగా ఉంటే సర్జరీ అవసరం. ఇక 3, 4 దశల్లో ఉంటే సర్జరీతో పాటు రేడియేషన్‌, కీమోథెరపీలూ అవసరమవుతాయి. అలాగే ఫ్రాంటల్‌, టెంపోరల్‌ లంబికల్లో వచ్చే కణితులను సర్జరీతో తొలగిస్తే చాలావరకూ సాధారణ జీవితం గడపగలుగుతారు. మెదడు మధ్య భాగంలో అంటే బేసల్‌ గాంగ్లియా, థాలమస్‌, కార్పస్‌ కలోజమ్‌ వంటి ప్రాంతాల్లో వచ్చే కణితులు మాత్రం ఉద్ధృతంగా ఉంటాయి.

* అందుకే ఎప్పుడైనా సరే- తీవ్రమైన, విడవని తలనొప్పి, వాంతులు, చూపు సమస్యలు, ఫిట్స్‌ వంటి లక్షణాలు ఉన్నట్టుండి మొదలైతే వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులకు చూపించుకుని, మెదడులో కణితులు లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.

* సర్జరీ: కణితులు కీలక ప్రాంతాల్లో వస్తే వాటిని పూర్తిగా తొలగించటం సాధ్యం కాకపోవచ్చు. మాటలు, కదలికలకు కీలకమైన ప్రాంతాలను గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితులను తొలగిస్తారు. మిగిలిపోయిన వాటిని రేడియో థెరపీ, కీమోథెరపీలతో నయం చేసే ప్రయత్నం చేస్తారు.

* కణితి మెదడు మధ్యలో వస్తే- మెదడు కణజాలాన్నీ, కణితినీ వేరుచేసి చూడటం కష్టం కావచ్చు. ఇలా పొరపాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ తేడా గుర్తించేందుకు- మైక్రోస్కోపు, నావిగేషన్‌ వంటి పరిజ్ఞానాలు ఉపయోగపడతాయి. ఒకవేళ మైక్రోస్కోపుతో గుర్తుపట్టలేమనుకుంటే సర్జరీకి ముందు రోజు- 'డై' రంగు మందు తాగిస్తారు. ఆ రంగు రక్తం ద్వారా శరీరమంతా వ్యాపించి మెదడులోని కణితుల్లో ఎక్కువగా చేరుతుంది. సర్జరీ సమయంలో అక్కడ 'ఫ్లోరసెంట్‌ లైట్‌' వేస్తే కణితి స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు దాన్ని తొలగించటం తేలిక. అదీ కష్టమనుకుంటే మెదడు కణజాలం, రక్తనాళాలు దెబ్బతినకుండా కేవలం కణితి కణాలను మాత్రమే ధ్వంసం చేసే 'అల్ట్రాసోనిక్‌ ఆస్పిరేటర్‌' సాయంతో కణితిని నిర్మూలిస్తారు.

* సర్జరీ కాని సర్జరీ: హైపోథాలమస్‌, థాలమస్‌, బ్రెయిన్‌ స్టెమ్‌ వంటి కీలక ప్రాంతాల్లో సర్జరీ సాధ్యం కాని చిన్న కణితులు ఉంటే- కత్తిపెట్టాల్సిన పని లేకుండా కేవలం రేడియేషన్‌ ద్వారా కచ్చితంగా కణితిని గుర్తించి దాన్ని తొలగించేందుకు 'రేడియో సర్జరీ' ఉపకరిస్తుంది. దీనికోసం గామానైఫ్‌, నోవాలిస్‌, సైబర్‌నైఫ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిని సాధారణ కణితుల కోసం వాడతారు.

