ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండె పోటు, రక్తనాళాల జబ్బులు రాకుండా జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మనకు గుండె జబ్బులు రాకుండా చూసుకోవటమెలాగో తెలుసు. గుండెను ఆరోగ్యకరంగా కాపాడుకోవటమెలాగో బాగానే తెలుసు. ఈ విజ్ఞానానికి కొదవ లేదు. అయినా ఈ దారిలో ప్రయాణించటంలో, ఈ గమ్యాన్ని చేరుకోవటంలో మనం ఘోరంగా విఫలమవుతున్నాం. ఇందుకు ఏటా 1.73 కోట్ల మంది గుండె, రక్తనాళాల వ్యాధులతో దుర్మరణం పాలవుతుండటమే ప్రత్యక్ష తార్కాణం! నేడు ప్రపంచ వ్యాప్తంగా మనుషులను అత్యధికంగా కబళిస్తున్న అతిపెద్ద ముప్పు... 'నంబర్ ఒన్ కిల్లర్'.. గుండె పోటు, రక్తనాళాల వ్యాధులే కావటం ఇందుకు ప్రబల నిదర్శనం! వీరిలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు.. యువకులు.. అన్ని వయసుల వారూ ఉంటున్నారు. పైగా పేద దేశాల వారే ఎక్కువ ఉంటున్నారు. ఇల్లు గడిపేవారూ, సంసారాన్ని నడిపే వారూ.. అందరూ ఉంటున్నారు. దీనివల్ల కుటుంబాలు కకావికలమైపోతున్నాయి. సమాజం అతలాకుతలమవుతోంది. నిజానికి ఇవన్నీ చాలావరకూ నివారించదగ్గ మరణాలే! మనం చక్కటి దారిలో నడిస్తే చాలు.. ఆరోగ్యకరమైన బాటలో పయనిస్తే చాలు... ఈ జబ్బులు మన జోలికి రావు. గుండెపోటు, పక్షవాతం వంటి రక్తనాళాల వ్యాధులకు కారణమవుతున్న ముప్పుల్లో చాలాభాగం నివారించుకోదగ్గవీ, నియంత్రించుకోదగ్గవే! కాబట్టి దారి తెలిసిన తర్వాత గమ్యం తప్పటం అర్థరహితం. అందుకే ఈ ఏటి 'ప్రపంచ హృదయ దినం' సందర్భంగా... మనందరం 'ఆరోగ్యకరమైన బాట పడదాం...World heart day, prevention of heart disease,ప్రపంచ హృదయ దినం,గుండె జబ్బుల నివారణ.
క్రమం తప్పకుండా బీపీ చూపించుకోండి
పక్షవాతం, గుండె జబ్బులకు అతిపెద్ద ముప్పు కారకం.. హైబీపీ! మనకు బీపీ ఎక్కువున్నా ఎటువంటి హెచ్చరికలూ, లక్షణాలూ, సంకేతాలూ ఉండవు. లోపల్లోపల అది చెయ్యాల్సిన నష్టం చేస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అంటారు. తరచూ మీరే బీపీ చూపించుకోండి.
వెంటనే పొగకు--వీడ్కోలు పలకండి!
పొగ మానేసిన 2 ఏళ్లకు గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. కానీ దాని ప్రభావం పూర్తిగా తగ్గి... ఆ ముప్పు అస్సలు పొగ అలవాటు లేనివారి స్థాయికి చేరటానికి 15 ఏళ్లు పడుతుంది. కాబట్టి తక్షణం పొగ మానెయ్యండి. ఇందుకు అవసరమైతే వైద్యులు, నిపుణుల సహాయం తీసుకోండి.
రక్తంలో 'షుగరు'--పరీక్ష తప్పనిసరి
రక్తంలో గ్లూకోజు ఎక్కువుండటం మధుమేహానికి సంకేతం. మధుమేహుల్లో 60% మరణాలకు గుండెపోటు, పక్షవాతాలే కారణం. కాబట్టి ఇప్పటికే మనకు తెలియకుండా మధుమేహం ఉన్నా, లేక తెలిసీ అది నియంత్రణలో లేకున్నా.. అనవసరంగా మనం గుండెపోటు, పక్షవాతం ముప్పు పెంచుకుంటున్నట్టే. దానిపై కన్నేయండి!
చురుకైన శారీరక--శ్రమ చెయ్యండి!
రోజుకు 30 నిమిషాల చొప్పున ఒక మోస్తరు వ్యాయామం వారానికి ఐదుసార్లు చేసినా గుండెపోటు, పక్షవాతాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. వ్యాయామం కోసం పని గట్టుకుని జిమ్‌లకు వెళ్లక్కర్లేదు. శక్తిని ఖర్చుచేస్తూ, కండరాలకు బలాన్నిచ్చే ఏ పనైనా.. అంటే పిల్లలతో ఆడటం, నడవటం, నాట్యం.. ఏం చేసినా మంచిదే.
ఏం తింటున్నామో--ఒక కన్నేయండి!