* ముక్క తియ్యటం: మెదడు మధ్య భాగమైన థాలమస్‌, బేసల్‌ గాంగ్లియా వంటి ప్రాంతాల్లో క్యాన్సర్‌ కణుతులు వస్తే వాటిని పూర్తిగా తొలగించటం కష్టం. వీరికి- తల మీద చిన్న రంధ్రం చేసి.. దాని ద్వారా తలకు ఫ్రేమ్‌ బిగించి.. కణితి కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందో అక్కడి నుంచి ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. దీన్ని 'స్టీరియోటాక్సీ బయాప్సీ' అంటారు. దానిలో వచ్చే ఫలితాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలతో చికిత్స చేస్తారు.
  • మూర్ఛకు సర్జరీ
మూర్ఛకు చాలా వరకూ మందులతోనే చికిత్స చేస్తారుగానీ ఓ 30% మందికి మాత్రం 2, 3 రకాల మందులు వాడినా ఫలితం కనబడదు. ఇలాంటి వారికి సర్జరీతో ఫలితం ఉంటుంది. మందులు వాడినా నెలకు 2, 3 సార్లకు మించి ఫిట్స్‌ వస్తూ, రెండేళ్లకు పైగా బాధపడుతుంటే వారికి మందులన్నీ ఆపేసి.. ఆసుపత్రిలో చేర్చి ఫిట్‌ వచ్చినప్పుడు ప్రత్యేకమైన 'వీడియో ఈఈజీ' తీస్తారు. దీనిలో ఫిట్‌కు మూలమైన భాగం ఏది, విద్యుత్‌ సమస్య ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుస్తుంది. తర్వాత ఎమ్మారై చేసి.. ఆ ప్రాంతంలో ఏదైనా తేడా ఉందా? అన్నదీ చూస్తారు. రెంటిలోనూ ఒకే ప్రాంతంలో తేడా ఉందని గుర్తిస్తే- వారికి సర్జరీ చేసి ఆ ప్రాంతాన్ని తొలగించొచ్చు. దాంతో మూర్ఛ నుంచి చాలా వరకూ విముక్తి వస్తుంది. చాలామందికి ఈ సమస్య టెంపోరల్‌ లంబికలో ఉంటుంది. దాన్ని తొలగించినా పెద్ద నష్టం ఉండదు. కీలకమైన ప్రాంతం నుంచి వస్తుంటే మాత్రం వారికి సర్జరీ సిఫార్సు చెయ్యరు. ఒక్కోసారి మెదడులో ఒక ప్రాంతమని కాకుండా... ఒక అర్ధభాగం మొత్తం మూర్ఛకు కారణమవుతుంటుంది. అప్పుడు 'హెమీస్పెరాటమీ' అనే సర్జరీ చేసి.. మెదడులోని రెండు అర్ధభాగాల మధ్యనా ఉండే అనుసంధానాలను కత్తిరిస్తారు. ఇందుకు కంప్యూటర్‌ 'నావిగేషన్‌' పరిజ్ఞానం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
  • పార్కిన్సన్‌కు సర్జరీ
వాస్తవానికి మన మెదడు ఎప్పుడూ అతిగా పని చేసేందుకే ప్రయత్నిస్తుంటుంది. కానీ మెదడులోని మరికొన్ని భాగాలు దాన్ని ఎప్పటికప్పుడు అదుపులో పెడుతుంటాయి. ఇలా మెదడు సమతౌల్యంతో పని చేస్తుంటుంది. అతి చురుకుదనానికి 'బేసల్‌ గాంగ్లియా' భాగం మూలమైతే దాన్ని నియంత్రించేది 'ఫ్రాంటల్‌ లోబ్‌'. ఈ ప్రచోదనాలు ప్రసరించేందుకు సహకరించే రసాయనం డోపమైన్‌. ఏదైనా కారణాన ఈ డోపమైన్‌ ఉత్పత్తి పెరిగినా, తగ్గినా మెదడు అతిగా పని చేస్తూ.. కండరాల వణుకు, కంపనం, బిగువు వంటివి పెరిగి సమస్యాత్మకంగా తయారవుతాయి. ఈ సమయంలో నియంత్రణ పెంచేందుకు కొన్ని కేంద్రాలను ధ్వంసం (లీజనింగ్‌) చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకు 'స్టీరియో టాక్టిక్‌' విధానంలో కచ్చితమైన కేంద్రాన్ని గుర్తించి అక్కడ ఎలక్ట్రోడ్‌ను అమర్చి, విద్యుత్‌తో ప్రేరేపించటం ద్వారా రోగికి కండరాల బిగువు తగ్గుతోందేమో గమనిస్తారు. సర్జరీ సమయంలో రోగిని మెలకువగానే ఉంచుతారు. అలా తగ్గితే 'రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌' ద్వారా దాన్ని ధ్వంసం చేస్తారు. కొందరికి 'హైఫ్రీక్వెన్సీ పేస్‌మేకర్‌' వంటి పరికరంతో 'డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌' చేస్తారు. ఇది కాస్త ఖరీదైనది.

  • పక్షవాతం - సర్జరీ
మెదడులోని రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం రావచ్చు. దీన్ని 'హెమరేజిక్‌ స్ట్రోక్‌' అంటారు. ఇలాంటప్పుడు మెదడు వాచి ఉబ్బినట్లవుతుంది. కానీ అది పెరగటానికి వీల్లేకుండా పుర్రె ఎముక గట్టిగా అడ్డుపడుతుంటుంది కాబట్టి మెదడు వాచిన కొద్దీ లోపల్లోపలే నొక్కుకుపోతూ దెబ్బతినిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు కొందరికి.. ఆ వైపు పుర్రె ఎముకను కట్‌ చేసి మెదడు నొక్కుకుపోకుండా ఖాళీ కల్పించే సర్జరీ చేస్తారు. అలా కట్‌ చేసిన పుర్రె ఎముకను తాత్కాలికంగా డొక్కలో చర్మం కింద ఉంచుతారు. ఎముక తొలగించిన తర్వాత తల పైన చర్మాన్ని కుట్టేస్తారు. మొదట్లో మెదడు వాపు వల్ల అక్కడ ఉబ్బెత్తుగా ఉంటుందిగానీ ఐదారు వారాల్లో రక్తస్రావం దానంతట అదే సర్దుకుంటుంది. క్రమేపీ మెదడు వాపు తగ్గి అక్కడ సొట్టలా తయారవుతుంది. ఇక ఆ సమయంలో- మళ్లీ సర్జరీ చేసి, డొక్కలో పెట్టిన పుర్రె ఎముకను తెచ్చి తిరిగి తల మీద ఉంచి కుట్టేస్తారు.

వాస్తవానికి ఇది పక్షవాతానికి చికిత్స కాదు. రక్తనాళాలు చిట్లి మెదడు వాస్తున్నప్పుడు.. మిగతా మెదడు భాగం నొక్కుకుపోయి దెబ్బతినకుండా రక్షించుకునేందుకు చేసే చికిత్స. ఇలా చెయ్యకపోతే మిగిలిన మంచి భాగం కూడా దెబ్బతింటుంది. చాలామంది దీన్ని పక్షవాతం తగ్గించే సర్జరీ అనుకుంటూ.. ఈ సర్జరీ చేసినా పక్షవాతం పరిస్థితి మెరుగవ్వలేదని విమర్శిస్తుంటారు. వాస్తవానికి ఇది బాగున్న మెదడు భాగాలను రక్షించుకునే సర్జరీనేగానీ పక్షవాతం, దాని దుష్ప్రభావాలను తగ్గించేది కాదు.

* ఇవే కాదు, మెదడుకు క్షయవంటి రకరకాల సందర్భాల్లో కూడా మెదడుకు సర్జరీలు అవసరమవుతుంటాయి.

Courtesy with Dr.Manas Panigrahi(Neuro-surgeon)KIMS hos.Hyd@sukhibhava of eenadu news paper.
  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/