నూనె, కొవ్వులు, ఉప్పు.. ఇవి ఎక్కువగా తిన్నకొద్దీ గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. కొవ్వు ఎక్కువైతే రక్తనాళాలు పూడికలతో మూసుకుపోయే ముప్పు పెరుగుతుంది. రడీమేడ్ ఆహారంలో ఉప్పూ, కొవ్వూ.. రెండూ ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యకర ఆహారాన్ని తినటం అలవరచుకోండి.
మీ వ్యక్తిగత అంకెలు--తెలుసుకోండి
మన జీవితం హాయిగా సాగుతుండాలంటే కొన్ని అంకెలు ముఖ్యం. మన ఎత్తుబరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 లోపుండాలి. బీపీ 120/80కి దగ్గరగా ఉండాలి. రక్తంలో గ్లూకోజు పరగడుపున 100లోపు, తిన్న తర్వాత రెండు గంటలకు 140 లోపుండాలి. కొలెస్ట్రాల్ 200 లోపుండాలి. ఆర్నెల్లకోసారైనా ఈ అంకెలు చూసుకుంటూ ఉండటం ఆరోగ్యప్రదం.
హెచ్చరిక--ఏటా దాదాపు 30 లక్షల మంది కేవలం తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్లే మరణిస్తున్నారు. నిజానికి ఇవన్నీ నివారించదగ్గ మరణాలే!
మనం ఎక్కువగా అనారోగ్యకర ఆహారానికి అలవాటు పడిపోతున్నాం. అర్ధాంతర మరణాలకు కారణమవుతున్న పది ముప్పు కారకాల్లో కనీసం 4 దీనివల్లే సంప్రాప్తించే ప్రమాదం ఉంది. అవి- 1. హైబీపీ 2. మధుమేహం 3. వూబకాయం. 4. అధిక కొలెస్ట్రాల్.
పొగాకు తెచ్చిపెట్టే వ్యాధులతో ప్రపంచవాప్తంగా రోజుకు 15,000 మంది మరణిస్తున్నారు. పొగతాగే ప్రతి ఇద్దరిలో ఒకరు పొగ సంబంధ సమస్యలతోనే మరణిస్తున్నారు. వీళ్లే కాదు.. వీళ్లు వదులుతున్న పొగ పీల్చిన కారణంగా ఏటా దాదాపు 6,00,000 మంది -ఎలాంటి పొగ అలవాటూ లేనివారు కూడా- మరణిస్తున్నారు, వీళ్లలో పిల్లలూ ఉంటున్నారు.
స్త్రీలకూ ముఖ్యమే
* స్త్రీలకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు తక్కువని చాలామంది నమ్ముతుంటారుగానీ ఇది తప్పు. స్త్రీలు ఎక్కువ మంది మృత్యువు పాలవుతుండటానికి తొలి ముఖ్య కారణం గుండె జబ్బులే! ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కారణంగా నిమిషానికి ఒక మహిళ చనిపోతున్నారు.
* గుండె జబ్బుల కారణంగా మృత్యువాతపడే ముప్పు మధుమేహం ఉన్న పురుషులకంటే కూడా మధుమేహం ఉన్న స్త్రీలకు చాలా ఎక్కువ. గర్భిణులకు హైబీపీ, మధుమేహం పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. పుట్టే బిడ్డలకూ రకరకాల ముప్పులు సంప్రాప్తిస్తాయి.
* నెలసరి నిలిచిపోయిన స్త్రీలకు హైబీపీ ముప్పు ఎక్కువ. గుండె జబ్బు, పక్షవాతాలకు హైబీపీ అతిపెద్ద కారకం. కాబట్టి స్త్రీలు తరచూ బీపీ చూపించుకోవటం చాలా ముఖ్యం.
* పొగతాగే పురుషుల కంటే కూడా పొగతాగే స్త్రీలకు పురుషుల కంటే కూడా పక్షవాతం ముప్పు ఎక్కువ. తాము తాగకున్నా ఇంట్లో ఇతరులు వదిలే పొగ పీల్చినా స్త్రీలకు గుండె జబ్బుల ముప్పు 15% పెరుగుతుంది.
* స్త్రీలకు గుండెపోటు వస్తే పురుషుల్లో మాదిరిగా ఛాతీ నొప్పి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, పైగా వీరిలో వికారం వాంతులు, నడుము నొప్పి, దవడ నొప్పి, శ్వాస కష్టం కావటం వంటి సాధారణ లక్షణాలే ఉండొచ్చు. దీన్ని గుర్తుపట్టలేకపోతే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి స్త్రీలు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించటం, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం వారికే కాదు.. యావత్ కుటుంబానికీ కూడా మంచిది.
పిల్లల్లోనే బీజం!
చిన్నవయసులోనే మనం ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పిస్తే పిల్లలు పెరిగి పెద్త్దెన తర్వాత కూడా అదే అలవాట్లను కొనసాగిస్తారు. మూడింట రెండొంతుల అకాల మరణాలకూ, పెద్దవారిలో కనిపించే మూడింట ఒక వంతు వ్యాధులకూ యుక్తవయస్సులోనే బీజాలు పడుతున్నాయి. పొగాకు వాడకం, వ్యాయామానికి బద్ధకించటం, అనారోగ్యకర ఆహారపుటలవాట్ల వంటివి ఈ వయసులోనే ఆరంభమవుతాయి.
* పొగ, పొగాకు బానిసల్లో చాలామంది యుక్తవయుస్సులోనే దాన్ని మొదలుపెడుతున్నారు. ఇక తల్లిదండ్రులు పొగతాగేవారైతే వారి పిల్లలకు ఈ అలవాటు అంటుకునే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.
* చిన్నవయసులోనే అధిక బరువు, వూబకాయం ఉన్న పిల్లలు.. పెద్దయ్యాకా స్థూలకాయులుగానే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. వీరికి మధుమేహం, గుండె జబ్బుల వంటివి చిన్నవయసులోనే వచ్చే అవకాశం మరింత అధికం.
* చిన్నప్పుడే వ్యాయామాన్ని అలవాటు చేస్తే.. అది పెద్దయ్యాకా కొనసాగుతుంది. దీంతో మున్ముందు మధుమేహం, పక్షవాతం ముప్పులూ తగ్గుతాయి.
* చూడగానే ఆకట్టుకునేవి, 'అబ్బ ఎంతబాగుందో' అనిపించేవి చిన్నపిల్లలనూ, యుక్తవయసువారినీ బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన ఆరోగ్యకర పదార్థాలు, వాళ్లు ఇష్టపడే వ్యాయామాలు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. మంచి ఆహారం తింటూ బాగా వ్యాయామం చేసే పిల్లలు బడుల్లో, చదువుల్లో, ఆటల్లో అన్నింటా రాణిస్తారు. ఏకాగ్రతా పెరుగుతుంది.
* పిల్లల్లో మంచి అలవాట్లకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఇంట్లో పెద్దలు ఆరోగ్యకర ఆహారం తినటానికి, వ్యాయామం చెయ్యటానికి ప్రయత్నిస్తుంటే.. పిల్లలూ అదే బాట పడతారు. అందరూ ఆరోగ్యంగా ఉండటం కుటుంబ శ్రేయస్సుకు ముఖ్యమన్న భావన వారిలోనూ కలుగుతుంది.
* తాము ఆడలేని ఆటలు, చెయ్యలేని వ్యాయామాల గురించి చెబితే పిల్లలు చేయరు. కాబట్టి వాళ్లు చేయగలిగినవే వారికి చెప్పాలి. వాటిని ఒక పనిలా కాకుండా వినోదం అందించేలా మలచాలి. ఆటల్లో గెలిస్తే మెచ్చుకుంటూ, బహుమతులు ఇస్తూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. సైకిల్ తొక్కటం, ఈత, నడక వంటివి పిల్లలకు తేలికగా నేర్పించొచ్చు.
* టీనేజి పిల్లలపై తోటివారి ప్రభావం ఎక్కువ. కాబట్టి స్నేహితులతో ఆడుకునే అవకాశాలు కల్పించాలి. ఆటలంటే ఫుట్‌బాల్ వంటివే కానక్కర్లేదు, కలిసి డ్యాన్స్ చెయ్యటం, స్కూలుకు నడిచి వెళ్లటం వంటివీ మంచివే. వీటివల్ల పిల్లల్లో ఆరోగ్య స్పృహతో పాటు కలుపుగోలుతనమూ పెరుగుతుంది.
* టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేమ్స్ ముందు కూచునే సమయాన్ని పరిమితం చేయాలి. శారీరకంగా చురుకుగా ఉండేందుకు మరిన్ని అవకాశాలు అందుబాటులో ఉంచాలి.
* కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేస్తే పిల్లలు చెడు తిండ్ల వైపు మళ్లే అవకాశం తగ్గుతుంది. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఆహారం పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. అందువల్ల రకరకాల కూరగాయలతో వంటలు వండేలా చూసుకోవాలి. వీలైతే కూరగాయలు కొనేందుకు పిల్లలనూ వెంట తీసుకెళ్లాలి. ఏయే కూరగాయలు వండాలో వారినే ఎంచుకోమని చెప్పాలి. సాయంత్రం, రాత్రి ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వుల వంటివి బాగా తగ్గించి.. తప్పనిసరిగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూడాలి.
* పిల్లలు నానాటికీ బయట మార్కెట్లో ప్యాకెట్లలో అమ్మే తినుబండారాల పట్ల మోజు పెంచుకుంటున్నారు. వీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యకర కొవ్వులూ ఎక్కువే. కాబట్టి వీటిని బాగా తగ్గించెయ్యాలి.
Source : sukhibhava@eenadu news paper - September 26, 2013
- =============================
i want to know what is plantar fasciilits and how to cure it. a specialist recently told me i am suffering with it.
ReplyDelete